దేశి సాహిత్యము జానపద గేయములు పాతపాటలు
శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావు

ఉపోద్ఘాతము

ఈపాతపాటలు నా పెద్దకుమారుడు టేకుమళ్ల కామేశ్వరరావు, బి. ఏ., కష్టపడి సేకరించినవి. అతనికి చాలకాలమునుండియు నిట్టిపాటలను, సామెతలను, కథలను, జాతీయములను (Idioms) కూర్చి యుంచుకొనుట యొక యభిమాన కార్యముగా నుండెను. ఈ పాతపాటలలో జాలవఱకు నాతల్లిగారి నోటనుండి వ్రాసికొనెను. కొన్నిటిని విజయనగరమునందును, మరికొన్నిటిని నెల్లూరునందును సంపాదించెను.

అతను సుమారు రెండువేలకంటె నెక్కుడుగా తెలుగు సామెతలను, లోకోక్తులను సమకూర్చెను. ఇవిగాక ఆంధ్రజాతీయములు (Telugu Idioms) చాలయున్నవి. ఈ జాతీయములు చాల చిత్రముగ నుండును. బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు, స్త్రీలు, పురుషులు మున్నగువారు మాట్లాడుచున్నప్పుడు స్వభావ సిద్ధముగాను, అనాలోచితముగాను వారి సంభాషణలయందు వాడుకచేయబడు ప్రత్యేక విలక్షణ ప్రయోగములు వీనియందు గాన్పించుచుండును. వీని నన్నిటిని సంధానించుట కితను చాలకాలము నిరాడంబరమైన పరిశ్రమ చేయవలసి వచ్చెను.

అతను సేకరించిన భాషావస్తుసముదాయములో పాతపాటలను మాత్రము ప్రస్తుతము భారతి పత్రికలో ముద్రించుటకు పత్రికాధిపతు లంగీకరించిరి. ఇందలి జోలపాటలను ప్రచురించుటకు ముఖ్యకారణము లేవనిన -

(౧)శిశుపోషణఁ జేసెడు తలిదండ్రులగు యువతీయువకులు తమపిల్లల నోదార్చుటకును, ఉబుసుపుచ్చుటకును, నిద్దుర పెట్టుటకును, యీ జోలపాటలను పాడిన నెక్కువ యుపయోగముగా నుండును.
(౨)ప్రస్తుతము ప్రాథమిక పాఠశాలలలో జదువుచున్న బాలురకును, బాలికలకును వాచకపుస్తకముల ననేకులు విద్యాధికులు వ్రాయుచున్నారు. అట్టి వాచక పుస్తకములలో శిశుతరగతి కుపయోగించెడు పాఠములు ముఖ్యముగా బాలగీతములు (Nursery Rhymes) రూపముగానుండుట చాల మంచిదని అనుభవైకవేద్యమైన విషయము. కావున వాచకపుస్తకములను వ్రాసెడు యుపాధ్యాయు లీజోలపాటలనుంచి వలసినవాని నేర్చి తీసికొనవచ్చును.
(౩)ఆంధ్రజాతీయత సర్వతోముఖముగా నభివృద్ధిబొందుటకు జనసామాన్యమందున్న యలేఖ్య పారంపర్య విద్య (Traditional lore) నశింపకుండ జాగ్రత పెట్టవలసియున్నది.

పైన జెప్పిన కారణములచేత నిటువంటి పాతపాటలను బాలగీతాభిమానులు సంపాదించి ప్రచురింతురుగాక!

టేకుమళ్ల అచ్యుతరావు.

AndhraBharati AMdhra bhArati - pAtapATalu - Tekumalla Kameshwara Rao - Tekumalla Achyuta Rao - dEshi dESi sAhityamu ( telugu andhra )