ఇతిహాసములు భాగవతము సప్తమ స్కంధము
వ. అట్టి బ్రాహ్మణజనులందుఁ గర్మనిష్ఠులు, తపోనిష్ఠులు, వేదశాస్త్రనిష్ఠులు,
జ్ఞాన యోగనిష్ఠులు నై కొందఱు వర్తింతురు. అందు జ్ఞాననిష్ఠునికి ననంత
ఫలకామి యైన గృహస్థుండు పితృజనుల నుద్దేశించి కవ్యంబులును, దేవతల
నుద్దేశించి హవ్యంబులునుఁ బెట్టుట ముఖ్యంబు. దైవకార్యంబునకు నిరువుర నైన,
నొకరి నైనఁ, బితృకార్యంబునకు మువ్వుర నైన నొకరి నైన, భోజనంబు సేయింప
వలయు. ధనవంతున కైనను శ్రాద్ధ విస్తారంబు కర్తవ్యంబు గాదు. దేశ కాల
ప్రాప్త కంద మూల ఫలాదికం బైన హరి నైవేద్యంబున, విధి చోదిత
ప్రకారంబుగా శ్రద్ధతోడఁ బాత్రంబునందుఁ బెట్టిన యన్నంబు కామదం బై యక్షయ
ఫలకారి యగు. ధర్మతత్త్వ వేది యైనవాఁడు శ్రాద్ధంబులందు మాంసప్రదానంబు
సేయక, భక్షింపక, చరింపవలయు. కందమూలాది దానంబున నయ్యెడి ఫలంబు,
పశుహింసనంబున సంభవింపదు. ప్రాణిహింస సేయక వర్తించుటకంటె మిక్కిలి
ధర్మంబు లేదు. యజ్ఞవిదు లైన ప్రోడలు నిష్కాములై, బాహ్యకర్మంబులు విడిచి,
యాత్మజ్ఞాన దీపంబులందుఁ గర్మమయంబు లయిన యజ్ఞంబుల నాచరింతురు.
455
క. పశువులఁ బొరిగొని మఖములు
విశదములుగఁ జేయు బుధుని వీక్షించి తము\న్‌
విశసనము చేయునో యని
కసిమసి బెగడొందు భూతగణము నరేంద్రా!
456
వ. అది గావున ధర్మవేది యైనవాఁడు, ప్రాప్తంబు లైన కందమూలాదికంబులచేత
నిత్య నైమిత్తిక క్రియలఁ జేయవలయు. నిజ ధర్మబాధకం బయిన ధర్మంబును,
బరధర్మ ప్రేరితం బైన ధర్మంబును, నాభాసధర్మంబును, బాషండధర్మంబును,
గపటధర్మంబును, ధర్మజ్ఞుం డైనవాఁడు మానవలయు. నైసర్గికధర్మంబు దురిత
శాంతి సమర్థం బగు. నిర్ధనుండు ధర్మార్థంబు యాత్రసేయుచు నైన ధనంబు
గోర వలదు. జీవనోపాయంబునకు నిట్టట్టుఁ దిరుగక, కార్పణ్యంబు లేక
జీవించుచు, మహాసర్పంబు తెఱంగున సంతోషంబున నాత్మారాముం డై, యెద్దియుం
గోరక బ్రతికెడి సుగుణునికిం గల సుఖంబు, కామలోభంబులం దశదిశలం బరి
ధావనంబు సేయువానికి సిద్ధింపదు. పాదరక్షలు గలవానికిఁ శర్కరాకంటకాదుల
వలన భయంబులేక మెలంగ నలవడుభంగిఁ, గామంబులవలన నివృత్తి గలవానికి
నెల్లకాలంబును భద్రం బగు. ఉపస్థకును, జిహ్వాదైన్యంబునకును బురుషుండు
