ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
వ. కమలోదరుచేత సహోదరుండు హతుం డయ్యె నని విని, హిరణ్యకశిపుండు
రోష శోక దందహ్యమాన మానసుం దై ఘూర్ణిల్లుచు, నాభీల దావదహనజ్వాలా
కరాళంబు లయిన విలోకనజాలంబుల గగనంబునం బొగ లెగయ నిరీక్షింపుచుఁ,
దటిల్లతాంకుర సంకాశ ధగద్ధగిత దంతసందష్ట దశనచ్ఛదుండును,
నభద్ర భయంకర భ్రుకుటత ఫాలభాగుండును, నిరంత రాశాంత దురంత
వైరవేగుండును నై మహాప్రభాజాల జటాలం బగు శూలంబుఁ గేల నందు కొని,
సభామండపంబున నిలువంబడి, త్రిమస్తక, త్రిలోచన, శకుని, శంబర,
శతబాహు, నముచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి ప్రముఖు లైన దైత్య
దానవుల నాలోకించి యి ట్లనియె.
29
శా. నాకుం దమ్ముఁడు మీకు నెచ్చెలి రణ న్యాయైక దక్షుండు బా
హా కుంఠీకృత దేవయక్షుఁడు హిరణ్యాక్షుండు వాని\న్‌ మహా
సౌకర్యాంగముఁ దాల్చి దానవవధూ సౌకర్యముల్‌ నీఱుగా
వైకుంఠుండు వధించి పోయె నఁట యీ వార్తాస్థితి\న్‌ వింటిరే!
30
చ. వనముల నుండుఁ జొచ్చు మునివర్గములోపల ఘోణి గాఁడు సం
జనన మెఱుంగ రెవ్వరును జాడ యొకింతయు లేదు తన్ను డా
సిన మఱి డాయు వెంటఁబడి చిక్కక చిక్కఁడు వీని నొక్క కీ
లున మనమెల్ల లోఁబడక బట్టుకొనంగవచ్చునే?
31
సీ. భుజశక్తి నాతోడఁ బోరాడ శంకించి మున్నీట మునిఁగిన మునుఁగుఁ గాక
యలయించి పెనఁగు నా యచల సంభ్రమమున కెఱఁగి వెన్నిచ్చిన నిచ్చుఁ గాక
జగడంబు సైపక సౌకర్య కాంక్షి యై యిలఁ గ్రింద నీఁగిన నీఁగుఁ గాక
క్రోధించి యిటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుఁ గాక
 
గీ. కఠిన శూలధారఁ గంఠంబు విదళించి
వాని శోణితమున వాఁడి మెఱసి
మ త్సహోదరునకు మహిఁ దర్పణము సేసి
మీఁద వత్తు మీకు మేలుఁ దెత్తు.
32
క. ఖండిత మూలద్రుమమున, నెండిన విటపములభంగి నీతఁడు వడ నా
ఖండలముఖ్యులు వడుదురు, భండనమున నితఁడు దమకుఁ బ్రాణము లగుట\న్‌
33
సీ. పొండు దానవులార! భూసురక్షేత్ర సంగత యైన భూమికి గములు గట్టి
మహిఁ దప స్స్వాధ్యాయ మౌనవ్రతస్థుల వెదకి ఖండింపుఁడు విష్ణుఁ డనఁగ
నన్యుఁ డొక్కఁడు లేఁడు యజ్ఞంబు వేదంబు నతఁడె భూదేవ క్రియాది మూల
మతఁడె దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాధార మతఁడె
 
గీ. యే స్థలంబున గో భూసురేంద్ర వేద
వర్ణ ధర్మాశ్రమంబులు వరుస నుండు
నా స్థలంబుల కెల్ల నీ రరగి చెఱిచి
దగ్ధములు సేసి రండు మీ దర్ప మొప్ప.
34
వ. అని యిట్లు నిర్దేశించిన, దివిజమర్దను నిర్దేశంబులు శిరంబున ధరియించి,
రక్కసులు పెక్కండ్రు భూతలంబునకుం జని.
35
సీ. గ్రామ పురక్షేత్ర ఖర్వట ఖేట ఘో షారామ నగరాశ్ర మాదికములు
గాలిచి కొలఁకులు గలఁచి ప్రాకార గోపుర సేతువులు ద్రవ్వి పుణ్యభూజ
చయముల ఖండించి సౌధ ప్రపా గేహ పర్ణశాలాదులు పాడుచేసి
సాధు గో బ్రాహ్మణ సంఘంబులకు హింస గావించి వేదమార్గములు చెఱచి
 
ఆ. కుతలమెల్ల నిట్లు కోలాహలంబుగా
దైత్యు లాచరింపఁ దల్లడిల్లి
నష్టమూర్తు లగుచు నాకలోకము మాని
యడవులందుఁ జొచ్చి రమరవరులు.
36
వ. అంత హిరణ్యకశిపుండు దుఃఖితుం డై, మృతుం డైన సోదరునకు నుదకప్రదానాది
కార్యంబు లాచరించి, యతని బిడ్డ లగు శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ
ప్రముఖుల నూఱడించి, వారల తల్లితోఁ గూడ హిరణ్యాక్షుని భార్యల నందఱ
రావించి, తమ తల్లి యైన దితి నవలోకించి యి ట్లనియె.
37
శా. నీరాగార నివిష్ట పాంథులఁ క్రియ\న్‌ నిక్కంబు సంసార సం
చారుల్‌ వత్తురు కూడి విత్తురు సదా సంగంబు లే దొక్కచో
శూరుల్‌ వోయెడి త్రోవఁ బోయెను భవ త్సూనుండు దల్లీ! మహా
శూరుం డాతఁడు త ద్వియోగమునకున్‌ శోకింప నీ కేటికి\న్‌.
38
సీ. సర్వజ్ఞుఁ డీశుండు సర్వాత్ముఁ డవ్యయుఁ డమలుండు సత్యుఁ డనంతుఁ డాఢ్యుఁ
డాత్మరూపంబున నశ్రాంతమును దన మాయాప్రవర్తన మహిమవలన
గుణములఁ గల్పించి గుణసంగమంబున లింగశరీరంబు లీలఁ దాల్చి
కంపిత జలములోఁ గదలెడిక్రియఁ దోఁచు పాదపంబులభంగి భ్రామ్యమాణ
 
ఆ. చక్షువుల ధరిత్రి చలిత యై కానంగఁ
బడినభంగి వికల భావరహితుఁ
డాత్మమయుఁడు కంపితాంతరంగంబునఁ
గదలినట్ల తోఁచుఁ గదలఁ డతఁడు.
39
బాలవేషము దాల్చిన యముండు దెలిపెడు సుయజ్ఞోపాఖ్యానము
వ. అవ్వా! యి వ్విధంబున లక్షణవంతుండు గాని యీశ్వరుండు లక్షితుం డై, కర్మ
సంసరణంబున యోగవియోగంబుల నొందించు. సంభవ వినాశ శోక వివేకా
వివేక చింతా స్మరణంబులు వివిధంబులు. ఈ యర్థంబునకుఁ బెద్దలు ప్రేత
బంధు యమసంవాదం బను నితిహాసంబు నుదాహరింతురు. వినుఁడు సెప్పెద.
ఉశీనరదేశమునందు సుయజ్ఞుం డను రాజు గలండు. అతండు శత్రువులచేత
యుద్ధంబున నిహతుం డై యున్న యెడ.
40
సీ. చినిఁగిన బహురత్న చిత్ర వర్మంబుతో రాలిన భూషణ రాజితోడ
భీకర బాణనిర్భిన్న వక్షముతోడ తఱచుఁ గాఱెడు శోణితంబుతోడఁ
గీర్ణ మై జాఱిన కేశబంధముతోడ రయ రోష దష్టాధరంబుతోడ
నిమిషహీనం బైన నేత్రయుగ్మముతోడ భూరజోయుత ముఖాంబుజముతోడఁ
 
ఆ. దునిసి పడిన దీర్ఘ దోర్దండములతోడ
జీవరహితుఁ డగు నుశీనరేంద్రుఁ
జుట్టి బంధుజనులు సొరిది నుండఁగ భయా
క్రాంత లగుచు నతని కాంతలెల్ల.
41
శా. స్రస్తాకంపిత కేశబంధములతో సంఛిన్న హారాళితో
హస్తాబ్జంబులు సాఁచి మోదుకొనుచు\న్‌ హా! నాథ! యంచు\న్‌ బహు
ప్రస్తావోక్తులతోడ నేడ్చిరి వగ\న్‌ బ్రాణేశు పాదంబుపై
నస్తోక స్తన కుంకుమారుణ వికీర్ణాస్రంబు వర్షింపుచు\న్‌.
42
మ. అనఘా! నిన్ను నుశీనరప్రజలు కర్థానంద సంధాయిగా
మును నిర్మించిన బ్రహ్మ నిర్దయత నున్మూలించెనే? వీరికి\న్‌
దనయశ్రేణికి మాకు దిక్కు గలదే? ధాత్రీశ! నీ బోఁటికిన్‌
జనునే? పాసి చనంగ భ్రాతృజనుల\న్‌ సన్మిత్రుల\న్‌ బుత్రుల\న్‌.
43
మ. జనలోకేశ్వర! నిన్నుఁ బాసిన నిమేషంబుల్‌ మహాబ్దంబు లై
చను లోకాంతరగామి వై మరల కీ చందంబున న్నీవు వో
యిన నె బ్భంగి జరింతు మొల్లము గదా! యీ లోకవృత్తంబు నేఁ
డనలజ్వాలలఁ జొచ్చి వచ్చెదము నీ యంఘ్రిద్వయిం జూడఁగ\న్‌.
44
వ. అని యిట్లు రాజభార్య లా రాజవంశంబు డగ్గఱి విలపింపం, బ్రొద్దు గ్రుంకెడు
సమయంబున వారల విలాపంబులు విని, బాలకుం డై యముండు సనుదెంచి,
ప్రేతబంధులం జూచి యి ట్లనియె.
45
ఉ. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్‌
జచ్చుచునుండఁ జూచెదరు చావక మానెడువారిభంగి నీ
చచ్చినవారి కేడ్చెదరు చావుకు నొల్లక డాఁగవచ్చునే?
యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేఁగుట నైజము ప్రాణికోటికిన్‌.
46
క. జననీజనకులఁ బాసియు, ఘన వృకముల బాధపడక కడుఁ బిన్నల మై
మనియెద మెవ్వఁడు గర్భం, బున మును పోషించె వాఁడె పోషకుఁ డడవి\న్‌.
47
క. ఎవ్వఁడు సృజించుఁ బ్రాణుల, నెవ్వఁడు రక్షించుఁ ద్రుంచు నెవ్వఁ డనంతుం
డెవ్వఁడు విభుఁ డెవ్వఁడు వాఁ, డి వ్విధమున మనుచుఁ బెనుచు హేలారతుఁడై.
48
ఆ. ధనము వీథిఁ బడిన దైవవశంబున
నుండుఁ బోవు మూల నున్న నైన
నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు
రక్షితుండు మందిరమునఁ జచ్చు.
49
క. కలుగును మఱి లేకుండును, గల భూతము లెల్లఁ గాలకర్మవశము లై
యిలఁ బడియుఁ బ్రకృతిఁ ద ద్గుణ, కలియుఁడు గాఁ దాత్మమయుఁ డగమ్యుఁడు దలఁప\న్‌.
50
సీ. పాంచభౌతిక మైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలోఁ బూర్వకర్మ
వశమున నొకవేళ వర్తించు దీపించు తఱి యైన నొకవేళ తలఁగిపోవు
చెడునేని దేహంబు చెడుఁ గాని పురుషుండు చెడఁ డాతనికి నింతచేటు లేదు
పురుషునికిని దేహపుంజంబునకు వేఱు గాని యేకత్వంబు గానరాదు
 
ఆ. దారువుల వెలుంగు దహనుని కైవడిఁ
గాయములఁ జరించు గాలిభంగి
నాళలీన మైన నభము చాడ్పున వేఱు
దెలియ వలయు దేహి దేహములకు.
51
వ. అని మఱియు నిట్లనియె. 52
సీ. భూపాలకుఁడు నిద్రపోయెడి నొండేమి విలపింప నేటికి? వెఱ్ఱులార!
యెవ్వఁడు భాషించు నెవ్వఁ డాకర్ణించు నట్టివాఁ డెన్నఁడో యరిగినాఁడు
ప్రాణభూతుం డైన పవనుఁ డా కర్ణింప భాషింప నేరఁడు ప్రాణి దేహ
ములకు వేఱై తాను ముఖ్యుఁ డై యింద్రియవంతుఁ డై జీవుండు వలను మెఱయఁ
 
ఆ. బ్రాభవమున భూత పంచ కేంద్రియ మనో
లింగదేహములను లీలఁ గూడి
విడుచు నన్యుఁ డొకఁడు విభుఁడు దీనికి మీరు
వొగల నేల? వగలఁ బొరల నేల?
53
క. ఎందాఁక నాత్మ దేహము, నొండెడు నందాఁక కర్మయోగము లటపైఁ
జెందవు మాయా యోగ, స్పందితు లై రిత్త జాలిఁ బడ నేమిటికి\న్‌?
54
మ. చెలులుం దండ్రులు దల్లు లాత్మజులు సంసేవ్యుల్‌ సతుల్‌ చారు ని
ర్మల గేహంబు లటంచుఁ గూర్తురు మహా మాయాగుణ భ్రాంతు లై
కలలోఁ దోఁచిన యర్థముల్‌ నిజములే? కర్మానుబంధంబులం
గలుగున్‌ సంగము లేక మాను పిదప\న్‌ గర్మాంత కాలంబున\న్‌.
55
వ. మఱియు, మాయా గుణప్రపంచంబు నెఱింగెడి తత్త్వజ్ఞులు నిత్యానిత్యంబులం
గూర్చి సుఖదుఃఖంబులం జెందరు. అజ్ఞులు గొందఱు యోగవియోగంబులకు
సుఖదుఃఖంబుల నొందుదురు. తొల్లి యొక్క మహాగహనంబున విహంగంబులకు
నంతక భూతుం డైన యెఱుకు గలఁడు. అతండు ప్రభాతంబున నొక్కనాఁడు
లేచి వాటం బైన వేఁట తమకంబున.
56
క. వల లురులు జిగురుఁ గుండెలుఁ, జలిదియుఁ జిక్కంబు ధనువు శరములుఁ గొనుచుం
బులుఁగులఁ బట్టెడుఁ వేడుక, నలుకుడు వెడలంగఁ గదలి యడవికి నడచెన్‌.
57
వ. ఇ ట్లడవికిం జని త త్ప్రదేశంబునందు. 58
క. క ట్టలుకఁ దడక చాటునఁ, బిట్టల నురిగోలఁ దిగిచి బిరుసున ఱెక్కల్‌
వట్టి విఱిచి చిక్కములోఁ, బెట్టుచు విహరించె లోకభీకర లీలన్‌.
59
వ. మఱియు, నానావిధంబు లగు శకుంతంబుల నంతంబు నొందింపుచు, సకల పక్షి
సంహారసంరబ్ధకరుం డైన లుబ్ధకుండు, దన ముందటఁ గాలచోదితం బై సంచ
రింపుచున్న కుళింగపక్షిమిథునంబుఁ గనుంగొని, యందుఁ గుళింగి నురిం దిగిచి,
యొక్క చిక్కంబులో వైచినం జూచి, దుఃఖించి, గుళింగపక్షి యి ట్లనియె.
60
చ. అడవుల మేఁత మేసి మన మన్యుల కెన్నఁడు నెగ్గుసేయ కి
క్కడ విహరింప నేఁ డకట! కట్టిఁడి బ్రహ్మ కిరాతు చేతిలోఁ
బడు మని వ్రాసెనే? నుదుటఁ బాపపు దైవము కంటి కింత యె
క్కుడు బరు వయ్యెనే బ్రతుకు? కోమలి! యే మననేర్తుఁ జెల్ల రే!
61
క. ఒకమాటు మనల నందఱఁ, బ్రకటించి కిరాతువలలఁ బడఁ జేయక ని
న్నొకతి\న్‌ వలఁ బడఁ జేసిన, వికటీకృత దక్ష మైన విధి నే మందున్‌?
62
ఉ. ఱెక్కలురావు పిల్ల లకు ఱేపటి నుండియు మేఁత గానమి\న్‌
బొక్కుచుఁ గూఁటిలో నెగసి పోవఁగ నేరవు మున్ను తల్లి యే
దిక్కున నుండి వచ్చు నని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి నల్‌
దిక్కులు చూచుచున్న వతిదీనత నెట్లు భరింతు? నక్కటా!
63
వ. అని యి వ్విధంబున. 64
క. కుంఠిత నాదముతోడను, గంఠము శోషింప వగచు ఖగమును హననో
త్కంఠుం డైన కిరాతుఁ డ, కుంఠిత గతి నేసె నొక్కకోల\న్‌ గూల\న్‌.
65
క. కాలము వచ్చిన శబరుని, కోలం ధరఁ గూలె ఖగము ఘోషముతోడ\న్‌
కాలము డాసిన నేలం, గూలక పో వశమే? యెట్టి గుణవంతులకున్‌.
66
ఉ. కావున మీరు చచ్చుతఱిఁ గానరు చచ్చి ధరిత్రిఁ బడ్డ ధా
త్రీ విభు దేహముం గదిసి దీనత నేడువనేల? పొండు చిం
తావతులార! వత్సర శతంబుల కైన నిజేశు చక్కికిం
బోవుట దుర్లభంబు మృతిఁ బొందినవారలు సేర వత్తురే?
67
వ. అని యిట్లు కపట బాలకుం డై క్రీడించుచున్న యముని యుపలాల నాలాపంబులు
విని సుయజ్ఞుని బంధువు లెల్ల వెఱఁగు పడి, సర్వప్రపంచంబు నిత్యంబు గా దని
తలంచి, శోకంబు మాని, సుయజ్ఞునికి సాంపరాయిక కృత్యంబులు సేసి చనిరి.
అంత నంతకుం డంతర్హితుం డయ్యె. అని చెప్పి హిరణ్యకశిపుండు దన తల్లినిఁ ,దమ్ముని
భార్యలం జూచి యి ట్లనియె.
68
క. పరు లెవ్వరు? దా మెవ్వరు?, పరికింపఁగ నేక మగుట భావింపరు త
త్పరమజ్ఞానము లేమినిఁ, బరులును మే మనుచుఁ దోఁచుఁ బ్రాణుల కెల్ల\న్‌.
69
వ. అని తెలియం బలికిన, హిరణ్యకశిపుని వచనంబులు విని, దితి కోడండ్రునుం, దానును,
శోకంబు మాని, తత్త్వ విలోకనంబు గలిగి, లోకాంతర గతుం డైన కొడుకునకు
వగవక చనియె. అనిచెప్పి నారదుండు ధర్మనందనునకు ని ట్లనియె.
70
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )