ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
వ. అని పరమేశ్వరుండు ప్రహ్లాదునియందుఁ గల సకామత్వంబుఁ దెలియుకొఱకు
వచించి యి ట్లానతిచ్చిన, నతండు నిష్మాముం డైన యేకాంత భక్తుఁడు
గావునఁ, గామంబు భక్తియోగంబునకు నంతరాయం బని తలంచి యి ట్లనియె.
ఉత్పత్తిమొదలు కామా ద్యనుభవాసక్తి గల నాకు వరంబు లిచ్చెద నని
వచింప నేల. సంసార బీజంబులును, హృదయబంధకంబులును నైన కామంబు
లకు వెఱచి, ముముక్షుండ నై, సేమంబుకొరకు నేమంబున నిన్నుం జేరితి.
కామంబులును, నింద్రియంబులును, మన శ్శరీర ధైర్యంబులును, మనీషా ప్రాణ
ధర్మంబులును, లజ్జా స్మరణ లక్ష్మీ సత్య తేజో విశేషంబులును నశించు.
లోకంబు లందు భృత్యు లర్థకాము లై రాజుల సేవింతురు. రాజులుం బ్రయోజనంబు
లర్థించి, భృత్యులకు నర్థంబు లొసంగుదురు. అ వ్విధంబునఁ గాదు. నాకుం
గామంబు లేదు. నీకుం బ్రయోజనంబు లేదు. ఐన దేవా! వరదుండ వయ్యెద
వేని కామంబు వృద్ధిఁ బొందని వరంబుఁ గృపసేయుము. కామంబుల విడిన
పురుషుండు నీతోడ సమానవిభవుం డగు. నరసింహ! పరమాత్మ! పురుషోత్తమ!
యని ప్రణవపూర్వంబుగ నమస్కరించిన, హరి యి ట్లనియె.
371
సీ. నీవంటి విజ్ఞాననిపుణు లేకాంతులు గోర్కులు నాయందుఁ గోర నొల్ల
రట్లైన బ్రహ్లాద! యసురేంద్రభర్త వై సాగి మన్వంతరసమయ మెల్ల
నిఖిలభోగంబులు నీవు భోగింపుము కల్యాణబుద్ధి నా కథలు వినుము
సకల భూతములందు సంపూర్ణుఁడగు నన్ను యజ్ఞేశు నీశ్వరు నాత్మ నిలిపి
 
తే. కర్మచయము లెల్ల ఖండించి పూజన
మాచరింపు మీశ్వరార్పణముగ
భోగములు నశించుఁ బుణ్యంబు వ్రతములఁ
బాపసంచయములు పాయు నిన్ను.
372
వ. మఱియు నటమీదఁ గాలవేగంబునం గళేబరంబు విడిచి, త్రైలోక్య విరాజ
మానంబును, దివిజరాజ జేగీయమానంబును, బరిపూరిత దశదిశంబు నైన
యశంబుతోడ ముక్తబంధుండ వై నన్ను డగ్గఱియెదవు వినుము.
373
ఆ. నరుఁడు ప్రియముతోడ నా యవతారంబు
నీ యుదారగీత నికరములను
మానసించె నేని మఱి సంభవింపఁడు
కర్మబంధచయము గడచిపోవు.
374
వ. అనినఁ బ్రహ్లాదుం డి ట్లనియె. 375
సీ. దంష్ట్రి వై తొల్లి సోదరుని హిరణ్యాక్షు నీవు సంపుటఁజేసి నిగ్రహమున
మా తండ్రి రోషనిర్మగ్నుఁ డై సర్వలో కేశ్వరుఁ బరము ని న్నెఱుఁగ లేక
పరిపంథిపగిది నీ భక్తుండ నగు నాకు నపకారములు సేసె నతఁడు నేఁడు
నీ శాంతదృష్టిచే నిర్మలత్వము నొందెఁ గావున పాపసంఘంబు వలనఁ
 
తే. బాసి శుద్ధాత్మకుఁడు గాఁగ భవ్యగాత్ర!
వరము వేఁడెద నా కిమ్ము వనజనేత్ర!
భక్తసంఘాత ముఖపద్మ పదమిత్ర!
భక్త కల్మషవల్లికా పటు లవిత్ర!
376
వ. అనిన భక్తవత్సలుం డి ట్లనియె. 377
మ. నిజ భక్తుండవు నాకు నిన్నుఁ గనుట\న్‌ నీ తండ్రి త్రిస్సప్త పూ
ర్వజులం గూడి పవిత్రుఁ డై శుభగతిన్‌ వర్తించు విజ్ఞానదీ
ప జితానేక భవాంధకారు లగు మద్భక్తుల్‌ వినోదించు దే
శజనుల్‌ దుర్జను లైన శుద్ధులు సుమీ సత్యంబు దైత్యోత్తమా!
378
సీ. ఘన సూక్ష్మ భూతసంఘాతంబులోపల నెల్లవాంఛలు మాని యెవ్వ రైన
నీచందమున నన్ను నెఱయ సేవించిన మద్భక్తు లగుదురు మత్పరులకు
గుఱిసేయ నీవ యోగ్యుఁడ వైతి విటమీఁద వేదచోదిత మైన విధముతోఁడ
జిత్తంబు నామీదఁ జేర్చి మీ తండ్రికిఁ బ్రేతకార్యములు సంప్రీతిఁ జేయు
 
తే. మతఁడు రణమున నేఁడు నా యంగమర్శ
నమున నిర్మలదేహుఁ డై నవ్యమహిమ
నపగతాఖిల కల్మషుఁ డై తనర్చి
పుణ్యలోకంబులకు నేఁగుఁ బుణ్యచరిత!
379
వ. అని ఇట్లు నరసింహదేవుం డానతిచ్చినఁ, బ్రహ్లాదుండు హిరణ్యకశిపునకుం
బరలోకక్రియలు సేసి, భూసురోత్తములచేత నభిషిక్తుండయ్యె. అ య్యెడం
బ్రసాదపరిపూర్ణుం డైన శ్రీనరసింహదేవునిం జూచి, దేవతాప్రముఖ
సహితుం డై బ్రహ్మదేవుం డి ట్లనియె.
380
సీ. దేవదే వాఖిలదేవేశ! భూతభావన! వీఁడు నాచేత వరము వడసి
మత్సృష్ట జనులచే మరణంబు నొందక మత్తుఁడై సకలధర్మములఁ జెఱచి
నేఁడు భాగ్యంబున నీచేత హతుఁ డయ్యెఁ గల్యాణ మమరె లోకముల కెల్ల
బాలు నీతని మహాభాగవతశ్రేష్ఠు బ్రతికించితివి మృత్యుభయము వాపి
 
తే. వరముఁ గృపసేసితివి మేలు వారిజాక్ష!
నీ నృసింహావతారంబు నిష్ఠతోడఁ
దగిలి చింతించువారలు దండధరుని
బాధ నొందరు మృత్యువుబారిఁ బడరు.
381
వ. అనిన నృసింహదేవుం డి ట్లనియె. 382
క. మన్నించి దేవశత్రుల
కెన్నఁడు నిటువంటివరము లీకుము పాపో
త్పన్నులకు వరము లిచ్చుట
పన్నగముల కమృత మిడుట పంకజగర్భా!
383
వ. అని యి ట్లానతిచ్చి, బ్రహ్మాది దేవతాసమూహంబుచేతం బూజితుం డై,
భగవంతుం డైన శ్రీనరసింహదేవుండు తిరోహితుం డయ్యె. ప్రహ్లాదుండును,
శూలికిం బ్రణమిల్లి, తమ్మిచూలికి వందనం బాచరించి, ప్రజాపతులకు మ్రొక్కి
భగవత్కళ లైన దేవతలకు నమస్కరించినం జూచి, బ్రహ్మదేవుండు శుక్రాది
మునిసహితుం డై, దైత్యదానవ రాజ్యంబునకుఁ బ్రహ్లాదునిఁ బట్టంబు గట్టి,
యతనిచేతం బూజితుం డై దీవించె. అంతట నీశానాది నిఖిలదేవతలు, వివిధంబు
లగు నాశీర్వాదంబులచేత నా ప్రహ్లాదునిఁ గృతార్థుఁ గాఁ జేసి, తమ్మిచూలి
ముందఱ నిడుకొని, తమతమ నివాసంబులకుం జనిరి. ఇట్లు విష్ణుదేవుండు జనిపార్శ్వ
చరులిరువురు బ్రాహ్మణశాపంబునం జేసి ప్రథమజన్మంబున దితిపుత్రు లైన
హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వరాహ నారసింహ రూపంబుల నవతరించి వధియించె.
ద్వితీయభవంబున రాక్షసజన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామ
రూపంబున సంహరించె. తృతీయజన్మంబున శిశుపాల దంతవక్త్రు లను పేరులఁ
బ్రసిద్ధినొందిన వారలం గృష్ణావతారంబున సంహరించె. ఇ వ్విధంబున మూఁడు
జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంతర సంభావిత ధ్యాను లై, వారలు
నిఖిలకల్మష వినిర్ముక్తు లై, హరిం గదిసిరి. అని చెప్పి నారదుం డి ట్లనియె.
384
ఉ. శ్రీరమణీయ మైన నరసింహవిహారము నింద్రశత్రు సం
హారముఁ బుణ్యభాగవతుఁ డైన నిశాచరనాథపుత్రు సం
చారము నెవ్వఁ డైన సువిచారత విన్నఁ బఠించిన\న్‌ శుభా
కారముతోడ నే భయము గల్గని లోకముఁ జెందు భూవరా!
385
మ. జలజాతప్రభవాదులు\న్‌ మనములోఁ జర్చించి భాషావళి\న్‌
బలుక\న్‌లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ యింటిలోఁ
జెలి యై మేనమఱంది యై సచివుఁ డై చిత్తప్రియుం డై మహా
ఫలసంధాయకుఁ డై చరించుట మహాభాగ్యంబు రాజోత్తమా!
386
త్రిపురాసుర సంహారము
క. బహుమాయుఁ డైన మయుచే
విహతం బగు హరుని యశము విఖ్యాత జయా
వహముగ నీ భగవంతుఁడు
మహితాత్ముఁడు ము న్నొనర్చె మనుజవరేణ్యా!
387
వ. అనిన ధర్మనందనుం డి ట్లనియె. 388
క. ఏ కర్మంబున విభుఁ డగు
శ్రీకంఠుని యశము మయునిచే సుడివడియె\న్‌
వైకుంఠుఁ డె వ్విధంబునఁ
గైకొని తత్కీర్తి చక్కఁగా నొనరించె\న్‌.
389
వ. అనిన నారదుం డి ట్లనియె. 390
క. చక్రాయుధ బలయుతు లగు
శక్రాదుల కోహటించి శ్రమమున నసురుల్‌
సాక్రోశంబుగ నరిగిరి
విక్రమములు మాని మయుని వెనుకకు నధిపా!
391
వ. ఇట్లు రక్కసులు దనవెనుకఁ జొచ్చిన, మాయానిలయుండును, దుర్దముండును నైన
మయుండు దన మాయాబలంబున నయో రజత సువర్ణమయంబు లై యెవ్వరికిని
లక్షింపరాని గమనాగమనంబులును, వితర్కింపరాని కర్కశ పరిచ్ఛదంబులును
గలిగిన త్రిపురంబులు నిర్మించి యిచ్చిన, నక్తంచరు లందఱు నందుఁ బ్రవేశించి
కామసంచారు లై పూర్వ వైభవంబు దలంచి, సనాయకానీకంబు లయిన లోకంబుల
నస్తోకంబు లైన బలాతిరేకంబుల శోకంబుల నొందించిన.
392
క. లోకాదినాథు లెల్లను
శోకాతురు లగుచు నేఁగి చొచ్చిరి దుష్టా
నీక విదళ నాకుంఠు\న్‌
శ్రీ కంఠు\న్‌ భువనభరణ చిత్తోత్కంఠు\న్‌.
393
వ. ఇట్లు సకలలోకేశ్వరుం డగు మహేశ్వరుం జేరి, లోకపాలకులు ప్రణతు లై
పూజించి, కరకమలంబులు ముకుళించి.
394
క. త్రిపురాలయు లగు దానవు
లపరాజితు లగుచు మాకు నశ్రాంతంబు\న్‌
వపురాది పీడఁ జేసెద
రపరాధకులను వధింపు మగజాధీశా!
395
క. దీనులము గాక యుష్మ ద
ధీనుల మై యుండు మేము దేవాహిత దో
ర్లీనుల మైనారము బల
హీనుల మగు మమ్ముఁ గావు మీశాన! శివా!
396
వ. అనిన, భక్తవత్సలుం డగు పరమేశ్వరుండు, శరణాగతు లైన గీర్వాణుల
వెఱవకుం డని, దుర్వారబలంబున బాణాసనంబుఁ గేల నందుకొని, యొక్క
దివ్యబాణంబు సంధించి, త్రిపురంబులపై నేసిన, మార్తాండమండలంబున వెలువడు
మయూఖజాలంబుల చందంబునఁ, దద్బాణంబు వలన దేదీప్యమానంబు లయిన
యనేక బాణ సహస్రంబులు సంభవించి, భూ నభోఽంతరాళంబులు నిండి, మండి,
కుప్పలు గొని, త్రిపురంబులపైఁ గప్పె. అప్పుడు తద్బాణపావక హేతిసందోహ
దందహ్య మాను లై, గతాసు లైన త్రిపురనివాసులం దెచ్చి, మహాయోగి యైన
మయుండు సిద్ధరస కూపంబున వైచిన.
397
క. సిద్ధామృత రసమహిమను
శుద్ధ మహావజ్రతుల్య శోభితతను లై
వృద్ధిం బొందిరి దానవు
లుద్ధత నిర్ఘాతపావకోపము లగుచు\న్‌.
398
క. కూపామృతరస సంగతి
దీపితు లై నిలిచియున్న దేవాహితుల\న్‌
రూపించి చింత నొందెడు
గోపధ్వజుఁ జూచి చక్రి కుహనాన్వితుఁ డై.
399
శా. ఉత్సాహంబున నొక్క పాఁడి మొద వై యూధంబు ఘ్రాణించుచు\న్‌
వత్సం బై తనవెంట బ్రహ్మ నడవ\న్‌ వైకుంఠుఁ డేతెంచి యు
ద్య త్సత్త్వంబునఁ గూపమధ్యరసముం ద్రావెన్‌ విలోకింపుచు\న్‌
దత్సౌభాగ్య నిమగ్ను లై మఱచి రా దైత్యుల్‌ నివారింపఁగ\న్‌.
400
వ. ఇట్లు విష్ణుండు మోహనాకారంబున ధేను వై వచ్చి, త్రిపుర మధ్య కూపామృత
రసంబుఁ ద్రావిన, నెఱింగి శోకాకుల చిత్తు లైన, రసకూప పాలకులం జూచి,
మహాయోగి యైన మయుండు వెఱఁగుపడి, దైవగతిఁ జింతించి, శోకింపక య్లనియె.
401
ఆ. అమరు లైన దనుజు లైనను నరులైన
నెంత నిపుణు లైన నెవ్వ రైన
దైవికార్థచయముఁ దప్పింపఁగా లేరు
వలదు దనుజులార! వగవ మనకు.
402
వ. అని పలికె. అంత విష్ణుండు నైజంబు లైన ధర్మ జ్ఞాన విద్యా తపో విరక్తి
సమృద్ధి క్రయాది శక్తివిశేషంబుల శంభునికిం బ్రాధాన్యంబు సమర్పించి,
రథ సూత కేతు వర్మ బాణాసన ప్రముఖ సంగ్రామ సాధనంబులు సేసినం గై కొని.
403
మ. శరి యై కార్ముకి యై మహాకవచి యై సన్నహి యై వాహి యై
సరథుం డై సనియంత యై సబలుఁ డై సత్కేతన చ్ఛత్రుఁ డై
పరమేశుం డొక బాణము\న్‌ విడిచెఁ దద్బాణానల జ్వాలల\న్‌
బురము ల్గాలెఁ జటచ్ఛట ధ్వని నభో భూమధ్యము న్నిండఁగ\న్‌.
404
వ. ఇట్లు హరుండు దురవగాహంబులైన త్రిపురంబుల నభిజిన్ముహూర్తంబున భస్మంబు సేసి
గూల్చిన, నమర గరుడ సిద్ధ సాధ్య గంధర్వ యక్ష వల్లభులు వీక్షించి, జయ జయ శబ్దంబులు
సేయుచుఁ, గుసుమ వర్షంబులు వర్షించిరి. ప్రజలు హర్షించిరి. బ్రహ్మాదులు కీర్తించిరి. అప్సరసలు
నర్తించిరి. దివ్య కాహళ దుందుభి రవములును, మునిజనోత్సవంబులును, బ్రచురంబు లయ్యె. ఇట్లు
విశ్వజనీనంబగు త్రిపురాసుర సంహారంబున నఖిలలోకులును సంతసిల్లి యుండ నయ్యవసరంబున.
405
ఆ. తృణకణముల భంగిఁ ద్రిపురంబుల దహించి
పరముఁ డవ్యయుండు భద్రయశుఁడు
శివుఁడు పద్మజాది జేగీయమానుఁ డై
నిజనివాసమునకు నెమ్మిఁ జనియె.
406
వ. ఇట్లు నిజమాయా విశేషంబున మర్త్యలోకంబున విడంబించుచున్న విష్ణుని పరాక్రమ
విధానంబులు మునిజన వంద్యమానంబు లై, సకల లోక కల్యాణ ప్రదానంబు లై
యుండు. అనిన విని, నారదునకు ధర్మనందనుం డి ట్లనియె.
407
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )