ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
వ. అనిన యుధిష్ఠిరుం డి ట్లనియె. 443
క. ననుబోఁటి జడ గృహస్థుఁడు
మునివల్లభ! యిట్టి పదవి మోదంబున నే
యనువునఁ జెందును వేగమ
వినుపింపుము నేఁడు నాకు విజ్ఞాననిధీ!
444
వ. అనిన నారదుం డి ట్లనియె. గృహస్థుం డైనవాఁడు, వాసుదేవార్పణంబుగా
గృహోచిత క్రియలను సంధించుచు, మహామునుల సేవించి, వారలవలన నారాయణ
దివ్యావతార కథాశ్రవణంబు సేయుచు, న య్యై విహితకాలంబుల శాంతజనులం
గూడి యుండుచుఁ, బుత్ర మిత్ర కళత్రాది సంగంబులు గలలవంటివని యెఱుంగుచు,
లోపల నాసక్తి లేక సక్తునికైవడి వెలుపలఁ బురుషకారంబు లొనర్చుచుఁ,
దగులంబులు లేక, విత్తంబు లిచ్చి జనక సుత సోదర సఖి జ్ఞాతి జనుల చిత్తంబులు
సమ్మదాయత్తంబులు గావింపుచు, ధన ధాన్య నిధాన దైవ లబ్ధంబులవలన
నభిమానంబు మాని యనుభవింపుచు, గృహక్షేత్రంబులఁ జొచ్చి యుదరపూరణమాత్రంబు
దొంగిలించినవాని దండింపక, భుజగ మృగ మూషక మర్కట మక్షికా ఖరోష్ట్రంబుల
హింసింపక పుత్రులభంగి నీక్షింపుచు, దేశ కాల దైవంబుల కొలఁదిని ధర్మార్థ
కామంబులఁ బ్రవర్తింపుచు, శునక పతిత చండాలాదుల కైన భోజ్యపదార్థంబులు
తగినభంగి నిచ్చుచు, నిజవృత్తి లబ్ధంబులగు నశనాదులచేత దేవ ఋషి
పితృ భూత మానవుల సంతర్పించుచుఁ, బంచ మహాయజ్ఞావశేషంబుల
నంతర్యామి పురుషయజనంబు, నాత్మ జీవనోపాయంబును సమర్థింపుచు నుండవలయు.
445
ఆ. జనక గురుల నైనఁ జంపు నర్థమునకై
ప్రాణ మైన విడుచు భార్యకొఱకు
నట్టి భార్యఁ బురుషుఁ డతిథిశుశ్రూష సే
యించి గెలుచు నజితు నీశు నైన.
446
ఆ. పరముఁ డీశ్వరుండు బ్రాహ్మణముఖమున
నాహరించి తుష్టుఁ డైన భంగి
నగ్నిముఖమునందు హవ్యరాసులు గొని
యైన తుష్టినొందఁ డనఘచరిత!
447
వ. కావున గృహస్థుండు బ్రాహ్మణులందును, దేవతలందును, మర్త్య పశుప్రముఖ
జాతులందును, నంతర్యామియు, బ్రాహ్మణాననుండును నైన క్షేత్రజ్ఞునందు న య్యై
కోరికలు సమర్పించి, సంతర్పణంబు సేయవలయు. భాద్రపదంబునఁ,
గృష్ణపక్షంబునందును, దక్షిణోత్తరాయణంబులందును, రేయింబగలు సమ మైన
కాలంబునందును, వ్యతీపాతంబులందును, దినక్షయంబులందును, సూర్య చంద్ర
గ్రహణంబులందును, శ్రవణద్వాదశియందును, వైశాఖశుక్ల తృతీయ యందును,
కార్తికశుక్ల నవమియందును, హేమంత శిశిరంబులోన నాలు గష్టక లందును,
మాఘశుక్ల సప్తమియందును, మాస నక్షత్రంబులతోడం గూడిన పున్నమ లందును,
ద్వాదశితోడం గూడిన యుత్తరాత్రయ శ్రవణానూరాధలందును, నుత్తరాత్రయ
సహిత లైన యేకాదశీ తిథులందును, జన్మనక్షత్ర యుక్త దివసంబులందును,
మఱియుఁ, బ్రశస్తకాలంబులందును, జననీ జనక బంధుజనులకు శ్రాద్ధంబులును,
జప హోమ స్నాన వ్రతంబులును, దేవ బ్రాహ్మణ సమారాధనంబులును నాచరింపవలయు.
భార్యకుఁ బుంసవనాదికంబును, నపత్యంబునకు జాతకర్మాదికంబును, దనకు
యజ్ఞదీక్షాదికంబును, బ్రేతజనులకు దహనాదికంబును, మృతదివసంబున
సాంవత్సరికంబును జరుపవలయు.
448
మ. విను మే దేశములం దయాగుణ తపో విద్యాన్వితం బైన వి
ప్రనికాయంబు వసించు నే స్థలముల\న్‌ భాగీరథీముఖ్య వా
హిను లుండున్‌ హరిపూజ లెయ్యెడల భూయిష్ఠ ప్రకారంబుల\న్‌
దనరు\న్‌ భూవర! యిట్టి చోటులఁ దగున్‌ ధర్మంబులం జేయఁగ\న్‌.
449
క. హరియందు జగము లుండును
హరిరూపము సాధుపాత్ర మం దుండు శివం
కర మగు పాత్రము గలిగిన
నరయఁగ నది పుణ్యదేశ మనఘచరిత్రా!
450
వ. మఱియుఁ, గురుక్షేత్రంబును, గయాశీర్షంబును, బ్రయాగంబును, బులహాశ్రమంబును,
నైమిశంబును, ఫల్గునంబును, సేతువును, బ్రభాసంబునుఁ, గుశస్థలియును,
వారాణసియు, మధురాపురియును, బంపా బిందు సరోవరంబులును, నారాయణాశ్రమంబును,
సీతారామాశ్రమంబును, మహేంద్ర మలయాదు లైన కులాచలంబులును,
హరిప్రతిమార్చన ప్రదేశంబులును, హరిసేవాపర పరమభాగవతులు వసించెడు
పుణ్యక్షేత్రంబులును, శుభకాముం డైన వాఁడు సేవింప వలయు.
451
ఆ. భూవరేంద్ర! యిట్టి పుణ్యప్రదేశంబు
లందు నరుఁడు సేయునట్టి ధర్మ
మల్ప మైన నది సహస్రగుణాధిక
ఫలము నిచ్చు హరి కృపావశమున.
452
వ. వినుము. చరాచరం బైన విశ్వ మంతయు విష్ణుమయం బగుటం జేసి, పాత్ర నిర్ణయ
నిపుణు లైన విద్వాంసులు నారాయణుండు ముఖ్యపాత్ర మని పలుకుదురు. దేవఋషులును,
బ్రహ్మపుత్రు లైన సనకాదులును నుండ, భవదీయ రాజసూయంబున నగ్రపూజకు హరి
సమ్మతుం డయ్యె. అనేక జంతుసంఘాత సంకీర్ణం బైన బ్రహ్మాండ పాదపంబునకు
నారాయణుండు మూలంబు. తన్నిమిత్తంబున నారాయణ సంతర్పణంబు సకలజంతు సంతర్పణ
మని యెఱుంగుము. ఋషి నర తిర్య గమర శరీరంబులు పురంబులు. వానియందుఁ దార
తమ్యంబులతోడ జీవరూపంబున భగవంతు డైన హరి వర్తించుటం జేసి, పురుషుండనఁ
బ్రసిద్ధు డయ్యె. అందుఁ దిర్యగ్జాతులకంటె నధికత్వంబు పురుషునియందు విలసిల్లుటం
జేసి పురుషుండు పాత్రంబు. పురుషులలోన హరి తను వైన వేదంబు నుద్ధరింపుచు
సంతోష విద్యా తపోగరిష్ఠుం డైన బ్రాహ్మణుండు పాత్రంబు. బ్రాహ్మణులలోన
నాత్మజ్ఞాన పరిపూర్ణుం డైన యోగి ముఖ్యపాత్రం బని పలుకుదురు. పరస్పర
పాత్రంబులకు సహింపని మనుష్యులకుఁ బూజనార్థంబు త్రేతాయుగంబునందు
హరిప్రతిమలు గల్పింపఁ బడియె. కొందఱు ప్రతిమార్చనంబుఁ జేయుదురు. పురుషద్వేషు
లైన వారలకు నట్టి ప్రతిమార్చనంబు ముఖ్యార్థప్రదంబు గాదు. మందాధికారులకుఁ
బ్రతిమార్చనంబు పురుషార్థ ప్రదం బగు.
453
ఆ. అఖిల లోకములకు హరి దైవతము సూడ
హరికి దైవతము ధరామరుండు
పదపరాగ లేశపంక్తిచేఁ ద్రైలోక్య
పావనంబుఁ జేయు బ్రాహ్మణుండు.
454
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )