ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
క. క్రమమున వర్ణంబుల చి
హ్నము లెల్లను జెప్పఁబడియె నాశ్రమముల ధ
ర్మము లెఱిఁగించెద నన్నియు
సమదాహితహృదయ శూల! సదమలశీలా!
420
వ. వినుము. బ్రహ్మచారి మౌంజీ, కౌపీన యజ్ఞోపవీత కృష్ణాజిన పాలాశదండ
కమండలు ధరుండును, సంస్కారహీన శిరోరుహుండును, దర్భహస్తుండును, శీల
ప్రశస్తుండును, మౌనియు నై, త్రిసంధ్యంబును బ్రహ్మగాయత్రి జపియించుచు, సాయం
ప్రాత రవసరంబుల నర్క పావక గురు దేవతోపాసనంబులు సేయుచు, గురు
మందిరంబునకుం జని, దాసుని చందంబున భక్తి వినయ సౌమనస్యంబులు గలిగి,
వేదంబులు సదువుచు, నధ్యయ నోపక్ర మావసానంబుల గురుచరణంబులకు
నమస్కరింపుచు, రేపు మాపును విహితగృహంబుల భిక్షించి, భైక్షంబు గురువునకు
నివేదించి, యనుజ్ఞఁ గొని, మితభోజనంబు గావింపుచు, విహిత కాలంబుల
నుపవసింపుచు, నంగనలందు నంగనాసక్తులందుం బ్రయోజనమాత్ర భాషణంబు
లొనర్చుచు, గురు పరాంగనలవలన నభ్యంగ కేశప్రసాధన శరీర మర్దన
మజ్జన రహస్యయోగంబులు వర్జించుచు, గృహంబున నుండక, జితేంద్రియత్వంబున
సత్యభాషణుం డై సంచరింపవలయు.
421
ఆ. పొలఁతి దావవహ్ని పురుషుఁ డాజ్యఘటంబు
కరఁగ కేల యుండుఁ గదిసె నేని
బ్రహ్మ యైన కూఁతుఁ బట్టక మానఁడు
వడుగు కింతిపొత్తు వలదు వలదు.
422
వ. వినుము. స్వరూప సాక్షాత్కారంబున దేహి, బహిరింద్రియాదికం బైన యంతయు నాభాస
మాత్రంబుగా నిశ్చయించి, యెందాఁక జీవుండు స్వతంత్రుం డైన యీశ్వరుండు గాకుండు,
నంత దడవు నంగన యిది, పురుషుండ నే ననియెడి బుద్ధి మానుట కర్తవ్యంబు గాదు.
బ్రహ్మచారి యతి గృహస్థులం దెవ్వఁ డైనఁ జిత్తంబు పరిపక్వంబు గాక యద్వైతాను
సంధానంబు సేసిన మూఢుం డగు. కావున రహస్యంబునఁ బుత్రిక నైనం డాయకుండ వలయు.
423
చ. శిరమున మేన సంస్కృతులు సేయక చందన భూషణాద్యలం
కరణము లెల్ల మాని ఋతుకాలముల న్నిజభార్యఁ బొందుచుం
దరుణులఁ జూడఁబాఱక ధృతవ్రతుఁ డై మధు మాంస వర్జి యై
గురుతరవృత్తితో మెలఁగు కోవిదుఁ డొక్క గృహస్థు భూవరా!
424
వ. మఱియు, ద్విజుండు గృహస్థుం డై గురువువలన నుపనిష దంగ సహితం బైన
వేదమంత్రంబును బఠియించి, నిజాధికా రానుసారంబుగా నర్థవిచారంబు సేసి,
తన బలంబుకొలఁది గురువులకు నభీష్టంబు లొసంగి, గృహంబున నొండె, వనంబున
నొండె, నైష్ఠికత్వంబు నాశ్రయించి, ప్రాణులతోడ జీవింపుచు, గురువునందు,
నగ్నియందు, నాత్మయందు, సర్వభూతములయందు నచ్యుత దర్శనంబు సేయుచు, నింద్రియ
వ్యసనాది మగ్నుండు గాక యెఱుక కలిగి వర్తింపుచుఁ బరబ్రహ్మంబు నొందు.
425
క. వినుము వనప్రస్థునకు\న్‌
మునికథితము లైన నియమములు గల వా చొ
ప్పున వనగతుఁ డై మెలఁగెడి
ఘనుఁడు మహర్లోకమునకు గమనించు నృపా!
426
వ. అటమీఁద గృహస్థాశ్రమంబు విడిచి, వనంబునకుం జని, దున్నక పండెడి నీవా
రాదికంబు లగ్నిపక్వంబు చేసి యొండె, నామంబులు చేసి యొండె, నర్క పక్వంబు లైన
ఫలాదు లొండె, భక్షింపుచు, వన్యాహారంబుల నిత్యకృత్యంబు లైన చరుపురోడాశంబు
లొనర్చుచుఁ, బ్రతిదినంబునం బూర్వసంచితంబులు పరిత్యజించి, నూతన ద్రవ్యంబులు
సంగ్రహింపుచు, నగ్నికొఱకుఁ బర్ణశాల యైనఁ, బర్వతకందరం బైన,
నాశ్రయింపుచు, హిమ, వాయు, వర్షాతపంబులకు సహింపుచు, నఖ శ్మశ్రు కేశ
తనూరుహంబులు ప్రసాధితంబులు సేయక జటిలుం డై వసియింపుచు, దండాజిన కమండలు
వల్కల పరిచ్ఛదంబులు ధరియించి, పండ్రెం డైన, నెనిమి దైన, నాలు గైన,
రెండైన, నొక వత్సరం బైనఁ, దపఃప్రయాసంబున బుద్ధినాశంబు గాకుండ ముని యై
చరింపుచు, దైవవశంబున జరారోగంబులచేతఁ జిక్కి, నిజ ధర్మానుష్ఠాన
సమర్థుండు గాని సమయంబున నిరశన వ్రతుం డై, యగ్నుల నాత్మారోపణంబులు సేసి,
సన్న్యసించి, యాకాశంబునందు శరీరరంధ్రంబులును, గాలియందు నిశ్శ్వాసంబును,
తేజంబులోపల నూష్మంబును, జలంబుల రసంబును, ధరణియందు శల్య మాంస
ప్రముఖంబులును, వహ్నియందు వక్తవ్యంబుతోడ వాక్కును, నింద్రునియందు శిల్పంబుతోడఁ
గరంబులును, విష్ణునియందు గతితోడఁ బదంబులును, బ్రజాపతియందు రతితోడ
నుపస్థంబును, మృత్యువందు విసర్గంబుతోడఁ బాయువును, దిక్కులందు శబ్దంబుతోడ
శ్రోత్రంబును, వాయువందు స్పర్శంబుతోడఁ ద్వక్కును, సూర్యునియందు రూపంబుతోడఁ
జక్షువులును, సలిలంబులందుఁ బ్రచేతస్సహిత యైన జిహ్వయు, క్షితియందు గంధసహితం
బైన ఘ్రాణంబునుఁ, జంద్రునియందు మనోరథంబులతోడ మనంబును, గవి యైన
బ్రహ్మయందు బోధంబుతోడ బుద్ధియు, రుద్రునియం దహంకారంబుతోడ మమత్వంబును,
క్షేత్రజ్ఞునియందు సత్త్వంబుతోడఁ జిత్తంబునుఁ, బరంబునందు గుణంబులతోడ
వైకారికంబునుఁ జెందించి, యటమీఁద బృథివిని జలంబునందును, జలంబును
దేజంబునందును, దేజంబును వాయువందును, వాయువును గగనమందును, గగనము
నహంకారతత్త్వమందును, నహంకారమును మహత్తత్త్వంబునందును, మహత్తత్త్వమును
బ్రకృతియందును, బ్రకృతి నక్షరుం డైన పరమాత్మయందును లయంబు నొందించి,
చిన్మాత్రావశేషితుం డైన క్షేత్రజ్ఞుని నక్షరత్వంబున నెఱింగి, ద్వయరహితుం డై,
దగ్ధకాష్ఠుం డైన వహ్నిచందంబునఁ బరమాత్మ యైన నిర్వికారబ్రహ్మంబునందు
లీనుండు గావలయు.
427
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )