దేశి సాహిత్యము రగడలు నయన రగడ
(శివభక్తి దీపిక)
- రంగనాథ
నయన రగడ (శివభక్తి దీపిక)
- రంగనాథ
శ్రీ పార్వతీశుఁ జూడక
పాపాత్ముఁడ నగుచుఁ బోవఁ బథమునఁ జక్షుల్‌
దీపించు దృష్టి తొలఁగిన
శ్రీపతి నడుగంగఁ గర్త శివుఁడని చెప్పె\న్‌.
1
శ్రీశైల వల్లభుని శిఖరంబుఁ బొడగంటి
కాశీ పురాధీశు గౌరీశుఁ బొడగంటి
సర్వలోకేశ్వరుని సర్వేశుఁ బొడగంటి
సర్వసంరక్షకుని సర్వంబుఁ బొడగంటి
పరమాత్ము నీశానుఁ బరమేశుఁ బొడగంటి
పరమ యోగీంద్ర హృత్పదనిలయుఁ బొడగంటి
చంద్రార్క శతకోటి సంకాశుఁ బొడగంటి
చంద్రార్క శిఖినేత్రు శంకరునిఁ బొడగంటి
రూపింపఁ బ్రకటస్వరూపంబుఁ బొడగంటి
నాపరంజ్యోతియై యమరుదేవునిఁ గంటి
వేదంబు లీశ్వరుని వినుతింపఁ బొడగంటి
నాదిదేవుఁడు రుద్రుఁడని శ్రుతులఁ బొడగంటి
శ్రుతి 'యేక ఏవ రుద్రో' యనఁగఁ బొడగంటి
శ్రుతి 'పరంబ్రహ్మ' మని శూలిఁబల్కుటఁ గంటి
ముక్కంటికై శ్రుతుల్‌ మ్రొక్కఁగాఁ బొడగంటి
ముక్కంటి లీలచే మ్రోయుచుండఁగఁ గంటి
భర్గుఁడే తత్పరాత్పరుఁడనఁగఁ బొడగంటి
భర్గుఁ డర్కునిలోనఁ బ్రభ వెలుంగుటఁగంటి
బ్రహ్మాండముల కోట్లు భర్గులోఁ బొడగంటి
బ్రహ్మాండమాలికా భరణ భూషితుఁ గంటి
విశ్వరూపంబైన విశ్వేశుఁ బొడగంటి
విశ్వచక్షుని విశ్వవేద్యు నభవునిఁ గంటి
మూఁడుమూర్తుల కాదిమూర్తి దేవునిఁ గంటి
మూఁడుమూర్తుల లోన ముక్కంటిఁ బొడగంటి
నష్టమూర్తుల కీర్తులమరంగఁ బొడగంటి
నిష్టభోగములెల్ల నిచ్చు వేల్పని కంటి
నజ్ఞానతిమిర సంహార సూర్యునిఁ గంటి
సుజ్ఞాన సంశీల సులభ మోక్షముఁ గంటి
నక్షరత్రయ రూప మక్షయునిఁ బొడగంటి
దక్షాధ్వర ధ్వంస ధన్యవేషునిఁ గంటి
విమలాత్ము నాద్యంత విరహితునిఁ బొడగంటిఁ
గమలలోచన నయనకమల పూజితుఁ గంటి
వృషభేంద్ర వాహనుని విషకంఠుఁ బొడగంటి
వృషభధ్వజుండైన వేదవేద్యునిఁ గంటి
ధవళ సంకాశంబు దశబాహుఁ బొడగంటి
భవదు@ఃఖ సంహారుఁ బంచవదనుని గంటి
పురవైరి నంధకాసురవైరిఁ బొడగంటి
కరివైరి గంకాళకరధాముఁ బొడగంటిఁ
గారుణ్యసాగరునిఁ గల్యాణుఁ బొడగంటి
నారాయణప్రియుని నాగకంకణుఁ గంటి
మహినొప్పు శ్రీశైల మహిమ నేఁ బొడగంటి
బహువేద శాస్త్రముల్‌ ప్రణుతి సేయుటఁగంటి
భూలోకకైలాస పుర మనఁగఁ బొడగంటి
ఫాలాక్షుఁడచ్చోటఁ బాయకుండుటఁ గంటి
ధృతిఁదూర్పు మొగసాల త్రిపురాంతకముఁ గంటి
నతులజ్యోతిర్లింగ మట యామ్యమునఁ గంటిఁ
బలు పశ్చిమద్వార బ్రహ్మేశ్వరముఁ గంటి
జెలువొందు నుత్తర శ్రీమహేశ్వరుఁ గంటి
క్షితి లక్షకోట్లకును శివతీర్థములు గంటి
చతురొప్పఁ బదికోట్ల శక్తిరూపులఁ గంటి
దివ్యస్థలంబులను దివ్యులను బొడగంటి
దివ్యయోగీంద్రులను దివ్యమహిమలఁ గంటి
రంగొందు పాతాళగంగ నేఁ బొడగంటి
గంగ పాతాళంబు గంగఁ గలియుటఁ గంటి
గంగలోఁ ద్రిజగముల్‌ గదలకుండుటఁ గంటి
గంగలో సురమునులు గదలకుండుటఁ గంటిఁ
బుణ్య కుండములెల్లఁ బొలుపారు నని కంటిఁ
బుణ్యజలముల తోడఁ బొసఁగ ధారలు గంటి
సరినొప్పు బంగారు శైలంబుఁ బొడగంటిఁ
బరికింప నవరత్న పర్వతంబులు గంటి
నెనసి యోగస్థలము లెల్లచోఁ బొడగంటి
ఘనబిలంబులు గుహలు గహ్వరంబులు గంటి
కామరూపుల గిరులఁ గణఁకతోఁ బొడగంటి
కామరూపుల నున్న కల్పతరువులఁ గంటిఁ
జరపర్వతంబులును జరవృక్షములు గంటి
ధరణిఁ బ్రొద్దొక్కచాయ తరులు గిరులును గంటి
గిరులు నీడలులేక క్రిక్కిఱియఁ బొడగంటి
తరులు నీడలులేక తనరుచుండుటఁ గంటి
నీడదిరుగని శైలనికరంబుఁ బొడగంటి
నీడదిరుగని తరులు నియతి నుండుటఁ గంటి
వృక్షమొక్కటి సర్వ వృక్ష ఫలములు గంటి
వృక్షమొక్కటి సర్వ వృక్షజాతులు గంటి
నగపక్షి మృగతరులు నాట్యమాడుటఁ గంటి
నగపక్షి మృగతరులు నాథుఁ గొల్చుటఁ గంటి
నరసురాసురు లుమానాథుఁ గొల్చుటఁ గంటి
హరివిధీంద్రాదు లట నభవుఁ గొల్చుటఁ గంటి
రుద్రుఁ గొల్చిన పెక్కు రుద్రులను బొడగంటి
రుద్రగణముల వివిధరూపధారులఁ గంటి
రూఢి తపములు సేయు ఋషులనేఁ బొడగంటి
కూడి మ్రోసెడు వేదఘోషంబుఁ బొడగంటి
సురదుందుభుల మ్రోఁత సొంపారఁ బొడగంటి
సురసతులు నాట్యంబు సొరిది నాడుటఁ గంటి
నాంగికమ్ముగ నాడు భృంగీశుఁ బొడగంటి
సంగీత నాదములు సకల దిక్కులఁ గంటిఁ
బరగ శ్రీశైలంబు భావమునఁ బొడగంటి
దురితంబులన్నియును దొలఁగిపోవుటఁ గంటి
శ్రీపర్వతేంద్రంబు శిఖరంబుఁ బొడగంటి
శ్రీపార్వతీనాథుఁ జేరికొల్చుటఁ గంటి
నాదివ్యలింగంబు నర్చింపఁ బొడగంటి
మోదమున సాయుజ్య ముక్తి నీయఁగఁ గంటిఁ
బర్వత లింగంబుఁ బ్రాణేశుఁ డని కంటిఁ
బర్వతేశ్వరు హృదయ పద్మనిలయునిఁ గంటి
శ్రీకంఠు శ్రుతివచ శ్శితికంఠుఁ బొడగంటి
లోకేశు నిజభక్త లోకేశుఁ బొడగంటి
నజు నజరు నమరు నవ్యయు నీశుఁ బొడగంటి
గజకృత్తిధరు దయాకరు జగద్గురుఁ గంటిఁ
గ్రతువైరిఁ బురవైరిఁ గామారిఁ బొడగంటిఁ
బతి నుమాపతి నాదిపతి లోకపతిఁ గంటిఁ
బతి సర్వపతి దేవపతి యీశుఁడని కంటిఁ
బతిభక్తులకు నాదిపతి శంభుఁడని కంటి
నతికాముఁ బ్రతికాము ననిలోముఁ బొడగంటి
నతిశుద్ధు నతిబుద్ధు నతిబౌద్ధుఁ బొడగంటి
శివకథామర్మములు శివధర్మములు గంటి
శివమూలమంత్రములు శివ తంత్రములు గంటి
తారకబ్రహ్మంబు తత్త్వంబుఁ బొడగంటి
హారకర్పూర నీహారాద్రి నిభుఁ గంటి
నిర్వాణ నిస్సీమ నిష్పాపరుచిఁ గంటి
దుర్వార దుస్సార దుర్భేదహరుఁ గంటి
ప్రణవాది మంత్ర ప్రపంచంబుఁ బొడగంటి
నణిమాది గుణదూర మగువీథిఁ బొడగంటి
షట్తర్క షట్కర్మ షట్చక్ర గతిఁ గంటి
షట్త్రింశ దుస్తర స్థల లక్షణముఁ గంటి
అక్షరత్రయ రూప మగునబ్ధిఁ బొడగంటి
నక్షరాంబుధిలోన నమృతంబుఁ బొడగంటి
నక్షర గ్రామంబు లందైదు పొడగంటి
నక్షరపు లక్షణము లన్నియును బొడగంటి
నమితశబ్ద బ్రహ్మమంతయును బొడగంటి
విమలశబ్దబ్రహ్మ విభవ మేర్పడఁగంటి
చొర నవసరము లేక శ్రుతులున్కిఁ బొడగంటి
హరతత్త్వ నిరతులై యతులున్కిఁ బొడగంటిఁ
గర్మంబులందు డగ్గఱరామిఁ బొడగంటి
ధర్మముల్‌ తమ త్రోవ తలపింపఁ బొడగంటి
శివభక్తి సంసారసీమ దాఁటుటఁ గంటి
నవివేకులకు భక్తి యలవికాదని కంటి
నొగి నభవులో లోక ముదయింపఁ బొడగంటి
నగణిత క్రమశైవ మది దైవమని కంటి
నిరవొప్ప హరతత్త్వమే యందమని కంటి
హరతత్త్వ మక్షీణ మానంద మని కంటి
రుసులెల్ల శైవస్వరూపులని పొడగంటి
విస మమృతమును జేయు విమలచిత్తులఁ గంటి
బసవన్న నన్నేలు భర్తగాఁ బొడగంటి
బసవన్న మాపాలి పరమేశుఁడని కంటి
బసవాక్షర త్రయము పావనంబని కంటి
బసవన్న భక్తులకుఁ బరుసవేదని కంటి
బసవా యనినఁ బాయుఁ బాపంబులని కంటి
బసవా యనిన మోక్షపద మబ్బునని కంటి
కడఁగి కన్నపఁ డీశుఁ గాలఁ దన్నుటఁ గంటి
జడలతో గండూషజలము లుమియుటఁ గంటి
మిఱుమిండఁ డెంతయును మేటియని పొడగంటి
గఱకంఠుపైఁ గినిసి గంటివేయుట గంటి
ధరణి వేశ్యయు నంబి తర్కింపఁ బొడగంటి
నిరువురకుఁ బరమేశుఁ డెదుర నిల్చుటఁ గంటి
గొడుకుఁ జంపినఁ గాని కుడువ నను పతిఁ గంటిఁ
గొడుకుఁ జంపించియును కుడువనను పతి గంటి
నెడరు దిరిగిన కంచి యేడువాడలు గంటిఁ
గొడుకుతోడనె కూడి కొనిపోవఁ బొడగంటి
భల్లాణు పత్నిఁ దాపసుఁడు వేఁడుటఁ గంటి
నిల్లాలి భల్లాణుఁ డిచ్చి మ్రొక్కుటఁ గంటి
గఱకంఠునకు నక్కగారు దక్కుటఁ గంటి
నెఱుకమై శ్రీశైల మెక్కు డిగ్గమిఁ గంటి
మతిమంతు మడివాలు మాచధీమణిఁ గంటిఁ
జతురుడై యేనుఁగును జావ నుదుకుటఁ గంటి
భక్తు లప్రతిహత ప్రధితమతులని కంటి
భక్తులకుఁ బ్రత్యర్థి పరులు లేరని కంటి
భక్తులకు నెందు నాపదలు లేవని కంటి
భక్తులాపదలచేఁ బట్టువడరని కంటి
భక్తు లహి కేయూర పదబద్ధులని కంటి
భక్తులతి నిర్వాణ పదసిద్ధులని కంటి
భక్తులు జగత్ప్రాణ పదలోలు రని కంటి
భక్తులు సదానంద పదశీలురని కంటి
భక్తు లేపదవులును బడయ నొల్లమిఁ గంటి
భక్తులకు నేరుచుల్‌ భక్తిఁ బోలమిఁ గంటి
భక్తులద్భుత కర్మ పారీణులని కంటి
భక్తులద్భుత పుణ్య ఫలభాగులని కంటి
భక్తుల కుమాభర్త ప్రాణంబులని కంటి
భక్తులుద్భట దోషభవ ముక్తులని కంటి
భక్తు లసదృశ భోగ భాగ్యైకులని కంటి
భక్తు లిహపర భోగ భాగ్యైకులని కంటి
శివభక్తు లక్షర శ్రీకరములని కంటి
శివభక్తు లాచార శేఖరములని కంటి
శివభక్తి దూషకులు చిరపాపులని కంటి
శివభక్తి దూషకులు చెడిపోదురని కంటి
శివభక్తి కల్యాణసీమ దాఁటుట గంటి
శివభక్తి యభిమత స్థితికర్త యని కంటి
శివభక్తి శత్రులకు శివములేదని కంటి
శివభక్తి మిత్రులకు శివసౌఖ్యమని కంటి
నిశ్చలము భక్తులకు నెఱయఁ జేకుఱఁ గంటి
దుశ్చరిత భక్తులకుఁ దొలఁగించు నని కంటి
త్రిభువనము భక్తులకుఁ దృణకణము లని కంటి
సభలందు భక్తులకు జయవాదమని కంటి
భక్తి యేవేదములు పడయలేవని కంటి
భక్తి యేవాదముల్‌ పడయలేవని కంటి
భక్తి యింద్రాదులును బడయలేరని కంటి
భక్తి సూర్యాదులును బడయలేరని కంటి
భక్తి బ్రహ్మాదులును బడయలేరని కంటి
భక్తి విష్ణ్వాదులును బడయలేరని కంటి
భక్తి సత్యము చేతఁ బ్రభవించు నని కంటి
భక్తి రుచి సద్‌ గుణప్రారంభ మని కంటి
భక్తి గురు కారుణ్య ఫలమూలమని కంటి
భక్తి చాతుర్వర్గ ఫలదాయి యని కంటి
భస్మధారికిఁగాని భక్తిలేదని కంటి
భస్మంబు భక్తియును బావనంబని కంటి
భస్మ ముత్తమలోక పాథేయమని కంటి
భస్మ త్రిపుండ్రంబు పరమార్థ మని కంటి
భస్మంబు శ్రుతులెల్లఁ బాటించునని కంటి
భస్మంబు యోగసంపద మూలమని కంటి
భస్మంబు సర్వసంపత్కరంబని కంటి
భస్మంబు శివయోగ ఫలవృక్షమని కంటి
భస్మ మిహపరములకుఁ బట్టుఁగొమ్మని కంటి
భస్మంబు మాపాలి పరమేశుఁడని కంటి
భస్మంబు త్రైలోక్య పావనంబని కంటి
భస్మంబు కర్మాబ్ధి బాడబంబని కంటి
భస్మంబు ఋషులెల్ల భక్తిఁ దాల్చుటఁ గంటి
భస్మంబు హర్యజులు భక్తిఁదాల్చుటఁ గంటి
రుద్రాక్ష రుద్రనేత్రోద్భవంబని కంటి
రుద్రాక్ష రుద్రస్వరూప మని పొడగంటి
రుద్రాక్ష వేదముల రూపుబల్కుఁట గంటి
రుద్రాక్ష బ్రహ్మాది ఋషులు గట్టుటఁ గంటి
రుద్రాక్ష భవగజము ద్రుంచునని పొడగంటి
రుద్రాక్ష పాపముల రోలఁ దోలుటఁ గంటి
రుద్రాక్ష పుణ్యములు రొక్కమిచ్చుటఁ గంటి
రుద్రాక్ష జపమునకు రుద్రుఁడౌనని కంటి
రుద్రాక్షధరుఁడు శ్రీరుద్రుఁడౌనని కంటి
రుద్రాక్ష ఫలమహిమ రుద్రుఁడిచ్చుట గంటి
సకల నిష్కళ మంత్ర సంబంధ మని కంటి
నకలంకమగు మంత్ర మపవర్గ మని కంటి
పాదతీర్థముఁ ద్రావఁ బాపహరమని కంటిఁ
పాదతీర్థముఁ ద్రావ ప్రాణరక్షని కంటి
పాదతీర్థముఁ జిల్కఁ బసిడియౌనని కంటి
పాదతీర్థము .... ప్రమదరసమని కంటి
బాదతీర్థముఁ ద్రావ ఫలమెక్కుడని కంటిఁ
బాదతీర్థము వేదభక్తిరసమని కంటిఁ
బాదతీర్థము తీర్థ ఫలసారమని కంటిఁ
బాదతీర్థముఁ ద్రావ భవహరంబని కంటి
ధరఁ బ్రసాదస్థలము తలఁపలేనని కంటి
సరిఁ బ్రసాదస్థలము చవి యెఱుంగుటఁ గంటి
నెలకొని ప్రసాదంబు నిలుపరాదని కంటి
మలసి ప్రసాదంబు మలహరం బని కంటి
గొనకొని ప్రసాదంబు కుడువవలెనని కంటి
పనిగొని ప్రసాదంబు భవహరంబని కంటిఁ
గుమతి ప్రసాదంబు కుడువరాదని కంటి
విమల ప్రసాదంబు విడువరాదని కంటిఁ
దెలియరు ప్రసాదంబుతెఱఁ గజ్ఞులని కంటి
మలదేహికిఁ బ్రసాద మలవికాదని కంటి
మునుకొని ప్రసాదంబు ముట్టరాదని కంటిఁ
దనియరు ప్రసాదంబు తత్త్వజ్ఞులని కంటి
నెనయ రుచు లీశునకు నీవలయునని కంటి
గొనకొనక నిల్చి మఱి కొనవలయునని కంటి
ననుదినము నర్పించు నాతఁ డతఁడని కంటిఁ
బెనఁగి ప్రసాదంబుఁ బెట్టరాదని కంటి
భర్గోపకృతులు సద్భక్తులని పొడగంటి
స్వర్గాది భోగముల్‌ సరకుగావని కంటి
గలదు లేదనరాదు కైవల్యమని కంటిఁ
గలదన్న చోటనే కలఁ డీశుఁడని కంటి
తత్త్వంబు లారుద్రుఁ దడవలేవని కంటి
సత్త్వాది గుణకోటి సంఖ్య కేమని కంటి
నఖిలేశునకు నాది యరయరాదని కంటి
నఖిలైక్యునకు నంత్యమరయ రాదని కంటి
నఖిలేశునకు నెక్కు డరయలేదని కంటి
నఖిలాండనాయకుం డాదియని పొడగంటి
నఖిలంబుఁ బుట్టించు నభవుఁడని పొడగంటి
నఖిలంబు హరునందు నణఁగునని పొడగంటి
సంసార హరమైన సర్వేశుఁ బొడగంటి
హింసకులు వడయలే రిహపరములని కంటి
సచరాచరానేక జగదుద్భవముఁ గంటి
నచరంబున జగమ్ము లన్నియును బొడగంటి
కా దహంకార మమకారంబుఁ బొడగంటి
లే దితర పరతత్త్వ లేశంబుఁ బొడగంటి
నత్యద్భుతాకార మాకార మని కంటి
ప్రత్యక్ష మానంద పాకంబుఁ బొడగంటిఁ
బుణ్యపాపము లీశుఁ బొందనేరమిఁ గంటి
గణ్యముల్‌ శ్రుతు లీశుఁ గాననేరమిఁ గంటి
వేదము లుమానాథు వెదకి కానమిఁ గంటి
నాదిదేవుఁడు శంభుఁడని శ్రుతులఁ బొడగంటిఁ
బంచవింశతి మీఁదఁ బతి రుద్రుఁడని కంటిఁ
బంచాశదక్షర ప్రభవంబుఁ బొడగంటి
నీలోక నిర్వాహ మీశానుఁడని కంటి
నీలోక సన్నాహ మీశానుఁడని కంటి
నీలోక నిస్తార మీశానుఁడని కంటి
నీలోక నిర్వాణ మీశానుఁడని కంటి
బ్రహ్మాది సురలెల్లఁ బశువు లని పొడగంటి
బ్రహ్మ విష్ణ్వాదులకుఁ బతి రుద్రుఁడని కంటి
బ్రహ్మ విష్ణువుల కౌ వాదంబుఁ బొడగంటి
బ్రహ్మపద మిద్దఱును బడసి కానమిఁ గంటి
నంతలోక ప్రభువు నరచేతిలోఁ గంటి
జింతించు భక్తులకు శివుఁడు లోనని కంటి
శివభక్తి తుదముట్టఁ జేరఁగాదని కంటి
శివభక్తి తుదిముట్టఁ జేరలేనని కంటి
శివభక్తి శ్రుతుల కాశ్రితమగుట పొడగంటి
శివభక్తి నతుల కాశీర్వాదమని కంటి
నాసనన్యాస కరుణాతీతుఁ బొడగంటి
దాసోహమను త్రోవ తలనున్న శివుఁ గంటి
ద్రోహులద్వైతులకుఁ దొలఁగి పోవుటఁ గంటి
దేహ దోషాతీత దివ్యభోగముఁ గంటి
సుఖదుఃఖములు శివుని సోఁకనేరమిఁ గంటి
నఖిలబీజములు సోమాదిత్యులని కంటి
నా రెండు వెలుఁగులే హరుకన్నులని కంటి
గౌరీశుఁడే సర్వకర్త యనఁగాఁ గంటిఁ
... ... ... ...
గారుణ్యమున శివుఁడు కనుపించె నని కంటి
కఱకుమాటల భక్తి గలుగనేరమిఁ గంటి
నెఱుఁగరాదెవ్వరికి నీశానునని కంటి
మనదధీచుని దక్ష మఖమునను బొడగంటిఁ
బెనుపొంద శ్రుతుల శాపించి విడుచుటఁ గంటిఁ
బరగ శివమంత్రంబు ప్రబలి పొందుటఁ గంటిఁ
బరికింప శివభక్తి పదమెక్కుడని కంటి
శరధిఁ దరువఁగ సద్విషాగ్ని పొంగుటఁ గంటి
సురలెల్ల గరళంబుఁ జూచి పాఱుటఁ గంటి
గరళమప్పుడు లోకకర్త మ్రింగుటఁ గంటి
గరకంఠనామంబు గణుతి కెక్కగఁ గంటి
క్షేమదస్ఫుట సౌఖ్యఖేటంబుఁ బొడగంటి
సోమ ఖండాఖండ జూటంబుఁ బొడగంటి
భరిత నయనాభీల భాలంబుఁ బొడగంటి
సురచిర స్ఫుటజైత్ర శూలంబుఁ బొడగంటి
క్రతుహరుని శుద్ధ కంకాళంబుఁ బొడగంటి
జిత గజాజిన మహాచేలంబుఁ బొడగంటి
గురుమౌళి సురసరిత్కూలంబుఁ బొడగంటి
గిరిసుతా తనుభాగకీలంబుఁ బొడగంటి
నతిసుందరాకార మాది వృషభునిఁ గంటి
రతిరాగ భస్మాంగరాగంబుఁ బొడగంటి
గురుకుచము కచము ననుకూలంబుఁ బొడగంటి
హరినేత్ర పూజితుని నాదిమూలముఁ గంటిఁ
బరికింప నాలోని పాపంబు కడగంటి
నరసి పాపము నన్ను నంటరాదని కంటి
బహుపాపధరుఁ డేల భక్తుఁడౌనని కంటి
బహుపాపములు నన్నుఁ బట్టి విడుచుటఁ గంటి
నయముగా నయనములు నాకీయఁ బొడగంటి
భయభక్తులీ భర్గు పాదములు పొడగంటి
నిది పుణ్యమని కంటి నిది గణ్యమని కంటి
నిది యోగమని కంటి నిది భోగమని కంటి
నిది ధర్మమని కంటి నిది మర్మమని కంటి
నిది నిత్యమని కంటి నిది సత్యమని కంటి
నిది పుణ్యములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది గణ్యములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది యోగములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది భోగములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది ధర్మములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది మర్మములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది నిత్యములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది సత్యములకెల్ల నెక్కుడని పొడగంటిఁ
గణఁగి సంసారంబు కడగంటి నని కంటిఁ
గణఁగి శ్రీగిరి చెన్ను కారుణ్యమని కంటి
ఘనుఁడు రంగన దూషకరగండఁ డని కంటి
జనకల్పతరులలో జయశాలి యని కంటిఁ
దవిలి రంగనమంత్రి ధన్యకృతి యని కంటి
భువిలోనఁ బ్రోలాంబ పుణ్యవతి యని కంటి
నింక శ్రీగిరిఁ జేర నేఁ గందునని కంటి
శంకరుని కృప వడయ సమయమిది యని కంటి
నిఁకను నాయెత్తు కృతులిత్తునని పొడగంటి
నిఁకఁ గృతుల్‌ చెప్ప నా కేమిభయమని కంటి
వడిఁ గృతుల్‌ నాయెత్తు వచ్చునని పొడగంటి
మృడుఁడింక నాకృతుల్‌ మెచ్చునని పొడగంటిఁ
దనర శ్రీరంగకవి దాతయని పొడగంటి
... ... ... ...
భువిలోపలఁ బ్రసిద్ధ పుణ్యుఁడనఁగాఁ గంటి
శివభక్తి దీపికా శీతాంశు వని కంటి
శ్రీగిరీశునకు నర్పింతునని పొడగంటి
శ్రీగిరీశ్వరుని కృప చెన్నలరు నని కంటి.
2కృతజ్ఞతలు:

శ్రీమతి జ్యోత్స్న ఆదూరి, వారి విలువైన సమయమును వెచ్చించి ఎంతో ఓపికతో దీనిని Transliterate చేసి యిచ్చినారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
రంగనాథుని శివకవిత్వము గుఱించి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వ్యాసమును యిక్కడ చదువగలరు.

AndhraBharati AMdhra bhArati - dEshi sAhityamu - nayana ragaDa (Sivabhakti dIpika) Siva bhakti deepika raMganAtha Ranganatha Ranganadha( telugu andhra )