ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౨
సీ. రాజేంద్ర! విను సుధారాశిలో నొక పర్వతము త్రికూటంబనఁ దనరుచుండు
యోజనాయుతమగు నున్నతత్వంబును నంతియ వెడలుపు నతిశయిల్లుఁ
గాంచనాయస్సార కలధౌత మయములై మూఁడుశృంగంబులు మొనసియుండుఁ
దటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములుఁ దేజరిల్లు
 
తే. భూరి భూజ లతా కుంజ పుంజములును మ్రోసి పఱతెంచు సెలయేటి మొత్తములును
మరగి తిరిగెడు దివ్య విమానములును జఱులఁ గ్రీడించు కిన్నరచయముఁ గలిగి.
23
వ. అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురువక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు న్నివహా లంకృతంబును, మణివాలు కానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫల రంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీపసంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బలాహక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధకోలాహల బధిరీభూత భూ నభోంతరాళంబును, తుహినకరకాంత మరకత కమలరాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరితట దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గంధర్వ గరుడ కిన్నర కింపురుష మిధున సంతత సరససల్లాప సంగీతప్రసంగ మంగళాయతనంబును, గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమరసన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమనకింకరంబునునై యొప్పు నప్పర్వత సమీపంబునందు. 24
క. భిల్లీ భల్ల లులాయక
భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరీ
ఝిల్లీ హరి శరభక కిటి
మల్లాద్భుత కాక ఘూకమయ మగు నడవి\న్‌.
25
శా. అన్యాలోకన భీకరంబులు జితాశానేక పానీకముల్‌
వన్యేభంబులు గొన్ని మత్తతనులై వ్రజ్యా విహారాగతో
దన్యత్వంబున భూరి భూధర దరీ ద్వారంబులందుండి సౌ
జన్యక్రీడల నీరుగాలివడిఁ గాసారావగాహార్థమై.
26
ఆ. అంధకారమెల్ల నద్రి గుహాంతర
వీథులందుఁ బగలు వెఱచి డాఁగి
యెడరు వేచి సంధ్య నినుఁడు వృద్ధత నున్న
వెడలె ననఁగ గుహలు వెడలెఁ గరులు.
27
క. తలఁగవు కొండలకైనను
మలఁగవు సింగములకైన మార్కొను కడిమిం
గలఁగవు పిడుగులకైనను
నిల బలసంపన్న వృత్తి నేనుఁగుగున్నల్‌.
28
సీ. పులుల మొత్తంబులు పొదరిండ్లలోఁ దూఱు ఘోర భల్లూకముల్‌ గుహలు సొచ్చు]
భూదారములు నేలబొఱియలలో డాఁగు హరిదంతముల కేఁగు హరిణచయము
మడుఁగులఁ జొరఁబాఱు మహిషసంఘంబులు గండశైలంబులఁ గపులు ప్రాఁకు
వల్మీకములు సొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగి కెగయు
 
తే. వెఱచి చమరీమృగంబులు విసరు వాల చామరంబుల విహరణశ్రమము వాయ
భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి వాఱిన మాత్రాన జాలిఁ బొంది.
29
క. మదగజ దానామోదము
కదలని తమకములఁ ద్రావి కడుపులు నిండ\న్‌
బొదలుచుఁ దుమ్మెదకొదమల
కదుపులు జుం జుమ్మటంచు గానము సేసెన్‌.
30
క. తేఁటి యొకటి యొరు ప్రియకును
మాటికి మాటికిని నాగ మదజల గంధం
బేటి కని తన్నుఁ బొందెడి
బోటికి నందిచ్చు నిండు బోటుఁదనమునన్‌.
31
క. అంగీకృత రంగన్మా
తంగీ మదగంధ మగుచుఁ దద్దయు వేడ్కన్‌
సంగీత విశేషంబుల
భృంగీగణ మొప్పె మ్రానుపెట్టెడి మాడ్కిన్‌.
32
క. వల్లభలు వాఱి మున్పడ
వల్లభమని ముసరిరేని వారణదానం
బొల్లక మధుకరవల్లభు
లుల్లంబులఁ బొందిరెల్ల యుల్లాసంబుల్‌.
33
వ. అప్పుడు. 34
మ. కలభంబుల్‌ చెరలాడుఁ బల్వలము లాఘ్రాణించి మట్టాడుచున్‌
ఫలభూజంబులు రాయుచున్‌ జివురుజొంపంబుల్‌ వడిన్‌ మేయుచున్‌
బులులం గారెనుపోతులన్‌ మృగములన్‌ బోనీక శిక్షింపుచున్‌
గొలఁకుల్‌ సొచ్చి కలంపుచున్‌ గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచున్‌.
35
క. తొండంబుల మదజలవృత
గండంబుల కుంభములను ఘట్టన సేయం
గొండలు దలక్రిందై పడు
బెండుపడున్‌ దిశలు సూచి బెగడున్‌ జగముల్‌.
36
క. ఎక్కడఁ జూచిన లెక్కకు
నెక్కువయై యడవి నడచు నిభయూధములో
నొక్క కరినాథుఁ డెడతెగి
చిక్కె నొక కరేణుకోటి సేవింపంగన్‌.
37
వ. ఇట్లు వెనుక ముందఱ నడుమ నుభయపార్శ్వంబులఁ దృషార్దితంబులై యరుగు దెంచు నేనుంగుగములం గానక తెఱంగుదప్పి తొలంగుడుపడి, యీశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండుటంజేసి తానును, దన కరేణు సముదయంబును నొక్క తెరువై పోవుచు. 38
సీ. పల్వలంబుల లేఁతపచ్చికఁ మచ్చికఁ జెలుల కందిచ్చు నచ్చికము లేక
నివురుజొంపములఁ గ్రొవ్వెలయు పూఁగొమ్మలఁ బ్రాణవల్లభలకుఁ బాలు వెట్టు
ఘన దాన శీతల కర్ణతాళంబుల దయితల చెమటార్చుఁ దనువు లరసి
మృదువుగాఁ గొమ్మల మెల్లన గళములు నిమురుచుఁ బ్రేమతో నెఱపు వలపు
 
తే. పిఱుఁదు చక్కట్ల డగ్గఱి ప్రేమతోడ డాసి మూర్కొని దివికిఁ దొండంబు సాపు
వెద వివేకించుఁ గ్రీడించు విశ్రమించు మత్త మాతంగమల్లంబు మహిమతోడ.
39
సీ. తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల కుచములు పయ్యెదకొంగు లీఁగఁ
దన యానగంభీరతకుఁ జాల కబలల యానంబు లందెల నండగొనఁగఁ
దన కరశ్రీఁ గని తలఁగి బాలల చిఱు దొడలు మేఖలదీప్తిఁ దోడుపిలువఁ
దన దంతరుచి కోడి తరుణుల నగవులు ముఖచంద్ర దీప్తుల ముసుఁగు దిగువఁ
 
తే. దనదు లావణ్యరూపంబుఁ దలఁచి చూడ నంజనాభ్రము కపిలాది హరిదిభేంద్ర
దయిత లందఱుఁ దనవెంటఁ దగిలి నడువ గుంభివిభుఁ డొప్పె నొప్పుల కుప్పఁబోలి.
40
వ. మఱియు నానా గహనవిహరణ మహిమతో మదగజేంద్రంబు మార్గంబుఁ దప్పి, పిపాసా పరాయత్త చిత్తంబున మత్తకరేణువుల మొత్తంబునుం దానును జని చని. 41
మ. అటఁ గాంచె\న్‌ గరిణీవిభుండు నవ ఫుల్లాంభోజ కల్హారము\న్‌
నట దిందిందిర వారమున్‌ గమఠ మీన గ్రాహ దుర్వారము\న్‌
వట హింతాళ రసాల సాల సుమనో వల్లీ కుటీ తీరము\న్‌
చటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గాసారము\న్‌.
42
వ. ఇట్లనన్య పురుషసంచారంబును, నిష్కళంకంబును నైన యప్పంకజాకరంబుఁ బొడగని. 43
సీ. తోయజగంధంబు దోఁగిన చల్లని మెల్లని గాడ్పుల మేను లలర
గమలనాళాహార విమల వాక్కలహంస రవముల సెవుల పండువులు సేయ
ఫుల్ల దిందీవరాంభోరుహామోదంబు ఘ్రాణరంధ్రంబుల గారవింప
నిర్మల కల్లోలనిర్గతాసారంబు వదనగహ్వరముల వాడు దీర్పఁ
 
తే. ద్రిజగ దభినవ సౌభాగ్య దీప్తమైన విభవ మీక్షణములకును విందు సేయ
నరిగి పంచేంద్రియ వ్యవహారములను మఱచి మత్తేభయూధంబు మడుఁగుఁ జొచ్చె.
44
క. తొండంబులఁ బూరింపుచు
గండంబులఁ జల్లుకొనుచు గళగళ రవముల్‌
మెండుకొన వలుదకడుపులు
నిండన్‌ వేదండకోటి నీరుం ద్రావెన్‌.
45
వ. అప్పుడు. 46
మ. ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చం
డభ మార్గంబున కెత్తి నిక్కి వడి నుడ్డాడించి పింజింప నా
రభటి న్నీరములోనఁ బెల్లెగసి నక్ర గ్రాహ పాఠీనముల్‌
నభమం దాడెడు మీన కర్కటములన్‌ బట్టెన్‌ సురల్‌ మ్రాన్పడన్‌.
47
వ. మఱియును, నగ్గజేంద్రం బనర్గళ విహారంబున. 48
సీ. కరిణీ కరోజ్ఝిత కంకణ చ్ఛటఁ దోఁగి సెలయేటి నీలాద్రి చెలువుఁ దెగడు
హస్తినీ హస్తవిన్యస్త పద్మంబుల వేయుగన్నులవాని వెఱవు సూపు
కలభ సముత్కీర్ణ కల్హార రజమునఁ గనకాచలేంద్రంబు ఘనతఁ దాల్చుఁ
గుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభ వహించు
 
ఆ. మదకరేణు ముక్త మౌక్తిక శుక్తుల మెఱుఁగు మొగిలుతోడ మేలమాడు
నెదురులేని గరిమ నిభరాజ మల్లంబు వనజగేహకేళి వ్రాలు నపుడు.
49
వ. మఱియు, నా సరోవరలక్ష్మి మదగజేంద్ర వివిధ విహార వ్యాకులిత నూతన లక్ష్మీవిభవయై, యనంగవిద్యా నిరూఢ పల్లవప్రబంధ పరికంపిత శరీరాలంకార యగు కుసుమకోమలియునుం బోలె, వ్యాకీర్ణ చికుర మత్తమధుకర నికరయు, విగతరస వదనకమలయు, నిజస్థాన చలిత కుచ రథాంగయుగళ లంపటిత జఘన పులినతలయునై యుండె. అంత. 50
సీ. భుగభుగాయుత భూరి బుద్బుద చ్ఛటలతోఁ గదలుచు దివికి భంగంబు లెగయ
భువన భయంకర ఫూత్కార రవమున ఘోర నక్ర గ్రాహకోటి బెగడ
వాలవిక్షేప దుర్వార ఝంఝానిల వశమున ఘుమఘుమావర్త మడరఁ
గల్లోల జాల సంఘట్టనంబులఁ దటీ తరులు మూలములతో ధరణిఁ గూల
 
తే. సరసిలోనుండి పొడగని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భానుఁ గబళించి పట్టు స్వర్భానుపగిది నొక్క మకరేంద్రుఁ డిభరాజు నొడిసి పట్టె.
51
క. వడి దప్పించి కరీంద్రుఁడు
నిడుదకరం బెత్తి వ్రేయ నీరాటంబుం
బొడ వడఁగినట్లు జలములఁ
బడి కడువడిఁ బట్టెఁ బూర్వ పదయుగళంబు\న్‌.
52
చ. పదములఁ బట్టినం దలఁకుఁ బాటొకయింతయు లేక శూరత\న్‌
మదగజ వల్లభుండు ధృతిమంతుఁడు దంతయుగాంత ఘట్టన\న్‌
జెదరఁగ జిమ్మె నమ్మకరి చిప్పలు పాదులు దప్ప నొప్పఱ\న్‌
వదలి జలగ్రహంబు కరి వాలము మూలముఁ జీరెఁ గోఱల\న్‌.
53
క. కరిఁ దిగుచు మకరి సరసికిఁ
గరి దరికిని మకరిఁ దిగుచుఁ గరకరి బెరయ\న్‌
కరికి మకరి మకరికిఁ గరి
భరమన నిట్లతల కుతల భటు లదిరిపడ\న్‌.
54
వ. ఇట్లు కరిమకరంబులు రెండును నొండొండ సముద్దండ దండంబులై తలపడి, నిఖిల లోకాలోకన భీకరంబులై, యన్యోన్య విజయశ్రీ వశీకరంబులై, సంక్షోభిత కమలాకరంబులై, హరి హరియును, గిరి గిరియునుం దాఁకి, పిఱుతివియక పెనంగు తెఱంగున, నీరాటంబైన పోరాటంబునఁ బట్టుచు వెలికి లోనికిం దిగుచుచుఁ, గొలంకు కలంకం బందఁ, గడువడి నిట్టట్టుపడి, తడఁబడక, బుడబుడానుకారంబులై, భుగులు భుగుల్లను చప్పుళ్లతో నురువులు గట్టుచు, జలంబు లుప్పరంబున కెగయం జప్పరింపుచుఁ, దప్పక వదనగహ్వరంబుల నప్పళింపుచు, నిశిత నితాంత దురంత దంతకుంతంబుల నింతింతలు దునియలై, నెప్పళంబునం బునుకచిప్పలు కుదుళ్లుదప్పి రక్తంబులు గ్రమ్ముదేర, హు మ్మని యొక్కుమ్మడిం జిమ్ముచు, నితరేతర సమాకర్షణంబులం గదలక, పదంబులు మొదలిపట్టు వదలక, కుదురై యుండుచుఁ, బరిభ్రమణ వేగంబున జలంబులం దిరుగుచు, మకర కమఠ కర్కట గండక మండూకాది సలిలనిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా, నొకటొకటిం దాఁకు రభసంబున నిక్కలువడ మ్రక్కం ద్రొక్కుచు, మెండుచెడి, బెండువడి, నాఁచు గుల్లచిప్ప తండంబులం బరస్పర తాడనంబులకు నడ్డంబుగా నొడ్డుచు, నోల మాసగొనక, గెలుపుఁదలంపులు బెట్టిదంబులై రెట్టింప, నహోరాత్రంబులుం బోలెఁ గ్రమక్రమ విజృంభమాణంబులై, బహుకాల కలహ విహారంబులై, నిర్గత నిద్రాహారంబులై, యవక్ర పరాక్రమ ఘోరంబులై, పోరుచున్న సమయంబున. 55
క. జవమును జలమును బలమును
వివిధములుగఁ బోరు కరటి వీరతకు భువి\న్‌
దివి మకర మీన కర్కట
నివహము లొక్కటన మిత్రనిలయముఁ బొందెన్‌.
56
శా. ఆటోపమ్మునఁ జిమ్ము ఱొమ్మగల వజ్రాభీల దంతమ్ములన్‌
దాఁటించున్‌ మెడఁ జుట్టి పట్టి హరి దోర్దండాభ శుండాహతిన్‌
నీటన్‌ మాటికి మాటికిం దిగువఁగా నీరాటము న్నీటిపో
రాటం దోటమిపాటుఁ జూపుట కరణ్యాటంబు వాచాటమై.
57
వ. అప్పుడు. 58
ఆ. మకరితోడఁ బోరు మాతంగవిభుని నొ
క్కరుని డించిపోవఁ గాళ్ళురాక
కోరి చూచుచుండెఁ గుంజరీయూధంబు
మగలు తగులుగారె మగువలకును.
59
వ. అంత. 60
ఆ. జీవనంబు దనకు జీవనంబై యుంట
నలవు చలము నంత కంత కెక్కి
మకర మొప్పె డస్సె మత్తేభమల్లంబు
బహుళపక్ష శీతభాను పగిది.
61
మ. ఉఱుకుం గుంభయుగంబుపై హరిక్రియన్‌ హు మ్మంచు పాదంబులం
దిఱుకుం గంఠము వెన్నుదన్న నెగయున్‌ హేలాగతి\న్‌ వాలమున్‌
బఱచు న్నుగ్గుగఁ దాఁకు ముంచు మునుఁగున్‌ శల్యంబులున్‌ దంతముల్‌
విఱుగన్‌ వ్రేయుచుఁ బొంచి పొంచి కదియున్‌ వేదండ యూధోత్తమున్‌.
62
మ. పొడ గానంబడకుండ డాఁగు వెలికిం బోవంగఁ దా నడ్డమై
పొడచూపుం జరణంబులం బెనఁగొనుం బోరాక రారాక బె
గ్గడిలం గూలఁగఁ దాఁచు లేచుతఱి నుద్ఘాటించు లంఘించు బల్‌
విడి జీరున్‌ దలఁగున్‌ మలంగు నొడియున్‌ వేధించుఁ గ్రోధించుచున్‌.
63
వ. ఇట్లు విస్మిత నక్రచక్రంబై, నిర్వక్ర విక్రమంబున, నల్ప హృదయ జ్ఞానదీపంబు నతిక్రమించు మహా మాయాంధకారంబునుం బోలె, నంతకంతకు నుత్సాహ కలహ సన్నాహ బహువిధ జలావగాహంబైన గ్రాహంబును మహాసాహసంబున. 64
శా. పాదద్వంద్వము నేల మోపి పవను\న్‌ బంధించి పంచేంద్రియో
న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకు\న్‌ మాఱాకు హత్తించి ని
ష్ఖేద బ్రహ్మపదావలంబనగతిం గ్రీడించు యోగీంద్రు మ
ర్యాద న్నక్రము విక్రమించెఁ గరి పాదాక్రాంత నిర్వక్రమై.
65
ఆ. వనగజంబు నెగుచు వనచారిఁ బొడగని
వనగజంబె కాన వజ్రిగజము
వెల్లనై సురేంద్రు వేచి సుధాంధులఁ
బట్టు పట్టనీక బయలు వ్రాఁకె.
66
ఉ. ఊహ కలంగి జీవనపు టోలమునం బడి పోరుచు\న్‌ మహా
మోహలతా నిబద్ధ పదము\న్‌ విడిపించుకొనంగలేక సం
దేహముఁ బొందు దేహిక్రియ దీనదశ\న్‌ గజముండె భీషణ
గ్రాహ దురంతదంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమై.
67
వ. ఇవ్విధంబున. 68
క. అలయక సొలయక వేసట
నొలయక కరి మకరితోడ నుద్దండత రా
త్రులు సంధ్యలు దివసంబులు
సలిపె\న్‌ బో రొక్క వేయి సంవత్సరముల్‌.
69
మ. పృథుశక్తి\న్‌ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరాడి సం
శిథిలంబై తనలావు వైరిబలముం జింతించి మిథ్యా మనో
రథ మింకేటికి దీని గెల్వ సరి పోరం జాలరా దంచు స
వ్యథమై యిట్లనుఁ బూర్వపుణ్య ఫల దివ్యజ్ఞాన సంపత్తితో\న్‌.
70
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )