ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
శా. రక్షోబాలుర నెల్ల నీకొడుకు చేరం జీరి లోలోన నా
శిక్షామార్గము లెల్లఁ గల్ల లని యాక్షేపించి తా నందఱ\న్‌
మోక్షాయత్తులఁ జేసినాఁడు మనకున్‌ మోసంబు వాటిల్లె నీ
దక్షత్వంబునఁ జక్కఁ జేయవలయు\న్‌ దైతేయ వంశాగ్రణీ!
251
క. ఉల్లసిత విష్ణుకథనము
లెల్లప్పుడు మాకుఁ జెప్పఁ డీ గురుఁ డని న
న్నుల్లంఘించి కుమారకు
లొల్లరు చదువంగఁ దానవోత్తమ! వింటే.
252
క. ఉడుగఁడు మధురిపు కథనము
విడివడి జడుపగిదిఁ దిరుగు వికసనమున నే
నొడివిన నొడువులు నొడువఁడు
దుడుకనిఁ జదివింప మాకు దుర్లభ మధిపా!
253
క. చొక్కపు రక్కసికులమున
వెక్కురు జన్మించినాఁడు పీతాంబరుని
న్నిక్కపు మక్కువఁ గొలిచెడి
నెక్కడి సుతుఁ గంటి రాక్షసేశ్వర! వెఱ్ఱి\న్‌.
254
వ. అని యిట్లు గురుసుతుండు సెప్పిన కొడుకువలని విరోధవ్యవహారంబులు కర్ణ
రంధ్రంబులందు ఖడ్గప్రహారంబు లై సోఁకిన బిట్టు మిట్టిపడి, పాదతాడితం బైన
భుజంగంబుభంగి బవనప్రేరితం బైన దవానలంబు చందంబున, దండితాడితం
బైన కంఠీరవంబు కై వడి, భీషణ రోష రసావేశ జాజ్వల్యమాన చిత్తుండును,
పుత్ర సంహా రోద్యోగ యుక్తుండును గంపమాన గాత్రుండును, నరుణీకృత నేత్రుండును
నై కొడుకును రప్పించి, సమ్మానకృత్యంబులు దప్పించి, నిర్దయుం డై యశనిసంకాశ
భాషణంబుల నదల్చుచు.
255
శా. సూను\న్‌ శాంతగుణ ప్రధాను నతి సంశుద్ధాంచిత జ్ఞాను న
జ్ఞానారణ్య కృశాను నంజలిపుటీ సంభ్రాజమాను\న్‌ సదా
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృ తాస్వాదనా
ధీను\న్‌ ధిక్కరణంబుఁ జేసి పలికెం దేవాహితుం డుగ్రత\న్‌.
256
సీ. అస్మదీయం బగు నాదేశమునఁ గాని మిక్కిలి రవి మింట మెఱయ వెఱచు
నన్ని కాలములందు ననుకూలుఁ డై కాని విద్వేషి యై గాలి వీవ వెఱచు
మత్ప్రతాపానల మందీకృతార్చి యై విచ్చలవిడి నగ్ని వెలుఁగ వెఱచు
నతితీక్ష్ణ మైన నా యాజ్ఞ నుల్లంఘించి శమనుండు ప్రాణులఁ జంప వెఱచు
 
తే. నింద్రుఁ డౌదల నామ్రోల నెత్త వెఱచు
నమర కిన్నర గంధర్వ యక్ష విహగ
నాగ విద్యాధ రావళి నాకు వెఱచు
నేల వెఱవవు పలువ! నీకేది దిక్కు.
257
శా. ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్ద్వేషు లయ్యు\న్‌ మదీ
యాజ్ఞాభంగము సేయ నోడుదురు రోషాపాంగ దృష్టి\న్‌ వివే
క జ్ఞానచ్యుత మై జగత్త్రితయముం గంపించు నీ విట్టిచో
నాజ్ఞోల్లంఘన మెట్లు సేసితివి సాహంకారత\న్‌ దుర్మతీ!
258
శా. కంఠక్షోభము గాఁగ నొత్తిలి మహాగాఢంబుగా డింభ! వై
కుంఠుం జెప్పెదు దుర్జయుం డనుచు వైకుంఠుండు వీరవ్రతో
త్కంఠాబంధురుఁ డేని నే నమరుల\న్‌ ఖండింప దండింపఁగాఁ
గుంఠీభూతుఁడు గాక రావలదె మద్ఘోరాహవ క్షోణికి\న్‌.
259
శా. ఆచార్యోక్తము మాని బాలురకు మోక్షాసక్తిఁ బుట్టించి నీ
వాచాలత్వముఁ జూపి విష్ణు నహితున్‌ వర్ణించి మ ద్దైత్యవం
శాచారంబులు నీఱు చేసితివి మూఢాత్ముం గులద్రోహి ని
న్నీచుం జంపుట మేలు చంపి కులము న్నిర్దోషముం జేసెద\న్‌.
260
క. దిక్కులు గెలిచితి నన్నియు
ది క్కెవ్వఁడు రోరి! నీకు దేవేంద్రాదుల్‌
దిక్కుల రాజులు వేఱొక
ది క్కెఱుఁగక కొలుతు రితఁడె దిక్కని నన్నున్‌.
261
క. బలవంతుఁడ నే జగముల
బలములతోఁ జనక వీరభావమున మహా
బలుల జయించితి నెవ్వని
బలమున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడ వై.
262
వ. అనినఁ దండ్రికి మెల్ల మెల్లన వినయంబుతోఁ గొడు కి ట్లనియె. 263
క. బలయుతులకు దుర్బలులకు
బల మెవ్వఁడు నీకు నాకు బ్రహ్మాదులకు\న్‌
బల మెవ్వఁడు ప్రాణులకును
బల మెవ్వం డట్టి విభుఁడు బల మసురేంద్రా!
264
క. దిక్కులు కాలముతో నే
దిక్కున లే కుండుఁ గలుగు దిక్కుల మొదలై
దిక్కు గల లేనివారికి
ది క్కెయ్యది యదియు నాకు దిక్కు మహాత్మా!
265
సీ. కాలరూపంబులఁ గల విశేషంబుల నలఘు గుణాశ్రయుం డైన విభుఁడు
సత్త్వ బలేంద్రియ సహజ ప్రభావాత్ముఁడై వినోదంబుల నఖిలజగముఁ
గల్పించు రక్షించు ఖండించు నవ్యయుం డన్ని రూపములందు నతఁడు గలఁడు
చిత్తంబు సమముగాఁ జేయుము మార్గంబు దప్పి వర్తించు చిత్తంబుకంటె
 
తే. వైరు లెవ్వరు? చిత్తంబు వైరి గాక
చిత్తమును నీకు వశముగాఁ జేయవయ్య!
మదయుతాసురభావంబు మానవయ్య!
యయ్య! నీ మ్రోల మే లాడరయ్య! జనులు.
266
ఉ. లోకము లన్నియు\న్‌ గడియలోన జయించినవాఁడ వింద్రియా
నీకముఁ జిత్తముం గెలువ నేరవు నిన్ను నిబద్ధుఁ జేయు నీ
భీకర శత్రు లార్వురఁ బ్రభిన్నులఁ జేసినఁ బ్రాణికోటిలో
నీకు విరోధి లేఁ డొకఁడు నేర్పునఁ జూడుము దానవేశ్వరా!
267
క. పాలింపుము శేముషి ను
న్మూలింపుము కర్మబంధమున సమదృష్టి\న్‌
జాలింపుము సంసారముఁ
గీలింపుము హృదయమందుఁ గేశవభక్తి\న్‌.
268
వ. అనినఁ బరమ భాగవత శేఖరునకు దోషాచరశేఖరుం డి ట్లనియె. 269
క. చంపినఁ జచ్చెద ననుచును
గంపింపక యోరి పలువ! కఠినోక్తుల న\న్‌
గుంపించెదు చావునకు\న్‌
దెంపరి వై వదరు వాని తెఱఁగునఁ గుమతీ!
270
శా. నాతోడం బ్రతిభాష లాడెదు జగన్నాథుండు నాకంటె నీ
భూతశ్రేణికి రాజు లే డొకఁడు సంపూర్ణ ప్రభావుండు మ
ద్భ్రాతం జంపిన మున్ను నే వెదకితి\న్‌ బల్మాఱు నారాయణుం
డేత ద్విశ్వములోన లేఁడు మఱి వాఁ డెందుండురా దుర్మతీ!
271
క. ఎక్కడఁ గలఁ డే క్రియ నే
చక్కిని వర్తించు నెట్టిజాడను వచ్చున్‌!
జక్కడుతు నిన్ను విష్ణునిఁ
బెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిది\న్‌.
272
వ. అనిన, హరికింకరుండు శంకింపక హర్ష పులకాంకుర సంకలిత విగ్రహుం డై
యాగ్రహంబు లేక హృదయంబునఁ గేశవునిం దలంచి, నమస్కరించి, బాల
వర్తనంబుల నర్తనంబులు సేయుచు ని ట్లనియె.
273
మ. కలఁ డంబోధిఁ గలండు గాలిఁ గలఁ డాకాశంబునం గుంభిని\న్‌
గలఁ డగ్ని\న్‌ దిశలం బగళ్ళ నిశలన్‌ ఖద్యోత చంద్రాత్మలన్‌
గలఁ డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగ వ్యక్తులం దంతట\న్‌
గలఁ డీశుండు గలండు దండ్రి! వెదకంగా నేల యీ యా యెడ\న్‌.
274
క. ఇందుఁ గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నం దందే గలఁడు దానవాగ్రణి! వింటే.
275
వ. అని యి వ్విధంబున. 276
మ. హరి సర్వాకృతులం గలం డనుచుఁ బ్రహ్లాదుండు భాషింప స
త్వరుఁ డై యెందును లేఁడుఁ లేఁ డని సుతుం దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుఁడు నానాజంగమ స్థావరో
త్కర గర్భంబుల నన్నిదేశముల నుద్దండ ప్రభావంబున\న్‌.
277
వ. అ య్యవసరంబున దానవేంద్రుండు. 278
క. డింభక! సర్వస్థలముల
నంభోరుహనేత్రుఁ డుండు నంచు మిగుల సం
రంభమునఁ బలికెద వీ
స్తంభంబునఁ జూపఁగలవె చక్రిం గిక్రి\న్‌.
279
క. స్తంభమునఁ జూపవేనియుఁ
గుంభిని నీ శిరము ద్రుంచి కూల్పఁగ రక్షా
రంభమున వచ్చి హరి వి
స్రంభంబున నడ్డపడఁగ శక్తుం డగునే.
280
వ. అనిన భక్తవత్సలుం డగు శ్రీహరి పరమభక్తుం డైన ప్రహ్లాదుం డి ట్లనియె. 281
శా. అంభోజాసనుఁ డాది గాఁగఁ దృణపర్యంతంబు విశ్వాత్ముఁ డై
సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబులో నుండఁడే
స్తంభాతర్గతుఁ డయ్యు నుండుటకు నే సందేహము\న్‌ లేదు ని
ర్దంభత్వంబున నేఁడు గానఁబడుఁ బ్రత్యక్ష స్వరూపంబున\న్‌.
282
వ. అనిన విని కరాళించి, గ్రద్దన లేచి, గద్దియ డిగ్గ నుఱికి, యొఱ వెఱికిన ఖడ్గంబుఁ
గేల నమర్చి, జళిపించుచు, మహాభాగవతశిఖామణి యైన ప్రహ్లాదుని ధిక్కరింపుచు.
283
మ. వినరా! డింభక! మూఢచిత్త! గరిమన్‌ విష్ణుండు విశ్వాత్మకుం
డని భాషించెద వైన నిందుఁ గలఁడే యంచు\న్‌ మదోద్రేకి యై
దనుజేంద్రుం డఱచేత వ్రేసెను మహోదగ్ర ప్రభా శుంభము\న్‌
జన దృగ్భీషణ దంభము\న్‌ హరిజను స్సంరంభము\న్‌ స్తంభమున్‌.
284
శ్రీహరి నరసింహ రూపమున స్తంభంబునం దావిర్భవించుట
వ. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన
రోషానలుండును, రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్య
ధైర్య జేగీయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామస
గుణ చంక్రమ్యమాణ స్థైర్యుండును నై, విస్రంభంబున హుంకరించి, బాలుని ధిక్కరించి,
హరి నిందుఁ జూపుమని, కన త్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా
దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తం బగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన,
వ్రేటుతోడన దశదిశలును మిణుఁగురులు సెదఱఁ జిటిలి, పెటిలి పడి, బంభజ్యమానం బగు
న మ్మహాస్తంభంబు వలనఁ బ్రళయవేళా సంభూత సప్త స్కంధ బంధుర సమీరణ సంఘటిత
జోఘుష్యమాణ మహా బలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాతసంఘ నిర్ఘోష
నికాశంబు లైన ఛటచ్ఛట, స్ఫటస్ఫట ధ్వనిప్రముఖ భయంకరారావపుంజంబులు జంజన్య
మానంబు లై యెగసి, యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు సేసి నిండినం బట్టు చాలక,
దోదూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ
చరాచర జంతుజాలంబుల తోడ బ్రహ్మాండకటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ, బ్రఫుల్ల పద్మ
యుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును,
చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర
కూర్మ కుల శేఖరుండును, దుగ్ధజలధి జాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ
మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ
వలయిత పీతాంబర శోభిత కటిప్రదేశుండును, నిర్జర నిమ్నగావర్త వర్తుల కమలాకర గంభీర నాభీ
వివరుండును, ముష్టిపరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును, కులాచల సానుభాగ సదృశ
కర్కశ విశాల వక్షుండును, దుర్జన దనుజభట ధైర్యలతికా లవిత్రాయమాన, రక్షోరాజ వక్షోభాగ
విశంకటక్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన, ప్రతాపజ్వలన జ్వాలాయమాన, శరణాగత నయన
చకోర చంద్రరేఖాయమాన, వజ్రాయుధప్రతిమాన భాసమాన, నిశాత ఖరతర ముఖనఖరుండును,
శంఖ చక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ
సన్నిభ వీరసాగర వేలాయమాన, మాలికా విరాజమాన, నిరర్గళానేకశత భుజార్గళుండును, మంజు
మంజీర మణిపుంజ రంజిత మంజుల హారకేయూర కంకణ కిరీట మకరకుండలాది భూషణ
భూషితుండును, త్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును, ప్రకంపన కంపిత
పారిజాతపాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును, శరత్కాల మేఘజాల మధ్యమ
ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, కల్పాంతకాల సకలభువన
గ్రసన విలసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వా తులిత తరళతరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును,
మేరుమందర మహా గుహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును, నాసికావివర నిస్సర
న్నిబిడ నిశ్శ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును, పూర్వపర్వత
విద్యోతమాన ఖద్యోతమండలసదృక్ష సమంచిత లోచనుండును, లోచనాంచల సముత్కీర్యమాణ
విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకా గ్రహ మండలుండును, శక్ర చాప
సురుచిరోదగ్ర మహా భ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును, ఘనతర గండశైల తుల్య
కమనీయ గండభాగుండును, సంధ్యారాగ రక్త ధారాధరమాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన
పటుతర సటాజాలుండును, సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక
విమానుండును, నిష్కంపిత శంఖ వర్ణ మహోర్ధ్వకర్ణుండును, మంథదండాయమాన మందర
వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశికల్లోల
శీకరాకార భాసుర కేసరుండును, పర్వాఖర్వ శిశిర కిరణమయూఖ గౌర తనూరుహుండును,
నిజ గర్జననినాద నిర్దళిత కుముద సుప్రతీక వామనైరావత సార్వభౌమ ప్రముఖ ధిగిభరాజ కర్ణ
కోటరుండును, ధవళ ధరాధర దీర్ఘదురవలోకనీయ దేహుండును, దేహ ప్రభాపటల నిర్మథ్యమాన
పరిపంథి యాతుధాన నికురుంబ గర్వాంధకారుండును, బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన
నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును
నైన శ్రీనృసింహదేవుం డావిర్భవించినం గనుంగొని.
285
క. నరమూర్తి గాదు కేవల
హరిమూర్తియుఁ గాదు మానవాకారము కే
సరియాకారము నున్నది
హరి మాయారచిత మగు యథార్ధము సూడ\న్‌.
286
ఉ. తెంపున బాలుఁ డాడిన సుధీరత సర్వగతత్వముం బ్రతి
ష్ఠింపఁ దలంచి యిందు నరసింహశరీరము దాల్చి చక్రి శి
క్షింపఁగ వచ్చినాఁడు హరిచే మృతి యంచుఁ దలంతు నైన నా
సొంపునుఁ బెంపు నందఱును జూడఁ జరింతు హరింతు శత్రుని\న్‌.
287
నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించుట
వ. అని మెత్తంబడని చిత్తంబున గద యెత్తికొని, తత్తఱంబున నార్చుచు నకుంఠిత
కంఠీరవంబు డగ్గఱు గంధసింధురంబు చందంబున నక్తంచరకుంజరుండు నరసింహ
దేవుని కెదురు నడచి, తదీయ దివ్య తేజోజాల సన్నికర్షంబునంజేసి దవానలంబు
డగ్గఱిన ఖద్యోతంబునుంబోలెఁ గర్తవ్యాకర్తవ్యంబులు దెలియక నిర్గత ప్రభుం
డై యుండె. అంత.
288
మ. ప్రకటం బై ప్రళయావసానమున ము\న్‌ బ్రహ్మాండభాం డావరో
ధక మై యున్న తమిస్రముం జగము నుత్పాదించుచోఁ ద్రావి సా
త్త్విక తేజోనిధి యైన విష్ణునెడ నుద్దీపించునే నష్ట మై
వికలం బై చెడుఁ గాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమా!
289
వ. అంత నద్దానవేంద్రుండు మహోద్దండం బగు గదాదండంబు గిరగిరఁ ద్రిప్పి,
నరమృగేంద్రుని వ్రేసిన, నతండు దర్పంబున సర్పంబు నొడిసిపట్టు సర్పపరిగంథి నేర్పున
దితిపట్టిం బట్టికొనిన, మిట్టిపడి, దట్టించి, బిట్టు కట్టలుక న య్యసురవరుండు
దృఢబలంబున నిట్టట్టు మిడిసి, పట్టుదప్పించుకొని, విడివడి, దిటవుతప్పక కుప్పించి,
యుప్పరంబున కెగసి, విహంగకులరాజచరణ నిర్గళిత భుజంగంబు చందంబునఁ దలంగ
నుఱికి, తన భుజాటోపంబున వరకంఠీరవుండు కుంఠితుం డయ్యెడి నని తలంచి, కలంగక
చెలంగుచుఁ, దన్ను నిబిడ నీరదనికరంబుల మాటున నిలింపులు గుంపులుగొని డాఁగి మూఁగి
క్రమ్మఱ నాత్మీయ జీవనశంకా కలంకితు లై మంతనంబులఁ జింతనంబులు సేయుచు నిరీక్షింప,
నక్షీణ సమరదక్షతా విశేషం బుపలక్షించి, ఖడ్గ వర్మంబులు ధరియించి, భూనభోభాగంబుల
వివిధ విచిత్ర లంఘన లాఘవంబులఁ బరిభ్రమణభేదంబులఁ గరాళవదనుం డై యంతరాళంబున
దిరుగు సాళువడేగచందంబున సంచరించిన సహింపక.
290
సీ. పంచాన నోద్ధూత పావక జ్వాలల భూనభోంతర మెల్లఁ బూరితము
దంష్ట్రాకు రాభీల ధగధగాయిత దీప్తి నసురేంద్రు నేత్రము లంధములుగఁ
గంటక సన్ని భోత్కట కేసరాహతి, నభ్ర సంఘము భిన్న మై చరింపఁ
బ్రళయాభ్ర చంచ లాప్రతిమ భాస్వరము లై ఖరనఖరోచులు గ్రమ్ముదేర
 
తే. సటలు జళిపించి గర్జించి సంభ్రమించి
దృష్టి సారించి బొమలు బంధించి కెరలి
జిహ్వ యాడించి లంఘించి చేత నొడసి
పట్టె నరసింహుఁ డా దితిపట్టి నధిప!
291
క. సరకు గొనక లీలాగతి
నురగేంద్రుఁడు మూషికంబు నొడిసినభంగి\న్‌
నరకేసరి దను నొడిసిన
సురవిమతుఁడు బ్రానభీతి సుడివడియె నృపా!
292
క. సురరాజ వైరి లోఁబడెఁ
బరిభావిత సాధు భక్త పటాలాంహునకు\న్‌
నరసింహునకు నుదంచ
త్ఖరతర జిహ్వునకు నుగ్రతర రంహునకున్‌.
293
వ. అంత. 294
మ. విహగేంద్రుం డహి వ్రచ్చుకైవడి మహోద్వృత్తి న్నృసింహుండు సా
గ్రహుఁ డై యూరువులందుఁ జేర్చి నఖసంఘాతంబుల\న్‌ వ్రచ్చె దు
స్సహు దంభోళి కఠోర దేహు నచలోత్సాహున్‌ మహాబాహు నిం
ద్ర హుతా శాంతక భీకరున్‌ ఘనకరున్‌ దైత్యాన్వయ శ్రీకరున్‌.
295
శా. చించున్‌ హృత్కమలంబు శోణితము వర్షించు\న్‌ ధరామండలి\న్‌
ద్రెంచుం గర్కశ నాడికావళులు భేదించున్‌ మహా వక్షము\న్‌
ద్రుంచున్‌ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురున్‌ వ్రచ్చి ద
ర్పించుం బ్రేవులు కంఠమాలికలు కల్పించు న్నఖోద్భాసి యై.
296
సీ. వక్షః కవాటంబు వ్రక్కలు సేయుచో ఘన కుఠారంబుల కరణి నొప్పు
గంభీర హృదయపంకజము భేదించుచోఁ గుద్దాలముల భంగిఁ గొమరు మిగులు
ధమనీ వితానంబుఁ దగిలి ఖండించుచోఁ బటు లవిత్రంబుల పగిది మెఱయు
జఠర విశా లాంత్రజాలంబుఁ ద్రెంచుచోఁ గ్రకచ సంఘంబుల గరిమఁ జూపు
 
తే. నంకగతుఁ డైన దైత్యుని నాగ్రహమున
శస్త్రచయముల నొంపక సంహరించి
యమరు నరసింహు నఖరంబు లతివిచిత్ర
సమర ముఖరంబు లై యుండె జనవరేణ్య!
297
క. స్ఫురిత విబుధజన ముఖములు
పరివిదళిత దనుజ నివహగతి తను ముఖముల్‌
గురురుచి జిత శిఖిశిఖములు
నరహరి కరనఖము లమరు నతజన సఖముల్‌.
298
వ. ఇట్లు కేవల పురుషరూపంబును మృగరూపంబునుం గాని నరసింహ రూపంబున రేయునుం
బగలునుం గాని సంధ్యాసమయంబున, నంతరంగంబును బహిరంగంబును గాని సభా
ద్వారంబున, గగనంబును భూమియుం గాని యూరుమధ్యంబున, బ్రాణసహితంబులును
బ్రాణరహితంబులును గాని నఖంబులం, ద్రైలోక్యజన హృదయభల్లుం డైన దైత్య మల్లుని
వధియించి, మహా దహన కీలాభీల దర్శనుండును, కరాళ వదనుండును, లేలిహాన భీషణ
జిహ్వుండును, శోణితపంకాంకిత కేసరుండునునై ప్రేవులు కంఠమాలికలుగ ధరించి, కుంభి
కుంభ విదళనంబుఁ జేసి చనుదెంచు పంచాననంబునుం బోలె దనుజకుంజర హృదయకమల
విదళనంబుం జేసి, తదీయ రక్తసిక్తంబు లైన నఖంబులు సంధ్యారాగ రక్త చంద్రరేఖ చెలువు
వహింప, సహింపలేక లేచి, తన కట్టెదుర నాయుధంబు లెత్తుకొని, తత్తఱంబున రణంబునకు
నురవణించు రక్కసులం బెక్కు సహస్రంబులం జక్రాది నిర్వక్రసాధనంబుల నొక్కనిం
జిక్కకుండం జక్కడిచె. ఇవ్విధంబున.
299
శా. రక్షోవీరుల నెల్లఁ ద్రుంచి రణసంరంభంబు చాలించి దృ
ష్టి క్షేపంబు భయంకరంబుగ సభాసింహాస నారూఢుఁ డై
యక్షీ ణాగ్రహుఁ డై నృసింహుఁడు కరాళాస్యంబుతో నొప్పెఁ దన్‌
వీక్షింపం బరికింప నోడి యమరుల్‌ విభ్రాంతు లై డాఁగఁగన్‌.
300
క. సుర చారణ విద్యాధర
గరుడోరగ యక్ష సిద్ధ గణములలో నొ
క్కరుఁ డైన డాయ వెఱచును
నరహరి న య్యవసరమున నరలోకేశా!
301
క. తర్షంబుల నరసింహుని
హర్షంబులఁ జూచి నిర్జరాంగనలు మహో
త్కర్షంబులఁ గుసుమంబుల
వర్షంబులు గురిసి రుత్సవంబుల నధిపా!
302
వ. మఱియు, న య్యవసరంబున మింట ననేక దేవతావిమానంబులును, గంధర్వ గానంబులును,
నప్సరోగణ నర్తనసంవిధానంబులును, దివ్య కాహళ భేరీ పటహ మురజాది ధ్వానంబులును
బ్రకాశమానంబు లయ్యె. సునంద కుముదాదు లైన హరి పార్శ్వచరులును, మహేశ్వర విరించి
మహేంద్ర పురస్సరు లగు త్రిదశ కిన్నర కింపురుష పన్నగ సిద్ధ సాధ్య గరుడ గంధర్వ
చారణ విద్యాధరాదులును, మునులును, మనులును, బ్రజాపతులును, నరకంఠీరవ
దర్శనోత్కంఠితు లై చనుదెంచి.
303
బ్రహ్మాది దేవతలు నృసింహమూర్తిని వేఱువేఱ స్తుతించుట
క. కర కమలయుగళ కీలిత
శిరు లై డగ్గఱక భక్తిఁ జేసిరి బహు సం
సరణాబ్ధి తరికి నఖరికి
నరభోజనహస్తి హరికి నరకేసరికి\న్‌.
304
వ. ఆ సమయమున దేవత లందఱు వేఱువేఱ వినుతించిరి. అందుఁ గమలాసనుం డి ట్లనియె. 305
మ. ఘనలీలాగుణ చాతురి\న్‌ భువనముల్‌ గల్పించి రక్షించి భే
దనముం జేయు దురంతశక్తికి ననంతజ్యోతికి\న్‌ జిత్రవీ
ర్యునికి న్నిత్య పవిత్రకర్మునికి నే నుత్కంఠతో నవ్యయా
త్మునికి\న్‌ వందన మాచరించెదఁ గృపాముఖ్య ప్రసాదార్థి నై.
306
వ. రుద్రుం డి ట్లనియె. 307
చ. అమరవరేణ్య! మిఁదట సహస్ర యుగాంతము గాంతము నాఁడు గాని కో
పమునకు వేళగాదు సురబాధకుఁ డైన తమస్వినీచరు\న్‌
సమరమునన్‌ వధించితివి చాలుఁ దదాత్మజుఁ డైన వీఁడు స
ద్విమలుఁడు నీకు భక్తుఁడు పవిత్రుఁడు గావుము భక్తవత్సలా!
308
వ. ఇంద్రుం డి ట్లనియె. 309
సీ. ప్రాణిసంఘముల హృత్పద్మ మధ్యంబుల నివసించి భాసిల్లు నీవ యెఱుఁగు
దింతకాలము దానవేశ్వరుచే బాధపడి చిక్కియున్న యాపన్నజనుల
రక్షించితివి మమ్ము రాక్షసేశ్వరుఁ జంపి క్రతుహవ్యములు మాకుఁ గలిగె మఱల
మంటిమి నీసేవ మరగినవారలు కైవల్యవిభవంబు కాంక్షసేయ
 
ఆ. రితరసుఖము లెల్ల నిచ్ఛయింపఁగ నేల
యస్థిరంబు లివి యనంతభక్తిఁ
గొలువ నిమ్ము నిన్ను ఘోర దైత్యానీక
చిత్తభయద రంహ! శ్రీనృసింహ!
310
వ. ఋషు లి ట్లనిరి. 311
మ. భవదీ యోదరలీన లోకముల నుత్పాదించి రక్షించ నేఁ
డవి దైత్యేశునిచేత భేదితము లై హ్రస్వంబు లై యుండ నీ
యవినీతు న్నరసింహరూపమున సంహారంబు నొందించి వే
దవిధిం గ్రమ్మఱ నుద్ధరించితిగదా! ధర్మానుసంధాయి వై.
312
వ. పితృదేవత లి ట్లనిరి. 313
శా. చండ క్రోధముతోడ దైత్యుఁడు వడి\న్‌ శ్రాద్ధంబుల\న్‌ మత్సుతుల్‌
పిండంబుల్‌ సతిలోదకంబులుగ నర్పింపంగ మా కీక యు
ద్దండత్వంబునఁ దానె కైకొను మహోదగ్రుండు వీఁ డిక్కడ\న్‌
ఖండింపంబడె నీ నఖంబుల నుతుల్‌ గావింతు మాత్మేశ్వరా!
314
వ. సిద్ధు లి ట్లనిరి. 315
క. క్రుద్ధుం డై యణిమాదిక
సిద్ధులు గైకొనిన దైత్యుఁ జీరితివి మహా
యోద్ధవు నీ కృప మాకును
సిద్ధులు మఱలంగఁ గలిగె శ్రీనరసింహా!
316
వ. విద్యాధరు లి ట్లనిరి. 317
క. దానవునిఁ జంపి యంత
ర్ధానాదిక విద్యలెల్ల దయతో మఱలం
గా నిచ్చితివి విచిత్రము
నీ నిరుపమ వైభవంబు నిజము నృసింహా!
318
వ. భుజంగు లి ట్లనిరి. 319
క. రత్నములను మత్కాంతా
రత్నములనుఁ బుచ్చుకొన్న రక్కసు నురము\న్‌
యత్నమున వ్రచ్చి వేసితి
పత్నులు రత్నములు గలిగెఁ బ్రతికితి మీశా!
320
వ. మనువు లి ట్లనిరి. 321
క. దుర్ణయుని దైత్యుఁ బొరిగొని
వర్ణాశ్రమ ధర్మ సేతు వర్గము మఱలం
బూర్ణముఁ జేసితి వేమని
వర్ణింతుము కొలిచి బ్రతుకువారము దేవా!
322
వ. ప్రజాపతు లి ట్లనిరి. 323
మ. ప్రజలం జేయుటకై సృజించితి మముం బాటించి దైత్యాజ్ఞచేఁ
బ్రజలం జేయక యింతకాలము మహాభారంబుతో నుంటి మీ
కుజనున్‌ వక్షముఁ జీరి చంపితివి సంకోచంబు లే కెల్లచోఁ
బ్రజలం జేయుచు నుండువారము జగ ద్భద్రాయమానోదయా!
324
వ. గంధర్వు లి ట్లనిరి. 325
క. ఆడుదుము రేయుఁ బగలుం
బాడుదుము నిశాటు నొద్ద బాధించు దయం
జూడఁడు నీచే జమునిం
గూడె మహాపాతకునికిఁ గుశలము గలదే.
326
వ. చారణు లి ట్లనిరి. 327
క. భువనజన హృదయ భల్లుఁడు
దివిజేంద్ర విరోధి నేఁడు దెగె నీచేత\న్‌
భవరోగ నివర్తక మగు
భవదంఘ్రియుగంబుఁ జేరి బ్రతికెద మీశా!
328
వ. యక్షు లి ట్లనిరి. 329
ఉ. భ్రంశము లేని నీ భటుల భంగవిముక్తుల మమ్ము నెక్కి ని
స్సంశయవృత్తి దిక్కులఁ బ్రచారముఁ జేయుచునుండు వీఁడు ని
స్త్రింశముతోడ వీనిఁ గడఁదేర్చితి వాపద మానె నో చతు
ర్వింశతి తత్త్వ శాసక! త్రివిష్టప ముఖ్య జగన్నివాసకా!
330
వ. కింపురుషు లి ట్లనిరి. 331
క. పురుషోత్తమ! నేరము కిం
పురుషుల మల్పులము నిన్ను భూషింపఁగ ధు
ష్పురుషున్‌ సకలసుజన హృ
త్పరుషుం జంపితివి జగము బ్రతికె నధీశా!
332
వ. వైతాళికు లి ట్లనిరి. 333
క. త్రిభువన శత్రుఁడు వడియెను
సభలందును మఖములందు జగదీశ్వర! నీ
శుభగీతములు పఠింపుచు
నభయుల మై సంచరింతు మార్తశరణ్యా!
334
వ. కిన్నరు లి ట్లనిరి. 335
క. ధర్మము దలపఁడు లఘుతర
కర్మము సేయించు మమ్ముఁ గలుషాత్మకు దు
ష్కర్మునిఁ జంపితి వున్నత
శర్ములమై నీదు భక్తి సలిపెదము హరీ!
336
వ. విష్ణుసేవకు లి ట్లనిరి. 337
ఉ. సంచిత విప్రశాపమునఁ జండనిశాచరుఁ డైన వీని శి
క్షించుట కీడుగాదు కృపచేసితి వీశ్వర! భక్తితోడ సే
వించినకంటె వైరమున వేగమె చేరఁగవచ్చు నిన్ను నీ
యంచిత నారసింహతను వద్భుత మాపదఁ బాసి రందఱు\న్‌.
338
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )