వచన సాహిత్యము వ్యాసములు ఆంధ్ర సాహిత్యము - తెలంగాణము

ఆంధ్ర సాహిత్యము - తెలంగాణము
తెలంగాణలో జాతీయోద్యమాలు - డా॥ దేవులపల్లి రామానుజరావు

"తేనె మాగాణ మీ తెలంగాణము"
ఆంధ్ర సాహిత్య చరిత్రలో తెలంగాణ స్థానము
జానుతెలుగు ప్రజాసాహిత్యము
రాజకీయాల ప్రభావము
ఆంధ్ర శారదకు అరణ్య, అజ్ఞాతవాసాలు
తెలుగు సరస్వతికి సేవజేసిన ధన్యులు
అత్యుత్తమ రచనలు
సమగ్రాంధ్ర దృక్పథముతో సారస్వత కృషి

"తేనె మాగాణ మీ తెలంగాణము"

ఇరువదవ శతాబ్ద మందలి రెండు తరాలకు జెందిన యిద్దరు ప్రముఖ కవీశ్వరులు తెలంగాణ ప్రశస్తిని కీర్తించినారు. "తేనె మాగాణ మీ తెలంగాణము, తమ్ముడా మాతల్లియని పాడరా, సోదరీ మా మాత యని పాడవే!" అని యొకరు ప్రబోధించగా, "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" యని ఇంకొకరు ఉద్ఘాటించినారు. ఈ కవీశ్వరులలో ఒకరు భారత జాతీయతను, ఆంధ్రదేశ సంస్కృతిని నోరూర నోరారా గానము చేసిన ఆంధ్ర మహాశయులు; ఇంకొకరు యావదాంధ్రము యేకము కావలెనను ఆదర్శముతో "మూడు కోటుల నొక్కటే ముడి బిగించ" వలెనని ఉద్బోధించిన యువకవీశ్వరులు. కావున యీ ఉభయులు తెలంగాణమును కీర్తించుటకు కారణము యేవిధమైన సంకుచిత అభిమానము కాదని నిస్సందేహముగా చెప్పవచ్చును. ఆంధ్రదేశ చరిత్ర పుటలను అవలోకించినచో చరిత్ర నిర్మాణానికి, సంస్కృతికి, శిల్పమునకు, చిత్రలేఖనమునకు, సాహిత్యమునకు తెలంగాణము ఆదినుండియు ఆటపట్టయినదన్న సత్యము ఎల్లడి కాగలదు.

ఆంధ్ర సాహిత్య చరిత్రలో తెలంగాణ స్థానము

ఆంధ్ర సాహిత్య చరిత్రలో తెలంగాణమునకు గల స్థాన మేమిటియను ప్రశ్నకు యీ సందర్భమున సమాధానము చెప్పవలసి యున్నది. దేశ చరిత్రలోని ఒడుదుడుకుల ప్రభావము అన్ని ప్రాంతాలమీద పడినట్లే తెలంగాణము మీద కూడా పడినది. కాని యే పరిస్థితులలోను సాహిత్య దీపము యీ ప్రాంతమున యెన్నడును ఆరిపోలేదు. కొంతకాలము యీ జ్యోతి దేదీప్యమానముగా ప్రకాశించినది. మరికొంతకాలము మినుకుమను ఆముదపు దీపమువలె వెలిగినది. ఆంధ్ర సాహిత్యములోని ఉద్గ్రంథములను చెప్పవలసినదని యెవరిని కోరినప్పటికిని వెంటనే మూడు గ్రంథాలను సహజముగా పేర్కొనుట అనివార్యము. ఇందులో మొదటిది భారతము; రెండవది భాగవతము; మూడవది రామాయణము. తిక్కన భారతమును నెల్లూరులో రచించినప్పటికిని, దాని ఆవిష్కరణము తెలంగాణములోని యేకశిలా నగరమందలి గణపతి దేవుని యాస్థానమున జరిగినదను సత్యము చరిత్రకారులకు తెలిసియే యున్నది. ఆంధ్రులపాలిటి అమృత మూర్తియైన పోతనామాత్యుడు తెలంగాణ ప్రాంతమందలి ఓరుగల్లు పరిసరములందు నివసించి, భాగవత రచన గావించిన సంగతి చరిత్ర ప్రసిద్ధమైనది. భాగవతము నందలి శిథిల భాగములను పూరణ గావించినవారు తెలంగాణ వాస్తవ్యులైన కవీశ్వరులే. భాస్కర రామాయణమును రచించిన భాస్కరుడు, మల్లికార్జునుడు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు తెలంగాణమున జన్మించిన కవీశ్వరులని వేరుగా చెప్పవలసిన ఆవశ్యకత లేదు. రంగనాథ రామాయణ కృతికర్త రాయచూరు జిల్లా వాస్తవ్యుడు. ఇటీవల వరకు, అనగా 1957 సంవత్సరము వరకు యీ జిల్లా పూర్వపు హైదరాబాదు రాష్ట్రము నంతర్భాగమై యుండెను. ఈ విధముగా భారత, భాగవత, రామాయణాలకు తెలంగాణము పరోక్షముగాను, ప్రత్యక్షముగాను జన్మస్థానమైనది. మారన మహాకవి మార్కండేయ పురాణము తెలంగాణములో ఉద్భవించిన ఉత్తమ సారస్వతములో చేరుచున్నది.

జానుతెలుగు ప్రజాసాహిత్యము

సాహిత్యము ప్రజలకు అందుబాటులో నుండవలెనను సత్యమును గుర్తించి, జానుతెలుగులో ప్రజాసాహిత్యానికి మిక్కిలి అనుకూలమైన ద్విపదలో బసవపురాణమును వ్రాసిన పాలకురికి సోమనాథ కవికి జన్మస్థానము తెలంగాణము. ఆంధ్ర సారస్వతములో బసవపురాణము సర్వ విధాల విశిష్టమైన రచన. శైవ వాఙ్మయము తెలంగాణములో ప్రకాశించినది. మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము, పిడుపర్తి సోమనాథుని బసవపురాణ పద్యకావ్యము ప్రభులింగలీల, కాసె సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్రము యీ శైవ వాఙ్మయమున ప్రత్యేకముగా పేర్కొన దగిన గ్రంథములు. శివకవులతోపాటు వైష్ణవకవుల రచనలకును తెలంగాణము జన్మస్థానమైనది. ముముక్షు జనకల్పకము, తత్వార్థ దర్పణము, యతిరాజవింశతి మొదలైన కావ్యములను రచించిన కవీశ్వరులు యీ ప్రాంతమువారే. మేలుకొలుపులు, మంగళహారతులు మొదలైన గేయ వాఙ్మయమును అపారముగా రచించిన వైష్ణవ కవులు యీ ప్రాంతమున అసంఖ్యాకముగా నున్నారు. క్రీస్తు శకము 1700 ప్రాంతమున యేకామ్రనాథుడను పండితుడు ప్రతాపచరిత్రమను వచన గ్రంథమును వ్రాసి యుండెను. బహుశా ఆంధ్రభాషలోని మొట్టమొదటి వచన గ్రంథమేమో యిది! తరువాత కొంతకాలానికి అనగా 19వ శతాబ్దమున తెలంగాణములో మరొక మహా గ్రంథము విరచితమైనది. వేదాంత దృష్ట్యా ఆంధ్రభాషలో యిది అత్యుత్తమ శ్రేణికి జెందిన గ్రంథమై యున్నది. పరశురామపంతుల లింగమూర్తి వ్రాసిన సీతారామాంజనేయమే యీ వేదాంత గ్రంథమని ఆంధ్ర సారస్వతముతో పరిచయము గలిగిన ప్రతివారును వెంటనే గ్రహించగలరు. మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యముకూడా యీ ప్రాంతముననే విరచితమైనదని ఆంధ్ర సారస్వత చరిత్ర వివరించుచున్నది. పొన్నగంటి తెలగన్న యయాతి చరిత్రము అచ్చతెనుగు కావ్యాలలో మొదటిదే కాక సర్వోత్తమమైనది కూడ. ఈ విధముగా ప్రాచీనాంధ్ర వాఙ్మయమున తెలంగాణ ప్రాంతమందు మహోజ్జ్వలమైన సారస్వత కృషి జరిగినది. జాను తెలుగు శైలి, ద్విపద ఛందస్సు, ప్రత్యేకముగా అచ్చ తెనుగు కావ్య రచన, వచనములో చరిత్ర గ్రంథ రచన మొదలైన అనేక వాఙ్మయ వీథులలో మార్గదర్శకమైన గౌరవము తెలంగాణమునకు లభించుచున్నది.

రాజకీయాల ప్రభావము

రాజకీయముగా ఆనాడు కలిగిన మార్పుల ఫలితము తెలంగాణము మీద స్పష్టముగా కనిపించుచున్నది. కాకతీయుల పతనానంతరము రెడ్లు, వెలమలు, కమ్మలు ఆంధ్ర దేశమును, తెలంగాణమును పరిపాలించి యుండిరి. ఆంతరంగికమైన విబేధాలు యెన్ని యున్నప్పటికిని, ఆంధ్రభాషా పోషణము వీరి కాలమున చక్కగా జరిగినదని చెప్పవలసి యున్నది. తరువాత తెలుగుసీమ కుతుబ్షాహీల హస్తగతమైనది. కుతుబ్షాహీల పరిపాలనలో తెలంగాణమున వైజయంతీ విలాసమును రచించిన సారంగు తమ్మయ్య, యయాతి చరిత్ర కృతికర్త పొన్నగంటి తెలగన్న, షడ్చక్రవర్తి చరిత్రను వ్రాసిన మల్లారెడ్డి, తపతీసంవరణోపాఖ్యాన గ్రంథకర్త అద్దంకి గంగాధరకవి మొదలైనవారు ప్రశస్త సారస్వత నిర్మాణము గావించియుండిరి. క్రమక్రమముగా ఆసఫ్జాహీలకు ఆంధ్రదేశము ఆధీనమైనది. ఇంతలోనే ఇంగ్లీషువారు తమ సామ్రాజ్యమును విస్తరింపసాగిరి. తత్ఫలితముగా కుతుబ్షాహీల కాలములో ఏకఖండముగా నుండిన తెలుగుసీమ రెండు ప్రాంతాలుగా విడిపోయి, తెలంగాణ ప్రాంతము ఇటీవల వరకు ఆసఫ్జాహీ వంశీయుల పరిపాలనలో నుండుట జరిగినది (1957 వరకు).

ఈ పరిపాలనలో యీ ప్రాంతమున ఆంధ్ర సారస్వతాభివృద్ధి కుంటుపడినదను సత్యము సుప్రసిద్ధమైనది. పరిపాలకులకు ప్రజల భాషమీద ఆదరము లేకుండెను. వారు అభిమానించిన ఉర్దూ, అరబ్బీ, పారసీల క్రింద తీయనితెలుగు నలిగిపోయినది. ఈ పరిస్థితుల్లో మినుకుమినుకుమని తెలుగు భాషా దీపములు వెలుగుచుండిన ప్రమిదలలో చమురుపోసి వానిని ఆరిపోకుండ కాపాడిన గౌరవము వనపర్తి, గద్వాల, ఆత్మకూరు మొదలైన సంస్థానాలకు జెందుచున్నది. కవులను, పండితులను పోషించి యీ సంస్థానాలు గడచిన రెండు శతాబ్దాలలో తెలంగాణమున ఆంధ్రభాషా పోషణకు చేసిన సహాయము అమూల్యమైనది. ఆధునికాంధ్ర కవులకు గురుపీఠమైన తిరుపతి వేంకటకవులు యీ సంస్థానాలను సందర్శించి, గౌరవాదరాలను పొందియుండిరి. తెలంగాణమందలి సంస్థానాలు ఆంధ్రభాషకు, ఆంధ్ర సంస్కృతికి గావించిన దోహదము ఒక ప్రత్యేక గంథానికి ఆధార సామాగ్రి కాగలిగినదిగా నున్నది. ఈ సందర్భమున ఆధునిక చరిత్ర పరిశోధకులలో అగ్రగణ్యులైన మానవల్లి రామకృష్ణ కవిగారు చిరకాలము వనపర్తిలో ఆస్థాన విద్వాంసులుగా నుండి, ఆ కాలమున అనేక గ్రంథాలను ప్రకటించి, అపారమైన పరిశోధన గావించిన సత్యము ప్రత్యేక స్మరణీయమై యున్నది.

ఆంధ్ర శారదకు అరణ్య, అజ్ఞాతవాసాలు

మొత్తముమీద గడచిన రెండు శతాబ్దాలలో తెలంగాణములో ఆంధ్ర శారదకు అరణ్యవాస, అజ్ఞాతవాసములు అనివార్యముగా సంప్రాప్తమైనవి. ఇరువదియవ శతాబ్దపు తొలిదశలో హైదరాబాదు రాష్ట్ర ప్రజల విమోచనోద్యమము చట్టబద్ధమైన పద్ధతిలో ప్రారంభమైనది. ఇరుగుపొరుగు రాష్ట్రాలనుంచి స్వాతంత్ర్యోద్యమ వాయువులు మెల్లమెల్లగా హైదరాబాదులో కూడ ప్రవేశించి వీచుట ప్రారంభించినవి. గ్రంథాలయోద్యమముగా ప్రారంభమై, ఆంధ్రోద్యమముగా అభివృద్ధి జెంది, రాజకీయ స్వాతంత్ర్యోద్యమముగా పరిణమించి, హైదరాబాదు రాష్త్రములో జాతీయోద్యమముగా వర్ధిల్లినది. ఈ ఉద్యమ ప్రభావం సారస్వత రంగంమీద సహజముగా పడినది. పైన పేర్కొనిన దశలలో కాలానుగుణముగా సారస్వత చైతన్యము వ్యాప్తిజెంది కొంతకాలము నిద్రాణమైన తెలంగాణమును తిరిగి మేలుకొలిపినది. ఈ పరిస్థితులలో హైదరాబాదు రాష్ట్ర క్షేత్రమున ఆధునికాంధ్ర వాఙ్మయ వికాసానికి అంకురార్పణ గావించిన గౌరవము కొమర్రాజు వేంకట లక్ష్మణరావుగారికి చెందుచున్నది. మహారాష్ట్ర దేశమున విద్యాభ్యాసము గావించి, మహారాష్ట్ర భాషలో ప్రావీణ్యము గడించి, అక్కడి వాఙ్మయ కృషిని చక్కగ అవగాహన గావించుకొనిన ఆంగ్ల విద్యా విభూషితులు, సంస్కృతాంధ్ర పండితులు లక్ష్మణరావుగారు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర పరిస్థితులను గమనించి ఆయన వాఙ్మయ వికాసానికి మూడు ముఖ్యమైన మార్గాలను సూచించినారు. ఇందులో మొదటిది గ్రంథాలయోద్యమము; క్రీ. శ. 1900 సంవత్సరమున లక్ష్మణరావుగారు హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయమును స్థాపించిరి. తరువాత తెలంగాణములో అనేక గ్రంథాలయాలు స్థాపితమై, ఒక్కమారు సారస్వత రంగములో అమోఘమైన జాగృతిని కలిగించి, అనేక రచయితలను ప్రోత్సహించినవి. రెండవది విజ్ఞాన చంద్రికా మండలి స్థాపన. హైదరాబాదు నగరములోనే తమకు అత్యంత అభిమానాస్పదమైన చరిత్ర పరిశోధన, విజ్ఞాన గ్రంథ రచనలను ఆశయములుగా కలిగిన విజ్ఞానచంద్రికా గ్రంథమండలిని లక్ష్మణరావుగారు స్థాపించిరి. విజ్ఞాన చంద్రికా మండలి చూపిన మార్గము ననుసరించి తెలంగాణములో మరికొన్ని గ్రంథమండలులు స్థాపితమైనవి. మూడవది చరిత్ర పరిశోధన. తమ జీవిత కాలములోనే హైదరాబాదు నగరమున లక్ష్మణరావుగారు స్థాపించిన పరిశోధక మండలి తరువాత లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మారి శాసనాలను, చరిత్ర సామగ్రిని సేకరించి, రెండు మూడు సంపుటాలను ప్రకటించి అమూల్యమైన కృషి గావించినది.

తెలుగు సరస్వతికి సేవజేసిన ధన్యులు

ఈ వాతావరణములో ఆంధ్ర భాషా సేవకు కంకణము గట్టుకొని, తమ రచనలతో తెలుగు సరస్వతిని అలంకరించిన మహాశయులలో మాడపాటి హనుమంతరావుగారిని, ఆదిరాజు వీరభద్రరావుగారిని ప్రత్యేకముగా పేర్కొనవలసియున్నది. ఈ ఉభయుల రచనలమీద లక్ష్మణరావుగారి ఆశయాలైన చరిత్ర పరిశోధన, విజ్ఞాన వాఙ్మయముల ప్రభావము స్పష్టముగా కనుపించుచున్నది. విశేషించి, ప్రేమ్‌చంద్‌ కథానికలను తెలుగులోనికి మొట్టమొదటిసారి అనువదించిన గౌరవము మాడపాటి హనుమంతరావుగారికి లభించుచున్నది. ఈ పరిస్థితులలో మూడు పత్రికలు ఆవిర్భవించి తెలంగాణములోని రచయితలను ప్రోత్సహించినవి. నల్లగొండ నుండి నీలగిరి అను వారపత్రిక, ఓరుగల్లు జిల్లా ఇనుగుర్తి గ్రామము నుండి తెనుగు వారపత్రిక, హైదరాబాదు నగరమునుండి స్వర్గీయ సురవరము ప్రతాపరెడ్డిగారి సంపాదకత్వమున గోలకొండ అర్ధవారపత్రిక హైదరాబాదు రాష్ట్రములోని రచయితల రచనలను ప్రకటించి, కవులకు, పండితులకు, పరిశోధకులకు, విజ్ఞానులకు, రచయితలకు అపారమైన ప్రోత్సాహము నిచ్చి, ప్రజలలో అమోఘమైన సారస్వత ప్రబోధము గావించినవి. తరువాత క్రమక్రమముగా యువకు లనేకులు సారస్వత రంగములో ప్రవేశించి, మరికొన్ని పత్రికలను స్థాపించి కొంతకాలము నిర్వహించిరి. వీనిలో సుజాత, తెలుగుతల్లి, ఆంధ్రకేసరి, ఆంధ్రాభ్యుదయము, పూలతోట, విభూతి, కిన్నెర, భాగ్యనగర్‌, దేశబంధు, శోభ మొదలైన మాస పత్రికలు; ఆంధ్రవాణి, సారథి మొదలైన వారపత్రికలును; తెలంగాణ దినపత్రికయు ప్రత్యేకముగా పేర్కొనదగి యున్నవి. ఈ పత్రికల సంపుటాలను పరిశీలించినచో కథకులకు, కవులకు, వ్యాసకర్తలకు, విమర్శకులకు, పరిశోధకులకు, నాటికా రచయితలకు ప్రోత్సాహము నిచ్చి భాషా వికాసమునకు తోడ్పడినట్లు వెల్లడికాగలదు. క్రమక్రమముగా కొన్ని సారస్వత సంస్థలు స్థాపితమై పనిజేయసాగినవి. ఆంధ్ర సారస్వత పరిషత్తు, విజ్ఞానవర్ధని పరిషత్తు, ఆంధ్ర చంద్రికా గ్రంథమాల, రచయితల సంఘము, సాధన సమితి, వైతాళిక సమితి శతాబ్దపు మొదటి అర్ధభాగములో స్థాపితమై సమావేశాలను జరిపి, గ్రంథాలను ప్రకటించి ఈ ప్రశంసనీయమైన భాషాసేవ గావించినవి. ఈ అర్ధ శతాబ్దపు వాఙ్మయమును ఒక్కమారు పరిశీలించినచో, తెలంగాణములో నవ్యసారస్వత వికాసము నాలుగు విధాలుగా జరిగినట్లు విశదము కాగలదు. మొదటిది చరిత్ర పరిశోధన, రెండవది విజ్ఞాన వాఙ్మయ నిర్మాణము, మూడవది కథానికా రచన, నాలుగవది ప్రభుత్వమునకు, ప్రజలకు మధ్య జరిగిన సంఘర్షణ ఫలితమైన కవితా రచన. అందులోనే ఆంధ్రోద్యమ కవిత్వమును గూడ చేర్చవచ్చును. హైదరాబాదులో పోలీసు చర్య జరిగి బాధ్యతాయుత పరిపాలన స్థాపితమై జాతీయ కవులు అఖండాంధ్ర ఆశయముచే ప్రబోధితులైనారు. తెలంగాణములోని రచయితలు వివిధ వాఙ్మయ వీథులలో విశేషించి కథానిక, కవిత, వ్యాసరంగాలలో సకలాంధ్ర రచయితలతో సమానముగా ముందంజ వేసి ఆంధ్ర సరస్వతిని ఆరాధించినారు.

అత్యుత్తమ రచనలు

ఈ శతాబ్దపు మొదటి అర్ధభాగములో ప్రకటితమైన కొన్ని గ్రంథాలను ప్రత్యేకముగా ప్రశంసించవలసి యున్నది. తెలంగాణ కవుల రచనలను యేరి కూర్చి ప్రకటించిన కావ్య సంపుటము గోలకొండ కవుల సంచిక. ఈ ప్రాంతములోని సాహిత్యమును సకలాంధ్రమునకు పరిచయము గావించు ఉద్దేశ్యముతో సురవరము ప్రతాపరెడ్డిగారు కవుల రచనలను వారి జీవిత వివరాలతోపాటు సేకరించి ప్రకటించిన కావ్య సంపుటము గోలకొండ కవుల సంచిక. ఆంధ్ర భాషలో వివిధ రచయితల ఖండ కావ్యములను ప్రకటించుటకు చేసిన ప్రథమ ప్రయత్నము ఈ సంపుటమే కావచ్చును. తెలంగాణ ప్రాంతమున ప్రకటితమైన ఉద్గ్రంథాలలో ప్రత్యేకముగా పేర్కొనదగిన మరొక పుస్తకము ఆంధ్రుల సాంఘిక చరిత్ర. అపార పరిశోధనా ఫలితమై, యీ మార్గమున తెలుగులో ప్రప్రథమ ప్రచురణమైన యీ చరిత్ర కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరము యిచ్చు అయిదువేల రూపాయల బహుమతిని ఆంధ్రభాషలో పొందిన మొట్టమొదటి గ్రంథమై యున్నది. నిండు కావ్యములు, ఖండ కావ్యములు, గేయములు, కథానికలు, ఏకాంకికలు, నవలలు, చరిత్ర గ్రంథములు, సారస్వత విమర్శలు అనేకము తెలంగాణమున ప్రకటిత మైనవి. ఇందులో అత్యుత్తమ శ్రేణికి జెందిన సారస్వతము గూడ పుష్కలముగా నున్నది. ఉర్దూ, ఆంగ్ల భాషల ప్రభావము, దేశములో వ్యాప్తి జెందిన వివిధ ఉద్యమాల ప్రభావము యీ వాఙ్మయములో గోచరించు చున్నది.

సమగ్రాంధ్ర దృక్పథముతో సారస్వత కృషి

ఆంధ్ర భాషకు, ఆంధ్ర సరస్వతికి కృత్రిమమైన సరిహద్దులను, పొలిమేరలను కల్పించుటకు వీలిలేదు. అట్టి ప్రయత్నాలు విఫల మైనవి; ఆంధ్రప్రదేశ్‌ యేర్పాటయిన తరువాత సమగ్రాంధ్ర దృక్పథముతో సారస్వత కృషి సమైక్యముగా జరుగుచున్నది. కృష్ణా గోదావరీ నదులు ఆంధ్రమహాజనులందరికి సమిష్టి స్వత్వములైనట్లుగానే, నన్నయ, తిక్కన, పోతనాది పూర్వ మహాకవులతోపాటు ఆధునిక మహా రచయితలు వారు ఏ ప్రాంతమున నివసించినప్పటికిని, ఆంధ్రజాతికంతకు సమానముగా ఆదర్శనీయులైయున్నారు. తెలంగాణము, రాయలసీమ, సర్కారు జిల్లాలలో జరిగిన, జరుగుతున్న కృషిని ఆంధ్ర రచయితలు సమిష్టిగా సమీక్షించుకొని ముందడుగు వేయవలసి యున్నది.

AndhraBharati AMdhra bhArati - aaMdhra saahityamu - telaMgaaNamu - telaMgANalO jAtIyOdyamAlu - DA\.. dEvulapalli rAmAnujarAvu - telugu vachana sAhityamu - vyAsamulu ( telugu andhra )