గృహపాలక శునకంబుకైవడి సంచరించుచు సంతుష్టి లేక చెడు. సంతోషిగాని
విప్రుని విద్యా తపో విభవ యశంబులు నిరర్థకంబులు. ఇంద్రియ లోలత్వంబున
జ్ఞానంబు నశించు. సకల భూలోక భోగంబులు భోగించియు, దిగ్విజయంబు సేసియు,
బుభుక్షా పిపాసవలన కామపారంబును, హింసవలనఁ గ్రోధపారంబును జేరుట
దుర్లభంబు. సంకల్ప వర్జనంబునఁ గామంబును, గామవర్జనంబునఁ గ్రోధంబును,
నర్థానర్థ దర్శనంబున లోభంబులును, నద్వైతానుసంధానంబున భయంబును,
నాత్మానాత్మ వివేకంబుల శోకమోహంబులును, సాత్త్వికసేవనంబున దంభంబును,
మౌనంబున యోగాంతరాయంబును, శరీరవాంఛలేమి హింసయు, హితాచరణంబున
భూతజం బైన దుఃఖంబును, సమాధిబలంబున దైవికవ్యథయును, ప్రాణాయామాదికంబున
మన్మథవ్యథయును, సాత్త్వికాహారంబుల నిద్రయు, సత్త్వగుణంబున రజస్తమంబులును,
నుపశమంబున సత్త్వంబును, గురుభజనకుశలుం డై శీలంబున జయింప వలయు.
457
క. హరి మహిమ తనకుఁ జెప్పెడి
గురువు న్నరుఁ డనుచుఁ దలఁచి కుంఠితభక్తి\న్‌
దిరుగు పురుషు శ్రమ మెల్లను
కరిశౌచముక్రియ నిరర్థకం బగు నధిపా!
458
ఉ. ఈ వనజాతనేత్రుఁ బరమేశు మహాత్ముఁ బ్రధానపూరుషు\న్‌
దేవశరణ్యు సజ్జనవిధేయు ననంతుఁ బురాణయోగి సం
సేవిత పాదపద్ముఁ దమచిత్తముల న్నరుఁడంచు లోకు లి
చ్ఛావిధిఁ జూచుచుండుదురు సన్మతి లేక నరేంద్రచంద్రమా!
459
వ. వినుము. షడింద్రియంబులలోన నొకటియందుఁ దత్పరు లై, యిచ్ఛాపూరణ
విధానంబులఁ జరితార్థుల మైతి మనువారలు ధారణాభ్యాస సమాధియోగంబుల
సాధింపలేరు. కృషిప్రముఖంబులు సంసారసాధనంబులు గాని మోక్షసాధనంబులు
గావు. కుటుంబసంగంబునఁ జిత్తవిక్షేపం బగు. చిత్తవిజయప్రయత్నంబున సన్న్యసించి,
సంగంబు వర్జించి, మితం బైన భిక్షాన్నంబు భక్షింపుచు, శుద్ధ వివిక్త
సమప్రదేశంబున నొక్కరుఁడు నాసీనుం డై సుస్థిరత్వంబునఁ బ్రనవోచ్చారణంబు
సేయుచు, రేచక పూరక కుంభకంబులఁ బ్రాణాపానంబుల నిరోధించి, కామాహతం
బైన చిత్తంబు పరిభ్రమణంబు మాని, కామవిసర్జనంబు చేసి మరలునంతకు నిజ
నాసాగ్రనిరీక్షణంబు సేయుచు, ని వ్విధంబున యోగాభ్యాసంబు సేయువాని చిత్తంబు
కాష్ఠరహితం బైన వహ్నితెఱంగున శాంతిఁ జెందు. కామాదులచేత వేధింపఁ
బడక, ప్రశాంత సమస్తవృత్తం బైన చిత్తంబు బ్రహ్మసుఖ సమ్మర్శనంబున లీనం
బై మఱియు నెగయనేరదు.
460
మ. ధరణీదేవుఁడు సన్న్యసించి యతి యై ధర్మార్థ కామంబులన్‌
బరివర్జించి పున ర్విలంబమునఁ దత్ప్రారంభి యౌనేని లో
భరతిం గక్కినకూడు మంచి దనుచు\న్‌ భక్షించి జీవించు దు
ర్నరుచందంబున హాస్యజీవనుఁ డగున్‌ నానాప్రకారంబుల\న్‌.
461
క. మలమునఁ గ్రిమియునుఁ బడుక్రియ
నిలఁబడు నొడలాత్మగాదు హేయంబనుచున్‌
దలఁతురు తద్‌జ్ఞులు వొగడుదు
రలసత నొడలాత్మ యనుచు నజ్ఞు లిలేశా!
462
ఆ. వ్రతము మానఁ దగదు వడుగుఁ గుఱ్ఱనికినిఁ
గ్రియలు మానఁ దగదు గృహగతునికిఁ
దపసి కూర నుండఁ దగదు సన్న్యాసికిఁ
దరుణితోడి పొత్తు తగదు తగదు.
463
సీ. రథము మేనెల్ల సారథి బుద్ధి యింద్రియగణము గుఱ్ఱములు పగ్గములు మనము
ప్రాణాది దశవిధపవనంబు లిరుసు ధర్మాధర్మగతులు రథాంగకములు
బహులతరం బైన బంధంబు చిత్తంబు శబ్దాదికములు సంచారభూము
లభిమానసంయుతుం డైన జీవుఁడు రథి ఘనతర ప్రణవంబు కార్ముకము
 
తే. శుద్ధజీవుండు బాణంబు శుభగమైన
బ్రహ్మ మంచితలక్ష్యంబు పరులు రాగ
భయ మద ద్వేష శోక లోభ ప్రమోహ
మాన మత్సర ముఖములు మానవేంద్ర!
464
వ. ఇట్లు మనుష్యశరీరరూపం బైన రథంబుఁ దనవశంబు సేసికొని, మహాభాగవత
చరణకమల సేవానిశితం బైన విజ్ఞానఖడ్గంబు ధరియించి, శ్రీమన్నారాయణ
కరుణావలోకన బలంబున రాగాది శత్రునిర్మూలనంబు గావించి, ప్రణవబాణాస
నంబున శుద్ధజీవశరంబును సంధించి, బ్రహ్మ మనియెడి గుఱియందుఁ బడనేసి,
యహంకార రథికుండు రథికత్వంబు మాని, నిజానందంబున నుండవలయు. అట్టి
విశేషంబు సంభవింపని సమయంబున, బహిర్ముఖంబు లైన యింద్రియఘోటకంబులు
బుద్ధిసారథి సహితంబు లై, సాభిమాన రథికుని ప్రమత్తత్వంబు దెలిసి, ప్రవృత్తి
మార్గంబు నొందించి, విషయ శత్రుమధ్యంబునం గూల్చిన.
465
ఆ. విషయశత్రు లెల్ల విక్రాంతితోడ సా
రథిసమేతుఁ డైన రథికుఁ బట్టి
యుగ్ర తిమిర మృత్యుయుత మగు సంసార
కూప మధ్యమందుఁ గూల్తు రధిప!
466
వ. విను. వైదిక కర్మంబు ప్రవృత్తంబును, నివృత్తంబు నను, రెండు తెఱంగు లయ్యె.
అందుఁ బ్రవృత్తంబునఁ బునరావర్తనంబును, నివృత్తంబున మోక్షంబును సిద్ధించు.
ప్రవృత్త కర్మంబులోన నిష్టాపూర్తంబు లన రెండుమార్గంబులు గలవు. అందు హింసా
ద్రవ్యమయ కామ్యరూపంబు లైన దర్శ పూర్ణమాస పశుసోమయాగ వైశ్వదేవ
బలిహరణ ప్రముఖంబులైన యాగాదికంబు లిష్టంబులు. దేవాలయ వనకూప తటాక
ప్రముఖంబులు పూర్తంబులు. ప్రవృత్తకర్మంబున దేహంబు విడిచి, దేహాంత
రారంభంబున దేహి హృదయాగ్రంబున వెలుంగు. వానితోడ నింద్రియంబులఁ గూడి,
భూత సూక్ష్మయుక్తుఁ డై ధూమ దక్షిణాయన కృష్ణపక్ష రాత్రి దర్శంబులవలన
సోమలోకంబుఁ జేరి, భోగావసానంబున విలీన దేహుం డై, వృష్టిద్వారంబునఁ
గ్రమంబున నోషధిలతాన్న శుక్లరూపంబులఁ బ్రాపించి, భూమియందు జన్మించు.
ఇది పునర్భవరూపం బైన పితృమార్గంబు. నివృత్త కర్మనిష్ఠుం డైనవాఁడు,
జ్ఞానదీప్తంబు లైన యింద్రియంబులందుఁ గ్రియాయజ్ఞంబుల యజించి, యింద్రియంబుల
దర్శనాది సంకల్పరూపం బైన మనంబునందును, వికారయుక్తంబైన మనంబును వాక్కు
నందును, విద్యాదిలక్షణ యైన వాక్కును వర్ణసముదాయంబు నందును, వర్ణసముదాయంబు
నకారాది స్వరత్రయాత్మకంబైన ఓంకారంబు నందును, నోంకారంబును బిందువందును,
బిందువును నాదంబునందును, నాదంబును బ్రాణంబునందును, బ్రాణంబును బ్రహ్మమందును
నిలుపవలయు. దేవమార్గంబు లైన యుత్తరాయణ శుక్లపక్ష దివా ప్రాహ్ణ రాకలవలన
సూర్యబ్రహ్మలోకంబునందుఁ జేరి, భోగావసానంబున స్థూలోపాధి యైన విశ్వుం డై,
స్థూలంబును సూక్ష్మంబునందు లయించి సూక్ష్మోపాధి యైన తేజసుం డై, సూక్ష్మంబును
గారణంబునందు లయించి కారణోపాధి యైన ప్రాజ్ఞుం డై, కారణంబును సాక్షిస్వరూపంబునందు
లయించి తురీయుం డై, సూక్ష్మలయంబునందు శుద్ధాత్ముం డై యి వ్విధంబున ముక్తుండగును.
467
ఆ. అమరనిర్మితంబు లై యొప్పు పితృ దేవ
సరణు లెవ్వఁ డెఱుఁగు శాస్త్రదృష్టి
నట్టివాఁడె దేహి యై మోహమున నొందఁ
డతిశయించు బుద్ధి నవనినాథ!
468
వ. వినుము. దేహాదులకుఁ గారణత్వంబున నాదియందును, నవధిత్వంబున నంత్యమందునుఁ
గలుగుచు, బహిరంగంబున భోగ్యంబును, నంతరంగంబున భోక్తయుఁ, బరంబును,
నపరంబును, జ్ఞానంబును, జ్ఞేయంబును, వచనంబును, వాచ్యమును, నప్రకాశమును,
బ్రకాశంబు నైన వస్తువునకు వేఱొండు లేదు. ప్రతిబింబాదికంబు వస్తుత్వంబునంజేసి
వికల్పితం బై తలంపంబడుభంగి, నైంద్రియకం బైన సర్వంబును నర్థత్వంబున
వికల్పితం బై తోఁచుం గాని పరమార్థంబు గాదు. దేహాదికంబులు వినాశ్యంబులు.
వానికి హేతువు లైన క్షితిప్రముఖంబులును వినాశ్యంబు లగుట సిద్ధంబు. పరమాత్మకు
నవిద్యచేత నెంత తడవు వికల్పంబు దోఁచు, నంత తడవును భ్రమంబుదోఁచు.
అవిద్యానివృత్తి యైన సర్వంబును మిథ్య యయి శాస్త్ర విధినిషేధంబులు
కలలోపల మేలుగన్న తెఱంగు లగు భావాద్వైత, క్రియాద్వైత, ద్రవ్యాద్వైతంబులు
మూఁడు గలవు. అందుఁ బటతంతు న్యాయంబునఁ గార్యకారణంబులందు వస్తువొక్కటియై
యుండు నని యెఱింగి, యేకత్వాలోచనంబు చేసి, వికల్పంబు లేదని భావించుట
భావాద్వైతంబు. మనో వా క్కాయకృతంబు లైన సర్వకర్మంబులను ఫలభేదంబు
సేయక, పరబ్రహ్మార్పణంబు సేయుట క్రియాద్వైతంబు. పుత్రమిత్రకళత్రాది
సర్వప్రాణులకుం దనకును దేహమునకుం బంచభూతాత్మకత్వంబున భోక్త యొక్కండను
పరమార్థత్వంబున నర్థకామంబులయెడ నైక్యదృష్టిఁ జేయుట ద్రవ్యాద్వైతంబు.
నేర్పున నాత్మ తత్త్వానుభవంబున నద్వైత త్రయంబును విలోకించి, వస్తుభేద
బుద్ధియుఁ, గర్మభేద బుద్ధియు, స్వకీయ పరకీయ బుద్ధియు, స్వప్నంబులుగాఁ
దలంచి ముని యైన వాఁడు మానవలయు.
469
క. వాదములు వేయు నేటికి
వేదోక్తవిధిం జరించు విబుధుఁడు గృహమం
దాదరమున నారాయణ
పాదంబులు గొలిచి ముక్తిపదమున కేఁగు\న్‌.
470
శా. భూపాలోత్తమ! మీరు భక్తిగరిమస్ఫూర్తి\న్‌ సరోజేక్షణ
శ్రీపాదాంబుజ యుగ్మము న్నియతు లై సేవించి కాదే మహో
గ్రాపత్సంఘములోనఁ జిక్కక సమస్తాశాంత నిర్జేత లై
యేపారంగ మఖంబు సేసితిరి దేవేంద్ర ప్రభావంబున\న్‌.
471
నారదుని పూర్వజన్మ వృత్తాంతము
వ. వినుము. పోయిన మహాకల్పంబునందు గంధర్వులలోన నుపబర్హణుం డను పేర
గంధర్వుండ నైన నేను సౌందర్య చాతుర్య మాధుర్య గాంభీర్యాది గుణంబుల
సుందరులకుఁ బ్రియుండ నై క్రీడింపుచు, నొక్కనాఁడు విశ్వస్రష్ట లైన బ్రహ్మలు
దేవసత్ర మనియెడి యాగంబులోన నారాయణ కథలు గానంబు చేయుకొరకు
నప్సరోజనులను, గంధర్వులనుం జీరిన.
472
ఆ. క్రతువులోని కేను గంధర్వ గణముతోఁ
గలసి పోయి విష్ణుగాథ లచటఁ
గొన్ని పాడి సతులఁ గూడి మోహితుఁడ నై
తలఁగి చనితి నంత ధరణినాథ!
473
క. వారిజగంధుల పొత్తున
వారిం గైకొనక దలఁగివచ్చిన బుద్ధిన్‌
వా రెఱిఁగి శాపమిచ్చిరి
వారింపఁగరాని రోషవశమున నధిపా!
474
ఆ. పంకజాక్షు నిచటఁ బాడక కామినీ
గణముఁ గూడి చనిన కల్మషమున
దగ్ధకాంతి వగుచు ధరణీతలంబున
శూద్రజాతిసతికి సుతుఁడ వగుము.
475
వ. అని యిట్లు విశ్వస్రష్టలు శపించిన, నొక్క బ్రాహ్మణదాసికిఁ బుత్రుండ నై
జన్మించి, యందు బ్రహ్మవాదు లైన పెద్దలకు శుశ్రూష చేసిన భాగ్యంబున,
నిమ్మహాకల్పంబునందు బ్రహ్మపుత్రుండ నై జన్మించితి.
476
ఆ. కౌశలమున మోక్షగతికి గృహస్థుఁ డే
ధర్మ మాచరించి తగిలిపోవు
నట్టి ధర్మమెల్ల నతివిశదంబుగాఁ
బలుకఁబడియె నీకు భవ్యచరిత!
477
మ. అఖిలాధారుఁ డజాది దుర్లభుఁడు బ్రహ్మం బైన విష్ణుండు నీ
మఖమం దర్చితుఁ డై నివాసగతుఁ డై మర్త్యాకృతి\న్‌ సేవ్యుఁ డై
సఖి యై చారకుఁ డై మనోదయితుఁ డై సంబంధి యై మంత్రి యై
సుఖదుం డయ్యె భవన్మహామహిమఁ దాఁ జోద్యంబు ధాత్రీశ్వరా!
478
వ. అని యిట్లు నారదుండు చెప్పిన వృత్తాంతం బంతయు విని, ధర్మనందనుండు
ప్రేమవిహ్వలుం డై వాసుదేవునిం బూజించె. వాసుదేవ ధర్మనందనులచేతఁ
బూజితుం డై, నారదమునియు దేవమార్గంబునం జనియె. అని శుకయోగీంద్రుండు
పాండవపౌత్రునకుం జెప్పె నని సూతుండు శౌనకాదులకుం జెప్పె.
479
క. రాజీవసదృశలోచన!
రాజీవభవాది దేవరాజవినుత! వి
భ్రాజిత కీర్తిలతావృత
రాజీవభవాండభాండ! రఘుకులతిలకా!
480
మాలిని. దరణిదుహితృరంతా! ధర్మమార్గానుగంతా!
నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కుంభినీచక్రభర్తా!
సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!
481
చ. హరపటుచాపఖండన! మహాద్భుత విక్రమ శౌర్య భండనా!
శరనిధి గర్వభంజన! రసాతనయాహృదయాబ్జ రంజనా!
తరుచర సైన్యపాలన! సుధాంధసమౌని మనోజ్ఞఖేలనా!
సరసిజగర్భ సన్నుత! నిశాచర సంహార! త్రైజగన్నుతా!
482
గద్యము. ఇది శ్రీపరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర
సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బైన శ్రీమహాభాగవతం బను
మహాపురాణంబునందు ధర్మనందనునకు నారదుండు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల
పూర్వజన్మ వృత్తాంతంబు సెప్పుటయు, హిరణ్యకశిపు దితి సంవాదంబును,
సుయజ్ఞ చరిత్రంబును, యమసల్లాపంబును, బ్రహ్మవరలాభ గర్వితుం డైన
హిరణ్యకశిపు చరిత్రంబును, ప్రహ్లాద విద్యాభ్యాస కథయును, బ్రహ్లాద
హిరణ్యకశిపుల సంవాదంబును, బ్రహ్లాదు వచనంబు ప్రతిష్ఠింప హరి
నరసింహరూపంబున నావిర్భవించి, హిరణ్యకశిపుని సంహరించి,
ప్రహ్లాదునకు నభయం బిచ్చి, నిఖిల దేవతానివహ ప్రహ్లాదాది
స్తూయమానుం డై, తిరోహితుం డగుటయుఁ, ద్రిపురాసుర వృత్తాంతంబును,
ఈశ్వరుండు త్రిపురంబుల దహించుటయు, వర్ణాశ్రమ ధర్మ వివరణంబును,
బ్రహ్లాదాజగర సంవాదంబును, నారదు పూర్వజన్మ వృత్తాంతంబును నను
కథలం గల సప్తమ స్కంధము సంపూర్ణము.
 
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - saptama skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )