ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౭
సీ. భూనాథ! వినవయ్య భోగీంద్రు వాసుకిఁ బిలిపించి యతనికిఁ బ్రియము సెప్పి
ఫలభాగ మీ నొడఁబడి సమ్మతునిఁ జేసి మెల్లనఁ జేతుల మేను నిమిరి
నీవ కా కెవ్వరు నేర్తు రీ పని కియ్యకొమ్మని యతనిఁ గైకోలు వడసి
కవ్వంపుఁగొండ నిష్కంటకంబుగఁ జేసి ఘర్షించి యతని భోగంబుఁ జుట్టి
 
ఆ. కడఁగి యమృతజలధిఁ గలశంబుఁ గావించి త్రచ్చు న చ్చలమునఁ దలఁపు లమర
బద్ధవస్త్రకేశ భారులై యీ రెండు గములవారు తరువఁ గదిసి రచట.
192
వ. తదనంతరంబ. 193
క. హరియును దేవానీకము
నురగేంద్రుని తలలు పట్ట నుద్యోగింప\న్‌
హరిమాయా పరవశులై
సురవిమతులు గూడి పలుకఁజొచ్చిరి కడిమి\న్‌.
194
మత్తకోకిల. స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కఁ బట్టి మథింపఁగాఁ
బుచ్ఛ మేటికి మాకుఁ బట్టఁగఁ బూరుషత్వము గల్గి మే
మచ్ఛమైన తపోబలాధ్యయనాన్వయంబుల వారమై
యిచ్ఛయింతుమె తిచ్ఛవృత్తికి నిండు మాకు ఫణాగ్రముల్‌.
195
వ. అని పలుకు దనుజులం జూచి. 196
క. విస్మయముఁ బొంది దానవ
ఘస్మరుఁ డహిఫణము విడువఁ గైకొని యసురుల్‌
విస్మితముఖులై యార్చి ర
విస్మేరతఁ గొనిరి సురలు వీఁక\న్‌ దోఁక\న్‌.
197
వ. ఇట్లు సమాకర్షణ స్థాన భాగ నిర్ణయంబు లేర్పఱుచుకొని, దేవతలు పుచ్ఛంబును, పూర్వదేవతలు ఫణంబులం బట్టి, పయోరాశి మధ్యంబునం బర్వతంబు వెట్టి, పరమాయత్త చిత్తులై, యమృతార్థంబు ద్రచ్చుచున్న సమయంబున. 198
క. విడు విడుఁడని ఫణి పలుకఁగఁ
గడుభరమున మొదలఁ గుదురు గలుగమి వెడఁగై
బుడబుడ రవమున నఖిలము
వడవడ వణఁకఁగ మహాద్రి వనధి మునింగె\న్‌.
199
ఉ. గౌరవమైన భారమునఁ గవ్వపుఁ గొండ ధరింపలేక దో
స్సారవిహీనులై యుభయసైనికులు\న్‌ గడు సిగ్గుతో నకూ
పారతటంబునం బడిరి పౌరుషముం జెడి పాండవేయ! యె
వ్వారికి నేరఁబోలు బలవంతపు దైవము నాక్రమింపఁగ\న్‌.
200
క. వననిధి జలముల లోపల
మునిఁగెడి గిరిఁ జూచి దుఃఖమునఁ జింతాబ్ధిన్‌
మునిఁగెడి వేల్పులఁ గనుఁగొని
వనజాక్షుఁడు వార్ధి నడుమ వారలు సూడన్‌.
201
కూర్మావతార కథా ప్రారంభము
సీ. సవరనై లక్షయోజనముల వెడలుపై కడుఁ గఠోరంబైన కర్పరమున
నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖగహ్వరంబు
సకల చరాచర జంతురాసుల నెల్ల మ్రింగి లోఁగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైఁబడ్డ నాఁగినఁ గదలనియట్టి కాళ్ళు
 
తే. వెలికి లోనికిఁ జనుదెంచు విపులతుండ మంబుజంబులఁ బోలెడి యక్షియుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి కూర్మి చెలువొంద నొక మహాకూర్మమయ్యె.
202
మ. కమఠంబై జలరాశిఁ జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్‌
నమదద్రీంద్రము నెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో
నమరేంద్రాదులు మౌళికంపములతో నౌ నౌఁ గదే బాపురే
కమలాక్షా! శరణంచు భూ దిశలు నాకాశంబునున్‌ మ్రోయఁగాన్‌.
203
వ. ఇవ్విధంబున. 204
క. తరిగాండ్రలోన నొకఁడఁట
తరికడవకుఁ గుదురు నాఁక త్రాడును జేరుల్‌
దరిగవ్వంబును దానఁట
హరి హరి హరి చిత్రలీల హరియే యెఱుఁగున్‌.
205
ఆ. జలధిఁ గడవసేయ శైలంబు కవ్వంబు
సేయ భోగిఁ ద్రాడుసేయఁ దరువ
సిరియు సుధయుఁ బడదు శ్రీవల్లభుఁడు దక్క
నొరుఁడు శక్తిమంతుఁడొకఁడు గలఁడె.
206
ఆ. గొల్లవారి బ్రతుకు గొఱఁతన వచ్చునే
గొల్లరీతిఁ బాలకుప్పఁ ద్రచ్చి
గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు
చేటులేని మందు సిరియుఁ గనిరి.
207
వ. ఇట్లు సురాసురయూధంబులు హరిసనాథంబులై, కవచంబులు నెట్టంబులు వెట్టికొని, పుట్టంబులు పిరిచుట్లు చుట్టుకొని, కరంబులు గరంబుల నప్పళించుచు, భుజంబులు భుజంబులు నొఱయుచు, లెండు లెండు దరువం దొడంగుఁడు రండని, యమందగతిఁ బెరుఁగుఁ ద్రచ్చు మందగొల్లల చందంబున, మహార్ణవ మధ్యంబున మంథాయమాన మందరమహీధర విలగ్న భోగిభోగాద్యంతంబులం గరంబులం దెమల్చుచుఁ, బెను బొబ్బలం బ్రహ్మాండకటాహంబు నిర్భరంబై గుబ్బు గుబ్బని యురలఁ, గొంత కవ్వంబుగుత్తి జిఱజిఱం దిరుగు వేగంబున, ఛటచ్ఛటాయమానంబులై భుగులు భుగుళ్ళను చప్పుళ్ళ నుప్పరం బెగసి, లెక్కకు మిక్కిలి చుక్కల కొమ్మల చెక్కుల నిక్కలువడు మిసిమిగల మీఁది మీఁగడపాల తేటనిగ్గు తుంపరల పరంపరలవలన నిజకర క్రమక్రమాకర్షణ పరిభ్రాంత ఫణి ఫణాగర్భ సముద్భూత నిర్భర విషకీలి కీలజాలంబు లప్పటప్పటికి నుప్పతిల్లిన, దప్పినొందక, మందగతిం జెందక, యక్కూపార వేలాతట కుటజ కుసుమగుచ్ఛ పుచ్ఛ పిచ్ఛిల స్వచ్ఛ మకరంద సుగంధి గంధవహావహనంబునం గ్రొంజెమట పిచ్ఛిల, పెను వఱదగము లొడళ్ళ నిగుర, నొండొరులం బరిహసించుచుఁ, బేరువాడి విలసించుచు, మేలుమేలని యగ్గించుచు, గాదు కాదని భంగించుచు, నిచ్చ మెచ్చని మచ్చరంబులవలన వనధివలమాన వైశాఖ వసుంధరాధర పరివర్తన సంజనిత ఘుమఘుమారావంబును, మథనగుణాయమాన మహాహీంద్రప్రముఖ ముహుర్ముహు రుచ్చలిత భూరి ఘోర ఫూత్కార ఘోషంబును, గులకుధర పరిక్షేపణ క్షోభిత సముల్లంఘన సమాకులితంబులై, వెఱచఱచి, గుబురుగుబురులై యొరలు కమఠ కర్కట కాకోదర మకర తిమి తిమింగిల మరాళ చక్రవాక బలాహక భేక సారసానీకంబుల మొఱలునుం గూడికొని ముప్పిరిగొని, దనుజ దివిజ భటాట్టహాస తర్జన గర్జన ధ్వనుల నలుపురియై మొత్తినట్లైన, దశదిగంత భిత్తులును బేడెత్తి పెల్లగిల్లం ద్రుళ్ళుచుఁ గికురు పొడుచుచు, నొకని కొకనికంటె వడియునుం, దడవునుం గలుగఁ ద్రచ్చుచుఁ, బంతంబు లిచ్చుచు, సుధాజననంబుఁ జింతింపుచు, నూతన పదార్థంబులకు నెదుళ్ళు సూచుచు, నెంత తడవు ద్రత్తమని హరి నడుగుచు, నెడపదని తమకంబుల నంతకంతకు మురువు డింపక త్రచ్చు సమయంబున. 208
క. అప్పాలవెల్లి లోపల
నప్పటి కప్పటికి మందరాగము తిరుగం
జప్పుడు నిండె నజాండము
చెప్పెడిదే మజుని చెవులు చిందఱఁ గొనియె\న్‌.
209
వ. అంత నప్పయోరాశి మధ్యంబున. 210
క. ఎడమఁ గుడి మునుపు దిరుగుచుఁ
గుడి నెడమను వెనుకఁ దిరుగు కులగిరి కడలి\న్‌
గడ వెడల సురలు నసురులు
దొడితొడి ఫణిఫణము మొదలుఁ దుదియును దిగువ\న్‌.
211
క. వడిగొని కులగిరిఁ దరువఁగ
జడనిధి ఖగ మకర కమఠ ఝుష ఫణిగణముల్‌
సుడివడుఁ దడఁబడుఁ గెలఁకులఁ
బడు భయపడి నెగసి బయలఁబడు నురలిపడు\న్‌.
212
క. అమరాసుర కరవిపరి
భ్రమణ ధరాధరవరేంద్ర భ్రమణంబును దాఁ
గమఠేంద్రు వీఁపు తీఁటను
శమియింపఁగఁ జాలదయ్యె జగతీనాథా!
213
వ. తదనంతరంబ. 214
క. ఆలోల జలధిలోపల
నాలో నహి విడిచి సురలు నసురులు బఱవం
గీలా కోలాహలమై
హాలాహలవిషము పుట్టె నవనీనాథా!
215
వ. అదియునుం, బ్రళయకాలాభీల ఫాలలోచను లోచనానలశతంబు చందంబున నమందంబై, విలయదహన సహస్రంబు కైవడి వడియై, కడపటి పట్టపగటింటి వెలుంగుల లక్ష తెరంగున దుర్లక్షితంబై, తుదిరేయి వెలింగిన మొగులు గముల వలనం బడు బలుపిడుగుల వడువున బెడిదంబై, పంచభూతంబులుం దేజో రూపంబులైన చాడ్పున దుస్సహంబై, భుగభుగాయమానంబులైన పొగలును, జిటచిటాయమానంబులైన విస్ఫులింగంబులును, ధగద్ధగాయమానంబులైన నెఱ మంటలుం గలిగి, మహార్ణవ మధ్యంబున మందరనగం బమందరంబుగం దిరుగు నెడ జనియించి, పెటపెటాయమానంబై, నింగికిం బొంగి, దిశలకుం గేలుసాఁచి, బయళ్ళు ప్రబ్బికొని, తరిగవ్వంపుఁ గొండ నండ గొనక, నలుగడలకుం బఱచి, దరుల కుఱికి, సురాసుర సముదయంబులం దరికొని, గిరివర గుహాగహ్వరంబుల సుడివడక, కులశిఖరి శిఖరంబుల నెరగలి వడి, గహనంబులు దహించి, కుంజ మంజరీపుంజంబుల భస్మంబుచేసి, జనపదంబు లేర్చి, నదీనదంబు లెరియించి, దిక్కుంభి కుంభంబులు నిక్కలువడ నిక్కి, తరణి తారామండలంబులపై మిట్టించి, మహర్లోకంబు దరికొని, యుపరిలోకంబునకు మాఱుగొన లిడి, సుడివడి, ముసరుకొని, బ్రహ్మాండగోళంబు చిటిలిపడం దాఁటి, పాతాళాది లోకంబులకు వ్రేళ్ళువాఱి, సర్వాధికంబై శక్యంబుగాక, యెక్కఁడఁ జూచినం దానయై, కురంగంబుక్రియం గ్రేళ్ళుఱుకుచు, భుజంగంబు విధంబున నొడియుచు, సింగంబుభంగి లంఘింపుచు, విహగంబు పగిది నెగయుచు, మాతంగంబు పోలిక నిలువంబడుచు, నిట్లు హాలాహల దహనంబు జగంబులం గోలాహలంబు సేయుచున్న సమయంబున, మెలకు సెగల మిడుకం జాలక నీఱైన దేవతలును, నేలంగూలిన రక్కసులును, డుల్లిన తారకంబులును, గీటణంగిన కిన్నర మిథునంబులును, గమలిన గంధర్వ విమానంబులును, జీకాకువడ్డ సిద్ధచయంబులును, జిక్కువడిన గ్రహంబులును, జిందఱ వందఱలైన వర్ణాశ్రమంబులును, నిగిరిపోయిన నదులును, నింకిన సముద్రంబులును, గాలిన కాననంబులును, బొగిలిన పురంబులును, బొనుఁగు వడిన పురుషులును, బొక్కిపడిన పుణ్యాంగనా జనంబులును, బగిలి పడిన పర్వతంబులును, భస్మంబులైన ప్రాణిసంఘంబులును, వేగిన లోకంబులును, వివశలైన దిశలును, నొడ్డగెడవులైన భూజచయంబులును, నఱవఱలైన భూములునునై యకాల విలయ కాలంబై తోఁచుచున్న సమయంబున. 216
క. ఒడ్డారించి విషంబున
కడ్డము చనుదెంచి కావ నధికులు లేమి\న్‌
గొడ్డేఱి మ్రంది రాలన
బిడ్డన నెడలేక జనులు పృథ్వీనాథా!
217
వ. అప్పుడు. 218
మ. చని కైలాసముఁ జొచ్చి శంకరు నివాసద్వారముం జేరి యీ
సున దౌవారికు లడ్డపెట్టఁ దల మంచుం జొచ్చి కుయ్యో మొఱో
విను మాలింపుము చిత్తగింపుము దయ\న్‌ వీక్షింపుమం చంబుజా
సన ముఖ్యుల్‌ గని రార్తరక్షణ కళాసంరంభుని\న్‌ శంభుని\న్‌.
219
క. వారలు దీనత వచ్చుటఁ
గూరిమితో నెఱిఁగి దక్షుకూఁతురు, దాను\న్‌
బేరోలగమున నుండి ద
యారతుఁడై చంద్రచూడుఁ డవసర మిచ్చె\న్‌.
220
వ. అప్పుడు భోగిభూషణునకు సాష్టాంగ దండప్రణామంబులు గావించి, ప్రజాపతి ముఖ్యులిట్లని స్తుతియించిరి. 221
సీ. భూతాత్మ! భూతేశ! భూతభావనరూప! దేవ! మహాదేవ! దేవవంద్య!
యీ లోకములకెల్ల నీశ్వరుండవు నీవ బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ
యార్తశరణ్యుండవగు గురుండవు నిన్నుఁ గోరి భజింతురు కుశలమతులు
సకల సృష్టి స్థితి సంహార కర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ బరఁగు దీవు
 
ఆ. పరమగుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవ శక్తిమయుఁడ వీవ
శబ్దయోని వీవ జగదంతరాత్మవు నీవ ప్రాణ మరయ నిఖిలమునకు.
222
క. నీయంద సంభవించును
నీయంద వసించి యుండు నిఖిలజగంబుల్‌
నీయంద లయముఁ బొందును
నీ యుదరము సర్వభూత నిలయము రుద్రా!
223
సీ. అగ్ని ముఖంబు, పరాపరాత్మక మాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము,
శ్వసనంబు నీయూర్పు, రసన జలేశుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి,
సూర్యుండు గన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చదలు శిరము,
సర్వౌషధులు రోమచయములు, శల్యంబు లద్రులు, మానస మమృతకరుఁడు,
 
తే. ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయ, మాస్యపంచక ముపనిషదాహ్వయంబు
లైన నీరూపు పరతత్త్వమై శివాఖ్యమై స్వయంజ్యోతియై యొప్పు నాద్యమగుచు.
224
క. కొందఱు కలఁడందురు నినుఁ
గొందఱు లేఁడందు రతఁడు గుణి గాఁడనుచు\న్‌
గొందఱు కలఁడని లేఁడని
కొందల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!
225
సీ. తలఁపఁ బ్రాణేంద్రియ ద్రవ్య గుణ స్వభావుఁడవు, కాల క్రతువులును నీవ
సత్యంబు ధర్మ మక్షరము ఋతంబును నీవ ముఖ్యుడవు నిఖిలమునకు
ఛందోమయుండవు సత్త్వ రజ స్తమశ్చక్షుండవై యుందు సర్వరూప
కామపురాధ్వర కాలగరాది భూతద్రోహిజయము చోద్యంబుగాదు
 
తే. లీల లోచనవహ్నిస్ఫులింగ శిఖల నంతకాదులఁ గాల్చిన యట్టి నీకు
రాజఖండావతంస! పురాణపురుష! దీనరక్షక! కరుణాత్మ! దేవదేవ!
226
ఆ. మూఁడుమూర్తులకును మూఁడు లోకములకు
మూఁడు కాలములకు మూలమగుచు
భేదమగుచు మది నభేదమై యొప్పారు
బ్రహ్మమనఁగ నీవ ఫాలనయన!
227
క. సదసత్తత్త్వ చరాచర
సదనంబగు నిన్నుఁ బొగడ జలజభవాదుల్‌
పెదవులు గదలుప వెఱతురు
వదలక నినుఁ బొగడ నెంతవారము దేవా!
228
మత్తకోకిల. బాహుశక్తి సురాసురుల్‌ సని పాలవెల్లి మథింప హా
లాహలంబు జనించె నేరి కలంఘ్యమై భువనంబు కో
లాహలంబుగఁ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణిసం
దోహముం బ్రతికింపవే దయ దొంగలింపఁగ నీశ్వరా!
229
క. లంపటము నివారింపను
సంపద కృపసేయ జయము సంపాదింప\న్‌
జంపెడివారి వధింపను
సొంపారఁగ నీకె చెల్లు సోమార్ధధరా!
230
క. నీకంటె నొండెఱుంగము
నీకంటెం బరులు గావనేరరు జగముల్‌
నీకంటె నొడయఁడెవ్వఁడు
లోకంబుల కెల్ల నిఖిలలోకస్తుత్యా!
231
ఈశ్వరుండు దేవబృందప్రార్థితుండై హాలాహలమును బానము చేయుట
వ. అని మఱియు నభినందింపుచున్న ప్రజాపతిముఖ్యులం గని, సకలభూత సముండగు నద్దేవుండు తన ప్రియసతి కిట్లనియె. 232
క. కంటే జగముల దుఃఖము
వింటే జలజనిత విషమువేఁడిమి ప్రభువై
యుంటకు నార్తుల యాపదఁ
గెంటించుట ఫలము దానఁ గీర్తి మృగాక్షీ!
233
క. ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన
ప్రాణుల రక్షింపవలయుఁ ప్రభువుల కెల్ల\న్‌
బ్రాణుల కిత్తురు సాధులు
ప్రాణంబులు నిమిష భంగురములని మగువా!
234
క. పరహితము సేయు నెవ్వడు
పరమ హితుండగును భూత పంచకమునకు\న్‌
బరహితమె పరమధర్మము
పరహితునకు నెదురులేదు పర్వేందుముఖీ!
235
క. హరి మది నానందించిన
హరిణాక్షి! జగంబులెల్ల నానందించు\న్‌
హరియును జగములు మెచ్చఁగ
గరళము వారింపు టొప్పుఁ గమలదళాక్షీ!
236
క. శిక్షింతు హాలహలమును
భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియ\న్‌
రక్షింతుఁ బ్రాణికోట్లను
వీక్షింపుము నేఁడు నీవు వికచాబ్జముఖీ!
237
వ. అని పలికినఁ, బ్రాణవల్లభునకు వల్లభ యిట్లనియె. దేవా! చిత్తంబు కొలది నవధరింతు గాక. అని పలికెనని చెప్పిన యమ్మునీంద్రునకు నరేంద్రుండిట్లనియె. 238
మ. అమర\న్‌ లోకహితార్థమంచు నభవుం డౌఁగాక యంచాడెఁ బో,
యమరుల్‌ భీతిని మ్రింగుమీ యనిరి వో, యంభోజగర్భాదులుం
దముఁ గావ\న్‌ హర లెమ్ము! లెమ్మనిరి వో, తాఁ జూచి కన్గంట న
య్యుమ ప్రాణేశ్వరు నెట్లు మ్రింగుమనె నయ్యుగ్రానలజ్వాలల\న్‌.
239
వ. అనిన శుకుండిట్లనియె. 240
క. మ్రింగెడివాఁడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకు\న్‌
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
241
మ. తన చుట్టు\న్‌ సురసంఘముల్‌ జయజయ ధ్వానంబుల\న్‌ బొబ్బిడ\న్‌
ఘన గంభీర రవంబుతో శివుఁడు లోకద్రోహి! హుం! పోకు ర
మ్మని కెంగేలఁ దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం
బన సర్వంకషము\న్‌ మహావిషము నాహారించె హేలాగతి\న్‌.
242
వ. అయ్యవిరళ గరళ దహన పాన సమయంబున. 243
మ. కదలం బాఱవు పాఁపపేరు లొడల\న్‌, ఘర్మాంబుజాలంబు పు
ట్టదు, నేత్రంబులు నెఱ్ఱగావు, నిజ జూటార్ధేంద్రుఁడు\న్‌ గందఁడు\న్‌,
వదనాంభోజము వాడ దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
బదిలుండై కడిసేయుచోఁ దిగుచుచో భక్షింపుచో మ్రింగుచో\న్‌.
244
క. ఉదరము లోకంబులకును
సదనంబగు టెఱిఁగి శివుఁడు చటుల విషాగ్ని\న్‌
గుదురుకొనఁ గంఠబిలమునఁ
బదిలంబుగ నిలిపె సూక్ష్మ ఫలరసము క్రియ\న్‌.
245
క. మెచ్చిన మచ్చిక గలిగిన
నిచ్చిన నీవచ్చుఁ గాక యిచ్చ నొరులకుం
జిచ్చుఁ గడిఁ గొనఁగ వచ్చునె
చిచ్చఱ చూపచ్చుపడిన శివునకుఁ దక్క\న్‌.
246
ఆ. హరుఁడు గళమునందు హాలాహలము వెట్టఁ
గప్పు గలిగి తొడవు కరణి నొప్పె
సాధురక్షణంబు సజ్జనునకు నెన్న
భూషణంబు గాదె భూవరేంద్ర!
247
వ. తదనంతరంబ. 248
క. గరళంబుఁ గంఠబిలమున
హరుఁడు ధరించుటకు మెచ్చి 'యౌ నౌ' ననుచు\న్‌
హరియు విరించియు నుమయును
సురనాథుఁడు బొగడిరంత సుస్థిరమతితో.
249
క. హాలాహల భక్షణ కథ
హేలాగతినైన విన్న నెలమిఁ బఠింప\న్‌
వ్యాళానల వృశ్చికముల
పాలై చెడరెట్టి జనులు భయవిరహితులై.
250
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )