ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౬
వ. అని యిట్లు దేవగణసమేతుండై యనేక విధంబులఁ గీర్తింపుచునున్న పరమేష్ఠి యందుఁ గరుణించి, దయాగరిష్ఠుండగు విశ్వగర్భుం డావిర్భవించె. 158
మ. ఒక వేయర్కులు గూడి గట్టికరువై యుద్యత్ప్రభాభూతితో
నొకరూపై చనుదెంచుమాడ్కి హరి దా నొప్పారె; నావేలుపుల్‌
వికలాలోకనులై, విషణ్ణమతులై, విభ్రాంతులై మ్రోలఁ గా
నక శంకించిరి కొంతప్రొద్దు; విభుఁ గానం బోలునే వారికిన్‌.
159
వ. అప్పుడు. 160
సీ. హార కిరీట కేయూర కుండల పాదకటక కాంచన రత్న కంకణాది
కౌస్తుభోపేతంబుఁ గౌమోదకీ శంఖ చక్ర శరాసన సంయుతంబు
మరకతశ్యామంబు సరసిజనేత్రంబు కర్ణాభరణ కాంతి గండయుగము
కలిత కాంచనవర్ణ కౌశేయవస్త్రంబు శ్రీ వనమాలికా సేవితంబు
 
ఆ. నై మనోహరణంబునై దివ్యసౌభాగ్యమైన యతనిరూపు హర్ష మెసఁగఁ
జూచి బ్రహ్మ హరుఁడు సురలును దానును బొంగి నమ్రు లగుచుఁ బొగడఁ దొడఁగె.
161
క. జనన స్థితి లయ దూరుని
మునినుతు నిర్వాణసుఖసముద్రుని సుగుణుం
దనుతనునిఁ బృథులబృథులుని
ననఘుఁడగు మహానుభావు నభినందింతున్‌.
162
క. పురుషోత్తమ! నీరూపము
పరమశ్రేయంబు భువనపంక్తుల కెల్లన్‌
స్థిర వైదికయోగంబున
వరుసను నీయందుఁ గానవచ్చెను మాకున్‌.
163
క. మొదలును నీలోఁ దోఁచెను
దుదియు న్నటఁ దోఁచె నడుము దోఁచెను నీవే
మొదలు నడుము దుది సృష్టికిఁ
గదియఁగ ఘటమునకు మన్ను గతి యగు మాడ్కిన్‌.
164
క. నీ మాయచేత విశ్వము
వేమాఱు సృజింతు వనుచు విష్ణుఁడ వనుచున్‌
ధీమంతులు గుణపదవిని
నేమంబున సగుణుఁడైన నినుఁ గాంతు రొగిన్‌.
165
ఆ. అన్న మవని యందు నమృతంబు గోవుల
యందు వహ్ని సమిధలందు నరులు
యోగవశతఁ బొందు నోజను బుద్ధిచే
నగుణు నిన్నుఁ గాంతు రాత్మవిదులు.
166
మత్తకోకిల. పట్టులేక బహుప్రకార విపన్న చిత్తులమైతి మే
మెట్టకేలకు నిన్నుఁ గంటి మభీప్సితార్థము వచ్చెఁ బె\న్‌
వెట్టయైన దవానలంబుల వేఁగు నేనుఁగు మొత్తముల్‌
నిట్ట లేచిన గంగలోపల నీరు గాంచిన చాడ్పునన్‌.
167
మత్తకోకిల. నీకు నేమని విన్నవింతుము నీవు సర్వమయుండవై
లోకమెల్లను నిండి యుండఁగ లోకలోచన! నీ పదా
లోకనంబు శుభంబు మాకును లోకపాలకు లేను నీ
నాకవాసులు నీవ వహ్నిఁ దనర్చు కేతు తతిక్రియ\న్‌.
168
వ. అని కమలసంభవ ప్రముఖులు వినుతిచేసిరి. అని చెప్పి నరేంద్రునకు శుకుండిట్లనియె. 169
శా. ఈ రీతిం జతురాననాది నుతుఁడై యేపార జీమూతగం
భీరంబైన రవంబునం బలికె సంప్రీతాత్ముఁడై యీశ్వరుం
డా రోమాంచితకాయుల న్నవవిముక్తాపాయుల\న్‌ శ్రేయులం
బ్రారబ్ధోగ్ర మహార్ణవోన్మథన వాంఛానల్పుల\న్‌ వేల్పుల\న్‌.
170
క. ఓ నలువ! యో సురేశ్వర!
యో నిటలతటాక్ష! యో సురోత్తములారా!
దానవులతోడ నిప్పుడు
మానుగఁ బోరామి గలిగి మనుటే యొప్పు\న్‌.
171
వ. అది యెట్లంటిరేని. 172
క. ఎప్పుడు దనకును సత్త్వము
చొప్పడు నందాఁక రిపులఁ జూచియుఁ దన మైఁ
గప్పికొని యుండవలయు
న్నొప్పుగ నహి మూషకమున కొదిఁగిన భంగి\న్‌.
173
క. అమృతోత్పాదన యత్నము
విమలమతిం జేయుటొప్పు వేల్పులు వినుఁడీ
యమృతంబుఁ ద్రావి జంతువు
లమృతగతిం బ్రతుకుచుండు నాయుర్వృద్ధి\న్‌.
174
సీ. పాలమున్నీటిలోపల సర్వతృణ లతౌషధములు దెప్పించి చాల వైచి
మందరశైలంబు మంథానముగఁ జేసి తనర వాసుకిఁ దరిత్రాడు సేసి
నా సహాయంబున నలి నందఱును మీరు తరువుఁడు వేగ నతంద్రు లగుచు
ఫలము మీదయ్యెడు బహుళదుఃఖంబులఁ బడుదురు దైత్యులు పాపమతులు
 
ఆ. అలసటయును లేక యఖిలార్థములు గల్గు విషధిలోన నొక్క విషము పుట్టుఁ
గలఁగి వెఱవ వలదు కామరోషంబులు వస్తుచయమునందు వలదు చేయ.
175
వ. అని యుపదేశించి. 176
క. అంతాదిరహితుఁ డచ్యుతుఁ
డంతర్ధానంబు నొందె నజ ఫాలాక్షుల్‌
సంతోషంబునఁ దమ తమ
కాంతాలయములకుఁ జనిరి గౌరవ మొప్పన్‌.
177
క. కయ్యంబు సేయ నొల్లక
నెయ్యంబున నతులు వెట్టి నిర్జరనికరం
బియ్యప్పనములు వెట్టుచుఁ
దియ్యంబునఁ గొల్చె బలిని దేవద్వేషి\న్‌.
178
క. పస చెడి తనకును వశమై
సుసరముతోఁ గొల్చుచున్న సురసంఘముల\న్‌
గసిమసఁగి చంపఁ బూనిన
నసురుల వారించె బలియు నతి నయయుక్తి\న్‌.
179
వ. అట్లు వారించి, వైరోచని రాక్షససముదయంబున కిట్లనియె. 180
క. పగవారు శరణుచొచ్చిన
మగతనములు నెఱపఁ దగదు మగవారలకు\న్‌
దగు సమయ మెఱుఁగవలదే
మగఁటిమి పాటింపవల దమర్త్యులతోడ\న్‌.
181
వ. అని పలికి, కొలువుకూటంబున నసురనికర పరివృతుండై, నిఖిల లోక రాజ్య లక్ష్మీ సహితుండై, యఖిల విబుధ వీర విజయాహంకార నిజాలంకారుండై, సుఖంబునఁ గొలువున్న విరోచన నందనుం గని, శచీవిభుం డుత్తమసచివుండునుం బోలె సాంత్వవచనంబుల శాంతిం బొందించి, పురుషోత్తమ శిక్షితంబైన నీతిమార్గంబున శంబరునికిం బ్రియంబు సెప్పి, యరిష్టనేమి ననునయించి, త్రిపురవాసులగు దానవుల నొడంబఱిచి, జంభుని సమ్మతంబు చేసికొని, హయగ్రీవుని విగ్రహంబు మాన్చి, నముచి తారక బాణాదులతో సఖ్యంబు నెఱపి, విప్రచిత్తికిఁ బొత్తు హత్తించి, శకుని విరోచన ప్రహేతులకుఁ బోరామి సూపి, మయ మాలి సుమాలి ప్రముఖులకు మైత్రి యెఱింగించి, కుంభ నికుంభులకు సౌజన్యంబు గైకొలిపి, పౌలోమ కాలకేయ నివాతకవచాదుల యెడ బాంధవంబు ప్రకటించి, వజ్రదంష్ట్రికి వశుండై, యితర దానవ దైత్య సమూహంబువలన నతి స్నేహంబు సంపాదించి, మనకు నక్కచెలియండ్ర బిడ్డలకు నొడ్డారంబులేమిటికి? ఏకకార్య పరత్వంబున నడ్డంబులేక బ్రతుకుదము. అన్యోన్య విరోధంబు లేల? తొల్లి యన్యోన్య విరోధంబున నలంగితిమి. ఇదిమొదలు దనుజ దివిజ సముదయంబులకు రాజు విరోచననందనుండ. మనమందఱ మతనిపంపు సేయంగలవారము. ఉభయకులంబును వర్ధిల్లునట్టి యుపాయం బెఱింగింతు. అని యమృతజలధి మథన ప్రారంభ కథనంబు దెలియం జెప్పి, అట్లు సురాసుర యూధంబులు బలారాతి బలి ప్రముఖంబులై, పరమోద్యోగంబున సుధా సంపాదనాయత్త చిత్తులై, సఖ్యంబు నొంది, మందగమనంబున మందరనగంబునకుం జని. 182
సీ. వాసవు వర్ధకి వాఁడిగాఁ జఱచిన కుద్దాలముఖములఁ గొంత ద్రవ్వి
ముసలాగ్రములు సొన్పి మొదలిపాఁ తగలించి దీర్ఘపాశంబులఁ దిండుసుట్టి
పెకలించి బాహులఁ బీడించి కదలించి పెల్లార్చి తమ తమ పేరు వాడి
పెఱికి మీఁదికి నెత్తి పృథులహస్తంబులఁ దలల భుజంబులఁ దరలకుండ
 
తే. నాని మెల్లన కుఱుతప్పు టడుగు లిడుచు భార మధికంబు మఱవకఁ బట్టుఁ డనుచు
మందరనగంబుఁ దెచ్చి రమందగతిని దేవదైత్యులు జలరాశి తెరువు వట్టి.
183
క. మందరము మోప నోపమి
నందఱిపైఁ బడియె నదియు నతిచోద్యముగాఁ
గొందఱు నేలం గలసిరి
కొందఱు నుగ్గైరి చనిరి గొందఱు భీతి\న్‌.
184
క. ఏలా హరికడ కేగితి
మేలా దొరఁకొంటి మధికహేలన శైలో
న్మూలనము చేసి తెచ్చితి
మేలా పెక్కండ్రు మడిసి రేలా నడుమన్‌.
185
క. ఏటికి మముఁ బనిపంచె
న్నేటికి మనబోఁటివారి కింతలు పనులిం
కేటికి రాఁడు రమేశ్వరుఁ
డేటి కుపేక్షించె మఱవ నేటికి మనల\న్‌.
186
వ. అని కులకుధర పతనజన్యం బగు వేదన సహింపనోపక, పలవించుచున్న దివిజ దితిజుల భయంబు మనంబున నెఱింగి, సకలవ్యాపకుండగు హరి తత్సమీపంబున. 187
మ. గరుడారోహకుఁడై గదాదిధరుఁడై కారుణ్యసంయుక్తుఁడై
హరికోటి ప్రభతో నొహో వెఱకుఁడీ యంచుం బ్రదీపించి త
ద్గిరిఁ గేల న్నొవకుండ, గందుకము మాడ్కి\న్‌ బెట్టెఁ బక్షీంద్రుపైఁ
గరుణాలోకసుధ\న్‌ సురాసురుల ప్రాణంబుల్‌ సమర్థింపుచు\న్‌.
188
క. వారలు గొలువఁగ హరియును
వారిధి దరి కరుగు మనఁగ వసుధాధరము\న్‌
వారిజనయనునిఁ గొంచు న
వారితగతిఁ జనియె విహగవల్లభుఁ డఱుత\న్‌.
189
క. చని జలరాశి తటంబున
వనజాక్షుని గిరిని డించి వందనములు స
ద్వినతులు సేసి ఖగేంద్రుఁడు
పనివినియెను భక్తి నాత్మభవనంబునకు\న్‌.
190
వ. అప్పుడు. 191
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )