దేశి సాహిత్యము రగడలు నమశ్శివాయ రగడ
(శివమంత్ర వర్ణనము)
నమశ్శివాయ రగడ (శివమంత్ర వర్ణనము)
- రంగనాథ
క॥ శ్రీకాము లతుల కీర్తి
శ్రీకాము లుమాధినాథ చిత్తానంద
శ్రీకాములు సద్భక్తిం
జేకొనుఁడు 'నమశ్శివాయ' చెప్పెద మీకు\న్‌
1
నమశ్శివాయ
  శ్రీగిరీశ వశ్యమంత్ర సేకరము నమశ్శివాయ
ఆగమోపదిష్ట విధి మహాకరము నమశ్శివాయ
పంచవర్ణ పంచరూప భాసురము నమశ్శివాయ
అంచితానురక్త జిత గజాసురము నమశ్శివాయ
సునిశితోపనిష దధీత సుస్వరము నమశ్శివాయ
కనదనూన భక్తిరస వికస్వరము నమశ్శివాయ
పారలౌకిక ప్రధాన భాషణము నమశ్శివాయ
భూరిపుణ్య హేతుభూత భూషణము నమశ్శివాయ
సతత జన్మ దాహ దగ్ధ చందనము నమశ్శివాయ
నతవిశిష్ట భక్తబృంద నందనము నమశ్శివాయ
శ్రుతిశిర స్సహస్ర రత్న సుందరము నమశ్శివాయ
మత కుతర్క శరధి మథన మందరము నమశ్శివాయ
దారువన మునీంద్ర ముఖ్యధర్మము నమశ్శివాయ
దూర దూర హత నికృష్ట దుర్మదము నమశ్శివాయ
తరుణ చంద్ర జూట దర్ప దర్పణము నమశ్శివాయ
హరణ భరణ శక్తికృత సమర్పణము నమశ్శివాయ
పరమభక్త మహిత హిత విభావనము నమశ్శివాయ
చిరతర ప్రభావ భావజీవనము నమశ్శివాయ
వామదేవ తత్త్వ లేశ వాచకము నమశ్శివాయ
సోమపాన ఫల సహస్ర సూచకము నమశ్శివాయ
నరకహర విశిష్టమంత్ర నాయకము నమశ్శివాయ
ధరణిసుర సుధీ విధా విధాయకము నమశ్శివాయ
దారుణాధి జలధిమగ్న తారకము నమశ్శివాయ
కారణ ప్రధాన వస్తుకారకము నమశ్శివాయ
బాఢపాప ఘోరకృత్య పాచకము నమశ్శివాయ
మూఢ గూఢ మోహబంధ మోచకము నమశ్శివాయ
కర్మదోష హరవిచార కారణము నమశ్శివాయ
ధర్మ మర్మ మూలమంత్ర ధారణము నమశ్శివాయ
ప్రస్తవ ప్రశస్త భరణ పండితము నమశ్శివాయ
మస్తకాయమాన విభవమండితము నమశ్శివాయ
రక్త భక్త నిత్య సత్య రక్షణము నమశ్శివాయ
భక్తలోక హృదయశోక భక్షణము నమశ్శివాయ
భజనధన్య సుజన వజ్రపంజరము నమశ్శివాయ
కుజనదృష్టి దోషకంజ కుంజరము నమశ్శివాయ
సర్గదుష్ట దుష్టచిత్తశాసకము నమశ్శివాయ
భర్గరూప దుర్గ లసదుపాసకము నమశ్శివాయ
పురభి దభిమతానురక్త పోషకము నమశ్శివాయ
సురభవన కళంకపంక శోషకము నమశ్శివాయ
పాశుపత పథ ప్రవృద్ధ పాలనము నమశ్శివాయ
క్లేశపాశ వలన దళన ఖేలనము నమశ్శివాయ
యోగిహృదయ సదయ జల పయోధరము నమశ్శివాయ
భోగిభూష పక్షవిభవ భూధరము నమశ్శివాయ
దురితహత నికృష్టదుష్ట దుర్భరము నమశ్శివాయ
నిరతిశయ దయాశమాది నిర్భరము నమశ్శివాయ
భవవిపినా పౌక్ష దహన పాటవము నమశ్శివాయ
కవిముఖ ప్రసిద్ధ నియమ కాటవము నమశ్శివాయ
నికటపుణ్య తంత్రనిచయ నిశ్చయము నమశ్శివాయ
ప్రకటధీర భావభర తపశ్చయము నమశ్శివాయ
భూతనాథ చరణకమల పూజనము నమశ్శివాయ
ప్రాతత ప్రశస్త వస్తుభాజనము నమశ్శివాయ
శోషణాది శుద్ధికరణ శోధితము నమశ్శివాయ
పోషితాగమ ప్రమేయ బోధితము నమశ్శివాయ
ప్రసవశరవికార భావభంజనము నమశ్శివాయ
రసికభక్త రాజలోక రంజనము నమశ్శివాయ
కలుషగజనికాయ సింహగర్జనము నమశ్శివాయ
వలభిదాది చపల భజన వర్జనము నమశ్శివాయ
శరణగణ గణాధినాథ శాతనము నమశ్శివాయ
నరసురేశ వినుతనత సనాతనము నమశ్శివాయ
ఘనఘనాఘచండ విపినఖండనము నమశ్శివాయ
మననమథిత శివరహస్య మండనము నమశ్శివాయ
కుతలజాత భర్గరూప గురువనము నమశ్శివాయ
తతఫలప్రదాన కల్ప తరువనము నమశ్శివాయ
మారమథన పరులలోని మంతనము నమశ్శివాయ
చేరి శివునిఁ గొలుచువారి చింతనము నమశ్శివాయ
కలయవెదకి శ్రుతులు దొలుతఁ గన్నయది నమశ్శివాయ
ఒలసి మంత్రకోటి గొలువనున్న యది నమశ్శివాయ
నరకలోక వాసికైన నాకదము నమశ్శివాయ
విరసమతికి నైన నురువివేకదము నమశ్శివాయ
అల్ప పుణ్యమతుల కెందు నందనిది నమశ్శివాయ
కల్ప కోటిశతములందుఁ గందనిది నమశ్శివాయ
పురహరునకు మొదలఁ మొదలఁ బుట్టినది నమశ్శివాయ
పరమధర్మ నిరతు లర్థిఁ బట్టినది నమశ్శివాయ
శివుఁడజాది సురలకెల్లఁ జెప్పినది నమశ్శివాయ
కవసి వాసవాది సతులఁ గప్పినది నమశ్శివాయ
దురితహరుఁడు దొడవుగాఁగఁ దొడిగెడిది నమశ్శివాయ
కరణదుఃఖ మలినహతులఁ గడిగెడిది నమశ్శివాయ
ఓరవోక సర్పసమితి నుండెడిది నమశ్శివాయ
పారిజాత ఫలసమృద్ధిఁ బండెడిది నమశ్శివాయ
దురితవితతిఁ దూరుపాఱఁ దోలెడిది నమశ్శివాయ
వరములోలి నిచ్చుచోట వ్రాలెడిది నమశ్శివాయ
మునులు ఘనులు మించి తలఁచి మ్రొక్కెడిది నమశ్శివాయ
ఇనశశిశిఖి నయనవీథి నెక్కెడిది నమశ్శివాయ
ఓటలేక పుణ్యపథము లూఱెడిది నమశ్శివాయ
మేటిసుకృతకోటి నెల్ల మీఱెడిది నమశ్శివాయ
తిర మిడుకొని విబుధవరులఁ ద్రిప్పెడిది నమశ్శివాయ
గురుముఖ ప్రదత్తమగుచుఁ గ్రొప్పెడిది నమశ్శివాయ
బహువిధ ప్రమాదములను బాపెడిది నమశ్శివాయ
సుహితపుణ్య భోగపంక్తిఁ జూపెడిది నమశ్శివాయ
మూల మీ నమశ్శివాయ ముఖ్య మీ నమశ్శివాయ
శీల మీ నమశ్శివాయ శిఖర మీ నమశ్శివాయ
సుపథ మీ నమశ్శివాయ శుద్ధ మీ నమశ్శివాయ
నిపుణ మీ నమశ్శివాయ నిత్య మీ నమశ్శివాయ
గగన మీ నమశ్శివాయ గర్త మీ నమశ్శివాయ
నిగమ మీ నమశ్శివాయ నిఖిల మీ నమశ్శివాయ
వీర మీ నమశ్శివాయ విమల మీ నమశ్శివాయ
సార మీ నమశ్శివాయ సౌఖ్య మీ నమశ్శివాయ
ధనద మీ నమశ్శివాయ ధన్య మీ నమశ్శివాయ
జనన మీ నమశ్శివాయ జన్య మీ నమశ్శివాయ
యోగ మీ నమశ్శివాయ యోగ్య మీ నమశ్శివాయ
భోగ మీ నమశ్శివాయ భోగ్య మీ నమశ్శివాయ
సరస మీ నమశ్శివాయ సత్య మీ నమశ్శివాయ
పరమ మీ నమశ్శివాయ బ్రహ్మ మీ నమశ్శివాయ
2
కం. ఈ యష్టోత్తరశతముం
బాయక పఠియించు నతఁడు పరమానంద
శ్రీయుక్తుఁడు రైయుక్తుఁడు
ధీయుక్తుఁడు నై తనర్చు దివ్య మహత్త\న్‌.
3
చం. అని మనరంగనాథుఁడు దయానిధి శ్రీగిరినాథుమీఁదఁ జె
ప్పిన శివమంత్ర వర్ణనము చిత్తసముద్గత భక్తియుక్తి వ్రా
సినఁ గొనియాడిన\న్‌ వినినఁ జెల్వెసలారఁ బఠించిన\న్‌ జగ
జ్జనులకుఁ బుణ్యసంపద లసంఖ్యములై సమకూరు నిమ్మహి\న్‌.
4కృతజ్ఞతలు:

శ్రీమతి జ్యోత్స్న ఆదూరి, వారి విలువైన సమయమును వెచ్చించి ఎంతో ఓపికతో దీనిని Transliterate చేసి యిచ్చినారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
రంగనాథుని శివకవిత్వము గుఱించి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి వ్యాసమును యిక్కడ చదువగలరు.

AndhraBharati AMdhra bhArati - dEshi sAhityamu - namaSSivAya ragaDa (SivamaMtra varNanamu) raMganAtha Namassivaya Ragada Shiva Mantra Varnanamu - Ranganatha - Ranganadha ( telugu andhra )