ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౧౧
వ. ఇట్లు పరమపురుషుండగు హరి కరుణా పరత్వంబునఁ బ్రత్యుపలబ్ధమనస్కులయిన వరుణ వాయు వాసవ ప్రముఖులు పూర్వంబున నెవ్వరెవ్వరితోఁ గయ్యంబు సేయుదురు, వారు వారలం దలపడి నొప్పించిరి. అయ్యవసరంబున. 347
క. బాహుబలంబున నింద్రుఁడు
సాహసమున బలిని గెలువ సమకట్టిన స
న్నాహమున వజ్ర మెత్తిన
'హా హా' నినదంబు సేసి రఖిలజనంబుల్‌.
348
వ. ఇట్లు సముద్యత భిదురహస్తుండై, యింద్రుఁడు తన పురోభాగంబునం బరాక్రమించుచున్న విరోచననందను నుపలక్షించి యిట్లనియె. 349
మ. జగతి\న్‌ వైరి మొఱంగి గెల్చుటదియు\న్‌ శౌర్యంబె ధైర్యంబె తా
మగవాఁడయ్యును దన్నుఁ దానెఱిఁగి సామర్థ్యంబునుం గల్గియు\న్‌
బగవానిం గని డాఁగెనేని మెయి సూపంజాలఁడేనిం గటా!
నగరే బంధులు, దిట్టరే బుధులు, కన్యల్‌ గూర్తురే దానవా!
350
శా. మాయల్‌ సేయఁగరాదు పో! నగవులే మాతోడి పోరాటముల్‌?
దాయా! చిక్కితి వ్రక్కలించెదఁ గన ద్దంభోళి ధారాహతి\న్‌
నీ యిష్టార్థము లెల్ల జూడుము వెస న్నీవారలం గూడుకో
నీ యాటోపము నిర్జరేంద్రుఁ డడఁచు\న్‌ నేఁ డాజిలో దుర్మతీ!
351
వ. అని పలికిన వజ్రితో విరోచననందనుండిట్లనియె. 352
శా. నీవే పోటరివే సురేంద్ర! తెగడ న్నీకేల గెల్పోటముల్‌
లేవే యెవ్వరిపాలఁ బోయినవి మేల్కీడుల్‌ విరించాదులు\న్‌
ద్రోవంజాలుదు రెవ్విధానమున సంతోషింప శోకింప నా
దైవం బేమి కరస్థలామలకమే దర్పోక్తులుం బాడియే.
353
ఆ. జయము లపజయములు సంపద లాపద
లనిల చలిత దీపికాంచలములు
చంద్రకళలు మేఘచయము తరంగలు
మెఱుఁగు లమరవర్య! మిట్టిపడకు.
354
వ. అని యిట్లాక్షేపించి. 355
క. వీరుఁడు దానవనాథుఁడు
నారసములు నింద్రు మేన నాఁటించి మహా
ఘోరాయుధ కల్పములగు
శూరాలాపములు సెవులఁ జొనిపె\న్‌ మరల\న్‌.
356
వ. ఇట్లు తథ్యవాదియైన బలిచే నిరాకృతుండై. 357
క. శత్రువు నాక్షేపంబునఁ
దోత్రాహత గజముభంగిఁ ద్రుళ్ళుచు బలి నా
వృత్రారి వీచి వైచిన
గోత్రాకృతి నతఁడు నేలఁ గూలె నరేంద్రా!
358
క. చెలికాని పాటు గనుఁగొని
బలిసఖుఁడగు జంభుఁ డతులబాహాశక్తి\న్‌
జెలితనము సాల నెఱపుచు
'నిలు నిలు' మని వీఁకఁ దాఁకె నిర్జరనాథు\న్‌.
359
క. పంచానన వాహనుఁడై
చంచ ద్గద జంభుఁ డెత్తి శైలారినిఁ దా
కించి సురేభంబును నొ
ప్పించి విజృంభించి యార్చి పేర్చెం గడిమి\న్‌.
360
క. వీఁక చెడి ఘన గదాహతిఁ
దోఁకయుఁ గదలింపలేక దుస్సహపీడ\న్‌
మ్రోఁకరిలఁబడియె నేలను
సోఁకోర్వక దిగ్గజంబు సుడిసుడి గొంచు\న్‌.
361
వ. అయ్యెడ. 362
క. సారథి వేయు హయంబుల
తే రాయితపఱిచి తేర దేవేంద్రుఁడు దా
నారోహించెను దైత్యుఁ డు
దారత మాతలిని శూలధారం బొడిచె\న్‌.
363
ఆ. శూలనిహతి నొంది స్రుక్కుచు నొచ్చిన
సూతు వెఱకు మంచు సురవిభుండు
వాని శిరము దునిమె వజ్రఘాతంబున
దైత్యసేన లెల్లఁ దల్లడిలఁగ.
364
చ. చని సురనాథుచేఁ గలన జంభుఁడు సచ్చుట నారదుండు చె
ప్పిన విని వాని భ్రాతలు గభీరబలాధికుఁ డా బలుండు పా
క నముచు లా పురందరునిఁ గాంచి ఖరోక్తులఁ దూలనాడుచు\న్‌
ఘన జలధారల న్నగము గప్పిన చాడ్పునఁ గప్పి రమ్ముల\న్‌.
365
సీ. విబుధలోకేంద్రుని వేయుగుఱ్ఱంబుల నన్ని కోలల బలుం డదర నేసె
నిన్నూట మాతలి నిన్నూట రథమును నారీతి నింద్రు ప్రత్యంగకముల
వేధించెఁ బాకుండు వింట వాఁ డస్త్రంబు లేయుట దొడుగుట యెఱుఁగరాదు
కనకపుంఖంబుల కాండంబు లొక పదియేనిఁట సముచియు నేసి యార్చె
 
ఆ. బలిమి నిట్లు ముగురు పగవాని రథసూత సహితు ముంచి రస్త్రజాలములను
వనజలోక సఖుని వానకాలంబున మొగులుగములు మునుఁగ మూఁగినట్లు.
366
వ. అయ్యవసరంబున. 367
మ. అమరారాతుల బాణజాలముల పాలై పోయితే చెల్లరే
యమరాధీశ్వర! యంచు భిన్నతరులై యంభోధిలోఁ జంచల
త్వమునం గ్రుంకు వణిగ్జనంబుల క్రియం దైత్యాధిపవ్యూహ మ
ధ్యమునం జిక్కిరి వేల్పు లందఱు విపద్ధ్వానంబుల\న్‌ జేయుచు\న్‌.
368
శా. ఓహో దేవతలార! కుయ్యిడకుఁ డే నున్నాఁడ నం చంబుభృత్‌
వాహుఁ డా శరబద్ధ పంజరము నంతం జించి తేజంబున\న్‌
వాహోపేత రథంబుతోడ వెలికి\న్‌ వచ్చెన్‌ నిశాంతోల్లస
న్మాహాత్మ్యంబునఁ దూర్పునం బొడుచు నా మార్తాండు చందంబున\న్‌.
369
వ. ఇట్లు వెలువడి. 370
చ. విఱిగినసేనఁ గాంచి సురవీరుఁ డొహో యని బిట్టు చీరి క్ర
మ్మఱఁ బురికొల్పి పాక బలమస్తకముల్‌ నిశితాస్త్రధారల
న్నెఱసిన తీక్ష్ణవజ్రమున నేలకు వ్రాల్చెను వాని చుట్టముల్‌
వెఱచిరి తచ్చమూపతులు విహ్వలులై చెడి పాఱి రార్తితో.
371
వ. అప్పుడు నముచి నిలువంబడి. 372
మ. తన చుట్టంబులఁ జంపె వీఁడనుచు నుద్యత్క్రోధ శోకాత్ముఁడై
కనకాంతంబును నశ్మసారమయము\న్‌ ఘంటాసమేతంబునై
జనదృగ్దుస్సహమైన శూలము నొగి\న్‌ సారించి వైచె\న్‌ సురేం
ద్రునిపై దీన హతుండ వౌ దని మృగేంద్రుం బోలి గర్జించుచు\న్‌.
373
శా. ఆకాశంబున వచ్చు శూలమును జంభారాతి ఖండించి నా
నా కాండంబుల వాని కంఠము దెగన్‌ దంభోళియున్‌ వైచె న
స్తోకేంద్రాయుధమున్‌ సురారిగళము\న్‌ ద్రుంపంగలేదయ్యె వాఁ
డాకంపింపక నిల్చె దేవవిభుఁ డత్యాశ్చర్యము\న్‌ బొందఁగ\న్‌.
374
వ. ఇట్లు నిలిచియున్న నముచిం గనుంగొని వజ్రంబు ప్రతిహతంబగుటకు శంకించి బలభేది తన మనంబున. 375
సీ. కొండల ఱెక్కలు ఖండించి వైచుచో వజ్రమెన్నఁడు నింత వాఁడి సెడదు
వృత్రాసురాదుల విదళించె నీ పవి తిరుగదెన్నఁడు పగదీర్చి కాని
యింద్రుఁడఁ గానొకో యేను దంభోళియుఁ గాదొకో యిది ప్రయోగంబు చెడెనొ
దనుజాధముఁడు మొనతాఁకు దప్పించెనో భిదురంబు నేఁడేల బెండువడియె
 
ఆ. ననుచు వజ్రి వగవ నార్ద్రశుష్కంబులఁ జావకుండఁ దపము సలిపె నీతఁ
డితర మెద్దియైన నింద్ర ప్రయోగింపు వైళ మనుచు దివ్యవాణి వలికె.
376
వ. ఇట్లుపదేశించిన దివ్యవాణి పలుకు లాకర్ణించి యింద్రుండు. 377
ఆ. ఆత్మబుద్ధిఁ దలఁచె నార్ద్రంబు శుష్కంబు
గాని సాధనంబు ఫేన మనుచు
నదియ వైచి దాన నమరులు మెచ్చంగ
నముచి శిరముఁ ద్రుంచె నాకవిభుఁడు.
378
వ. అయ్యవసరంబున. 379
సీ. పురుహూతు నగ్గించి పుష్పాంజలులు సేసి మునులు దీవించిరి ముదముతోడ
గంధర్వ ముఖ్యులు ఘనులు విశ్వావసుఁడును పరావసుఁడు నింపెనయఁ బాడి
రమరాంగనాజను లాడిరి దేవతా దుందుభులును మ్రోసె దురములోన
వాయు వహ్ని కృతాంత వరుణాదులును బ్రతిద్వంద్వుల గెల్చి రుద్దండవృత్తి
 
తే. నల్పమృగముల సింహంబు లట్ల తోలి రమరవర్యులు దనుజుల నదటువాయ
నజుఁడు పుత్తేర నారదుఁ డరుగుదెంచె దైత్య హరణంబు వారింప ధరణినాథ!
380
వ. వచ్చి సురలకు నారదుండిట్లనియె. 381
శా. సిద్ధించెన్‌ సురలార! మీ కమృతమున్‌ శ్రీనాథసంప్రాప్తులై
వృద్ధిం బొందితి రెల్లవారలును విద్వేషుల్‌ మృతింబొంది రీ
యుద్ధం బేటికి నింకఁ జాలుఁ బనిలే దోహో పురే యంచు సం
బద్ధాలాపము లాడి మాన్చె సురలం బాండవ్య వంశాగ్రణీ!
382
వ. ఇట్లు నారదవచన నియుక్తులై, రాక్షసులతోడి సంగ్రామంబు సాలించి, సకల దేవముఖ్యులునుం ద్రివిష్టపంబునకుం జనిరి. హతశేషులైన దైత్యదానవులు, విపన్నుండైన బలిం దోడ్కొని, పశ్చిమ శిఖరి శిఖరంబుఁ జేరిరి. విధ్వంసమాన కంధరులై, వినష్టదేహులగు యామినీచరుల నెల్లను శుక్రుండు మృతసంజీవని విద్య పెంపునంజేసి బ్రతికించె. బలియును భార్గవానుగ్రహంబున విగత శరీర వేదనుండై, పరాజితుండయ్యును, లోకతత్త్వ విచక్షణుండగుటం జేసి దుఃఖింపక యుండె. అని చెప్పి రాజునకు శుకుండిట్లనియె. 383
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )