ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
వ. అనిన నారదుం డి ట్లనియె. 128
శా. లభ్యం బైన సురాధిరాజపదము\న్‌ లక్షింపఁ డశ్రాంతము\న్‌
సభ్యత్వంబున నున్న వాఁ డబలుఁ డై జాడ్యంబుతో వీఁడు వి
ద్యాభ్యాసంబునఁ గాని తీవ్రమతి గాఁడంచు\న్‌ విచారించి దై
త్యేభ్యుం డొక్కదినంబునం బ్రియసుతు\న్‌ వీక్షించి సోత్కంఠుఁ డై.
129
క. చదువనివాఁ డజ్ఞుం డగుఁ
జదివిన సదసద్వివేక చతురత గలుగుం
జదువఁగ వలయును జనులకుఁ
జదివించెద నార్యులొద్దఁ జదువుము తండ్రీ.
130
వ. అని పలికి, యసురలోక పురోహితుండును భగవంతుండును నగు శుక్రాచార్యు కొడుకులఁ
బ్రచండవితర్కు లైన చండామార్కుల రావించి, సత్కరించి యి ట్లనియె.
131
శా. అంధ ప్రక్రియ నుండు రాఁడు పలుకం డస్మత్ప్రతాపక్రియా
గంధం బించుక లేదు మీరు గురువుల్‌ కారుణ్యచిత్తుల్‌ మనో
బంధుల్‌ మాన్యులు మాకుఁ బెద్దలు మముం బాటించి యీ బాలకున్‌
గ్రంథంబుల్‌ చదివించి నీతికుశలుం గాఁ జేసి రక్షింపరే!
132
వ. అని పలికి, వారలకుం బ్రహ్లాదు నప్పగించి, తోడ్కొనిపొం డనిన, వారును
దనుజరాజ కుమారునిం గొనిపోయి, యతనికి సమానవయస్కులగు సహశ్రోతల
నసురకుమారులం గొందఱం గూర్చి.
133
ఉ. అంచిత భక్తితోడ దనుజాధిపు గేహసమీపముం బ్రవే
శించి సురారిరాజసుతుఁ జేకొని శుక్రకుమారకుల్‌ పఠిం
పించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రము లా కుమారుఁ డా
లించి పఠించె నన్నియుఁ జలింపని వైష్ణవభక్తిపూర్ణుఁ డై.
134
క. ఏ పగిది వారు సెప్పిన
నా పగిదిం జదువు గాని యట్టి ట్టని యా
క్షేపింపఁడు తా నన్నియు
రూపించిన మిథ్య లని నిరూఢ మనీష\న్‌.
135
శా. అంతం గొన్ని దినంబు లేఁగిన సురేంద్రారాతి శంకాన్విత
స్వాంతుం డై నిజనందనుం గురువు లే జాడం బఠింపించిరో?
భ్రాంతుం డేమి పఠించెనో? పిలిచి సంభాషించి విద్యాపరి
శ్రాంతిం జూచెదఁ గాక నేఁ డని మహా సౌధాంత రాసీనుఁ డై.
136
ఉ. మోదముతోడ దైత్యకులముఖ్యుఁడు రమ్మని చీరఁ బంచె బ్ర
హ్లాదకుమారకు\న్‌ భవ మహార్ణవ తారకుఁ గామ రోష లో
భాది విరోధివర్గ పరిహారకుఁ గేశవ చింతనామృ తా
స్వాద కఠోరకు\న్‌ గలుషజాల మహోగ్రవనీ కుఠారకు\న్‌.
137
వ. ఇట్లు చారులచేత నాహూయమానుం డై ప్రహ్లాదుండు సనుదెంచిన. 138
శా. ఉత్సాహ ప్రభు మంత్రశక్తి యుత మై యుద్యోగ మారూఢ సం
వి త్సంపన్నుఁడ వైతివే? చదివితే వేదంబులు\న్‌ శాస్త్రముల్‌?
వత్సా! ర మ్మని చేరఁ జీరి కొడుకు\న్‌ వాత్సల్య సంపూర్ణుఁ డై
యుత్సంగాగ్రముఁ జేర్చి దానవవిభుం డుత్కంఠ దీపింపఁగ\న్‌.
139
క. అనుదిన సంతోషణములు
జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్‌
తనయుల సంభాషణములు
జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్‌.
140
వ. అని మఱియుఁ బుత్రా! నీకు నెయ్యది భద్రం బై యున్నది? చెప్పు మనినఁ
గన్న తండ్రికిఁ బ్రియనందనుం డిట్లనియె.
141
చ. ఎల్ల శరీరధారులకు నిల్లను చీఁకటి నూతి లోపలం
ద్రెళ్ళక వీరు నే నను మతిభ్రమణంబున భిన్నులై ప్రవ
ర్తిల్లక సర్వము న్నతని దివ్యకళామయ మంచు విష్ణునం
దుల్లముఁ జేర్చి తా రడవి నుండుత మేలు నిశాచరాగ్రణీ!
142
వ. అని కుమారుం డాడిన ప్రతిపక్షానురూపంబు లైన సల్లాపంబులు విని, దానవేంద్రుండు
నగుచు ని ట్లనియె.
143
క. ఎ ట్టాడిన న ట్టాడుదు
రిట్టి ట్టని పలుక నెఱుఁగ రితరుల శిశువుల్‌
దట్టించి యెవ్వ రేనియుఁ
బట్టించిరొ? బాలకునకుఁ బరపక్షంబుల్‌
144
శా. నాకుం జూడఁగఁ జోద్య మయ్యెడుఁగదా! నా తండ్రి యీబుద్ధి దా
నీకు\న్‌ లోపలఁ దోఁచెనో? పరులు దుర్నీతుల్‌ పఠింపించిరో?
యేకాంతంబున భార్గవుల్‌ పలికిరో? యీ దానవశ్రేణికి\న్‌
వైకుంఠుండు కృతాపరాధుఁ డతని\న్‌ వర్ణింప నీ కేటికి\న్‌?
145
మ. సురలం దోలుటయో! సురాధిపతుల\న్‌ స్రుక్కించుటో! సిద్ధులం
బరివేధించుటయో! ముని ప్రవరులన్‌ బాధించుటో! యక్ష కి
న్నర గంధర్వ విహంగ నాగపతుల న్నాశంబు నొందించుటో!
హరి యంచు\న్‌ గిరి యంచు నేల చెడ? మోహాంధుండ వై పుత్రకా!
146
వ. అనినఁ దండ్రిమాటలకుఁ బురోహితు నిరీక్షించి, ప్రహ్లాదుం డి ట్లనియె. మోహ
నిర్మూలనంబు సేసి, యెవ్వనియందుఁ దత్పరు లైన యెఱుక గల పురుషులకుఁ
బరులు దా రనియెడు మాయాకృతం బైన యస ద్గ్రాహ్యంబు గానంబడ దట్టి
పరమేశ్వరునకు నమస్కరించెద.
147
శా. అజ్ఞుల్‌ గొందఱు మేము దా మనుచు మాయం జెంది సర్వాత్మకుం
బ్రజ్ఞాలభ్యు వరాన్వయ క్రమముల\న్‌ భాషింపఁగా నేర రా
జిజ్ఞాసా పథమందు మూఢులు గదా! చింతింప బ్రహ్మాది వే
దజ్ఞుల్‌ త త్పరమాత్ము విష్ణు నితరుల్‌ దర్శింపఁగా నేర్తురే?
148
తే. ఇను మయస్కాంతసన్నిధి నెట్లు భ్రాంత
మగు హృషీకేశుసన్నిధి నా విధమునఁ
గరఁగుచున్నది దైవయోగమునఁ జేసి
బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంత మగుచు.
149
సీ. మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే? మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె? తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే? కుటజములకుఁ
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే? సాంద్ర నీహారములకు
 
తే. అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు
వినుతగుణశీల! మాటలు వేయునేల?
150
వ. అనిన విని రోషించి, రాజసేవకుం డైన పురోహితుండు ప్రహ్లాదుం జూచి,
తిరస్కరించి యి ట్లనియె.
151
ఉ. పంచశర ద్వయస్కుఁడవు బాలుఁడ వించుక గాని లేవు భా
షించెదు తర్కవాక్యములఁ జెప్పిన శాస్త్రములోని యర్థ మొ
క్కించుక యైనఁ జెప్ప వసురేంద్రుని ముందట మాకు నౌదలల్‌
వంచుకొనంగఁ జేసితివి వైరి విభూషణ! వంశదూషణా!
152
చ. తనయుఁడు గాఁడు శాత్రవుఁడు దానవభర్తకు వీఁడు దైత్య చం
దనవనమందుఁ గంటకయుత క్షితిజాతముభంగిఁ బుట్టినాఁ
డనవరతంబు రాక్షసకులాంతకుఁ బ్రస్తుతి సేయుచుండు దం
డనమునఁ గాని శిక్షలకు డాయఁడు పట్టుఁడు కొట్టుఁ డుద్ధతి\న్‌.
153
క. నీ పాపనిఁ జదివించెద
నీ పాదము లాన యింక నిపుణతతోడం
గోపింతుము దండింతుము
కోపింపకుమయ్య! దనుజకుంజర వింటే!
154
వ. అని మఱియు, నా రాచపాపనికి వివిధోపాయంబులం పురోహితుండు వెఱపుఁ
జూపుచు రాజసన్నిధిం బాపి, తోడుకొని పోయి యేకాంతంబున.
155
క. భార్గవనందనుఁ డతనికి
మార్గము సెడకుండఁ బెక్కుమాఱులు నిచ్చల్‌
వర్గ త్రితయముఁ జెప్పె న
నర్గళ మగు మతివిశేష మమర నరేంద్రా!
156
వ. మఱియు, గురుండు శిష్యునకు సామ దాన భేద దండోపాయంబు లన్నియు
నెఱింగించి, నీతికోవిదుం డయ్యె నని నమ్మి నిశ్చయించి, తల్లికి నెఱింగించి,
తల్లి చేత నలంకృతుం డైన కులదీపకు నవలోకించి.
157
ఉ. త్రిప్పకు మన్న మా మతము దీర్ఘము లైన త్రివర్గపాఠముల్‌
దప్పకు మన్న! నేఁడు మన దైత్యవరేణ్యుని మ్రోల నేము ము\న్‌
చెప్పినరీతి గాని మఱి సెప్పకు మన్న! విరోధి నీతుల\న్‌
విప్పకు మన్న! దుష్ట మగు విష్ణుచరిత్ర కథార్థ జాలముల్‌.
158
వ. అని బుజ్జగించి, దానవేంద్రుని సన్నిధికిం దోడి తెచ్చిన. 159
సీ. అడు గడ్గునకు మాధవానుచింతన సుధామాధుర్యమున మేను మఱచువాని
నంభోజగర్భాదు లభ్యసింపఁగలేని హరిభక్తి పుంభావ మైనవాని
మాతృగర్భముఁ జొచ్చి మన్నది మొదలుగాఁ జిత్త మచ్యుతుమీఁదఁ జేర్చువాని
నంకించి తనలోన నఖిల ప్రపంచంబు శ్రీవిష్ణుమయ మని చెలఁగువాని
 
తే. వినయ కారుణ్య బుద్ధివివేక లక్ష
ణాది గుణముల కాటప ట్టయిన వాని
శిష్యు బుధలోక సంభావ్యుఁ జీరి గురుఁడు
ముందఱికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కు మనుచు.
160
క. శిక్షించితి మన్యము లగు
పక్షంబులు మాని నీతిపారగుఁ డయ్యె\న్‌
రక్షోవంశాధీశ్వర!
వీక్షింపుము నీ కుమారు విద్యాబలము\న్‌.
161
వ. అని పలికిన, శుక్రకుమారకు వచనంబు లాకర్ణించి, దానవేంద్రుండు దనకు
దండ ప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి, బాహుదండంబులు సాఁచి,
దిగ్గనం డగ్గఱం దిగిచి, పెద్ద తడవు గాఢాలింగనంబు సేసి, తన తొడ మీఁద
నిడుకొని, చుంచు దువ్వి, చుబుకంబు పుణికి, చెక్కిలి ముద్దుకొని, శిరంబు మూర్కొని,
ప్రేమాతిరేక సంజనిత బాష్పబిందు సందోహంబుల నతని వదనార విందంబుఁ
దడపుచు, మందమధురాలాపంబుల ని ట్లనియె.
162
శా. చోద్యం బయ్యెడు నింతకాల మరిగెన్‌ శోధించి యే మేమి సం
వేద్యాంశంబులు సెప్పిరో? గురువు లే వెంటం బఠింపించిరో?
విద్యాసార మెఱుంగఁ గోరెద భవ ద్విజ్ఞాత శాస్త్రంబులోఁ
బద్యం బొక్కటి చెప్పి సార్థముగఁ దాత్పర్యంబు భాషింపుమా!
163
శా. నిన్ను\న్‌ మెచ్చరు నీతిపాఠమహిమ న్నీతోడి దైత్యార్భకుల్‌
గన్నా రన్నియుఁ జెప్ప నేర్తురుగదా! గ్రంథార్థముల్‌ దక్షు లై
యన్నా! యెన్నఁడు నీవు నీతిమతి వౌ దంచు\న్‌ మహావాంఛతో
నున్నాఁడ న్ననుఁ గన్నతండ్రి! భవదీ యోత్కర్షముం జూపవే!
164
వ. అనినం గన్నతండ్రికిఁ బ్రియనందనుం డైన ప్రహ్లాదుం డి ట్లనియె. 165
క. చదివించిరి నను గురువులు
సదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు నేఁ
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్లఁ జదివితిఁ దండ్రీ!
166
మ. తనుహృద్భాషల సఖ్యము\న్‌ శ్రవణము\న్‌ దాసత్వము\న్‌ వందనా
ర్చనముల్‌ సేవయు నాత్మలో నెఱుకయు\న్‌ సంకీర్తనల్‌ చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్ము\న్‌ హరి న్నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలఁతు\న్‌ సత్యంబు దైత్యోత్తమా!
167
శా. అంధేందూదయముల్‌ మహాబధిర శంఖారావముల్‌ మూక స
ద్గ్రంథాఖ్యాపనముల్‌ నపుంసక వధూకాంక్షల్‌ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధ ద్రవ్యముల్‌ క్రోడ స
ద్గంధంబుల్‌ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్‌.
168
సీ. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరిఁ దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి
 
తే. దేవదేవునిఁ జింతించు దినము దినము
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు
దండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
169
సీ. కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మభస్త్రి గాక
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్వి గాక
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే? తనుకుడ్య జాల రంధ్రములు గాక
 
ఆ. చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్బుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాదయుగముతోడి పశువు గాక.
170
సీ. సంసారజీమూత సంఘంబు విచ్చునే? చక్రి దాస్యప్రభంజనము లేక
తాపత్రయాభీల దావాగ్ను లాఱునే? విష్ణుసేవామృత వృష్టి లేక
సర్వంకషాఘౌఘ జలరాసు లింకునే? హరి మనీషా బడబాగ్ని లేక
ఘన విపద్గాఢాంధకారంబు లణఁగునే? పద్మాక్షు నుతి రవిప్రభలు లేక
 
తే. నిరుప మాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధిఁ గానవచ్చునే? ముఖ్యమైన
శార్ఙ్గి కోదండ చింతనాంజనము లేక
తామరస గర్భునకు నైన దానవేంద్ర!
171
వ. అని యి వ్విధంబున వెఱపు మఱపు నెఱుంగక, యులుకు చెడి పలికెడు కొడుకు
నుడువులు సెవులకు ములుకుల క్రియ నొదవినఁ, బెదవు లదరం గదురుచు, నదరిపడి,
గురుసుతునిం గనుంగొని, విమత కథనంబులు గరపినాఁడ వని దానవేంద్రుం డి ట్లనియె.
172
చ. పటుతర నీతిశాస్త్రచయ పారగుఁ జేసెద నంచు బాలు నీ
వటు గొనిపోయి వానికి ననర్హములైన విరోధి శాస్త్రముల్‌
కుటిలతఁ జెప్పినాఁడవు భృగుప్రవరుండ వటంచు నమ్మితిన్‌
గటకట! బ్రాహ్మణాకృతివి గాక యథార్థపు బ్రాహ్మణుండవే?
173
క. ధర్మేతర వర్తనులును
దుర్మంత్రులు నైన జనుల దురితము లొందన్‌
మర్మములు గలఁచి కల్మష
కర్ముల రోగములు వొందు కైవడి విప్రా!
174
వ. అనిన రాజునకుం బురోహితుండిట్లనియె. 175
ఉ. తప్పులు లేవు మావలన దానవనాథ! విరోధిశాస్త్రముల్‌
సెప్పము క్రూరు లై పరులు సెప్పరు మీ చరణంబు లాన సు
మ్మెప్పుడు మీ కుమారునకు నింతయు నైజమనీష యెవ్వరుం
జెప్పెడిపాటి గాదు ప్రతిచింతఁ దలంపుము నేర్పు కైవడి\న్‌.
176
క. మిత్రులము పురోహితులము
పాత్రుల మే మదియుఁ గాక భార్గవులము నీ
పుత్రుని నిటువలెఁ జేయఁగ
శత్రులమే? దైత్య జలధి చంద్రమ వింటే?
177
వ. అనినం గురునందనుం గోపింపక దైత్యవల్లభుండు గొడుకు నవలోకించి యి ట్లనియె. 178
క. ఒజ్జలు సెప్పని యీ మతి
మ జ్జాతుఁడ వైన నీకు మఱి యెవ్వరిచే
నుజ్జాత మయ్యె బాలక!
త జ్జనులం బేరుకొనుము తగ నామ్రోల\న్‌.
179
వ. అనినఁ దండ్రికిఁ బ్రహ్లాదుం డిట్లనియె. 180
ఉ. అచ్చపుఁ జీఁకటిం బడి గృహవ్రతు లై విషయ ప్రవిష్టు లై
చచ్చుచుఁ బుట్టుచున్‌ మఱలఁ జర్వితచర్వణు లైన వారికిం
జెచ్చెరఁ బుట్టునే? పరులు సెప్పిన నైన నిజేచ్ఛ నైన నే
మిచ్చిన నైనఁ గానలకు నేఁగిన నైన హరిప్రబోధముల్‌
181
ఉ. కాననివాని నూఁతగొని కాననివాఁడు విశిష్ట వస్తువుల్‌
గాననిభంగిఁ గర్మములు గైకొని కొందఱు కర్మబద్ధు లై
కానరు విష్ణుఁ గొంద ఱటఁ గందు రకించిన వైష్ణవాంఘ్రి సం
స్థాన రజోఽభిషిక్తు లగు సంహృతకర్ములు దానవేశ్వరా!
182
శా. శోధింపంబడె సర్వశాస్త్రములు రక్షోనాథ! వె య్యేటికిన్‌
గాథల్‌ మాధవశేముషీ తరణి సాంగత్యంబునం గాక దు
ర్మేధం దాఁటఁగ వచ్చునే? సుత వధూ మనోగ్రవాంఛా మద
క్రోధోల్లోల విశాలసంసృతి మహా ఘోరామితాంభోనిధిన్‌.
183
వ. అని పలికిన కొడుకును ధిక్కరించి, మక్కువ సేయక, రక్కసులఱేఁడు దన
తొడలపై నుండనీక గొబ్బున దిగఁద్రొబ్బి, నిబ్బరం బగు కోపంబు దీపింప, వేఁడి
చూపుల మింట మంట లెగయ, మంత్రులం జూచి యి ట్లనియె.
184
హిరణ్యకశిపుండు ప్రహ్లాదుని వివిధోపాయంబుల హింసించుట
శా. క్రోడం బై పినతండ్రిఁ జంపె నని తాఁ గ్రోధించి చిత్తంబులోఁ
వీడం జేయఁడు బంటుభంగి హరికిన్‌ విద్వేషికిన్‌ భక్తుఁ డై
యోడం డక్కట! ప్రాణవాయువులు వీఁ డొప్పించుచున్నాఁడు నా
తోడన్‌ వైరముపట్టె నిట్టి జనకద్రోహిన్‌ మహిన్‌ గంటిరే?
185
వ. అని రాక్షసవీరుల వీక్షించి యి ట్లనియె. 186
శా. పంచాబ్దంబుల వాఁడు తండ్రి నగు నా పక్షంబు నిందించి య
త్కించి ద్భీతియు లేక విష్ణు నహితుం గీర్తింపుచున్నాఁడు వ
ల్దంచుం జెప్పిన మానఁ డంగమునఁ బుత్రాకారతన్‌ వ్యాధి జ
న్మించెన్‌ వీని వధించి రండు దనుజుల్‌ మీ మీ పటుత్వంబులన్‌.
187
శా. అంగవ్రాతములోఁ జికిత్సకుఁడు దుష్టాంగంబు ఖండించి శే
షాంగశ్రేణికి రక్షసేయుక్రియ నీ యజ్ఞుం గులద్రోహి దు
స్సంగుం గేశవపక్షపాతి నధముం జంపించి వీరవ్రతో
త్తుంగఖ్యాతిఁ జరించెదన్‌ గులము నిర్దోషంబుఁ గావించెద\న్‌.
188
క. హంతవ్యుఁడు రక్షింపను
మంతవ్యుఁడు గాఁడు యముని మందిరమునకు\న్‌
గంతవ్యుఁడు వధమున కుప
రంతవ్యుం డనక చంపి రం డీ పడుచు\న్‌.
189
వ. అని దానవేంద్రుం డానతిచ్చిన, వాఁడికోఱల రక్కసులు పెక్కండ్రు శూల
హస్తు లై వక్త్రంబులు దెఱచికొని యుబ్బి బొబ్బలిడుచు, ధూమసహిత దావ
దహనంబునుం బోలెఁ దామ్రసంకాశంబు లైన కేశంబులు మెఱయ, భేదన
వాదన చ్ఛేదనంబులు సేయుచు.
190
చ. బాలుఁడు రాచబిడ్డఁడు కృపాళుఁడు సాధుఁడు లోకమాన్య సం
శీలుఁడు వీ డవధ్యుఁ డని చిక్కక స్రుక్కక క్రూరచిత్తు లై
శూలములం దదంగముల సుస్థిరు లై ప్రహరించి రుగ్ర వా
చాలత నందఱు\న్‌ దివిజశత్రుఁడు వల్దనఁ డయ్యె భూవరా!
191
చ. పలువురు దానవుల్‌ పొడువ బాలునిదేహము లేశమాత్రము
న్నొలియదు లోపల\న్‌ రుధిర ముబ్బదు కందదు శల్యసంఘము
న్నలియదు దృష్టివైభవము నష్టముగాదు ముఖేందుకాంతియు\న్‌
బొలియదు నూతనశ్రమము పుట్టదు పట్టదు దీనభావము\న్‌.
192
ఉ. తన్ను నిశాచరుల్‌ వొడువ దైత్యకుమారుఁడు మాటిమాటి కో
పన్నగశాయి! యో దనుజభంజన! యో జగదీశ! యో మహా
పన్న శరణ్య! యో నిఖిలపావన! యంచు నుతించుఁ గాని తాఁ
గన్నుల నీరుదేఁడు భయకంప సమేతుఁడు గాఁడు భూవరా!
193
ఉ. పాఱఁడు లేచి దిక్కులకు బాహువు లొడ్డఁడు బంధురాజిలోఁ
దూఱఁడు ఘోరకృత్య మని దూఱఁడూ తండ్రిని మిత్రవర్గము\న్‌
జీరఁడు మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోనికి\న్‌
దాఱఁడు కావరే యనఁడు తాపము నొందఁడు కంటగింపఁడు\న్‌.
194
వ. ఇట్లు సర్వాత్మకం బై యిట్టి దట్టి దని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దాన యై
య మ్మహావిష్ణుని యందుఁ జిత్తంబుఁ జేర్చి, తన్మయుం డై పరమానందంబునం
బొందియున్న ప్రహ్లాదునియందు రాక్షసేంద్రుండు దన కింకరులచేతం జేయింపు
చున్న మారణకర్మంబులు పాపకర్మునియందుఁ బ్రయుక్తంబు లైన సత్కారంబులుం
బోలె విఫలంబు లగుటం జూచి.
195
ఉ. శూలముల న్నిశాచరులు స్రుక్కక దేహము నిగ్రహింపఁగా
బాలుఁడు నేలపైఁ బడఁడు పాఱఁడు చావఁడు తండ్రి నైన నా
పాలికి వచ్చి చక్రధరుపక్షము మానితి నంచుఁ బాదముల్‌
ఫాలము సోఁక మ్రొక్కఁ డనపాయత నొందుట కేమి హేతువో?
196
వ. అని శంకింపుచు. 197
సీ. ఒకమాటు దిక్కుంభియూధంబుఁ దెప్పించి కెరలి బాలకునిఁ ద్రొక్కింపఁ బంపు
నొకమాటు విషభీకరోరగశ్రేణుల గడువడి నర్భకుఁ గఱవఁ బంపు
నొకమాటు హేతిసంఘోగ్రానలములోన విసరి కుమారుని వేయఁ బంపు
నొకమాటు గూలంకషోల్లోల జలధిలో మొత్తించి శాబకు ముంపఁ బంపు
 
ఆ. విషము వెట్టఁ బంపు విదళింపఁగాఁ బంపు
దొడ్డకొండ చఱులఁ ద్రోయఁ బంపుఁ
బట్టి కట్టఁ బంపుఁ బాధింపఁగాఁ బంపు
బాలుఁ గినిసి దైత్యపాలుఁ డధిప!
198
సీ. ఒకవేళ నభిచార హోమంబు సేయించు నొకవేళ నెండల నుండఁ బంపు
నొకవేళ వానల నుపహతి నొందించు నొకవేల రంధ్రంబు లుక్కఁ బట్టు
నొకవేళఁ దనమాయ నొదవించి బెగడించు నొకవేళ మంచున నొంటి నిలుపు
నొకవేళఁ బెనుగాలి కున్ముఖుఁ గావించు నొకవేళఁ బాఁతించు ను ర్వియందు
 
తే. నీరు నన్నంబు నిడనీక నిగ్రహించుఁ
గశల నడిపించు ఱువ్వించు గండశిలల
గదల వ్రేయించు నేయించు ఘనశరములఁ
గొడుకు నొకవేళ నమరారి క్రోధి యగుచు.
199
వ. మఱియు ననేక మారణోపాయంబులఁ బాపరహితుం డైన పాపని రూపుమాప
లేక యేకాంతంబున దురంత చింతాపరిశ్రాంతుం డై రాక్షసేంద్రుండు దన మనంబున.
200
చ. ముంచితి వార్ధులం గదల మొత్తితి శైలతటంబులందుఁ ద్రొ
బ్బించితి శస్త్రరాజిఁ బొడిపించితి మీఁద నిభేంద్రపంక్తిఁ ద్రొ
క్కించితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్నులందుఁ ద్రో
యించితిఁ బెక్కు పాట్ల నలయించితిఁ జావఁ డి దేమి చిత్రమో!
201
చ. ఎఱుఁగడు జీవనౌషధము లెవ్వరు భర్తలు లేరు బాధల\న్‌
దరలఁడు నైజతేజమునఁ దథ్యము జాడ్యము లేదు మిక్కిలి\న్‌
మెఱయుచునున్నవాఁ డొక నిమేషము దైన్యము నొందఁ డింక నే
తెఱఁగునఁ ద్రుంతు? వేసారితి దివ్యము వీని ప్రభావ మెట్టిదో?
202
వ. అదియునుం గాక తొల్లి శునశ్శేఫుం డను మునికుమారుండు దండ్రిచేత
యాగ పశుత్వంబునకు దత్తుం డై తండ్రి దనకు నపకారి యని తలంపక
బ్రతికిన చందంబున.
203
క. ఆగ్రహమున నేఁ జేసిన
నిగ్రహములు పరులతోడ నెఱి నొకనాఁడు\న్‌
విగ్రహము లనుచుఁ బలుకఁ డ
నుగ్రహములుగాఁ దలంచు నొవ్వఁడు మదిలో\న్‌.
204
వ. కావున వీఁడు మహా తపఃప్రభావ సంపన్నుండు. వీని కెందును భయంబు లేదు.
వీనితోడి విరోధంబునం దనకు మృత్యువు సిద్ధించు. అని నిర్ణయించి, చిన్నఁ
బోయి ఖిన్నుం డై ప్రసన్నుండు గాక క్రిందు సూచుచు విషణ్ణుం డై చింతనంబు
సేయుచున్న రాజునకు మంతనంబునఁ జండామార్కు లి ట్లనిరి.
205
శా. శుభ్రఖ్యాతివి నీ ప్రభావము మహాచోద్యంబు దైత్యేంద్ర! రో
ష భ్రూయుగ్మ విజృంభనంబున దిగీశవ్రాతము\న్‌ బోరుల\న్‌
విభ్రాంతంబుగఁ జేసి యేలితి గదా! విశ్వంబు వీఁ డెంత! యీ
దభ్రోక్తుల్‌ గుణ హేతువులు చింతం బొంద నీ కేటికిన్‌.
206
ఉ. వక్రుం డైన జనుండు వృద్ధ గురు సేవం జేసి మేధా నయో
పక్రాంతి\న్‌ విలసిల్లు మీఁదట వయఃపాకంబుతో బాలకు\న్‌
శక్రద్వేషణ బద్ధు జేయుము మది\న్‌ జాలింపు మీ రోషము\న్‌
శుక్రాచార్యుఁడు వచ్చునంత కితఁడు\న్‌ సుశ్రీయుతుం డయ్యెడు\న్‌.
207
వ. అని గురుపుత్రులు పలికిన, రాక్షసేశ్వరుండు గృహస్థులైన రాజులకు నుపదేశింపం
దగిన ధర్మార్థ కామంబులు, ప్రహ్లాదునకు నుపదేశింపుం డని యనుజ్ఞ చేసిన,
వారును నతనికిఁ ద్రివర్గంబు నుపదేశించిన, నతండును, రాగద్వేషంబుల చేత
విషయాసక్తు లైన వారికి గ్రాహ్యంబు లైన ధర్మార్థ కామంబులు దనకు
నగ్రాహ్యంబు లనియును, వ్యవహార ప్రసిద్ధికొఱ కైన భేదంబు గాని యాత్మ
భేదంబు లే దనియు, ననర్థంబుల నర్థకల్పనంబు సేయుట దిగ్భ్రమం బనియును
నిశ్చయించి, గురూపదిష్ట శాస్త్రంబు మంచి దని తలంపక, గురువులు దమతమ
గృహస్థ కర్మానుష్ఠానంబులకుం బోయిన సమయంబున.
208
క. ఆటలకుఁ దన్ను రమ్మని
పాటించి నిశాటసుతులు భాషించిన దో
షాటకులేంద్ర కుమారుఁడు
పాటవమున వారిఁజేరి ప్రజ్ఞాన్వితుఁ డై.
209
క. చెప్పఁ డొకచదువు మంచిది
చెప్పెడిఁ దగులములు చెవులు చిందఱఁ గొనఁగా
నెప్పుడు మనయెడ నొజ్జలు
సెప్పెద నొక చదువు వినుఁడు చిత్తము లలర\న్‌.
210
వ. అని రాచకుమారుండు గావునఁ గరుణించి, సంగడికాండ్రతో నగియెడు చందంబునఁ
గ్రీడలాడుచు, సమానవయస్కు లైన దైత్యకుమారుల కెల్ల నేకాంతంబున ని ట్లనియె.
211
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )