ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
క. అజరామర భావంబును, ద్రిజగ ద్రాజ్యంబు నప్రతిద్వంద్వము దో
ర్విజి తాఖిల శాత్రవమును, గజరిపు బలమును హిరణ్యకశిపుఁడు గోరెన్‌.
71
వ. ఇట్లు గోరి, మందరాచల ద్రోణికిం జని, యందుఁ గాలిపెనువ్రేల నేల నిలువం
బడి యూర్ధ్వబాహుం డై, మిన్ను చూచుచు, వాఁడు మయూఖంబుల తోడి ప్రళయకాల
భానుండునుం బోలె దీర్ఘ జటారుణ ప్రభాజాలంబులతోడ నెవ్వరికిం దేఱిచూడ
రాక, పరమ దారుణం బైన తపంబు సేయుచుండె. నిర్జరులు నిజ స్థానంబుల
నుండిరి. అంత.
72
మ. అదరెం గుంభిని సాద్రి యై కలఁగె నే డంభోనిధుల్‌ తారకల్‌
చెదరెన్‌ సగ్రహసంఘ లై దిశలు విచ్ఛిన్నాంత లై మండెఁ బె
ల్లదరెన్‌ గుండెలు జంతుసంహతికి నుగ్రాచార దైత్యేంద్ర మూ
ర్ధ దిశోద్ధూత సధూమ హేతిపట లోదంచ త్తపోవహ్నిచేన్‌.
73
వ. ఇట్లు త్రైలోక్య సంతాపకరం బైన దైత్యరాజ తపో దహన విజృంభణంబు
సైరింపక, నిలింపులు నాకంబు విడిచి, బ్రహ్మలోకంబునకుం జని, లోకేశ్వరుం
డైన బ్రహ్మకు వినతు లై, యి ట్లని విన్నవించిరి.
74
క. దితికొడుకు తపమువేఁడిమి, నతితప్తుల మైతి మింక నలజడి నమరా
వతి నుండ వెఱతు మె య్యది, గతి మాకును దేవదేవ! కారుణ్యనిధీ!
75
శా. శంకాలేశము లేదు దేవ! త్రిజగ త్సంహారము\న్‌ దేవతా
సంకోచంబును వేదశాస్త్ర పదవీ సంక్షేపము\న్‌ జాల నే
వంక\న్‌ జేతు నటంచు దుస్సహ తపోవ్యావృత్తి చిత్తంబులో
సంకల్పించె నిశాచరుండు ప్రతిసంస్కారంబు చింతింపవే!
76
శా. నీ వే రీతి తపోబలంబున జగ న్నిర్మాణము\న్‌ జేసి యీ
దేవాధీశులకంటె నెక్కుడు సిరిం దీపించి తి బ్భంగిఁ దా
నీ విశ్వంబుఁ దపస్సమాధి మహిమ\న్‌ హింసించి వేఱొక్క వి
శ్వావిర్భావకరత్వ శక్తి మదిలో నర్థించినాఁ డీశ్వరా!
77
వ. అదియునుం గాక కాలాత్ము లగు జీవాత్ముల కనిత్యత్వంబు గలుగుటం జేసి
తపో యోగ సమాధి బలంబునం దనకు నిత్యత్వంబు సంపాదింతు నని తలంచి
నాఁడు. అని మరియు ని ట్లనిరి.
78
మ. భవదీయం బగు నున్నతోన్నత మహాబ్రహ్మైక పీఠంబు సం
స్తవనీయం బగు భూతియు\న్‌ విజయము\న్‌ సౌఖ్యంబు సంతోషము\న్‌
భువనశ్రేణికి నిచ్చు దైత్యుని తపస్స్ఫూర్తి న్నివారించి యో
భువనాధీశ్వర! కావవే! భువనముల్‌ పూర్ణ ప్రసాదంబున\న్‌.
79
బ్రహ్మదేవుండు హిరణ్యకశిపునకు వరము లిచ్చుట
వ. అని దేవతలు విన్నవించిన స్వయంభూతుండును, భగవంతుండును నైన నలు
మొగంబుల ప్రొడ భృగు దక్షాదులతోడ మందరపర్వతంబునకు వచ్చి, యందు
నియమ యుక్తుండును, బిపీలికావృత మేదో మాంస చర్మ రక్తుండును, వల్మీక
తృణ వేణుపటల పరిచ్ఛన్నుండును, మహా తపః ప్రభావ సంపన్నుండును నై
నీరంధ్ర నిబిడ నీరదనికర నివిష్ట నీరజబంధుండునుం బోలె నివసించి
యున్న నిర్జరారాతిం జూచి, వెఱఁగుపడి, నగుచు ని ట్లన్నియె.
80
మత్తకోకిల. ఓ సురారికులేంద్ర! యీ క్రియ నుగ్ర మైన తపంబు ము\న్‌
చేసి చూపినవారు లే రిఁకఁ జేయువారును లేరు నే
నీ సమాధికి మెచ్చితి\న్‌ విను నీ యభీష్టము లిత్తు నా
యాస మేటికి? లెమ్ము లెమ్ము మహాత్మ! కోరుము కోరికల్‌.
81
శా. దంశవ్రాతములు\న్‌ బిపీలికలు మేదః క్రవ్య రక్తంబుల\న్‌
సంశీర్ణంబులు సేసి పట్టి తినఁగా శల్యావశిష్టుండ వై
వంశచ్ఛన్న తృణావళీ యుత మహావల్మీకమం దింద్రియ
భ్రంశం బెంతయు లేక నీవు నిలువం బ్రాణంబు లెట్లుండెనో?
82
ఉ. ఉత్సుకత\న్‌ జలాన్నముల నొల్లక యీ క్రియ నూఱు దివ్యసం
వత్సరముల్‌ శరీరమున వాయువుల\న్‌ నిలుపంగ వచ్చునే?
యుత్సవ మయ్యెఁ జూచి మము నుగ్రతపంబున గెల్చి తీవు నే
వత్సలత న్నినుం గదియ వచ్చితిఁ గోరిక లెల్ల నిచ్చెద\న్‌.
83
వ. అని పలికి వనమక్షికా పిపీలికా భక్షితం బైన రక్షోవిభుని దేహంబుమీఁదం గమం
డలుజలకంబులు ప్రోక్షించిన, న ద్దానవేంద్రుండు కమలాసన కరకమల కమనీయ
కనకమయ దివ్యామోఘ కమండలు నిర్గత నిర్మల నీరధారా బిందుసందోహ సంసిక్త
సకలాంగుం డై, తపంబు సాలించి, సాంద్ర కీచక సంఘాత సంఛాదిత
వామలూరుమధ్యంబు వెలువడి, మహాప్రభావ బల సౌందర్య తారుణ్య సహితుండును,
వజ్రసంకాశ దేహుండును, దప్త సువర్ణవర్ణుండును నై నీర సేంధన నికర
నిర్గత వహ్నియుం బోలె వెలుంగుచుఁ జనుదెంచి.
84
మ. దివిజానీకవిరోధి మ్రొక్కెఁ గని వాగ్దేవీ మనోనేతకు\న్‌
సవిశేషోత్సవ సంవిధాతకు నమ త్సంత్రాతకు\న్‌ స త్తపో
నివహాభీష్ట వరప్రదాతకు జగ న్నిర్మాతకు\న్‌ ధాతకు\న్‌
వివిధప్రాణి లలాటలేఖన మహావి ద్యానుసంధాతకు\న్‌.
85
వ. ఇట్లు దైత్యేశ్వరుండు దివి నున్న హంసవాహనునకు ధరణీతలంబున దండ ప్రమాణం
బాచరించి, సంతోష బాష్ప సలిల సంవర్ధిత పులకాంకురుం డై యంజలి చేసి,
కంజగర్భునిమీఁద దృష్టి యిడి, గద్గదస్వరంబున నిట్లని స్తుతియించె.
86
సీ. కల్పాంతమున నంధకార సంవృత మైన జగము నెవ్వఁడు దన సంప్రకాశ
మున వెలుఁగింపుచు మూఁడుభంగుల రజస్సత్త్వ తమో గుణసహితుఁ డగుచుఁ
గల్పించు రక్షించుఁ గడపటఁ బ్రహరించు నెవ్వఁ డాద్యుఁడు సర్వహేతు వగుచు
శోభితుం డై స్వయంజ్యోతి యై యొక్కట విలసిల్లు నెవ్వఁడు విభుత మెఱసి
 
ఆ. సమయ మైన మానస ప్రాణ బుద్ధీంద్రి
యములతోడ నెవ్వఁ డలఘుమహిమ
నడరు నట్టి సచ్చి దానందమయునకు
మహితభక్తి నే నమస్కరింతు.
87
వ. దేవా! నీవు ముఖ్యప్రాణం బగుటంజేసి ప్రజాపతివి. మనో బుద్ధి చిత్తేంద్రియంబు
లకు నధీశ్వరుండవు. మహాభూతగణంబులకు నాధారభూతుండవు. త్రయీతనువునం
గ్రతువులు విస్తరింతువు. సకల విద్యాకళలు నీ తనువు. సర్వార్థసాధకులకు
సాధనీయుండవు. ఆత్మనిష్ఠా గరిష్ఠులకు ధ్యేయం బగు నాత్మవు. కాలమయుండ
వై జనులకు నాయుర్నాశంబుఁ జేయుదువు. జ్ఞాన విజ్ఞాన మూర్తివి. ఆద్యంత
రహితుండవు. అంతరాత్మవు. త్రిమూర్తులకు మొద లైన పరమాత్మవు. జీవలోకంబునకు
జీవాత్మవు. నీవ సర్వంబును. నీవు గానిది లేశంబును లేదు. వ్యక్తుండవు గాక
పరమాత్మవై, పురాణపురుషుండ వై, యనంతుండ వైన నీవు ప్రాణేంద్రియ మనో
బుద్ధి గుణంబుల నంగీకరించి, పరమేష్ఠి పదవిశేషంబున నిలిచి, స్థూల
శరీరంబునంజేసి యింతయుం బ్రపంచింతువు. భగవంతుండ వైన నీకు మ్రొక్కెద.
అని మఱియు ని ట్లనియె.
88
క. కోరినవారల కోర్కెలు, నేరుపుతో నిచ్చి మనుప నీక్రియ నన్యుల్‌
నేరరు కరుణాకర, నేఁ! గోరెద నీ విచ్చెదేనిఁ గోరిక లభవా!
89
శా. గాలిం గుంభిని నగ్ని నంబువుల నాకాశస్థలి\న్‌ దిక్కుల\న్‌
రేల\న్‌ ఘస్రముల\న్‌ దమఃప్రభల భూరి గ్రాహ రక్షో మృగ
వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తి\న్‌ సమస్తాస్త్రశ
స్త్రాళి\న్‌ మృత్యువులేని జీవనము లోకాధీశ! యిప్పించవే!
90
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )