ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౪
మ. మొఱసె న్నిర్జరదుందుభుల్‌, జలరుహామోదంబులై వాయువుల్‌
దిరిగె\న్‌, బువ్వుల వానజల్లు గురిసె\న్‌, దేవాంగనా లాస్యముల్‌
పరఁగె\న్‌, దిక్కులయందు జీవ జయ ఖేల ధ్యానముల్‌ నిండె, సా
గర ముప్పొంగెఁ దరంగచుంబిత నభోగంగా ముఖాంభోజమై.
117
క. నిడుద యగు కేల గజమును
మడువున వెడలంగఁ దిగిచి మదజలరేఖల్‌
దుడుచుచు మెల్లన పుణుకుచు
నుడిపెన్‌ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా!
118
క. శ్రీహరి కర సంస్పర్శను
దేహము దాహంబు మాని ధృతిఁ గరిణీ సం
దోహమును దాను గజపతి
మోహన ఘీంకారశబ్దములతో నొప్పె\న్‌.
119
క. కరమున మెల్లన నివురుచుఁ
గర మనురాగమున మెఱసి కలయంబడుచున్‌
గరి హరికతమున బ్రతుకుచుఁ
గరపీడన మాచరించెఁ గరిణుల మరల\న్‌.
120
సీ. జననాథ! దేవలశాప విముక్తుఁడై పటుతర గ్రాహరూపంబు మాని
ఘనుఁడు హూహూనామ గంధర్వుఁ డప్పుడు తన తొంటి నిర్మలతనువుఁ దాల్చి
హరికి నవ్యయునకు నతిభక్తితో మ్రొక్కి తవిలి కీర్తించి గీతములు వాడి
యా దేవు కృప నొంది యందంద మఱియును వినతశిరస్కుఁడై వేడ్కతోడ
 
ఆ. దళితపాపుఁ డగుచుఁ దనలోకమున కేఁగె నపుడు శౌరి కేల నంటఁ దడవ
హస్తిలోకనాథుఁ డజ్ఞానరహితుఁడై విష్ణురూపుఁ డగుచు వెలుఁగుచుండె.
121
మ. అవనీనాథ! గజేంద్రుఁ డా మకరితో నాలంబు గావించె, ము\న్‌
ద్రవిళాధీశుఁ డతండు పుణ్యతముఁ డింద్రద్యుమ్న నాముండు, వై
ష్ణవముఖ్యుండు, గృహీత మౌననియతి\న్‌ సర్వాత్ము నారాయణు\న్‌
సవిశేషంబుగఁ బూజ చేసెను మహాశైలాగ్ర భాగంబున\న్‌.
122
మ. ఒకనాఁ డా నృపుఁ డచ్యుతు\న్‌ మనములో నూహింపుచున్‌ మౌనియై
యకలంకస్థితి నున్నచోఁ గలశజుం డ చ్చోటికి\న్‌ వచ్చి లే
వక పూజింపక యున్న రాజుఁ గని నవ్యక్రోధుఁడై 'మూఢ! లు
బ్ధ కరీంద్రోత్తమ యోనిఁ బుట్టు' మని శాపంబిచ్చె భూవల్లభా!
123
క. మునిపతి నవమానించిన
ఘనుఁ డింద్రద్యుమ్నవిభుఁడు గౌంజరయోనిం
జననం బందెను విప్రులఁ
గని యవమానింపఁ దగదు ఘనపుణ్యులకున్‌.
124
క. కరినాథుఁ డయ్యె నాతఁడు
కరులైరి భటాదులెల్ల గజమై యుండి\న్‌
హరి చరణసేవ కతమునఁ
గరివరునకు నధికముక్తి గలిగె నరేంద్రా!
125
ఆ. కర్మతంత్రుఁడగుచుఁ గమలాక్షుఁ గొల్చుచు
నుభయనియతవృత్తి నుండెనేనిఁ
జెడును గర్మమెల్ల శిథిలమై మెల్లనఁ
బ్రబలమైన విష్ణుభక్తి చెడదు.
126
క. చెడుఁగరులు హరులు ధనములుఁ
జెడుదురు నిజసతులు సుతులుఁ జెడు చెనఁటులకు\న్‌
జెడక మను నెఱసుగుణులకుఁ
జెడని పదార్థములు విష్ణుసేవా నిరతుల్‌.
127
వ. అప్పుడు జగజ్జనకుండగు నప్పరమేశ్వరుండు దరహసిత ముఖకమల యగు నక్కమల కిట్లనియె. 128
క. బాలా! నా వెనువెంటను
హేల\న్‌ వినువీథినుండి యేతెంచుచు నీ
చేలాంచలంబుఁ బట్టుట
కాలో నేమంటి నన్ను నంభోజముఖీ!
129
క. ఎఱుఁగుదు తెఱవా! యెప్పుడు
మఱవను సకలంబు నన్ను మఱచిన యెడల\న్‌
మఱుతునని యెఱిఁగి మొఱఁగక
మఱవక మొఱయిడిర యేని మఱి యన్యముల\న్‌.
130
వ. అని పలికిన, నరవింద మందిర యగు నయ్యిందిరాదేవి మందస్మిత చంద్రికా వదనారవింద యగుచు ముకుందున కిట్లనియె. 131
క. దేవా! దేవర యడుగులు
భావంబున నిలిపి కొలుచు పని నాపని గా
కో వల్లభ! యేమనియెద
నీవెంటనె వచ్చుచుంటి నిఖిలాధిపతీ!
132
క. దీనుల కుయ్యాలింపను
దీనుల రక్షింప మేలు దీవనఁ బొందన్‌
దీనావన! నీ కొప్పును
దీనపరాధీన! దేవదేవ! మహేశా!
133
వ. అని మఱియును, సముచిత సంభాషణంబుల నంకించుచున్న పరమ వైష్ణవీరత్నంబును సాదర సరస సల్లాప మందహాస పూర్వకంబుగా నాలింగనంబు గావించి, సపరివారుండై, గంధర్వ సిద్ధ విబుధగణ జేగీయమానుండై, గరుడారూఢుండగుచు, నిజసదనంబునకుం జనియె. అని చెప్పి శుక యోగీంద్రుండిట్లనియె. 134
సీ. నరనాథ! నీకును నాచేత వివరింపఁ బడిన యీ కృష్ణానుభావమైన
గజరాజ మోక్షణ కథ వినువారికి యశము లిచ్చును గల్మషాపహంబు
దుస్స్వప్ననాశంబు దుఃఖసంహారంబుఁ బ్రొద్దుల మేల్కాంచి పూతవృత్తి
నిత్యంబుఁ పఠియించు నిర్మలాత్మకులైన విప్రులకును బహువిభవ మమరు
 
తే. సంపదలు గల్గుఁ బీడలు శాంతిఁ బొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు
మోక్ష మఱచేతిదై యుండు ముదము చేరు ననుచు విష్ణుండు ప్రీతుఁడై యానతిచ్చె.
135
వ. అని మఱియు, నప్పరమేశ్వరుండిట్లని యానతిచ్చె. ఎవ్వరేనియు నపరరాత్రంబున మేల్కాంచి, సమాహిత మనస్కులై, శ్వేతద్వీపంబును, నాకుం బ్రియంబైన సుధాసాగరంబును, హేమనగరంబును, నిగ్గిరికందర కాననంబులను, వేత్ర కీచక వేణులతా గుల్మ సురపాదపంబులను, ఏనును బ్రహ్మయు ఫాలలోచనుండును నివసించి యుండు నక్కొండశిఖరంబులను, కౌమోదకీ కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను, శ్రీదేవిని, శేష గరుడ వాసుకి ప్రహ్లాద నారదాది ఋషులను, మత్స్య కూర్మ వరాహాద్యవతారంబులను, దదవతారకృత కార్యంబులను, సూర్య సోమ పావకులనుఁ, బ్రణవంబును, ధర్మ తప స్సత్యంబులను, వేదంబును, వేదాంగంబులను, శాస్త్రంబులను, గో భూసుర సాధు పతివ్రతాజనంబులను, జంద్రకాశ్యపజాయా సముదయంబును, గౌరీ గంగా సరస్వతీ కాళిందీ సునందా ప్రముఖ పుణ్యతరంగిణీ నిచయంబును, నమరులను, నమరతరువులను, నైరావతంబును, నమృతంబును, ధ్రువుని, బ్రహ్మర్షి నివహంబును, బుణ్యశ్లోకులైన మానవులను, సమాహిత చిత్తులై తలంచువారలకుఁ బ్రాణావసానకాలంబున మదీయంబగు విమలగతి నిత్తు. అని హృషీకేశుండు నిర్దేశించి, శంఖంబు పూరించి, విహగపరివృఢ వాహనుండై వేంచేసె. విబుధానీకంబు సంతోషించె. అని చెప్పి శుకుండు రాజున కిట్లనియె. 136
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )