ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౧౦
క. దానవు లమృతము ద్రావం
బూని పయోరాశిఁ ద్రచ్చి పొగిలిన మాడ్కి\న్‌
శ్రీనాథ పరాఙ్ముఖులగు
హీనులు వొందంగఁ జాల రిష్టార్థముల\న్‌.
326
క. శోధించి జలధి నమృతము
సాధించి నిలింపవైరి చక్షుర్గతుల\న్‌
రోధించి సురల కిడి హరి
బోధించి ఖగేంద్రు నెక్కిపోయె నరేంద్రా!
327
క. శుద్ధులగు సురల కమృతము
సిద్ధించిన నసురవరులు సిడిముడి పడుచు\న్‌
గ్రుద్ధులు నానాయుధ స
న్నద్ధులునై యుద్ధమునకు నడిచిరి బలిమి\న్‌.
328
క. ధన్యులు వైరోచని శత
మన్యు ప్రముఖులు మదాభిమానులు తమలో
నన్యోన్యరణము బాహా
సిన్యాసంబులును బేర్చి చేసిరి కడిమి\న్‌.
329
మ. అరుదై కామగమై మయాసురకృతంబై లోకితాలోక్యమై
వరశస్త్రాస్త్రసమేతమై తరళమై వైహాయసంబై మహా
సుర యోధాన్వితమైన యానమున సంశోభిల్లెఁ బూర్ణేందు సు
స్థిర కాంతి\న్‌ బలి చామర ధ్వజ చమూ దీప్తస్థితి\న్‌ ముందట\న్‌.
330
వ. మఱియు, నముచి, శంబర, బాణ, ద్విమూర్ధ, కాలనాభ, శకుని, నికుంభ, కుంభ, అయోముఖ, ప్రహేతి, హేతి, భూతసంతాప, హయగ్రీవ, కపిల, మేఘదుందుభి, మయ, త్రిపురాధిప, విప్రచిత్తి, విరోచన, వజ్రదంష్ట్ర, తారక, అరిష్ట, అరిష్టనేమి, శుంభ, నిశుంభ, శంకు, శిరోముఖ ప్రముఖులును, పౌలోమ కాలకేయులును, నివాతకవచ ప్రభృతులును, దక్కిన దండయోధులునుం గూడుకొని, యరదంబులం, దురంగంబుల, మాతంగంబుల, హరిణంబుల, హరి కిరి కీట జలచరంబులను, శరభ మహిష గవయ ఖడ్గ గండభేరుండ చమరీ జంబుక శార్దూల గో వృషాది మృగంబులను, గంక గృధ్ర కాక కుక్కుట బక శ్యేన హంసాది విహంగంబులను, దిమి తిమింగిలాది జలచరంబులను, నరులను, నసుర సురనికర వికృత విగ్రహ రూపంబులగు జంతువులను నారోహించి, తమకు నడియాలంబులగు గొడుగులు, పడగలు, జోడులు, కైదువులు, పక్కెరలు, బొమిడికంబులు మొదలగు పోటుము ట్లాయితంబుగఁ గైకొని, వేఱువేఱు మొనలై, విరోచన నందనుండగు బలి ముందట నిలువంబడిరి. దేవేంద్రుఁడు నైరావణారూఢుండై, వైశ్వానర వరుణ వాయు దండధరా ద్యనేక నిర్జరవాహినీ సందోహంబులును, దాను నెదురుపడి, పిఱుతివియక మోహరించె. అట్లు సంరంభ సన్నాహ సముత్సాహంబుల రెండు దెఱుంగుల వారుం బోరాడు వేడుకల మీఁటగు మాటల సందడింపుచున్న సమయంబున. 331
సీ. వజ్ర దంష్ట్రాంచిత వ్యజనంబులును బర్హ చామరంబులు సితచ్ఛత్రములును,
జిత్రవర్ణ ధ్వజచేలంబులును వాత చలితోత్తరోష్ణీష జాలములును
జప్పుళ్ళ నెసఁగు భూషణ కంకణంబులుఁ జండాంశు రోచుల శస్త్రములును
వివిధ ఖేటకములు వీరమాలికలును బాణపూర్ణములైన తూణములును
 
ఆ. నిండి పెచ్చు రేఁగి నిర్జరాసురవీర సైన్యయుగ్మకంబు చాల నొప్పె
గ్రాహతతులతోడఁ గలహంబునకు వచ్చు సాగరముల భంగి జనవరేణ్య!
332
క. భేరీ భాంకారంబులు
వారణ ఘీంకారములును వర హరి హేషల్‌
భూరి రథనేమి రవములు
ఘోరములై పెల్లగించెఁ గులశైలముల\న్‌.
333
వ. ఇవ్విధంబున నుభయ బలంబులు మోహరించి, బలితో నింద్రుండును, దారకునితో గుహుండును, హేతితో వరుణుండును, బ్రహేతితోడ మిత్రుండును, గాలనాభుని తోడ యముండును, మయునితో విశ్వకర్మయు, త్వష్టతో శంబరుండును, సవిత తోడ విరోచనుండును, పరాజిత్తుతో నముచియు, వృషపర్వునితో నశ్వినీదేవత లును, బాణాది బలిపుత్ర శతంబుతో సూర్యుండును, రాహువుతో సోముండును, బులోముతో ననిలుండును, నిశుంభ శుంభులతో భద్రకాళీదేవియును, జంభుని తోడ వృషాకపియును, మహిషునితో విభావసుండును, బ్రహ్మపుత్రులతోడ నిల్వల వాతాపులును, గామదేవునితోడ దుర్మర్షణుండును, మాతృగణముతోడ నుత్కలుండును, శుక్రునితోడ బృహస్పతియును, నరకునితో శనైశ్చరుండును, నివాత కవచులతో మరుత్తులును, గాలకేయులతోడ వసువులును నమరులును, గ్రోధవశ పౌలోములతో రుద్రవిశ్వేదేవగణంబులును, నివ్విధంబునఁ గలిసి పెనంగిఁ, ద్వంద్వయుద్ధంబు సేయుచు, మఱియు రథికులు రథికులను, బదాతులు పదాతులను, వాహనారూఢులు వాహనారూఢులం దాఁకి, సింహనాదంబులు సేయుచు, నట్టహాసంబు లిచ్చుచు, నాహ్వానంబు లొసంగుచు, నన్యోన్య తిరస్కారంబులు సేయుచు, బాహునాదంబుల విజృంభించుచుఁ, బెను బొబ్బల నుబ్బిరేఁగుచు, హుంకరింపుచు, నహంకరింపుచు, ధనుర్గుణంబులఁ డంకరింపుచు, శరంబుల నాఁటింపుచుఁ, బరశువుల నఱుకుచు, జక్రంబులం జెక్కుచు, శక్తులం దునుముచుఁ, గశలం బెట్టుచుఁ, గుఠారంబులం బొడుచుచుఁ, గదల నడచుచుఁ, గరంబులం బొడుచుచుఁ, గరవాలంబుల వ్రేయుచుఁ, బట్టసంబుల నొంచుచుఁ, బ్రాసంబులం దెంచుచుఁ, బాశంబులఁ గట్టుచు, బరిఘంబుల మొత్తుచు, ముసలంబుల మోఁదుచు, ముద్గరంబులఁ జదుపుచు, ముష్టివలయంబుల ఘట్టింపుచుఁ, దోమరంబుల నుఱుముచు, శూలంబులఁ జిమ్ముచు, నఖంబులం జీరుచుఁ, దరు శైలంబుల రువ్వుచు, నుల్ముకంబులం జూడుచు, నిట్లు బహు విధంబులం గలహ విహారంబులు సలుపు నవసరంబున, భిన్నంబులైన శిరంబులును, విచ్ఛిన్నంబులైన కపాలంబులును, వికలంబులైన కపోలంబులును, జిక్కులువడిన కేశబంధంబులును, భగ్నంబులైన దంతంబులును, గృత్తంబులైన భుజంబులును, ఖండితంబులైన కరంబులును, విదళితంబులైన మధ్యంబులును, వికృతంబులైన వదన బింబంబులును, వికలంబులైన నయనంబులును, వికీర్ణంబులైన కర్ణంబులును, విశీర్ణంబులైన నాసికలును, విఱిగిపడిన యూరుదేశంబులును, వితథంబులైన పదంబులును, జినిఁగిన కంకటంబులును, వ్రాలిన కేతనంబులును, గూలిన ఛత్రంబులును, మ్రొగ్గిన గజంబులును, నుగ్గైన రథంబులును, నుఱుమైన హయంబులును, జిందఱ వందఱలైన భటసమూహంబులును, బ్రాణంబులఁ బొరలెడు మేనులును, నుబ్బి యాడెడు భూతంబులును, బాఱెడు రక్త ప్రవాహంబులును, గట్టలు గొన్న మాంసంబులును, నెగసి తిరిగెడు కళేబరంబులును, గలకలంబులు సేయు కంక గృధ్రాది విహంగంబులునై యొప్పు నప్పో రతిఘోరంబయ్యె. అప్పుడు. 334
శా. నాకాధీశుఁ బదింట మూఁట గజము న్నాల్గింట గుఱ్ఱంబుల
న్నేకాస్త్రంబున సారథిం జొనిపె దైత్యేంద్రుండు వీఁక\న్‌ వియ
ల్లోకాధీశుఁడు ద్రుంచె నన్నిటినిఁ దోడ్తో నన్ని భల్లంబుల\న్‌
రాకుండ\న్‌ రిపువర్గముం దునిమె గీర్వాణుల్‌ నుతింప\న్‌ వెస\న్‌.
335
సీ. తన తూపులన్నియుఁ దరమిడి శక్రుండు నఱికిన జోడు విన్ననువు మెఱసి
బలి మహాశక్తిఁ జేపట్టిన నదియును నతఁడు ఖండించె నత్యద్భుతముగ
మఱి ప్రాస శూల తోమరములు గైకొన్నఁ దోడ్తోన నవియునుఁ దునిమివైచె
నంతటఁ బోక యెయ్యది వాఁడు సంధించెఁ దొడరి తా నదియును దుమురుసేసె
 
ఆ. నసురభర్త విరథుఁడై పోయి పగఱకుఁ గానఁబడక వివిధ కపటవృత్తి
నేర్పు మెఱసి మాయ నిర్మించె మింటను వేల్పుగములు సూచి వెఱఁగుపడఁగ.
336
వ. ఇట్లు దానవేంద్రుని మాయావిశేష విధానంబున సురానీకంబులపైఁ బర్వతంబులు వడియె. దావాగ్ని దందహ్యమాన తరు విస్ఫులింగంబులు గురిసె. శిఖిశిఖాసారంబులు గప్పె. మహోరగ దందశూకంబులు గఱచె. వృశ్చికంబులు మీటె. వరాహ వ్యాఘ్ర సింహంబులు కదిసి, విదళింపం దొరఁకొనియె. వనగజంబులు మట్టి మల్లాడం జొచ్చె. శూలహస్తులు, దిగంబరులునై, బలురక్కసులు శతసహస్ర సంఖ్యలు భేదన చ్ఛేదన భాషణంబు లాడందొడంగిరి. వికృతవదనులు గదాదండధారులు నాలంబిత కేశభారులునై, యనేక రాక్షసవీరులు "పోనీకు పోనీకుఁడు, తును ముండని" వెనుతగిలిరి. వర్ష గంభీర నిర్ఘాత సమేతంబులైన జీమూత సంఘాతంబులు, వాతాహతంబులై యుప్పతిల్లి, నిప్పుల కుప్పలు, మంటల ప్రోవులుం గురిసె. మహాపవన విజృంభితంబైన కార్చిచ్చు ప్రళయానలంబు చందంబునం దరికొనియె. ప్రచండ ఝంఝానిలప్రేరిత సముత్తుంగ తరంగావర్త భీషణంబైన మహార్ణవంబు, చెలియలికట్ట దాఁటి వెల్లివిరిసినట్లయ్యె. ఆ సమయంబునఁ బ్రళయ కాలంబునుం బోలె మిన్ను మన్ను రేయుంబగ లని యెఱుంగరాదయ్యె. అయ్యవసరంబున. 337
క. ఆ యసురేంద్రుని బహుతర
మాయాజాలంబులకును మాఱెఱుఁగక వ
జ్రాయుధ ముఖరాదిత్యు ల
పాయంబునుఁ బొంది చిక్కువడిరి నరేంద్రా!
338
వ. అప్పుడు. 339
క. ఇయ్యసురల చేఁజిక్కితి
మెయ్యది దెరు వెందుఁజొత్తు మిటు వొలయఁ గదే
యయ్యా! దేవ! జనార్దన!
కుయ్యో! మొఱ్ఱో! యటంచుఁ గూ యిడిరమరుల్‌.
340
వ. అట్లు మొఱ యిడు నవసరంబున. 341
మ. విహగేంద్రాసనరూఢుఁడై మణిరమా విభ్రాజితోరస్కుఁడై
బహుశస్త్రాస్త్ర రథాంగ సంకలితుఁడై భాస్వత్కిరీటాది దు
స్సహుఁడై నవ్యపిశంగ చేలధరుఁడై సంఫుల్ల పద్మాక్షుఁడై
విహితాలంకృతితోడ మాధవుఁడుఁ దా వేంచేసె నచ్చోటికి\న్‌.
342
చ. అసురుల మాయ లన్నియును నబ్జదళాక్షుఁడు వచ్చినంతట\న్‌
గసిబిసియై నిరర్థమయి గ్రక్కునఁ బోయెను నిద్రనొంది సం
తసమున మేలుకొన్న గతిఁ గాంచి చెలంగిరి వేల్పులందఱుం
బసచెడ కేల యుండు హరిపాద పరిస్మృతి సేయ నాపదల్‌.
343
వ. అయ్యెడ. 344
ఆ. కాలనేమి ఘోర కంఠీరవము నెక్కి
తార్క్ష్యుశిరము శూలధారఁ బొడువ
నతని పోటుముట్టు హరి కేల నంకించి
దానఁ జావఁబొడిచె దానవునిని.
345
క. పదపడి మాలి సుమాలులు
బెదరించినఁ దలలు ద్రుంచెఁ బృథు చక్రహతి\న్‌
గదఁగొని గరుడుని ఱెక్కలు
చెదరించిన మాల్యవంతు శిరము\న్‌ వ్రేసె\న్‌.
346
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )