ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
వ. అని మఱియు, రణంబులందుఁ దన కెదురులేని శౌర్యంబును, లోకపాలకుల
నతిక్రమించు మహిమయును, భువనత్రయ జయంబును, హిరణ్యకశిపుండు
గోరిన, నతని తపంబునకు సంతోషించి, దుర్లభంబు లైన వరంబు లన్నియు
నిచ్చి, కరుణించి విరించి యి ట్లనియె.
91
శా. అన్నా! కశ్యపపుత్ర! దుర్లభము లీ యర్థంబు లె వ్వారికి\న్‌
ము న్నెవ్వారలుఁ గోర రీ వరముల\న్‌ మోదించితి న్నీ యెడ\న్‌
నన్ను\న్‌ గోరినవెల్ల నిచ్చితిఁ బ్రవీణత్వంబుతో బుద్ధి సం
పన్నత్వంబున నుండుమీ! సుమతి వై భద్రైకశీలుండ వై.
92
వ. అని యి ట్లమోఘంబు లైన వరంబు లిచ్చి, దితినందనుచేతం బూజితుం డై
యరవింద సంభవుండు బృందారక సందోహ వంద్యమానుం డగుచు, నిజమందిరం
బునకుం జనియె. ఇ వ్విధంబున నిలింపారాతి వరపరంపరల సంపాదించుకొని.
93
క. సోదరుఁ జంపిన పగకై, యాదర మించుకయు లేక యసురేంద్రుండు కం
జోదరు పై వైరము దు, ర్మాదరతుం డగుచుఁ జేసె మనుజాధీశా!
94
సీ. ఒకనాఁడు గంధర్వ యూధంబుఁ బరిమార్చు దివిజుల నొకనాఁడు దెరలఁ దోలు
భుజగుల నొకనాఁడు భోగంబులకుఁ బాపు గ్రహముల నొకనాఁడు గట్టివైచు
నొకనాఁడు యక్షుల నుగ్రత దండించు నొకనాఁడు విహగుల నొడిసిపట్టు
నొకనాఁడు సిద్ధుల నోడించి బంధించు మనుజుల నొకనాఁడు మదము లడఁచు
 
తే. కడిమి నొకనాఁడు కిన్నర ఖచర సాధ్య
చారన ప్రేత భూత పిశాచ వన్య
సత్త్వ విద్యాధరాదుల సంహరించి
దితితనూజుండు దుస్సహతేజుఁ డగుచు.
95
క. అ ట్టళ్ళతోడఁ గోటలు, కట్టలుకం గూలఁ ద్రోచి క్రవ్యాదులతోఁ
జుట్టువిడిసి దిక్పాలుర, పట్టణములు గొనియె నతఁడు బలమున నధిపా!
96
క. కృశ లై సంప్రాపిత దు, ర్దశ లై సర్వంకషోగ్ర దైతేయాజ్ఞా
వశ లై నిశలును దినములు, దిశ లెల్లను గట్టువడియె దీనత ననఘా!
97
వ. మఱియు, న ద్దానవేంద్రుండు విద్రుమ సోపానంబులును, మరకతమణిమయ ప్రదేశంబులును,
వైడూర్య రత్న స్తంభసముదయంబులును, చంద్రికాసన్నిభ స్ఫటికసంఘటిత
కుడ్యంబులును, బద్మరాగపీఠ కనకవాట గేహళీ విటంక వాతాయనంబులును,
విలంబమాన ముక్తాఫలదామవితాన శోభిత ధవళ పర్యంకంబులును, వివిధ
విచిత్ర విమానంబులును, నిరంతర సురభి కుసుమ ఫల భరిత పాదప
మహోద్యానంబులును, హేమారవింద సౌగంధిక బంధుర సరోవరంబులును, రమణీయ
రత్న ప్రాసాద విశేషంబులును, మనోహర పరిమళ శీతల మంద మారుతంబులును,
మృదు మధుర నినద కీర కోకిలకుల కోలాహలంబులునుఁ గలిగి, విశ్వకర్మనిర్మితం
బై, త్రైలోక్య రాజ్యలక్ష్మీ శోభితం బైన మహేంద్రభవనంబు సొచ్చి.
98
మ. దితిపుత్రుండు జగత్త్రయైక విభుఁ డై దేవేంద్ర సింహాసనో
ద్ధతుఁ డై యుండ హరాచ్యుతాంబుజభవుల్‌ దప్పంగ భీతి\న్‌ సమా
గతు లై తక్కిన యక్ష కిన్నర మరు ద్గంధర్వ సిద్ధాదు లా
నతు లై కానుక లిచ్చి కొల్తు రతనిన్‌ నానా ప్రకారంబుల\న్‌.
99
శా. ఏ దిక్పాలురఁ జూచి నేఁ డలుగునో? యే దేవు బంధించునో?
యే దిగ్భాగముమీఁద దాడి చనునో? యే ప్రాణులం జంపునో?
యీ దైత్యేశ్వరుఁ డంచు నొందొరులు దా రింద్రాదు లాస్థానభూ
వేది\న్‌ మెల్లన నిక్కి చూతురు భయావిర్భూత రోమాంచు లై.
100
సీ. కోలాహలము మాని కొలువుఁడు సురలార! తలఁగి దీవింపుఁడు తపసులార!
ఫణ లెత్తకుఁడు నిక్కి పన్న గేంద్రములార! ప్రణతు లై చనుఁడు దిక్పాలురార!
గానంబు సేయుఁడు గంధర్వవరులార! సందడిఁ బడకుఁడు సాధ్యులార!
ఆడుఁడు నృత్యంబు లప్సరోజనులార! చేరిక మ్రొక్కుఁడు సిద్ధులార!
 
తే. శుద్ధ కర్పూర వాసిత సురభి మధుర
భవ్య నూతన మైరేయ పానజనిత
సుఖవిలీనత నమరారి సొక్కిఁనాఁడు
శాంతి లేదండ్రు నిచ్చలుఁ జారు లధిప!
101
శా. లీలోద్యాన లతా నివాసములలో లీలావతీ యుక్తుఁ డై
హాలాపాన వివర్ధమాన మద లోలావృత్త తామ్రాక్షుఁ డై
కేళిం దేలఁగ నేను తుంబురుఁడు సంగీత ప్రసంగంబుల\న్‌
వాలాయంబు గరంగఁజేయుదుము దేవద్వేషి నుర్వీశ్వరా!
102
క. యాగములు బుధులు ధరణీ, భాగములం జేయుచుండఁ బఱతెంచి హవి
ర్భాగములు దాన కైకొనుఁ, జాగింపఁడు దైత్యుఁ డమరసంఘంబునకున్‌.
103
సీ. సకల మహాద్వీప సహిత విశ్వంభరా స్థలిని దున్నక పండు సస్యచయము
కామధేన్వాదుల కరణి నర్థులు గోరు కోర్కులు గగనంబు గురియుచుండు
వననిధు లేడును వాహినీ సందోహ ములును వీచుచు రత్నములు వహించు
నుర్వీరుహంబులు నొక్కకాలంబున నఖిలర్తు గుణముల నతిశయిల్లు
 
తే. నంబుసంపూరిత ద్రోణు లగుచు నొప్పు
పర్వతంబులు సకల దిక్పాల వివిధ
గుణము లెల్లను దానె కైకొనుచు దైత్య
విభుఁడు త్రైలోక్యరాజ్య సంవృద్ధి నుండ.
104
వ. ఇట్లు సకలదిక్కులు నిర్జించి, లోకైక నాయకుం డై, తన యిచ్ఛాప్రకారంబున
నింద్రియసుఖంబు లనుభవింపుచుం, దనియక శాస్త్రమార్గంబు నతిక్రమించి,
విరించి వరజనిత దుర్వార గర్వాతిరేకంబున సురవైరి యైశ్వర్యవంతుం డై
పెద్దకాలంబు రాజ్యంబు సేయునెడ.
105
ఉ. ఎన్నఁడు మాకు దిక్కు గల? దెన్నఁడు దైత్యుని బాధ మాను? మే
మెన్నఁడు వృద్ధిఁ బొందగల? మెవ్వఁడు రక్షకుఁ? డంచు దేవతా
కిన్నర సిద్ధ సాధ్య ముని ఖేచరనాయకు లాశ్రయించి రా
పన్నగతల్పు భూరి భవబంధ విమోచనుఁ బద్మలోచను\న్‌.
106
వ. ఇట్లు దానవేంద్రుని యుగ్రదండంబునకు వెఱచి, యనన్య శరణ్యు లై రహస్యంబున
నందఱుం గూడికొని.
107
ఉ. ఎక్కడ నున్నవాఁడు? జగదీశ్వరుఁ డాత్మమయుండు మాధవుం
డెక్కడి కేఁగి శాంతులు మునీశులు భిక్షులు రారు? గ్రమ్మఱ\న్‌
దిక్కుల కెల్ల నెక్కుడు తుదిం జొర దిక్కగు నట్టి దిక్కునకు\న్‌
మ్రొక్కెద మేము హస్తయుగముల్‌ ముకుళించి మదీయ రక్షకు\న్‌.
108
వ. అని మఱియు, నాహారనిద్రలు మాని, చిత్తంబులు పరాయత్తంబులు గానీక
సమాహిత బుద్ధు లై భగవంతుండును, మహాపురుషుండును, మహాత్ముండును,
విశుద్ధ జ్ఞానానందమయుండును నైన హృషీకేశునకు నమస్కరించుచున్నయెడ,
మేఘరవసమాన గంభీరనినదంబున దిశలు మ్రోయించుచు, సాధులకు నభయంబు
గావించుచు, దృశ్యమానుండునుం గాక పరమేశ్వరుం డైన హరి యి ట్లనియె.
109
మ. భయముం జెందకుఁ డయ్య! నిర్జరవరుల్‌ భద్రంబు మీ కయ్యెడి\న్‌
జయము\న్‌ లాభము భూతసంతతికి మ త్సందర్శన ప్రాప్తి న
వ్యయ మై చేరు నెఱుంగుదు\న్‌ దితిసుత వ్యాపార భాషావిప
ర్యయముం గాలము గూడఁ జంపెదఁ జనుం డందాఁక మీ త్రోవల\న్‌.
110
ఆ. శుద్ధ సాధులందు సురలందు శ్రుతులందు
గోవులందు విప్రకోటియందు
ధర్మపదవియందుఁ దలిగి నాయందు వాఁ
డెన్నఁ గలుగు నాఁడె హింసఁ జెందు.
111
క. కన్నకొడుకు శమ దమ సం, పన్నుని నిర్వైరుఁ డనక ప్రహ్లాదుని వాఁ
డెన్నఁడు రోషంబున నా, పన్నత నొందించు నాఁడె పట్టి వధింతు\న్‌.
112
శా. వేధోదత్త వర ప్రసాద గరిమ\న్‌ వీఁ డింతవాఁ డై మిముం
బాధం బెట్టుచునున్న వాఁ డని మది\న్‌ భావింతు భావించి నే
సాధింపం దఱికాదు కావునఁ గడు\న్‌ సైరించితి\న్‌ మీఁదట\న్‌
సాధింతు\న్‌ సురలార! నేఁడు సనుఁడా! శంకింప మీ కేటికి\న్‌?
113
వ. అని యిట్లు దనుజమర్దనుండు నిర్దేశించిన, నిలింపులు గుంపులుగొని మ్రొక్కి,
రక్కసుండు మ్రక్కుట నిక్కం బని తమతమ దిక్కులం జనిరి. హిరణ్యకశిపునకు
విచిత్రచరిత్రులు నలువులు పుత్రు లుద్భవించిరి. అందు.
114
ప్రహ్లాద చరిత్ర
సీ. తనయందు నఖిలభూతములందు నొకభంగి సమహితత్వంబున జరుగువాఁడు
పెద్దలఁ బొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతుల్‌ సేయువాఁడు
కన్నుదోయికి నన్యకాంత లడ్డం బైన మాతృభావన సేసి మరలువాఁడు
తల్లిదండ్రులభంగి ధర్మవత్సలతను దీనులఁ గావఁ జింతించువాఁడు
 
తే. సములయెడ సోదరస్థితి జరుపువాఁడు
దైవతములంచు గురువులఁ దలఁచువాఁడు
లీలలందును బొంకులు లేనివాఁడు
లలిత మర్యాదుఁ డైన ప్రహ్లాదుఁ డధిప!
115
వ. మఱియును. 116
సీ. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుఁ డై గర్వ సంస్తంభ సంగతుఁడు గాఁడు
వివిధ మహానేక విషయసంపన్నుఁ డై పంచేంద్రియములచేఁ బట్టువడఁడు
భవ్య వయో బల ప్రాభవోపేతుఁ డై కామ రోషాదులఁ గ్రందుకొనఁడు
కామినీప్రముఖ భోగము లెన్ని గలిగిన వ్యసనసంసక్తి నా వంకఁ బోఁడు
 
ఆ. విశ్వమందుఁ గన్న విన్న యర్థములందు
వస్తుదృష్టిఁ జేసి వాంఛ యిడఁడు
ధరణినాథ! దైత్యతనయుండు హరిపర
తంత్రుఁ డై హతాన్యతంత్రుఁ డగుచు.
117
ఆ. సద్గుణంబు లెల్ల సంఘంబు లై వచ్చి
యసురరాజ తనయునందు నిలిచి
పాసి చనవు విష్ణుఁ బాయనివిధమున
నెమ్మి దగిలియుండు నిర్మలాత్మ!
118
మ. పగవా రైన సురేంద్రులు\న్‌ సభలలోఁ బ్రహ్లాదసంకాశుల\న్‌
సుగుణోపేతుల నెందు మే మెఱుఁగ మంచు\న్‌ వృత్తబంధంబుల\న్‌
బొగడం జొత్తురు స త్కవీంద్రులక్రియ\న్‌ భూనాథ! మీబోఁటి స
ద్భగవద్భక్తులు దైత్యరాజ తనయు\న్‌ బాటించి కీర్తింపరే!
119
క. గుణనిధి యగు ప్రహ్లాదుని, గుణము లనేకములు గలవు గురుకాలమున\న్‌
గణుతింప నశక్యంబులు, ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికి\న్‌.
120
వ. ఇట్లు సద్గుణగరిష్ఠుం డైన ప్రహ్లాదుండు భగవంతుం డైన వాసుదేవునియందు
సహజ సంవర్ధమాన నిరంతర ధ్యాన రతుం డై.
121
సీ. శ్రీవల్లభుఁడు దన్నుఁ జేరిన య ట్లైన చెలికాండ్ర నెవ్వరిఁ జేర మఱచు
నసురారి దనమ్రోల నాడిన య ట్లైన నసురబాలురతోడ నాడ మఱచు
భక్తవత్సలుఁడు సంభాషించి న ట్లైన పరభాషలకు మాఱుపలుక మఱచు
సురవంద్యుఁ దనలోనఁ జూచిన య ట్లైనఁ జొక్కి సమస్తంబు జూడ మఱచు
 
తే. హరి పదాంభోజయుగ చింతనామృతమున
నంతరంగంబు నిండిన ట్లైన నతఁడు
నిత్య పరిపూర్ణుఁ డగుచు నన్నియును మఱచి
జడత లేక యు నుండును జడునిభంగి.
122
శా. పానీయంబులు ద్రావుచున్‌ గుడుచుచున్‌ భాషింపుచున్‌ హాస లీ
లా నిద్రాదులు సేయుచు\న్‌ దిరుగుచున్‌ లక్షింపుచున్‌ సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం
ధానుం డై మఱచెన్‌ సురారిసుతుఁ దేత ద్విశ్వమున్‌ భూవరా!
123
సీ. వైకుంఠ చింతావివర్జిత చేష్టుఁడై యొక్కఁడు నేడుచు నొక్కచోట
నశ్రాంత హరిభావ నారూఢచిత్తుఁడై యుద్ధతుఁడై పాడు నొక్కచోట
విష్ణుఁ డింతియ కాని వేఱొండు లేదని యొత్తిలి నగుచుండు నొక్కచోట
నళినాక్షుఁ డను నిధానముఁ గంటి నేఁడని యుబ్బి గంతులు వైచు నొక్కచొటఁ
 
ఆ. బలుకు నొక్కచోటఁ బరమేశుఁ గేశవుఁ
బ్రణయ హర్ష జనిత బాష్పసలిల
మిళిత పులకుఁ డై నిమీలిత నేత్రుఁ డై
యొక్కచోట నిలిచి యూరకుండు.
124
వ. ఇట్లు పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతం బైన ముకుంద చరణారవింద
సేవాతిరేకంబున నఖర్వ నిర్వాణభావంబు విస్తరింపుచు, నప్పటప్పటికి దుర్జన
సంసర్గ నిమిత్తంబునం దన చిత్తం బన్యాయత్తంబు గానీక నిజాయత్తంబు
సేయుచు, నప్రమత్తుండును, సంసార నివృత్తుండును, బుధజన విధేయుండును,
మహాభాగధేయుండును, సుగుణ మణిగణ గరిష్ఠుండును, బరమ భాగవతశ్రేష్ఠుం
డును, గర్మబంధలతా లవిత్రుండును, బవిత్రుండును నైన పుత్రునియందు
విరోధించి, సురవిరోధి యనుకంప లేక చంపం బంపె. అని పలికిన నారదునకు
ధర్మజుం డి ట్లనియె.
125
శా. పుత్రుల్‌ నేర్చిన నేరకున్న జనకుల్‌ పోషింతు రెల్లప్పుడున్‌
మిత్రత్వంబున బుద్ధి సెప్పి దురితోన్మేషంబు వారింతు రే
శత్రుత్వంబుఁ దలంప రెట్టియెడ నా సౌజన్య రత్నాకరున్‌
బుత్రున్‌ లోకపవిత్రుఁ డండ్రి నెగులుం బొందింప నె ట్లోర్చెనో!
126
ఉ. బాలుఁ బ్రభావిశాలు హరి పాదపయోరుహ చింతనక్రియా
లోలుఁ గృపాళు సాధు గురు లోక పదానత ఫాలు నిర్మల
శ్రీలు సమస్త సభ్య నుతశీలు విఖండిత మోహవల్లికా
జాలు నదేల తండ్రి వడిఁ జంపగఁ బంపె? మునీంద్ర! సెప్పవే.
127
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )