ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
శా. అక్షీణోగ్ర తపంబు మందరముపై నర్థించి మా తండ్రి శు
ద్ధక్షాంతిం జనియుండఁ జీమగమిచేత\న్‌ భోగిచందంబున\న్‌
భక్షింపంబడెఁ బూర్వపాపములచేఁ బాపాత్మకుం డంచు ము\న్‌
రక్షస్సంఘము మీఁద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై.
223
శా. ప్రస్థానోచిత భేరి భాంకృతులతోఁ బాకారియుం దారు శౌ
ర్య స్థైర్యంబుల నేఁగుదెంచినఁ దదీయాటోప విభ్రాంతు లై
స్వస్థేమల్‌ దిగనాడి పుత్ర ధన యోషా మిత్ర సంప త్కళా
ప్రస్థానంబులు డించి పాఱి రసురుల్‌ ప్రాణావనోద్యుక్తు లై.
224
మత్తకోకిల. ప్రల్లదంబున వేల్పు లుద్ధతిఁ బాఱి రాజనివాసము\న్‌
గొల్లవెట్టి సమస్తవిత్తముఁ గ్రూరతం గొనిపోవఁగా
నిల్లు సొచ్చి విశంకుఁ డై యమరేశ్వరుం డదలించి మా
తల్లిఁ దాఁ జెఱవట్టె సిగ్గునఁ దప్త యై విలపింపఁగా\న్‌.
225
వ. ఇట్లు సురేంద్రుండు మాతల్లినిం జెఱగొని పోవుచుండ, న మ్ముగుద కురరి
యను పులుఁగుక్రియ మొఱయిడినఁ, దెరువున దైవయోగంబున నారదుండు
పొడగని యి ట్లనియె.
226
ఉ. స్వర్భువనాధినాథ! సురసత్తమ! వేల్పులలోన మిక్కిలి
న్నిర్భర పుణ్యపూర్తివి సునీతివి మానినిఁ బట్టనేల యీ
గర్భిణి నాతుర\న్‌ విడువు కల్మషమానసురాలు గాదు నీ
దుర్భర రోషము న్నిలుపు దుర్జయుఁ డైన నిలింపవైరిపై.
227
వ. అనిన వేల్పుతపసికి వేయుఁగన్నులఠవర యి ట్లనియె. 228
ఉ. అంతనిధాన మైన దివిజాధిపు వీర్యము దీని కుక్షి న
త్యంతసమృద్ధి నొందెడి మహాత్మక! గావునఁ దత్ప్రసూతిప
ర్యంతము బద్ధఁ జేసి జనితార్భకు వజ్రపుధారఁ ద్రుంచి ని
శ్చింతుఁడ నై తుది\న్‌ విడుతు సిద్ధము దానవరాజ వల్లభ\న్‌.
229
వ. అని పలికిన వేల్పుఱేనికిఁ దపసి యి ట్లనియె. 230
శా. నిర్భీకుండు ప్రశస్త భాగవతుఁడు న్నిర్వైరి జన్మాంత రా
విర్భూ తాచ్యుత పాదభక్తి మహి మావిష్టుండు దైత్యాంగనా
గర్భస్థుం డగు బాలకుండు బహు సంగ్రా మా ద్యుపాయంబుల\న్‌
దుర్భావంబునఁ బొంది చావఁడు భవ ద్దోర్దర్ప విభ్రాంతుఁ డై.
231
వ. అని దేవముని నిర్దేశించిన, నతని వచనంబులు మన్నించి, తానును హరిభక్తుండు
గావున దేవేంద్రుండు భక్తి భావంబున మా యవ్వను విడిచి, వలగొని, సురలోకం
బునకుం జనియె. మునీంద్రుండు మ జ్జననియందుఁ బుత్రికాభావంబు చేసి యూఱడించి,
నిజాశ్రమంబునకుం గొనిపోయి, నీవు పతివ్రతవు. నీ యుదరంబునఁ బరమభాగవతుం
డైన ప్రాణి యున్నవాఁడు. తపోమహత్త్వంబునం గృతార్థుండై నీ పెనిమిటి
రాఁగలండు. అందాఁక నీ విక్కడ నుండుము. అనిన సమ్మతించి.
232
శా. యోషారత్నము నాథదేవత విశాలోద్యోగ మా తల్లి ని
ర్వైషమ్యంబున నాథురాక మదిలో వాంఛించి నిర్దోష యై
యీష ద్భీతియు లేక గర్భ పరిరక్షేచ్ఛ\న్‌ విచారించి శు
శ్రూషల్‌ సేయుచు నుండె నారదునకున్‌ సువ్యక్త శీలంబున\న్‌.
233
వ. ఇట్లు దనకుఁ బరిచర్య చేయుచున్న దైత్యరాజకుటుంబినికి నాశ్రితరక్షా విశారదుం
డైన నారదుండు నిజసామర్థ్యంబున నభయం బిచ్చి, గర్భస్థుం డైన నన్ను
నుద్దేశించి, ధర్మతత్త్వంబును, నిర్మలజ్ఞానంబును నుపదేశించిన, న మ్ముద్దియ
దద్దయుం బెద్దకాలంబునాఁటి వినికియుం గావున, నాఁడుది యగుటంజేసి, పరిపాటి
దప్పి సూటిలేక మఱచె. నారదుండు నా యెడఁ గృప గల నిమిత్తంబున.
234
క. వెల్లిగొని నాఁటనుండియు
నుల్లసితం బైన, దైవయోగంబున శో
భిల్లెడు మునిమత మంతయు
నుల్లంబున మఱపు పుట్ట దొకనాఁ డైన\న్‌.
235
ఆ. వినుఁడు నాదుపల్కు విశ్వసించితి రేని
సతుల కైన బాలజనుల కైనఁ
దెలియవచ్చు మేలు దేహాద్యహంకార
దళన నిపుణ మైన తపసిమతము.
236
వ. అని నారదోక్త ప్రకారంబున బాలకులకుఁ బ్రహ్లాదుం డి ట్లనియె. ఈశ్వరమూర్తి
యైన కాలంబునంజేసి వృక్షంబు గలుగుచుండ ఫలంబునకు జన్మ సంస్థాన వర్ధ
నాపక్షీణత్వ పరిపాక నాశనంబు ప్రాప్తంబు లైన తెఱంగున, దేహమునకుం గాని
షడ్భావవికారంబు లాత్మకు లేవు. ఆత్మ నిత్యుండు, క్షయరహితుండు, శుద్ధుండు,
క్షేత్రజ్ఞుండు, గగనాదులకు నాశ్రయుండు, క్రియాశూన్యుండు, స్వప్రకాశుండు,
సృష్టిహేతువు, వ్యాపకుండు, నిస్సంగుండు, పరిపూర్ణుండు, నొక్కండు నని వివేక
సమర్థంబులగు నాత్మలక్షణంబులు పండ్రెండు నెఱుంగుచు, దేహాదులందు మోహ
జనకంబులగు నహంకార మమకారంబులు విడిచి, పసిండిగనులు గల నెలవున విభ్రాజమాన
కనకలేశంబు లైన పాషాణాదులందుఁ బుటంబు వెట్టి, వహ్ని యోగంబున గరంగ నూఁది,
హేమకారకుండు పాటవంబున హాటకంబుఁ బడయుభంగి, నాత్మకృత కార్యకారణంబుల
నెఱింగెడి నేర్పరి, దేహంబునం దాత్మసిద్ధికొఱకు నైన యుపాయంబునంజేసి బ్రహ్మ
భావంబుఁ బడయు. మూలప్రకృతియు, మహ దహంకారంబులును, బంచ తన్మాత్రంబులు
నివి యెనిమిదియుం బ్రకృతు లనియును, రజస్సత్త్వ తమంబులు మూఁడును బ్రకృతి
గుణంబులనియును, గర్మేంద్రియంబు లైన వాక్పాణి పాదపాయూపస్థలును, జ్ఞానేంద్రియంబులైన
శ్రవణ నయన రసనా త్వగ్ఘ్రాణంబులును, మనంబును, మహీ సలిల తేజో వాయుగగనంబులును
నివి పదాఱును వికారంబు లనియును, గపిలాది పూర్వాచార్యులచేతం జెప్పంబడియె.
సాక్షిత్వంబున నీ యిరువదియేడింటిని నాత్మ గూడియుండు. పెక్కింటి కూటువ దేహము.
అదియు జంగమ స్థావర రూపంబుల రెండువిధంబు లయ్యె. మూలప్రకృతి మొదలైన
వర్గంబునకు వేఱై మణిగణంబులం జొచ్చియున్న సూత్రంబు చందంబున నాత్మ యిన్నింటి
యందునుం జొచ్చి దీపించు. ఆత్మకు జన్మ స్థితి లయంబులు గలవంచు మిథ్యాతత్పరులు
గాక, వివేకశుద్ధ మైన మనంబున విచారించి, దేహంబునం దాత్మ వెతకవలయు. ఆత్మకు
నవస్థలు గలయ ట్లుండుఁ గాని యవస్థలు లేవు. జాగరణ స్వప్న సుషుప్తు లను వృత్తు
లెవ్వనిచేత నెఱుంగంబడు, నతం డాత్మ యండ్రు. కుసుమధర్మంబు లైన గంధంబులచేత
గంధాశ్రయుం డైన వాయువు నెఱింగెడు భంగి ద్విగుణాత్మకంబు లై కర్మజన్యంబు లైన
బుద్ధి భేదంబుల నాత్మ నెఱుంగం దగు. అని చెప్పి.
237
సీ. సంసార మిది బుద్ధిసాధ్యము గుణకర్మ గణబద్ధ మజ్ఞాన కారణంబు
కలవంటి దింతియ కాని నిక్కము కాదు సర్వార్థములు మన స్సంభవములు
స్వప్న జాగరములు సమములు గుణశూన్యుఁ డగు పరమునికి గుణాశ్రయమున
భవనాశంబులు పాటిల్లి నట్లుండుఁ బట్టిచూచిన లేవు బాలురార!
 
తే. కడఁగి త్రిగుణాత్మకము లైన కర్మములకు
జనక మై వచ్చు నజ్ఞాన సముదయమును
ఘనతర జ్ఞానవహ్నిచేఁ గాల్చిపుచ్చి
కర్మవిరహితు లై హరిఁ గనుట మేలు.
238
వ. అది గావున గురుశుశ్రూషయు, సర్వలాభ సమర్పణంబును, సాధుజన సంగంబును
నీశ్వర ప్రతిమా సమారాధనంబును, హరికథా తత్పరత్వంబును, వాసుదేవుని యందలి
ప్రేమయు, నారాయణ గుణ కర్మ కథా నామ కీర్తనంబును, వైకుంఠ చరణకమల
ధ్యానంబును, విశ్వంభరమూర్తి విలోకన పూజనంబులును, మొద లైన విజ్ఞాన వైరాగ్య
లాభసాధనంబు లైన భాగవత ధర్మంబులపై రతి గలిగి, సర్వభూతంబులయందు
నీశ్వరుండు భగవంతుం డాత్మ గలం డని సన్మానంబు సేయుచుఁ, గామ క్రోధ
లోభ మోహ మద మత్సరంబుల గెలిచి, యింద్రియవర్గంబును బంధించి, భక్తి
సేయుచుండ నీశ్వరుం డైన విష్ణుదేవుని యందుల గతి సిద్ధించు.
239
సీ. దనుజారి లీలావతారంబులందలి శౌర్యకర్మంబులు సద్గుణములు
విని భక్తుఁ డగువాఁడు వేడ్కతోఁ బులకించుఁ గన్నుల హర్షాశ్రుకణము లొలుక
గద్గదస్వరముతోఁ గమలాక్ష! వైకుంఠ! వరద! నారాయణ! వాసుదేవ!
యనుచు నొత్తిలి పాడు నాడు నాక్రోశించు నగుఁ జింతనము సేయు నతి యొనర్చు
 
తే. మరులుకొని యుండుఁ దనలోన మాటలాడు
వేల్పుసోఁకిన పురుషునివృత్తిఁ దిరుగు
బంధములు వాసి యజ్ఞానపటలిఁ గాల్చి
విష్ణుఁ బ్రాపించుఁ దుది భక్తివశుఁ డగుచు.
240
వ. కావున రాగాదియుక్త మనస్కుం డైన శరీరికి సంసార చక్ర నివర్తకం బైన హరిచింతనంబు
బ్రహ్మమందలి నిర్వాణసుఖ మని బుధులు దెలియుదురు. హరి భజనంబు దుర్గమంబు
గాదు. హరి సకలప్రాణి హృదయంబులయందును నంతర్యామి యై యాకాశంబు భంగి
నుండు. విషయార్జనంబుల నయ్యెడిది లేదు. నిమిషభంగుర ప్రాణు లైన మర్త్యులకు
మమతాస్పదంబుల లగు చంచలంబు లైన పుత్ర మిత్ర కళత్ర పశు భృత్య బల బంధు
రాజ్య కోశ మణి మందిర మంత్రి మాతంగ మహీ ప్రముఖ విభవంబులు నిరర్థకంబులు.
యాగ ప్రముఖ పుణ్య లబ్ధంబు లైన స్వర్గాది లోక భోగంబులు పుణ్యానుభవ క్షీణంబులు
గాని, నిత్యంబులు గావు. నరుండు విద్వాంసుండ నని యభిమానించి, కర్మంబు లాచరించి,
యమోఘంబు లైన విపరీతఫలంబుల నొందు. కర్మంబులు కోరక చేయవలయు. కోరి
చేసిన దుఃఖములు ప్రాప్తించు. పురుషుండు దేహంబు కొఱకు భోగంబుల నపేక్షించు. దేహంబు
నిత్యంబు గాదు. తోడరాదు. మృతుం డైన వాని దేహమును శునకాదులు భక్షించు. దేహి
కర్మంబు లాచరించి, కర్మ బద్ధుం డై క్రమ్మఱం గర్మానుకూలం బైన దేహంబుఁ దాల్చు.
అజ్ఞానంబునం జేసి పురుషుండు కర్మదేహంబుల విస్తరించు. అజ్ఞానతంత్రంబులు ధర్మార్థ
కామంబులు. జ్ఞానలభ్యంబు మోక్షంబు. మోక్షప్రదాత యగు హరి సకల భూతంబులకు
నాత్మేశ్వరుండు. ప్రియుండు. తనచేత నైన మహాభూతంబుల తోడ జీవసంజ్ఞితుం డై
యుండు. నిష్కాము లై హృదయగతుం డైన హరిని నిజభక్తిని భజించవలయు.
241
క. దానవ దైత్య భుజంగమ
మానవ గంధర్వ సుర సమాజములో ల
క్ష్మీనాథు చరణకమల
ధ్యానంబున నెవ్వఁ డైన ధన్యత నొందు\న్‌.
242
క. చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ
జిక్కఁడు దానముల శౌచ శీల తపముల\న్‌
జిక్కఁడు యుక్తిని భక్తినిఁ
జిక్కినక్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ.
243
క. చాలదు భూదేవత్వము
చాలదు దేవత్వ మధిక శాంతత్వంబు\న్‌
చాలదు హరి మెప్పింప వి
శాలోద్యములార! భక్తి చాలినభంగి\న్‌.
244
ఆ. దనుజ భుజగ యక్ష దైత్య మృగాభీర
సుందరీ విహంగ శూద్ర శబరు
లైనఁ బాపజీవు లైన ముక్తికిఁ బోదు
రఖిలజగము విష్ణుఁ డనుచుఁ దలఁచి.
245
క. గురువులు తమకును లోఁబడు
తెరువులు సెప్పెదరు విష్ణు దివ్యపదవికి\న్‌
దెరువులు సెప్పరు చీఁకటి
బరువులు వెట్టంగనేల బాలకులారా!
246
క. తెం డెల్ల పుస్తకంబులు
నిం డాచార్యులకు మఱల నేకతమునకు\న్‌
రండు విశేషము సెప్పెదఁ
బొం డొల్లనివారు కర్మపుంజము పాలై.
247
క. ఆడుదము మనము హరి రతిఁ
బాడుద మే ప్రొద్దు విష్ణు భద్రయశంబుల్‌
వీడుదము దనుజసంగతిఁ
గూడుదము ముకుంద భక్తకోటి\న్‌ సూటి\న్‌.
248
క. విత్తము సంసృతిపటలము
వ్రత్తము కామాది వైరివర్గంబుల నేఁ
డిత్తము చిత్తము హరికినిఁ
జొత్తము నిర్వాణపదము శుభమగు మనకున్‌.
249
వ. అని యిట్లు ప్రహ్లాదుండు రహస్యంబున న య్యా వేళల రాక్షసకుమారులకు
నపవర్గమార్గంబు నెఱింగించిన, వారును గురుశిక్షితంబు లైన చదువులు సాలించి,
నారాయణభక్తిఁ జిత్తములం గీలించియుండుటఁ జూచి, వారల యేకాంతభావంబుఁ
దెలిసి, వెఱచి, వచ్చి, శుక్రాచార్యు నందనుండు శక్రవైరి కి ట్లనియె.
250
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )