ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౩
శా. ఏ రూపంబున దీని గెల్తు, నిటమీఁ దే వేల్పుఁ జింతింతు, నె
వ్వారిం జీరుదు, నెవ్వ రడ్డ మిఁక, ని వ్వారిప్రచారోత్తము\న్‌
వారింపం దగువార లెవ్వ, రఖిల వ్యాపారపారాయణుల్‌
లేరే, మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్‌.
71
శా. నానానేకప యూధముల్‌ వనములోనం బెద్దకాలంబు స
న్మానింప\న్‌ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ
ద్దానాంభః పరిపుష్ట చందన లతాంత చ్ఛాయలం దుండలే
కీ నీరాశ నిటేల వచ్చితి, భయం బెట్లోకదే, యీశ్వరా!
72
ఉ. ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందుఁ బరమేశ్వరుఁ డెవ్వఁడు మూలకారణం
బెవ్వఁ డనాది మధ్య లయుఁ డెవ్వఁడు సర్వముఁ దాన యైన వాఁ
డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్‌.
73
క. ఒకపరి జగములు వెలినిడి
యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై
సకలార్థ సాక్షి యగు న
య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతు\న్‌.
74
క. లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినతుది నలోకంబగు పెం
జీఁకటి కవ్వల నెవ్వఁడు
నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతు\న్‌.
75
క. నర్తకునిభంగిఁ బెక్కగు
మూర్తులతో నెవ్వఁ డాడు మునులున్‌ దివిజుల్‌
కీర్తింప నేర రెవ్వని
వర్తన మొరు లెఱుఁగ రట్టి వాని నుతింతున్‌.
76
ఆ. ముక్తసంగులైన మునులు దిదృక్షులు
సర్వభూత హితులు సాధుచిత్తు
లసదృశ వ్రతాఢ్యులై కొల్తు రెవ్వని
దివ్యపదము, వాఁడు దిక్కు నాకు.
77
సీ. భవము దోషంబు రూపంబు కర్మంబు నాహ్వయమును గుణము లెవ్వనికి లేక
జగములఁ గలిగించు సమయించుకొఱకునై నిజమాయ నెవ్వఁ డిన్నియును దాల్చు
నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్ధరూపికి రూపహీనునకును
జిత్రచారునకు సాక్షికి నాత్మరుచికినిఁ బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకు
 
ఆ. మాటల న్నెఱుకల మనములఁ జేరంగఁ గాని శుచికి సత్త్వగమ్యుఁ డగుచు
నిపుణుఁడైనవాని నిష్కర్మతకు మెచ్చు వాని కే నొనర్తు వందనములు.
78
సీ. శాంతున కపవర్గ సౌఖ్యసంవేదికి, నిర్వాణభర్తకు నిర్విశేషు
నకు, ఘోరునకు మూఢునకు గుణధర్మికి సౌమ్యున కధికవిజ్ఞానమయున
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మమూలునకు జితేంద్రియజ్ఞాపకునకు దుఃఖాంతకృతికి
 
ఆ. నెఱిన సత్య మనెడి నీడతో వెలుఁగుచు నుండు నొక్కటికి మహోత్తమునకు
నిఖిలకారణునకు, నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొఱకు.
79
క. యోగాగ్ని దగ్ధకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొం డెఱుఁగక స
ద్యోగ విభాసిత మనముల
బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతు\న్‌.
80
సీ. సర్వాగమామ్నాయ జలధికి నపవర్గ మయునికి నుత్తమ మందిరునకు
సకల గుణారణి చ్ఛన్న బోధాగ్నికిఁ దనయంత రాజిల్లు ధన్యమతికిఁ
గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మనిర్వర్తితునకు
దిశలేని నాబోఁటి పశువుల పాపంబు లణఁచువానికి సమస్తాంతరాత్ముఁ
 
ఆ. డై వెలుంగువాని, కచ్ఛిన్నునకు, భగవంతునకుఁ దనుజ సువస్తు దేశ
దార సక్తులైనవారి కందఁగరాని వాని కాచరింతు వందనములు.
81
వ. మఱియును. 82
సీ. వరధర్మ కామార్థ వర్జితకాములై విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతిఁ బొందుదురు చేరి కాక్షించువారి కవ్యయ దేహ మిచ్చు నెవ్వాఁడు కరుణ
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు రానంద వార్ధి మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వాని నేమియుఁ గోరక భద్రచరిత్రంబుఁ బాడుచుందు
 
ఆ. రా మహేశు నాద్యు నవ్యక్తు నధ్యాత్మయోగగమ్యుఁ బూర్ణు నున్నతాత్ము
బ్రహ్మమైన వానిఁ బరుని నతీంద్రియు నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.
83
వ. అని మఱియు నిట్లని వితర్కించె. 84
సీ. పావకుం డర్చుల భానుండు దీప్తుల నె బ్భంగి నిగిడింతు రెట్లడంతు,
రా క్రియ నాత్మకరావళిచేత బ్రహ్మాదుల వేల్పుల నఖిలజంతు
గణముల జగముల ఘన నామ రూప భేదములతో మెఱయించి తగ నడంచు
నెవ్వఁడు మనము బుద్ధీంద్రియములుఁ దానయై గుణ సంప్రవాహంబుఁ బఱపు
 
తే. స్త్రీ నపుంసక పురుష మూర్తియును గాక తిర్య గమర నరాది మూర్తియును గాక
కర్మ గుణ భేద సదసత్ప్రకాశి గాక వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు.
85
క. కలఁడందురు దీనులయెడఁ
గలఁడందురు పరమయోగి గణములపాలం
గలఁడందు రన్ని దిశలను
గలఁడు గలండనెడువాఁడు గలఁడో లేఁడో.
86
సీ. కలుగఁడే నాపాలి కలిమి సందేహింపఁ గలిమిలేములు లేక గలుగువాఁడు
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ బడిన సాధుల కడ్డపడెడు వాఁడు
చూడఁడే నా పాటు చూపులఁ జూడక చూచువారలఁ గృపఁ జూచువాఁడు
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱఁగువాఁడు
 
తే. నఖిల రూపులుఁ దనరూపమైనవాఁడు నాది మధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు వినఁడె చూడఁడె తలపఁడె వేగ రాఁడె.
87
క. విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వు\న్‌
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతు\న్‌.
88
వ. అని పలికి, తన మనంబున నగ్గజేంద్రుం డీశ్వర సన్నిధానంబుఁ గల్పించుకొని యిట్లనియె. 89
శా. లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యెఁ, బ్రాణంబులు\న్‌
ఠావుల్‌ దప్పెను, మూర్ఛ వచ్చెఁ, దనువు\న్‌ డస్సె\న్‌, శ్రమం బయ్యెడి\న్‌,
నీవే తప్ప నితః పరం బెఱుఁగ, మన్నింపందగున్‌ దీనుని\న్‌,
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!
90
క. విను దఁట జీవుల మాటలు
జను దఁట చనరానిచోట్ల శరణార్థుల కో
యను దఁట పిలిచిన సర్వముఁ
గను దఁట సందేహమయ్యెఁ గరుణావార్ధీ!
91
ఉ. ఓ కమలాత్మ! యో వరద! యో ప్రతిపక్ష విపక్షదూర! కు
య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విపులప్రభావ! రా
వే, కరుణింపవే, తలఁపవే, శరణార్థిని నన్నుఁ గావవే.
92
వ. అని పలికి, మఱియు నరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుండైన నన్నుం గాచుఁ గాక యని, నింగి నిక్కి చూచుచు, నిట్టూర్పులు నిగిడింపుచు, బయ లాలకింపుచు, నగ్గజేంద్రుండు మొఱ సేయుచున్న సమయంబున, 93
ఆ. విశ్వమయత లేమి వినియు నూరక యుండి
రంబుజాసనాదు లడ్డపడక
విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు
భక్తియుతున కడ్డపడఁ దలంచి.
94
మ. అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా
పల మందార వనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము "పాహి పాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.
95
మ. సిరికిం జెప్పఁడు శంఖ చక్ర యుగంబు జేదోయి సంధింపఁ డే
పరిపారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జొక్క నొత్తఁడు వివాద ప్రోద్ధత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడఁడు గజ ప్రాణావనోత్సాహియై.
96
వ. ఇట్లు భక్తజనపాలన పరాయణుండును, నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును నగు నారాయణుండు, కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి, లక్ష్మీకాంతా వినోదంబులం దనివి సాలించి, సంభ్రమించి, దిశలు నిరీక్షించి, గజేంద్ర రక్షాపరత్వంబు నంగీకరించి, నిజ పరికరంబును మరల నవధరించి, గగనంబున కుద్గమించి, వేంచేయు నప్పుడు. 97
మ. తనవెంట\న్‌ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతము\న్‌, దాని వె
న్కను బక్షీంద్రుఁడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండుఁ దా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాల గోపాలము\న్‌.
98
వ. తదనంతరంబ ముఖారవింద మకరంద బిందుసందోహ పరిష్యందమా నానంద దిందిందిర యగు నయ్యిందిరాదేవి, గోవింద కరారవింద సమాకృష్యమాణ సంవాద చేలాంచలయై పోవుచు. 99
మ. తన వేంచేయు పదంబుఁ బేర్కొనఁ, డనాథ స్త్రీ జనాలాపముల్‌
వినెనో, మ్రుచ్చులు మ్రుచ్చిలించిరో ఖలుల్‌ వేదప్రపంచంబుల\న్‌,
దనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో, భక్తులం
గని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో దుర్జనుల్‌.
100
వ. అని వితర్కింపుచు. 101
శా. తాటంకాచలనంబుతో, భుజ నట ద్ధమ్మిల్లబంధంబుతో,
శాటీ ముక్త కుచంబుతో, నదృఢ చంచత్కాంతితో, శీర్ణ లా
లాటాలేపముతో, మనోహర కరాలగ్నోత్తరీయంబుతోఁ
గోటీందు ప్రభతో, నురోజ భర సంకోచ ద్వలగ్నంబుతోన్‌.
102
క. అడిగెద నని కడువడిఁ జను
నడిగిన దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్‌
వెడ వెడ సిడిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడల\న్‌.
103
సీ. నిటలాలకము లంటి నివుర జుం జుమ్మని ముఖసరోజము నిండ ముసరుఁ దేంట్లు
నళులఁ జోఁపగఁ జిల్క లల్ల నల్లనఁ జేరి యోష్ఠబింబ ద్యుతు లొడియ నుఱుకు
శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మందాకినీ పాఠీనలోక మెగుచు
మీనపంక్తులు దాఁట మెయిదీఁగెతో రాయ శంపాలతలు మింట సరణి గట్టు
 
ఆ. శంపలను జయింపఁ జక్రవాకంబులు కుచయుగంబుఁ దాఁకి క్రొవ్వు చూపు
మెలఁత మొగులు పిఱిఁది మెఱుఁగుఁ దీగెయుఁ బోలె జలదవర్ణు వెనుక జరుగు నపుడు.
104
మ. వినువీథిం జనుదేరఁ గాంచి రమరుల్‌ విష్ణు\న్‌ సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణా వర్ధిష్ణు యోగీంద్ర హృ
ద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజనబృంద ప్రాభవాలంకరి
ష్ణు నవోఢోల్లస దిందిరా పరిచరిష్ణున్‌ జిష్ణు రోచిష్ణునిన్‌.
105
వ. ఇట్లు పొడగని. 106
మ. చనుదెంచెన్‌ ఘనుఁడల్ల వాఁడె హరి పజ్జం గంటిరే లక్ష్మి శం
ఖనినాదం బదె చక్ర మల్లదె భుజంగధ్వంసియున్‌ వాఁడె క్ర
న్నన నేతెంచె నటంచు వేల్పులు నమో నారాయణా యేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్‌.
107
వ. అయ్యవసరంబునఁ గుంజరేంద్రపాలన పారవశ్యంబున దేవతానమస్కారంబు లంగీకరింపక, మనస్సమాన సంచారుండై, పోయి పోయి, కొంతదూరంబున శింశుమార చక్రంబునుంబోలె గురు మకర కుళీర మీన మిథునంబై, కిన్న రేంద్రుని భాండాగారంబునుంబోలె స్వచ్ఛ వర కచ్ఛపంబై, భాగ్యవంతుని భాగధేయంబునుం బోలె సరాగ జీవనంబై, వైకుంఠపురంబునుంబోలె శంఖ చక్ర కమలాలంకృతంబై, సంసారచక్రంబునుంబోలె ద్వంద్వ సంకుల పంక సంకీర్ణంబై యొప్పు నప్పంకజాకరంబుఁ బొడగని. 108
మ. కరుణాసింధుఁడు శౌరి వారిచరము\న్‌ ఖండింపఁగా బంపె స
త్వరితాకంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగ చ్ఛటా
పరిభూతాంబుర శుక్రమున్‌ బహువిధ బ్రహ్మాండభాండ చ్ఛటాం
తర నిర్వక్రముఁ బాలితాఖిల సుధాంధ శ్చక్రముం జక్రము\న్‌.
109
వ. ఇట్లు పంచిన. 110
శా. అంభోజాకర మధ్య నూతన నళిన్యాలింగన క్రీడనా
రంభుండైన వెలుంగుఱేని చెలు వార\న్‌ వచ్చి నీట\న్‌ గుభుల్‌
గుంభ ధ్వానముతోఁ గొలంకువు గలంకం బొందఁగాఁ జొచ్చి దు
ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై.
111
శా. భీమంబై తలఁ ద్రుంచి ప్రాణములఁ బాపెం జక్ర మాశుక్రియ\న్‌
హేమక్ష్మాధర దేహముం జకిత వన్యేభేంద్ర సందోహమున్‌
గామ క్రోధన గేహము\న్‌ గరటి రక్తస్రావ గాహంబు ని
స్సీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమున్‌ గ్రాహము\న్‌.
112
వ. ఇట్లు నిమిషస్పర్శంబున సుదర్శనంబు మకరి తల ద్రుంచు నవసరంబున. 113
క. మకర మొకటి రవిఁ జొచ్చెను
మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగె\న్‌,
మకరాలయమునఁ దిరిగెడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్‌.
114
మ. తమముం బాసిన రోహిణీవిభు క్రియ\న్‌ దర్పించి, సంసారదుః
ఖము వీడ్కొన్న విరక్తచిత్తుని గతిన్‌ గ్రాహంబు పట్టూడ్చి, పా
దము లల్లార్చి, కరేణుకావిభుఁడు సౌందర్యంబుతో నొప్పె, సం
భ్రమదాశా కరిణీ కరోజ్ఝిత సుధాంభస్స్నాన విశ్రాంతుఁడై.
115
శా. పూరించె\న్‌ హరి పాంచజన్యముఁ, గృపాంభోరాశి సౌజన్యము\న్‌,
భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యము\న్‌,
సారోదార సితప్రభా చకిత పర్జన్యాది రాజన్యము\న్‌,
దూరీభూత విపన్న దైన్యమును, నిర్ధూత ద్విషత్సైన్యము\న్‌.
116
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )