ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
సీ. అనఘాత్మ! సకల వర్ణాశ్రమాచార సమ్మత ధర్మ మెయ్యది మానవులకు
నే ధర్మమున నరుం డిద్ధ విజ్ఞానము భక్తియుఁ బ్రాపించుఁ బద్మజునకు
సాక్షా త్సుతుండవు సర్వజ్ఞుఁడవు నీకు నెఱుఁగరానిది ధర్మ మింత లేదు
నారాయణ పరాయణ స్వాంతు లనఘులు శాంతులు సదయులు సాధువృత్తి
 
ఆ. మెఱయుచున్న ఘనులు మీవంటి వా రెద్ది
పరమధర్మ మనుచు భక్తిఁ దలఁతు
రట్టి ధర్మరూప మఖిలంబు నెఱిఁగింపు
వినఁగ నిచ్ఛ గలదు విమలచరిత.
408
వ. అనిన, నారదుండు ధర్మరాజుం జూచి, దాక్షాయణియందు నిజాంశంబున జన్మించి,
భువనశోభనంబుకొఱకు బదరికాశ్రమంబునఁ దపోరతుం డై యున్న నారాయణుని
వలన సనాతన ధర్మంబు వింటిని. అది సెప్పెద. సకల వర్ణంబుల జనులకు
సత్యంబును, దయయును, నుపవాసాది తపంబును, శౌచంబును, సైరణయు, సద స
ద్వివేకంబును, మనోనియమంబును, బహిరింద్రియ జయంబును, హింస లేమియు,
బ్రహ్మచర్యంబును, దానంబును, యథోచిత జపంబును, సంతోషంబును, మార్దవంబును,
సమదర్శనంబును, మహాజన సేవయు, గ్రామ్యంబు లైన కోరికలు మానుటయు,
నిష్ఫలక్రియలు విడుచుటయు, మితభాషిత్వంబును, దేహంబు గాని తన్ను వెదకి
కొనుటయు, నన్నోదకంబులు ప్రాణులకుం బంచియిచ్చుటయుఁ, బ్రాణులందు
దేవతాబుద్ధియు, నాత్మబుద్ధిం జేయుటయు, శ్రీనారాయణచరణ స్మరణ కీర్తన
శ్రవణ సేవార్చన నమస్కార దాస్యాత్మసమర్పణ సఖ్యంబు లనెడి త్రింశ
ల్లక్షణంబులు గలుగవలయు. అందు సత్కులాచారుం డై మంత్రవంతంబు లైన
గర్భాధానాది సంస్కారంబు లవిచ్ఛిన్నంబులుగాఁ గలవాఁడు ద్విజుండు.
ద్విజునకు యజన యాజ నాధ్యయ నాధ్యాపన దాన ప్రతిగ్రహంబు లను
షట్కర్మంబులు విహితంబులు. రాజునకుఁ బ్రతిగ్రహ వ్యతిరిక్తంబు లైన యజనాది
కర్మంబు లైదును, బ్రజాపాలనంబును, బ్రాహ్మణులు గానివారివలన దండ
శుల్కాదులను గొనుటయు, విహిత కర్మంబులు. వైశ్యునికిఁ గృషి వాణిజ్య
గోరక్షణాది కర్మంబులును, బ్రాహ్మణ కులానుసరణంబును విహితంబులు. శూద్రునకు
ద్విజశుశ్రూష సేయవలయు.
409
సీ. విను కర్షణాదిక వృత్తికంటెను మేలు యాచింప నొల్లనియట్టి వృత్తి
ప్రాప్తంబు గైకొని బ్రతుకుకంటెను లెస్స యనుదినంబును ధాన్యమడిగికొనుట
యాయావరము కంటె నధిక కల్యాణంబు పఱిగ యెన్నుల ధాన్య భక్షణంబు
శిలజీవనముకంటె శ్రేయ మాపణములఁ బడ్డ గింజలు దిని బ్రతుకుఁ గనుట
 
ఆ. యెడరుచోట నృపతి కీ నాల్గు వృత్తులు
దగుఁ బ్రతిగృహంబు దగదు తలఁప
నాప దవసరముల నధముఁ డెక్కువ జాతి
వృత్తి నున్న దోషవిధము గాదు.
410
వ. వినుము. శిలవృత్తియు, నుంఛవృత్తియు ఋతమనియు, నయాచితవృత్తి మమృత మనియు,
నిత్య యాచ్ఞావృత్తి మృత మనియు, కర్షకవృత్తి ప్రమృత మనియు నెన్నుదురు. అట్టి
వృత్తుల జీవించుట మేలు. వాణిజ్యంబు సత్యానృతంబనియు, శ్వవృత్తి నీచసేవ
యనియుఁ బలుకుదురు. సర్వవేదమయుండు బ్రాహ్మణుండు. సర్వదేవమయుండు క్షత్త్రియుండు.
బ్రాహ్మణ క్షత్త్రియులకు నీచసేవనంబు కర్తవ్యంబు గాదు.
411
క. దమమును శౌచముఁ దపమును
శమమును మార్దవముఁ గృపయు సత్యజ్ఞాన
క్షమలును హరిభక్తియు హ
ర్షము నిజలక్షణము లగ్రజాతికి నధిపా!
412
ఉ. శౌర్యము దానశీలముఁ బ్రసాదము నాత్మజయంబుఁ దేజము\న్‌
ధైర్యము దేవభక్తియును ధర్మము నర్థముఁ గామము\న్‌ బుధా
చార్య ముకుంద సేవలును సత్కృతియుం బరితోషణంబు స
ద్వీర్యము రక్షణంబుఁ బృథివీవరశేఖర! రాజచిహ్నముల్‌.
413
క. ధర్మార్థ కామవాంఛయు
నిర్మల గురుదేవ విప్ర నివహార్చనముల్‌
నిర్మదభావముఁ బ్రమదము
శర్మకరత్వమును వైశ్యజన లక్షణముల్‌.
414
ఉ. స్తేయములేని వృత్తియు శుచిత్వము సన్నుతియు న్నిజేశులన్‌
మాయలులేక డాయుటయు మంత్రము సెప్పక పంచయజ్ఞముల్‌
సేయుటయు\న్‌ ధరామరుల సేవయు గోవుల రక్షణంబు న
న్యాయము లేమియు\న్‌ మనుజనాథ! యెఱుంగుము శూద్రధర్మముల్‌.
415
సీ. నిలయము వాటించి నిర్మలదేహి యై శృంగార మేప్రొద్దుఁ జేయవలయు
సత్యప్రియాలాప చతుర యై ప్రాణేశు చిత్తంబు ప్రేమ రంజింపవలయు
దాక్షిణ్య సంతోష ధర్మ మేధాదుల దైవత మని ప్రియుఁ దలఁపవలయు
నాథుఁ డేపద్ధతి నడచు నా పద్ధతి నడచి సద్బంధుల నడపవలయు
 
ఆ. మార్దవమునఁ బతికి మజ్జన భోజన
శయన పాన రతులు జరుపవలయు
విభుఁడు పతితుఁ డైన వెలఁది పాతివ్రత్య
మహిమఁ బుణ్యుఁ జేసి మనుపవలయు.
416
క. తరుణి తన ప్రాణవల్లభు
హరిభావంబుగ భజించి యతఁడును దాను\న్‌
సిరి కైవడి వర్తించును
హరిలోకమునందు సంతతానందమున\న్‌.
417
క. ఉపవాసంబులు వ్రతములుఁ
దపములు వెయ్యేల భర్త దైవత మని ని
ష్కపటతఁ గొలిచిన సాధ్వికి
నృపవర! దుర్లభము లేదు నిఖిలజగముల\న్‌.
418
వ. మఱియు, సంకరజాతు లైన రజక, చర్మకారక, నట, బురుడ, కైవర్తక, మేడ,
భిల్లు రగు నంత్యజాతు లేడువురకును, జండాల, పుల్కస, మాతంగ జాతులకును,
నాయా కులాగతంబు లైన వృత్తులఁ, జౌర్య హింసాదులు వర్జించి సంచరింప
వలయు. మానవులకుఁ బ్రతియుగంబున నైసర్గికంబు లైన ధర్మంబులు రెండు లోకంబు
లందును సుఖకరంబు లని వేదవిదు లైన పెద్దలు సెప్పుదురు. కారుకారున దున్నెడు
క్షేత్రంబు లావు చెడు. అందుఁ జల్లిన బీజంబులు నిస్తేజంబు లై యుండి, లెస్సగ
నంకురింపవు. నిరంతర ఘృతధారా వర్షంబున దహనంబునకు దాహకత్వంబు
శాంతిం జెందు. అందు వేల్చిన హవ్యంబులు ఫలించవు. తద్విధంబున ననవరత
కామాను సంధానంబునఁ గామోన్ముఖం బైన చిత్తంబు కామంబులం దనిసి, నిష్కామం
బై విరక్తి నొందుం గావున, సత్త్వస్వభావంబుతోడ నెప్పుఁడు దప్పక నిజవంశానుగత
విహితధర్మంబున వర్తించు నరుండు మెల్లన స్వాభావిక కర్మపరత్వంబు విడిచి ముక్తి
నొందు. జాతిమాత్రంబునఁ బురుషుని వర్ణంబు నిర్దేశింప లేరు. శమదమాది
వర్ణలక్షణ వ్యవహారంబులఁ గన వలయు. అని నారదుం డి ట్లనియె.
419
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )