ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
క. శ్రీమన్నామ! పయోద
శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా!
రామాజన కామ! మహో
ద్దామ! గుణస్తోమధామ! దశరథరామా!
1
అధ్యాయము - ౧
వ. మహనీయ గుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండిట్లనియె. అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని. 2
క. వినఁబడియెను స్వాయంభువ
మనువంశము వర్ణ ధర్మ మర్యాదలతో
మనుజుల దనుజుల వేల్పుల
జననంబులు స్రష్ట లెల్ల జనియించుటయు\న్‌.
3
ఉ. ఏ మనుకాలమందు హరి యీశ్వరుఁ డేటికి సంభవించె నే
మేమి యొనర్చె నమ్మనువు లే రతఁ డేక్రియఁ జేయుచున్నవాఁ
డేమి నటించు మీఁద గత మెయ్యది సజ్జనులైనవారు ము
న్నేమని చెప్పుచుందురు మునీశ్వర! నా కెఱుఁగింపవే! దయ\న్‌.
4
వ. అనిన శుకుండిట్లనియె. 5
క. ఈ కల్పంబున మనువులు
ప్రాకటముగ నార్వురైరి పదునలువురలో
లోకముల జనుల పుట్టువు
లాకథితములయ్యె వరుస నఖిలములు నృపా!
6
వ. ప్రథమ మనువైన స్వాయంభువునకు నాకూతి, దేవహూతులను నిరువురు కూఁతులు గలరు. వారికిఁ గ్రమంబునఁ గపిల, యజ్ఞ నామంబుల లోకంబులకు ధర్మజ్ఞాన బోధంబులు సేయుకొఱకు హరి పుత్రత్వంబు నొందె. అందుఁ గపిలుని చరిత్రంబులు మున్ను చెప్పంబడియె. యజ్ఞుని చరిత్రంబు చెప్పెద వినుము. 7
మ. శతరూపాపతి కామభోగ విరతి\న్‌ సంత్యక్త భూభారుఁడై
సతియుం దాను వనంబు కేఁగి శతవర్షంబుల్‌ సునందానదిన్‌
వ్రతియై యేకపదస్థుఁడై నియతుఁడై వాచంయమ స్ఫూర్తితో
గతదోషుండు తపంబు సేసె భువన ఖ్యాతంబుగా భూవరా!
8
వ. ఇట్లు తపంబు సేయుచు స్వాయంభువమనువు దన మనంబులోన. 9
సీ. సృష్టిచే నెవ్వఁడు చేతన పడకుండు సృష్టి యెవ్వని చేఁతచే జనించు
జగములు నిద్రింప జాగరూకత నుండి యెవ్వఁడు బ్రహ్మంబు నెఱుఁగుచుండు
నాత్మ కాధారంబు నఖిలంబు నెవ్వఁడు నెవ్వని నిజధనం బింతవట్టు
పొడగాన రాకుండుఁ బొడగను నెవ్వఁడు నెవ్వని దృష్టికి నెదురు లేదు
 
ఆ. జనన వృద్ధి విలయ సంగతిఁ జెందక నెవ్వఁ డెడపకుండు నెల్ల యెడలఁ
దన మహత్త్వ సంజ్ఞ తత్త్వ మెవ్వఁడు దాన విశ్వరూపుఁ డనఁగ విస్తరించు.
10
వ. అని మఱియు, నిరహంకృతుండును, బుధుండును, నిరాశియుఁ, బరిపూర్ణుండును, ననన్యప్రేరితుండును, నృశిక్షా పరుండును, నిజమార్గ సంస్థితుండును, నిఖిల ధర్మ భావనుండునైన పరమేశ్వరునకు నమస్కరించెద. అని యుపనిషదర్థంబులు పలుకుచున్న మనువుం గనుంగొని. 11
క. రక్కసులు దినఁగఁ గడఁగిన
వెక్కసముగ యజ్ఞ నామ విష్ణుఁడు వారిం
జక్కడిచెఁ జక్రధారల
మిక్కటముగ వేల్పులెల్ల మేలని పొగడన్‌.
12
వ. ఇది ప్రథమ మన్వంతరంబు. ఇంక రెండవ మన్వంతరంబు వినుము. 13
సీ. స్వారోచిషుండన సప్తార్చి బిడ్డఁడు మనువు వానికి నా ద్యుమ త్సుషేణ
రోచిష్మ దాద్యు లారూఢ పుత్త్రులు ధాత్రి యేలిరి రోచనుం డింద్రుఁడయ్యె
నధికులు తుషితాదు లమరు లూర్జస్తంబ ముఖ్యు లాఢ్యులు సప్తమునులు నాఁడు
వేదశిరుండను విప్రుని దయితకుఁ దుషితకుఁ బుత్త్రుఁడై తోయజాక్షుఁ
 
ఆ. డవతరించెను విభుఁడన నశీత్యష్ట సహస్రమునులు నధికులైనవారు
ఘను లనుగ్రహింపఁ గౌమారక బ్రహ్మచారి యగుచు నతఁడు సలిపె వ్రతము.
14
వ. తదనంతరంబ. 15
సీ. మనువు మూఁడవవాఁడు మనుజేంద్ర! యుత్తముండన ప్రియవ్రతునకు నాత్మజుండు
పాలించె నిల యెల్లఁ బవన సృంజయ యజ్ఞహోత్రాదు లాతని పుత్త్రు లధిక
గుణులు వసిష్ఠుని కొడుకులు ప్రమథాదులైరి సప్తఋషులు నమరవిభుఁడు
సత్యజిత్తనువాఁడు సత్య భద్రాద్యులు సురలు ధర్మునికిని సూనృతకును
 
ఆ. బుట్టి సత్యనియతిఁ బురుషోత్తముఁడు సత్యసేనుఁడనఁగ దుష్టశీలయుతుల
దనుజ యక్షపతుల దండించె సత్యజిన్మిత్రుఁ డనఁగ జగము మేలనంగ.
16
గజేంద్ర మోక్షణ కథ
వ. చతుర్థ మనువు కాలప్రసంగంబు వివరించెద. 17
సీ. మానవాధీశ్వర! మనువు నాలవవాఁడు తామసుండనఁగ నుత్తముని భ్రాత
పృథ్వీపతులు కేతు పృథు నర ఖ్యాతాదు లతని పుత్రులు పదు రధికబలులు
సత్యక హరివీర సంజ్ఞులు వేల్పులు త్రిశిఖ నామమువాఁడు దేవవిభుఁడు
మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరి పుట్టె హరిమేధునకుఁ బ్రీతి హరిణియందు
 
ఆ. గ్రహ నిబద్ధుఁడైన గజరాజు విడిపించి ప్రాణభయమువలనఁ బాపి కాఁచె
హరి దయాసముద్రుఁ డఖిలలోకేశ్వరుఁ డనిన శుకునిఁ జూచి యవనివిభుఁడు.
18
క. నీరాట వనాటములకుఁ
బోరాటం బెట్లు గలిగెఁ, బురుషోత్తము చే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోని భద్రకుంజరమునకు\న్‌
19
క. మునినాథ! యీ కథాస్థితి
వినిపింపుము వినఁగ నాకు వేడుక పుట్టె\న్‌
వినియెదఁ గర్ణేంద్రియములు
పెనుఁ బండువు సేయ మనము ప్రీతిం బొంద\న్‌.
20
క. ఏ కథలయందుఁ బుణ్య
శ్లోకుఁడు హరి సెప్పఁబడును సూరిజనముచే
నా కథలు పుణ్యకథలని
యాకర్ణింపుదురు పెద్ద లతిహర్షమున\న్‌.
21
వ. ఇవ్విధంబునఁ బ్రాయోపవిష్టుండైన పరీక్షన్నరేంద్రుండు బాదరాయణి నడిగె. అని చెప్పి, సభాసదులైన మునుల నవలోకించి, సూతుండు పరమ హర్షసమేతుండై చెప్పె. అట్లు శుకుండు రాజున కిట్లనియె. 22
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )