భాష ఛందస్సు ఛందోదర్పణము
తృతీయాశ్వాసము

ఛందోదర్పణము - అనంతామాత్యుఁడు - తృతీయాశ్వాసము

క. శ్రీమదనంతశయన భవ
భీమదహన నిఖిలహరణభీషణవర్షా
సామజభీతి నివారణ
కామజనక శిష్టలోకకామితవరదా.
1
కందములు
క. నలగగభజసలు కందం
బుల మూఁడును నైదు షష్ఠముల నలజలు బే
సుల జగణరహిత మంత్యగ
మలఘుపదత్రిగణవిరతి యర్థముల హరీ!
2
ఆర్య
గీ. కంద మరయ నార్యాగీతికడగణంబు
నపరషష్ఠంబు గురులఘు లైననార్య
నలఘు లాఱింట గిరిశరస్థలుల నున్న
నగు ద్వితీయ ప్రధానలఘ్వాదియతులు.
3
క. వడియగు నార్యకు రెండవ
యడుగునఁ ద్రిగణంబుమీఁదఁ నంధ్రకవితకు\న్‌
గడపటిపాదమునకు వడి
యడరును ద్విగణయుతలఘువు కవ్వలిచోటన్‌.
4
ఆ. సరవిఁ బథ్య విపుల చపలార్య ముఖ జఘ
నాఖ్యచపల లనఁగ నార్య లైదు
నొనర గీతి యనఁగ నుపగీతి యుద్గీతి
యార్యపేరిగీతి యనఁగ నాల్గు.
5
పథ్యార్య
క. బేసులు త్రిగణయుతములై
యాసమపాదములఁ బొరసి యార్య యనఁ గడు\న్‌
భాసిల్లుఁ బథ్య యనఁగా
వాసవముఖ సకల దివిజ వర్గ ప్రణుతా!
6
విపులార్య
క. ప్రకట సమపాదముల నిలు
వక శబ్దమునవలఁ జొచ్చి వచ్చె ననం ద
క్కక విపులార్య యగును సే
వకజనమందార ధీర వనజదళాక్షా!
7
చపలార్య
క. వరుసను ద్వితీయ మంత్యము
స్ఫురణ న్మద్యగజకారములను దగ\న్‌ రెం
డరయఁగ దనర్చు నేని\న్‌
సరవి నదియ హరి మురారి చపలార్య యగున్‌.
8
ముఖచపలార్య
క. చపలాగణప్రకారం
బపారకారుణ్యసాగరా ప్రథమార్థం
బపరం బగుచున్నది ముఖ
చపలార్య యనంగఁ జనును జక్కఁగ గృతులన్‌.
9
జఘనచపలార్య
క. మొదలిసగము చపలార్య
స్పదగణలక్షణము సొరక చరమార్థం బం
దుదితప్రకార రేఖ\న్‌
గదాధరా చనుఁ గృతుల జఘనచపలార్యన్‌.
10
గీతి
క. లసదార్య మొదలిసగమున
నెసగఁగ రెండరలుఁ జెప్పిరే నదియే గీ
తి సమాహ్వమ మగుఁ గృతుల\న్‌
వసుథాధం కృష్ణ యాదవస్వామి యనన్‌.
11
ఉపగీతి
క. ధర నార్యమీఁదిసగమున
నిరుసగమున నట్ల చెప్పి రేని యదియ దాఁ
బరఁగు నుపగీతి యనఁగా
సరసిజదళనేత్ర కృష్ణశార్ఙ్గధర హరీ!
12
ఉద్గీతి
క. విదితార్యచరమదళమున్‌
మొదలి సగము చేసి యందు మొదలింటిసగం
బది యపరార్థముఁ జేసినఁ
బొదు వగు నుద్గీతి భుజగభుగ్వరగమనా!
13
ఆర్యాగీతి
క. కందములకుఁ గలనియమము
లం దేమియుఁ గడమ వడక యడరిన నది యిం
పొందఁగ నార్యాగీతి య
నం దగు ని ట్లురగభూషణ ప్రణుత గుణా!
14
సమ విషమ గీతులు
క. అమర మఱిగీతులందు వి
షమగీతులు మూఁడు రెండు సమగీతులు నై
సమము లగు నపకలిప్రా
సముల యతుల విషమములఁ బొసఁగు బ్రావళ్లున్‌.
15
ఎత్తుగీతి. ఆదిప్రాసంబు హరియు
నాదిత్యయుగము నగుచు
నీదెసయతుల నెత్తు
గీదియ నెగడుఁ గృష్ణ.
16
పవడగీతి. పవడగీతియందుఁ బ్రాసంబు నిలిచి మూఁ
డవగణంబుమీఁద నమరు విరతి
రవులు మువ్వురును బురందరు లిద్దఱు
నవుల నేగు రినులు నర్ధములకు.
17
మేలనగీతి. నగణమొండె హగణమొండె నగణహగణయుగము
తగిలియుండె సప్తసంఖ్య తత్పదంబు లమరఁ
దగుఁ జతుర్థగణముపై నుదాత్తవిశ్రమంబు
నిగుడుమేలనాఖ్య గీతి నెరయుఁ బ్రాస మొదవి.
18
సమ గీతులు
ఆ. ఇనులు ముగురు పాడ నిద్ద ఱింద్రులు మృదం
గములు దాల్ప వంశకాహళాదు
లేగురర్కు లూఁద నిరుమేళగతి నాట
వెలఁది యొప్పుచుండు విష్ణుసభల.
19
తే. ఒక్కఁ డర్కుఁ డిద్దఱుజిష్ణు లొనర మఱియు
నిద్ద ఱర్కు లీచొప్పున నేగురేసి
నాల్గువంకలఁ గదిసి వర్ణన మొనర్పఁ
తేటగీతి విష్ణునివేర్మిఁ దేటపఱుచు.
20
క. పెనఁగి గణత్రియతములై
నొనరఁగ వడియొండెఁ బ్రాసమొండెను నిలుప\న్‌
జను నాటవెలఁది యందును
ననువొందిన తేటగీతి యందు ముకుందా!
21
సీసంబులు
క. నలనగసలభరతలలో
పల నాఱును మీఁద రెండుఁ బద్మాప్తగణం
బులఁ దగి నాలుగుపదములఁ
జెలు వగు నొకగీతితోడ సీసము కృష్ణా!
22
క. సీసము రెండుగణంబులఁ
బ్రాసం బేనియును మఱి విరామంబైన\న్‌
భాసిల్లుఁ బృథివిమీఁద\న్‌
జేసిన నియమములఁ బ్రాససీసాదులజా!
23
సీ. వృత్తంబులకుఁబోలె వెలయు నాల్గడుగునఁ - బ్రాసముల్నిల్పి విరతులు నునుపఁ
బ్రాససీసము లగుఁ బశ్చిమార్ధములట్ల - భాసిల్ల నక్కిలి ప్రాససీస
మగు మున్నుగైకొన్న యతిపాదమందెల్ల - నడరిన వడిసీన మనుఁగఁ బరఁగు
నర్ధమర్ధమునకు యతులు వేఱై చనఁ - జెప్ప నక్కిలివడి సీసమయ్యె.
 
గీ. నవకలికి నిట్లు ప్రాసంబు లవతరిల్లు
యతులు ప్రాసంబు లిష్టసంగతుల నడవ
నదియ సమసీస ముత్సాహ తుదనుగీతి
పరఁగ విషమసీసం బగుఁ బద్మనాభ!
24
గీ. అగు సమప్రాససీస మాఱడుగులందు
నాలుగింట వృత్తప్రాసనామసీస
మన్ని చోటులఁ బ్రాసంబు నందెనేని
సర్వతః ప్రాససీసంబు జలజనాభ!
25
సమ సీసము. ఇందులు తమలోన నిద్దఱిద్దఱుఁ గూడి - యతులకు నాధార మై తనర్చి
మూఁడుచోటుల నుండ మొగి నిద్ద ఱర్కులు - గదియ నాక్రియ నొక్క పదము మెఱయ
నిటువంటి పదము లింపెసఁగంగ నాల్గింట - సమధర్మగతి నతిశయము నొండు
నట్టిధర్మమునకు నాస్పదంబై పేర్చి - యాతతచ్ఛందోవిభాతిఁ దనరి
 
ఆ. ఆట వెలఁది యొండెఁ దేటగీతియు నొండె
విమలభావ మమర విష్ణుదేవుఁ
డొప్పు ననుచుఁ బొసఁగఁ జెప్పిన సీసంబు
పసిఁడి యగు ధరిత్రిఁ బద్మనాభ!
26
ప్రాస సీసము. భామినిచే నున్న పట్టుతోరముఁ జూచి - ప్రల్లదంబునఁ ద్రెంచి పాఱవైచి
యామునిద్రోహ మత్యంత మై తనుఁ బట్టి - యతిదరిద్రునిఁ జేయ నార్తి నొంది
భూమి వెల్వడి పోయి పురపురఁ బొక్కుచుఁ - బుండరీకాక్ష యోభువనవంద్య
స్వామి నాయపరాధశతసహస్రంబులు - సైరింపవే కృపాజలధి యనుచు
 
గీ. ప్రేముడించు కౌండిన్యునిభీతిఁ బాపి
పృథులసౌఖ్యంబు లొసఁగి గాంభీర్యమమరఁ
బాముపైఁ బవ్వళించిన ప్రభుఁడ వనినఁ
బ్రాససీసంబు విలసిల్లుఁ బద్మనాభ!
27
వృత్తప్రాససీసము. శ్రీశ్రితవక్షుండు సింధురవరదుండు - చింతిత ఫలదానశీలుఁ డితఁడు
ఆశ్రితావనలోలుఁ డాభీరకాంతాకు - చాగ్రకుంకుమభూషితాంగుఁ డితఁడు
ఆశ్రాంతజయధాముఁ డాశాంతవిశ్రాంత - యశుఁడు ధరాధరశ్యాముఁ డితఁడు
విశ్రుతవిభవుండు విపులబలాఢ్యుండు - వికసితవదనారవిందు డితఁడు
 
గీ. అనుచు మునులును దివిజులు నభినుతింపఁ
జూపు చెవులపాన్పున వెన్ను మోపియుండు
నంబుజోదరుఁ డంచు ని ట్లాంధ్రకృతులఁ
జెప్పిరేని వృత్తప్రాససీస మగును.
28
సర్వతఃప్రాససీసము. నీరదవర్ణుండు నీరేరుహాక్షుండు - నీరధిబంధనోదారబలుండు
కారుణ్యరసరాశి గౌరీరసజ్ఞా వి - హారిశోభితనామగౌరవుండు
ధీరుండు త్రిభువనాధారుండు దశరథ - క్ష్మారమణేంద్రకుమారవరుఁడు
మారీచదమనుండు నారాచవిద్యావి - శారదుం డసురవిదారణుండు
 
గీ. ధారుణీసుత నయనచకోరసరసి
జారి యన సర్వతఃప్రాసచారుసీస
మారయఁగ సత్కవిజనవిస్ఫారనుతులఁ
దేరు శ్రీపద్మనాభ శృంగారసార!
29
అక్కిలిప్రాస సీసము. ఉరగతల్పుని గాని యుల్లంబులలో నిల్ప - శరధితల్పుని గాని సన్నుతింప
మురసంహరుని గాని మ్రొక్కులఁ గయిసేయ - నరమృగేంద్రులఁ గాని నమ్మికొలువ
గరుడవాహను పేరుఁగాని వీనులఁ జొన్ప - బురుషోత్తముని గాని పూజసేయ
హరిప్రసాదముఁ గాని యర్థిమైఁ గొననొల్లఁ - బరమాత్ముపనిఁగాని భక్తిఁ బూన
 
గీ. ధరని నవినాదు నిత్యవర్తనము లనుచుఁ
బరఁగు వ్రతిఁగాని నీవు చేపట్టవనిన
జరుగు నక్కిలిప్రాస సీసంబు కృతులఁ
బరభృతాతసిపుష్పాభ పద్మనాభ!
30
వడిసీసము. కరుణాసముద్రుండు గజరాజవరదుండు - గర్వితాసురశిరఃఖండనుండు
విహగేంద్రవాహుండు విబుధేంద్రవంద్యుండు - విశ్వరక్షాచణవీక్షణుండు
రతిరాజజనకుండు రఘువంశతిలకుండు - రణబలోదగ్రుండు రమ్యగుణుఁడు
గోకులాధీశుండు గోపికారమణుండు - గోవిందుఁ డురుకళాకోవిదుండు
 
గీ. అనుచు వడిసీసముల నిన్ను నభినుతింతు
రఖిల విద్యావిశారదు లైన మునులు
పన్నగాధీశతల్ప నాపాలివేల్ప
భక్తజనకామ్యలాభ శ్రీపద్మనాభ!
31
అక్కిలివడిసీసము. పద్మాక్షి యీతఁడే బలి రసాతల మేలు - మని పంపనేర్చిన యధికబలుడు
హరిణాక్షి యీతఁడే యలవిభీషణు లంకఁ - బట్టంబు గట్టిన బల్లిదుండు
తొయ్యలి యీతఁడే ధ్రువుని నున్నతపదం - బునఁ ప్రతిష్ఠించిన భూరియశుఁడు
ధవళాక్షి యీతఁడే ధనువు ద్రుంచినయట్టి - రఘువంశ తిలకుండు రాఘవుండు
 
గీ. బాణ బాహావిఖండన ప్రముఖుఁ డితడు
నీలగళసుప్తికరబాణనిపుణుఁ డితడు
ననుచు నక్కిలివడిసీస మమర వేల్పుఁ
బడఁతు లభినుతింతురు నిన్నుఁ బద్మనాభ!
32
అవకలిప్రాస సీసము. వరదుఁ డుద్యద్గుణాకరుఁడు వియన్నదీ - పాదుఁడు భక్తప్రమోదకరుఁడు
సింధుబంధనుఁ డబ్జబంధు తారాధీశ - నేత్రుఁడు కాశ్యపగోత్రజుండు
సుగ్రీవ విభుఁడు దశగ్రీవదమనుండు - లలితకంబుగ్రీవవిలసితుండు
పూతనాజీవితనూతనస్తన్యపా - నాభిలోలుఁడు నిత్యశోభనుండు
 
ఆ. భువనవంద్యుఁ డనుచు నవకలిప్రాససీ
సముల నిన్నుఁ బొగడు నమరసమితి
శరణభరణనిపుణ వరయోగవిమల హృ
త్పద్మసద్మదేవ పద్మనాభ!
33
విషమసీసము
ఉత్సాహ. సాహచర్య మమర సప్త సవితృవర్గమును సము
త్సాహ మెక్క నొక్కగురుఁడు చరణములు భజింపఁగా
నీహితప్రదానలీల లెసగుకమఠమూర్తి ను
త్సాహరీతు లుల్లసిల్ల సంస్తుతింతు రచ్యుతు\న్‌.
34
ఆ. ప్రాసములును వడులు భాసురంబుగ నిట్లు
విలసితముగ నాటవెలఁదియందు
నుత్సుకత నొనర్చి యుత్సాహ మది నిల్ప
విషమసీస మమరు విషధిశయన!
35
క. ద్వాదశపదమగు మఱి య
ష్టాదశపాదమగు గీతి సహితంబుగఁ దా
నేదియగు సీసమాలిక
శ్రీదయితా నిలుపవలయు సీసపునియతిన్‌.
36
క. సర్వలఘుసీసమునకు స
ఖర్వాంఘ్రులనడుమ నింద్రగణములు మాఱై
యార్వంచల లఘుగణంబులు
నుర్వీధర త్రిలఘుయుగము నొకగీతితుదన్‌.
37
సర్వలఘుసీసము. మృగమదము తిలకమును నగు మొగముచెలువమును - నలఁతిపవడముఁ దెగడు నధరపుటము
వలుదజఘనములు బొలుపలరుకనకపువలువ - కలితకరచరణమణికటకములును
విరులతురుమును నమిలిపురిసొబగుగుమకరికము - రచన నెసఁగిన చెవుల రవణములును
కరకమలయుగళ ధృతి మురళియును ద్రివిధమగు - నిలుకడయు నిటలతటి నెఱయు కురులు
 
గీ. తెల్లదమ్మిరేకులభంగి నుల్లసిల్లు
వెడఁదకన్నులు గలగోపవేషశౌరి
నాశ్రయించెద ననుచు ని ట్లమరఁ జెప్ప
సర్వలఘుసీస మగు నండ్రు జలజనాభ!
38
తరువోజ. ముగురు జిష్ణులు త్రయీమూర్తియు మఱియు - ముగురు జిష్ణులు త్రయీమూర్తియుఁ గూడి
యొగి నుండ గరయతి నొక్కొక్క చరణ - ముడుగక సేవింప నుజ్జ్వలం బగుచుఁ
దగ నుల్లసిల్లు పాదములు నాల్గింటఁ - దనరు వరాహావతారోదయునకు
నిగురొత్తు భావంబు లెసఁగఁ దర్వోజ - నీయోజ నొనరింతు రెల్ల సత్కవులు.
39
మహాక్కర. ఆదివార మాదిగ ననుక్రమమున - నన్నివాసరముల నొక్కినుండు
నాదితేయాధినాథు లేగురు నల - రారంగ నొక్కసుధాకరుండు
నాది హరిఁ గొల్వ రెండును నాలుగు - నగు వాసరంబున నర్కుఁడైన
నాదరంబున నెడసొచ్చునని మ - హాక్కరం బలుకుదు రార్యు లెల్ల.
40
మధ్యాక్కరము. ఓజతో నిద్దఱింద్రులును నొక్కయాదిత్యుండు మఱియు
రాజితంబుగ నిద్ద ఱమర రాజులు నొక్కసూర్యుండు
పూజింతు రత్యంతభక్తిఁ బుండరీకాక్షు ననంతు
భ్రాజిల్లు బుధులు మధ్యాక్కరంబు నొప్పారఁ బల్కుదురు.
41
మధురాక్కరము. రవియు నింద్రులు మువ్వురు రాజొకండును గలిసి
రవిసుధాకరలోచను రాజితాననసరోజు
రవికులేశుఁ గొలుతు రని ప్రస్తుతింతురు ధరిత్రి
నవిరళం బగుమధురాక్కరాఖ్యచే సత్కవులు.
42
అంతరాక్కరము. ఇనుఁ డొకండును నింద్రు లిద్దఱును నొక్క
వనజవైరియుఁ గూడి వైభవ మొనర్ప
గనకవస్త్రుని గృత్తకైటభుని గొల్తు
రనుచుఁ జెప్పుదు రంతరాక్కర బుధులు.
43
అల్పాక్కర. ఒగి నిద్దఱింద్రులు నొకవిధుండు
జగతీధరుని పదాబ్జములు గొల్తు
రగణితభక్తి నంచభినుతింప
నెగడు నల్పాక్కర నియతితోడ.
44
క. విరతి చతుర్గణము మహా
క్కర కేకోనాక్షరత్రిగణ మంతరకు\న్‌
వరగణయుగయతి నల్పా
క్కర మధ్యయు మధురయుంద్రిగణయతుల హరీ!
45
షట్పదము. మెఱియంగ నిద్దఱి
ద్దఱు సురేంద్రులుమూఁడు
తెఱెఁగుల\న్‌ శశిఁగూడ నర్థంబుల\న్‌
నెఱిఁ గ్రాలఁగా వళ్ళు
దొఱఁగ షట్పదరీతి
వఱలుఁ జక్రిపదాబ్జవర్ణనంబు.
46
త్రిపద. సరవిఁ బ్రాసమునొంది సురపతుల్‌ నలువురు
హరియు గై కార్కులు కలియ
జరగు నిప్పగిది యై త్రిపద.
47
ద్విపద. ఇంద్రులు మువ్వురు నినుఁ డొక్కరుండు
సాంద్రమై యొక్కొక్కచరణంబుఁ గొలువ
నలరుఁ బద్మోదరుఁ డంచు ధీరోత్త
ములు విస్తరింతురు ముదముతో ద్విపద.
48
మంజరీ ద్విపద. శ్రీమందిరాకారు జితదైత్యధీరుఁ
గీర్తించుచోఁ బుణ్యవర్తనుం డనుచు
యతిమాఱుప్రాస మి ట్లచ్చోట నిడక
సరసిజనాభాయ సముదగ్రసాహ
సాయ నమోయంచు శబ్దమొక్కటియు
రెండుపాదముల నీక్రియఁ బంచియిడక
వెలయు ప్రాసములేని ద్విపద యై పరఁగఁ
బూజింపవలయును వాక్పుష్పమంజరుల.
49
చౌపద. కలసి చతుర్లఘుగణములయందు
నలిఁ ద్రిగణం బై నగణము వొందు
నలరుగణద్వయ యతిగోవిందుఁ
బలుకఁ గృతులఁ జౌపద చెలువందు.
50
వితాళ(చౌపద)ము. అర్కనామగణ మనువుగ రెండు
దార్కొని లఘువొందఁగ నిట్టుండుఁ
దర్కింపఁగను వితాళము నండు
పేర్కొనఁ దగు హరిబిరుదులపిండు.
51
రగడలు.
క. ఆద్యంత ప్రాసంబులు
హృద్యంబుగ రెంట రెంట నిడి పాదము లు
ద్యద్యతులఁ గూర్పఁ దగు నన
వద్యంబగు రగడలందు వారిజనాభా!
52
హయప్రచార రగడ. హనచతుష్టయంబు ఋతుల
జనితయతుల జరగుఁ గృతులఁ
జను హయప్రచార రగడ
వినుతశాస్త్రవిధులు వొగడ.
53
తురగవల్గన రగడ. శ్రీసతీశుఁ బరమపురుషుఁ జిత్తమున దలంచువారు
వాసవాదినిఖిల దివిజవంద్యు నాశ్రయించువారు
నిట జనింప రనఁగ నన్వయించుఁ దురగవల్గనంబు
పటుదినేశలఘువిరామ భానుమద్గణాష్టకంబు.
54
విజయమంగళ రగడ. శ్రీధరాయ శిష్టజననిషేవితాయ భక్తలోక
    జీవితాయ గర్వితోరుసింధురాజబంధనాయ
గాధిపుత్రయజ్ఞ విఘ్నకరమహాసురీమహోగ్ర
    కాయ శైలదళన నిపుణ ఘన సురాధిపాయుధాయ
కేశవాయ తే నమోఽస్తు కృష్ణ పాహిపాహి యనుఁచు
    గేలుమొగచి మౌళినునిచి కృష్ణుఁ బలికెననుచునిట్లు
దేశభాషణములఁ జెప్ప ద్విగుణతురగవల్గనమునఁ
    దేరు విజయమంగళంబు తీయచెఱకు రసమునట్లు.
55
ద్విరదగతి రగడ. శ్రీయువతి నిజయువతిఁ జేసి యెంతయు మించి
కాయజునిఁ దనతనయుఁ గా నెలమిఁ బాటించి
సకల దేవతలఁ బరిజనులుగా మన్నించి
ప్రకటగతి శ్రుతుల నుతిపాఠకులఁ గావించి
హరి యొప్పు నన నొప్పు నవతార లఘువిరతి
శరది నగనలలభలసలతరల ద్విరదగతి.
56
జయభద్ర రగడ. శ్రీకి నొడయం డనఁగఁ జిత్తజునిగురుఁ డనఁగ
    శేషశయనుం డనఁగఁ జెలువుగఁ జతుర్భుజుఁడు
నాకౌకసుల నేలు నముచిసూదనువూజ
    నతఁడు దాఁగైకొన్న నందగోపాత్మజుఁడు
ఇతనిఁ గొల్చినఁ గాని యిహపరంబులు గలుగ
    వితరసేవల ననఁగ నెసఁగు నివ్విభుఁ డంచుఁ
జతురమతు లొనరింప జయభద్రరగడ లిటు
    సద్ద్విరదగతి రెంటఁ జాటింపులం బెంచు
57
మధురగతి రగడ. శ్రీవనితాధిపుఁ జేరి భజింపుఁడు
భావజ జనకుని భక్తిఁ దలంపుఁడు
అని గగనలభసలను నాల్గిటఁ గృతి
జను గజలఘువిశ్రమము మధురగతి.
58
హరిగతి రగడ. శ్రీరామాకుచకుంకుమపంకము
    చేఁ బొలుపగు విపులోరఃఫలకము
తారతుషారపటీరసమానో
    దకవాహిని యొదవిన పదకమలము
నతిశయ మై యలవడు నేదెవుని
    ననవరతోదారత నాహరిగతి
యితరుల కలవడ దని నృప లఘుయతి
    నిభనలగగభసల నగును హరిగతి.
59
వృషభగమన రగడ. శ్రీమనోహరు నంబుజోదరుఁ
    జిత్తజాతగురుం దలంచెదఁ
గామితార్థవిధాయి నిర్జిత
    కాళియాహిని నాశ్రయించెద
ననువుగా భసనల భానుస
    మన్విత ద్వితయములు నాలుగు
ననిమిషాధిపలఘుయతినిడఁగ
    నలరువృషభగమనము మేలగు.
60
హరిణగతి రగడ. శ్రీనివాసు భజింతు నే నని - పూని కుజనులపొంత బోనని
భానుయుతనలభసగగంబుల - లోననిరుదోలుననగంబుల
నిరవుగా నిరుమాఱులఘువుల - నెల్లవారును నొగి గణింపఁగ
విరతులను గావింపనిమ్ముల -హరిణగతి చెలువగు జగమ్ముల.
61
చాటుప్రబంధ లక్షణము
సీ. ఒకపద్య మైన ముక్తకము రెండును మూఁడు - ద్వికమును ద్రికమునై విస్తరిల్లుఁ
బంచరత్నము లైదు పరఁగ నెన్మిది గజా - వళికి నామావళి ద్వాదశంబు
నెన్నంగ నిరువదియేడు తారావళి - యొనయు ముప్పది రెండు నేఁబదియును
నూఱునూటెనిమిది నుతికెక్కి ద్వాత్రింశ - దభిధాన పంచాశదాఖ్యనాఁగ
 
ఆ. వెలయు శతక మనఁగ వెండి యష్టోత్తర
శతక మనఁగ నిట్లు సకలసుకవి
సమ్మతముగ నెగడు జాటు ప్రబంధము
లభిమతార్థ రచన నబ్జనాభ!
62
ఉదాహరణ లక్షణము
సీ. భాసిల్లు సప్తవిభక్తులందును మఱి - సంబోధనంబున సరవిగాఁగఁ
బ్రభునామయుతముగాఁ బద్య మొక్కటియును - దగఁజెప్పి రగడ భేదంబులందుఁ
గళికలు ప్రత్యేక దళము లెన్మిది చేసి - తత్పరార్థముల నుత్కళిక లనఁగ
నేకసమాస మై యేడుదళంబులు - తుద విభక్త్యర్థంబు దోఁపఁబలుక
 
గీ. దాని కెనగాఁగ జిక్కినదళ మమర్చి
ఫణితులొడఁగూర్చి సార్వవిభక్తికముగఁ
గట్ట కడపటిపద్య మొక్కటి రచింప
నది యుదాహరణం బగు నబ్జనాభ!
63
సీ. ప్రథమవిభక్తిఁ బరఁగు వీరావళి - మఱి ద్వితీయకుఁ గీర్తిమతి దలంప
సుభగాభిధాన మచ్చుగఁ దృతీయకుఁ జతు - ర్థికి భోగమాలిని దృఢముగాఁగ
క్షితిఁ బంచమికిఁ గళావతి కాంతిమతి షష్ఠి - కమరు నుదాత్త సప్తమికిఁ గమల
సంబోధనమునకు జయవతి యీగతిఁ - దగు విభక్త్యధి దేవతాచయంబు
 
గీ. నెలమి నయ్యైవిభక్తుల నెసఁగఁ జెప్ప
గావ్యములను సంతోషించి కరుణతోడ
నాత్మనామాభిరూపఫలాభివృద్ధి
భర్తలకుఁ గర్తలకుఁ జేయుఁ బద్మనాభ!
64
షట్ప్రత్యయంబులు
క. క్రమమునఁ బ్రస్తారము న
ష్టకము నుద్ధిష్టమును వృత్తసంఖ్యయు మఱి పెం
పమరు లగ క్రియయును న
ధ్వము లన షట్ప్రత్యయములు దనరు ముకుందా!
65
ప్రస్తారము.
క. చాలుగ సర్వగురువు లిడి
లాలితముగ గురువుక్రింద లఘువును వలప
ల్లోలి సమంబులు డాపలి
వ్రాలకు గురువులను నిలుపఁ బ్రస్తారమగున్‌.
66
నష్టలబ్ధి
క. నరు లర్థించినచోటుల
నరయఁగ లఘువులను బేసులం దొక టిడి చె
చ్చెర నర్థించిన చోట్ల\న్‌
గురువుల నిడ నష్టలబ్ధి కుంజరవరదా!
67
ఉద్దిష్టము
క. ఒక్కటి మొదిలుగ నినుమ
ళ్లెక్కినచో లఘుయుతంబు లన్నియుఁ బ్రోగై
యొక్కటి కలియఁగఁదోఁచును
గ్రక్కున నుద్దిష్ట మిక్షుకార్ముకజనకా!
68
వృత్తసంఖ్య
క. చేకొని ఛందోవర్ణము
లేకాదిద్విగుణితముగ నిడి కడలెక్కం
బ్రాకటముగ రెట్టించిన
శ్రీకరముగ వృత్త సంఖ్య శ్రీనరసింహా!
69
లగక్రియ
క. ఒకటి గలసిన ఛందపు
టక్కరముల దొంతి యిడి యుపాంతములతుది\న్‌
జక్కఁగ నొక్కొక్కటిలోఁ
గ్రక్కున నొడఁగూర్ప నగు లగక్రియ కృష్ణా!
70
క. తొలుత ప్రతి సర్వగురువగు
లలి నేకద్విత్రికాదిలఘుయుతవృత్తం
బులు పరప్రతు లగుఁ జక్రా
కలితము లౌనెలవు లగు లగక్రియఁ గృష్ణా!
71
చ. సగణలగ క్రియాంక మగు చక్రమునం దొకఁ డాదిగాఁగఁద
ద్ద్విగుణము లడ్డవీథి నొదవింపఁగ వామగృహాంక సంఖ్యతో
నొగిఁదరువాతియిండ్ల ప్రతులొందనధోఽంకముల\న్‌ సమాధికం
బగు ప్రతిమానుచుంగడకౌల ప్రతుల్‌ దొరలించినిల్పఁగాన్‌.
72
గీ. ఇందు సమమగునది తొల్తయిండ్ల వ్రాయఁ
బడిన సంఖ్యతో సమమైనఁ బ్రతికిఁ జేరు
నధిక మగునది వృత్తసంఖ్యాధికంబు
వ్రాయ రివి రెండు ప్రతులచక్రములయందు.
73
వ. సుప్రతిష్ఠకు లగక్రియాచక్రోద్ధారం బెట్టిదనిన. 74
చ. మునుగలయొండు రెండునిటమూఁడుగ మూఁడును రెండునైదునై
దును నట నాల్గుతొమ్మిదగుఁదొమ్మిదినెన్మిదియుం బదేడుగా
ననువగు పంక్తి రెండు మొదలైనవి నాల్గిట నాలుగాదిగా
నెనిమిదియుం దదాదికము లెల్లఁ బబాఱిటఁ గూడఁగా నగున్‌.
75
అధ్వప్రక్రియ.
క. తిరముగ ఛందోఽక్షరములు
నురుతరముగ వృత్తసంఖ్యయను ద్విగుణము లై
పొరి నొక్కొక్కఁడు తొలఁగఁగఁ
బరిశిష్టాంగుళము లధ్వభాగ ముపేంద్రా!
76
క. కడపటి వృత్తంబుల యిను
మడి లోపలఁ బ్రథమ వృత్తమండలిఁ దీర్ప\న్‌
వడినిష్టచ్ఛందంబులఁ
బొడమిన వృత్తముల వెఱసు పొలుపగుఁ గృష్ణా!
77
చ. ఒగిఁ బదుమూఁడు కోటులును నొప్పుగనల్వది రెండులక్షల్‌
దగఁ బదునేడు వేలు నుచితముగ నవ్వల నేడునూటిపై
నగణితవైభవా యిరువదాఱు గదా సమవృత్తభేదముల్‌
ప్రగుణితలక్షణస్ఫురణఁ బంచిన ఛందము లిర్వదాఱిటన్‌.
78
గద్యము. ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్య తనుసంభవ
సుకవిజనవిధేయ అనంతనామధేయ ప్రణీతం బైన ఛందోదర్పణంబునందు
జాతిలక్షణలక్షితంబు లగు కందంబులును, మాత్రాలక్షణయుక్తంబు లగు గీతులును
సీసంబులు నుత్సాహము దరువోజయు నక్కరయు షట్పదయుఁ ద్విపదయు మంజరియుఁ
జౌపదయు రగడలును జాటు కావ్య ప్రమాణంబులును, ఉదాహరణంబులును,
షట్ప్రత్యయంబులును, సప్తమప్రత్యయం బైన సమవృత్తముల వెఱసు తెఱంగు
నన్నది తృతీయాశ్వాసము.
 
AndhraBharati AMdhra bhArati - bhAshha - ChaMdassu - anaMtAmAtyuni ChaMdOdarpaNamu - tR^itIyAshvAsamu - anaMtAmAtyuDu - andhra telugu tenugu ( telugu andhra )