ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౫
క. గజరాజ మోక్షణంబును
నిజముగఁ బఠియించునట్టి నియతాత్ములకు\న్‌
గజరాజవరదుఁ డిచ్చును
గజతురగ స్యందనములుఁ గైవల్యంబు\న్‌.
137
క. తామసు తమ్ముఁడు రైవత
నామకుఁడై వెలసె మనువు నలువుర మీఁద\న్‌
భూమికిఁ బ్రతివింధ్యార్జున
నామాదులు నృపులు మనువు నందనులు నృపా!
138
సీ. మునులు హిరణ్యరోముఁడు నూర్ధ్వబాహుండు వేదశీర్షుండును వీరు మొదలు
నమరులు భూతరయాదులు శుభ్రుని పత్ని వికుంఠాఖ్య పరమ సాధ్వి
యా యిద్దఱకుఁ బుత్రుఁడై తనకళలతో వైకుంఠుఁడనఁ బుట్టి వారిజాక్షుఁ
డవనిపై వైకుంఠ మనియెడి లోకంబుఁ గల్పించె నెల్లలోకములుఁ మ్రొక్క
 
తే. రమ యెదుర్కోలు చేకొనె రాజముఖ్య! తదనుభావ గుణంబులుఁ దలఁప దరమె?
యీ ధరారేణు పటలంబు నెఱుఁగవచ్చుఁ గాని రాదయ్య హరి గుణగణము సంఖ్య.
139
వ. తదనంతరంబ. 140
సీ. చక్షుస్తనూజుండు చాక్షుషుండను వీరుఁ డాఱవ మనువయ్యె నవనినాథ!
భూమీశ్వరులు పురుః పురుష సుద్యుమ్నాదు లాతని నందను లమరవిభుఁడు
మంత్రద్యుమాఖ్యుఁ డమర్త్యు లాప్యాదికు లా హవిష్మ ద్వీరకాది ఘనులు
మునులందు విభుఁడు సంభూతికి వైరాజునకుఁ బుట్టి యజితుండు నాఁగ నొప్పె
 
ఆ. నతఁడ కాఁడె కూర్మమై మందరాద్రిని నుదధిజలములోన నుండి మోసె
నతఁడు సువ్వె దివిజు లర్థింప నమృతాబ్ధిఁ ద్రచ్చి యిచ్చె నా సుధారసంబు.
141
వ. అని పలికినం, బరీక్షిన్నరేంద్రుండు మునీంద్రున కిట్లనియె. 142
మ. విను ము న్నేటికిఁ ద్రచ్చె పాలకడలి\న్‌ విష్ణుండు కూర్మాకృతి\న్‌
వనధిం జొచ్చి యదెట్లు మోసెఁ బలు కవ్వంబైన శైలంబు దే
వనికాయం బమృతంబు నెట్లు వడసెన్‌ వారాశి నేమేమి సం
జనితంబయ్యె మునీంద్ర! చోద్యము గదా సర్వంబుఁ జెప్పంగదే.
143
క. అప్పటనుండి బుధోత్తమ!
చెప్పెదు భగవత్కథా విశేషంబులు నా
కెప్పుడు దనివి జనింపదు
సెప్పఁగదే చెవులు నిండ శ్రీహరికథలన్‌.
144
వ. అని మఱియు నడుగంబడినవాఁడై యతని నభినందించి, హరిప్రసంగంబు చెప్ప నుపక్రమించె. అని సూతుండు ద్విజుల కిట్లనియె. అట్లు శుకుండు రాజుం జూచి. 145
క. కసిమసఁగి యసురవిసరము
లసిలతిలక సురల నెగువ నసువులు వెడలం
జసచెడిరి పడిరి కెడసిరి
యసమసమర విలసనముల ననువెడలి నృపా!
146
క. సురపతి వరుణాదులతో
సురముఖ్యులు కొంద ఱరిగి సురశైలముపై
సురనుతుఁడగు నజుఁ గని యా
సురదుష్కృతిఁ జెప్పిరపుడు సొలయుచు నతులై.
147
క. దుర్వాసుశాపవశమున
నిర్వీర్యత జగములెల్ల నిశ్శ్రీకములై
పర్వతరిపుతోఁ గూడ న
పర్వములై యుండె హత సుపర్వావళులై.
148
ఆ. నెలవు వెడలియున్న నిస్తేజులైనట్టి
వేల్పుగములఁ జూచి వేల్పు పెద్ద
పరమపురుషుఁ దలఁచి ప్రణతుఁడై సంఫుల్ల
పద్మ వదనుఁ డగుచుఁ బలికెఁ దెలియ.
149
క. ఏనును మీరును గాలము
మానవ తిర్య గ్లతా ద్రుమ స్వేదజముల్‌
మానుగ నెవ్వని కళలము
వానికి మ్రొక్కెదము గాక వగవఁగ నేలా?
150
క. ఆద్యుండు రక్షకుండు న
సాధ్యుఁడు మాన్యుండు లోక సర్గ త్రాణాం
తాద్యాదు లొనర్చు నతం
డాద్యంత విధానములకు నర్హుఁడు మనకు\న్‌.
151
క. వరదునిఁ బరము జగద్గురుఁ
గరుణాపరతంత్రు మనము గనుఁగొన దుఃఖ
జ్వరములు చెడు నని సురలకు
సరసిజజని చెప్పి యజితు సదనంబునకు\న్‌.
152
వ. తానును, దేవతాసమాహంబును నతిరయంబునఁ జని, గానంబడని యవ్విభు నుద్దేశించి, దైవికంబులగు వచనంబుల నియతేంద్రియుఁడై యిట్లని స్తుతియించె. 153
సీ. ఎవ్వని మాయకు నింతయు మోహించుఁ దఱిమి యెవ్వనిమాయ దాఁటరాదు
తనమాయ నెవ్వఁ డింతయును గెల్చినవాఁడు నెవ్వని బొడగాన రెట్టిమునులు
సర్వభూతములకు సమవృత్తి నెవ్వఁడు చరియించుఁ దనచేత జనితమైన
ధరణి పాదములు చిత్తము సోముఁ డగ్ని ముఖంబును గన్నులు కమలహితులు
 
తే. చెవులు దిక్కులు రేతంబు సిద్ధజలము మూఁడుమూర్తుల పుట్టిల్లు మొదలినెలవు
గర్భ మఖిలంబు మూర్ధంబు గగన మగుచు మలయు నెవ్వని వాని నమస్కరింతు.
154
వ. మఱియు, నెవ్వని బలంబున మహేంద్రుండును, ప్రసాదంబున దేవతలును, గోపంబున రుద్రుండును, బౌరుషంబున విరించియు, నింద్రియంబులవలన వేదంబులును మునులును, మేఢ్రంబునఁ బ్రజాపతియు, పక్షంబున లక్ష్మియు, ఛాయవలనఁ బితృదేవతలును, స్తనంబులవలన ధర్మంబును, బృష్ఠంబువలన నధర్మంబును, శిరంబువలన నాకంబును, విహాసంబువలన నప్సరోజనంబులును, గుహ్యంబువలన బ్రహ్మంబును, ముఖంబువలన విప్రులును, భుజంబువలన రాజులును (బలంబును), నూరువులవలన వైశ్యులును (నైపుణ్యంబును), పదంబులవలన శూద్రులును (అవేదంబును), అధరంబు వలన లోభంబును, నుపరి రదచ్ఛదంబువలనఁ బ్రీతియుఁ, నాసాపుటంబువలన ద్యుతియు, స్పర్శంబునఁ గామంబును, భ్రూయుగళంబున యమంబును, బక్షంబునఁ గాలంబును సంభవించె, నెవ్వని యోగ మాయా విహితంబులు ద్రవ్య వయః కర్మ గుణ విశేషంబులు, చతుర్విధ భూత సర్గం బెవ్వని యాత్మతంత్రంబు, నెవ్వని వలన సిద్ధించి, లోకంబులును లోకపాలురుం బ్రతుకుచుందురు, పెరుఁగుచుందురు, దివిజులకు నాయువు బలంబునై,జగంబులకు నీశుండై, పరమ మహాభూతి యగు నప్పరమేశ్వరుండు మాకుం బ్రసన్నుండగుఁ గాక! అని మఱియును. 155
క. మొదల జల మిడిన భూజము
దుది నడుమను జల్లఁదనము దొరఁకొను మాడ్కిన్‌
మొదలను హరికిని మ్రొక్కిన
ముదమందుదు మెల్ల వేల్పుమూఁకలు నేమున్‌.
156
క. ఆపన్నులగు దిదృక్షుల
కో పుణ్య! భవన్ముఖాబ్జ మొయ్యన తఱితోఁ
బ్రాపింపఁ జేయు సంపద
నో పరమదయానివాస! యుజ్జ్వలతేజా!
157
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )