ఇతిహాసములు భాగవతము ద్వితీయ స్కంధము
అధ్యాయము - 10
వ. అ మ్మహాపురాణంబు చతుఃశ్లోక రూపంబున దశ లక్షణంబుల సంకుచిత మార్గంబుల నొప్పు. అందు దశ లక్షణంబు లెయ్యవి? యనిన స్వసర్గంబును, విసర్గంబును, స్థానంబును, పోషణంబును, ఊతులును, మన్వంతరంబులును, ఈశానుచరితంబును, నిరోధంబును, ముక్తియు, నాశ్రయంబు ననం బది తెఱంగులయ్యె. దశమ విశుద్ధ్యర్థంబు తక్కిన తొమ్మిది లక్షణంబులు సెప్పంబడె. అవి యెట్టి వనిన. 259
తే. మహ దహంకార పంచ తన్మాత్ర గగన
పవన శిఖి తోయ భూ భూతపంచ కేంద్రి
య ప్రపంచంబు భగవంతునందు నగుట
సర్గ మందురు దీనిని జనవరేణ్య!
260
క. సరసిజగర్భుండు విరా
ట్పురుషునివలనం జనించి భూరితర చరా
చర భూతసృష్టిఁ జేయుట
పరువడిని విసర్గ మండ్రు భరతకులేశా!
261
క. లోకద్రోహి నరేంద్రా
నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా
వైకుంఠ నాథు విజయం
బాకల్పస్థాన మయ్యె నవనీనాథా!
262
క. హరి సర్వేశుఁ డనంతుఁడు
నిరుపమ శుభమూర్తి చేయు నిజభక్త జనో
ద్ధరణము పోషణ మవనీ
వర! యూతు లనంగఁ గర్మవాసన లరయ\న్‌.
263
తే. జలజనాభ! దయాకటాక్ష ప్రసాద
లబ్ధి నిఖిలైక లోకపాలన విభూతి
మహిమఁ బొందిన వారి ధర్మములు విస్త
రమునఁ బలుకుట మన్వంతరములు భూప!
264
క. వనజోదరు నవతార క
థనము దదీయానువర్తి తతి చారిత్రం
బును విస్తరించి పలుకం
జను నవి యీశాను కథలు సౌజన్యనిధీ!
265
సీ. వసుమతీనాథ! సర్వస్వామియైన గోవిందుండు చిదచి దానందమూర్తి
సలలిత స్వోపాధి శక్తి సమేతుఁడై తనరారు నాత్మీయ ధామమందు
ఫణిరాజ మృదుల తల్పంబుపై సుఖలీల యోగనిద్రారతి నున్న వేళ
నఖిల జీవులు నిజ వ్యాపార శూన్యులై యున్నత తేజంబు లురలుకొనగఁ
 
తే. జరగు నయ్యవస్థా విశేషంబు లెల్ల, విదిత మగు నట్లు వలుకుట యది నిరోధ
మన నిది యవాంతర ప్రళయం బనంగఁ, బరఁగు నిఁక ముక్తిగతి విను పార్థివేంద్ర!
266
సీ. జీవుండు భగవత్కృపా వశంబునఁజేసి దేహ ధర్మంబులై ధృతి ననేక
జన్మానుచరిత దృశ్యము లైన య ్రా మరణంబు లా త్మధర్మంబు లైన
ఘన పుణ్యపాప నికాయ నిర్మోచన స్థితి నొప్పి పూర్వసంచితము లైన
యపహత పాప్మవత్త్వా ద్యష్టతద్గుణ వంతుఁడై తగ భగవచ్ఛరీర
 
తే. భూతుఁడై పారతంత్ర్యాత్మ బుద్ధి నొప్పి, దివ్యమా ల్యానులేపన భవ్యగంధ
కలిత మంగళదివ్య విగ్రహవిశిష్టుఁ, డగుచు హరిరూప మొందుటే యనఘ! ముక్తి.
267
వ. మఱియు నుత్పత్తి స్థితి లయంబు లెందు నగుచుఁ బ్రకాశింపఁబడు నది యాశ్రయం బనంబడు. అదియ పరమాత్మ. బ్రహ్మశబ్ద వాచ్యంబు నదియ. ప్రత్యక్షానుభవంబున వీతంబు సేయుకొరకు నాత్మ కాధ్యాత్మి కాది విభాగంబు సెప్పంబడియె. అది యెట్లనిన నాత్మ యాధ్యాత్మి కాధిదైవి కాధిభౌతికంబులఁ ద్రివిధం బయ్యె. అందు నాధ్యాత్మికంబు చక్షురాది గోళ కాంతర్వర్తి యై యెఱుంగంబడు. చక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుండె యాధిదైవికుం డనందగు. చక్షురా ద్యదిష్ఠా నాభిమాన దేవతయు, సూర్యాది తేజో విగ్రహుండు నగుచు నెవ్వనియందు నీ యుభయ విభాగంబునుం గలుగు నతండె యాధిభౌతికుండు, విరా డ్విగ్రహుండు నగుం గావున, ద్రష్టయు దృక్కు దృశ్యంబు ననందగు నీ మూఁటియందు నొకటి లేకున్న నొకటి గానరాదు. ఈ త్రితయంబు నెవ్వఁ డెఱుంగు నతండు సర్వ లోకాశ్రయుండై యుండు. అతండె పరమాత్మయు. అ మ్మహాత్ముండు లీలార్థంబై జగత్సర్జనంబు సేయు తలంపున బ్రహ్మాండంబు నిర్భేదించి తనకు సుఖస్థానంబు నపేక్షించి మొదల శుద్ధంబులగు జలంబుల సృజియించె. స్వతఃపరిశుద్ధుండు గావున స్వసృష్టంబగు నేకార్ణ వాకారం బైన జలరాసియందు శయనంబు సేయుటం జేసి, (శ్లో.) ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః తా యద స్యాయనం పూర్వం తేన నారాయణ స్స్మృతః. అను ప్రమాణము చొప్పున నారాయణ శబ్దవాచ్యుండు గావున నతని ప్రభావంబు వర్ణింప దుర్లభంబు. ఉపాదానభూతంబైన ద్రవ్యంబును, ద్రివిధంబైన కర్మంబును, గళా కాష్ఠా ద్యుపాధి భిన్నంబైన కాలంబును, జ్ఞానాధికంబగు జీవస్వభావంబును, భోక్తయగు జీవుండును, నెవ్వని యనుగ్రహంబునం జేసి వర్తింపుచుండు, నెవ్వని యుపేక్షంజేసి వర్తింపకుండు, నట్టి ప్రభావంబుగల సర్వేశ్వరుండు దా నేకమయ్యు ననేకంబుగాఁ దలంచి యోగతల్పంబునం బ్రబుద్ధుండై యుండు. అట మీఁద స్వ సంకల్పంబునం జేసి తన హిరణ్మయంబైన విగ్రహంబు నధిదైవంబు నధ్యాత్మకంబు నధిభూతంబు నను సంజ్ఞాయుతంబైన త్రివిధంబుగా సృజియించె. 268
సీ. అట్టి విరా డ్విగ్రహాంత రాకాశంబు వలన నోజ స్సహోబలము లయ్యెఁ
బ్రాణంబు సూక్ష్మరూప క్రియా శక్తిచే జనియించి ముఖ్యాసు వఁనగఁ బరఁగె
వెలువడి చను జీవి వెనుకొని ప్రాణముల్‌ చనుచుండు నిజనాథు ననుసరించు
భటుల చందంబునఁ బాటిల్లు క్షుత్తును భూరి తృష్ణయు మఱి ముఖము వలనఁ
 
తే. దాలుజిహ్వాదికంబు లుద్భవము నొందె, నందు నుదయించె జిహ్వయు నందు రసము
లెల్ల నుదయించి జిహ్వచే నెఱుఁగఁబడును, మొనసి పలుకనపేక్షించు ముఖమువలన.
269
వ. మఱియు వాగింద్రియంబు వుట్టె, దానికి దేవత యగ్ని. ఆ రెంటివలన భాషణంబు వొడమె. ఆ యగ్నికి మహాజల వ్యాప్తం బగు జగంబున నిరోధంబు గలుగుటంజేసి యా జలంబె బ్రతిబంధకం బయ్యె. దోధూయమానంబైన మహా వాయువువలన ఘ్రాణంబు వుట్టెం గావున వాయుదేవతాకంబైన ఘ్రాణేంద్రియంబు గంధగ్రహణ సమర్థంబయ్యె. నిరాలోకం బగు నాత్మ నాత్మయందుఁ జూడంగోరి తేజంబువలన నాదిత్యదేవతాకంబై రూప గ్రాహకం బైన యక్షి యుగళంబు వుట్టె. ఋషిగణంబుచేత బోధితుం డగుచు భగవంతుండు దిగ్దేవతాకంబును శబ్దగ్రాహకంబును నైన శ్రోత్రేంద్రియంబు వుట్టించె. సర్జనంబు సేయు పురుషునివలన మృదుత్వ కాఠిన్యంబులు, లఘుత్వ గురుత్వంబులు, నుష్ణత్వ శీతలత్వంబులునుం జేసెడు త్వగింద్రి యాధిష్ఠానంబగు చర్మంబు వుట్టె. దాని వలన రోమంబు లుదయించె. వానికి మహీరుహంబు లధిదేవత లయ్యె. అందు నధిగత స్పర్శ గుణుండును అంత ర్బహిః ప్రదేశంబుల నావృతుండును నగు వాయువువలన బలవంతంబులు నింద్రదేవతాకంబులు నాదాన సమర్థంబులు నానా కర్మ కరణ దక్షంబులు నగు హస్తంబు లుదయించె. స్వేచ్ఛా విషయగతి సమర్థుం డగు నీశ్వరునివలన విష్ణుదేవతాకంబు లగు పాదంబు లుదయించె. ప్రజానందామృతార్థి యగు భగవంతునివలనఁ బ్రజాపతి దేవతాకంబై స్త్రీ సంభోగాది కామ్యసుఖంబులు కార్యంబులుగాఁ గల శిశ్నోపస్థంబు లుదయించె. మిత్రుం డధిదైవతంబుగాఁ గలిగి భుక్తాన్నా ద్యసారాంశ త్యాగోపయోగం బగు పాయు వనెడి గుదం బుద్భవించె. దాని కృత్యం బుభయ మల మోచనంబు. దేహంబుననుండి దేహాంతరంబు జేరంగోరి పూర్వకాయంబు విడుచుటకు సాధనంబగు నాభిద్వారంబు సంభవించె. అట్టి నాభియే ప్రాణాపాన బంధస్థానం బనం బడు. త ద్బంధవిశ్లేషంబె మృత్యువగు. అదియ యూర్ధ్వాధో దేహ భేదకం బనియుం జెప్పంబడు. అన్నపానాది ధారణార్థంబుగ నాంత్ర కుక్షి నాడీనిచయంబులు గల్పింపఁబడియె. వానికి నదులు సముద్రంబులు నధిదేవతలయ్యె. వాని వలనఁ దుష్టి పుష్టులను నుదరభరణ రస పరిణామంబులును గలిగియుండు. ఆత్మీయ మాయాచింతనం బొనర్చు నపుడు కామ సంకల్పాది స్థానం బగు హృదయంబు గలిగె. దానివలన మనంబును, చంద్రుండును, కాముండును, సంకల్పంబును నుదయించె. అంతమీఁద జగత్సర్జనంబు సేయు విరా డ్విగ్రహంబు వలన సప్తధాతువులును, పృథివ్యప్తేజోమయంబు లైన సప్తప్రాణంబులును, వ్యోమాంబు వాయువులచే నుత్పన్నంబు లయి గుణాత్మకంబు లైన యింద్రియంబులును, నహంకార ప్రభవంబు లైన గుణంబులును, సర్వవికార స్వరూపంబగు మనస్సును, విజ్ఞానరూపిణి యగు బుద్ధియుఁ బుట్టు. వివిధంబగు నిది యంతయు సర్వేశ్వరుని స్థూల విగ్రహంబు. మఱియును. 270
క. వరుస బృథివ్యా ద్యష్టా
వర ణావృతమై సమగ్ర వైభవములఁ బం
కరుహ భవాండాతీత
స్ఫురణం జెలువొందు నతివిభూతి దలిర్పన్‌.
271
క. పొలుపగు సకల విలక్షణ
ములు గలి గాద్యంత శూన్యమును నిత్యమునై
లలి సూక్ష్మమై మనో వా
క్కులకుం దలపోయఁగా నగోచర మగుచున్‌.
272
సీ. అలఘు తేజోమయం బైన రూపం బిది క్షితినాథ నాచేతఁ జెప్పఁబడియె
మానిత స్థూల సూక్ష్మ స్వరూపంబుల వలన నొప్పెడు భగవ త్స్వరూప
మ మ్మహాత్మకుని మాయా బలంబునఁజేసి దివ్య మునీంద్రులు దెలియలేరు
వసుధేశ వాచ్యమై వాచకంబై నామ రూపముల్‌ గ్రియలును రూఁఢి దాల్చి
 
ఆ. యుండునట్టి యీశ్వరుండు నారాయణుం, డఖిలధృతి జగ న్నియంతయైన
చిన్మయాత్మకుండు సృజియించు నీ ప్రజా, పతుల ఋషులను బితృతతుల నపుడు.
273
వ. మఱియును. 274
సీ. సుర సిద్ధ సాధ్య కిన్నరవర చారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ
భూత బేతాళ కింపురుష కూశ్మాండ గుహ్యక డాకినీ యక్ష యాతుధాన
విద్యాధ రాప్సరో విషధర గ్రహ మాతృగణ వృక హరి ఘృష్టి ఖగ మృగాళి
భల్లూక రోహిత పశు వృక్ష యోనుల వివిధ కర్మంబులు వెలయఁ బుట్టి
 
తే. జల నభో భూతలంబుల సంచరించు, జంతుచయముల సత్త్వ రజ స్తమోగు
ణములఁ దిర్య క్సురాసుర నర ధరాది, భావముల భిన్ను లగుదురు పౌరవేంద్ర!
275
మ. ఇరవొంద\న్‌ ద్రుహిణాత్మకుం డయి రమాధీశుండు విశ్వంబు సు
స్థిరతం జేసి హరిస్వరూపుఁ డయి రక్షించు\న్‌ సమస్త ప్రజో
త్కర సంహారము సేయు నప్పుడు హరాంతర్యామియై యింతయు\న్‌
హరియించు\న్‌ బవనుండు మేఘముల మాయంజేయు చందంబున\న్‌.
276
క. ఈ పగిదిని విశ్వము సం
స్థాపించును మనుచు నణఁచు ధర్మాత్మకుఁడై
దీపిత తిర్యఙ్నర సుర
రూపంబులు దానె తాల్చి రూఢి దలిర్ప\న్‌.
277
సీ. హరియందు నాకాశ మాకాశమున వాయు వనిలంబు వలన హుతాశనుండు
హవ్యవాహనునందు నంబువు లుదకంబు వలన వసుంధర గలిగె ధాత్రి
వలన బహు ప్రజావళి యుద్భవం బయ్యె నింతకు మూలమై యెసఁగునట్టి
నారాయణుఁడు చిదానంద స్వరూపకుం డవ్యయుఁ డజరుఁ డనంతుఁ డాఢ్యుఁ
 
తే. డాది మధ్యాంత శూన్యుం డనాదినిధనుఁ, దతనివలనను సంభూత మైన యట్టి
సృష్టి హేతుప్రకార మీక్షించి తెలియఁ, జాల రెంతటి మును లైన జనవరేణ్య!
278
వ. అదియునుం గాక. 279
మ. ధరణీశోత్తమ! భూతసృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా
హరి కర్తృత్వము నొల్లఁ డాత్మగత మాయారోపితం జేసి తా
నిరవద్యుండు నిరంజనుండు పరుఁడు\న్‌ నిష్కించనుం డాఢ్యుఁడు\న్‌
నిరపేక్షుండును నిష్కళంకుఁ డగుచు\న్‌ నిత్యత్వము\న్‌ బొందెడిన్‌.
280
వ. బ్రహ్మసంబంధి యగు నీ కల్పప్రకారం బవాంతర కల్పంబుతోడ సంకుచిత ప్రకారంబున నెఱింగించితి. ఇట్టి బ్రహ్మకల్పంబున నొప్పు ప్రాకృత వైకృత కల్ప ప్రకారంబులును, తత్పరిమాణంబులును, కాల కల్ప లక్షణంబులును, నవాంతర కల్ప మన్వంతరాది భేద విభాగ స్వరూపంబును, నతివిస్తారంబుగ ముందు నెఱింగింతు వినుము. అదియునుం బద్మకల్పం బనందగు. అని భగవంతుం డయిన శుకుండు పరీక్షిత్తునకుఁ జెప్పె. అని సూతుండు మహర్షులకు నెఱింగించిన. 281
క. విని శౌనకుండు సూతుం
గనుఁగొని యిట్లనియె సూత! కరుణోపేతా!
జననుతగుణ సంఘాతా!
ఘన పుణ్య సమేత! విగతకలుషవ్రాతా!
282
వ. పరమ భాగవ తోత్తముండైన విదురుండు బంధు మిత్ర జాలంబుల విడిచి, సకల భువన పావనంబులును కీర్తనీయంబులును నైన తీర్థంబులు నగణ్యంబులైన పుణ్య క్షేత్రంబులును దర్శించి, క్రమ్మఱ వచ్చి, కౌషారవియగు మైత్రేయుం గని, యతని వలన నధ్యాత్మబోధంబు వడసె నని వినంబడు. అది యంతయు నెఱింగింపు మనిన నతం డిట్లనియె. 283
క. విను మిపుడు మీరు న న్నడి
గిన తెఱఁగున శుకు మునీంద్ర గేయుఁ బరీక్షి
జ్జనపతి యడిగిన నతఁ డా
తని కెఱిఁగించిన విధంబుఁ దగ నెఱిఁగింతున్‌.
284
వ. సావధానులై వినుండు. 285
ఉ. రామ! గుణాభిరామ! దినరాజ కులాంబుధి సోమ! తోయద
శ్యామ! దశానన బ్రబల సైన్య విరామ! సురారి గోత్ర సు
త్రామ! సుబాహు బాహుబల దర్ప తమః పటు తీవ్ర ధామ! ని
ష్కామ! కుభృల్లలామ! గరకంఠ సతీ నుత నామ! రాఘవా!
286
క. అమరేంద్రసుత విదారణ!
కమలాప్త తనూజ రాజ్యకారణ! భవ సం
తమస దినేశ్వర! రాజో
త్తమ! దైవత సార్వభౌమ! దశరథరామా!
287
మాలిని. నిరుపమ గుణజాలా! నిర్మ లానంద లోలా!
దురిత ఘన సమీరా! దుష్ట దైత్య ప్రహారా!
శరధి మద విశోషా! చారు స ద్భక్త పోషా!
సరసిజ దళనేత్రా! స జ్జన స్తోత్ర పాత్రా!
288
గద్యము. ఇది పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర, కేసన మంత్రి పుత్ర, సహజ
పాండిత్య, పోతనామాత్య ప్రణీతం బైన శ్రీమహాభాగవతం బను పురాణంబునం
బరీక్షిత్తుతోడ శుకయోగి భాషించుటయు, భాగవత పురాణ వైభవంబును, ఖట్వాంగు
మోక్షప్రకారంబును, ధారణా యోగ విషయంబైన మహావిష్ణుని శ్రీపాదా ద్యవయవంబుల
సర్వలోకంబు లున్న తెఱంగును, సత్పురుష వృత్తియు, మోక్ష వ్యతిరిక్త సర్వకామ్య ఫలప్రద
దేవతా భజన ప్రకారంబును, మోక్ష ప్రదుండు శ్రీహరి యనుటయు, హరి భజన విరహితు
లైన జనులకు హేయ తాపాదనంబును, రాజప్రశ్నంబును, శుకయోగి శ్రీహరి స్తోత్రంబు
సేయుటయు, వాసుదేవ ప్రసాదంబునం జతుర్ముఖుండు బ్రహ్మాధిపత్యంబు వడయుటయు,
శ్రీహరివలన బ్రహ్మ రుద్రాది లోక ప్రపంచంబు వుట్టుటయు, శ్రీమ న్నారాయణ దివ్య
లీలావతార పరంపరా వైభవ వృత్తాంత సూచనంబును, భాగవత వైభవంబును,
పరీక్షిత్తు శుకయోగి నడిగిన ప్రపంచాది ప్రశ్నలును, అందు శ్రీహరి ప్రధానకర్త యని
త ద్వృత్తాంతంబు సెప్పుటయు, భగవ ద్భక్తి వైభవంబును, బ్రహ్మ తప శ్చరణంబు నకుం
బ్రసన్నుండై హరి వైకుంఠ నగరంబుతోడఁ బ్రసన్నుండైన, స్తోత్రంబు సేసి త
త్ప్రసాదంబునం దన్మహిమ వినుటయు, వాసుదేవుం డానతిచ్చిన ప్రకారంబున బ్రహ్మ
నారదునికి భాగవత పురాణ ప్రధాన దశ లక్షణంబు లుపన్యసించుటయు, నారాయణ
వైభవంబును, జీవాది తత్త్వసృష్టియు, శ్రీహరి నిత్య విభూత్యాది వర్ణనంబును,
గల్పప్రకారాది సూచనంబును, శౌనకుండు విదుర మైత్రేయ సంవాదంబు సెప్పుమని
సూతు నడుగుటయు, నను కథలుం గల ద్వితీయ స్కంధము సంపూర్ణము.
289
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - dvitIya skaMdhamu ( telugu andhra )