ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
క. శ్రీమ ద్విఖ్యాతి లతా, క్రామిత రోదోంతరాళ! కమనీయ మహా
జీమూత తులిత దేహ, శ్యామల రుచిజాల! రామ చంద్రనృపాలా!
1
వ. మహనీయ గుణగరిష్టు లగు న మ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణ వ్యాఖ్యాన
వైఖరీసమేతుం డైన సూతుం డిట్లనియె. అట్లు ప్రాయోపవిష్టుం డైన పరీక్షిన్న
రేంద్రుండు శుకయోగీంద్రు నవలోకించి.
2
సీ. సర్వభూతములకు సముఁడు నెచ్చెలి ప్రియుం డైన వైకుంఠుఁడనంతుఁ డాఢ్యుఁ
డింద్రునికొఱకు దైత్యేంద్రుల నేటికి విషమునికైవడి వెదకి చంపె?
నసురులఁ జంపంగ నమరులచేఁ దనకయ్యెడు లాభ మింతైనఁ గలదె?
నిర్వాణనాథుండు నిర్గుణుం డగు తన కసురులవలని భయంబుఁ బగయుఁ
 
ఆ. గలుగనేర వట్టి ఘనుఁడు దైత్యులఁ జంపి
సురలఁ గాఁచుచునికి చోద్య మనుచు
సంశయంబు నాకు జనియించె మునినాథ!
ప్రజ్ఞ మెఱసి తెలియఁ బలుకవయ్య!
3
వ. అనిన శుకుం డి ట్లనియె. 4
శా. నీ సంప్రశ్నము వర్ణనీయము గదా! నిక్కంబు రాజేంద్ర! ల
క్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింపఁ ద
ద్దాసాఖ్యానము లొప్పు విష్ణుచరణ ధ్యాన ప్రధానంబు లై
శ్రీసంధానము లై మునీశ్వరవచో జేగీయమానంబు లై.
5
క. చిత్రంబులు త్రైలోక్య ప, విత్రంబులు భవలతా లవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజన వన, చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్‌.
6
వ. నరేంద్రా! కృష్ణద్వైపాయనునకు నమస్కరించి, హరికథనంబులు సెప్పెద.
వినుము. వ్యక్తుండు గాక, గుణంబులు లేక, ప్రకృతిం జెందక, భవంబుల నొందక,
పరమేశ్వరుండు దన మాయవలన నైన గుణంబుల నావేశించి బాధ్యబాధకత్వం
బుల నొందు. అతండు గుణరహితుండు. సత్త్వ రజ స్తమంబులు ప్రకృతిగుణంబులు. ఆ
గుణంబులకు నొక్కొక్క కాలంబున హానివృద్ధులు గలవు. ఆ యీశ్వరుండు సత్త్వంబున
దేవఋషులను, రజోగుణంబున నసురులను, దమోగుణంబున యక్ష రక్షో గణంబులను
విభజించె. సూర్యుండు పెక్కెడలం గానంబడియు నొక్కరుం డైన తెఱంగునఁ, ద
ద్విభుండును సర్వగతుం డయ్యును భిన్నుండు గాఁడు. తత్త్వవిదు లైన పెద్దలు దమలోనం
బరమాత్మస్వరూపంబున నున్న యీశ్వరు ని వ్విధంబున నెఱుంగుదురు. జీవాత్మకుఁ
బరుండైన సర్వమయుండు దనమాయచేత విశ్వంబున్‌ సృజియింపం గోరి రజంబును,
గ్రీడింపంగోరి సత్త్వంబును, నిద్రింపంగోరి తమంబును, నుత్పాదించి చర మైన
కాలంబును సృజియించు. ఆ కాలమున సర్వదర్శనుం డైన యీశ్వరుండు
కాలాహ్వయుండై సత్త్వగుణం బైన దేవానీకంబునకు వృద్ధియు, రజ స్తమో గుణు
లైన రాక్షసులకు హానియుం జేయుచుండు.
7
క. జననాయక! యీ యర్థము, ఘనయశుఁ డగు ధర్మజునకుఁ గ్రతుకాలమునన్‌
మును నారదుండు సెప్పెను, వినుపించెద వినుము చెవులు విమలత నొందన్‌.
8
వ. మున్ను ధర్మరాజు సేయు రాజసూయ యాగంబున బాలుం డైన శిశుపాలుండు హరిని
నిందించి, నిశిత నిర్వక్ర చక్రధారా దళిత మస్తకుం డై, తేజోరూపంబున
వచ్చి, హరిదేహంబు సొచ్చుటం జూచి వెఱఁగుపడి, ధర్మజుండు సభలో నున్న
నారదు నీక్షించి యి ట్లనియె.
9
ఆ. ఎట్టివారి కైన నేకాంతులకు నైన
వచ్చి చొరఁగరాని వాసుదేవు
తత్త్వమందుఁ జెంది ధరణీశుఁ డహితుఁ డై
యెట్లుచొచ్చె? మునివరేణ్య! నేఁడు.
10
ఉ. వేనుఁడు మాధవుం దెగడి విప్రులు దిట్టిన భగ్నుఁ డై తమో
లీనుఁడు గాఁడె? తొల్లి మదలిప్తుఁడు చైద్యుఁడు పిన్ననాఁటనుం
డేనియు మాధవున్‌ విన సహింపఁడు భక్తి వహింపఁ డిట్టి వాఁ
డే నిబిడ ప్రభావమున నీ పరమేశ్వరునందుఁ జొచ్చెనో?
11
మ. హరి సాధింతు హరిన్‌ గ్రసింతు హరిఁ బ్రాణాంతంబు నొందింతుఁ దా
హరికి\న్‌ వైరి నటంచు వీఁడు పటు రోషాయత్తుఁ డై యెప్పుడు\న్‌
దిరుగుం బ్రువ్వదు నోరు వ్రీలి పడదు\న్‌ దేహంబు దాహంబుతో
నరకావాసము నొందఁ డేక్రియ జగన్నాథుం బ్రవేశించెనో?
12
వ. అదియునుం గాక దంతవక్త్రుండును, వీఁడును నిరంతరంబు గోవిందు నింద సేయుదురు.
నిఖిలజనులు సందర్శింప నేఁడు వీనికి విష్ణుసాయుజ్యంబు గలుగుట కేమి హేతువు?
వినిపింపుము. పవనచలిత దీపశిఖయునుం బోలె నా హృదయంబు చలింపుచున్నది.
అనిన ధర్మనందనునకు నారదుం డి ట్లనియె. దూషణ భూషణ తిరస్కార
సత్కారంబులు శరీరంబునకుం గాని పరమాత్మకు లేవు. శరీరాభిమానంబునం
జేసి దండ వాక్పారుష్యంబులు హింసయై తోఁచుతెఱంగున, నేను, నాయది యనియెడు
వైషమ్యంబు భూతంబులకు శరీరంబునంద సంభవించు. అభిమానంబు బంధంబు.
నిరభిమానుం డై వధించినను వధంబు గాదు. కర్తృత్వ మొల్లని వానికి హింసయు
సిద్ధింపదు. సర్వభూతాత్మకుండైన యీశ్వరునికి వైషమ్యంబు లేదు. కావున.
13
ఆ. అలుక నైనఁ జెలిమి నైనఁ గామంబున
నైన బాంధవమున నైన భీతి
నైనఁ దగిలి తలఁప నఖిలాత్ముఁ డగు హరి
జేరవచ్చు వేఱుసేయఁ డతఁడు.
14
క. వైరానుబంధనంబునఁ, జేరిన చందమున విష్ణుఁ జిరతరభక్తిం
జేరఁగరా దని తోఁచును, నారాయన భక్తి యుక్తి నా చిత్రమున\న్‌.
15
క. కీటకముఁ దెచ్చి భ్రమరము, పాటవమున బంభ్రమింప భ్రాంతం బై త
త్కీటకము భ్రమరరూపముఁ, బాటించి వహించుఁ గాదె! భయయోగమున\న్‌.
16
వ. ఇ వ్విధంబున. 17
శా. కామోత్కంఠత గోపికల్‌ భయమునం గంసుండు వైరక్రియా
సామగ్రి\న్‌ శిశుపాలముఖ్య నృపతుల్‌ సంబంధు లై వృష్ణులు\న్‌
బ్రేమ\న్‌ మీరలు భక్తి నేము నిదె చక్రిం గంటి మె ట్లైన ను
ద్దామ ధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెంద\న్‌ వచ్చు ధాత్రీశ్వరా!
18
శ్రీహరి ద్వారపాలకులకు సనక సనంద నాదులవలన శాపంబు సంభవించుట
వ. మరియుం బెక్కండ్రు కామ ద్వేష భయ స్నేహ సేవాతిరేకంబులఁ జిత్తంబు హరి
పరాయత్తంబుగాఁ జేసి తద్గతిం జెందిరి. హరి నుద్దేశించిన క్రోధాదు లైన
యేనింటిలోపల నొకటి యైన వేనునికి లేని నిమిత్తంబున నతండు వ్యర్థుం డయ్యె.
మీ తల్లికిఁ జెల్లెలికొడుకు లైన శిశుపాల దంతవక్త్రులు దొల్లి విష్ణుమందిర
ద్వారపాలకులు. విప్రశాపంబునఁ బదభ్రష్టు లై భూతలంబున జన్మించిరి.
అనిన యుధిష్ఠిరుండు నారదున కి ట్లనియె.
19
మ. అలుగం గారణ మేమి విప్రులకు? ము న్నా విప్రు లెవ్వారు? ని
శ్చలు లేకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారు లీశానువ
ర్తులు వైకుంఠపురీ నివాసు లన విందు\న్‌ వారి కె బ్భంగి నీ
ఖలజన్మంబులు వచ్చె? నారద! వినం గౌతూహలం బయ్యెడి\న్‌.
20
వ. అనిన నారదుం డి ట్లనియె. ఒక్కనాఁడు బ్రహ్మమానసపుత్రు లైన సనక సనందనాదులు
దైవయోగంబున భువనత్రయంబున సంచరింపుచు, నై దా ఱేండ్ల ప్రాయంపు బాలకుల
భావంబున దిగంబరు లై హరిమందిరంబునకు వచ్చి చొచ్చునెడ, మొగసాల నున్న
పురుషు లిరువురు వారలం జూచి.
21
క. డింభకుల ననర్గళ వి, స్రంభకుల రమాధినాథ సల్లాప సుఖా
రంభకుల ముక్తమానస, దంభకులం జొరఁగనీక తఱిమి రధీశా!
22
క. వారించినఁ దమకంబున, వా రించుక నిల్వలేక వడిఁ దిట్టిరి దౌ
వారికుల నసురయోని న, వారితు లై పుట్టుఁ డనుచు వసుధాధీశా!
23
వ. మఱియు నా పిన్న పెద్దలు వారలం జూచి, మీ రీయెడ నుండ నర్హులు గారు. నారాయణ
చరణమూలంబు విడిచి, రజ స్తమో గుణు లై, రాక్షసయోనిం బుట్టుడు. అని శపియించిన
వారు నా శాపవశంబునఁ బదభ్రష్టు లై కూలుచు మొఱ లిడిన, న మ్మహాత్ములు
దయాళువు లై క్రమ్మఱం గరుణించి, మూఁడు జన్మంబులకు వైరంబున భగవ
త్సన్నిధానంబు గలిగెడు నని నిర్దేశించి చనిరి. ఇ వ్విధంబున శాపహతు లై హరి
పార్శ్వచరు లైన పురుషు లిరువురు హిరణ్యకశిపు హిరణ్యాక్షు లన దితికి జన్మించిరి.
అందుఁ గనిష్ఠుం డైన హిరణ్యాక్షుని హరి వరాహరూపమున సంహరించె. అగ్రజుండైన
హిరణ్యకశిపుండును నరసింహమూర్తి యైన శ్రీహరిచేత విదళితుం డయ్యె. అతని కొడుకు
ప్రహ్లాదుండు దండ్రిచేత హింసితుం డయ్యును నారాయణ పరాయణుం డ శాశ్వతుం డయ్యె.
రెండవభవంబునఁ గైకసి యను రాక్షసికి రావణ కుంభకర్ణు లై సంభవించిన, విశ్వంభరుండు
రఘుకులంబున రాఘవుం డై యవతరించి వధించె. తృతీయ జన్మంబున మీ తల్లిచెల్లెలికి
శిశుపాల దంతవక్త్రు లన నుద్భవించి.
24
శా. వక్రం బింతయు లేక పాయని మహావైరంబుతో నిత్య జా
త క్రోధ స్మరణంబుల\న్‌ విదళి తోద్య త్పాపసంఘాతు లై
చక్రచ్ఛిన్న శిరస్కు లై మునివచ శ్శాపావధి ప్రాప్తు లై
చక్రిం జెందిరి వారె పార్శ్వచరు లై సారూప్య భావంబున\న్‌.
25
వ. అనిన విని ధర్మనందనుం డి ట్లనియె. 26
క. బాలు\న్‌ హరిపద చింతా, శీలు\న్‌ సుగుణాలవాలు శ్రీమ న్మేధా
జాలు\న్‌ సంతోషించక, యేలా శిక్షించె? రాక్షసేంద్రుం డనఘా!
27
క. పరిభూత వ్యథనంబులు, నిరుపమ సంసారజలధి నిర్మథనంబుల్‌
నరకేసరి కథనంబులు, పరిరక్షిత దేవ యక్ష ఫణి మిథునంబుల్‌.
28
వ. మునీంద్రా! వినుపింపు మనిన నారదుం డి ట్లనియె.  
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )