ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
ఉ. బాలకులార! రండు మన ప్రాయముబాలురు కొంద ఱుర్విలో
గూలుట కంటిరే! గురుఁడు క్రూరుఁ డనర్థచయంబునందు దు
శ్శీలత నర్థకల్పనముఁ జేసెడి గ్రాహ్యము గాదు శాస్త్రముల్‌
మే లెఱిఁగించెద\న్‌ వినిన మీకు నిరంతర భద్ర మయ్యెడి\న్‌.
212
వ. వినుండు. సకల జన్మంబులందును ధర్మార్థాచరణ కారణం బైన మానుషజన్మంబు
దుర్లభంబు. అందుఁ బురుషత్వంబు దుర్గమంబు. అదియు శతవర్ష పరిమితం బైన
జీవితకాలంబు నియతం బై యుండు. అందు సగ మంధకార బంధురం బై రాత్రి
రూపంబున నిద్రాది వ్యవహారంబుల నిరర్థకం బై చను. చిక్కిన పంచాశ
ద్వత్సరంబులందును బాల్య కైశోర వయోవిశేషంబుల వింశతి హాయనంబులు గడచు.
కడమ ముప్పది యబ్దంబులు నింద్రియంబులచేతఁ బట్టువడి, దురవగాహంబు లైన
కామ క్రోధ లోభ మోహ మద మత్సరంబు లను పాశంబులఁ గట్టువడి, విడివడ
సమర్థుండు గాక ప్రాణంబుల కంటె మధురాయమానమైన తృష్ణకు లోనై భృత్య
తస్కర వణిక్కర్మంబులఁ బ్రాణహాని యైన నంగీకరించి, పరార్థంబుల
నర్థింపుచు రహస్య సంభోగచాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికా
లవిత్రంబు లైన కళత్రంబులను, మహనీయ మంజుల మధురాలాపంబులు గల్గి, వశు
లైన శిశువులను, శీల వయో రూప ధన్యలగు కన్యలను, వినయ వివేక
విద్యాలంకారు లైన కుమారులను, గామిత ఫలప్రదాత లగు భ్రాతలను, మమత్వ
ప్రేమ దైన్య జనకు లైన జననీ జనకులను, సకల సౌజన్య సింధువు లైన
బంధువులను, ధన కనక వస్తు వాహన సుందరంబు లైన మందిరంబులను, సుకరంబు
లైన పశు భృత్య నికరంబులను, వంశ పరంపరాయత్తంబు లైన విత్తంబులను
వర్జింప లేక, సంసారంబు నిర్జింప నుపాయంబుఁ గానక, తంతువర్గంబున
నిర్గమద్వార శూన్యం బైన మందిరంబుఁ జేరి చిక్కువడి, వెడలెడి పాటవంబు
సాలక తగులువడు కీటకంబు చందంబున, గృహస్థుండు స్వయంకృత కర్మబద్ధుం
డై, శిశ్నోదరాది సుఖంబులఁ బ్రమత్తుం డై, నిజ కుటుంబ పోషణ పారవశ్యంబున
విరక్తి మార్గంబు దెలియనేరక, స్వకీయ పరకీయ భిన్నభావంబున నంధకారంబునం
బ్రవేశించు. కావునఁ గౌమార సమయంబున మనీషాగరిష్ఠుం డై, పరమ
భాగవత ధర్మం బనుష్ఠింప వలయు. దుఃఖంబులు వాంఛితంబులు గాక చేకుఱు
భంగిని సుఖంబులును గాలానుసారంబు లై లబ్ధంబు లగు. కావున వృథా ప్రయాసం
బున నాయుర్వ్యయంబు సేయం దగదు. హరి భజనంబున మోక్షంబు సిద్ధించు. విష్ణుండు
సర్వ భూతంబులకు నాత్మేశ్వరుండు. ప్రియుండు. ముముక్షుం డగు దేహికి దేహావసాన
పర్యంతంబు నారాయణ చరణారవింద సేవనంబు కర్తవ్యంబు.
213
సీ. కంటిరే మనవారు ఘనులు గృహస్థు డై విఫలులై కైకొన్న వెఱ్ఱితనము
భద్రార్థుడై యుండి పాయరు సంసార పద్ధతి నూరక పట్టువడిరి
కలయోనులం దెల్ల గర్భా ద్యవస్థలఁ బురుషుండు దేహియై పుట్టుచుండుఁ
ద న్నెఱుంగఁడు కర్మతంత్రుఁ డై కడపల ముట్టఁడు భవశతములకు నైన
 
ఆ. దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు
జగతిఁ బుట్టి చచ్చి చచ్చి
పొరల నేల మనకుఁ బుట్టని చావని
త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి.
214
శా. హాలాపాన విజృంభమాణ మద గర్వారూఢ దేహోల్లస
ద్బాలాలోకన శృంఖలానిచయ సంబద్ధాత్ముఁ డై లేశము\న్‌
వేలా నిస్సరణంబు గానక మహావిద్వాంసుఁడు\న్‌ గామినీ
హేలాకృష్ట కురంగశాబక మగు\న్‌ హీనస్థితి\న్‌ వింటిరే.
215
ఆ. విషయ సక్తు లైన వివిధాహితుల తోడి
మనికి వలదు ముక్తి మార్గ వాంఛ
నాదిదేవు విష్ణు నాశ్రయింపుఁడు ముక్త
సంగజనులఁ గూడి శైశవమున.
216
వ. కావున విషయంబులఁ జిక్కువడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబు గాదు.
రమ్య మయ్యును, బహుతర ప్రయాసగమ్య మని తలంచితి రేనిఁ జెప్పెద. సర్వ
భూతాత్మకుం డై, సర్వ దిక్కాల సిద్ధుం డైన బ్రహ్మ కడపలగాఁ గల
చరాచర స్థూల సూక్ష్మ జీవసంఘంబు లందును, అంభోవాయుకుంభినీ గగన
తేజంబు లనియెడు మహాభూతంబులందును, భూతవికారంబు లైన ఘట
పటాదు లందును, గుణసామ్యం బైన ప్రధానమందును, గుణవ్యతికరంబైన మహత్తత్త్వాది
యందును, రజ స్సత్త్వ తమో గుణంబుల యందును, భగవంతుం డవ్యయుం డీశ్వరుండు
పరమాత్మ పరబ్రహ్మ మనియెడు వాచక శబ్దంబులుంగల్గి గేవలానుభవానంద
స్వరూపకుండు, నవికల్పితుండు, ననిర్దేశ్యుండు నైన పరమేశ్వరుండు త్రిగుణాత్మకం
బైన తన దివ్యమాయచేత నంతర్హి తైశ్వర్యుం డై, వ్యాప్యవ్యాపక రూపంబులంజేసి
దృశ్యుండును, ద్రష్టయు, భోగ్యుండును, భోక్తయు నై నిర్దేశింపం దగి, వికల్పితుం
డై యుండు. త త్కారణంబున నాసుర భావంబు విడిచి, సర్వభూతంబులందును దయా
సుహృ ద్భావంబులు కర్తవ్యంబులు. దయా సుహృద్భావంబులు గలిగిన నథోక్షజుండు
సంతసించు. అనంతుం, డాద్యుండు, హరి సంతసించిన నలభ్యం బెయ్యదియు లేదు.
జనార్దన చరణ సరసీరుహయుగళ స్మరణ సుధారసపాన పరవశుల మైతిమేని
మనకు దైవవశంబున నకాంక్షితంబులై సిద్ధించు ధర్మార్థ కామంబులును,
గాంక్షితం బై సిద్ధించు మోక్షం బన నేలను? త్రివర్గంబును, నాత్మవిద్యయుం, దర్క,
దండనీతి, జీవికాదు లన్నియును, త్రైగుణ్య విషయంబు లైన వేదంబులవలనం
బ్రతిపాద్యంబులు. నిస్త్రైగుణ్య లక్షణంబునం బరమపురుషుం డైన హరికి నాత్మ
సమర్పణంబు సేయుట మేలు. పరమాత్మ తత్త్వ జ్ఞానోదయంబునం జేసి స్వ పర
భ్రాంతిఁ జేయక పురుషుండు యోగావధూతత్వంబున నాత్మవికల్ప భేదంబునం
గలలోఁ గన్న విశేషంబుల భంగిఁ దథ్యం బనక మిథ్య యని తలంచు. అని
మఱియుఁ బ్రహ్లాదుం డి ట్లనియె.
217
మ. నరుఁడుం దానును మైత్రితో మెలఁగుచో నారాయణుం డింతయున్‌
వరుస న్నారద సంయమీశ్వరునకు\న్‌ వ్యాఖ్యానముం జేసె ము\న్‌
హరిభక్తాంఘ్రి పరాగ శుద్ధతను లేకాంతుల్‌ మహాకించనుల్‌
పరతత్త్వజ్ఞులుగాని నేరరు మది\న్‌ భావింప నీ జ్ఞానము\న్‌.
218
వ. తొల్లి నేను దివ్యదృష్టి గల నారదమహామునివలన సవిశేషం బైన యీ
జ్ఞానంబును బరమ భాగవత ధర్మంబును వింటి. అనిన వెఱఁగుపడి దైత్య బాలకు ల
ద్దనుజరాజ కుమారున కి ట్లనిరి.
219
ఉ. మంటిమి కూడి భార్గవ కుమారకు లొద్ద ననేక శాస్త్రముల్‌
వింటిమి లేఁడు సద్గురుఁడు వేఱొకఁ డెన్నఁడు రాజశాల ము
క్కంటికి నైన రాదు సొరఁగా వెలికిం జనరాదు నీకు ని
ష్కంటక వృత్తి నెవ్వఁడు ప్రగల్భుఁడు సెప్పె గుణాఢ్య! సెప్పుమా.
220
క. సేవింతుము ని న్నెప్పుడు
భావింతుము రాజ వనుచు బహుమానంబుల్‌
గావింతుము తెలియుము నీ
కీ వింత మతిప్రకాశ మే క్రియఁ గలిగెన్‌.
221
వ. అని యిట్లు దైత్యనందనులు ద న్నడిగినఁ బరమ భాగవత కులాలంకారుం డైన
ప్రహ్లాదుండు నగి, తనకు పూర్వంబునందు వినంబడిన నారదు మాటలు దలంచి
యి ట్లనియె.
222
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )