భాష ఛందస్సు సులక్షణసారము
9. గణ సంయోగములు
9.1. మగణ సంయోగము
క. మగణంబు పద్య ముఖమున
నగణితముగఁ గూర్చి చెప్ప - నగుఁ గృతియొండెన్‌
దగఁ బద్యమొండెఁ గర్తకు
నగణితముగ నొసఁగు నాయు - రైశ్వర్యంబుల్‌.
    (భీమన ఛందము)
219
క. జగతికి గణముల కెల్లను
మగణము గారణము గాన - మగణము గదియన్‌
నిగిడించిన గణ మెల్లను
దగ శుభ మొనరించుఁ గీడు - దగులదు దానన్‌.
    (కావ్యచింతామణి)
220
క. మించిన పరుసము లోహముఁ
గాంచనముగఁ జేయునట్టి - కైవడి గణముల్‌
మంచివి గానివి యైనను
మంచివియై వెలయుఁ జేయు - మగణము పతికిన్‌.
221
క. మగణముతోఁ బద్యాదిని
మగణము గదిసినను ధరణి - మండల మెల్లన్‌
బొగడొంద నేలుఁ గృతిపతి
సగణము గదిసినను గీర్తి - జగముల వెలయున్‌.
222
క. మించులు గిరికొనుముత్యము
గాంచనముం గదిసినట్టి - గతి నల యగణం
బంచితముగఁ దనుఁగదిసిన
మంచిదియై లక్ష్మినొసఁగు - మగణము పతికిన్‌.
223
క. ముందట నిల్పిన మగణము
క్రిందన్‌ జగణంబుగదియఁ - గీలించిన మే
లొందున్‌ సగణం బటువలెఁ
బొందించిన విభుఁడు రిపులఁ - బోర జయించున్‌.
224
క. మగణం బెప్పుడు శుభకర
మగు నైననుఁ గ్రూరగణము - నది డాసినచోఁ
దెగి చంపు బుధుఁడు క్రూరుం
డగు గ్రహముం గదిసి క్రూరుఁ - డై చనుమాడ్కిన్‌.
    (భీమన ఛందము)
225
9.2. యగణ సంయోగము
క. శంకింపక యగణముతోఁ
బంకజహితగణము గదియఁ - బద్యము జెప్పన్‌
బొంకముసెడి విభుఁ డొరులకుఁ
గింకరుఁడైఁ దిక్కులేక - గీడ్పడి యుండున్‌.
226
9.3. రగణ సంయోగము
క. పొగడొందఁ బద్య ముఖమున
రగణము యగణంబుఁ గూడి - రాజిల్లినచో
జగమంతయు నేలెడి వాఁ
డగుఁ గృతిపతి విభవయుక్తుఁ - డగుఁ గవివరుఁడున్‌.
    (భీమన ఛందము)
227
క. ఇంగల రగణము జగణము
సంగడమున నొండెఁ దగణ - సంగతి నొండెన్‌
మంగళకరమని పద్యము
ముంగల జెప్పుదురు సుకవి - ముఖ్యులు గృతులన్‌.
228
క. అన లానిల సంయోగం
బనుపమ కీలా కరాళ - మగు వహ్నిభయం
బొనరించుఁ గర్తృగృహమున
కనుమానము లేదు దీన - నండ్రు కవీంద్రుల్‌.
    (అధర్వణుని ఛందము)
229
క. రగణంబును సగణంబును
జగణముఁ బద్యాది నిల్పఁ - జన దెవ్వరికిన్‌
దగదనక యనియె నిల్పిన
మిగులం బతి కవయుఁ జెడుగు - మేదిని లోనన్‌.
230
9.4. సగణ సంయోగము
క. మునుకొని పద్య ముఖంబున
ననిలగణం బిడిన నాయు - రారోగ్యములున్‌
గొనసాగు, దానిముందట
ననలగణం బిడినఁ బతికి - నలజడి సేయున్‌.
    (భీమన ఛందము)
231
క. మారుతగణంబు సంప
త్కారణమగు జతగణములఁ - గదిసినచో నా
మారుతగణంబు జతగా
నా రవిగణమున్నఁ బతికి - నలమటవచ్చున్‌.
232
క. మారుతగణంబు జత నం
గారపుగణమున్నఁ బతి మృ - గంబుల చేతన్‌
జోరులచే శత్రులచే
ధారుణిఁ జెడు మందిరంబు - దరికొని కాలున్‌.
233
9.5. తగణ సంయోగము
క. తగణంబున కధిదైవము
గగనం బది శూన్యమగుచుఁ - గాదని పలుకన్‌
దగ, దది మిక్కిలి మంచిది
గగనం బొగి నిత్య విభవుఁ - గాఁ జేయు నిలన్‌.
    (కావ్య చింతామణి)
234
క. ఆది తగణ మొప్పు - నది దేవతా గణం
బరసి చూడ దాని - కమరగురుఁడు
గ్రహము గానఁ బద్య - గద్య ముఖంబుల
మంచిదనుచు భీము - డెంచినాఁడు.
235
క. అగణిత పద సంపత్కర
మగుఁ దగణము దానిపజ్జ - నమరిన గణముల్‌
వెగటుగుణంబులు మానుఁ జె
లఁగుచు\న్‌ సౌఖ్యంబు లొసఁగు - లలిత చరిత్రా.
236
క. తగణంబు దొలఁతఁ బిమ్మట
భగణంబును గదియనిల్పి - పద్యము హృద్యం
బుగ రచియించిన కర్తకు
నగణితముగ నొసఁగు నాయు - రైశ్వర్యంబుల్‌.
    (భీమన ఛందము)
237
క. మొగివాత తగణముండిన
వగవక యగణంబు దాని - వద్దనె నిలుపన్‌
దెగి తన్నుఁ జంపఁ దలఁచిన
పగవారికైనఁ దగదు - పద్యముఁ జెప్పన్‌.
238
క. ఆరోగ్యకరుఁడు భాస్కరుఁ
డారయ జగణమున కొడయఁ - డది మొగి నిడఁగా
నేరోగముపైకొన దా
చేరువ చుట్టంపుగణముఁ - జేకొనఁ జాలు\న్‌.
239
9.6. జగణ సంయోగము
క. అవివేకులు జగణంబును
భువి రోగము సేయుననుచుఁ - బోనాడుదు రీ
కవివరులు\న్‌ శబ్దార్థము
వివరింపరు రుక్కు దీప్తి - విదితముగాఁగన్‌.
    (కావ్యచింతామణి)
240
క. తగణంబుఁ గదిసి చంపును
రగణముతోఁ గదిసి ఘోర - రణ మొనరించు\న్‌
భగణ మిఁక నొక విచిత్రము
మగణముతోఁ గూడఁ గాల - మానము పతికి\న్‌.
241
క. రాజులకు జగణరగణము
లోజం గీలించి సుకవి - యొసఁగిన పద్యం
బాజిని జయమీఁ జాలును
దేజీ లేనుఁగులు భటులుఁ - దేరులు నేలా!
242
9.7. భగణ సంయోగము
క. భగణంబు సకల శుభములఁ
బొకడొందగఁ జేయు దానిఁ - బొందిన గణముల్‌
మిగుల శుభంబుల నొసఁగును
యగణంబు సువర్ణకారి - యగుఁ బద్యాదిన్‌.
243
9.8. నగణ సంయోగము
గీ. పర్వతములందు మేరువు - భాతియగుచు
సర్వసురులందు శంకరు - సామ్యమగుచు
నరయ మృగములయందు సిం - హంబుకరణి
గణములందెల్ల నగణంబు - గరిమఁగాంచు.
    (అధర్వణుని ఛందము)
244
క. ఏగణము గదియు నగణం
బాగణము సమస్త మంగ - ళావాప్తంబై
రాగిల్లు నినుము పరుసపు
యోగంబునఁ బసిఁడివన్నె - నూనిన భంగిన్‌.
    (భీమన ఛందము)
245
9.9. గణ సంయోగ ప్రభావము
క. చందనతరు సంగతి పిచు
మందంబులు పరిమళించు - మాడ్కి నమందా
నందకరమైన గణముల
పొందున దుష్టగుణవర్ణ - ములు ప్రియమిచ్చు\న్‌.
    (ఉత్తమగండచ్ఛందము)
246
గీ. పరుసవేదితోడఁ - బెరసినలోహంబు
జాతరూపమైన - చందంబున
సారమైన గణము - సంగతిఁ దనకీడు
మాని దుష్టగణము - మంచి దగును.
247
9.10. గణ సంయోగ విశేషములు
క. రసలం జెప్పినఁ జిచ్చగు
జసలం జెప్పినను దెవులు - చయ్యనవచ్చు\న్‌
తసలం జెప్పిన మేలగు
మసలం జెప్పినను గర్త - మండలమేలు\న్‌.
    (భీమన ఛందము)
248
క. సయలం జెప్పిన శుభమగు
జయల\న్‌ జెప్పినను బతికి - జయకీర్తులగున్‌
రయల\న్‌ జెప్పిన నెంతయుఁ
బ్రియమగు మఱిమయలఁ జెప్పఁ - బెంపొనరించు\న్‌.
249
క. సభలం జెప్పిన విభవము
రభలం జెప్పినను జెట్ట - రయమున వచ్చున్‌
శుభమగు మయలం జెప్పిన
నుభయము వర్తిల్లునందు - రుత్తమచరితా.
    (భీమన ఛందము)
250
ఆ. సగణమగణములు పొ - సంగిన విభవంబు
రసగణంబు లెనయఁ - బ్రబలుఁ గీడు
రగణ యగణయుతము - రాజ్యప్రదంబగు
భయము లిరువురకును - భయము లిడును.
    (కవిసర్పగారుడము)
251
క. యగణముతో యగణంబును
జగణముతో జగణములును - సగణముతోడన్‌
సగణంబును రగణముతో
రగణంబును గూర్చి చెప్ప - రాదయ్యెడలన్‌
252
9.11. నక్షత్ర గుణదోషములు
క. కమలహితుఁడున్న నక్ష
త్రము మొదలుగ నేడు దోష - తమములు నడుమన్‌
ప్రమదప్రదములు పండ్రెం
డమరఁగ నశుభములు తొమ్మి - దగుఁ బద్యాదిన్‌.
    (కవిగజాంకుశము)
253
9.12. జీవ నిర్జీవ నక్షత్రములు - తత్ఫలములు
క. విదితముగ రాహుభుక్తిని
నొదవిన పదమూఁడు జీవ - యుక్తములం దు
న్నది యావల నెరితారలు
పదునాలుగు మృతములనఁగఁ - బడు నెల్లెడలన్‌.
    (శ్రీధరచ్ఛందము)
254
క. పతి మృతుఁడగుఁ బద్యాదిని
మృత నక్షత్రంబు నిడిన - మేదురసౌఖ్యా
న్వితుఁడగు నమృతములన న
ప్రతిమములగు తారకములఁ - బద్యాది నిడన్‌.
    (కవిగజాంకుశము)
255
క. మొదలనె జీవగణం బిడఁ
గొదలేక కృతీశుబ్రదుకు - గొనసాగు మదిన్‌
వెదకక నిర్జీవగణం
బదికిన నపుడా కృతీశు - కాయువు దఱుఁగున్‌.
256
9.13. దగ్ధజ్వలిత ధూమిత నక్షత్రములు
క. క్రూర గ్రహ ముక్తములగు
తారలు దగ్ధములు, ధూమి - తంబులు వానిన్‌
జేరి యెదురెదుర నున్నవి
క్రూర గతంబులని యెఱిఁగి - కొను జ్వలితంబుల్‌.
    (గోకర్ణ చ్ఛందము)
257
ఆ. ధనముఁ గోలుపుచ్చు - దగ్ధనక్షత్రంబు
చావుచేటుఁదెచ్చు - జ్వలిత తార
ధూమితంబు మారి - తునిజేయు నెప్పుడు
గాన మొదల నిల్పఁ - గాదు వీని.
    (అధర్వణుని చ్ఛందము)
258
క. కృతి మొదల దగ్ధతారయుఁ
బతి సతి దుఃఖితుని జేయుఁ - బ్రజ్వలితంబున్‌
మృతిఁ బొందించును మఱి ధూ
మిత నక్షత్రంబు నతని - మే నలయించున్‌.
259
క. పతితారకు సంబంధ
స్థితితారకుఁ జెల్లు కీడు - చింతింపక దు
ర్మతిఁ గవిత చెప్పఁ దివిరెడు
నతఁడె సుమీ కవిపిశాచ - మారయ నుర్విన్‌.
260
9.14. గణ గ్రహ మైత్రి
క. మగణాది గణంబులకును
బగయును మైత్రియు నెఱుఁగఁ - బడు సుకవులకున్‌
జగమునఁ దత్తద్గ్రహముల
పగయును మైత్రియును శాస్త్ర - పద్ధతిఁగనఁగాన్‌.
261
9.15. శుభ పాప గ్రహములు
ఉ. వారిజమిత్త్రసూనుఁడును - వారిజమిత్త్రుఁడు భూమి పుత్త్రుడున్‌
గ్రూరులు; వారిఁ జేరునెడఁ - గ్రూరుఁడు చంద్రతనూభవుండు; బృం
దారక రాజమంత్రియును - దైత్యగురుండును సౌమ్యుఁడ వ్విధుం
డారయఁ గృష్ణపక్ష తిథు - లందు శుభప్రదు లెన్ని చూడఁగన్‌.
262
క. తొలుత గణగ్రహమైత్త్రులు
దలఁపఁ ద్రికోణాధిపతులు - తత్తద్గ్రహ రా
సుల గణము వారణమ్మునఁ
గలసిన చుట్టంబులవియె - గ్రహగణమైత్త్రుల్‌.
263
ఆ. ఏ యవస్థనుండి - యే వేళనే గ్రహ
మే శుభాశుభంబు - లిచ్చుచుండు
నా యవస్థనుండి - యా వేళ నా గణ
మా శుభాశుభంబు - లందఁజేయు.
264
ఆ. గ్రహము పొత్తుకలిమి - గల గణసంగతి
నుండి క్రూరగ్రహము - నొందు శుభము
గ్రహము పొత్తులేని - గణముతోఁ బద్యాదిఁ
గూడి మంచిగణము - కీడు సేయు.
265
9.16. గ్రహముల ఛాయలు
ఆ. శుక్రశశులు తెలుపు - శోణిత వర్ణులు
తరణికుజులు బుధుఁడు - సురగురుండు
పసిఁడి వన్నెవారు - భానుజరాహులు
సలిల జలధరంబు - ఛాయవారు.
266
చ. ఉడుపతి యేగ్రహంబుకడ - నున్నను దానును వాని వన్నెయున్‌
నడుమను నా శుభంబుగ గ - ణంబుల లోపలనే గణంబుసం
గడి భగణంబు నిల్పు నధి - కంబుగ నాఫల మిచ్చు నవ్విధుం
దొడయడు గాన దానికిని - యుక్తమ యండ్రు కుయుక్తులేటికిన్‌.
267
ఆ. శ్వేత చంద్రుఁడయిన - సేమంబుఁ గావించు
రక్తచంద్రుఁడయిన - రణమొనర్చుఁ
గృష్ణచంద్రుఁడయిన - గ్రూరత లొడఁగూర్చు
బీతచంద్రుఁడయినఁ - బ్రీతినిచ్చు.
268
9.17. కృతి రచనకుఁ బ్రశస్త వారములు
క. శుక్ర గురు బుధవారముల్‌ - సొంపు సేయు
సోమవారంబు సంపదల్‌ - సొరిది నిచ్చు
శనియు మంగళవారముల్‌ - చావుదెచ్చు
భానువారంబు సంగరం - బమరఁ జేయు.
269
క. తలపోసి గద్యపద్యా
దుల నక్షరగణములకును - దొరఁకొని మైత్రుల్‌
గలుగఁగఁ జెప్పిన హస్తా
మలకముగాఁ దగుఫలంబు - మహి నిర్వురకున్‌.
270
క. పొందెఱిఁగి యానుకూల్యము
నొందంగాఁ గూర్చి తగఁ బ్ర - యోగించి కృతుల్‌
సందర్భించు గణాక్షర
బృందం బిరువురకుఁ జాలఁ - బ్రీతియొనర్చున్‌.
271
క. శ్రీసర్వజ్ఞాంచితరస
నా సంవాసిత విశేష - నామ బహువిధా
వాస! సులక్షణసారం
బా సో మార్కముగ నిల్పు - మననిసుతేశా!
272
మ. కరుణాబంధుర! కామదాయి! - కితవఘ్నా! కీశసేవ్యా! కుభృ
ద్వర! కూలంకష కీర్తి! కేవల! - కృతార్థా! కైకసీపుత్త్ర రా
జ్వరమాస్థాపక కోటిసూర్యనిభ! - కౌసల్యాత్మజా! కంబుకం
ధర! కర్ణాంత విశాలనేత్ర! రఘునాథా! భక్తచింతామణీ!
273
AndhraBharati AMdhra bhArati - bhAshha - ChaMdassu - sulakShana sAramu - vishhaya sUchika - liMgamaguMTa timmakavi - sulaxaNa sAramu vellaMki tAtaMbhaTTu andhra telugu tenugu ( telugu andhra )