ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
వ. ఇట్లు బ్రహ్మ రుద్రేంద్ర సిద్ధ సాధ్య పురస్సరు లైన దేవముఖ్యు లందఱు నెడ గలిగి
యనేక ప్రకారంబుల వినుతించి, రోష సంరంభ విజృంభమాణుం డైన నరసింహ
దేవుని డగ్గర వెఱచి, లక్ష్మీదేవిం బిలిచి యి ట్లనిరి.
339
క. హరికిం బట్టపు దేవివి
హరిసేవా నిపుణమతివి హరిగతివి సదా
హరిరతివి నీవు సని నర
హరి రోషము డింప వమ్మ! హరివరమధ్యా!
340
వ. అనిన నియ్యకొని మహోత్కంఠ తోడ నా కలకంఠి నరకంఠీరవుని యుపకంఠంబునకుం జని. 341
సీ. ప్రలయార్క బింబంబు పగిది నున్నది గాని నెమ్మోము పూర్ణేందు నిభము గాదు
శిఖి శిఖాసంఘంబు చెలువు చూపెడుఁ గాని చూడ్కి ప్రసాదభాసురము గాదు
వీర రౌద్రాద్భుతావేశ మొప్పెడుఁ గాని భూరి కృపారస స్ఫూర్తి గాదు
భయద దంష్ట్రాంకుర ప్రభలు గప్పెడుఁ గాని దరహసితాంబుజాతంబు గాదు
 
తే. కఠిన నఖర నృసింహ విగ్రహము గాని
కామినీజన సులభవిగ్రహము గాదు
విన్నదియుఁ గాదు తొల్లి నే విష్ణువలనఁ
గన్నదియుఁ గాదు భీషణాకార మనుచు.
342
క. పలికెద నని గమకము గొనుఁ
బలికినఁ గడు నలిగి విభుఁడు ప్రతివచనములం
బలుకఁ డని నిలుచు శశిముఖి
బలువిడి హృదయమునఁ జనవు భయమును గదురన్‌.
343
వ. ఇట్లు నరహరిరూపంబు వారిజనివాసిని వీక్షించి, శంకించి, శాంతుం డైన వెనుక
డగ్గఱియెద నని చింతింపుచున్న, వారిజసంభవుం డ ద్దేవుని రోషంబు నివారింప
నితరుల కలవిగా దని ప్రహ్లాదుం జీరి యి ట్లనియె.
344
క. తీండ్ర మగు రోషమున మీ
తండ్రి నిమిత్తమునఁ జక్రి దారుణమూర్తిన్‌
వేండ్రము విడువడు మెల్లనఁ
దండ్రీ! శీతలునిఁ జేసి దయసేయఁగదే.
345
వ. అనిన నౌఁగాక యని మహాభాగవత శేఖరుం డైన బాలకుండు కరకమలంబులు
ముకుళించి, మందగమనంబున నమంద వినయ వివేకంబుల నరసింహదేవుని సన్నిధికిం
జని, సాష్టాంగ దండప్రణామంబులు సేసిన, భక్తపరాధీనుం డగు న య్యీశ్వరుం
డాలోకించి, కరుణాయత్త చిత్తుం డై.
346
ఉ. ప్రాభవ మొప్ప నుత్కట కృపామతి యై కదియంగ జీరి సం
శోభిత దృష్టిసంఘములఁ జూచుచు బాలుని మౌళియందు లో
కాభినుతుండు వెట్టె నసురాంతకుఁ డుద్భట కాలసర్ప భీ
తాభయ దాన శస్తము ననర్గళ మంగళ హేతు హస్తము\న్‌.
347
వ. ఇట్లు హరి కరస్పర్శంబున భయవిరహితుండును, బ్రహ్మజ్ఞాన సహితుండును, పులకిత
దేహుండును, సముత్పన్న సంతోషబాష్ప సలిలధారా సమూహుండును, ప్రేమాతిశయ
గద్గద భాషణుండును, వినయ వివేక భూషణుండును, నేకాగ్ర చిత్తుండును,
భక్తిపరాయత్తుండును నై, య ద్దేవుని చరణ కమలంబులు దన హృదయంబున నిలిపికొని,
కరకమలంబులు ముకుళించి యి ట్లని వినుతించె.
348
ప్రహ్లాదుండు నరసింహమూర్తిని స్తుతించుట
మ. అమరుల్‌ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్‌ సతాత్పర్య చి
త్తముల న్నిన్ను బహుప్రకారముల నిత్యంబు\న్‌ విచారించి పా
రము ముట్ట న్నుతిసేయ నోప రఁట నే రక్షస్తనూజుండ గ
ర్వ మదోద్రిక్తుఁడ బాలుఁడన్‌ జడమతి\న్‌ వర్ణింప శక్తుండనే.
349
మ. తపము\న్‌ వంశము తేజము\న్‌ శ్రుతము సౌందర్యంబు నుద్యోగము
న్నిపుణత్వంబు ప్రతాప పౌరుషములు న్నిష్ఠా బల ప్రజ్ఞలున్‌
జప యోగంబులుఁ జాల వీశ్వర! భవ త్సంతుష్టికై దంతి యూ
ధపు చందంబున భక్తి సేయవలయున్‌ దాత్పర్య సంయుక్తుఁ డై.
350
మ. అమలజ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సర
త్వములన్‌ యజ్ఞ తపోఽనసూయల గడున్‌ దర్పించు ధాత్రీసురో
త్తముకంటె\న్‌ శ్వపచుండు ముఖ్యుఁడు మనోఽర్థ ప్రాణ వా క్కర్మముల్‌
సమత న్నిన్ను నయించెనేని నిజవంశ శ్రీకరుం డౌఁ దుదిన్‌.
351
సీ. అజ్ఞుండు సేసిన యారాధనములఁ జేపట్టఁ డీశ్వరుఁడు కృపాళుఁ డగుటఁ
జేపట్టు నొకచోట సిద్ధ మీశ్వరునకు నర్థంబు లేకున్న నతఁడు పూర్ణుఁ
డైన నర్థము లీశ్వరార్పణంబులు గాఁగఁ జేయుట ధర్మంబు సేసెనేని
నద్దంబుఁ జూచిన నళిక లలామంబు ప్రతిబింబితం బగు పగిది మఱల.
 
తే. నర్థములు దోఁచుఁ గావున నధికబుద్ధి
భక్తి సేయంగవలయును భక్తిగాని
మెచ్చఁ డర్థంబు లొసఁగెడు మేరలందుఁ
బరమకరుణుండు హరి భక్తబాంధవుండు.
352
క. కావున నల్పుఁడ సంస్తుతిఁ
గావించెద వెఱపు లేక కల నేరుపునన్‌
నీ వర్ణనమున ముక్తికిఁ
బోవు నవిద్యను జయించి పురుషుఁ డనంతా!
353
సీ. సత్త్వాకరుఁడ వైన సర్వేశ! నీ యాజ్ఞ శిరముల నిడుకొని చేయువారు
బ్రహ్మాదు లమరులు భయ మొందుచున్నారు నీ భీషణాకృతి నేఁడు చూచి
రోషంబు మాను నీ రుచిర విగ్రహములు కల్యాణకరములు గాని భీతి
కరములు గావు లోకములకు వృశ్చిక పన్నగములభంగి భయముఁ జేయు
 
తే. నసుర మర్దించితివి సాధుహర్ష మయ్యె
నవతరించిన పని దీఱె నలుక యేల
కలుషహారివి సంతోషకారి వనుచు
నిన్నుఁ దలఁతురు లోకులు నిర్మలాత్మ!
354
మ. ఖరదంష్ట్రా భ్రుకుటీ సటా నఖయు నుగ్రధ్వానయు\న్‌ రక్తకే
సరయుం దీర్ఘతరాంత్రమాలికయు భాస్వ న్నేత్రయు న్నైన నీ
నరసింహాకృతిఁ జూచి నే వెఱవఁ బూర్ణ క్రూర దుర్వార దు
ర్భర సంసారదవాగ్నికి\న్‌ వెఱతు నీ పాదాశ్రయుం జేయవే.
355
వ. దేవా! సకల యోనులయందును సుఖవియోగ దుఃఖసంయోగ జనితం బైన శోకానలంబున
దందహ్యమానుండ నై, దుఃఖనివారకంబు గాని దేహా ద్యభిమానంబున మోహితుండ నై,
పరిభ్రమించుచున్న యేను, నాకుం బ్రియుండవు, సఖుండవు, పరమదేవతవు నైన నీయొక్క
బ్రహ్మగీతంబు లైన లీలావతార కథా విశేషంబులఁ బఠియించుచు, రాగాది నిర్ముక్తుండ నై,
దుఃఖపుంజంబులఁ దరించి, భవదీయ చరణకమల స్మరణ సేవానిపుణు లైన భక్తులం జేరి
యుండెద. బాలునిం దల్లిదండ్రులును, రోగిని వైద్యదత్తం బైన యౌషధంబును, సముద్రంబున
మునింగెడువాని నావయును, దక్క నొరులు రక్షింపలేని తెఱంగున, సంసారతాప సంతప్య
మానుం డై నీచేత నుపేక్షితుం డైన వాని నుద్ధరింప నీవు దక్క నన్యుండు సమర్థుండు గాడు.
జగంబుల నెవ్వం డేమి కృత్యంబు నెవ్వని చేతం బ్రేరితుం డై యే యింద్రియంబులం జేసి
యేమిటికొఱకు యెవ్వనికి సంబంధి యై యే స్థలంబున నే సమయంబునం దేమి రూపమున
నే గుణంబున నపరంబైన జనకాది భావంబున నుత్పాదించి, పరం బైన బ్రహ్మాదిభావంబున
రూపాంతరంబు నొందించు, నట్టి వివిధ ప్రకారంబు లన్నియు నీవ, నిత్యముక్తుండవు, రక్షకుండవు
నైన నీ యంశం బైన పురుషునికి నీ యనుగ్రహంబునఁ గాలంబు చేతం ప్రేరిత యై కర్మ
మయంబును, బలయుతంబును, ప్రధానలింగంబును నైన మనంబును నీ మాయ సృజించు.
అవిద్యార్పిత వికారంబును, వేదోక్త కర్మ ప్రధానంబును, సంసారచక్రాత్మకంబును నైన యీ
మనమును నిన్ను సేవింపక నియమించి తరియింప నొక్కండును సమర్థుండు లేఁడు. విజ్ఞాన
నిర్జిత బుద్ధి గుణుండవు నీవు. నీవలన వశీకృత కార్యసాధన శక్తి యైన కాలంబు, మాయతోడం
గూడ షోడశవికారయుక్తం బైన సంసార చక్రంబుఁ జేయుచుండు. సంసార దావదహన సంతప్య
మానుండ నగు నన్ను రక్షింపుము.
356
సీ. జనులు దిక్పాలుర సంప దాయు ర్విభవములు గోరుదురు భవ్యంబు లనుచు
నవి యెంతయును రోష హాస జృంభిత మైన మాతండ్రి బొమముడి మహిమఁ జేసి
విహితంబు లగు నట్టి వీరుండు నీచేత నిమిషమాత్రంబున నేఁడు మడిసెఁ
గావున ధ్రువములు గావు బ్రహ్మాదుల శ్రీవిభవంబులు జీవితములు
 
తే. కాలరూపకుఁ డగు నురుక్రమునిచేత
విదళితము లగు, నిలువవు వేయునేల
యితర మే నొల్ల నీమీఁది యెఱుక కొంత
గలిగియున్నది గొలుతుఁ గింకరుఁడ నగుచు.
357
మత్తకోకిల. ఎండమావులవంటి భద్రము లెల్ల సార్థము లంచు మ
ర్త్యుండు రోగనిధాన దేహముతో విరక్తుఁడు గాక యు
ద్దండ మన్మథ వహ్ని నెప్పుడుఁ దప్తుఁ డై యొకనాఁడు చే
రండు పారము దుష్ట సౌఖ్యపరంప రాక్రమణంబున\న్‌.
358
ఉ. శ్రీమహిళా మహేశ సరసీరుహగర్భుల కైన నీ మహో
ద్దామ కరంబుచే నభయదానము సేయని నీవు బాలుఁడ\న్‌
దామస వంశ సంభవుఁడ దైత్యుఁడ నుగ్ర రజోగుణుండ ని
స్సీమదయ\న్‌ గరాంబుజము శీర్షముఁ జేర్చుట చోద్య మీశ్వరా!
359
వ. మహాత్మా! సుజను లైన బ్రహ్మాదులందును, దుర్జను లైన మాయందును, సేవానురూపంబునం
బక్షాపక్షంబులు లేక కల్పవృక్షంబు చందంబున ఫల ప్రదానంబు సేయుదువు. కందర్పసర్ప
సమేతం బగు సంసారకూపంబునం గూలుచున్న మూఢజనులం గూడి కూలెడి నేను, భవదీయ
భృత్యుం డగు నారదుని యనుగ్రహంబునంజేసి నీ కృపకుం బాత్రుండ నైతి. నన్ను రక్షించి
మజ్జనకుని వధియించుట నాయందులఁ బక్షపాతంబు గాదు. దుష్టజన సంహారంబును, శిష్ట
భృత్య మునిజన రక్షాప్రకారంబును నీకు నైజగుణంబులు. విశ్వంబు నీవ. గుణాత్మకం బైన
విశ్వంబు సృజియించి, యందుం బ్రవేశించి, హేతుభూత గుణయుక్తుండ వై, రక్షక
సంహారకాది నానారూపంబుల నుండుదువు. స దసత్కారణ కార్యాత్మకం బైన విశ్వంబునకుం
బరమకారణంబు నీవ. నీ మాయచేత వీఁడు దా ననియెడి బుద్ధివికల్పంబు దోఁచుఁ గాని,
నీ కంటె నొండెద్దియు లేదు. బీజంబునందు వస్తుమాత్ర భూత సౌక్ష్మ్యంబును, వృక్షంబునందు
నీలత్వాది వర్ణంబునుఁ గలుగుతెఱంగున, విశ్వంబునకు నీయంద జన్మ స్థితి ప్రకాశ
నాశంబులు గలుగు. నీచేత నైన విశ్వంబు నీయంద నిలుపుకొని, తొల్లి ప్రళయ కాల
పారావారంబునఁ బన్నగేంద్ర పర్యంకంబునఁ గ్రియారహితుండ వై, నిజ సుఖానుభావంబు
సేయుచు, నిద్రితునిభంగి యోగ నిమీలిత లోచనుండ వై యుండుచుఁ, గొంత కాలంబునకు నిజ
కాలశక్తిచేతఁ బ్రేరితంబు లై, ప్రకృతి ధర్మంబు లైన సత్త్వాదిగుణంబుల నంగీకరించి,
సమాధి చాలించి, వెలుంగు చున్న నీ నాభియందు, వటబీజమువలన నుద్భవించు వటంబు
తెఱంగున, నొక్క కమలంబు సంభవించె. అట్టి కమలంబున నాల్గుమోముల బ్రహ్మ జన్మించి,
దిశలు వీక్షించి, కమలంబునకు నొం డైన రూపంబు లేకుండుటఁ జింతించి, జలాంతరాళంబుఁ
బ్రవేశించి, జలంబులందు నూఱు దివ్యవత్సరంబులు వెదకి, తన జన్మంబున కుపాదానకారణం
బైన నిన్ను దర్శింప సమర్థుండు గాక, మగిడి కమలంబుకడకుం జని, విస్మయంబు నొంది,
చిరకాలంబు నిర్భరతపంబు చేసి, పృథివియందు గంధంబు గనుచందంబునఁ దనయందు
నానా సహస్ర వదన శిరో నయన నాసా కర్ణ వక్త్ర భుజ కర చరణుండును, బహువిధాభరణుండును,
మాయా కలితుండును, మహాలక్షణ లక్షితుండును, నిజప్రకాశ దూరీకృత తముండునుఁ,
బురుషోత్తముండును నైన నిన్ను దర్శించె. అ య్యవసరంబున.
360
క. ఘోటకవదనుఁడ వై మధు
కైటభులం ద్రుంచి నిగమగణముల నెల్లన్‌
బాటించి యజున కిచ్చిన
కూటస్థుఁడ వీశ్వరుఁడవు కోవిదవంద్యా!
361
వ. ఇ వ్విధంబునఁ గృత త్రేతా ద్వాపరంబు లను మూఁడు యుగంబులందును, తిర్యఙ్మానవ ముని
జలచరాకారంబుల నవతరించి, లోకంబుల నుద్ధరింపుచు, ధరియింపుచు, హరియింపుచు,
యుగానుకూల ధర్మంబులం బ్రతిష్ఠింపుచు నుండుదువు. దేవా! యవధరింపుము.
362
సీ. కామ హర్షాది సంకలిత మై చిత్తంబు భవదీయ చింతన పదవి సొరదు
మధురాది రసముల మరగి చొక్కుచు జిహ్వ నీ వర్ణనమునకు నిగుడనీదు
సుందరీముఖములఁ జూడఁ గోరెడు చూడ్కి తావకాకృతులపైఁ దగులువడదు
వివిధ దుర్భాషలు వినఁగోరు వీనులు వినవు యుష్మత్కథా విరచనములు
 
తే. ఘ్రాణ మురవడిఁ దిరుగు దుర్గంధములకుఁ
దనివు గొలుపదు వైష్ణవధర్మమునకు
నణఁగి యుండవు కర్మేంద్రియములు పురుషుఁ
గలఁచు సవతులు గృహమేధిఁ గలఁచునట్లు.
363
వ. ఇ వ్వి ధంబున నింద్రియంబులచేతం జిక్కువడి, స్వకీయ పరకీయ శరీరంబులందు
మిత్రామిత్ర భావంబులు సేయుచు, జన్మమరణంబుల నొందుచు, సంసార వైతరణీ నిమగ్నం
బైన లోకంబు నుద్ధరించుట, లోకసంభవ స్థితి లయ కారణుండ వైన నీకుం గర్తవ్యంబు.
భవదీయ సేవకుల మైన మా యందుఁ బ్రియభక్తు లయిన వారల నుద్ధరింపుము.
364
మ. భగవ ద్దివ్య గుణాను వర్ణన సుధా ప్రాప్తైక చిత్తుండ నై
బెగడ\న్‌ సంసరణోగ్ర వైతరిణికి\న్‌ భిన్నాత్ములై తావకీ
య గుణస్తోత్ర పరాఙ్ముఖత్వమున మాయాసౌఖ్య భావంబుల\న్‌
సుగతిం గానని మూఢులం గని మది\న్‌ శోకింతు సర్వేశ్వరా!
365
వ. దేవా! మునీంద్రులు నిజ విముక్తికాములై విజన స్థలంబులం దపంబు లాచరింతురు.
కాముకత్వంబు నొల్లక యుండువారికి నీకంటె నొండు శరణంబు లేదు. నిన్ను సేవించెద.
కొందఱు కాముకులు కరద్వయ కండూతిచేతం దనియని చందంబునఁ, దుచ్ఛమై పశు పక్షి
క్రిమి కీట సామాన్యం బైన మైథునాది గృహమేధి సుఖంబులం దనియక, కడపట నతి
దుఃఖవంతు లగుదురు. నీ ప్రసాదంబు గల సుగుణుండు నిష్కాముం డై యుండు. మౌనవ్రత
జప తప శ్శ్రుతాధ్యయనంబులును, నిజ ధర్మ వ్యాఖ్యాన విజనస్థల నివాస సమాధులును,
మోక్షహేతువు లగు. ఐన నివి పదియు నింద్రియజయంబు లేనివారికి భోగార్థంబు లై,
విశ్రమించు వారికి జీవనోపాయంబు లై, డాంబికులకు వార్తాకరంబు లై యుండు. సఫలంబులు
గావు. భక్తి లేక భవదీయ జ్ఞానంబు లేదు. రూపరహితుండ వైన నీకు బీజాంకురంబుల కైవడిఁ,
గారణ కార్యంబు లయిన సదసద్రూపంబులు రెండును బ్రకాశమానంబులగు. ఆ రెంటియందును
భక్తి యోగంబున బుద్ధి మంతులు,మథనంబున దారువులందు వహ్నిం గనియెడి తెఱంగున,
నిన్నుం బొడగందురు. పంచభూత తన్మాత్రంబులును, బ్రాణ బుద్ధీంద్రియంబులును,
మనోఽహంకార చిత్తంబులును నీవ. సగుణంబును, నిర్గుణంబును నీవ. గుణాభిమాను లై
జన్మమరణంబుల నొందు విబుధు లాద్యంతంబును గానక నిరుపాధికుండ వైన ని న్నెఱుంగరు.
తత్త్వజ్ఞు లైన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారంబులు మాని, వేదాంత ప్రతిపాద్యుండ
వగు నిన్ను సమాధివిశేషంబుల నెఱింగి, సేవింతురు. అది గావున.
366
సీ. నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మ్రొక్కఁ డేని
నీ మంగళస్తవ నికర వర్ణంబులు పలుమారు నాలుకఁ బలుకఁ డేని
నీ యధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపఁ డేని
నీ పదాంబుజముల నిర్మలహృదయుఁడై చింతించి మక్కువఁ జిక్కఁ డేని
 
తే. నిన్నుఁ జెవులార వినఁ డేని నీకు సేవఁ
జేయరాఁ డేని బ్రహ్మంబుఁ జెందఁగలఁడె
యోగి యైనఁ దపోవ్రత యోగి యైన
వేది యైన మహా తత్త్వవేది యైన.
367
వ. కావున భవదీయ దాస్యయోగంబు కృపసేయుము. అని ప్రణతుండైన ప్రహ్లాదుని
వర్ణనంబులకు మెచ్చి, నిర్గుణుం డైన హరి రోషంబు విడిచి యి ట్లనియె.
368
శా. సంతోషించితి నీ చరిత్రములకు\న్‌ స ద్భద్ర మౌఁ గాక! నీ
యంత ర్వాంఛిత లాభ మెల్లఁ గరుణాయత్తుండ నై యిచ్చెద\న్‌
జింతం జెందకు భక్తకామదుఁడ నే సిద్ధంబు దుర్లోక్యుఁడ\న్‌
జంతుశ్రేణికి నన్నుఁ జూచిన పునర్జన్మంబు లే దర్భకా!
369
ఆ. సకల భావములను సాధులు విద్వాంసు
లఖిల భద్రవిభుఁడ నైన నన్నుఁ
గోర్కు లి మ్మటంచుఁ గోరుదు రిచ్చెదఁ
గోరు మెద్ది యైనఁ గుఱ్ఱ! నీవు.
370
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )