ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
క. అనఘ! వనప్రస్థుం డై
చని త ద్ధర్మంబు లిట్లు సలుపుచు మఱియు\న్‌
మనె నేని సన్న్యసింపం
జను నట మీఁదటను ముక్తి సంగత్వమున\న్‌.
428
వ. ఇట్లు వానప్రస్థాశ్రమంబు జరిపి, సన్న్యసించి, దేహమాత్రావశిష్టుండును, నిర
పేక్షుండును, భిక్షుండును, నిరాశ్రయుండును, నాత్మారాముండును, సకలభూతసముండును,
శాంతుండును, సమచిత్తుండును, నారాయణ పరాయణుండును నై, కౌపీనాచ్ఛాదన
మాత్రం బైన వస్త్రంబు ధరియించి, దండాది వ్యతిరిక్తంబులు విసర్జించి,
యాత్మపరంబులు గాని శాస్త్రంబులు వర్జించి, గ్రహ నక్షత్రాది విద్యల నభ్యసింపక,
భేదవాదంబు లైన తర్కంబులు తర్కింపక, యెందును బక్షీకరింపక, శిష్యులకు
గ్రంథంబులు వచించి యుపన్యసింపక, బహువిద్యల జీవింపక, మత్తాది వ్యాపారంబుల
నుల్లసిల్లక, పెక్కుదినంబు లొక్కయెడ వసియింపక, యూరూర నొక్కొక్క రాత్రి నిలుచుచుఁ,
గార్యకారణ వ్యతిరిక్తం బయిన పరమాత్మయందు విశ్వంబు దర్శించుచు, స దస
న్మయం బైన విశ్వంబు నందుఁ బరబ్రహ్మ మైన యాత్మ నవలోకింపుచు, జాగరణ
స్వప్న సంధిసమయంబుల నాత్మనిరీక్షణంబు సేయుచు, నాత్మకు బంధమోక్షణంబులు
మాయా మాత్రంబులు గాని, వస్తు ప్రకారంబున లే వనియును, దేహంబునకు జీవితంబు
ధ్రువంబు గాదనియును, మృత్యువు ధ్రువంబనియు నెఱుంగుచు, భూతదేహంబుల
సంభవనాశంబులకు మూలం బైన కాలంబుఁ బ్రతీక్షించుచు, ని వ్విధంబున
జ్ఞానోత్పత్తి పర్యంతంబు సంచరించి, యటమీఁద విజ్ఞానవిశేషంబు
సంభవించినఁ బరమహంసుం డై, దండాది చిహ్నంబులు ధరియించి యొండె, ధరియింపక
యొండె, బహిరంగ వ్యక్తచిహ్నుండు గాక, యంతరంగవ్యక్త మైన యాత్మానుసంధానంబు
గలిగి, మనీషి యై, బాహ్యానుసంధానాభావంబున మనుష్యులకుం దన వలన నున్మత్త
బాల మూకుల తెఱంగుఁ జూపుచుండవలయు.
429
ప్రహ్లాదాజగర సంవాదము
క. మునివల్లభుఁ డజగరుఁ డను
సునయుండు హిరణ్యకశిపు సూనుండును ము
న్నొనరించిన సంవాదము
విను మీ యర్థంబు నందు వెలయు నరేంద్రా!
430
వ. తొల్లి భగవత్ప్రియుం డైన ప్రహ్లాదుండు కతిపయామాత్య సహితుం డై, లోక
తత్త్వంబు నెఱింగెడికొఱకు లోకంబుల సంచరింపుచు, నొక్కనాఁడు కావేరీ
తీరంబున సహ్యపర్వతతటంబున ధూళిధూసరితంబు లైన కరచరణా ద్యవయ
వంబులతోడ గూఢం బైన నిర్మలతేజంబుతోఁ గర్మాకార వచో లింగ వర్ణాశ్ర
మాదుల నెవ్వరికి నెఱుంగఁబడక, నేల నిద్రింపుచు, నజగర వ్రతధరుం డైన
మునిం గని, డాయం జని, విధివత్ప్రకారంబున నర్చించి, మునిచరణంబులకు
శిరంబు మోపి, మ్రొక్కి, యతని చరిత్రంబులు దెలియ నిచ్చగించి యి ట్లనియె.
431
సీ. భూమి నుద్యోగి యై భోగి యై యుండెడి నరుని కైవడి మునినాథ! నీవు
ఘనశరీరముఁ దాల్చి కదలవు చిత్ర ముద్యమయుక్తునకుఁ గాని ధనము లేదు
ధనవంతునకుఁ గాని తగు భోగములు లేవు భోగికిఁ గాని సంపూర్ణ మైన
తనువు లే దుద్యోగ ధన భోగంబులు లేక నేల నూరక పడి నిద్రవోవు
 
ఆ. నీకు నెట్లు గలిగె నిరుపమ దేహంబు?
సముఁడ వార్యుఁడవు విశారదుఁడవు
బుద్ధినిధివి జనులఁ బొగడవు దెగడవు
నిద్ర ప్రతిదినంబు నిలుప నేల.
432
వ. అని ఇట్లు ప్రహ్లాదుం డడిగిన, వికసితముఖుం డై మునీంద్రుండు తదీయ
మధురాలాప సుధారస ప్రవాహంబులు కర్ణంబులఁ బరిపూర్ణంబు లైన
నతని నవలోకించి యి ట్లనియె.
433
సీ. ఆంతరంగికదృష్టి నంతయు నెఱుఁగుదు వార్యనమ్మతుఁడ వీ వసురవర్య!
విశ్వజంతువుల ప్రవృత్తి నివృత్తి లక్షణములు నీ వెఱుంగనివి లేవు
భగవంతుఁ డగు హరిఁ బాయక నీ మనో వీథి రాజిల్లుచు వెలుఁగుఱేని
క్రమమున బహిరంధకారంబుఁ బరిమార్చు పరమ సాత్త్వికుఁడవు భద్రబుద్ధి
 
ఆ. వైన నీవు నన్ను నడిగెదు గావున
విన్నధర్మమెల్ల విస్తరింతు
నిన్నుఁ జూడఁ గలిగె నీతోడి మాటల
నాత్మశుద్ధి గలిగె ననఘచరిత్ర!
434
వ. వినుము. ప్రవాహకారిణి యై, విషయంబులచేతం బూరింపరాని తృష్ణచేతం బడి,
కర్మంబులఁ బరిభ్రామ్యమాణుండ నైన నేను నానావిధ యోనులందుఁ బ్రవేశింపుచు,
వెడలుచు, నెట్టకేలకు మనుష్యదేహంబు ధరియించి, యందు ధర్మంబున స్వర్గ
ద్వారంబును, నధర్మంబున శునక సూకరాది తిర్యగ్జంతు యోని ద్వారంబులను నొంది,
క్రమ్మఱ మనుష్యుం డై పుట్టవలయు నని వివేకించి, సుఖరక్షణ దుఃఖమోక్షణంబుల
కొఱకు ధర్మంబులు సేయు దంపతుల వ్యవహారంబుఁ గని, సర్వక్రియానివృత్తిఁ
గలిగిన జీవుండు స్వతంత్రుం డై ప్రకాశించు నని నిర్ణయించి, భోగంబులు
మనోరథజాత మాత్రంబులు గాని శాశ్వతంబులు గావని పరీక్షించి,నివృత్తుండనై
యుద్యోగంబు లేక నిద్రించుచుఁ, బ్రారబ్ధభోగంబు లనుభవించుచు, నుండుదు.
ఇ వ్విధంబునఁ దనకు సుఖరూపం బైన పురుషార్థంబు దనయందుఁ గలుగుట
యెఱుంగక, పురుషుండు శైవాలజాల నిరుద్ధంబులైన శుద్ధజలంబుల విడిచి, యెండ
మావులు జలంబు లని పాఱెడి మూఢుని తెఱంగున సత్యంబుగాని ద్వైతంబుఁ జొచ్చి,
ఘోర సంసార చక్ర పరిభ్రాంతుం డై యుండు. దైవతంత్రంబు లైన దేహాదులచేత,
నాత్మకు సుఖంబును, దుఃఖనాశంబునుఁ గోరుచు, నిరీశుం డైన వాని ప్రారంభంబులు
నిష్ఫలంబు లగు. అదియునుం గాక, మర్త్యునకు ధనంబు ప్రాప్తంబైన, నది దుఃఖకరంబు
గాని సుఖకరంబు గాదు. లోభవంతు లైన ధనవంతులు నిద్రాహారంబులు లేక రాజ
చోర యాచక శత్రు మిత్రాది సర్వస్థలంబులందును శంకింపుచు దాన భోగంబుల
మఱచి యుండుదురు. ప్రాణార్థవంతులకు భయంబు నిత్యంబు. శోక మోహ భయ క్రోధ
రాగ శ్రమాదులు వాంఛా మూలంబులు. వాంఛ లే కుండవలయు.
435
మ. సరఘల్‌ గూర్చిన తేనె మానవులకు\న్‌ సంప్రాప్త మైనట్లు లో
భరతుల్‌ గూర్చిన విత్తనముల్‌ పరులకుం బ్రాప్తించుఁ బ్రాప్తాశి యై
తిరుగంబోని మహోరగంబు బ్రతుకు\న్‌ దీర్ఘాంగ మై యుండియు\న్‌
జిరకాలంబు వాని వర్తనములం జింతించి యేకాంతి నై.
436
క. అజగరమును జుంటీఁగయు
నిజగురువులుగాఁ దలంచి నిశ్చింతుఁడ నై
విజనస్థలిఁ గర్మంబుల
గజిబిజి లేకున్నవాఁడ గౌరవవృత్తి\న్‌.
437
సీ. అజిన వల్కల దుకూలాంబరంబులు గట్టి యైనఁ గట్టక యైన నలరుచుందు
నాందోళికా రథ హయ నాగముల నెక్కి యైన నెక్కక యైన నరుగుచుందుఁ
గర్పూర చందన కస్తూరికా లేప మైన భూరజ మైన నలఁదికొందు
భర్మ శయ్యల నైనఁ బర్ణ శిలా తృణ భస్మంబులం దైనఁ బడుచునుందు
 
ఆ. మానయుక్త మైన మానహీనం బైనఁ
దీయ నైన మిగులఁ దిక్త మైనఁ
గుడుతు సగుణ మైన గుణవర్జితం బైన
నల్ప మైనఁ జాల నధిక మైన.
438
క. లేదని యెవ్వరి నడుగను
రాదని చింతింపఁ బరులు రప్పించినచోఁ
గాదని యెద్దియు మానను
ఖేదము మోదమును లేక క్రీడింతు మదిన్‌.
439
క. నిందింపఁ బరుల నెన్నఁడు
వందింప ననేక పీడ వచ్చిన మది నా
క్రందింప విభవముల కా
నందింపఁ బ్రకామవర్తనంబున నధిపా!
440
వ. ఇట్లు కోరిక లేక యొక్క సమయంబున దిగంబరుండ నై పిశాచంబు చందంబున
నుండుచుఁ, బెక్కు దినంబులంగోలెఁ బెనుబాము వర్తనంబు గైకొని, నిమీలిత
లోచనత్వంబున నేకాంతభావంబు విష్ణునియందుఁ జేర్చి, వికల్పంబు భేదగ్రాహక
చిత్తవృత్తులను, జిత్తంబు నర్థరూప పరిభ్రమంబు గల మనంబునందును, మనంబు
నహంకారంబునందును, నహంకారంబును మాయయందును, మాయ నాత్మానుభూతి
యందును లయంబు నొందించి, సత్యంబు దర్శించుచు, విరక్తి నొంది, స్వానుభవంబున
నాత్మస్థితుండ నై యుండుదు. నీవు భగవత్పరుండవు గావున రహస్యం బైన
పరమహంసధర్మంబు స్వానుభవ గోచరం బైన తెఱంగున నీకు హృద్గోచరం
బగునట్లు చెప్పితి. అనిన విని.
441
క. ఘను నజగర మునివల్లభు
దనుజేంద్రుఁడు పూజచేసి తగ వీడ్కొని నె
మ్మనమున సంతోషించుచుఁ
జనియె\న్‌ నిజగేహమునకు శశికులతిలకా!
442
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )