వచన సాహిత్యము ఉపన్యాసములు శృంగార నైషధము - ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు

సకలవిద్యాసనాధ కవిసార్వభౌమ శ్రీనాథుని
'శృంగార నైషధము'
- ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు

యువభారతి వారి కావ్యలహరి - ఉపన్యాస మంజరి
ఉపన్యాసకులు: ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు
ప్రథమ సమావేశం (18-7-1971)

సంస్కృత పంచకావ్యములలో చివరిదియు నాంధ్రపంచకావ్యములలో మొదటిదియునై ప్రసిద్ధికెక్కినది నైషధమహాకావ్యము. దీనిని సంస్కృతమున రచించిన మహాకవి శ్రీహర్షుఁడు. ఇతఁడు కాశ్మీరదేశమందలి శారదాపీఠమున శేషాహియంశమున జనించిన శ్రీహీరపండితునకు మామల్ల దేవి యను భార్యయందు చింతామణీమంత్ర చింతనఫలముగా పుట్టిన కుమారరత్నము. కాన్యకుబ్జ రాజాస్థానరంగమంగళాభరణము; గౌడ విజయాది కావ్యకర్త; కవికులాదృష్టాధ్వపాంథుఁడు; ఖండన గ్రంథకారుఁడు; వైతండిక కమల షండ వేదండము; షల్తుర్క మర్మైక చక్రవర్తి. ఇతని కాశ్రయుఁడైన కాన్యకుబ్జేశ్వరుఁడు జయంతచంద్రుఁడని చెప్పుదురు. ఇతఁడే రాణీ సంయుక్తకు తండ్రియు పృథ్వీరాజునకు విరోధియునైన జయచంద్రుఁడని (1170-1195) విమర్శకుల యభిప్రాయము. శ్రీహర్షుఁడు పృథ్వీరాజు గుణగణములను సంయుక్తా స్వయంవరమును మనసు నందుంచుకొనియే నైషధ కావ్యమున నలుని గుణగణములను దమయంతీ స్వయంవరమును రచించెనని విమర్శకులు తలంచుటలో నసంభావ్యమేమియు లేదు. అతఁడు నలదమయంతుల చరిత్రనంతను అఱువదియో నూఱో సర్గములుగల మహాకావ్యముగా రచించెననియు నందు ఇరువదిరెండు సర్గములతోఁ గూడిన పూర్వ భాగము మాత్రము లభించుచున్నదనియు చెప్పుదురు. కాని కావ్యాంతశ్లోకములను పరికింప లభించినది సమగ్ర కావ్యమనియే తోఁచుచున్నది. సంస్కృత వాఙ్మయమున నైషధమహాకావ్యమునకున్న ప్రశస్తి అప్రతిమానమైనది. కవితాభావ వర్ణనా ప్రౌఢియందు దానికదే సాటి. శ్రీనాథుఁడన్నట్లు కవిరాజరాజిశేఖర హీరమకుటము కదా శ్రీహర్ష మహాకవి!

అట్టి నైషధ మహాకావ్యమును శ్రీనాథమహాకవి చంపూరూపమున నాంధ్రీకరించి పెదకోమటి వేమారెడ్డి మంత్రి యును, సోమసిద్ధాంత వ్యాఖ్యాతగా పేరొందినవాఁడునైన మామిడి సింగనామాత్యున కంకిత మొనర్చెను. శ్రీనాథుని తల్లిదండ్రులు భీమాంబా మారయామాత్యులు. కనకక్ష్మాధరధీరుఁడును, కాల్పట్టణాధీశ్వరుఁడును, పద్మపురాణ సంగ్రహకళాకావ్యప్రబంధాధిపుఁడును, వినమత్కాకతి సార్వభౌముఁడును, కవితావిద్యాధరుఁడునైన కమలనాభామాత్యుఁడాతని తాత. వారు పాకనాటి నియోగి బ్రాహ్మణులు, భారద్వాజస గోత్రులు, ఆపస్తంబ సూత్రులు. శ్రీనాథుని జన్మస్థానమేదో నిశ్చితముగా చెప్పుట కవకాశము లేకున్నది. ఆతని తాత కాల్పట్టణా ధీశ్వరుఁడని చెప్పఁబడియుండుటచే నా కాల్పట్టణమేదో నిర్ణయించుటకు పలువురు విమర్శకులు ప్రయత్నించి యుండిరి. అది నెల్లూరు మండలమందలి క్రొత్తపట్టణమని కొందఱును, కృష్ణా మండలమందలి కాళీపట్టణమని కొందఱును, కలపట గ్రామమని కొందఱును, నెల్లూరే యని కొందఱును అభిప్రాయపడియున్నారు. అది యేదైనను పాకనాటియందు సముద్రతీర మందుండిన పట్టణమో గ్రామమోయై యుండవలయును. శ్రీనాథుఁడు 14వ శతాబ్ది చివరిపాదమున జన్మించి 15వ శతాబ్దిపూర్వార్ధము నంతము వరకు సుమారు డెబ్బది సంవత్సర ములు జీవించియుండెనని చెప్పవచ్చును. అతఁడు 1360 ప్రాంతముననే జన్మించెనను వారును, 1475 వఱకును జీవించెనను వారును గొందఱు గలరు. అతఁడు విద్యాధికారి పదవిని నిర్వహించి, కనకాభిషేకాది ఘనసత్కారములంది, కవిసార్వభౌముడై రాజోచిత భోగముల ననుభవించినవాఁడైనను చరమజీవితమున దారిద్ర్యమున కగ్గమై దీనస్థితిలో మరణించెనని తెలియుచున్నది. అతఁడప్పుడు కృష్ణాతీరమందలి బొడ్డుపల్లి గ్రామమును గుత్తకు తీసికొనెననియు, చేసిన వ్యవసాయమంతయు గంగపాలగుటచే నేడునూర్ల టంకముల సుంకము నిచ్చుకొనలేక యాతఁడు శిక్షకు పాలయ్యెననియు, నవసానకాలమున నాతఁడు రచించిన "కవిరాజు కంఠంబు కౌఁగిలించెనుగదా పురవీధి నెదురెండ బొగడదండ", "కాశికా విశ్వేశుఁ గలిసె వీరారెడ్డి రత్నాంబరంబు లే రాయఁడిచ్చు" నిత్యాది సీసపద్యములవలనఁ దెలియుచున్నది. అతఁడు రెడ్డిరాజ్యము పతనమైన పిమ్మట పలువురు రాజులను సంపన్నులను దర్శించుచు దేశమంతట సంచరించి యుండెను. అప్పుడాతఁడాయా ప్రదేశములను గూర్చియు, వస్తువులను గూర్చియు, వ్యక్తులను గూర్చియు చెప్పిన హృద్యములైన చాటువు లనేకములు లభ్యమగుచున్నవి. బహుశః పూర్వాంధ్రకవులలో నాతఁడు చెప్పినన్ని చాటువులను మఱియెవ్వరును చెప్పియుండరు. "చిన్నారి పొన్నారి చిఱుత కూకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర" అను సీసమున నాతఁడు రచించిన గ్రంథములు పేర్కొనఁబడినవి. అందు మరుత్తరాట్చరిత్రఁ, శాలివాహన సప్తశతి అనునవి యిప్పుడు లభించుటలేదు. అందు పేర్కొనఁబడని గ్రంథములుగూడ కొన్ని యున్నవి. అందు హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యము, పండితారాధ్యచరిత్రము, ధనంజయ విజయము, మానసోల్లాసము, నందనందన చరిత్రము ముఖ్యములైనవి. శ్రీనాథ కృతములని ప్రసిద్ధిపొందిన క్రీడాభిరామ పల్నాటివీరచరిత్రల కర్తృత్వము వివాదాస్పదమై యున్నది. శ్రీనాథుఁడు మహాపండితుఁడు. విద్యాధికారి పదవిని నిర్వహించుటయు డిండిమ పండితునోడించి కవిసార్వభౌమ బిరుదమును గడించుటయు నాతని పాండితీ శౌండీర్యమునకు నిదర్శనములు. అతని బావమఱఁదియు శిష్యప్రాయుఁడునైన దగ్గుపల్లి దుగ్గన నాసికేతోపాఖ్యానమున చెప్పిన "సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్యభాషాపరిజ్ఞానపాటవంబు" అను పద్యమాతని పాండితీపాటవమును చాటుచున్నది. హరవిలాసమున నవచితిప్పయ యతనిని "అధ్వర్యు వేదశాఖాధీతి నిష్ణాతు" నని వర్ణించి యుండుతచే నతనికి లౌకికవిద్యలందే కాక వేదమునందును శ్రౌతమునందునుగూడ పాండిత్యము కలదని తెలియుచున్నది. నైషధమున కృతిభర్త యతని వైదుష్యమును

బ్రాహ్మీదత్త వరప్రసాదుఁడ వురుప్రజ్ఞా విశేషోదయా
జిహ్మాస్వాంతుఁడ వీశ్వరార్చనకళాశీలుండ వభ్యర్హిత
బ్రహ్మాండాది మహాపురాణచయతాత్పర్యార్థనిర్ధారిత
బ్రహ్మజ్ఞానకళానిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే (1-13)

యని వర్ణించియున్నాఁడు. ఏనుగు లక్ష్మణకవి నైషధ మూలకర్తవలె శ్రీనాథుఁడుకూడ "మహిత చింతామణీ దివ్యమంత్రసిద్ధుఁ"డని తలంచెను. అందుకాతని అప్రతిమాన పాండితీకవితాప్రతిభలే కారణము.

పాండితీప్రకర్షచేకాక కవితాకౌశలముచేకూడ శ్రీనాథ రచిత కావ్యములందెల్ల తలమానికమని చెప్పఁదగినది నైషధ కావ్యము. "ఆంధ్రభాషా నైషధాబ్జభవుని" "ఆంధ్రభాషా మహాకావ్యము" అను ప్రయోగములను బట్టి శ్రీనాథునికి కూడ నదే ఎక్కువ అభిమానపాత్రమైన గ్రంథముగా తోఁచుచున్నది. "సంతరించితి నిండు జవ్వనంబునయందు హర్షనైషధ కావ్యమాంధ్రభాష" అను సీసపాదమునుబట్టి యాతఁడు దానిని నిండు జవ్వనమున రచించినట్లు తెలియుచున్నది. నూనూగు మీసాల నూత్నయౌవన మనఁగా నిరువది యేండ్ల ప్రాయమనియు, నిండు జవ్వన మనగా నిరువదియైదు ముప్పది యైదేండ్ల నడిమి ప్రాయమనియు నిర్ణయింప వచ్చును. దీనిని బట్టి యాతఁడు క్రీ.శ. 1400 ఇంచుక ముందో వెనుకనో నైషధాంధ్రీకరణము నారంభించియుండును. అతఁడు నైషధమును ముగింపకముందే కొన్ని రాజకీయ కారణములచే అవచి తిప్పయసెట్టిని మెప్పించుటకై హరవిలాసమును రచించి, యాతనికి కృతియిచ్చి, తరువాత నైషధమునందలి చివరి యాశ్వాసములను రచించియుండునని శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రిగారు (మనుమఁడు) భావించుచున్నారు. మామిడి సింగన శ్రీనాథుని నైషధకావ్యమునే ఆంధ్రీకరింపుమని కోరుటకు అనన్య సాధారణమైన దాని ప్రశస్తి మాత్రమేకాక మరొక కారణముకూడ నూహింప వీలగుచున్నది. ఆ కాలమున వెలమరాజులకును రెడ్డిరాజులకును రాజకీయముగనేకాక సారస్వతముగాకూడ విశేషమైన స్పర్థ కానవచ్చుచున్నది. సర్వజ్ఞ సింగభూపాలుని యాస్థానము నందుండిన మల్లినాథసూరి నైషధ కావ్యమునకు సంజీవనీ వ్యాఖ్య రచించియుండెను. అట్లే విజయనగర ప్రాంతమునకుఁ జెందిన నరహరి పండితుఁడును దాని కొక వ్యాఖ్యానము వెలయించి యుండెను. ఆ రెంటికిని పోటీగా సింగనామాత్యుఁడు విద్వత్కవిశేఖరుఁడును, తమ వంశమువారి కాశ్రితుఁడునైన శ్రీనాథుని నైషధాంధ్రీకరణమునకు ప్రేరేచియుండును. నైషధవ్యాఖ్యాతలలో శ్రీనాథనామధేయుఁడు కూడ నొకఁడు కలఁడు. కాని యాతఁడు కవిసార్వభౌమునికంటె భిన్నుఁడు. స్వయముగా పండితుఁడైన సింగనకు నైషధకావ్యమన్న నభిమానము మెండు. శ్రీనాథుఁడాతని

శ్రీహర్ష సుకవి కవితా
వ్యాహార కథా సుధారసాస్వాద సుఖ
శ్రీహర్షోదయ నిత్య స
మాహిత మహితాంతరంగ మామిడి సింగా. (3-1)

అని వర్ణించియుండెను. ప్రౌఢబంధురమైన నైషధమహాకావ్యము నిరాఘాటకవితానైపుణీ ధురీణుండైన శ్రీనాథుని చేతఁబడుట ఆంధ్రభాషాప్రియుల యదృష్ట విశేషమని చెప్పుటలో నతిశయోక్తి లేదు.

షట్చక్రవర్తులలో నొకడైన నలమహారాజు కథ వేదము నందలి వాజసనేయ సంహితయందును, భారతారణ్య పర్వమునందును, కథాసరిత్సాగరములందును గలదు. శ్రీహర్షుఁడు భారత, కథాసరిత్సాగరములందుండి కథ గ్రహించి చిఱుమార్పు లొనరించియు, వర్ణనాదులచే పెంచియు, సమకాలిక ప్రవృత్తుల నందందు చొప్పించియు దాని నొక మహాకావ్యముగా వెలయించెను. ఇది నలుని వర్ణనముతో నారంభించి తద్వంశ మూలపురుషుఁడైన చంద్రుని వర్ణనముతో ముగియుచున్నది. నిషధాధిపతియైన నలుఁడును కుండినపురేశ్వరుఁడైన భీమరాజు కూఁతురు దమయంతియు నొండొరుల గుణరూపసౌందర్యము లాలించి పరస్పరానురక్తచిత్తులై యుండిరి. నలుఁడొకప్పుడుపవనమున విహరించుచు నందలి తటాక తీరమున కాంచనపక్షమగు నొక రాయంచను గాంచి పట్టుకొనెను. అది యార్తిచెంది తనతల్లిని భార్యను బిడ్డలను దలంచుకొని విలపింప నలుఁడు కృపాళుఁడై దానిని విడిచిపుచ్చెను. అది యానందించి, దమయంతి గుణరూపము లాతనికి వర్ణించిచెప్పి, యామె నిన్నుఁదప్ప నన్యు పరిగ్రహింపకుండునట్లుగా భవద్గుణములు ప్రశంసించి వచ్చెదను నన్నుఁ బంపుమని యర్థించెను. నలుఁడు నీవు వచ్చునంతవఱ కిచ్చటనే యుండెదను, పోయి కార్యము సాధించుకొని రమ్మని పంపెను. హంస కుండిన పురమున కరిగి సఖులతో దమయంతి విహరించుచుండిన శృంగార వనమున వ్రాలెను. దమయంతి దానిని పట్టుకొనుటకై ప్రయత్నించుచు సఖులకు దూరముగా నరిగెను. అంత నా హంస ఆమెను జూచి మనుష్య భాషణములతో "నేను భూలోకమునందలి రాజులతో స్నేహము వర్తించుచుందును. అందు నిషధాధీశుఁడగు నలునందు నాకు పక్షపాతము మెండు. నేనాతనికడ చనవు కలిగి వర్తింతును. అతఁడుతప్ప నన్యుఁడు నిన్ను వరింప పాత్రుఁడు కాఁడు. నేను నిన్నాతనితోఁ గూర్పనేర్తును. నీ యభిమత మెఱింగింపు" మని పలికెను. దమయంతి తనకు నలునియందుఁగల వలపెఱిఁగించి తన్నాతనితోఁ గూర్చి ప్రాణములు నిలుపుమని ప్రార్థించెను. హంస నలుఁడామెకై విరహవేదన ననుభవించుచున్నాఁడని పలికి యామె యనుజ్ఞగొని నలునికడ కరుదెంచి జరిగిన వృత్తాంతమంతయు నాతనికి తెలిపెను. నలుఁడు దాని పరోపకార పరాయణతను, కార్యఘటనా చాతుర్యమును ప్రశంసించెను. హంస యతని వీడుకోలు వడసి బ్రహ్మలోకమున కరిగెను. నలుఁడు దమయంతీ వియోగ విహ్వలుఁడై కాలము పుచ్చుచుండెను. దమయంతియు నలవియోగ దోదూయమాన మానసయై యొకరాత్రి సఖీజనులు పరివేష్టించి యుండ చంద్రమన్మథోపాలంభన మాచరించి మూర్ఛిల్లెను. సఖులు శిశిరోప చారము లొనరించుచు కోలాహలము కావింప భీమరాజు దేవీసహితుఁడై యచ్చటి కరిగి, యావద్వృత్తాంతము విని, దమయంతీ స్వయంవరము చాటఁబంచెను.

ఆ సందర్భమున నింద్రుఁడు తన సభ కరుదెంచిన నారదపర్వతుల నుచితరీతి గౌరవించి పూర్వమువలె రాకుమారులు తనపురమునకు రాకుండుటకు కారణమేమని యడిగెను. నారదుఁడు దమయంతీ స్వయంవర వృత్తాంత మెఱింగించి తద్గమన పరాయణులై భూలోక రాజకుమారులు యుద్ధములు మాని యున్నారనియు, అదియే వారమర లోకమునకు రాకుండుటకుఁ గారణమనియుఁ దెల్పెను. అది విని యింద్రుఁడు కూడ నా స్వయంవరమున కరుగ నిశ్చయించెను. అతనితోఁగూడ నగ్నివరుణులు కూడ ప్రయాణమైరి. వారు ముందుగా దేవకాంతలచే దమయంతికి కానుకలుగా మందార కుసుమ గుచ్ఛము లాదిగాఁగల దివ్యవస్తువులు పంపిరి. పిమ్మట వారు విమానారూఢులై భూలోకమున కరుదెంచి దమయంతీ స్వయంవరమున కేగుచుండిన నలుని గాంచిరి. నలుఁడును దివ్య విమానారూఢులైన వారిని జూచి అద్భుత రసాక్రాంతచిత్తుఁడై రథము డిగి వారికడ కరుదెంచెను. వారొండొరులను గూర్చి యెఱింగిన పిమ్మట నింద్రుఁడు నలునిగాంచి యర్థులై వచ్చిన మమ్మాదరింపుమని పలికెను. నలుఁడించుక సేపాలోచించి ప్రాణమైనను ప్రాణాధికమైనను మీరడిగినది యిచ్చెదనని నిర్విశంకముగా నుత్తరమిచ్చెను. ఇంద్రుఁడంతఁ దాము దమయంతిని కాంక్షించి వచ్చుటతెల్పి యా విషయమున దూత కృత్యము కావింపవలెనని నలునడిగెను. నలుండు తానుకూడ నా కోరిక తోడనే యేగుచుండుట యెఱింగించి యెంత వేడుకొన్నను వారు వినరైరి. నలుఁడు చేయునదిలేక తద్దూత్యభారము వహించెను. దేవతలతని కంతఃపుర ప్రవేశమున కనువుగా తిరస్కరణీవిద్య నుపదేశించిరి. నలుడు కుండినపురము చేరి అమాత్యులను రథమును ఒక్కచో నిల్పి, తానొక్కరుఁడును పాదచారియై రాజమందిరము డాసి, యేనుంగు మొగసాల గడచి, కక్ష్యాంతర ములు ప్రవేశించి యంతిపురము చొత్తెంచెను. తరువాత నాతఁడు దమయంతీ సభాభవనము చేరి యొక పార్శ్వమున వేచియుండెను. దమయంతియు సఖీజనులతో నచ్చటి కరుదెంచి యొక బంగారుపీఠము నధి వసించెను. అప్పుడు దేవతలు పంపిన దూతికలువచ్చి, దమయంతికి కానుక లర్పించి వారిని వరింప వేడుకొనిరి. దమయంతి తనమనసు నలమహారాజ లగ్నమై యుండుటెఱింగించి వారిని పంపివైచెను. నలుఁడు చికురాది పదనఖాంతముగా దమయంతి సౌందర్యమును వర్ణించి తానామెకుఁ గనఁబడుటకై దేవతాపరికల్పితమైన శాంబరిని వీడెను. దమయంతి యాతని గాంచి, యాతిథ్యసత్కార ప్రదాన పూర్వకముగా కూర్చుండ నియోగించి, నీవెవ్వర వెందుండి యెట్లు వచ్చితి వెఱిఁగింపుమని యడిగెను. నలుఁడు దిక్పతుల యాస్థానమునుండి యామెకతిథిగా వచ్చినవాడనని తెల్పి, యింద్రాగ్నివరుణు లామెకై పడుచున్న విరహబాధను వారు తాను ముఖమున బంపిన వాచికమును వివరించి, వారిలో నొకరిని వరింపుమని వేడుకొనెను. దమయంతి తాను మానవియు దిక్పాలురు దివ్యులు నగుట తాను వారికిఁ దగననియు, నలునే తాను వలచెననియు, నతడు తన్నొల్లనిచో నేదోవిధమున మరణింతుననియుఁ బలికెను. నలుఁడెట్లు మరణించినను ఆమె దిక్పాలుర వశమగుట తప్పదని హేతువాద పూర్వకముగా నిరూపింపఁ, జేయునది లేక యామె రోదించెను. నలుఁడది చూచి విభ్రాంతుఁడై తన్ను, తన వచ్చిన కార్యమును మఱచి, తన పేరెఱిఁగించి మన్మథోన్మాదము ప్రకటించెను. తరువాత నతఁడు ప్రాప్త సంస్కారుఁడై పేరుతెల్పి దూత్యభంగ మొనరించినందుకు వగచుచుండ దమయంతి యాతని నలునిగా నెఱిఁగి గద్దె డిగి యవనికాంతరమున కేగెను. చెలికత్తె మన్మథుని బారినుండి దమయంతిని రక్షింపుమని ప్రార్థించెను. నలుఁడు గాంభీర్యము వహించి ఆ పలుకులు వినఁడయ్యెను. దమయంతి నిక్కపు దూతకాని నలునిముందు తానాడిన మాటను తలంచి దురపిల్లుచుండఁ దొల్తటి కనక హంస మరుదెంచి నలదమయంతుల నూఱడించి చనెను. నలుఁడు దిక్పాలుర నుద్దేశించి తన తప్పు మన్నింప వేడుకొనెను. దమయంతి దిక్పాలురును అన్య రాజులును చూచుచుండ నలుని వరింతునని పలికెను. నిగూఢాకృతితో నంతయుఁ బరికించుచున్న దేవతలు నలుని మనశ్శుద్ధికి మెచ్చుకొనియు దమయంతికి తమయెడఁగల వైముఖ్యమునకు వెత నొందుచు వంచనా రూపమున నలరూపమును ధరించి స్వయంవరకాలము ప్రతీక్షించుచుండిరి. నలుఁడును అంతఃపురము నుండి యరిగి తనకై నిర్దేశింపఁ బడిన రమ్య ప్రదేశంబున సపరివారముగా విడిసియుండెను.

దమయంతి స్వయంవరమునకు ముల్లోకముల రాజులు నరుదెంచి తమతమ యాసనములందు కూర్చుండిరి. వారివారి గుణశీలములు దమయంతి కేర్పఱించి తెలుప భీమరాజు సరస్వతీదేవిని వేడుకొనెను. సరస్వతి యా సభాస్థానమున ప్రత్యక్షమయ్యెను. సభాసదులందఱు నామెకు నమస్కరించిరి. దమయంతి యలంకృతయై స్వయంవరాస్థానమున కరుదెంచెను. సభాసదులైన రాజులెల్లరు నాశ్చర్య చకితులై యామె సౌందర్యము వీక్షించిరి. దమయంతి పల్లకి దిగి సరస్వతికి నమస్కరింప నామె యాశీర్వదించి స్వయంవరాగతులైన ముప్పదిమూడుకోట్ల దేవతలను, వాసుకిని, నవదీపాధిపతులను, ఉజ్జయినీ మధురాయోధ్యా కాశీరాజులను, పాండ్యనేపాల కాళింగ కీకటోత్కళాధినాథులను పేర్వేర నెఱింగింప దమయంతి వారియెడ ననాదరము ప్రదర్శించెను. తరువాత సరస్వతి సమానాకారులైన నలుర నేవురను దమయంతికిఁ జూపి నలునికి ఇంద్రాదులకు నన్వయించునట్లుగా గూఢశబ్దార్థ సంశ్లేషరూఢి మెఱయ వారి గుణరూపములు వర్ణించెను. దమయంతి వారిలో నలుఁడెవ్వరో యేర్పఱుపలేక విభ్రాంతయై నేలబొందని పాదములచేతను, కందని పూదండలచేతను, అనిమిషనేత్రములచేతను దిక్పాలురను గుర్తించి, భక్తిపూర్వకముగా వారిని స్తుతించి, నలునివైపున కెడయాడు దృష్టినెట్లో మగిడించి, సరస్వతిని దిలకింప నామె దమయంతి ననుగ్రహింప వలెనని దేవతల వేడుకొనెను. ఇంద్రాదులు నలాకారములు విడిచి సహజ రూపముల ధరించిరి. అప్పుడు సరస్వతి "వీరింద్రాదులు, ఇతఁడు నలుఁడు" అని తెలుప దమయంతి తనచేతనున్న మధూక దామమును నలుని కంఠమున చేర్చి, యాతని వరించెను. ఇంద్రాదులా నవదంపతులకు వరము లొసంగిరి. సరస్వతి నలునికి చింతామణీ మంత్రము నుపదేశించి దాని మహిమ యెఱింగించెను. పిమ్మట నామెయు దేవతలును విమానారూఢులై తమతమ నెలవుల కరిగిరి. దమయంతి సఖీజన పరివృతయై యాత్మమందిరమున కేగెను. నలుఁడర్థికోటిపై బంగారు వర్షము కురియించుచు తన శిబిరము ప్రవేశించెను.

విదర్భరాజు నానతిచే కార్తాంతికులు వివాహముహూర్తము నిర్ణయించిరి. ప్రౌఢాంగనలు నలదమయంతులను వివాహోచితముగ నలంకరించిరి. తరువాత దముఁడు శిబిరమున కరిగి నలుని వివాహ మంటపమునకుఁ గొని వచ్చెను. యథావిధిగా పాణిగ్రహణ మహోత్సవము జరిగెను. బువ్వపు బంతియైన పిమ్మట పెండ్లిదొరలు నిజవాస ముల కరిగిరి. నాల్గురోజుల యనంతరము నలుఁడు దమయంతితోఁ గూడ తన రాజధానికి పయనమై పుర ప్రవేశము కావించెను. సురలు పూలవాన కురియించిరి. ఇంద్రాది దిక్పాలు రూర్ధ్వ లోకమున కరుగుచుండగా దొలుత రతీసహితుఁడైన మన్మథుఁడును, తరువాత క్రోధుఁడును, పిమ్మట లోభుఁడును, అనంతరము మోహుఁడును వారి కెదురుపడిరి. పిదప వారికి కలిరాజెదురుపడి నమస్కార పూర్వకముగా కుశల ప్రశ్నలు కావించి "నేను దమయంతీ స్వయంవరమున కరుగుచున్నాఁడను. నాకోరిక సఫలమగునట్లుగా ననుగ్రహింపుఁ" డని ప్రార్థించెను. ఇంద్రాదులాశ్చర్య చకితులై "దమయంతీ స్వయంవరము జరిగిపోయెను. అచ్చటినుండియే మేమరు దెంచుచున్నాము. ఆమె వేల్పులను, నాగులను, అన్యరాజులను ఉజ్జగించి నలుఁడనువాని వరించెను. ఇప్పు డడుగుట వలన నేమి లాభము. మరలిర"మ్మని పలికిరి. అంత కలి క్రుద్ధుఁడై "దమయంతి మిమ్మందఱ విడిచి నలుని వరింప మీరెట్లు సైచిరి. నేనారాజును మోసపుచ్చి ఆ మచ్చెకంటి నెత్తుకొని మింటిమీదికిఁ దెచ్చెదను. మీరు నలుగురును, నేనును పాండవులు పాంచాలినివలె నామెను పెండ్లిచేసికొంద"మని పలికెను. ఇంద్రాదులాతని మాటలకు రోసి, నలుని మహానుభావత్వ మెఱింగించి, భూలోకమున కరుగవలదని నిషేధించిరి. కలి వారి యుపదేశమును పెడచెవినిబెట్టి "ఏదో యొక దోషము నెపముగా చేసికొని నేనా నలునిబట్టి దమయంతిమీఁది వలపుడిగింతు"నని ప్రతిన గావించెను. దేవతలు బ్రహ్మ నియోగమట్లున్నది కాఁబోలునని తలంచి తమదారి నరిగిరి. కలియు కామక్రోధలోభమోహపరివార పరివృతుఁడై నిషధదేశము సమీపమున భూమండలమునకు దిగెను. అతఁడు పాషండజైన కపటధార్మికమిత్రుఁడై నిషధదేశమున కొన్ని దినములుండి యెందును బాపము రూపింప నేరక, ద్వాపరకామక్రోధలోభమోహుల నాయా పనులందు నియోగించి, శుద్ధాంతలీలా వనమునందలి తాఁడి మ్రాని కోటరమున రంధ్రాన్వేషణ తత్పరుఁడై వసించెను.

నలదమయంతులు యథావిధిగా గృహప్రవేశము కావించి శిల్పిజనులలంకరించిన విహారసౌధము ప్రవేశించిరి. అందు నలుఁడు దమయంతితోఁ గూడి వివిధ విహారము లొనరించెను. వారు నిధువనక్రీడా పరాధీనులై యానందజలధి నోలలాడుచుండ రాత్రి తెల్లవాఱెను. అప్పుడు నలుఁడు వైతాళిక గీతములచే మేల్కని భీమరాజు కన్యాప్రదానవేళనిచ్చిన దివ్య రథముపై నెక్కి సురనదిలో స్నానమాచరించి వచ్చెను. అతఁడింటికి రాఁగానే తన్నెదుర్కొన్న దమయంతికి తానాకాశగంగనుండి తెచ్చిన కనకారవిందమును గానుకగా నిచ్చెను. తరువాత నతఁ డగ్నిహోత్ర గృహమునకేగి ప్రాహ్నకృత్యము లొనరించి కొంతవడి దమయంతితోడను నర్మసాక్షిణియగు కళావతితోడను సరససల్లాపములు కావించెను. అంతలో మధ్యాహ్నము కాఁగా నతఁడు జలకమాడి శివుని పూజించెను. పిమ్మట హరిపూజ యొనర్చి దశావతార వర్ణన పూర్వకముగా హరిని స్తుతించెను. దేవతార్చనా నంతర మతఁడు భోజనకార్యము తీర్చి కేళీసౌధమున దమయంతితోఁ గూడ సాయంకాలము వఱకు శృంగార క్రీడలతో ప్రొద్దుపుచ్చెను. పిమ్మట నక్షత్రము లుదయించెను. అంధకారము వ్యాపించెను. నలుఁడు సంధ్యోచిత క్రియలాచరించి క్రీడాసౌధము నేడవనిలువునకు దమయంతీ సమేతముగా నరిగి, యచ్చట నంతఃపురకాంతలు పరివేష్టింప గొలువుండెను. అప్పుడు చంద్రుఁడుదయించెను. నలుఁడు దమయంతికి నిజవంశ మకుటమాణిక్యమైన యాతని వర్ణించిచెప్పి రమణీ సమేతముగా నతనికి పుష్పాంజలి సమర్పించెను. ఈ విధముగా నా దంపతులు ప్రాజ్యములగు రాజసుఖము లనుభవించిరి. మేఘములు కాలము తప్పక వర్షించెను. దేశము ధనధాన్య సమృద్ధ మయ్యెను. సకల జనులు పరమానందము నొందిరి.

శ్రీహర్షుఁడు తన కావ్యమునకు నైషధీయచరితమను పేరు పెట్టెను. నైషధమనునది దాని సంగ్రహనామము. అందు నలదమయంతుల హృదయములందు ప్రణయ మంకురించి వికాసము నొందుటయు, వారి వివాహమును, తరువాత వారు శృంగారలీల లొనరించుటయు వర్ణింపఁబడి యున్నవి. చివరి యాశ్వాసమును సప్తమాశ్వాస మందలి యుత్తరార్థమును శృంగార రసమయములు. అందుచేతనే కావ్యముయొక్క శృంగార ప్రధానత్వమును సూచించుచు శ్రీనాథుఁడు దానికి శృంగార నైషధమను సార్థకమైన నామమొసంగెను. కావ్యోపసంహారమున నాతఁడు "నైషధ శృంగార కావ్య ప్రబంధంబున"నని మూలకావ్యమునుగూడ శృంగార కావ్యప్రబంధమనియే పేర్కొనియుండెను. అందుకు శృంగార వర్ణన ప్రధానమైన కావ్యస్వభావమే కారణము.

ఆంధ్రవాఙ్మయము సంస్కృతానువాదములతోడనే యారంభించెను. కవిత్రయమువారు పంచమవేదమైన మహా భారతమును, మారన కేతనలు మార్కండేయ పురాణ దశకుమారచరిత్రములను, భాస్కరాదులు శ్రీమద్రామాయణ మును ఆంధ్రీకరించిరి. ఆ కాలమును, అప్పటి అవసరములను పురస్కరించుకొని వారా పురాణాదులను చేపట్టి యుండిరి. ధర్మనీతితత్త్వ ప్రధానములైన పురాణములనుకాక, రసవర్ణన ప్రధానములైన సంస్కృత కావ్యముల ఆంధ్రీకరణమునకు శ్రీకారము చుట్టినవాఁడు శ్రీనాథుఁడే. ఆంధ్రవాఙ్మయమునందలి ఆంధ్రీకరణ విధానమును మూఁడు రకములుగా వింగడింపవచ్చును. కవిత్రయమువారిది కథానువాద పద్ధతి. వారు మూలమునందలి కథాసూత్రమును మాత్రము విడువక వర్ణనాదుల ననవసరమని తోఁచినచోట్ల తగ్గించియు, నవసరమని తోఁచిన చోట్ల పెంచియు, ననుచితమని తోఁచిన కొన్నిభాగముల నన్యథాకరించియు ననువాదముకూడ స్వతంత్ర కావ్యముగా భాసించునట్లొనరించియుండిరి. వారవలంభించిన విధానమత్యంత స్వతంత్రమైనది. ఆధునికుల అనువాద పద్ధతిని పదానువాదమని చెప్పవచ్చును. వీరు మూలమునందలి కథాభావములనేకాక పదముల నన్నింటిని కూడ ననువదించుటయందు శ్రద్ధవహింతురు. కొన్నిచోట్ల మూల సాహాయ్యము లేకుండ వీరి యనువాదముల నర్థము చేసికొనుట క్లేశకరముగా నుండును. వీరిదత్యంత మూలవిధేయమైన పద్ధతి. శ్రీనాథుని అనువాదవిధానము కవిత్రయమువారి అనువాదమువలె నత్యంత స్వతంత్రమైనదియుకాదు, ఆధునికుల దానివలె నత్యంత మూల విధేయమును గాదు. అతఁడు మూలము ననుసరించుచునే భావముల నెక్కడను విడిచిపెట్టక యెడనెడ స్వాతంత్ర్యము ప్రకటించుచుండును. ఈ పద్ధతిని భావానుపద్ధతియని చెప్పవచ్చును. అనువాదమై యుండియు పఠితల నలరింపఁజాలు నీ పద్ధతి మిగిలిన రెండింటికంటె ప్రశస్తతరమై పరిఢవిల్లునని వేఱుగా చెప్పనక్కఱలేదు.

సంస్కృతనైషధము నారికేళపాకమున రచింపఁబడిన ప్రౌఢకావ్యము. దాని నర్థముచేసికొని యానందించుటకు కొంతప్రయత్నమును పాండిత్యమును గూఁడ గావలయును. కృతిపతి తన్ను నైషధము నాంధ్రీకరింపుమని కోరు సందర్భమున శ్రీనాథుఁడు

పనివడి నారికేళఫల పాకమునం జవియైన భట్టహ
ర్షుని కవితానుగుంభములు సోమరిపోతులు కొందఱయ్యలౌ
నని కొనియాడనేరరదియెట్టిద లేజవరాలు చెక్కుగీ
టిన వసవల్చు బాలఁకుడు డెందమునం గలఁగంగ నేర్చునే (1-17)

యను పద్యమున నీ విషయమును వ్యక్తము చేసియున్నాఁడు. అతని యాంధ్రీకరణము పాకమునందును, ప్రౌఢత యందును సర్వవిధముల మూలముతో తులతూఁగుచుండును. కావ్యోపసంహారమున అతఁడు "శబ్దంబను సరించియు, నభిప్రాయంబు గుఱించియు, భావంబుపలక్షించియు, రసంబు పోషించియు, నలంకారంబు భూషించియు, నౌచిత్యంబాదరించియు, ననౌచిత్యంబుపహరించియు, మాతృకానుసారంబున" నశేష మనీషి హృదయంగమముగా ననువాదము సాగించినట్లు చెప్పుకొనియున్నాఁడు. ఈ లక్షణములన్నియు నాతని యనువాదమున కనిపించును. మూలగౌరవమునకును అర్థభావములకును ఎందును భంగము కలుగకుండ నౌచిత్యభాసురముగా ననువాదమును నిర్వహించుట కత్తిమీఁది సామువలె కష్టైకసాధ్యమైన కార్యము. శ్రీనాథుఁ డాకార్యము నత్యంత హృద్యముగను అవలీలగను కావించి శృంగారనైషధమును తన ప్రతిభా పాండిత్యములకు పట్టుఁగొమ్మగను ఆంధ్రసరస్వతి యఱితి కమూల్యాలంకారముగను పరిష్కరించియున్నాఁడు.

శ్రీనాథుఁడు సాధారణముగా మూలమునందలి యొక్కొక్క శ్లోకమున కొక్కొక్క పద్యము చొప్పున వ్రాయు చుండును. సీసములందు మూఁడు నాలుగు శ్లోకముల యొక్కయు, వచనములందు వాని పరిమాణమునుబట్టి యంతకెక్కువ శ్లోకముల యొక్కయు భావము నాత డిముడ్చుచుండును. మూలమునందలి యొక్క శ్లోకము లోని భావము నాతఁడు రెండు మూఁడు పద్యములలో వివరించిన పట్లును కొన్ని లేకపోలేదు. కాని యట్టి వాని సంఖ్య చాల తక్కువ. మూల శ్లోకభావము తెలుఁగు పద్యమునకు చాలనప్పుడాతఁడు దాని నించుక పెంపొందించుటయో పద్యమును పూర్తి చేయుటకై కొంతభాగమును కల్పించుటయో యెడనెడ కానవచ్చు చుండును. మూలమునందలి పదముల నన్నిటినిగాక భావములను స్పష్టముగా వివరించుటకే యాతఁడు యత్నించినట్లు కన్పించును. కొన్నిచోట్ల నాతఁడు మూలభావమును సంగ్రహించును; కొన్నిచోట్ల నౌచిత్య దృష్టితో నించుక మార్పుచేయును. అతఁడనువదింపక విడిచివైచిన శ్లోకములును పెక్కు గలవు. అనౌచిత్యమును, పునరుక్తులను, క్లిష్టములైన శ్లేషలను, అనావశ్యక వివరణమును పరిహరింప నెంచుటయే యందుకు కారణము.

శ్రీనాథుఁడు వ్యభిచారియను ప్రతీతి లోకమునందున్నది. అది యెంతవఱకు సత్యమో మనము చెప్పఁజాలము. కాని శృంగార రసపోషణమున నాతని కభినివేశము మెండని చెప్పుటలోమాత్ర మతిశయోక్తి లేదు. రచనలలో శృంగార రసమును చక్కఁగా పోషించు వారందఱును జీవితములోఁ గూడ శృంగార క్రియాలాలసులై యుందురని భావించుట యుక్తము కాదు. శృంగార రసపోషణాసక్తి కలవాఁడయ్యును నైషధమున శ్రీనాథుఁ డౌచిత్య దృష్టితో కావించిన మార్పులావిషయమున నాతనికిఁగల నిగ్రహమును ప్రదర్శించును. హంస దమయంతికి నలుని సౌందర్యమును వర్ణించిచెప్పునప్పుడు మూలకర్త రంభాద్యప్సరలనేకాక యింద్రాణియు త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ లక్ష్మీ పార్వతులను గూడ నాతని యతిలోక సౌందర్యమును గూర్చి విని చిత్త విభ్రాంతికి లోనైరని వర్ణించియుండెను. లోకమాతలైన ఆ సతీమతల్లుల కట్టి చిత్త వికారము కలిగెనని యూహించుట యసంభావ్యమును అనుచితమును అగుటచే శ్రీనాథుఁడా శ్లోకము లనువదింపక విడిచివైచెను. దేవవేశ్య యగుటచే రంభయందట్టి వికార మసంగతము కాదని తలంచుటచే కాఁబోలు నా శ్లోకమును మాత్ర మనువదించెను. ఆ శ్లోకమిది.

అస్మత్కిల శ్రోత్ర సుధాం విధాయ
రంభాచిరంభామతులాం నలస్య
తత్రానురక్తా తమనాప్య భేజే
తన్నామగంధా న్నలకూబరం సా. (3-26)

(రంభ నలుని సాటిలేని కాంతినిగూర్చి చిరకాలము నా వలన విని శ్రవణామృతమును బొంది, యతని యందనురక్తయై యతని బొందలేక తన్నామ వాసన యుండుటచే కుబేర సుతుడైన నలకూబరుని పొందెను.)

దీనిని శ్రీనాథుఁడు

విను కలిఁ గూర్మిజిక్కి పృథివీ భువనంబునకుం డిగంగనే
యనువునులేక రంభయను నచ్చరలేమ, నలున్‌ వరింపఁబూ
నిన తనకోర్కి నొక్కమెయి నిండఁగఁ జేయుటకై భజించె దాఁ
గొనకొని వేల్పులందు నలకూబరుఁ డచ్ఛుభనామవాసనన్‌. (2-54)

అని యథామాతృకముగా ననువదించెను. మూలమునందలి 'అనాప్య' అను పదము నాతఁడు "పృథివీ భువనంబునకున్‌ డిగంగనే యనువునులేక" యని కారణసూచనపూర్వకముగా చక్కగా వివరించెను.

నలుఁడుద్యానవనమున హంసనుగాంచి దానినిబట్టుకొన సంకల్పించినప్పుడు రతిక్షమాలసమైన యది క్షణకాల మొంటికాలిపై నిలిచి, యడ్డముగా మెడవంచి, ఱెక్కచే శిరమును కప్పికొని పల్వలసమీపమున నిద్రించెనని శ్రీహర్షుఁడీ క్రింది శ్లోకమున వర్ణించియున్నాఁడు.

అథావలంబ్య క్షణమేకపాదికాం
తదానిదద్రా వుపపల్వలం ఖగః
స తిర్యగా వర్జిత కంధరః శిరః
పిధాయ పక్షేణ రతిక్లమాలసః. (1-121)

నలుఁడు తన్ను బట్టుకొన్న పిమ్మట నాతనికి దయ కలిగించుటకై హంస తన తల్లిని ప్రియురాలిని తలంచుచు విధిని గూర్చి యిట్లు పల్కినదని మూలమందున్నది.

మదేకపుత్రా జననీ జరాతురా
నవప్రసూతిర్వరటా తపస్వినీ
గతిస్తయోరేష జనస్తమర్దయ
న్నహోవిధేత్వాం కరుణారుణద్ధినో. (1-135)

(నా తల్లికి నే నొక్కండనే పుత్రుఁడను. ఆమె ముసలిది. క్రొత్తగా ప్రసవించిన నా భార్య దీనురాలు. వారిరువురికిని దిక్కు నేనే. అట్టి నన్ను పీడించు నో విధీ! నిన్ను దయ అడ్డగించలేదా.)

పై శ్లోకమున హంస రతిక్లమాలసమని వర్ణింపఁబడినది. ఈ శ్లోకమున హంసభార్య నవప్రసూతి యని చెప్పఁ బడినది. భార్య నవప్రసూతియై యుండ భర్త రతిక్లమాలసుఁ డనుట విరుద్ధముగా తోఁచి కాఁబోలు శ్రీనాథుఁ డనువాదమున నా రెండు విశేషణములను విడిచివైచి రెండవ శ్లోకము నిట్లనువదించి యున్నాఁడు.

తల్లి మదేకపుత్రక, పెద్ద, కన్నులు-గానవిప్పుడు మూడుకాళ్ళముసలి
ఇల్లాలు కడు సాధ్వి యేమియు నెఱుఁగదు-పరమ పాతివ్రత్య భవ్యచరిత
వెనుక ముందరలేరు నెవరైన చుట్టాలు-లేవడి యెంతేని జీవనంబు
గానక కన్నసంతానంబు నిసువులు-జీవనస్థితికేన తాలవంబ
కృపఁ దలంపఁగదయ్య యో నృపవరేణ్య
యభయ మీవయ్య యో తుహినాంశువంశ
కావఁగదవయ్య యర్థార్థి కల్పశాఖి
నిగ్రహింపకువయ్య యో నిషధరాజ. (1-109)

మూలమున హంస తన తల్లి ముదుసలితనమున తన భార్య దీనత్వమును బేర్కొని తన్నట్లు నలునిచేతికి పట్టు వడునట్లొనరించి పీడించుచున్న విధి నిర్దయత్వమును నిందించినట్లున్నది. శ్రీనాథుఁడు తన తల్లి యిల్లాండ్ర స్థితితో పాటు తమ లేవడి జీవితమును, సంతానము వృత్తాంతమును, తానే జీవనస్థితికి తావలమై యుండుటనుగూడ తెల్పి తన్ను నిగ్రహింపక యభయ మొసఁగి కాపాడుమని నలుని దీనముగా వేడుకొన్నట్లు వర్ణించెను. పై సీస పద్యమున మొదటి రెండు పాదములకును కొంత మూలాధారమున్నది. మిగిలిన భాగమంతయు సందర్భాను కూలముగా నాతఁడు కల్పించి వ్రాసినదే. దైన్యసూచకమైన యిందలి హంస ప్రార్థనమెంతో యౌచిత్యశోభితమై నలునికే కాక పాఠకులకును జాలి పుట్టించుచున్నది.

హంస దమయంతికి నలుని గుణగణములను వర్ణించి చెప్పుటకు ముందతనికి తనకును గల పరిచయము నెఱింగించు సందర్భమున శ్రీహర్షుఁడు

సువర్ణ శైలా దవతీర్య తూర్ణం
స్వర్వాహినీ వారికణావకీర్ణైః
తం వీజయామః స్మరకేళికాలే
పక్షై ర్నృపంచామరబద్ధ సఖ్యైః. (3-22)

అను శ్లోకమును రచించెను. "మేము మేరు పర్వతము నుండి శీఘ్రముగా దిగి ఆకాశగంగాజలకణములచే వ్యాప్తములైనవియు వింజామరలతో సాదృశ్యము గలవియునైన మా ఱెక్కలచే సురతకాలమందు నలునికి వీచుచుందు"మని దీని యర్థము. హంస యీ వాక్యముల నాగర్భశ్రీమంతురాలును యౌవనవతియైన దమయంతితో నలుని వివాహమాడుమని ప్రోత్సహించుటకై చెప్పుచున్నది. స్మరకేళికాలే యనుటవలన నలుఁ డప్పుడప్పు డన్య స్త్రీరతాసక్తుఁడై కాలము పుచ్చుచుండునని వ్యక్తమగుచున్నది. ఈ విషయము దమయంతికి నలునియెడ వైముఖ్యము పుట్టించుట కవకాశమున్నది. ఈ యనౌచిత్యమును తొలఁగించి శ్రీనాథుఁడీ శ్లోకమును

కనకశైలంబు డిగ్గి యాకాశసింధు
సలిలములఁ దోగి మిగులంగఁ జల్లనైన
చారుహాటకమయ గరుచ్ఛామరముల
వీతు నతనికి వైశాఖవేళయందు. (2-51)

అని యనువదించెను. స్మరకేళీకాలమునకు బదులుగా వైశాఖ వేళ నిచ్చట చొప్పించుట శ్రీనాథుని యౌచిత్యదృష్టి యెంత గాఢమైనదో వెల్లడి చేయుచున్నది.

నలదమయంతుల వివాహమైన పిమ్మట బువ్వపుబంతిని వర్ణించు సందర్భమున మూలము ననుసరించియే శ్రీనాథుఁ డీక్రింది పద్యములను రచించెను.

లలన యొకర్తు వగ్గు కృకలాసముఁ జేరఁగఁ దెచ్చి వంచనన్‌
నలునకుఁ గుంచెవట్టు నెలనాగ పదద్వయ మధ్యమంబునన్‌
నిలిపినఁ, గాలుప్రాఁకనది నీవియసీమకుఁ, దోడి భామినుల్‌
గలకల నవ్వ నూడ్చెనది గట్టిన పుట్టము పాయ శూన్యతన్‌. (6-111)
అవ్వలిదిక్కు మోమయి ప్రియంబున నొండులతోడ ముచ్చటల్‌
ద్రవ్వుచు నొక్కకోమలి పరాకున నుండఁగ ధూర్తుఁడొక్కరుం
డివ్వలవచ్చి వంచనమెయిన్‌ నునుమించు మెఱుంగుటద్దమున్‌
నవ్వుచుఁ బట్టె దానిచరణంబులకున్‌ నడుమైన మేదినిన్‌. (6-113)

ఇట్లే నిషధమున కలిపురుషుని వర్తనమును వర్ణించు సందర్భమున

యజమాన ప్రమదావికస్వర భగన్యస్తాశ్వ దీర్ఘ స్మర
ధ్వజదండంబగు నశ్వమేధ మఖతంత్రంబు న్నిరీక్షించి యి
క్కుజనుం డొత్తిలినవ్వె వేదవిదులం గుత్సించి పుష్పాస్త్రుచే
నిజహస్తంబున వ్రేసియశ్రుకణముల్‌ నిండార నేత్రంబునన్‌. (7-133)

అను పద్యము కానవచ్చుచున్నది. మొదటి రెండు పద్యములందును శృంగారమును, మూఁడవపద్యమున జుగుప్సయు మితిమీఱి గోచరించుచు ననౌచిత్య శంక కలిగించుచునవి. ఔచిత్యదృష్టికల శ్రీనాథుఁడు వీని నేల పరిహరింపలేదని యెవ్వరైన ప్రశ్నింపవచ్చును. బువ్వపుబంతివేళ జరుగు పరిహాసాస్పదములైన వికారచేష్టలను, కలిపురుషుని వర్తనము నందలి జుగుప్సను ప్రకటించు నుద్దేశముతోడనే శ్రీనాథుఁడి వీనిని విడువక యనువదించె నని కొందఱు విమర్శకులు భావించుచుండిరి. కాని వీనిని యిట్టి భావమునే ప్రకటించు (6-132) మఱికొన్ని పద్యములను శ్రీనాథుఁడు పరిహరించి యుండవలసినది.

సంస్కృత నైషధము నల కీర్తితేజోవర్ణనాత్మకములైన యీ క్రింది రెండు శ్లోకములతో నారంభించుచున్నది.

నిపీయ యస్య క్షితి రక్షిణః కథా
స్తథా ద్రియంతే న బుధా స్సుధామపి
నలస్సితచ్ఛత్రిత కీర్తిమండల
స్సరాశిరాసీన్మహసాం మహోజ్జ్వలః. (1-1)
రసైః కథాయస్య సుధావ ధీరిణీ
నలస్స భూజానిరభూద్గుణాద్భుతః
సువర్ణ దండైక సితాతపత్రిత
జ్వలత్ప్రతాపావళి కీర్తిమండలః. (1-2)

(ఏ మహారాజు కథల నాస్వాదించి దేవతలమృతమునుగూడ నాదరింపరో, అట్టి నలుఁడు వెల్లగొడుగుగాఁ జేయఁబడిన కీర్తిమండలము కలవాఁడై తేజోరాసియగు సూర్యునివలె ప్రతాపశాలియై యుత్సవములతో నొప్పారుచుండెను.ఏ రాజుకథ రుచులచే నమృతమును ధిక్కరించుచున్నదో అట్టి నలమహారాజు గుణములచే లోకోత్తరుఁడై బంగారు దండముగను ఏకశ్వేతచ్ఛత్రముగను చేయఁబడిన ప్రకాశించు ప్రతాపావళియు యశస్సమూహమును గలవాడై యుండెను.)

ఈ రెండు శ్లోకములందును గల భావము కొంచెమించుమించుగా సమానమే. రెండవ శ్లోకమున ప్రతాపావళి యందు సువర్ణదండత్వ మారోపింపఁబడుట మాత్రము విశేషము. శ్రీనాథుఁడిందలి పునరుక్తి నూహించి రెండవ శ్లోకమునందలి యుత్తరభాగమును మాత్రము "తపనీయ దండైక ధవళాతపత్రితోద్దండతేజఃకీర్తిమండలుం"డని సీసపద్య ప్రథమపాదముగా ననువదించెను. ఇట్లిచ్చట రెండు శ్లోకముల నొక్కపాదముగా ననువదించుట వలన మూలకర్త భావమునకు చెప్పఁదగిన భంగమేమియు కలిగియుండలేదు.

నలుఁడు దిక్పాలు రనుభవించు దమయంతీ విరహవేదనను వివరించి, వారి సందేశమునుగూడ నామె కెఱింగించి, వారిలో నొక్కరిని వరింపుమని యామెను ప్రార్థించెను. ఆసందర్భమున దమయంతి నలుని వాక్‌నైపుణ్యమును ప్రశంసించి తనకా దూత వృత్తాంతము నెఱుంగుటయందే యెక్కువ కుతూహలము కలదనియు, నుదక పానముచే శాంతించు దప్పి మధుదుగ్ధాదు లధికముగా సేవించినను శాంతింపదనియుఁ బల్కినట్లు శ్రీహర్షుఁడీ క్రింది శ్లోకమును రచించెను.

గిరశ్శ్రుతా ఏవ తవ శ్రవస్సుధాః
శ్లథా భవాన్నామ్నిచ తే శ్రుతిస్పృహా
పిపాసుతా శాంతి ముపైతివారిణా
నజాతు దుగ్ధా న్మధునోఽధికాదపి. (9-5)

దప్పి నీరుత్రావినచో పూర్తిగా తొలఁగి పోవుట సత్యమే. కాని పాలు తేనె మున్నగువానివలన కూడ కొంతవఱకుప శమించుటలో సందేహములేదు. ఇచ్చట దమయంతితో ప్రసంగించుచున్న దూత (నలుని) వృత్తాంతముదకము. దిక్పాలుర యుదంతము మధుదుగ్ధసదృశము. అందుచే పైశ్లోకము నందలి భావమునుబట్టి దిక్పాలకోదంత శ్రవణముచే దమయంతి శ్రుతిస్పృహ కొంతవఱకైన తగ్గెననుట కవకాశమున్నది. కాని అది సత్యముకాదు. దిక్పాలుర యుదంత మెంత వినినను దూత వంశ నామాదికము వినవలెనను కుతూహల మామెకు తగ్గలేదు సరికదా కొంత యతిశయించుటయు జరిగెను. ఈ విషయమును వ్యక్తము చేయుటకై శ్రీనాథుఁడు మూలము నందలి భావము నించుకమార్చి యాశ్లోకము నిట్లనువదించెను.

అధిక తరులైనఁ గాని దిశాధిపతులు
కౌతుకము నాకు నీ వంశ కథలయందె
దప్పిగొన్నట్టి వారికా దప్పితీఱ
సలిలపూరంబు హితవొ యాజ్యంబు హితవొ. (4-52)

శ్రీనాథుఁ డిందు మధుదుగ్ధముల స్థానమున నాజ్యమును ప్రవేశపెట్టెను. నేతి నెక్కువగా గ్రహించినచో దాహమధిక మగుట లోకప్రసిద్ధము. అందుచే నాజ్యశబ్ద ప్రయోగము దిక్పాలుర యుదంతము వినినకొలంది దమయంతికి దూత వంశ నామాదికములను వినవలెనను కోరిక యుపశమింపక పోవుటయేకాక వృద్ధికూడ నందినదని సూచించుచు మూలమునకు వన్నె చేకూర్చుచున్నది.

మఱియు నధికతరులు, వంశకథలు అను శబ్దములందలి అర్థద్వయమును పురస్కరించుకొని యిచ్చట శ్రీనాథుఁ డమూలకమైన చమత్కారమును కల్పించియున్నాఁడు. అధిక తరులనగా మిక్కిలి యధికులని యొక యర్థము, గొప్ప వృక్షములని మఱొక యర్థము. అట్లే వంశకథలనఁగా వంశముయొక్క వృత్తాంతములు, వెదురుగడల యుదంతములు అను రెండర్థము లున్నవి. "దిక్పాలురు మహావృక్షములవంటి వారును, నీవు వెదురుగడవంటి వాఁడవును కావచ్చును. నాకా వృక్షముల వృత్తాంతముకంటె వెదురుగడ యుదంతము వినుటయందే యెక్కువ కుతూహల ముప్పతిల్లు చున్నది" అని దమయంతి భావము. అమూలకమైన యీ చమత్కార మిచ్చటి యర్థ భావములకు మఱింత వన్నెయు సౌందర్యమును ఆపాదించుచున్నది.

శ్రీహర్షుఁడు మహాపండితుఁడు. అతఁడు తన కావ్యమున నపూర్వములును ప్రౌఢసుందరములు నైనకొన్ని ప్రయోగములను కావించియున్నాఁడు. అవి అనువాదమున కతీతము లైనట్టివి. అన్యపదములచే నేదోవిధమున వాని నాంధ్రీకరించినచో నాప్రౌఢతయు సౌందర్యమును కొఱవడును. అందుచే శ్రీనాథుఁడా ప్రయోగములను అనువాదమున యథాతథముగా వాడి యున్నాఁడు. అట్లువాడుఁట యాతని ప్రౌఢతాప్రీతికే తార్కాణము కాని అసామర్థ్యమునకుఁ గాదు. హంస దమయంతిని గూర్చి నలునికి చెప్పు సందర్భమున శ్రీహర్షుఁడు

సరసీః పరిశీలితుంమయా
గమికర్మీకృతనైక నీవృతా
అతిథిత్వమనాయి సాదృశోః
సదసత్సంశయ గోచరోదరీ. (2-40)

అను శ్లోకమును వ్రాసియుండెను. ఇందు "గమికర్మీకృతనైక నీవృతా" (గమ్‌ ధాతువునకు కర్మగా చేయబడిన పెక్కు రాజ్యములుగల) "సదసత్సంశయ గోచరోదరీ" (ఉన్నదా లేదా యను సందేహమునకు గుఱియైన యుదరము కలది) అను ప్రయోగములు రెండును మిక్కిలి ప్రౌఢములును అర్థవంతములునై యలరారుచున్నవి. తెలుఁగున వెళ్ళు ధాతువకర్మకము. దానికి కర్మయుండుటకే అవకాశములేదు. దానిని "అనేక దేశములకు వెళ్ళినవాఁడనైన" అని తెనిగింపవచ్చును కాని మూలమందలి ప్రౌఢికాని చమత్కారముకాని రానేరవు. అట్లే "సదసత్సంశయ గోచరోదరీ" యను సమాసముకూడ చమత్కార స్ఫోరకమై మనోజ్ఞముగా నున్నది. శ్రీనాథుఁడీ శ్లోకమును రెండు విధములుగా ననువదించుచు రెందు పద్యములను వ్రాసియున్నాఁడు.

మృదురీతిం బ్రతివాసరంబు గమికర్మీభూతనానానదీ
నదకాంతారపురీ శిలోచ్చయుఁడనై నైకాద్భుత శ్రీజిత
త్రిదవంబైన విదర్భదేశమున నారీరత్నముంగాంచితిన్‌
సదసత్సంశయ గోచరోదరి శరత్సంపూర్ణచంద్రాననన్‌. (2-20)

ఇందొక సమాసమును యథాతథముగాఁ జొప్పించుటకవకాశము చిక్కినది. కాని రెండవదాని నించుక మార్చి వ్రాయవలసి వచ్చినది. దాని యందలి మక్కువ విడువలేక దాని నిముడ్చుచు శ్రీనాథుఁడీ రెండవ పద్యమును వ్రాసి యున్నాఁడు.

కమలేందీవర షండమండిత లసత్కాసారసేవారతి\న్‌
గమికర్మీకృతనైకనీ వృతుఁడనై కంటిన్‌ విదర్భంబునన్‌
రమణిం బల్లవపాణిఁబద్మనయనన్‌ రాకేందుబింబాననన్‌
సమపీనస్తనినస్తినాస్తివిచికిత్సాహేతు శాతోదరిన్‌. (2-21)

ఇందు సదసత్సంశయ గోచరోదరీ అను సమాసమును మార్చి వ్రాయవలసి వచ్చినది. ఆ పద్యములు ప్రౌఢ ప్రయోగములయందు శ్రీనాథునికిఁ గల యతిమాత్రమైన ప్రీతిని సూచించును. వీనిని మనసునందుంచుకొనియే యతఁడు కాశీఖండమున "తథ్యమిధ్యా మధ్యస్థిత మధ్య" లనియు, భీమఖండమున "గమికర్మీభూతకైవల్యమున్‌" అనియు ప్రయోగించి యున్నాఁడు. ఇది యాతని ప్రౌఢ ప్రయోగాసక్తిగా గ్రహింపక కొందఱు శ్రీనాథుఁడు మూలమునందలి సమాసములనే తెలుఁగు విభక్తి ప్రత్యయములైన డు ము వు లను తగిలించి యథాతథముగా వాడియున్నాఁడని విమర్శించుట కలదు. కాని యట్లు తలంచుట పొఱపాటు. వానినట్లు వాడక యనువాదముచేసి యుండినచో నిప్పటి ప్రౌఢతయు సౌందర్యమును తప్పక లోపించియుండును.

హంస నలునివిడిచి దమయంతి కడకు దూత్యమేగు సందర్భమున కుండినపురమును వర్ణించుచు శ్రీహర్షుఁడు

అశ్రాంతశ్రుతిపాఠపూతరసనావిర్భూత భూరిస్తవా
జిహ్మబ్రహ్మముఖౌఘవిఘ్నిత నవస్వర్గ క్రియాకేళినా
పూర్వం గాధిసుతేన సామిఘటితాముక్తాను మందాకినీ
యత్ప్రాసాద దుకూలవల్లి రనిలాందోళైరఖేలద్దివీ (2-102)

అను శ్లోకమును వ్రాసియుండెను. ఇందు పూర్వార్థమునఁగల సమాసరచన గంభీరమును శ్రవణ సుభగమునై యున్నది. ఇట్టి సమాసమును స్వయముగా కూర్చుటకై శ్రీనాథుఁడేమియు శ్రమపడవలసిన యవసరము లేదు. అతఁ డింతకన్న ప్రౌఢతరములైన సమాసములెన్నిటినో తన కావ్యములందు కూర్చియున్నాఁడు. కాని శ్రీహర్షుని యందలి గౌరవముచేతను ఆ సమాస రచనయందలి ప్రీతిచేతను అతఁడు యతిప్రాసల కనుగుణముగా నించుక మార్చి దానినే పద్యమున నిట్లు పొదిగియున్నాఁడు.

వేదాభ్యాసవిశేషపూతరసనావిర్భూతభూరిస్తవా
సాదబ్రహ్మ ముఖౌఘవిఘ్నిత నవస్వర్గక్రియాకేళిచే
నాదిన్‌ గాధితనూజుచే సగముసేయంబడ్డమిన్నేఱు ప్రా
సాదస్వచ్ఛదుకూల రైతవమునం జాలంగ నొప్పుంబురిన్‌ (2-41)

ఇట్లాతఁడు మూలమునందలి భావములతోపాటు పదములను సమాసములను గూడ ప్రౌఢతాప్రీతిచే గ్రహించిన పట్లు పెక్కు కానిపించును. మూలమున కవి వ్యాకరణ వైదుష్యమును ప్రయోగ వైచిత్రిని ప్రకటించు పద్యము లచ్చటచ్చట గోచరించును. శ్రీనాథుఁడుకూడ మూలకర్తవలెనే బహుశాస్త్ర నిష్ణాతుఁడగుటచే నాసందర్భములందు తాను సైతము పాండిత్య ప్రకర్షను ప్రకటించుచునే యుండును. సప్తమాశ్వమున నలదమయంతుల రతమును వర్ణించు సీస పద్యమునందలి గీతమున

అస్తివామ్యభారమస్తి కౌతూహలం
బస్తిఘర్మసలిల మస్తికంప
మస్తిభీతియస్తిహర్షమస్తివ్యథం
బస్తివాంఛమయ్యెనపుడురతము (7-177)

అని అస్తి పూర్వపదములైన సమాసములను వాడుటయిందుకు నిదర్శనము. ఇట్లే అతఁడు అష్టమాశ్వాసమున వైతాళిక గీతములలో ప్రాతఃకాలమందలి కాక కోకిలముల కూతలను కౌ కౌ, తు హి అను పద ప్రత్యయములను వాడుచు సంస్కృత వ్యాకరణ పాండిత్య స్ఫోరకముగను, యథామూలముగను ఈ క్రింది పద్యమున వర్ణించి యున్నాఁడు.

ప్రాతఃకాలము వాయసంబు పణినాపత్యోక్త శాస్త్రంబులోఁ
దాతఙ్‌స్థానులు చెప్పుఁడెవ్వియను చందంబొప్ప గౌకౌయనం
జాతుర్యం బలరార నుత్తరము విస్పష్టంబుగాఁ గోకిల
వ్రాతంబిచ్చె తుహీ తుహీ యని గృహారామ ప్రదేశంబులన్‌. (8-19)

సంస్కృతమున లోట్టునందు ప్రథమ మధ్యమ పురుషైక వచనములలో తు, హి అను ప్రత్యయములకు వైకల్పిత ముగా తాత్‌ అనునది ఆదేశముగా వచ్చునని 'తుహ్యోస్తాతఙాశిష్యన్యతరస్వామ్‌' అను పాణినిసూత్రము చెప్పుచున్నది. దానిని పురస్కరించుకొని మూలకర్త ప్రాతఃకాలమున కాకి తాతఙాదేశమునకు స్థానులేవని యడుగు చున్నట్లుగా కౌకౌ అని అఱచెననియు, నా ప్రశ్నమునకు కోకిల తుహి అని ప్రత్యుత్తరమిచ్చెననియు చమత్కార ముతోఁ గూడిన కల్పనము కావించి శ్లోకము వ్రాసియున్నాడు. శ్రీనాథుఁడు దానిని యథామాతృకముగా నను వదించి తన ప్రగల్భతను ప్రకటించి యున్నాఅడు. ఈ విధముగా మూలకారుఁడెడనెడ ప్రదర్శించిన బహుశాస్త్ర పాండిత్యమున కనుగుణముగా శ్రీనాథుఁ డనువాదమును సాగించి మాంధ్రకావ్యమునకు మూలతుల్య గౌరవము నాపాదింపఁ జాలినాఁడు.

మూలమునందలి భావముల కెట్టి లోపమునుఁ గలుగకుండ శ్రీనాథుఁడు తెలుఁగు పలుకుబడుల సొగసుట్టిపడున ట్లవలీలగా రచించిన పద్యము లనేకము లున్నవి. అట్టివాని కొండు రెండుదాహరణములు మాత్ర మొసంగెదను. హంస దమయంతితో నలుఁడు తప్ప నన్యుఁడామెను వరించుటకు పాత్రుఁడు కాఁడని చెప్పుచు బ్రహ్మనిర్ణయము కూడ నట్లేయున్నదని సూచించు సందర్భమున శ్రీహర్షుఁడు

విథిం వధూసృష్టి మపృచ్ఛమేవ
తద్యాన యుగ్యో నలకేళి యోగ్యాం
త్వన్నామ వర్ణా ఇవకర్ణ పీతా
మయాస్య సంక్రీడతి చక్ర చక్రే (3-50)

అను శ్లోకమును రచించెను. శ్రీనాథుఁడు దీనిని

అడిగితి నొక్కనాఁడు కమలాసను తేరికి వారువంబ నై
నడచుచు నుర్విలో నిషధనాథుని కెవ్వతె యొక్కొ భార్యయ
య్యెడునని చక్రఘోషమున నించుక యించుక గాని యంతయే
ర్పడ విననైతి, నీవనుచు బల్కిన చందముదోఁచె మానినీ (2-58)

అని యెంతో సులభముగను సహజముగను అనువదించెను. ఇందలి "యించుక యించుకగాని యంత యేర్పడ విననైతి" అను దానికి సరియైన పదములు మూలమున లేకున్నను అచ్చటి అభిప్రాయమంతే. 'కర్ణపీతా ఇవ' అను మూలము నందలి 'ఇవ' శబ్దము స్వారస్యమిందు మనోహరముగా వివరింపఁ బడినది.

సప్తమాశ్వాసమున నలదమయంతుల విహారమును వర్ణించు సందర్భమున శ్రీహర్షుఁడు రచించిన

యౌకురంగ మదకుంకుమాంచితౌ
నీలలోహితరుచే వధూకుచే
సప్రియో రసితయోః స్వయంభువో
రాచిచార నఖకింశుకార్చనమ్‌ (18-96)

అను శ్లోకమును శ్రీనాథుఁడీ క్రింది పద్యమున హృద్యముగా ననువదించెను.

కుతుకమునం గురంగ మదకుంకుమచర్చ వహించి నీలలో
హితరుచులై స్వయంభులయి యీహితసౌఖ్య విధాయులైన య
య్యతివ పయోధరంబులకు నర్ధనిశాసమయంబునన్సమం
చిత నఖకింశుకార్చనము చేసె మహీపతి భక్తియేర్పఁడన్‌. (7-178)

ఇందు నీలలోహితరుచులు, స్వయంభులు అను పదములు కుచములకు శివునికి కూడ నన్వయించు చున్నవి. భక్తి ఈహితసౌఖ్యవిధాయులు అనుపదములను శ్రీనాథుఁడు స్వయముగాఁ జేర్చినను వానికిఁ గూడ రెండర్థములు స్ఫురించునట్లొనరించి భావమునకు పుష్టి కలిగించెను.

ఆంధ్రనైషధమున శ్రీనాథుఁడు స్వయముగా రచించి సందర్భానుగుణముగా నందందుఁ జొప్పించిన పద్యములు కూడ కొన్ని యున్నవి. వివాహానంతరము దమయంతి నలునితో నిషధరాజధాని కఱుగు సమయమున భీమ రాజు కూఁతును గౌఁగిలించుకొని గద్గద స్వరంబునఁ గొంత హితోపదేశము కావించెను. మూలమున నీ సందర్భమున నొక్కటే శ్లోక మున్నది (16-118). శ్రీనాథుఁడిచ్చట నభిజ్ఞానశాకుంతలము నందలి "శుశ్రూషస్వ గురూన్‌" అను శ్లోకమునందలి భావము ననుకరించుచు నొకచక్కని సీసమును రచించెను (7-9). తరువాత దమ దమనులు సోదరికి సుగంధ ద్రవ్యములును, అమూల్యాభరణములును, పసుపునకై నూఱు గ్రామములు నొసంగినట్లు తెల్పు పద్యములు కూడ (7-11,12) శ్రీనాథుఁడు కల్పించినవే. స్వయంవరానంతర మింద్రాదులు నలదమయంతులకు వరములిచ్చిన పిమ్మట సరస్వతీదేవి నలునికి చింతామణి మంత్రము నుపదేశించెను. ఈ సందర్భమున శ్రీనాథుఁడు స్వయముగా రచించి చేర్చిన పద్యములు మూఁడున్నవి. వీనిని సరస్వతి నలునికి దెల్పి యుండెను. అందొకటి చింతామణీ దివ్యమంత్ర మూర్తియైన సరస్వతిని దలఁచినచో నయత్నముగా సారస్వతము గలుగుననియు, మఱొకటి యుషఃకాలమున నలదమయంతీ కర్కోటక ఋతుపర్ణులను దలంచు వారికి కలి కల్మషములు పొందవనియుఁ దెల్పుచున్నవి. మూడవదీ క్రింది సీసపద్యము.

కలియుగంబున యందుఁ గాశ్మీర భూమిలో-మత్పీఠమున ధరామరుఁడు పుట్టు
శ్రీహీరుఁడనఁగఁ శేషాహియంశంబున-నతఁడు మామల్లదేవ్యాఖ్యయైన
తనభార్యయందుఁ జింతామణీ మంత్ర చిం-తన ఫలంబుగ నొక్కతనయుఁ గాంచు
గల్పించు నతని కాకాశవాగ్దేవి తా-శ్రీహర్షుఁడనియెడు చిహ్నంబు
వానికీరేఁడు విద్యలు వచ్చియుండు
వాఁడు ఖండనకారుఁడు, వాఁడు సుకవి
కావ్యముఖముఁ వానిచేఁ గలుగు నీకు
నిర్మలంబైన సత్కీర్తి నిషధరాజ! (6-25)

ఇది శ్రీహర్షుఁడను మహాకవి జనించి కావ్యము ద్వార నలుని కఖండకీర్తి కలిగించునని వర్ణించుచున్నది. ఈ ఘట్టము చదువునప్పుడు శ్రీనాథుఁడు కూడ శ్రీహర్షునివలె చింతామణీ మంత్రోపాసకుఁడేమోయను ననుమాన ముదయించుటేకాక యాతఁడు తన కావ్యము ద్వారమున సైతము నలుని కీర్తి లోకమున వ్యాపించునని యన్యాప దేశముగ చెప్పుచున్నాఁ డేమోయని స్ఫురింపక మానదు. నైషధీయ చరితము ద్వారా శ్రీహర్షుఁడు యావద్భారత మందేకాక ఖండాంతరముల యందును, శృంగార నైషధము ద్వార శ్రీనాథుఁడాంధ్ర దేశమందును నలునికీర్తిని వ్యాపింప జేసిరనుటలో నతిశయోక్తి లేదు. నైషధ కావ్యమునందే, తద్రచనకు సంబంధించిన యీ కల్పనమెంతో చమత్కారముతోఁగూడి శ్రీనాథునికి శ్రీహర్షుని యెడఁ గల యపారమైన గౌరవభావమును వెల్లడి చేయుచున్నది.

శ్రీనాథుఁడు నైషధీయ చరితమునందలి పెక్కు శ్లోకముల ననువదింపకుండ విడిచివైచెను. నవమ సర్గమున దిక్పాలురెట్లైన నిన్ను పొందక మానరని నలుఁడు చెప్పినప్పు డప్రతివిధానమైన ప్రియావాప్తి విఘాతమునకు కలఁగి దమయంతి వెక్కివెక్కి యేడ్చెను. ఆ సందర్భమున తనకింక మరణము తప్పదని తలంచియు నలునుద్దేశించియు నామె కావించిన పరిదేవనమును వర్ణించు పదుమూఁడు శ్లోకము లకాంధ్రమున ననువాదము కానరాదు. ఇట్లే త్రయోదశ చతుర్దశ సర్గములందు స్వయంవర సమయమున దిక్పాలురకును నలునకును సమముగా నన్వయించు శ్లేషార్థ సముపేతములైన శ్లోకములు పెక్కనువాదమున విడువఁబడినవి. త్రయోదశ సర్గము నందలి 33వ శ్లోకము (దేవఃపతిర్విదుషి నైషధరాజగత్యా) ఒక పక్షమున నలుని పరముగను ఇంకొక పక్షమున నలువురు దిక్పాలురలో నొక్కొక్కరి పరముగను ప్రత్యేక పదవిభాగ పూర్వకముగా నర్థము చెప్పుటకు వీలుగా నున్నది. శ్రీనాథుఁడు దీనిని గూడ ననువదించి యుండలేదు. నిజమునకు దీనినే భాషలోనికైన ననువదించుట యతి కష్టసాధ్యము. ఈ శ్లోకములు పెక్కు పాండితీ ప్రకర్షను ప్రదర్శించునవే కాని కథాగమనమునకుఁగాని రసపోషణమునకుఁగాని పనికి వచ్చునట్టివికావు. అందుచేతనే శ్రీనాథుఁడు వానిని విసర్జించి యుండెను కాఁబోలును.

నైషధము వర్ణన ప్రధానమైన మహాకావ్యము. ఆయాసందర్భము లందాయా వర్ణనములను కావించుటలో కవి ప్రదర్శించిన భావనాశక్తియు, పాండితీ శౌండీర్యమును, లోకశాస్త్రాద్యవేక్షణ పాటవమును అప్రతిమానములై పఠితల నాశ్చర్యచకితులను గావించును. శ్రీనాథుఁడు శ్రీహర్షునికివాడిన "కవికులాదృష్టాధ్వగమనాధ్వనీనుఁ"డను విశేష మాతని వర్ణనముల విషయమున సార్థక్యము వహించును. నలుఁడు, దమయంతి, కుండినపురము, విరహచంద్ర మన్మథోపాలంభములు, శాంబరీనిగూఢుఁడైన నలుని యంతఃపుర ప్రవేశము, దూతికా వాక్యములు, దిక్పాలుర విరహము, స్వయంవరాగతులు, వివాహము, బువ్వపుబంతి, కామక్రోధలోభమోహకలిరాజులు, కలిరాజు వందుల కైవారములు, విహార సౌధము, నలదమయంతుల విహారములు, వైతాళిక గీతములు, నలదమయంతుల గోష్టి, శివ విష్ణు పూజ, దశావతారములు, సంధ్య, నక్షత్రములు, చంద్రుఁడు మున్నగు వ్యక్తి వస్తు భావ స్థితి సన్నివేశముల వర్ణనము లిందు ముఖ్యములైనవి. నాయికానాయకులైన నలదమయంతులీ కావ్యమున సందర్భ మునుబట్టి రెండుమూఁడుచోట్ల వర్ణింపఁబడి యున్నారు. కావ్యము కవికావించిన నలవర్ణనముతో నారంభించు చున్నది. హంస దమయంతి యెదుట నాతని గుణగణములను పరాక్రమ విశేషమును ఉగ్గడించినది. స్వయంవర మున సరస్వతి నలునికి దిక్పాలురకును అర్థద్వయ మేర్పడునట్లుగా నాతని గుణగణములను రూపరేఖలను వివరించినది. నలుఁడు వివాహ మంటపమున కేగుతరి పురయువతులును, కలియెట్లైన నలుని మోసపుచ్చెదనని పల్కినప్పుడు దిక్పాలురును అతని సౌందర్య మహనీయతా విశేషములను వర్ణించియుండిరి.

అర్హమెవ్వనిరూపమంగ సంభవరాజ్య-రుక్మసింహాసనారోహమునకుఁ
గడుపునెవ్వనికీర్తి కార్తికీతిథి నిశా-నాథబింబంబు నెన్నడిమికందు
భవన మెవ్వని ప్రతాపప్రదీపమునకుఁ-బుండరీకభవాండ మండలంబు
చుట్టమెవ్వనికేలు సురభిచింతారత్న-రోహణాచలవారివాహములకుఁ
గలుషమెవ్వానిఁదలఁచినఁ గ్రాఁగిపోవు
బుణ్యమెవ్వానిఁగీర్తింపఁబొడవువడయు
వాఁడు నిషధేశ్వరుండు మా వరుసవాఁడు
కలిమహారాజ మన్నింతుగాక వాని. (7-105)

అని దిక్పాలురు నలుని సౌందర్యమును, కీర్తిని, ప్రతాపమును, వదాన్యతను, మహానుభావతను కలి యెదుట వర్ణించు సీసము "ఎవ్వానివాకిట నిభమదపంకంబు రాజభూషణ రజోరాజినడఁగు" నను తిక్కనగారి ధర్మజ వర్ణనమును దలఁపించుచు నలుని సమగ్రమూర్తిని పఠితల యెదుటఁ బెట్టుచున్నది. హంస దమయంతికి నలుని పరాక్రమ కీర్తుల నీ విధముగ వర్ణించినది.

రణకండూభరదుస్సహంబయిన యారాజన్య దేవేంద్రు ద
క్షిణబాహాగ్రమునంజనించిన మహాకీర్తి ప్రవాహంబు కా
రణ సంక్రాంత గుణానుషంగముననో ప్రస్ఫీతదిఙ్మత్త వా
రణగండస్థలకుంభకూలములతో రాయున్‌ దివారాత్రముల్‌. (2-52)

నలుని దక్షిణ బాహువు యుద్ధమునకై తీటగొని విజయలాభముచే నఖండమైన కీర్తి నార్జించినది. కారణగుణములు కార్యమునందును సంక్రమించునను న్యాయముచే కారణమైన బాహువునందలి తీట కార్యమైన కీర్తియందును సంక్రమించినది. కీర్తియందిట ప్రవాహత్వమారోపింపఁ బడినది. అది నిత్యమును దిగ్గజముల గండస్థలములు కుంభములు అనునొడ్డులతో రాసికొనుచున్నదని దీని యర్థము. మూలమున నతనికీర్తి దిక్కులనెడినదుల గట్టుల నొరయు చున్నదని చెప్పఁబడినది. ఈ పద్యము మూలమునకు మెఱుగు పెట్టుచు నలునికీర్తి దిగంత వ్యాప్తిత్వమును దెల్పుచున్నది.

హంస నలునిముందు కేశపాశములనుండి యూరువులవఱకును దమయంతి సర్వావయవములను సంగ్రహముగా వర్ణించెను. నలుఁడు దూతగా నేగినప్పుడు దమయంతినిజూచి "చికురాదియుంబదనఖాంతముగా" నామె సౌందర్యమును దనివితీర వర్ణించెను. ఈ వర్ణనమాలంకారికమై తరువాతి యాంధ్రప్రబంధములందలి నాయికా వర్ణనమున కొజ్జబంతి యైనది. ఇందు కవి ప్రదర్శించిన భావనాశక్తి యనన్య సాధారణమైనది. విస్తరభీతిచే నొక్క పద్యమును మాత్రము దాహరింతును.

శ్రవణపుటకూప వినిపాత సాధ్వసమున
నిగిడియవ్వలికటుపోక నిల్చెఁగాక
యధిక చపల స్వభావంబులైన యట్టి
దాన్ని కన్నులు తలచుట్టుతిరిగి రావె (3-167)

కన్నుల చాపల్యమును, సోగతనమును ఇంతకంటె నతిశయముగా వర్ణించుట యసాధ్యము. దమయంతి స్వయం వరాస్థానమున కరుదెంచునప్పుడు మరల దమయంతీ సౌందర్యము వర్ణితమైనది. అది స్వయంవరాగతులైన రాజులందఱిచే నాసాశిఖాగ్రమున తర్జుని మోపించి మూర్ధములూపించి వారినాశ్చర్య చకితులఁ గావించినది.

నలదమయంతీ వివాహ నేపథ్యములను, మధుపర్కపారణమును, కౌతుకరక్షాబంధనమును, లాజహోమమును కవి వివరముగా వర్ణించెను. హోమ సమయమున నగ్నిజిహ్వాసముత్థితమైన ధూమము దమయంతి చెక్కు టద్దములపై చెఱలాడునప్పుడు కస్తూరికా పత్రకములవలెను, శ్రవణపాశములలోఁ జాగిపాఱెడునప్పుడు లలిత తమాలపల్లవములవలెను, కన్నులలో చోపారునప్పుడు నీలాంజనమువలెను, ఫాలభాగముపై పఱతెంచునప్పుడు చూర్ణాలకములవలెను ప్రకాశించెనని (6-103) వర్ణించు పద్యము కవి భావనాశక్తిని ఉచితోపమాన రచనా పాటవమును వేయి విధముల చాటుచున్నది. బువ్వపుబంతివేళ సాగిన పరిహాసములను, ప్రేమప్రకటనములను కవి మిక్కిలి అభినివేశముతో వర్ణించెను. అప్పటి చతుర్విధాహారములను వర్ణించునప్పుడు శ్రీనాథుఁడు మూలకర్త యొసంగిన వివరములతో తృప్తిపడక తనకభిమతములైన కొన్ని క్రొత్త పిండివంటకములనుగూడ చేర్చెను (6-120). అతఁడు విహార సౌధమును, అందలి చిత్రములను, నలదమయంతుల విహార సమయమునందలి శృంగార చేష్టలను, వివిధక్రీడా విశేషములను రసబంధురముగా వర్ణించెను.

ప్రాణేశు నొసలి లాక్షాంకమ్ము నొడగాంచి-ముసిముసి నగవుతో మొగము మలఁచు
నేలనవ్వితి చెప్పుమిప్పుడం చడిగిన-నధిపు చేతికిమించుటద్దమిచ్చు
మఱుపెట్టి చనుదోయిమదనాంకములు సూచుఁ-దనునవ్వు విభుజూపులన యదల్చు
రాజుచేఁజికురభారము పెట్టమోవంగ-మ్రొక్కించుకీనుఁబాదములకు నలిగి
రుద్రమూర్తి జీగీషానురూపకలన
అతనుఁడేకాదశాకృతియైన భంగిఁ
జరణనఖదర్పణములందు ధరణివిభుఁడు
వీలఁబ్రతిబింబితుండుగా లోలనయన (7-19)

అను పద్యము వారి శృంగార విలాసములను వ్యంగ్యముగా సూచించు చున్నది. నలుని నొసట లాక్షాచిహ్నములు తోఁచుట కాతఁడు ప్రణయకుపిత యైన దమయంతి ననునయించుటకై యామెపాదములఁ బడుటయే కారణము. ఆ చిహ్నములనుబట్టి జరిగిన కార్యము నితరులూహింతురని యామె హసించెను. ఎట్టయెదుట నవ్వుట యగౌరవము కావున మొగముమలంచెను. ఏల నవ్వితివని రాజడుగ నోటితోఁ జెప్పుట హేళనగనుండును గావున మీరే చూచుకొండని యతని చేతి కద్దమిచ్చెను. చెలికత్తెలు నఖక్షతాదులను జూచి గేలిచేయుదురని యామె చాటుగా తిరిగి వానిని దుడిచివేయుటకై యవి యెక్కడెక్కడ నున్నవో పరికించెను. నీ లాక్షాంకము నా నొసట నున్నట్లే నా నఖక్షతము నీ వక్షమున నున్నదను భావము సూచించుచు రాజెగతాళిగా నవ్వెను. దమయంతి మాటలచేఁగాక చూపులచేతనే యాతని నదలించి కోపము ప్రదర్శించెను. రాజు వినయమున మ్రొక్కెను. అప్పుడు దమయంతి నఖదర్పణము లందతని ప్రతిబింబములు తోఁచెను. ఆ ప్రతిబింబములు పదింటిలో మన్మథుని మూర్తులు పదొకండయ్యెను. రతిసమయమున నలుఁడు మన్మథునివలె నుండెనని భావము. ఆ పదొకండా కృతులు ఏకాదశాకృతియైన రుద్రుని జయించుటకై మదనుఁడు తానును ఏకాదశాకృతి యయ్యెనా యను నట్లుండెను. నలుఁడు శివపూజ యొనర్చిన పిమ్మట హరిపూజ కావించి యాదేవుని దశావతారములను వర్ణించెను. తరువాతి ప్రబంధ కవుల కొజ్జబంతియైన యీ దశావతార వర్ణన మద్భుతముగా నున్నది.

కామసమ్మోహిత క్రౌంచఘాతమునకు
వగచి నీ చాటుకవి చెంచువానిఁ గినిసెఁ
గామ మోహితయగు నింతిఁగస్తి పఱుప
ననుజుఁబురికొల్పితిది నీకుఁ జనునెరామ (8-130)

అను పద్యమున హృద్యమైన కించిదుపాలంభమున్నది. కామమోహితమైన క్రౌంచపక్షుల జంటలో నొకదానిఁ గొట్టినందుకుఁ (వాల్మీకి వ్యాధుని శపించెను. వాల్మీకి శ్రీరాముని చాటుకవియఁట!) కామమోహితయై వలచి తన కడకు వచ్చిన శూర్పణఖ ముక్కుచెవులు కోసి శిక్షించుటకై రాముఁడు తమ్ముఁడైన లక్ష్మణుని బంపెను. ఈ వ్యత్యాసము తగునాయని నలుఁడు రాముని ప్రశ్నించు చున్నాఁడు.

కావ్యాంతమున సంధ్యా నక్షత్రాంధకార చంద్రవర్ణనమున్నది. ఇది యుత్ప్రేక్షాతిశయోక్త్యాద్యలంకారములతోఁ గూడి కవి యపూర్వమైన భావనాశక్తిని జాటుచున్నది. చంద్రునియందలి మచ్చను, కిరణములను, చంద్రికను అతఁడుత్ప్రేక్షించిన తెఱంగద్భుతముగా నున్నది.

బాలిక! యీ సుధాకరుఁడు పంకజనాభుని వామభాగదృ
గ్గోళకమైననాడు నవకోమల బాలతమాలకందళీ
కాళిమగేలిసేయునడుకందిది తన్నయనాంతరంబున
న్నీలకనీనికామఘవనీలమణిత్వము నొందకుండునే. (8-180)

అను పద్యము చంద్రుఁడు నారాయణుని యెడమకన్ననియు, తన్మధ్యస్థమైన మచ్చ కంటి యందలి నల్ల గ్రుడ్డనియు తెల్పుచున్నది. సూర్యచంద్రులు విష్ణువు దక్షిణ వామ నేత్రములను పురాణ ప్రసిద్ధ సంప్రదాయముపై నాధారపడిన కల్పనమిది. నిజవంశ మకుట మాణిక్యమైన చంద్రుఁడు విశ్వమునకు కల్యాణ పరంపరాభివృద్ధి గావించుఁ గాతమని యాకాంక్షించుచు నలుఁడు రమణీ సమేతముగా నతనికి మోడ్పుఁగేలు సంధించుటతోఁ గవి కావ్యమును ముగించుట యత్యంతౌచిత్య భాసురముగా నున్నది.

దిక్పాలురు కల్పవృక్ష కామధేనువులనో సప్తతంతువాతాపితాపసులనో యర్థించి నిన్ను బొందిన నేమిచేయుదువని నలుఁడు పలికినప్పు డప్రతివిధానమైన ప్రియావాప్తి విఘాతమునకు కలఁతనొంది దమయంతి యేడ్చెనని కవి యీ క్రింది పద్యమున వర్ణించి యున్నాఁడు.

ప్రవిమలాక్షినభోనభస్యాంబుదములకు-నవవృష్టిధారలై యవతరిల్లి
యాకర్ణదీర్ఘ నేత్రాంభోరుహములకుఁ-గమనీయనాళభావము భజించి
లలిత వక్షోజ కుట్మలచుంబనమ్మున-మధుపదంపతుల సామ్యంబువడసి
కలిత కజ్జలత ముక్తాహారలతలలో-హరినీలరత్ననాయకతఁ దాల్చి
వేఁడియశ్రులు నిగుడంగ వెక్కివెక్కి
యేడ్వఁదొడఁగె లతాంగి పృథ్వీశుమ్రోల
మృదుల పరివేదనాక్షరోన్మిశ్రమధుర
కంఠకాకువికార కాకలిక గదుర. (4-87)

దమయంతి కాటుక కన్నులు శ్రావణభాద్రపదములందలి నీలమేఘములవలె నుండెను. అందుండి తొలకరి వాన ధారలవలె నవతరిల్లిన కన్నీటి ధారలు వక్షముపైఁ బడునప్పుడు నేత్రాంభోజముల తూండ్లవలెను నొప్పారెను. వక్షోజ కుట్మలములపైఁ బడియవి మధుపదంపతులతో సామ్యము వహించెను. ముక్తాహార లతలలో నవి యింద్రనీలమణి నాయకత్వము భజించెను. రమ్యములైన యుపమానములతోఁ గూడిన యిచ్చటి కన్నీటి ధారల వర్ణన మపూర్వ భావనా విరాజమానమై యేడ్చుచున్న దమయంతి మూర్తిని పఠితల కన్నుల యెదుట సాక్షాత్కరింపఁ జేయుచున్నది. మూలమునించుక మార్చి శ్రీనాథుఁడు రచించిన యీ సీసమతని యప్రతిమాన వర్ణనా పాటవమునకు తార్కాణమై యలరారు చున్నది.

కలిరాజును, కామక్రోధలోభమోహులను, స్వయంవరాగత రాజకుమారులను వర్ణించు సందర్భమున శ్రీనాథుఁడు వారి యాకృతులను, వేషములను, పరివారమును విశదముగా వివరించి తన వ్యక్తిరూపచిత్రణ చాకచక్యమును చక్కగా ప్రదర్శించి యున్నాఁడు.

కఱకువై పెరిఁగిన కుఱువెండ్రుకల తోడ-బట్టి యౌదలఁ గావి పాగయమర
నిగిడిపూఱేకు బాగుగఁ గత్తిరించిన-గడ్దంబుకొన ఱొమ్ము గమ్మిరింప
బండికందెన తోడఁ బ్రతివచ్చు మైచాయ-నీలిపచ్చడముతో మేలవింప
నవరక్తచందన ద్రవ కల్పితంబైన-నూత్న త్రిపుండ్రంబు నొసల నొప్పఁ
గోరమీసలు మిడిగ్రుడ్లు కుఱుచపొడవు
డొప్పచెవులును గొగ్గి పండులునుగలిగి
యున్నమద్గ్రీవుఁడై వచ్చు చున్నవానిఁ
గలి మహారాజుఁ గనిరి దిక్పాలవరులు. (7-93)

అనుసీసము కలిరాజు నాకారమును చిత్రమువోలె సాక్షాత్కరింపఁ జేయుచున్నది. కలిరాజు సైన్యభటులను (7-61) కలినిబొగడు బట్లను (7-63) వర్ణించు పద్యములు కూడ నిట్లే వారి వికారాకారములను చక్కగా వెల్లడి చేయుచున్నవి. స్వయంవరాగతులైన రాజులను సరస్వతి వర్ణించిచెప్పు పట్ల నాయాదేశములను, సౌఖ్యహేతువులైన యందలి విశేషములను, వారి పరాక్రమ విజయ వైభవములను వివరించి కవి తన భూగోళ పరిజ్ఞానమును ప్రపంచానుభవమును వ్యక్తముచేసి యున్నాడు.

కలిరాజువందులు త్రైలోక్యవాసులు విన వాచాటులై వేదమప్రమాణమనియు, స్వచ్ఛందమే ధర్మమనియు, కామదేవుఁడే దైవమనియు, మరణమే యపవర్గమనియు, దేహమనల దగ్ధమైపోవును గావున నింక పాపమను నదుండదనియు, జనులు సౌఖ్యదములైన పరదార సంగమాది దోషములను యథేచ్ఛగా నాచరింప వచ్చుననియు పల్కిన పల్కులు వింతహేతువాద పద్ధతితో గూడి యాస్తికులైన వారికి జుగుప్సా విషాదములను గలిగించును. వారు విగ్రహపూజ నపహసించిన యీ క్రింది పద్య మపూర్వమైన హేతువాదముతోగూడి వారుచెప్పుచున్నది సత్యమేమోయను భ్రాంతి కలిగించు చున్నది.

మలచినరాలయందుఁ గుసుమంబులువోయుచు మీఁదనెన్నఁడే
ఫలమొకనాఁడు గల్గునను పల్కది యెవ్వఁడు నమ్మినాడు, కో
మలవన రాజిలోనఁ గుసుమంబులు గోయుట యెప్పుడప్పుడే
ఫలములు పోవొ పోవునొ యుపాసకులార! తలంచిచూడుఁడా. (7-70)

విగ్రహములను పూవులతో పూజించుట వలన నెప్పుడో ఫలము కలుగునను మాట సందిగ్ధము, కాని యొక పువ్వు కోయఁగనే యొక ఫలము పోవుట మాత్రము నిశ్చయమని యందలి హేళన. వారి మాటలు విని యింద్రాదులు కోపించినప్పుడు వారే "పరతంత్రులము మా యబద్ధ వాక్యములకుఁ దప్పుబట్టకు"డని ప్రార్థించుట పాఠకు లవిచదివి పెడత్రోవఁ బట్టకుండుటకు తోడ్పడు చున్నది.

ఈ కావ్యమున శృంగారరసమును పోషించుటలో శ్రీనాథుఁడు చూపిన నేర్పనన్య సామాన్యమైనట్టిది. ఇందు వియోగ సంయోగ శృంగారములు రెండును వర్ణింపఁబడినవి. నలదమయంతు లిరువురు నొండొరుల గుణగణ ముల నన్యులవలన విని అనురక్తులై వియోగము ననుభవించిరి. ఇది వినుకలిచేఁ గలిగిన వియోగము. "జాగరో ద్భూత దృగ్రాగంబు మాణిక్యకర్ణకుండలదీప్తిఁ గప్పిపుచ్చు" (1-86) అను సీసము నలుని వియోగస్థితిని "అతివసమ్ముఖ వాస్తువగువస్తువును గానదాత్మయంతర్ముఖంబౌటఁజేసి" (2-113) అను సీసము దమయంతి వియోగావస్థను జక్కగా వర్ణించుచున్నవి. "దశలంతంతకు నెక్కఁగా విరహసంతాపాతిరేకంబున" దమయంతి కృశించి విరహబాధ సైపఁజాలక చంద్రమన్మథాద్యుల నుపాలంభించినది. తరువాత వెలువడిన ప్రబంధములందలి చంద్రమన్మథాద్యుపాలంభనముల కిదియే యొజ్జబంతి. ఆమె చంద్రు నీవిధముగా నుపాలంభించినది.

హాలహల ద్వయంబు కలశాంబుధిఁబుట్టె వినీలపాండుర
జ్వాలలతోడ నందొక విషంబొక వేలుపుమ్రింగె నెందఱో
వేలుపులోలియై ననుభవించిన రెండవయీవిషంబు ని
ర్మూలముగాక యున్నయది ముద్దియ! పాంథులపాపమెట్టిదో! (2-121)

పాలసముద్రమున రెండు విషములు జనించెను. అందొకటి నల్లనిది, రెండవది తెల్లనిది. నల్లని విషమును లోక రక్షణార్థమై శివుఁడు భక్షించెను. వేల్పులందఱు ననుభవించుచుండినను తెల్లని రెండవ విషము నిర్మూలము కాకున్నది. అదియే చంద్రరూపమైనది. దమయంతికి విరహోద్దీపకుఁడైన చంద్రుఁడు విషమువలె పొడగట్టెను. అవస్థానుగుణముగా జీవులకు ప్రకృతి యందలి వస్తువులు సుఖమునో దుఃఖమునో కలిగించుచుండుట సహజమే. మన్మథుఁడు పుష్పబాణుఁడు. ఆ పుష్పములైనను లెక్కకైదే. బ్రహ్మయట్లు కల్పించుటకు మన్మథుని మనః క్రౌర్యమే హేతువని దమయంతి భావించుచున్నది.

కామ! పరమేష్ఠి నీమనః క్రౌర్య మెఱిఁగి
పుష్పములు నీకు నాయుధమ్ములుగఁ జేసె
నవియు బహుళమ్ముగాఁ జేయనైదె చేసె
నిమ్తకైనను బ్రతుకునె యిజ్జగంబు (2-136)

మన్మథుని బాణము లయోమయములు, బహుళములు నైనచో నింక వియోగులు బ్రదుకుటయే దుర్లభమని యామె భావము. నలుఁడింద్రాదుల విరహ బాధను దమయంతికి విపులముగా వివరించి వారిలో నెవరినైన వరింపు మని యామెను బహువిధముల ప్రార్థించెను. అచ్చటి భావములు హృదయంగమములుగా నున్నవి. మున్ను ముక్కంటితో మోహరించి మదనుఁడతనుఁడై పోయెను. వేయికన్నులుగల యింద్రునితో విగ్రహించి యింకేమి కానున్నవాఁడో యని నలుఁడు దమయంతితో తెల్పుచున్నాఁడు.

మూఁడు కన్నుల వేల్పుతో మోహరించి
నేఁడు దేహంబు లేక యున్నాఁడు తాను
వేయికన్నుల వేల్పుతో విగ్రహించి
వనిత యింకేమి కానున్నవాఁడొ మరుఁడు. (4-23)

పద్యము చిన్నదైనను భావ మతిగంభీరముగా నున్నది. ఇంద్రుఁడు చిలుకలు పలికి కలఁగించునేమోయని నందనవనమున కరుగ మానినాఁడనియుఁ శిరసున చంద్రరేఖ యుండుటచే తద్భయమున శివునిపూజించుట మానినాఁడనియు తెల్పి నలుఁ డింద్రుని వియోగార్తిని లెస్సగా వివరించియున్నాఁడు.

చిలుకలు పల్కునో చెవులు చిల్లులు వోవఁగనందు నెన్నఁడున్‌
వెడఁలడు నందనోపవన వీధులకై, యటుమౌళిభాగ ని
ర్మల శశిరేఖచేయు నపరాధమునన్‌ గజదైత్య శాసనుం
గొలువఁడు పాకశాసనుఁడు కోమలి! నీదెస కూర్మియెట్టిదో! (4-24)

ఇట్లే నలుఁడగ్నియమవరుణుల విరాళిని కూడ విశదముగా వర్ణించి తన ద్యూతవిధినిఁ జక్కగా నిర్వహించెను. అగ్నిముక్కంటి కంటిమంటల దాపున నుండి తన ప్రాణముల నపహరించి యుండుటచే నాపగతీర్చుకొనుటకై మన్మథుఁడిప్పుడు దమయంతి దృక్కోణము ప్రాపునకోల్కొని తనయైదు బాణములచే నతని యభిమానమును గొల్లపుచ్చుచున్నాఁడని నలుడగ్ని దీనావస్థను వివరించుచున్నాఁడు.

స్థాణుని లోచనాంచలము దాపుగఁ దీవ్రతరార్చులన్‌ నిజ
ప్రాణము గొన్ననాఁటి పగయాత్మఁ దలంచియొ నీకటాక్షదృ
క్కోణము ప్రాపునన్మరుఁడు గోల్కొని పంతమెలర్పఁగాఁ గొనెన్‌
బాణదశార్థ పాతమునఁ బావకు భూరిమనోఽభిమానమున్‌. (4-31)

దమయంతి యేడ్చినప్పు డంతర్గత విప్రలంభ వేదనాభర ముద్దీపితమగుటచే నొడలు మఱచి నలుఁడు దమయంతితో నాడినపలుకులు శృంగార రసకళికలై యింపుమీఱుచున్నవి.సప్తమాశ్వాసము నందలి నల దమయంతుల విహారముల వర్ణనము సంభోగ శృంగారమున కాలవాలమై యున్నది. ఈ సందర్భమున దమయంతి లజ్జాముగ్ధతలను నలుని శృంగార చేష్టలను శ్రీనాథుఁడు మనోహరముగా వర్ణించియున్నాఁడు. అట్లే అష్టమాశ్వాసము నందలి నలదమయంతుల గోష్ఠి యత్యంత సరసముగా వర్ణింపఁ బడినది.

దాస్యము నిన్నరే కుసుమ ధన్వుఁ డొకండును సాక్షిగా సరో
జాస్య వహించినాఁడ వినుమప్పుడ మ్రొక్కుటలేదు నీకు వి
శ్వాసుఁడఁ గాన మ్రొక్కుగొను స్వస్తటి నీ సలిలాభిషేకసా
రస్య పవిత్రమస్తకము వ్రాల్చెద నీపద యుగ్మకంబుపై. (8-44)

అని నలుఁడు పల్కుట శృంగార రసానుకూలమై యాతని నిర్మలమైన యనురాగమును జాటుచున్నది. ఈ సందర్భమున దమయంతి ప్రణయకోపము నుపశమింపఁ జేయుటకై నలుఁడు పల్కిన పల్కులన్నియు నిట్లే రసభరితములై యింపునింపుచున్నవి. బువ్వపుబంతి వర్ణించు సందర్భమున శ్రీనాథుఁడు శృంగారమునేకాక హాస్యమును కూడ నెడనెడ చొప్పించి యున్నాఁడు.

కలికి వరాటరాజపుడు గప్పురవీడెము వెట్టె నవ్వుచు
న్నలునడపంబు వానికి ఫణాధరవల్లి దళాంతరంబునన్‌
బలితపుఁ దేలు మైనమునఁ బన్నియతండది సూచి భీతిఁద
మ్ముల మిలపైచినన్నగిరి మూఁగిన రాజకుమారు లందఱున్‌. (6-141)

ఇందు పరిహాస జనితమైన హాస్యము వెల్లడియగుచున్నది. చతుర్థాశ్వాసమున దమయంతి యేడ్చు సందర్భమున కరుణమును, కలిపురుషుఁడు నిషధలో వర్తించిన తెఱంగు వర్ణించు సందర్భమున భీభత్సమును సరస్వతి నలునికి చింతామణీ మంత్రము నుపదేశించు సందర్భమున శాంతమును స్ఫురించుచున్నవి.

