భాష ఛందస్సు ఛందోదర్పణము
చతుర్థాశ్వాసము

ఛందోదర్పణము - అనంతామాత్యుఁడు - చతుర్థాశ్వాసము

దోషాధికారము
క. శ్రీధర తనురుచివిజితప
యోధర యనవరతఘోషయోషిత్పరిపీ
తాధర తల్పీకృతవసు
ధాధర రిపుభయద ఘనగదాధర కృష్ణా!
1
క. జగమున దోషవివర్జిత
ముగఁ జెప్పఁగవలయుఁ గావ్యమ్ములు సత్కవు ల
ట్లగుట\న్‌ దశదోషమ్ములు
తగఁ జెప్పెదఁ బూర్వకవిమతంబుగఁ గృష్ణా!
2
గీ. పదియుఁ గీడుఛందోయతిభంగములు వి
సంధికము పునరుక్తి సంశయ మపక్ర
మంబు వ్యర్థ మపార్థము మఱి విరూపి
తాపశబ్దవిరోధంబు లనఁగ గృష్ణ!
3
దశదోషములు
1. ఛందోభంగము
క. ఛందోభంగం బగు గురు
వొందెడునెడ లఘువుగాఁ బ్రయోగించుట గో
వింద యనిపలుకుచోట ము
కుంద యనుచుఁ బలుక నిట్లు కుంజరవరదా!
4
2. యతి భంగము
ఆ. విమల కమలనేత్ర విశ్వలోకస్తోత్ర
విమలదైత్యకులవినాశ యనుచు
వలయుచోట లేక వడి యొండుచోనుండఁ
బలికిరేని నియతిభంగ మండ్రు.
5
3. విసంధికము
ఆ. అమృత ఉదధిశయన అమర ఈశానుజ
అబ్జమందిరాస్య అబ్జమిత్ర
అనుచు నిట్లు సంధి నెనయని శబ్దముల్‌
దొరకుటయ విసంధిదోష మండ్రు.
6
4. పునరుక్తము
గీ. తొలుతఁ దా నెద్దియైననుబలికి మఱియు
నదియ పలికినఁ బునరుక్తి యండ్రు బుధులు
శబ్ద పునరుక్తి పూర్వోక్తమైన శబ్దమైన
నర్థపునరుక్తి యేకార్థమైనఁ గృష్ణ!
7
గీ. శబ్దపునరుక్తి యగుఁ గాంతిచంద్రుఁ డని వ
చించి మఱి కాంతి చంద్రుఁ డటంచుఁ బలుక
నర్థపునరుక్తి యగుఁ గీర్తి నమృతకిరణుఁ
దని యశోమృగాంకుం డన నబ్జనాభ!
8
క. పునరుక్తి దోష మొందదు
దనరుపదావృత్తి నభిమతంబుగ వీప్స\న్‌
జనువినుతాభీక్ష్ణ్యంబునఁ
బొనరు క్రియాసమభిహారముననండ్రు హరీ!
9
సీ. ఈ వెన్నమ్రుచ్చు దా నిల్లిల్లు దప్పక - చొచ్చుఁ బొమ్మన వీప్స సొంపుమిగులు
ఇటువచ్చివచ్చి నీవేల నిల్చితి కృష్ణ - యనిన నాభీక్ష్ణ్యంబు పొనరియుండు
ఇమ్మిమ్ముశౌరికి నిమ్మపం దనఁ గ్రియా - సమభిహారంబు ప్రశంస కెక్కు
నీ చక్కఁదనమును నీమంచితనమును - బ్రీతిఁ గన్గొని ధాత్రి వ్రేత లైరి
 
ఆ. దండకావనంబు తాపసు లనఁ బదా
వృత్తి యుల్ల సిల్లు వినులకృతుల
భూరిపుణ్యశీల పునరుక్తిలాలన
ప్రకటపుణ్యశోభ పద్మనాభ!
10
5. సంశయము
ఆ. కడఁగి వానిఁ గదియఁగాఁ గదా నేఁడు నీ
కింతపట్టుగలిగె నిందువదన
ఊరకున్నఁ గలదొకో యని సంశయా
ర్ధముగఁ బలుక సంశయము ముకుంద!
11
6. అపక్రమము
క. పదమున నాభికమలమున
హృదయమునఁ బయోజభవ రతీశ్వరదివిష
న్నదు లుదయించెం గమలా
స్పదనకు నను వ్యుత్క్రమం బపక్రమ మయ్యె\న్‌.
12
7. వ్యర్థము
క. మును దాఁ బలికినమాటకు
ననుగుణములు గాక వ్యర్థ మగుమాటలతోఁ
బెనఁచిన నది వ్యర్థంబనఁ
జనుదోషం బనిరి కావ్యచతురులు కృష్ణా!
13
ఆ. త్యాగి వగుదు నీవు తారంబు వెట్టవు
చేరి నిన్ను నడుగు వారు పెద్ద
యింకఁ గీర్తి బ్రాతియే యని యొరుఁ బల్క
వ్యర్థదోష మండ్రు వనజనాభ!
14
ఆ. ప్రేమ మెఱిఁగి వాఁడు బిగియుచు నున్నాఁడు
వానిఁ గసనెయొల్ల వాడుఁ నాకుఁ
గూర్పఁ దెఱఁగు లేదొకో నాఁగ విరహిణి
యందు నిట్లు వ్యర్థ మమరుఁ కృష్ణ!
15
8. అపార్థము
క. కరిచర్మము గైరికశిల
సురగిరి యని సముదయార్థశూన్యపదంబుల్‌
బెరసిన నపార్థ మగు నది
జరగు మదోన్మత్తబాలచరితలఁ గృష్ణా!
16
9. అపశబ్దము
ఆ. కనుఁగొనంగ నాదికవులకావ్యంబుల
లలితమైన లక్ష్యలక్షణముల
రూఢిగాని పెఱవిరోధోక్తు లపశబ్ద
సంజ్ఞికంబు లండ్రు జగతిఁ గృష్ణ!
17
వ. అవియెయ్యవియనినం గుసంధి, దుస్సంధి, చుట్టుంబ్రావ, వైరి
వర్గంబు, కాకుదోషంబు, కుఱుచకాకు, తెనుంగునకుఁ జొరని
సంస్కృతక్రియలంబెరయు దుష్ప్రయోగంబులు మఱియు
నిట్టి గ్రామ్యంబు లెన్ని గల వన్నియు నపశబ్దంబులు
వాని వివరించెద.
18
కుసంధి
క. మొదల నికారముపైన
చ్చొదవి యకారముగ దీనియొడయం డిది యె
ట్లొదవె ననక దీనొండయం
డిదెట్లొదవె ననుఁ గుసంధు లిన శశినయనా!
19
దుస్సంధి
క. క్షితి స్వరసంధి నకారం
బతిశయముగ నతఁడు నతఁడు ననుచో నతఁడు
న్నతఁడు నని యూఁది పలికిన
సతతము దుస్సంధి యండ్రు సత్కవులు హరీ!
20
చుట్టుఁబ్రావ
క. మొద లాఱు వడ్డి మూఁ డనఁ
గదియింపక యెత్తి కట్టి ఖరమున నగువాఁ
డిదె వచ్చెడి నన నెగ్గై
యొదవిన యీచుట్టుఁబ్రావ లొల్లరు కృష్ణా!
21
వైరివర్గము
ఆ. తుదలు తెలుఁగుఁ జేసి యదికి పుష్పవిల్లు
పరంగ భూరుహంపుఁబండ్లు నాక
పుష్పవిల్లు నాఁగ భూరుహపండ్లు నా
వైరివర్గ మండ్రు వనజనాభ!
22
ఆ. కోమటీండ్రునాఁగ భూమితీరనఁ బలు
గ్రహము లనఁగ వానకాల మనఁగ
వైరివర్గమైన వదల రిట్టివిలోక
రూఢిఁ జెల్లునని సరోజనాభ!
23
ఆ. మొదలి తెలుఁగుపై సంస్కృతపద మొకండు
జరగు లోకరూఢిని సమాసంబు చొరదు
పూని ముజ్జగంబులు ననఁ బోలుఁ గాని
యతఁడు ముజ్జగద్వందితుఁ డనఁగఁ జనదు.
24
కాకుదోషము
క. పొలుపుగఁ బొగాడదండలు
లలన ముడిచిన\న్‌ మకార లాంఛనుఁ డొందె\న్‌
జలమునఁ జెఱాకువి ల్లన
నల నిడుదలఁ గాకు దోషమండ్రు ముకుందా!
25
కుఱచకాకు
క. ఎలుఁగుపడ నీవు చెపుమా
యెలిక వనుచు నసపడితిమి యెమి నివు నయెడ\న్‌
చలుఁజలు ననునిడుపులు గుఱు
చలు సేసినఁ గుఱుచకాకు చను నిది కృష్ణా!
26
దుష్ప్రయోగము
క. సత్వరము నృపస్యపదం
గత్వా యాతఁడు నిహత్య కంటకుల సఖీ
భూత్వా మెలఁగెడు నన్నఁగ
విత్వవిదులు దుష్ప్రయోగవిధ మండ్రు హరీ!
27
వ. సంస్కృత విభక్తులయ్యును దెనుఁగునకుఁ జెల్లు
సుప్రయోగంబెట్టి దనిన.
28
క. నిక్క మగు సుప్రయోగము
ధిక్కృతదురితాయ భగవతేఽస్తు నమో యం
చక్కడ నీకును నమరులు
మ్రొక్కుదు రని తిఙ్సుబంతములఁ గూర్ప హరీ!
29
10. విరోధములు
క. సమయవిరోధమ్మును నా
గమలోక విరుద్ధములును గాలవిరోధ
క్రమము కళాదేశవిరో
ధములును జొరకుండఁ జెప్పఁదగుఁ గృతుల హరీ!
30
సమయవిరోధము
క. సందులఁ గుండలముల్‌ గుడి
సందిని శివలింగమును నొసల భూతియుఁ బెం
పొందఁగ నొకదరిబేసి మ
రుం దెగడెడు నన సమయవిరోధము కృష్ణా!
31
ఆగమవిరోధము
క. ఎక్కడిధర్మము హింసయ
నిక్క మనుచు వృత్రవధకు నిర్జరపతియుం
ద్రొక్కె దయపేర్మి ననవుడు
నక్కడ నాగమవిరోధ మండ్రు ముకుందా!
32
కళావిరోధము
క. తాళము పట్టక చదువు\న్‌
బోలఁగఁ బుస్తకముజేత ముట్టక పాడు\న్‌
మే లితనిజాణతన మన
నోలి నిది కళావిరోధ ముదధివిహారా!
33
దేశవిరోధము
క. బహుకూపతటాకోదక
మహితము మరుదేశ మని సమర్థించిన ని
మ్మహి నది దేశవిరోధా
వహ మండ్రు కవీంద్రు లమృతవారిధిశయనా!
34
క. ఇట్టివి దశదోషము లనఁ
బట్టగుఁ గృతులందు నివియ భాసురముగఁ జే
పట్టుదురు ధీరు లొక్కొక
పట్టున డెందమ్ము లలరఁ బల్కినఁ గృష్ణా!
35
క. పదిదోషంబులఁ దెలిపెడు
నదనఁ బ్రయోగించినట్టి యవయోగములం
దొదవవు దోషంబులు నీ
సదమల నామములఁ గూడఁ జలుపుటఁ గృష్ణా!
36
క. క్రమమున నిటుచెప్పిన దో
షములం దత్యుత్కటము విసంధిక మని రా
దిమునులు తత్పరిహారా
ర్థము సంధి సమాసములు దిరంబుగఁ జేర్తున్‌.
37
క. సంధిఁ దెలిపెడుచో సూత్రసమ్మతముగఁ
దొలుతఁ బలికి చూపెడు వర్ణముల విసంధి
నాటుకొనదు శ్లిష్టోచ్ఛారణంబుఁజేసి
చూపునదియ నిశ్చయసంధిసూచకంబు.
38
షట్సంధులు
గీ. పరఁగు దుక్సంధి స్వరసంధి ప్రకృతిభావ
సంధి వ్యజనసంధి విసర్గసంధి
స్వాదిసంధి నా షట్సంధు లందులోనఁ
బ్రకృతసంధి యన్నది యాంధ్రభాషఁ జొరదు.
39
తుక్సంధి
క. పదమధ్యదీర్ఘలఘువులు
పదాంతలఘువులు ఛకారపరమై యూఁదు\న్‌
మది మ్లేచ్ఛుఁడు తుచ్ఛుం డనఁ
ద్రిదశ చ్ఛత్ర మననీగతిని దుక్సంధిన్‌.
40
గీ. లలిఁ బదాంతదీర్ఘము వికల్పంబు నొందుఁ
బుత్త్రి కాచ్ఛత్ర మాత్మజాఛత్ర మనఁగ
నటఁ బదాంతదీర్ఘం బయ్యు నాఙ్ప్రయుక్తి
నిత్య మాచ్ఛాదనం బని నెఱయ నూఁదు.
41
స్వర సంధి
క. ధర అఇఉఋలు సవర్ణము
పర మగుచో దీర్ఘ మగు సువర్ణాద్రి యన\న్‌
శరధీంద్రుఁ డన జహూదక
సరసి యనఁ బితౄణములు వెసం దీర్పు మనన్‌.
42
క. చెచ్చెర ఇఉఋలు మూఁటికి
నచ్చు పరం బైన యవర లాదేశ మగు\న్‌
మెచ్చగ దధ్యన్నం బనఁ
బెచ్చుగ మృద్వన్న మనఁగఁ బిత్రర్థ మనన్‌.
43
క. తగునేఅన మన నయనం
బగుఁ బోఅ మనఁగఁ బవన మగు నైఅక నా
నగు నాయక పౌఅకయన
నగుఁ బావక ఏజవాప్తి నయవాయావల్‌.
44
గీ. సరవి నీలాల్గుపదమధ్యసంధులందు
నప్రసిద్ధ మేకారాంత మైత్వమునకు
నోత్వమునకు నౌత్వమునకు నొగిఁ బదాంత
సంధి నగు విశేషంబు లేచంద మనిన.
45
క. గోశబ్దముపై నవఙా
దేశమున గవాక్ష మనఁగ దీపించు నవా
దేశము ద్యోశబ్దముపై
నాశక్రుండు ద్యవధీశుఁ డన సత్సంధిన్‌.
46
క. రైశిఖరాచ్చున కాయా
దేశం బగుసంధి రాయధీశ్వరుఁ డనఁగా
గ్లౌశిఖరాచ్చున కావా
దేశం బగుసంధి గ్లావుదీర్ణ యనంగన్‌.
47
క. మొదలిఅకారము ఇఉఋలు
పొదవిన నేత్వమును నోత్వమును రేఫయుఁ బెం
పొదవు సురేంద్రుఁ డనఁగ నీ
రదోత్కరం బనఁగ సంధి బ్రహ్మర్షు లనన్‌.
48
గీ. ఇత్వ ముత్వ మోత్వం బైత్వ మౌత్వ మైదు
నాది యై ఋకారము పరమైనచోట
మహితకవ్యృద్ధి మన్వృద్ధి మఱి ద్యవృద్ధి
యద్ది రాయృద్ధి గ్లావృద్ధి యనఁగఁ బరఁగు.
49
క. వశగతి ఋణపద మధికపు
దశఁ బ్రవసనకంబళార్ణ దశవత్సతరా
ఖ్యశిఖిభసంఖ్యపదంబులు
రశిరస్కాకార మొంది ప్రార్ణాదు లగున్‌.
50
క. ఐలగునేఐ లోఔ
లౌలగు నాద్యంతమునకు నఖిలైకవిభుం
డా లలితైశ్వర్యుఁడు స
త్యాలాపౌదనుఁడు భవమహౌషధ మనఁగన్‌.
51
గీ. అత్వమున కోతు వోష్ఠమంత్యమునఁ గదియఁ
గలుగు నోత్వౌత్వయుగ్మ వికల్పసంధి
ఆడఁ జెందె ఘనోతు వల్పౌతు వనఁగ
నాఁగె బింబోష్ఠి నొక్క బింబౌష్ఠి యనఁగ.
52
అఙ్ప్రయోగ చతుష్టయము
క. అందముగ నీషదర్థము
నం దాతుద నుత్వ మోత్వ మై యోష్ణ మగు\న్‌
జెంది క్రియా యోగము తుద
యందలియత్వ మది యాత్వ మావన మనఁగన్‌.
53
క. ఇల మర్యాదాదులయం
దలియత్వం బాత్వ మై పొదలు నాద్రి యన\న్‌
లలి నభివిద్యాదులయం
దలియత్వము నాత్వమై పొదలునాద్రియనన్‌.
54
గీ. ఈషదర్థ మనఁగ నించుక యగుఁ గ్రియా
యోగ మనఁగ సత్క్రియోపయుక్తి
యంతదాకఁ యనుటయై చను మర్యాద
యదియు ననుట యర్థ మభివిధికిని.
55
క. ఈనాల్గిట నుపసర్గయ
కానఁ గలిగె సంధి యట్లుగావు ప్రకృతిభా
వానుగతాకారము లవి
జానుఁగ దెలుగునకుఁ జొరవు సంధికలియమిన్‌.
56
క. ప్రతిషేధాకారోత్తర
గతశబ్దాద్యచ్యు లవి నకారము లగునా
శ్రితులకుఁ బంకజనేత్రుఁ డ
నతిదూరుం డనఁగ నతఁ డనాద్యంతుఁ డనన్‌.
57
వ్యంజన సంధి
క. పొడవగు దిగిభ మజంతము
షడంగములు జగదరిష్టశాంతి సుబంతం
బడరె ననఁ దృతీయము లల
వడు వర్గవ్యంజనములపై నచ్‌సంధిన్‌.
58
గీ. షడృతుధర్మభూషిత తరుషండలక్ష్మి
నిర్మలాబృద్ధదీర్ఘిక నిజవిశిష్ట
వాగృజుత్వంబు భవదృషిత్వమున కమరె
నాఁగ ఋత్వవర్గ వ్యంజనముల సంధి.
59
గీ. ఆదిఙఞణనమల పొల్లు లచ్చు లంట
స్వస్వరూపంబ యగు ఋత్వసంధి నైన
నడఁగు గుడి హలంతము నాఁ దిఙంతమన ని
కోయణచి నా ననృజువనఁ గూడుఁ గాన.
60
క. పన్నుగ మకార హల్లగు
సున్న మకార మగు నచ్చు సోఁక సమగ్రం
బన్న మన ఋకారం బా
సన్నమ్ముగ మృత్వ మగు రససమృద్ధి యనన్‌.
61
క. తమతమవర్ణంబుల ద్వి
త్వము లగుఁ దత్తరుణి తత్తదర్థము తద్దా
నము తద్ధనంబు తన్నయ
నము నా నిటు వర్గములఁ దనరు వ్యంజనముల్‌.
62
సీ. వర్గహల్లుల చేరువను హకారము చతు - ర్ధాక్షరం బై సంధి నడఁగు నొండె
మూఁడవవ్రాలతోఁ బోఁడిగ దీపింప - స్రగ్ఘార మనఁగ నజ్ఘల్లు లనఁగ
షడ్ఢలంబులునాఁగఁ సకలజగద్ధిత - ప్రౌఢిమనాఁగకుబ్భస్తు లనఁగ
నవియ స్రగ్‌హారంబు లనఁగ నజ్‌హల్లు ల - నంగ షడ్‌హలములు నా జగద్‌ హి
 
ఆ. తానువర్తను లనఁ గకుబ్‌ హస్తు లనఁగ
శపరమైన వాక్‌శాంతి వాక్ఛాంతి యట్ల
చపటహల్లులు మూఁటను జను విభాష
ఛత్వమగుఁ దకారమునఁ దచ్ఛాఖయనఁగ.
63
గీ. లలిని దవ్యంజనంబుపై లత్వమునకు
ద్విగతి తల్లీల యనఁగఁ దద్లీల యనఁగ
నంచితసకార మడఁగును నడఁగును నడఁగకుండు
నుత్థితం బుత్‌స్థితం బన నుండుఁగాన.
64
క. అనునాసికవర్గ వ్యం
జనముల నిజరూప మొండె జరగుఁ దృతీయం
బునఁ బ్రాఙ్ముఖంబు ప్రాగ్ముఖ
మన వాఙ్నియమంబు వాగ్నియ మమనుచోటన్‌.
65
గీ. కచటతపహల్లు పంచవర్గద్వివర్ణ
సలనిజాకృతి మీఁదియక్షరయుగముల
యరలవలఁ దృతీయంబు వాక్తరుణివాక్స
రంబు లనఁగ దృగ్దీప్తి దృగ్వ్రాత మనఁగ.
66
గీ. కపల ప్రథమయుగ్మ సకారగతులఁ దాన
అపరయుగ యరలవతృతీయంబు తత్కృ
తంబు తత్పుత్రి తత్సతి తద్గతియు జ
గద్గురుఁడు సద్యశము నాఁ దకారహల్లు.
67
గీ. తచ్చమత్కృతి తచ్ఛాయ తజ్జలంబు
తజ్ఝషము తట్టణాంకృతి తట్ఠకార
ఘనతతడ్డోల తడ్ఢక్క యనఁగ రెండు
వర్గముల ద్విత్వమొందుఁ దద్వ్యంజనమున.
68
విసర్గ సంధి
క. కపముఖయుగ్మములు విస
ర్గపయిం బొడసూపి నిర్వకార మగు మనః
కపట మనఃఖేదము లనఁ
దపఃఫలం బనఁ దపఃప్రతాపం బనఁగన్‌.
69
గీ. కపల మొదలిరెం డ్లగు దుర్నిర్గుపరిసంధి
షత్వ మగు దుష్పదంబు నిష్ఫల మనంగ
జరగు దుష్కర్మ మనఁగ నిష్కర్మ మనఁగఁ
జెల్లు దుష్పీత మనఁగ నిష్పీత మనఁగ.
70
క. పొలుపుగఁజటతాదియుగం
బుల శషస లెనయ విసర్గపొందు నన\న్‌ వా
శ్చలనముఛందష్టీకలు
లలితయశస్తతి మిథశ్చలంబు లనంగన్‌.
71
క. అలరు నికారాదివిస
ర్గలపై వర్గాపరాక్షరద్వయగణముల్‌
యలహవలు గదియ రేఫల్‌
గలియు హవిర్భుజధనుర్భలంబు లనంగన్‌.
72
క. మొదలి విసర్గలమీఁద\న్‌
బొదలిన శషస లవి యూఁదు భూరియశస్సం
పద యనఁ గాసుమనష్ష
ట్పదము లనఁగ నధిక మగు తపశ్శక్తి యనన్‌.
73
గీ. అవ్యయాంత విసర్గ వర్గాక్షరముల
రెంట ణనమయలవహల రేఫ రేఫ
గాక పెఱవర్ణములఁ గారకంబులట్ల
గదియు స్వర్గజం బనఁగ స్వఃకాంత యనఁగ.
74
క. ప్రకటవిసర్గాదిస్వర
మకారమునఁ గలసి యోత్వ మగు సంధిఁ దపో
ధికుఁ డన విసర్గ చెడి వా
క్ప్రకార మాప్రభృతిఁ గదిసి రజఆప్తి యగున్‌.
75
క. కలితేకారాదివిస
ర్గులు స్వరములమీఁదఁ గదియఁగా రేఫలు సం
ధిలు నర్చిరగ్ర మనఁగా
నలవడు మఱి చక్షురింద్రియం బనఁగ మహిన్‌.
76
గీ. వర్గములఁ దృతీయచతుర్థ వర్ణములును
ణనమలును యరలహవలు నొనరఁ గదియ
వామపదవిసర్గాంతిమాద్వర్ణ మోత్వ
మగు రజోగుణమన మనోహర మనంగ.
77
క. వెలయ నివర్ణాదివిస
ర్గలమీఁదను రేఫ గదియఁగా దీర్ఘము వ
ట్రిలి యర్చీరాజి యనఁగ
నలిఁ జక్షూరాగ మనఁ దనర్చును సంధిన్‌.
78
క. ధర నవ్యయపు విసర్గకుఁ
బరమున నచ్చున్నఁ గుఱుచపై రేఫ యగు\న్‌
పరరేఫ గదియ దీర్ఘ
స్వర మగు స్వరధీశుఁ డనఁగ స్వారాజ్య మనన్‌.
79
గీ. ప్రథమశబ్దాంత దీర్ఘవర్ణములమీదఁ
జతనమైన రేఫాంత విసర్గ యుండి
రేఫయగుఁ దుది నచ్చున్న రేఫయున్నఁ
గ్రాఁగు వారాకరంబు వారాశి యనఁగ.
80
క. అత్వాంతవిసర్గ యుడుగు
నిత్వాదుల రత్వమొందు ఋత్వము తుదరా
నత్వము తపఋద్ధి యనఁగ
సత్వయుతా నిరృతియనఁ బ్రశస్తం బగుటన్‌.
81
క. తల మగు రేఫాంతవిస
ర్గలమీఁద ఋవర్ణ మొనరఁగా సంధి విస
ర్గ లుడిగి రేఫయు ఋత్వము
గలిగియు బునరృతు సమేత కమలాక్షి యనన్‌.
82
గీ. స్వాదిసంధిలోపలి విసర్గాంతవర్ణ
సంధు లెన్ని యన్నియును విసర్గసంధి
యందె కలిసివచ్చుటఁజేసి స్వాదిసంధి
వేఱ యొనరింపబడదు వివేకరూఢి.
83
వ. మఱియు నొక్క విశేష సంధి. 84
క. ఉపరిని హల్సంయుతమై
నపు డూఁదును స్వరసమన్వితాక్షర మగునే
నపు డూఁద దాదివర్ణము
ప్రపాద్వయము పరికృతంబు పరికౢప్తి యనన్‌.
85
సమాసంబులు
క. లలితద్వంద్వబహువ్రీ
హులు తత్పురుషము నలుక్కు నుద్యద్ద్విగువు\న్‌
నలిఁ గర్మధారయము ని
ర్మలావ్యయీభావమును సమాసము లరయన్‌.
86
వ. అందుఁ బూర్వపదార్థ ప్రధానంబవ్యయీభావంబు నుత్తర
పదార్థప్రధానంబు తత్పురుషంబు నుభయపదార్థ ప్రధానంబు
ద్వంద్వంబు నన్యపదార్థ ప్రధానంబు బహువ్రీహియు నగు
నందు ద్వంద్వంబు.
87
ద్వంద్వము
క. పెక్కైనను రెండైనను
జొక్కపుశబ్దములు గదియుచో ద్వంద్వ మగు\న్‌
మ్రొక్కెద బలకృష్ణుల కన
నక్కిటికమఠాద్రు లుర్వి కాధార మనన్‌.
88
గీ. వ్యస్తపద మయ్యెనేని సమస్తమైన
ద్వంద్వమున కంత్య పదము చందము విభక్తి
అంబువులు గోవు ద్విజుఁడు శుద్ధాత్ము లనఁగ
నంబుగోద్విజుల్‌ శుద్ధాత్ము లనఁగ నిట్లు.
89
గీ. చేయవలయు మాతాపితృసేవ యనఁగ
మహితరుచులు సూర్యాచంద్రమసు లనంగ
నాదిమునులు మిత్రావరుణాఖ్యు లనఁగ
ద్వంద్వమున సంధిదీర్ఘము ల్వచ్చు నిట్లు.
90
క. అల సంస్కృతమునఁ బోలె\న్‌
వల దల్పాచ్చునకు నిచట ద్వంద్వపునియతుల్‌
తెలుఁగు లనుగ్రహనిగ్రహ
ములు నాఁగను బుణ్యపాపములు నాఁ జనుటన్‌.
91
బహువ్రీహి
క. ఏవస్తు వెవ్వనికిఁ గల
దావస్తువుకలిమి యతని కలవడఁ బలుకం
గావలయు బహువ్రీహి శి
రోవిలసద్బర్హిబర్హ రూఢవివేకా!
92
తత్పురుషము
గీ. ప్రథమపదమున కెద్ది విభక్తి దాని
చే విశేషింపఁబడినది యా విభక్తి
సంజ్ఞఁ బరఁగును దత్పురుషంబు కృతుల
నదియు నఞ్‌పూర్వసహిత మెన్మిదివిధములు.
93
క. తగఁ బ్రథమాతత్పురుషం
బగుఁ గాయముయొక్క పూర్వమపరము దెల్లం
బుగఁ బూర్వకాయ మనఁగా
నగణితముగ నపరకాయ మనఁగా వరుసన్‌.
94
క. కమలాశ్రితుండు ధనకృ
త్యము కుండలకాంచనంబు ధామాగతుఁ డ
ర్యమసుతుఁ డుపలస్థితచి
త్ర మన ద్వితీయాదు లాఱు తత్పురుషంబుల్‌.
95
క. క్షితినఞ్‌తత్పురుషం బగుఁ
బ్రతిషేధనకారమునకుఁ బ్రతియై మొదల\న్‌
వితతాకారము చొప్పడి
యతఁ డబ్రాహ్మణుఁ డనంగ నవృషలి యనఁగన్‌.
96
ద్విగువు
క. ద్విగు వగు సంఖ్యాపూర్వక
మగుచు సమానాధికరణ మగుచుఁ బ్రసిద్ధం
బుగఁ గర్మధారయాహ్వయ
మగుఁ దత్పురుషంబ యీక్రియ\న్‌ భిన్నగతిన్‌.
97
క. ఏయది సంఖ్యాపూర్వక
మై యలవఁడు బలుక ద్విగుసమాసం బది దా
నీయదుపతికీర్తిం దెలు
పాయెఁ ద్రిలోకి యన నీసమాహారోక్తిన్‌.
98
కర్మధారయము
క. ఏమిటి కెయ్యది గుణమై
తామెఱయుచు నుండు నది మొదల నిడి పలుక\న్‌
భూమి నది కర్మధారయ
మౌ మధురోదకము మేచకాభ్రం బనఁగన్‌.
99
క. అందముగఁ గర్మధారయ
మందు మహాత్మునకు నమరు నభియోగము గో
విందుఁడు మహాత్ముఁ డనఁ జే
యందు ఫలితకల్పలత మహాలక్ష్మి యనన్‌.
100
అలుక్సమాసము
క. ఏక్రియ యెవ్వనికిం దగు
నాక్రియఁ దేరఁ బదమధ్యమందు విభక్తి
ప్రక్రియఁ గూర్ప నలు క్కగు
నీక్రియ ఖేచరవనేచ రేశ్వరు లనఁగన్‌.
101
అవ్యయీభావ సమాసము
క. ఎక్కడ నెయ్యవి లే వవి
యిక్కడ లే వనిన నవ్యయీభావము దా
నెక్కొను నిర్మక్షిక మని
యక్కజ మగుఁ దీర్ఘ మహిమ నభినుతి సేయన్‌.
102
వ. మఱియు నుత్తరపదోపమానసమాసం బెట్టి దనిన. 103
ఉత్తర పదోపమాన సమాసము
గీ. ఓలిఁబురుషసింహో యని యుగ్గడించు
చోటఁ దా సింహఇవపురుషో యనంగఁ
దనరు నిగ్రహ మగుట నుత్తరపదోప
మానసమాస మండ్రిది శాస్త్రమహిమవిదులు.
104
కారక శబ్దంబులు
గీ. సంస్కృతము తెనుఁ గైనఁ దత్సమపదంబు
దానఁ బుట్టి తెనుంగైనఁ దద్భవంబు
దేశి తెనుఁగు దేశజ మచ్చ తెనుఁగు తెనుఁగు
నిర్మలుఁడ సిరి యొడయఁడు నిక్క మనఁగ
105
గీ. సర్వనామముల్‌ యుష్మదస్మత్పదంబు
లావిభక్తులక్రియ లవ్యయములు మానుఁ
దెలుఁగు లగుచోటఁ గారకాదిని వసించి
సర్వనామాశ్రయంబులు జరుగుఁ కొన్ని.
106
సీ. ఏనన్న నీవన్న నితఁడన్న బ్రథమాఖ్య - నను నిన్ను నాతని నన ద్వితీయ
నతనిచే నతనితో ననఁగ దృతీయ యీ - తనికొఱ కతనికై యనఁ జతుర్థి
పంచమి యగు దీనఁబట్టుండి యందుండి - వానికంటెను వానివలన ననఁగఁ
వానియొక్కకులంబు వానికిఁ బ్రియ మది - జనులలో నితఁడు మేలనఁగ షష్ఠి
 
ఆ. జలధియందు లక్ష్మిగలుగుచుండఁగ దన్ని
మిత్త మనఁగ సప్తమీవిభక్తి
జలజనాభ యనఁగ సంబుద్ధి యిట్లు వి
భక్తు లలరుఁ గారకోక్తిగతని.
107
క. స్త్రీపుంనపుంసకము లన
నేపగు లింగములమీఁద నెసఁగు విభక్తుల్‌
దీపించు నవియు వచన
వ్యాపారనిరూఢి నక్షరాంతరములతోన్‌.
108
క. తనరఁగ అఆఇఈ
లనఁగా ఉఊలు నాఁగ నంబుజదళలో
చన ఋౠ లన ఓఔ
లనఁగ నజంతాహ్వయంబు లగు నీపదియున్‌.
109
క. చజలు తవర్గము పబమలు
స్వజనప్రియ రవలు శషలు సహలు పదాఱు\న్‌
నిజమగు హలంతములు హరి
యజంతములు గూడ నిరువదా ఱంతంబుల్‌.
110
క. అంతము తెలుఁ గగునెడ నే
యంతముతలసూప దైన నచట సమాసా
భ్యంతరములందు సంధ్యుచి
రాంతము లగుఁ గాన ధీవియద్విష్ణులనన్‌.
111
క. యత్తత్ప్రభృతు లొకటితోఁ
జొత్తెంచును యద్గుణంబు చూచి మహాత్ముల్‌
మెత్తురు తత్పురుషుఁడు లో
కోత్తరుఁ డన నీదృశ ప్రయోగబలమునన్‌.
112
క్రియా పదంబులు
క. పరుఁ బలుకు బ్రథమ పురుష మె
దిరి మధ్యమపురుషపలుకు ధృతి దనుఁ బలుకున్‌
ధర నుత్తమపురుషక్రియ
వరుస నలింగము లైనవచనము లెసఁగున్‌.
113
క. కారకపదములు తెనుఁగై
నారి నరుఁడు రత్న మనఁ దనర్చుగతి క్రియా
కారవిశేషము లలరవు
వారలు వచ్చెదరు దండు వచ్చెద రనుచోన్‌.
114
క. ద్వివచనము లేదు తెలుఁగున
బ్రవిమలగతి నేకవచనబహువచనము లౌఁ
దివిచెద ననఁ దివిచెద మనఁ
గవి యనఁ గవు లనఁగ గ్రియలు కారకఫణితిన్‌.
115
అవ్యయ శబ్దంబులు
క. ఇలఁ గారకమట్టుల యు
జ్జ్వలరూపము లయ్యు లింగవచనములు విభ
క్తులు లేకవ్యయశబ్దం
బులు సకలము సముచితార్థములు విలసిల్లున్‌.
116
గీ. నెఱయ నవ్యయపదములన్నియు సమాస
రూపమున నాంధ్రకవితకు రుచి యొనర్చు
స్వర్వధూమణి యన వృథాశంక యనఁ బు
నః ప్రణత నాఁగ నుచ్చైర్నినాద మనఁగ.
117
క. వృథ యను నవ్యయ మొక్కఁడు
ప్రథితంబై చెల్లుఁ గృతులఁ బ్రత్యేకము తా
వృథసేయక యెపుడు మనో
రథములు మాకిచ్చు నీ మురద్విషుఁ డనఁగన్‌.
118
క. కారకజనితక్రియయును
నారఁగ ల్యప్ప్రత్యయాది కావ్యయము దెనుం
గైరంజిలుఁ బూజించి వి
చారించి యుదాహరించి సంధించి యనన్‌.
119
విశేష్య విశేషణంబులు
క. హరి కరుణాకరుఁ డనఁగా
హరి యనుశబ్దము విశేష్య మగు మఱి కరుణా
కరుఁ డనుట విశేషణ మి
ట్లురుతరగతిఁ గారకప్రయోగము లమరున్‌.
120
క్రియావిశేషణంబులు
క. పగతునితమ్ముని శాశ్వత
ముగ నిల్పెను దశరథేంద్రపుత్త్రుండనుచో
జగమునఁ గ్రియావిశేషణ
మగు నీయెడ శాశ్వతముగ నని పల్కుట దాన్‌.
121
ఆ. శబ్దసిద్ధికొఱకు సంధిసమాసరూ
పంబు లిట్లు కొంతపలుకఁబడియె
మఱియు నుచితరీతి నెఱుఁగంగవలయు ర
హస్యలక్షణంబు లాంధ్రకవులు.
122
పంచాశద్వర్ణంబులు
క. భూమిఁ బదాఱచ్చులు వాఁ
గా మెఱసి అకారమాదిగా స్వరము లగు\న్‌
కా మొదలు క్షకారముతుద
యై ముప్పదినాల్గుహల్లు లగు వ్యంజనముల్‌.
123
క. తగు హ్రస్వంబులు దీర్ఘము
లగు అఇఉఋఌలును వెండి హ్రస్వాభావం
బగు ఏఐఓఔలు నె
సఁగు అం అః అనఁగ షోడశస్వరము లగున్‌.
124
క. కచటతప వర్గవర్ణము
లెచట\న్‌ స్పర్శ లగు నిరువదే నై మఱి యం
దుచితగతి\న్‌ ఙఞణనమ
ప్రచయం బను నాసికాఖ్యఁ బ్రస్తుతినొందున్‌.
125
క. యరలవ లంతస్థలు నాఁ
బరఁగును శషసహలు తేటపడు నూష్మలన\న్‌
సొరిది క్షకారముఁ గూడఁగ
సరి నేఁబది యయ్యె వర్ణసంఖ్య ధరిత్రిన్‌.
126
క. ళలలకు భేదము లే దను
పలుకుఁన ళాఁ దొలఁగి యైదుపదులగు వర్ణం
బులు సంస్కృతభాషకు మఱి
తెలుఁగున ఱళ లనఁగ రెం డధిక మండ్రు హరీ!
127
గీ. రాఁదొలంగి సమస్తాక్షరముల మీఁదఁ
గార మగుఁ గకారంబు క్షకార మనఁగ
నట రవర్ణంబుపై నిఫ యనఁగఁ బరఁగుఁ
గాన నిది రేఫ యని పలుకంగవలయు.
128
క. వర్ణం బన నక్షర మన
నర్ణం బన మాతృక యన నక్కర మనఁగా
నిర్ణీత సమాహ్వయములు
వర్ణితములు కృతులయందు వ్రాలకునెల్లన్‌.
129
క. ఆదులు వర్గత్రయమును
భూదేవతలు తపవర్గములు రవలును ధా
త్రీదయితులు యలశషసహ
లాదటనూరుజులు ళక్షరాఖ్యలు శూద్రుల్‌.
130
షడ్వర్గంబులు
క. ఏకాదిషడంతముగ\న్‌
బ్రాకటపాదములు గలుగు మంజరి మొదలా
లోకితషడ్వర్గంబులు
శ్రీకలితచ్ఛంద మవధరింపుము కృష్ణా!
131
ఉ. శ్రీనిధి చక్రవర్తిగురు శేఖర పుణ్యకటాక్ష లబ్ధ సు
జ్ఞానుఁ డనంతధీమణిలసన్మణి భోజచరిత్ర చెప్పి ల
క్ష్మీనరసింహుఁ గూర్చి నప్రసిద్ధుఁడు వేడుకతో నొనర్చె ఛం
దోనుతి యోగిహృద్విమలతోయజవర్తి కనంతమూర్తికిన్‌.
132
ఉ. రాజులు పాడిఁ దప్పక ధరావలయం బఖిలంబు నేలెడి\న్‌
భూజనరాజి సంపదలఁ బొంపిరివోని సుఖానుభూతిచే
నోజఁ జరింపుచుండెడిఁ బయోజసముద్భవకల్పశాశ్వతం
బై జలజోదరాంకితమహాకృతి సన్నుతినొందుచుండెడున్‌.
133
గద్యము. ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవతిక్కనామాత్య
తనూభవ సుకవిజనవిధేయ యనంతయనామధేయ ప్రణీతం
బైన ఛందోదర్పణమునందు వర్జనీయంబు లగు దశదోషంబుల
నేర్పఱుచుటయు, నందుదోషరహితంబులై యాదరణీయంబు
లగుపట్లు దేర్చుటయు సంధి సమాసంబులు పంచాశద్వర్ణంబు
లేర్పఱుచుటయు నన్నది చతుర్థాశ్వాసము.
 
AndhraBharati AMdhra bhArati - bhAshha - ChaMdassu - anaMtAmAtyuni ChaMdOdarpaNamu - chaturthAshvAsamu - anaMtAmAtyuDu - andhra telugu tenugu ( telugu andhra )