ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౮
పాలకడలిలో నైరావతాదులు జనియించుట
వ. మఱియు నా రత్నాకరంబు సురాసురులు ద్రచ్చు నెడ. 251
క. తెల్లని మేనును నమృతము
జిల్లున జల్లించు పొదుఁగు శతశృంగములు\న్‌
బెల్లుగ నర్థుల కోర్కులు
వెల్లిగొలుపు మొదవు పాలవెల్లిం బుట్టె\న్‌.
252
ఆ. అగ్నిహోత్రి యనుచు నా సురభిని దేవ
మునులు పుచ్చుకొనిరి ముదముతోడ
విబుధ సంఘములకు వెరవుతో నధ్వర
హవులు వెట్టుకొఱకు నవనినాథ!
253
వ. మఱియు నా జలరాశియందు. 254
క. సచ్చంద్రపాండురంబై
యుచ్చైశ్శ్రవ మనఁగ దురగ ముదధి జనించె\న్‌
బుచ్చికొనియె బలిదైత్యుం
డిచ్చఁ గొనండయ్యె నింద్రుఁ డీశ్వరశిక్ష\న్‌.
255
క. ఒఱపగు నురమును పిఱుఁదును
నెఱిదోఁకయు ముఖముసిరియు నిర్మలఖురముల్‌
కుఱుచచెవులుఁ దెలికన్నులుఁ
దఱచగు కందంబు చూడఁదగు నా హరికి\న్‌.
256
వ. అంత నా పాలకుప్పయందు. 257
క. దంత చతుష్టాహతి శై
లాంతంబులు విఱిగిపడఁగ నవదాత కుభృ
త్కాంతంబగు నైరావణ
దంతావళ ముద్భవించె ధరణీనాథా!
258
క. తడలేని నడపువడి గల
యొడలును బెను నిడుదకరము నురుకుంభములు\న్‌
బెడఁగై యువతుల మురిపెపు
నడతలకు\న్‌ మూలగురువన\న్‌ గజ మొప్పె\న్‌.
259
వ. మఱియు నత్తరంగిణీవల్లభు మథింపు నయ్యెడ. 260
తే. ఎల్ల ఋతువులయందు నెలరారి పరువమై
యింద్రు విరులతోఁట కేపు దెచ్చి
కోరి వచ్చువారి కోర్కుల నీనెడు
వేల్పుమ్రాను పాలవెల్లిఁ బుట్టె.
261
వ. మఱియునుం గొండకవ్వంబునం గడలి మథింప నప్సరోజనంబు జనించె. అంత. 262
క. క్రొక్కారు మెఱుఁగు మేనులుఁ
గ్రిక్కిరిసిన చన్నుఁగవలుఁ గ్రిస్సిన నడుముల్‌
బిక్కటిలి యున్న తుఱుములుఁ
జక్కని చూపులును దివిజసతులకు నొప్పె\న్‌.
263
వ. మఱియు నా రత్నాకరంబునందు సుధాకరుం డుద్భవించి, విరించి యనుమతంబునఁ దన యథాస్థానంబునం బ్రవర్తించుచుండె. అంత. 264
క. తొలుకారు మెఱుఁగు కైవడి
తళతళ యని మేను మెఱయ ధగధగ యనుచు\న్‌
గలుముల నీనెడు చూపుల
చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టె నృపా!
265
సీ. పాలమున్నీటిలోపలి మీఁది మీఁగడ మిసిమి జిడ్డునఁజేసి మేనువడసి
క్రొక్కారుమెఱుఁగుల కొనల తళుక్కుల మేనిచేగల నిగ్గుమెఱుఁగు చేసి
నాఁడునాఁటికిఁ బ్రోది నవకంపుఁ దీఁగెల నునుఁబోద నెయ్యంబు నూలుకొలిపి
క్రొవ్వారు కెందమ్మి కొలఁకులఁ బ్రొద్దునఁ బొలసిన వలపులఁ బ్రోదివెట్టి
 
తే. పసిఁడిచంపకదామంబు బాగుఁ గూర్చి వ్రాలు క్రొన్నెల చెలువున వాఁడి దీర్చి,
జాణతనమునఁ జేతుల జిడ్డు విడిచి నలువ యీ కొమ్మ నొగిఁ జేసినాఁడు నేఁడు.
266
క. కెంపారెడు నధరంబును
జంపారెడి నడుము సతికి శంపారుచుల\న్‌
సొంపారు మోముఁ గన్నులు
బెంపారుచు నొప్పుఁ గొప్పుఁ బిఱుదును గుచముల్‌.
267
వ. అని జనులు పొగడుచుండ. 268
సీ. తరుణికి మంగళస్నానంబు సేయింతుమని పెట్టె నింద్రుఁ డనర్ఘమైన
మణిమయపీఠంబు మంగళవతులైన వేలుపుగరితలు విమల తోయ
పూర్ణంబులై యున్న పుణ్యాహకలశంబు లిడిరి పల్లవముల నిచ్చె భూమి
కడిమిగోవులు పంచగవ్యంబులను నిచ్చె మలసి వసంతుఁడు మధువు నొసఁగె
 
తే. మునులుఁ గల్పంబుఁ జెప్పిరి మొగిలుగములు పణవ గోముఖ కాహళ పటహ మురజ
శంఖ వల్లకి వేణు నిస్వనము నిచ్చె, పాడి రాడిరి గంధర్వపతులు సతులు.
269
క. పండితసూక్తుల తోడుతఁ
దుండంబులు సాఁచి తీర్థతోయములెల్ల\న్‌
గుండముల ముంచి దిగ్వే
దండంబులు జలకమార్చెఁ దరుణీమణికి\న్‌.
270
సీ. కట్టంగ పచ్చని పట్టుపుట్టము దోయి ముదితకుఁ దెచ్చి సముద్రుఁడిచ్చె
మత్తాళినికరంబు మధు వాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చెఁ
గాంచన కేయూర కంకణ కింకిణీ కటకాదులను విశ్వకర్మ యిచ్చె
భారతి యొక మంచి తారహారము నిచ్చెఁ బాణిపద్మము నిచ్చెఁ బద్మభవుఁడు
 
ఆ. కుండలివ్రజంబు కుండలముల నిచ్చె శ్రుతులు భద్రమైన నుతులు సేసె
నెల్లలోకములకు నేలికసానివై బ్రతికె దనుచు దిశలు పలికె నధిప!
271
వ. మఱియును. 272
సీ. పలుకుల నమృతంబు చిలుక నెవ్వానితో భాషించు నతఁడె పో బ్రహ్మ యనఁగ
నెలయించి కెంగేల నెవ్వని వరియించె వాఁడె లోకములకు వల్లభుండు
మెయిదీఁగె నెవ్వని మేనితోఁ గదియించె వాఁడె పో పరమ సర్వజ్ఞమూర్తి
నెలఁతుక యెప్పుడు నివసించు నేయింట నాయిల్లు పరమగు నమృతపదము
 
ఆ. నెలఁత చూపు వాఱు నెచ్చోటి కచ్చోటు జిష్ణు ధనద ధర్మ జీవితంబు
కొమ్మ పిన్ననగవు గురుతరదుఃఖ నివారణంబు సృష్టికారణంబు.
273
వ. మఱియు నక్కొమ్మ నెమ్మనంబున. 274
సీ. భావించి యొకమాటు బ్రహ్మాండమంతయు నాటల బొమ్మరిల్లని తలంచుఁ
బోలించి యొకమాటు భువనంబులన్నియుఁ దన యింటిలో దొంతులని తలంచుఁ
బాటించి యొకమాటు బ్రహ్మాది సురలను దన యింటిలో బొమ్మలని తలంచుఁ
గొనకొని యొకమాటు కుంభినీచక్రంబు నలవడ బొమ్మపీఁటని తలంచు
 
ఆ. సొలసి యొక్కమాటు సూర్యేందురోచుల నచటి దీపకళికలని తలంచు
భామ యొక్కమాటు భారతీదుర్గల నాత్మసఖు లటంచు నాదరించు.
275
వ. తదనంతరంబ. 276
ఆ. చంచరీక నికర ఝంకార నినదంబు
దనరు నుత్పలముల దండఁ బట్టి
మేఘకోటి నడిమి మెఱుఁగుఁ బుత్తడి మాడ్కి
సురల నడుమ నిల్చె సుందరాంగి.
277
క. ఆ కన్నులు నా చన్నులు
నా కురు లా పిఱుఁదు నడుము నా ముఖ మా న
వ్యాకారముఁ గని వేల్పులు
చీకాకునఁ బడిరి కలఁగి శ్రీహరి దక్క\న్‌.
278
వ. అట్లు నిలిచి, దశదిశలం బరివేష్టించియున్న యక్ష రక్ష స్సిద్ధ సాధ్య దివిజ గరుడ గంధర్వ చారణ ప్రముఖ యూధంబులం గనుంగొని, యప్పురాణ ప్రౌఢ కన్యకా రత్నంబు దన మనంబున నిట్లని వితర్కించె. 279
సీ. ఐదువనై యుండ నలవడ దొకచోట నొకచోట సవతితో నోర్వరాదు
తగ నొకచోట సంతత వైభవంబుగా దొకచోట వేఁడిమి నుండఁబోల
దొకచోటఁ గరుణలే దొక్కింత వెదకిన నొకచోట డగ్గఱి యుంట బెట్ట
నెఱయంగ నొకచోట నిలుకడ చాలదు చర్చింప నొకచోట జడత గలదు
 
ఆ. కొన్నిచోట్లు కామగుణ గరిష్ఠంబులు క్రోధసంయుతములు కొన్ని యెడలు
కొన్ని మోహలోభ కుంఠితంబులు కొన్ని ప్రమద మత్సరానుభావకములు.
280
వ. అని సకల సత్పురుష జనన వర్తనంబులు మానసించి పరిహరించి. 281
సీ. అమర ముత్తైదువనై యుండవచ్చును వరుసకు సవతు లెవ్వరును లేరు
వెలయంగ నశ్రాంత విభవ మీతని యిల్లు శృంగారచందన శీతలుండు
గలఁగఁడెన్నఁడు శుద్ధ కారుణ్యమయమూర్తి విమలుండు గదిసి సేవించవచ్చు
నెఱి నాడి తిరుగఁడు నిలుకడ గలవాఁడు సకలకార్యములందు జడత లేదు
 
ఆ. సాధురక్షకుండు షడ్వర్గ రహితుండు నాథుఁ డయ్యెనేని నడప నోపు
నితఁడె భర్త యనుచు నింతి సరోజాక్షుఁ బుష్పదామకమునఁ బూజఁ సేసె.
282
క. ఇందీవర దామమున ము
కుందునిఁ బూజించి తనకుఁ గూడి వసింప\న్‌
మందిరముగఁ దద్వక్షము
నంద సలజ్జాసుదృష్టి నాలోకించె\న్‌.
283
ఆ. మోహరుచులవలన ముద్దియ తలయెత్తు
సిగ్గువలన బాల శిరమువంచు
నింతి వెఱఁగువలన నెత్తదు వంపదు
తనదు ముఖము ప్రాణదయితుఁ జూచి.
284
క. హరి సూచిన సిరి చూడదు
సిరి చూచిన హరియుఁ జూడ సిగ్గును బొందు\న్‌
హరియును సిరియునుఁ దమలో
సరిచూపులఁ జూడ మరుఁడు సందడి వెట్టె\న్‌.
285
చ. జగముల తండ్రియై దనరు శౌరి జగంబుల తల్లి నిందిరం
దగ నురమందుఁ దాల్చె నటఁ దత్కరుణారసదృష్టిచేఁ బ్రజల్‌
మగుడఁగఁ దొంటిభంగి నతిమంగళ సాధిపతిత్వ సంపద\న్‌
నెగడిన లోకముల్‌ గని రనేకశుభంబులఁ బొంది రత్తఱి\న్‌.
286
వ. అటమున్న యబ్ధిరాజు దనయందు నున్న యమూల్యంబైన కౌస్తుభంబు పేరిటి యనర్ఘ మణిరాజంబు నయ్యంబుజాక్షునకు సమర్పించిన దానిఁ దన వక్షస్స్థలంబున ధరించె. అప్పు డయ్యాదిలక్ష్మియు శ్రీవత్సకౌస్తుభ వైజయంతీ వనమాలికాది తార హారాలంకృతంబైన పుండరీకాక్షు వక్షస్స్థలంబున వసియించె. నయ్యవసరంబున. 287
శా. మ్రోసె\న్‌ శంఖ మృదంగ వేణు రవముల్‌ మున్నాడి పెంజీఁకటుల్‌
వాసె\న్‌ నర్తన గానలీలల సురల్‌ భాసిల్లిరార్యుల్‌ జగ
ద్వాసుల్‌ విష్ణుని బ్రహ్మ రుద్ర ముఖరుల్‌ దల్లింగమంత్రంబులం
బ్రాసక్తి\న్‌ వినుతించి రుల్లసిత పుష్పశ్రేణి వర్షింపుచు\న్‌.
288
క. ఆ పాలవెల్లికూఁతురు
తీపులఁ జూపులను దోఁగి తిలకించి బ్రజల్‌
చేపట్టిరి సంపదలను
బ్రాపించెను మేలు జగము బ్రతికె నరేంద్రా!
289
క. పాలేటిరాచ కన్నియ
మేలారెడు చూపు లేక మిడుమిడు కంచుం
జాలిం బురబురఁ బొక్కుచుఁ
దూలిరి రక్కసులు కీడు తోఁచిన నధిపా!
290
వ. వారిధిఁ దరుఁవగ నంతట, వారుణి యను నొక్కకన్య వచ్చిన నసురుల్‌ వారిజలోచను సమ్మతి, వారై కైకొనిరి దాని వారిజనేత్రి\న్‌. 291
వ. మఱియుఁ దరువం దరువ నప్పయోధిరాశియందు. 292
సీ. తరుణుండు దీర్ఘదోర్దండుండు కంబుకంధరుఁడు పీతాంబరధారి స్రగ్వి
లాలిత భూషణాలంకృతుం డరుణాక్షుఁ డున్నతోరస్కుఁ డత్యుత్తముండు
నీల కుంచితకేశ నివహుండు జలధర శ్యాముండు మృగరాజ సత్త్వశాలి
మణికుండలుఁడు రత్నమంజీరుఁ డచ్యుతు నంశాంశ సంభవుం డమలమూర్తి
 
ఆ. భూరి యాగభాగ భోక్త ధన్వంతరి యనఁగ నమృతకలశ హస్తుఁ డగుచు
నిఖిల వైద్యశాస్త్ర నిపుణుఁ డాయుర్వేది వేల్పువెజ్జు కడలి వెడలివచ్చె.
293
వ. తదనంతరంబ. 294
ఆ. అతనిచేత నున్న యమృతకుంభము సూచి
కెరలు వొడిచి సురలు కికురువెట్టి
పుచ్చుకొనిరి యసుర పుంగవులెల్లను
మాఱులేని బలిమి మానవేంద్ర!
295
వ. వెండియు. 296
ఆ. చావులేని మందు చక్కఁగ మనకబ్బె
ననుఁచు గడవ యసురు లాచికొనిన
వెఱచి సురలు హరికి మొఱలు వెట్టిరి సుధా
పూర్ణఘటము పోయెఁ బోయె ననుచు.
297
శ్రీవిష్ణుమూర్తి మోహినీస్వరూపంబు నొందుట
వ. ఇట్లు శరణాగతులైన వేల్పుల దైన్యంబు వొడగని, భృత్యుజన కామదుండగు నప్పరమేశ్వరుండు మీరలు దుఃఖింప వలవదు. ఏను నా మాయాబలంబునం జేసి మీ యర్థంబు మరల సాధించెద. అని పలికె. తత్‌ సమయంబున నయ్యమృత పూరంబు నేముం ద్రావుదు మని తమకించు దైత్యదానవ జనంబుల లోపల నమంగళంబగు కలి సంభవించిన కతంబునఁ, బ్రబలులగు రక్కసులు విలోకించి, సత్రయాగంబునందు నడచు చందంబునఁ దుల్యప్రయాస హేతువులగు సురలును సుధాభాగంబున కర్హులగుటం బంచి కుడుచుట కర్తవ్యంబు. ఇది సనాతన ధర్మంబగుటం జేసి యయ్యమృతకుంభంబు విడువుండు అని, దుర్జనులగు నిశాచరులు జాతిమత్సరులై తమవారల వారింపుచున్న సమయంబున. 298
తే. ఒకనిచేత నుండ నొకఁడు బలిష్ఠుఁడై
పుచ్చికొనిన వానిఁ బొదుగఁ బట్టి
యంతకంటె నధికుఁ డమృతకుంభము నెత్తి
కొంచుఁ బాఱెఁ బరులు గుయ్యిడంగ.
299
వ. అంత. 300
సీ. మెత్తని యడుగుల మెఱుగారు జానువు లరఁటికంబముల దోయైన తొడలు
ఘనమగు జఘనంబు కడు లేఁతనడుమును బల్లవారుణకాంతి పాణియుగముఁ
గడు దొడ్డపాలిండ్లుఁ గంబుకంఠంబును బింబాధరముఁ జంద్రబింబ ముఖముఁ
దెలి గన్నుఁగవయును నళికుంతలంబులు బాలేందుసన్నిభ ఫాలతలము
 
తే. నమరఁ గుండల కేయూరహార కంకణాదు లేపార మంజీరనాద మొప్ప
నల్ల నవ్వులఁ బద్మదళాక్షుఁ డసురపతుల నణఁగింప నాఁడురూపంబుఁ దాల్చి.
301
వ. అయ్యవసరంబున జగన్మోహనాకారంబున. 302
సీ. పాలిండ్లపైనున్న పయ్యెద జాఱించు జాఱించి మెల్లనఁ జక్క నొత్తుఁ
దళ్కు తళ్కను గండఫలకంబు లొలయించు నొలయించి కెంగేల నుజ్జగించుఁ
గడు మెఱుంగులువాఱు కడకన్ను లల్లార్చు నల్లార్చి ఱెప్పల నండ గొలుపు
సవరని దరహాస చంద్రికఁ జిలికించుఁ జిలికించి కెమ్మోవిఁ జిక్కుపఱుచు
 
తే. దళిత ధమ్మిల్ల కుసుమగంధమ్ము నెఱపుఁ గంకణాది ఝణంకృతుల్‌ గడలుకొలుపు
నొడలికాంతులు పట్టులే కులుకఁబాఱు సన్న వలిపంపుఁ బయ్యెద చౌకళింప.
303
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )