ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౯
వ. ఇవ్విధంబున నక్కపట యువతీరత్నంబు జగన్మోహన దేవతయునుం బోలె, నెమ్మొగంబు దావికి మత్తిల్లిన తేఁటి మొత్తంబులం గెలిచి, చిగురుజొంపంబుల నెడ గలుగఁ జడియుచు మురియుచుండ రాక్షసవరులు గనుంగొని. 304
సీ. ఔఁ గదే లావణ్య మౌఁ గదే మాధుర్య మౌఁ గదే సతి! నవయౌవనాంగి!
యెటనుండి వచ్చితి వేమి యిచ్ఛించెదు నీ నామ మెయ్యది నీరజాక్షి!
యమర గంధర్వ సిద్ధాసుర చారణ మనుజకన్యలకు నీ మహిమ గలదె
ప్రాణ చిత్తేంద్రియ పరిమాణ దాయియై నిర్మించెఁ బో! విధి నిన్నుఁ గరుణ
 
తే. వనిత! కశ్యపు సంతతివార మేము భ్రాతలము సురల కే మిద్ధపౌరుషులము
జ్ఞాతులకు మాకు నేకార్థ సంగతులకు బాలు దీరని యర్థంబు పంచి యిమ్ము.
305
క. సభయై యుండెద మిందఱ
మభయంబున వచ్చుకొలఁది నమృతంబును నీ
విభరాజగమన! తప్పక
విభజింపు వివక్షపక్ష విరహమతివై.
306
వ. అని మంత్రించిన దైత్యులం గని, మాయాయువతి రూపుండగు హరి తన వాఁడి చూపుటంపరల వలన వారల తాలుముల నగలించి చిఱునగవు లెగయ మొగమెత్తి యిట్లనియె. 307
క. సుందరులగు పురుషులఁ గని
పొందెడు నాయందు బుద్ధి పుట్టెనె మీకు\న్‌
బృందారక రిపులారా!
చెందరు కామినుల విశ్వసింపరు పెద్దల్‌.
308
క. పలుకులు మధు రసధారలు
దలఁపులు నానాప్రకార దావానలముల్‌
సెలుములు సాలావృకములు
చెలువల నమ్మంగ వేదసిద్ధాంతములే.
309
క. నా నేర్పుకొలఁది మీకును
మానుగ విభజించి యిత్తు మానుఁడు శంక\న్‌
గానిం డనవుడు నిచ్చిరి
దానవు లమృతంపుఁగడవఁ దరుణీమణికి\న్‌.
310
క. ఆ శాంతాలోకనములు
నా శీతల భాషణములు నా లాలితముల్‌
రాశిపరంపర లగుచును
పాశములై వారినోళ్ళు బంధించె నృపా!
311
వ. ఇట్లు సుధాకలశంబు చేత నందుకొని, మందస్మిత భాషణంబుల సుందరీరూపుండగు ముకుందుండు, మేలు కీడనక నేను బంచియిచ్చిన తెఱంగున నంగీకరించుట కర్తవ్యంబు అనవుడు నగుంగాక యని, సురాసుర దైత్యదానవ సమూహం బుప వసించి, కృతస్నానులై, హోమంబు లాచరించి, విప్రులకు గో భూ హిరణ్య దానంబులు సేసి, తదాశీః ప్రవచనంబులు గైకొనిఁ ధవళ పరిధానులై, గంధ మాల్య ధూప దీపాలంకృతంబగు కనక రత్నశాలా మధ్యంబునఁ, బ్రాగగ్ర కుశ పీఠంబులం బూర్వదిశాభిముఖులై, పంక్తులు గొనియున్న సమయంబున. 312
క. శ్రోణీభర కుచయుగభర
వేణీభరములను డస్సి వివిధాభరణ
క్వాణ యయి యువిద వచ్చెను
బాణిసరోజమున నమృత భాండముఁ గొంచు\న్‌.
313
క. భాసుర కుండల భాసిత
నాసా ముఖ కర్ణ గండ నయనాంచలయై
శ్రీసతి యగు సతిఁ గని దే
వాసురయూధంబు మోహమందె నరేంద్రా!
314
వ. అప్పుడు. 315
క. అసురుల కమృతము వోయుట
పొసఁగదు పాములకుఁ బాలు పోసిన మాడ్కి\న్‌
దొసఁగగు నంచును వేఱొక
దెసనుం గూర్చుండఁ బెట్టె దేవాహితుల\న్‌.
316
వ. ఇట్లు రెండు పంక్తులుగా నేర్పఱించి. 317
సీ. వేగిరపడకుఁడీ వినుఁడు దానవులార! తడవుసేయక వత్తు దైత్యులార!
యటు చక్కఁ గూర్చుండుఁడని కన్నులల్లార్చి చనుఁగవ పయ్యెదఁ జాఱఁ దిగిచి
వదినెమఱందుల వావులు గల్పించి మర్మంబు లెడలించి మఱుఁగు సేసి
మెల్లని నగవుల మేనులు మఱపించి కడు జాణమాటలఁ గాకుపఱిచి
 
ఆ. యసురవరుల నెల్ల నణకించి సురలను దడవు సేయవలదు ద్రావుఁడనుచు
వచ్చుకొలఁది నమృతవారి విభాగించెఁ దరుణి దివిజులెల్లఁ దనిసి పొగడ.
318
వ. అయ్యవసరంబున. 319
సీ. మనకు వేల్పులకును మారాటములు రాక పంచిపెట్టెద నని పణఁతి పూనెఁ
దా నేల తప్పును దప్పదు తరళాక్షి గాక రమ్మనుచును గణఁకఁ బిల్వ
మఱుమాట లాడదో మఱి చూడకుండునో చనుఁగవ గప్పునో చాలు ననుచు
నొండాడ కలుగుచు నొక్కింత సొలయునో మనయెడఁ గందునో మగువయనుచు
 
ఆ. నెలఁత చూడ్కిగముల నీరై కలంగుచుఁ బ్రణయభంగ భీతిబద్ధులగుచు
నూరకుండ్రి గాని యువిద! తే తెమ్మని యడుగఁజాలరైరి యసురవరులు.
320
వ. అప్పుడు. 321
మ. అమరవ్రాతములోనఁ జొచ్చి దివిజుండై రాహు పీయూషపా
నము సేయం గని చంద్రభాస్కరులు సన్నల్‌ సేయ నారాయణుం
డమరారాతిశిరంబు చక్రహతిఁ దున్మాడె\న్‌ సుధాసిక్తమై
యమరత్వంబునుఁ జెందె మూర్ధము తదన్యాంగంబు నేలంబడె\న్‌.
322
ఆ. అజుఁడు వానిశిరము నంబరవీథిని
గ్రహము సేసి పెట్టి గారవించె
వాఁడు పర్వములను వైరంబు దప్పక
భానుచంద్రములను బట్టుచుండు.
323
క. ఒక బొట్టు జిక్కకుండఁగ
సకల సుధారసము నమర సంఘంబులకుం
బ్రకటించి పోసి హరి దన
సుకరాకృతిఁ దాల్చె నసురశూరులు బెగడ\న్‌.
324
దేవాసుర యుద్ధము
మ. అమరుల్‌ రక్కసులుం బ్రయాస బల హేత్వర్థాభిమానంబుల\న్‌
సములై లబ్ధవికల్పులైరి సురలు\న్‌ సంశ్రేయసంయుక్తులై
రమరారుల్‌ బహుదుఃఖము గనిరి తా మత్యంత దోర్గర్వులై
కమలాక్షు\న్‌ శరణంబు వేఁడని జనుల్‌ కల్యాణసంయుక్తులే.
325
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )