భాష ఛందస్సు సులక్షణసారము
5. యతి
5.1. యతుల పర్యాయపదములు
క. విశ్రాంతి విరతి విశ్రమ
విశ్రామ విరామ విరమ - విరమణములనన్‌
విశ్రుతమగు యతి కృతి నధి
కశ్రావ్యంబై బెడంగు-గా నిడవలయున్‌.
    (భీమన ఛందము)
89
5.2. యతి నిర్వచనము  
క. విలసత్పాదాద్యక్షర
ములు వళ్ళగు, నాద్వితీయ-ములు ప్రాసంబుల్‌;
నెలకొని తమ తమ పాదం
బుల యతిపై నన్నిపాద-ముల వళ్ళమరున్‌.
    (భీమన ఛందము)
90
5.3. యతి మైత్రి  
సీ. క్షాకును కఖగఘల్‌ - చఛజఝల్‌ శషసలు, అయహలకెల్లఁ గి-య్యలు ఘటించు\న్‌,
గీర్తింపఁ గ్రారయు - గిలకయు రేఫకు, నావడి సెల్లును - నణలకెల్ల,
మావడిసెల్లును - మాకునుం బాలకు, తావడిసెల్లును - తథదధలకు,
పోలింప పుఫుబుభుల్‌ - మూలకు విలసిల్లు, లావడి సెల్లును - రళలకెల్లఁ,
 
తే. దలఁపఁ దలకట్ల కైత్వ మౌ-త్వమును దీర్ఘ
మిత్వమేత్వంబు వట్రువ - లేకసరణిఁ
గొమ్మునకుఁ జెల్లు నోత్వంబు - నిమ్ముగాను,
యతుల కివి లక్షణములు ప-ద్మాయతాక్ష!
91
5.4. యతి భేదములు  
సీ. సరసంపు యతియును - సంయుక్తయతి, వర్గు, - గరిమదేశీయ, మె-క్కటియుఁ, బోల్కి,
చక్కటియతి, యను - స్వరయతి, స్వరయతి, - యావడి, ఋవ్వడి - మావడియును,
ప్రభు, విభాగములు, సౌ-భాగ్యంబు ప్రాసంబు, - భిన్నంబు, ప్రాది, య-భిన్నవిరతి,
వెలయు నభేదంబు - వృద్ధి, నిత్యసమాస, - ప్లుతయతు, లాదేశ-యతి, వికల్ప,
 
తే. కాకువులు, రివ్వడియును, న-ఖండనిరతి,
యుభయయతి, యశవర్గాదు - లొప్పు మెఱసి
కృతుల ముప్పదియొక్కటి - యతులు దనరు
సత్కవుల సమ్మతంబున - జలధిశయన!
    (లక్షణ చూడామణి)
92
5.4.1. సరసయతి
ఆ. ణనలు చెల్లుఁ గమల-నాభ! యొండొంటికి
అయహ లొనరఁజెల్లు - హస్తివరద!
శషసలొందునండ్రు - చఛజఝంబులతోడ
సరసయతులు నాఁగ - జలధిశయన!
    (అనంతుని ఛందము)
93
5.4.2. సంయుక్తయతి
క. వెలయఁగ సంయుక్తాక్షర
ములలో నెద్దానినైన - మునుకొని వడిగా
నిలువందగుఁ బాదంబుల
నలఘు గుణాన్వితుఁడ! రేచ - యసదృశదానా!
    (భీమన ఛందము)
94
క. ఒక్కడుగున విశ్రాంతులు
పెక్కగుచో సంయుతములు - పెనుపన్‌ మును జ
డ్డక్కరమునఁ దా నెత్తిన
యక్కరమే యునుపవలయు - నన్నిటఁ గృష్ణా!
    (అనంతుని ఛందము)
95
5.4.3. వర్గయతి
క. నిక్కువ మయ్యెన్‌ వర్గుల
యక్కరమగు వళ్లు నడుప - నగు ఙఞణనమల్‌
దక్కఁబెఱ నాలుగింటికి
దిక్కరి సన్నిభుఁడ! రేచ! - ధీజనవినుతా!
    (భీమన ఛందము)
96
5.4.4. దేశీయయతి
తే. అచ్చుతోఁగూడి దేశీయ - మనెడి విరతి
యెన్న నొక్కొక్కచోటఁ గ్రి-క్కిఱియుఁ గృతుల
సరసలక్షణ కవులు గ్ర-చ్చఱ నొనర్ప
భంజితాసురసముదాయ - యాంజనేయ!
    (చిత్రకవి పెద్దన - లక్షణసార సంగ్రహము)
97
5.4.5. ఎక్కటియతి
క. ధరనెక్కటివళ్ళనఁదగు
లరమఱవలు వానితోఁ దొ-లంగక లాకున్‌
సరిళాయని విశ్రమవే
ళ రమాధిప! రెండునుం గ-లసి వర్తించున్‌.
    (అనంతుని ఛందము)
98
ఆ. మరునితండ్రి లోక-మహితుండు యాదవ
రాజసింహమూర్తి - రక్షకుండు
ఱాఁగవేలుపనఁగ - ఱంపిల్లు నెక్కటి
వళ్ళునాఁగనిట్లు - వనజనాభ!
    (అనంతుని ఛందము)
99
5.4.6. పోలికవడి
క. పోలు\న్‌ పు, ఫు, బు, భు, లకు మూ
పోలికవడి శీలముల్ల -మున కెనయనఁగా
శీలంబుల్లం బనగా
భూలోకం బమరలోక-మున కెనయనఁగ\న్‌.
    (భీమన ఛందము)
100
క. చను నీవు హస్తినాపుర
మున కేనును బాండు భూప - పుత్త్రులఁ బ్రీతి\న్‌
గని యిటువత్తు నవశ్యం
బును వారలఁ జూడవలయుఁ - బోయెదననినన్‌.
    (భారతము - ఉద్యోగ)
101
5.4.7. చక్కటియతి
క. అక్కజముగ పు ఫు బు భు లకు
జక్కటియతియయ్యె శృంగ-సహిత మకారం
బక్కమలజేశ్వరాదుల
మ్రొక్కులుగైకొను సమస్త - భువనాధీశా!
    (అనంతుని ఛందము)
102
క. చిత్తమ్మున రంజిల్లుచు
ముత్తైదువ లపుడు గదిసి - పూవిల్తునకున్‌
బిత్తరికిఁ బలు తెఱంగుల
నెత్తిరి హారతులు పౌరులెల్లఁ - జెలంగన్‌.
    (పంచబాణ విలాసము)
103
5.4.8. అనుస్వారయతి
క. పంచక వర్గాక్షరములు
పంచమవర్ణములఁగూడి - పరఁగనటించున్‌
వంచింపక పెఱనాలుగు
నంచితముగఁ బిఱుఁద సున్న-లంటినచోటన్‌.
    (భీమన ఛందము)
104
షట్పాదగీతి. ఙాకు వడిసెల్లు రత్న కం-కణమనంగ
ఞాకు వడిసెల్లు బర్హిపిం-ఛంబనంగ
ణాకు వడిసెల్లుఁ గనకమం-డపమనంగ
నాకు వడిసెల్లు దివ్యగం-ధంబనంగ
మాకు వడిసెల్లు విజితఁశం-బరుఁడనంగ
బరఁగు నిబ్భంగిఁదగ నను-స్వార యతులు.
    (భీమన ఛందము)
105
5.4.9. స్వరయతి
క. అ ఆ ఐ ఔ లకు మఱి
ఇ ఈ లు ఋకారసహిత - మె ఏలకునౌ
ఉ ఊ ల్దమలో నొడఁబడి
ఒ ఓ లకు వళ్ళగు న్న-యోన్నత చరితా!
    (భీమన ఛందము)
106
5.4.10. యావడి
తే. తాయెతును నుయ్యెలయుఁ బయ్యె-దయను దక్కఁ
గలుగ దెత్వంబు మధ్య య-కారమునకుఁ
దుదలఁ గ్రియలందు నెత్వంబు - గదియు, వాని
కత్వమిడరాదు తెనుఁగున నబ్జనాభ!
    (కవిజన సంజీవని)
107
సీ. ఒక కాంతయొరఁగిన - సికమీఁది ముడిపువ్వు
టెత్తులు మెఱయఁదా-యెతులుచుట్టి
    (చంద్రభాను చరిత్రము)
108
క. వలనొప్పగ నపుడా యు
య్యెలలోపల బాలు నునిచి - యిందునిభాస్యల్‌
కలకంఠ నాదమాధురిఁ
బలుమఱుఁ జెలరేఁగి జోలఁ - బాడిరి ప్రేమన్‌.
    (విక్రమార్క చరిత్ర)
109
సీ. వలఁబడ్డ జక్కవ-ల్వలె నున్న జిలుఁగుఁబ
య్యెదలోని గుబ్బపా-లిండ్లు నెరయ.
    (యయాతి చరిత్ర)
110
5.4.11. ఋవడి
తే. క్షితి ఋకారస్వరూపమై - యతులుపరఁగు
ఋగ్యజుస్సామవినుతుండు - కృష్ణుఁడనఁగ
వృష్ణికులజుండు కరుణాస-మృద్ధుఁ డనఁగ
హేమపీతాంబరుఁడు దేవ - వృషభుఁడనఁగ.
    (అనంతుని ఛందము)
111
ఆ. ఋభులు సంతసిల్ల - గృతముఖ్యులరుదంద
దితిజతతికి నెల్ల - ధృతిగలంగఁ
దృణముమాడ్కి దాన - వేంద్రుని దునుమాడి
జయమునొందు వేగ - జగదదీశ!
    (దశకుమార చరిత్రము)
112
5.4.12. మావడి
తే. యరలవలు శషసహలును - నాదిబిందు
యుతములై మకారవిరామ - యుక్తిఁ దనరు,
మారుతాత్మజుఁ డరిది సం-యమి యనంగ
మదన జనకుండు దనుజ సం-హరుఁడనంగ.
    (అనంతుని ఛందము)
113
క. కమలాప్తాంశులు బల వి
క్రమవంతులు ఖడ్గధరులు - రాజులు మీరల్‌
మముఁ బ్రోవఁగఁదగదే సం
యమి వర్యులఁ జూచిరా కు-మారకు లెల్లన్‌.
    (దశకుమార చరిత్రము)
114
చ. గరళపు ముద్దలోహ మవ - గాఢ మహాశని కోట్లుసమ్మెటల్‌
హరు నయనాగ్ని కొల్మి యుర - గాధిపు కోఱలు పట్టుకార్లు ది
క్కరటి శిరంబు దాయ లయ - కాలుఁడు కమ్మరి వైరి వీర సం
హరణ గుణాభిరాముఁ డగు - మైలమ భీమన ఖడ్గ సృష్టికిన్‌.
    (భీమకవి చాటుధార)
115
5.4.13. ప్రభుయతి
తే. ఒనర నన్నమ్మ యనుచోట - నూఁదఁబడక
ద్వివిధమగుఁ బ్రభునామాంత - విరమణంబు
మహి నయోధ్యకు రాజు రా - మన యనంగ
నతని పట్టపుదేవి సీ - తమ యనంగ.
    (అనంతుని ఛందము)
116
మ. ఘనుఁడన్‌ వేములవాడ వంశజుఁడ దా - క్షారామ భీమేశ నం
దనుఁడన్‌ దివ్య విషామృత ప్రకట నా - నా కార్యధుర్యుండ భీ
మన నాపేరు వినంగఁ జెప్పితిఁ దెలుం - గాధీశ! కస్తూరికా
ఘనసారాది సుగంధ వస్తువుల వే - గందెచ్చి లాలింప రా.
    (భీమకవి చాటుధార)
117
5.4.14. విభాగయతి
తే. సంఖ్యకుం బరిమాణ సం - జ్ఞకుఁ దనర్చు
శబ్దములపై విభాగోక్తి - సరణి సంఘ
టించినప్పుడు యతులు రెం - డేసి యగు ను
పేంద్రుఁడిచ్చుధనము మోపెఁ - డేసి యనఁగ.
    (అనంతుని ఛందము)
118
క. ఆ సేనలఁ గని కినిసి మ
హాసాయక వృష్టి ముంచి - యధికులపై నే
డేసి పదేసి మఱియు నూ
ఱేసి శరములు నిగిడించె - రిపుల దరంగన్‌.
119
5.4.15. సౌభాగ్యయతి
తే. ఉభయములుసెల్లు యతులు రెం - డొక్క పదము
నందు నెలకొన్న సౌభాగ్య - యతి సెలంగుఁ
బ్రాంచితామర వినుత వే - దండ వరద
నాకరిపుశిక్ష శౌరి య - నంత యనఁగ.
    (లక్షణ చూడామణి)
120
క. భండనమున నెదిరిన రిపు
మండలముల నెల్లఁ గినిసి - మర్దించి మదో
ద్దండుండై కవ్వడి మా
ర్తాండసుతుం దొడరి పోరె - నాకులు మెచ్చన్‌.
    (భారతము)
121
5.4.16. ప్రాసయతి
తే. పాకశాసన సుతుఁడు లో - కైక వీరుఁ
డనఁగఁదగు బ్రాస విరతు లి - ట్లలరునేనిఁ
జారుతరహాసకీర్తి ప్ర - చారుఁ డనఁగఁ
బ్రాసయతిగాదు వర్గువు - పంకజాక్ష.
    (లక్షణ చూడామణి)
122
5.4.17. భిన్నయతి
క. అంచిత తిలకము శౌరి ధ
రించె ననఁగ జగణమధ్య - రేఫ విరతి యై
యంచిత తిలకము హరి ధరి
యించె ననఁగ భిన్నవడికి - నిత్యము వచ్చున్‌.
    (అనంతుని ఛందము)
123
5.4.18. ప్రాదియతి
క. ప్రపరాపసమను సుప్ర
త్యపి నిర్దు రధిన్యు పాభ్యు - దాజ్‌ వ్యత్యవ ప
ర్యుపసర్గ దింశతికి వ
ళ్లుపరిస్వరయుక్తమైన - నుభయము చెల్లు\న్‌.
    (భీమన ఛందము)
124
5.4.19. అభిన్నయతి
క. ఇంచి యును నచ్చుహల్లు ను
దంచితముగ సంధిఁ గూడు - నప్పు డభిన్నం
బెంచఁగ బాలుఁడు హరిఁ బలి
కించెననన్‌ రెండుఁ జెల్లు - నెలమిం గృతులన్‌.
    (లక్షణ చూడామణి)
125
క. మించి మదించిన రిపుల హ
రించక సత్కీర్తి యీ మ - హీతల మెల్లన్‌
నించక దీనుల దయఁ బో
షించక ప్రఖ్యాతి గల్గు - నే నరనాథా!
    (దశకుమార చరిత్రము)
126
క. భిన్నయతి జగణమధ్య మ
భిన్నము దక్కిన గణాళిఁ - బెంపెనసినచోఁ
భిన్నమున హల్లు చెల్లు న
భిన్నమునకు రెండుఁ జెల్లు - బీభత్సనుతా!
127
క. పంచశరుండనఁగను జా
లించిమహాప్రథన భూమి - నీక్షించి మదో
దంచితుఁడై శంఖముఁ బూ
రించెం గులఁగిరులు దిక్క - రివ్రజ మడఁగన్‌.
    (ప్రద్యుమ్నోపాఖ్యానము)
128
క. కాంచన చేలుని దమి నుతి
యించె ననఁగ భిన్న విరతి - యే పారుఁ గృతిన్‌
గొంచక పోషించె న్విను
తించె నన నభిన్న విరతి - యిటులు సెలంగున్‌.
    (లక్షణ చూడామణి)
129
5.4.20. అభేదయతి
క. 'వపయో రభేద' యనియెడు
నెపమున పఫబభలు వాకు - నేర్పున వడిగా
నుపమింపవచ్చుఁ గృతులం
దుపనిషదుచితార్థ సూక్తు - లొలసిన చోటన్‌.
130
తే. లలిత వీణారవంబుతో - డక్కసరియె
రమ్యమణిరాజరాజితో - లక్కసరియె
భరిత భువనార్ణవంబుతో - వంక సరియె
ననఁగను నభేద నామాఖ్య - యతులు సెలఁగు.
131
5.4.21. వృద్ధియతి
క. ఏకైకము సోదన నా
కౌకసులను శబ్దములకు - నచ్చటి వడిగా
ఐకారౌకారంబులు
గైకొనఁ జను వృద్ధివళ్లు - కవు లొడఁబడఁగన్‌.
    (కావ్యాలంకార చూడామణి)
132
శా. నీ కంఠార్పిత కాలపాశము శిరో - నిర్ఘాతపాతంబు లం
లౌక స్సంచయ కాలరాత్రి గళ బ - ద్ధోదగ్ర కాలాహి క
న్యా కారాగత మృత్యువున్‌ జనక క - న్యన్‌ వేగ నొప్పించి లో
కైక త్రాణుని రామునిం గనుము నీ - కీ బుద్ధి గాకుండినన్‌.
    (భాస్కర రామాయణము)
133
5.4.22. నిత్యసమాసయతి
తే. పదము విభజించి చెప్పఁ జొ - ప్పడని యదియు
నన్య శబ్దంబుఁ గొని విగ్ర-హంబుఁ జెప్పు
నదియు నిత్యసమాసమై - యతులఁ గృతుల
నంటి సంధిని నచ్చు హ - ల్లైన విరతి.
    (అనంతుని ఛందము)
134
క. శ్రీ కంఠుఁ డెదురునపుడు వ
నౌకోధ్వజ మింద్ర మకుట - మర్జున తురగా
నీకము దివ్యశతాంగము
నా కవ్వడి కబ్బియున్న - నతఁడే మనునో.
    (అధర్వణ భారత విరాతపర్వము)
135
5.4.23. ప్లుతయతి
క. ప్లుత మనఁ బరఁగుఁ ద్రి మాత్రా
న్విత వర్ణము దానిమీఁది - విదిత స్వరముల్‌
కృతి నయ్యక్షరములు చనుఁ
జతురానన సదృశ వళ్ళు - చక్కటి కెల్లన్‌.
    (భీమన ఛందము)
136
క. దూరాహ్వానమునందు మ
హారోదన గాన సంశ - యార్థముల తుదిన్‌
జేరువనగు నాద్యచ్చుల
నారూఢిం బ్లుతము వడి మ - హత్వము మెఱయన్‌.
    (భీమన ఛందము)
137
5.4.24. ఆదేశయతి
క. ద్వీపమునకు నాకమునకు
నాపై శాస్త్రోక్తి నచ్చు - లా దేశ సమా
సాపత్తి గలుగుటయు వళు
లాపాదింపుదురు గొంద - ఱచ్చును హల్లున్‌.
    (కావ్యాలంకార చూడామణి)
138
ఉ. ద్వీపుల ద్రుంచి విశ్వ జగ - తీ ధరుఁ డు త్తమమైన జాంబవ
ద్వీపమునందు గోవులకు - నిమ్ముగఁ జేయుటయుం బ్రసిద్ధమై
గోపతి ధేను వవ్విభున - కున్‌ ధనమిచ్చిన నిచ్చెఁగాక యే
భూపతు లివ్వదాన్యగుణ - బుద్ధిఁ బ్రసిద్ధి వహించి రుర్వరన్‌.
    (కావ్యాలంకార చూడామణి)
139
క. నీ కరవాల నిహతులై
నాకంబున కేఁగి రాజ - నారాయణ! యో
భూకాంతు లెంత చలమో
నాకవిటోత్తములఁ దూల - నాడుదు రెలమిన్‌.
    (కావ్యాలంకార చూడామణి)
140
ఉ. ఓ కమలాక్ష! వింటివె సు - యోధనుతోఁ గురుసేన లెల్ల జీ
కాకు పడంగ ధర్మజుఁడు - కౌతుకమందఁగ నీవు మెచ్చఁగా
నాకవిభుండు లేఖతతి - యచ్చెరుపాటున నన్నెచూడ నే
నే కమలాప్త పుత్త్రు వధి - యించెదఁ గార్యము నిర్వహించెదన్‌.
    (భారతము)
141
5.4.25. వికల్పయతి
తే. హయుత వర్గువులు వికల్ప - యతులఁ జెల్లు
దేవకీ నందనుఁడు జగ - ద్ధితుఁ డనంగ
హలధరుఁడు సంగరాంగణో - ద్ధతుఁ డనంగ
నవని మోచినయవి కకు - బ్భస్తు లగఁగ.
    (అనంతుని ఛందము)
142
క. నుతకీర్తివడసి సుజన ప
ణితులై వర్ధిల్ల దుష్ట - నిగ్రహ శిష్ట
ప్రతిపాలకులై త్రిజగ
ద్ధితముగ నేలంగఁ గదు మ - హీతల మెల్లన్‌.
    (దశకుమార చరిత్రము)
143
5.4.26. కాకువడి
తే. వరుస దీర్ఘాంతసంబుద్ధి - వచన యతుల
కమరుఁ గృతులందుఁ గాకుస్వ - రము సహస్ర
నామ శోభిత గోప కృ - ష్ణా యనంగ
నమరవందిత గోప కృ - ష్ణా యనంగ.
    (అనంతుని ఛందము)
144
క. కాకుస్వర యతులగు నితఁ
డే కదలక జలధిఁ బవ్వ - ళించె ననఁగ, బ్ర
శ్నాకలిత దీర్ఘమగు నితఁ
డే కవ్వడి రథముఁ గడపె - నిమ్ములననఁగ\న్‌.
    (అనంతుని ఛందము)
145
5.4.27. రివడి
క. విలసదృకారమ్మును మఱి
రిలవి విరమ మొందు శౌరి - ఋషులకు శశ్వ
త్సులభుఁ డనఁగ ఈ ఏలకుఁ
దలఁపఁగ రీతోడి విరతి - దలకొన దెందున్‌.
    (అనంతుని ఛందము)
146
5.4.28. అఖండయతి
ఉ. మానుగ విశ్రమాక్షర స - మన్వితమై సర్వమూఁదినం దదీ
యాను గుణాక్షరంబె కొని - యైనను జెప్పఁగవచ్చు నీ క్రియన్‌
భాను సహస్రిభాసి వృష - భాధిపుఁ డన్నటు లర్థయుక్తమై
పూనినచో నఖండయతి - పొల్పగు నాది కవి ప్రణీతమై.
    (భీమన ఛందము)
147
ఉ. అన్నపు తండ్రి యట్ల విను - మంతియకాదట మీఁద రాజ వే
మన్నఁ గొఱంత లేదు మణి - మండన ముఖ్యము లైన కానుకల్‌
మున్నుగ సీత నిచ్చి జన - లోకపతిం గని నన్నుఁ బ్రోవు మీ
సన్నపుఁ గార్యము ల్వలదు - సందియమే లటుగాక తక్కినన్‌.
    (భాస్కర రామాయణము)
148
క. పూనుకొని యక్ష శబ్దము
పై నూహిని శబ్దమున్నఁ - బటు వృద్ధి యగు\న్‌
మానుగ గుణముం జెల్లును
దాన నఖండంబు స్వరము - దనరున్‌ గృతులన్‌.
149
ఆ. లక్షణాన్వితముగ - నక్ష శబ్దంబుపైఁ
దనర నూహినను ప - దంబు వెలయు
నపుడు వృద్ధిసెప్ప - నగు గుణంబును జెల్లు
నాగుణం బఖండ - మై చెలంగు.
    (కవిజన సంజీవని)
150
5.4.29. ఉభయయతి
ఆ. యుష్మ దస్మ దనెడు - నుభయంబునకుఁ బొల్చు
నచ్చు గూడి ద్వివిధ - మయ్యె విరతి
తరమె కృష్ణ యుష్మ - దవతారకథనంబు
లభినుతింప నస్మ - దాదులకును.
151
5.4.30. యవర్గయతి - 5.4.31. శవర్గయతి
క. య శ వర్గ ద్వయమునకును
విశదము దమ యక్షరములు - వెలయఁగ వళ్ళౌఁ
గుశలమగు పదము ధరలో
శశి నౌదలఁ దాల్చు నతఁడు - హరుఁ డను మాడ్కిన్‌.
152
5.4.32. జ్ఞావడి
గీ. అప్రసిద్ధము ఙ ఞ లు శ - బ్దాదియందు
ఞా ఙ సంయుక్తి తద్భవ - వ్యాజమునను
నణలతోఁ బొందు విరతి యా - జ్ఞప్తి యనఁగ
జలరుహాక్షా శ్రితులును సు - జ్ఞానులనఁగ.
    (అనంతుని ఛందము)
153
ఆ. యజ్ఞమునకు జన్న - మాజ్ఞప్తి కానతి
యాజ్ఞ కానసంజ్ఞ - కరయ సన్న
విన్నపంబునగును - విజ్ఞాపనమునకు
జ్ఞాకుఁ దద్భవంబు - నా ధరిత్రి.
    (అనంతుని ఛందము)
154
ఉ. శ్రీలలనా తనూభవ వి - శేష జగన్మయమూల మన్మథా
జ్ఞాలతికాలవాల రతి - నాథ కరాళ మదాంధ గంధ శుం
డాల విలోల తద్భుజక - సత్కరవాల విశాల శుభ్రవా
తూల మదీయకాంత ధృతి - దూలఁగ నేపున వీవకుండుమీ.
155
5.4.33. సరసస్వరయతి
క. ఇరుగడల హల్లునొందిన
నొరపుగ నొకచోటఁ బొంది - యున్నను స్వరమౌ
విరసముగ నచ్చులున్నన్‌
సరస విరామం బటండ్రు - జలరుహనాభా!
156
గీ. ప్రాదినిత్య సమాస శ - బ్దములు గాక
పెఱ పదంబులపై నచ్చు - బెరసినప్పు
డన్నియును స్వరయతులగు - సాంబగురుఁడ
యింద్రుఁ డమరాన్వయాబ్ధిపూ - ర్ణేందుఁ డనఁగ.
    (అనంతుని ఛందము)
157
5.4.34. లుప్తవిసర్గకస్వరయతి
తే. స్వరము తుదనుండి లుప వి - సర్గకోత్వ
మైన స్వరవిరామంబు దా - సోఽహ మనఁగ
నచ్యుతాశ్రితు లుర్వి న - న్యోన్యమిత్రు
లన ముకుందుండు విమల య - శోఽర్థి యనఁగ.
    (అనంతుని ఛందము)
158
5.4.35. నిత్యయతి
ఆ. ఏని యనుపదంబు - తో నాదివిధమంది
సంధి నిత్యయతుల - జరుగుచుండు
నెట్టి క్రూర కర్ముఁ - డేని సద్గతి నొందు
నిన్ను నాత్మఁ దలఁచె - నేని కృష్ణ.
    (అనంతుని ఛందము)
159
5.4.36. అనునాసికవికల్పయతి
గీ. నలిఁ గకార హిల్లిత రాను - నాసికాఖ్యఁ
గదిసి తత్పంచమముగా వి - కల్పవిరతి
గలుగుఁ జక్రివల్లవ సుదృ - ఙ్మథుఁ డనంగఁ
గమల నేత్రుండు సకల ది - ఙ్మహితుఁ డనఁగ.
160
క. మగతనముఁ జూపఁజాలక
మగఁటిమి చెడి విఱిగి పాఱు - మన సైన్యములో
జగదక్షుఁడు రుచిచేఁ బ్రా
ఙ్నగమున వెలుంగొందు రీతిఁ - గవ్వడి పొలిచెన్‌.
161
5.4.37. ఌకారయతి
తే. మును ఋకార మీ ఏలతో - నొనరి నట్లు
చేర దొకట యణాదేశ - కారణమున
ఘన లకారంబ యగును ఌ - కార విరతి
కౢప్తిలేదు శౌరి గుణావ - ళికి ననంగ.
    (అనంతుని ఛందము)
162
5.4.38. పరరూపయతి
తే. స్వాంత వేదండ మార్తండ - శబ్దములకు
యతులు నుభయంబులగు బుధ - స్వాంతములకు
నతి సుఖావహుఁ డెపుడు వే - దండవరదు
డనఁగ హరి దైత్యతిమిర మా - ర్తండుఁ డనఁగ.
    (కవిజన సంజీవని)
163
5.4.39. ఱావడి
క. ధారుణి ఱావడి యనఁదగు
ఱా రేఫకు రేఫ ఱాకు - రహి వడిఁ దనరున్‌
నీరమ్యకీర్తి నగుఁ దా
రారాజన్‌ నలువబలుగు - ఱాలుననంగన్‌.
164
క. తెంపును బెంపును గదుర ని
లింపులు వెఱఁగంది చూడ - రిపుసైన్యము లుం
గంపింపఁ దనబలంబులు
ఱంపిలి బిట్టార్వ సింధు - రాజుం దాఁకెన్‌.
    (భారతము)
165
AndhraBharati AMdhra bhArati - bhAshha - ChaMdassu - sulakShana sAramu - vishhaya sUchika - liMgamaguMTa timmakavi - sulaxaNa sAramu vellaMki tAtaMbhaTTu andhra telugu tenugu ( telugu andhra )