కవి యిందు నాయికానాయకులైన నలదమయంతులయు హంసయొక్కయు, దిక్పాలురయు, కలిరాజాదుల యొక్కయు శీలస్వభావములను జక్కగా చిత్రించియున్నాఁడు. నలుఁడు సౌజన్య సౌందర్య సారస్యములకు నెలవైనవాఁడు. ఆడినమాట తప్పనివాఁడు. ఇంద్రుఁడర్థించినప్పుడైన నిచ్చెదనని మొదట వాగ్దానమొసంగి యుండుటచే నతఁడు దమయంతి కడకు దూతగా నరుగవలెనని దేవతలు నిజాభిలాషమునకు విఘాతకరముగా కోరినను వెనుదీయక వియోగభారముతో ద్యూతభారమును గూడ వహించినాఁడు. అతఁడు తనపేరు చెప్పకయే దిక్పాలురలో నెవరినైన వరింపవలెనని పలువిధముల దమయంతిని ప్రార్థించి తన విధినెంతో మనశ్శుద్ధితో నిర్వహించినాఁడు. తరువాతనైన తనపేరు చెప్పియాతఁడు దూత్యభంగ మొనరింపలేదాయను సందేహమును కవి చక్కగా నివారించి యున్నాఁడు. దమయంతి వెక్కివెక్కి యేడ్చినప్పు డతఁడు "దివిజోపకార కార్యప్రయోజన సంస్తంభితంబైన విప్రలంభవేదనాభరం బప్పుడుద్దీపితంబై భరింపం గొలందిగాక ... తన్నును తన వచ్చిన కార్యంబును దన్నుఁ బుత్తెంచిన వేల్పులను మరచి యవస్థావశంబున నుచితానుచిత వివేకంబు దప్పుటయు భావనా నిరూఢంబులైన ప్రియా విలాపంబులుగా వితర్కించుచు" తన నామధేయ మెఱింగించెను. అది యతఁడు వివశుఁడై చేసిన పనియేకాని యుద్దేశ్యపూర్వకముగా చేసినది కాదని కవి సమర్థించి యున్నాఁడు. మఱియు సంప్రాప్త సంస్కారుఁడై నలుఁడు పశ్చాత్తాపము పొందిన తెఱంగుకూడ నతని మనః పారిశుద్ధ్యమును వెల్లడి చేయుచున్నది.

ఆదిఁబరోపకార పరులై చరించిన యట్టి యాంజనే
యాదులఁబోలనైతి నిపుడక్కట! దైవతకార్య సిద్ధివి
చ్ఛేదమునొందె నేమియేని చెప్పుదునింక నమర్త్య పంక్తికు
న్మాదులు సంఘటింపఁగ సమర్థులె యెందును రాయబారముల్‌. (4-95)

అని పశ్చాత్తప్తుఁడై యతఁడు "చేతనాహానిఁగార్యంబు చిన్నవోయెఁ జేతనాహాని దైవంబుచేతవచ్చె"నని సరిపుచ్చు కొనెను. తరువాత దమయంతి చెలిపల్కిన పల్కుల నాతఁడు వినకపోవుటయేకాక "అక్కట దైవకార్యమిటు లాఱడిపోవునె యంచు" నాత్మలో విచారించెను. అప్పుడు హంస యరుదెంచి

నీయంతఃకరణము నిర్మలము వర్ణింపగ శక్యంబెనీ
భూయస్తంబు జగత్ప్రసిద్ధములు నీపుణ్య ప్రభావంబులే
లాయీలాగునఁ జింతనొందెదవు కార్యావాప్తి యౌగాదటే
యా యింద్రాదులు నీ నిజంబెఱుఁగరే యబ్జారివంశాగ్రణీ! (4-107)

అని యాతని యంతఃకరణ నైర్మల్యము నుగ్గడించి యోదార్చెను. దేవతలు కూడఁ "దన్మనశ్శుద్ధి" కాత్మల ముదంబందిరి. అందుచేతనే స్వయంవరానంతరము వారతనికి వరములు ప్రసాదించుటేకాక కలి దురుద్దేశము నెఱింగి యాతని వారించియుండిరి. కావ్యాంతమున నలుని నైష్ఠికతయు శివవిష్ణు భక్తియు వ్యక్తము చేయఁబడినవి. అందుచేతనే యతఁడు పుణ్యశ్లోకుఁడని కీర్తింపఁ బడియున్నాఁడు. దమయంతి యనురాగము నిర్మలము నచంచలము నైనది. ఆమె నలుని గుణగణములు వినియతనినే త్రికరణ శుద్ధిగా వరింప నిశ్చయించినది. దేవతలలో నెవరినైన వరింపుమని నలుఁడెన్ని విధముల ప్రోత్సాహించినను ఆమె తన నిశ్చయమును సడలించు కొనలేదు. "అనలసంబంధ వాంఛనాకగున యేని అనల సంబంధవాంఛ నాకగునుఁ జూవె" యనుటయే యామె స్థిరసంకల్పము శుద్ధియు పాతివ్రత్యమునే సరస్వతికిని దేవతలకును ఆమెపై దయ పుట్టుటకుఁ గారణములు. దేవతలామెను "ఆదిమశక్తియైన తుహినాచలరాజతనూజవోలె ముత్తైదువవై నిజేశ్వరుని యర్థశరీరము పాలు గొమ్మ"ని దీవించిరి. సరస్వతి "నీదుపాతివ్రత్యనియమంబునకుఁ దప్పుఖలుఁడు భస్మంబవుఁ గాతమపుడ", "నిక్కమిదియాదిగాఁగ నోనీరజాక్షి కామరూపిణివగుము మాకరుణఁ జేసి" యని యామె నాశీర్వదించెను. దూతగా వచ్చినవాఁడు నలుఁడని యెఱుంగక ముందామె ప్రదర్శించిన ప్రగల్భతను, ఎఱింగిన పిమ్మట ప్రకటించిన లజ్జా వినయములను, స్వయంవరానంతరము విహారాదులందు చూపిన పత్యనురక్తిని కవి చక్కగా వ్యక్తీకరించి యున్నాఁడు. దిక్పాలురకు దమయంతిని వరింపువలెనను వాంఛ జనింపకుండవలసినది. జనించిన పిమ్మట వారు నలునే దూతగాఁ బంపుట యాతని శీలమునకు వన్నె కల్గించుటకేయని తోఁచును. అట్లే వారు స్వయంవరమునందు పాల్గొనుటయు దమయంతీ పాతివ్రత్యమును బయల్పఱచుటకే. స్వయంవరమున దమయంతి తమ్ము వరింపమికి వాఁరు ఖిన్నులయ్యును ఆ పుణ్య దంపతులకు వరము లొసంగుటయు, కలిని నలవంచనా కార్యమునుండి నివారించుటయు వారి సహజ సౌజన్యమును చాటుచున్నవి. తమ మనోరథము విఫలమైనను వారు నలుని మనశ్శుద్ధిని ప్రశంసించుట వారి దివ్యత్వమునకు నిదర్శనము. కవి కలి వికృత రూపమునేకాక మౌర్ఖ్యమును దౌర్జన్యమును విశదముగా వర్ణించెను. కలి నిషధరాజ ధర్షణార్థము శుద్ధాంతలీలా వనమందలితోడి మ్రానికోటరంబున వసించి రంధ్రాన్వేషణ తత్పరుఁడై యుండుటయు, సరస్వతి "నీదు పాతివ్రత్యమునకుఁ దప్పుఖలుఁడు భస్మమగు"నని వరమొసఁ గుటయు నుత్తరకథా సూచకములై శ్రీహర్షుఁ డుత్తరభాగమును కూడ రచించెనేమోయను ననుమానము నావహించుచున్నవి. నల దమయంతుల కొండొరులపై ననురాగము కలిగించి దౌత్యము నెఱపిన హంస వాక్చాతుర్యమును మహానుభావతను కవి చక్కగా ప్రకటించెను. నలుఁడు హంసను

సరసత్వంబునిగూఢ కార్యఘటనా చాతుర్య సంపత్తియుం
బురుషార్థైక పరాయణత్వమును నభ్యుత్థాన లీలాధురం
ధరతా ప్రౌఢియునుంగృతజ్ఞతయు వాత్సల్యంబు సద్భావమున్‌
సరసీజాసన వాహనాన్వయవతంసా! హంస నీ కందముల్‌. (2-102)

ప్రశంసించుటలో స్వార్థముకంటె సత్యమే యెక్కువ.

నైషధము వర్ణన ప్రధానమైన కావ్యమనిముందే చెప్పితిని అయ్యును కవి యిందు రెండుమూఁడు సందర్భము లందు చక్కని సంభాషణరచనా చాతుర్యమును నాటకీయతను బ్రదర్శించి యున్నాఁడు. నలదమయంతులకును హంసకును జరిగిన సంభాషణములును, చతుర్థాశ్వాసమందలి నలదమయంతుల సంభాషణమును, కలి దిక్పాల సంభాషణమును ఇందుకు నిదర్శనములు. నలదమయంతుల యుక్తి ప్రత్యుక్తులును ప్రతిబందీరచనాచాతుర్యమును ప్రశంసాపాత్రములై యొప్పారుచున్నవి. దూత నలుఁడని తెలిసిన పిమ్మట దమయంతి "యవనికాంతరమున నోలమాసగొనుట" నాటకీయముగా నున్నది. అష్టమాశ్వాసమందు నలునికి దమయంతి చెలియైన కళావతికిని జరిగిన శృంగార సంభాషణము చమత్కార గర్భితమై సహృదయ హృదయావర్జకమై యలరారుచున్నది.

మదగజరాజ కుంభముల మచ్చకిరించుచురోజకుంభముల్‌
గిదిసి కలంత మేరయును గైకొని యున్నవి యెల్లవారికిన్‌
విదితముగాఁగ నిట్టితఱినీ చెలిడెందమునందు నేమియుం
గదలక మాకు నుండనవకాశము లేదుగదే కళావతీ! (8-65)

అని నలుఁడు పలుక కళావతి

రమణిహృదయంబునను మహారాజవీవు
గరిమ విచ్చేసి యుండిన కారణమున
దీని వక్షోరుహంబు లాలోననుండ
నెడము లేకున్న మఱికదా వెడవె వెలికి (8-66)

అని సమాధాన మొసంగెను. ఇట్లె యీ సంభాషణమంతయు చక్కని యుక్తిప్రత్యుక్తులతోఁ గూడి సరసమై యొప్పారుచున్నది. బువ్వపుబంతి వర్ణనము నందలి

ఉష్ణశీతాన్న కబళంబు లొకఁడు సూపఁ
బవలొ రాత్రియొ గెడ గూడ నవసరమని
దానికుత్తర మొకలతా తన్వియిచ్చె
నధర బింబంబు విఱిచి సంధ్యాగమమని (6-237)

మున్నగు పద్యములు సమయోచితములును సరసవ్యంగ్యపూరితములునై హృద్యములుగా నున్నవి.

నిజమునకు శృంగారనైషధము శ్రీహర్షుని సంస్కృత కావ్యమున కనువాదమే యయ్యును అది యెచ్చటను అనువాదమువలె కనిపింపదు. శ్రీనాథుఁడు సంస్కృత కావ్యమును బాగుగా పఠించి స్వాయత్తము కావించుకొని యందలి భావములను స్వేచ్ఛగా వివరించెను. అందుచేతనే యతని రచనయందు కుంఠితగమనముగల పద్యమొక్కటియును గానరాదు. పద్యమును నిరాఘాటముగను ధారాళముగను నడపించుట యతనికి వెన్నతో నలవడిన విద్య. అతఁడు సంస్కృతమునఁగూడ మహాపండితుఁడగుటచే తన రచనలో నెక్కువ సంస్కృత పదములనే వాడెను. అయినను ఎడనెడ నాతఁడు వాడుచుండు రమ్యములైన తెలుఁగు జాతీయములును నుడికారములును తెలుఁగుపై నాతనికిఁగల యధికారమును ఆసక్తిని వెల్లడించుచు చదువరుల హృదయముల కపారమైన యానందము నావహించుచుండును. అతని సీసపద్యముల నడక మత్తేభ గమనమున కెనయై, వైవిధ్య శోభితమై చదివిన కొలంది చదువవలయునను నుత్కంఠ రేకెత్తించుచుండును. "కాలకంఠకఠోరకంఠ హుంకారంబు చెవులు సోకనినాఁటి చిత్తభవుఁడు" వంటి పద్యములు ధ్వనిగాంభీర్యమున కాలవాలమై వినువారి వీనులకు విందొనగూర్చు చుండును. అతని రచన యర్థశబ్దాలంకార పూరితమై మిక్కిలి ప్రౌఢముగా నుండును. నైషధమున శ్లేషయును, అనుప్రాసాది శబ్దాలంకారములును అక్కడక్కడ కనిపించును. సరస్వతి పంచనళిని వర్ణించునప్పుడు శ్లేష వాడఁబడినది. అచ్చటి పద్యములందొక యర్థము నలునికిని వేఱొక యర్థము దిక్పాలురలో నొకఱికిని అన్వయించును.

తామరస పత్రనేత్ర యీతండనలుఁడు
లావుగలవాఁడు లోకపాలకులలోన
బహుతర స్నేహరుచి మహాబలసహాయ
సంపదుద్దాముఁ డితని వీక్షింపుమబల (5-167)

ఈతండు + అనలుఁడు = ఈతఁడగ్ని; ఈతఁడు + ఆ + నలుఁడు = ఈతఁడే నలుఁడు; లోకపాలకులు = దిక్పాలకులు, దేవతలు, రాజులు; స్నేహము = మైత్రి, నూనె; మహాబలము = గొప్పసేన, వాయువు; అనునవి యీ పద్యమునందలి రెండర్థములుగల పదములు. ఉపమోత్ప్రేక్షారూపకాతిశయోక్త్యర్థాంతర న్యాసముల నతఁడు విరివిగా వాడియున్నాఁడు.

ఇరులగెలిచినయంతఃపురేందు ముఖుల
కురులు మరుఁడను వేటకాఁడురులుచేసి
మరులు గొలుపంగ లేఁడయ్యెను మనుజవిభుని
సరులు లేని నదృక్ఖంజనశాబకముల (3-90)
అదికులాబలాచార సహాసనాస
హాతి సాహస కౌతూహలావసథము (4-50)
లలితకలాపికోమల కలాపకలాపపే
శల మృదుకేశమంజరులు. (6-51)

మున్నగునవి యాతని కనుప్రాసయమకాది శబ్దాలంకార ప్రయోగమునఁ గల కౌశలమును ప్రదర్శించును.

కాంతయశ్రుబిందుచ్యుతి కైతవమునఁ
దివిరి బింద్యుచ్యుతక కేలిఁ దవిలెదీవు
సారె సారెకునాదు సంసారమునుఁ స
సారముగఁజేయుచు మసార సారనయన (4-90)

అనునదాతని చిత్రకవితారచనాపాటవమునకు తార్కాణము. శ్రీనాథుఁడు నైషధమునం దచ్చటచ్చట మనోహరము లైన వచనములను రచించి యుండెను. "అక్కటకటా! దైవంబ నీ కంటికిం బేలగింజయుం బెద్దయయ్యెనే జననీ! ముదిసిముప్పుఁ గాలంబున సుతశోక సాగరం బెబ్భంగినీఁదఁగలదానవు" (1-110) మున్నగు వచనములలఁతి యలఁతి వాక్యములతోడను జాతీయములతోడను గూడి సరసములును రమణీయములునై యొప్పారుచున్నవి. నైషధమున ఛందో వైవిధ్యమంతగాఁ గానరాదు. స్వయంవరాగతులను వర్ణించుటకై భీమరాజు సరస్వతిని ప్రార్థించు సందర్భమున సంస్కృతభాషా దండకమున్నది. ఈ విధముగా మూలమున కెందును దీసిపోని భంగి శ్రీనాథుఁడు నైషధము నాంధ్రీకరించి యాంధ్రభారతి యఱితికపూర్వాలంకారమును సమకూర్చినాఁడు.

ఇమ్మహాకృతిఁ బఠియించు నెవ్వఁడేని
యాతఁ డపగత కలిదోషుఁడగుచుఁగాంచు
నాయురారోగ్య విమల విద్యావివేక
భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు. (8-203)
AndhraBharati AMdhra bhArati - telugu vachana sAhityamu - upanyAsamulu - shR^iMgAra naiShadhamu - AchArya divAkarla vEMkaTAvadhAnigAru ( telugu andhra )