ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౧౨
సీ. కైలాసగిరిమీఁద ఖండేందుభూషణుం డొకనాఁడు కొలువున నున్నవేళ
నంగనయై విష్ణుఁ డసురుల వంచించి సురలకు నమృతంబు చూఱలిడుట
విని దేవియును దాను వృషభేంద్రగమనుఁడై కడువేడ్క భూతసంఘములు గొలువ
మధుసూదనుండున్న మందిరంబున కేగి పురుషోత్తమునిచేతఁ బూజ లొంది
 
తే. తాను గూర్చుండి పూజించె దనుజవైరి కుశలమే మీకు మాకును గుశలమనుచు
మధుర భాషల హరిమీఁద మైత్రి నెఱపి హరుఁడు పద్మాక్షుఁ జూచి యిట్లనియెఁ బ్రీతి.
384
సీ. దేవ! జగన్మయ! దేవేశ! జగదీశ! కాల! జగద్వ్యాపకస్వరూప!
యఖిల భావములకు నాత్మయు హేతువునైన యీశ్వరుఁడ వాద్యంతములును
మధ్యంబు బయలును మఱి లోపలయు లేక పూర్ణమై భూరి సత్య
మానంద చిన్మాత్ర మవికార మాద్య మనన్య మశోకంబు నగుణ మఖిల
 
తే. సంభవ స్థితి లయముల సంగరహితమైన బ్రహ్మంబు నీవ నీ యంఘ్రియుగము
నుభయ సంగ విసృష్టులై యున్న మునులు కోరి కైవల్యకాములై కొల్తురెపుడు.
385
సీ. భావించి కొందఱు బ్రహ్మంబు నీవని తలపోసి కొందఱు ధర్మమనియుఁ
జర్చించి కొందఱు సదసదీశ్వరుఁడని సరవిఁ గొందఱు శక్తిసహితుఁడనియుఁ
జింతించి కొండఱు చిరతరుం డవ్యయుఁ డాత్మతంత్రుఁడు పరుం డధికుఁ డనియుఁ
దొడరి యూహింతురు తుది నద్వయ ద్వయ సదసద్విశిష్ట సంశ్రయుఁడ వీవు
 
తే. తలఁప నొక్కింత వస్తుభేదంబు గలదె కంకణాదుల పసిఁడి యొక్కటియ గాదె
కడలు వెక్కైన వార్ధి యొక్కటియ గాదె భేదమంచును నిను వికల్పింప వలదు.
386
సీ. యద్విలాసము మరీచ్యాదులెఱుంగరు నిత్యుఁడనై యున్న నేను నెఱుఁగ
నమ్మాయ నంధులై యమరాసురాదులు వనరెద రఁట యున్నవార లెంత
నే రూపమునఁ బొంద కేపారుదువు నీవు రూపివై సకలంబు రూపుసేయ
రక్షింపఁ జెఱుపఁ గారణమైన సచరాచరాఖ్యమై విలసిల్లు దంబరమున
 
తే. ననిలుఁ డేరీతి విహరించు నట్ల నీవు గలసి వర్తింతు సర్వాత్మకత్వ మొప్ప
జగములకు నెల్ల బంధమోక్షములు నీవ నీవ సర్వంబుఁ దలపోయ నీరజాక్ష!
387
మ. ఘనత న్నీ మగపోఁడుముల్‌ పలుమఱుం గన్నారము\న్‌ వీనుల\న్‌
నిను విన్నారము చూడ మెన్నఁడును మున్నీ యాఁడుచందంబు మో
హినివై దైత్యులఁ గన్నుఁబ్రామి యమృతం బింద్రాది దేవాళి కి
చ్చిన నీ రూపముఁ జూపుమా కుతుకము\న్‌ జిత్తంబునం బుట్టెడి\న్‌.
388
క. మగవాఁడవై జగంబులఁ
దగిలిచి చిక్కులను బెట్టు దంటవు నీకున్‌
మగువతనంబున జగములఁ
దగులముఁ బొందింప నెంతతడవు ముకుందా!
389
వ. అని పలుకుచున్న శూలపాణిచే నపేక్షితుండై, విష్ణుండు భావగంభీరంబగు నవ్వు నివ్వటిల్ల నవ్వామదేవున కిట్లనియె. 390
శా. శ్రీకంఠా! నిను నీవ యేమఱకుమీ చిత్తంబు రంజించెద\న్‌
నాకద్వేషుల డాఁగురించుటకునై నాఁ డేను గైకొన్న కాం
తాకారంబు జగన్నిమజ్జనము నీవై చూచెదేఁ జూపెద\న్‌
గైకో నర్హము లండ్రు కాముకులు సంకల్ప ప్రభూతార్థముల్‌.
391
శ్రీహరి తన మోహినీస్వరూపముచేత నీశ్వరుని మోహింపఁజేయుట
వ. అని పలికి, కమలలోచనుం డంతర్హితుండయ్యె. అయ్యుమాసహితుండైన భవుండు విష్ణుం డేడఁ బోయెనో, యెందుఁ జొచ్చెనో, యని దిశదిశలుం గలయ నవలోకించుచుండం దన పురోభాగంబున. 392
సీ. ఒక యెలదోఁటలో నొక వీథి నొక నీడఁ గుచకుంభములమీఁది కొంగు దొలఁగ
గబరికాబంధంబు గంపింప నుదుటిపైఁ జికురజాలంబులు చిక్కువడఁగ
ననుమానమై మధ్య మల్లాడఁ జెక్కులఁ గర్ణ కుండలకాంతి గంతు లిడఁగ
నారోహభరమున నడుగులు దడఁబడఁ దృగ్దీప్తిసంఘంబు దిశలు గప్ప
 
తే. వామకరమున జాఱిన వలువఁ బట్టి కనక నూపురయుగళంబు ఘల్లనంగఁ
గంకణంబుల ఝణఝణత్కార మెసఁగ బంతిచే నాడు ప్రాయంపు టింతిఁ గనియె.
393
వ. కని, మున్ను మగువ మరగి సగమైన మగవాఁ, డ మ్మగువ వయో రూప గుణ విలాసంబులు తన్ను నూరింపం, గనుఱెప్ప వెట్టక తప్పక చూచి, మెత్తనైన చిత్తంబున. 394
శా. ఈ కాంతాజనరత్న మెవ్వరిదొకో యీ యాఁడురూపంబు ము
న్నే కల్పంబులయందుఁ గాన మజుఁడీ యింతి\న్‌ సృజింపంగఁ దా
లేకుం టెల్ల నిజంబు వల్లభత నీ లీలావతిం జేరఁగా
నే కాంతుండు గలండో క్రీడలను నా కీ యింతి సిద్ధించునే.
395
వ. అని మఱియుం జెఱకువిలుతుని కోలలు మేరమీఱి దఱుము, నెఱబిదురు వెఱఁగుపడం, దెఱవఁ దుఱిమిన తుఱుము బిగిముడి వదలి భుజముల మెడల నదరి చెదరిన కుఱులు నొసలి మృగమద తిలకంపు టసలు మసల, విసవిస నగు మొగము మెఱుంగులు దశదిశలం బసలుగొలుపఁ, జిఱునగవు మెఱయ, నునుఁజెమటఁ దడంబడి పులకలుగొన, హృదయానంద కందంబగు కందుకంబు కరారవిందంబునం దమర్చి, యక్కునఁ జేర్చి, చెక్కున హత్తించి, చుబుకంబు మోపి, చూచుకంబులం గదియించి, నఖంబుల మీటుచు, మెల్లమెల్లన గెల్లాడు కరకమలములఁ గనక మణివలయములు ఝణఝణ యనం, గుచకలశములు నొకటి నొకటి నొఱయ, నెడమ కుడినిం దడంబడఁ, గ్రమ్మన నెగురఁజిమ్ముచు, నెగురజిమ్మి, తనకుఁ దానె కొన్ని చిన్న పన్నిదంబులు చేసికొని, బడుగునడుము బెడసి వడవడ వడంక, నఱితి సరులు కలయంబడఁ దిరుగుచుఁ బెనకువలు గొనఁ, జెవుల తొడవుల రుచులు కటముల నటనములు సలుపఁ, బవిరి తిరిగి యొడియుచు, నొడిసి కెలంకులం జడియుచు, జడిసి జడను వడక, వలువ నెలవువదలి దిగంబడం, గటిస్థలంబునం గాంచీ కనకమణి కింకిణులు మొరయఁ, జరణకటకములు ఘల్లుఘల్లుమనంగ, మితిదప్పిన మోహాతిరేకం బుప్పొంగ, వెనుకొని యుఱికి పట్టుచుఁ, బట్టి పుడమిఁ బడవైచి, పాటు వెంటనే మింటి కెగసినం, గెంటక కరంబునం గరంబు దిరంబై పలుమఱు నెగయ నడుచుచు, నెగయునెడ దిగంబడు తఱిని, నీలంపు మెఱుంగునిగ్గు సోగపగ్గంబుల వలలు వైచి, రా దిగిచినపగిది వెనుకొనంగ, విలోకనజాలంబులు నిగిడించుచు, మగిడించుచుఁ, గరలాఘవంబున నొకటి, పది, నూఱు, వేయునేసి, నేర్పు వాటించుచు, నరుణ చరణకమల రుచుల నుదయశిఖరి శిఖర తరణి కరణి సేయుచు, ముఖచంద్ర చంద్రికలు మండలంబులు గావించుచు, నెడనెడ నురోజదుర్గ చేలాంచలంబుఁ జక్కనొత్తుచుఁ, గపోలఫల కాలోల ఘర్మజల బిందుబృందంబుల నఖాంతంబుల నోసరింపుచు, నధర బింబారుణ సంభ్రాంత సమాగత రాజకీరంబులం జోపుచు, ముఖసరోజ పరిమళాసక్త మత్త మధుపంబుల నివారింపుచు, మందగమనాభ్యాస కుతూహలాయత్త మరాళ యుగ్మంబులకుం దలంగుచు, విలాసవీక్షణానందిత మయూరమిథునంబులకు నెడఁగలగుచుఁ, బొదరిండ్ల యీఱంబులకుం బోక మలంగుచుఁ, గరకిసలయాస్వాద కాముక కలకంఠ దంపతులకు దూరింపుచుఁ, దీఁగె యుయ్యలల నూఁగుచు, మాధవీమంటపంబు లెక్కుచుఁ, గుసుమ రేణుపటలంబుల గుబ్బళ్లువ్రాకుచు, మకరందస్యంద బిందు బృందం బుత్తరింపుచుఁ, గృతకశైలంబులఁ నారోహింపుచుఁ, బల్లవపీఠంబులం బరిశ్రమంబు పుచ్చుచు, లతాసౌధభాగంబులఁ బొడసూపుచు, నున్నత కేతకీ స్తంభంబుల నొరగుచుఁ, బుష్పదళ ఖచిత వాతాయనంబులఁ దొంగిచూచుచు, గమల కాండ పాలికల నాలంబించుచుఁ, జంపకగేహళి మధ్యంబుల నిలువంబడుచుఁ, గదళికాపత్ర వాతంబుల నొఱయు పరాగనిర్మిత సాలభంజికానివహంబుల నాదరింపుచు, మణికుట్టిమంబుల మురియుచుఁ, జంద్రకాంత వేదికల నెలయుచు, రత్న పంజర శారికానివహంబులకుం జదువులు చెప్పుచుఁ, గోరినక్రియం జూచుచుఁ, జూచినక్రియ మెచ్చుచు, మెచ్చినక్రియ వెఱఁగుపడుచు, వెఱఁగుపడినక్రియ మఱచుచు, మఱవక యేకాంతంబగు నవ్వనాంతంబున ననంతవిభ్రమంబుల జగ న్మోహినియై విహరింపుచున్న సమయంబున. 396
ఆ. వాలుఁగంటి వాఁడి వాలారుఁ జూపుల
శూలి ధైర్యమెల్ల గోలుపోయి
తఱలి యెఱుకలేక మఱచె గుణంబుల
నాలి మఱచె నిజ గణాలి మఱచె.
397
వ. అప్పుడు. 398
ఆ. ఎగురవైచి పట్ట నెడలేమిఁ జేదప్పి
వ్రాలుబంతిఁ గొనఁగ వచ్చునెడనుఁ
బడఁతి వలువ వీడి పడియె మారుతహతిఁ
జంద్రధరుని మనము సంచలింప.
399
మ. రుచిరాపాంగిని వస్త్రబంధనపర\న్‌ రోమాంచ విభ్రాజిత\న్‌
గుచభారానమితం గరద్వయపుటీ గూఢీకృతాంగిం జల
త్కచబంధం గని మన్మథాతురత నాకంపించి శంభుండు ల
జ్జ చలింపం దన కాంత సూడఁ గదిసెం జంద్రాస్య కేల్దమ్మికి\న్‌.
400
ఆ. పదము సేరవచ్చు ఫాలాక్షుఁ బొడగని
చీర వీడిపడిన సిగ్గుతోడ
మగువ నగుచుఁ దరులమాటున డాఁగెను
వేల్పుఱేఁడు నబలవెంటఁ బడియె.
401
మ. ప్రబలోద్యత్‌ కరిణిం గరీంద్రుఁడు రమింప\న్‌ వచ్చులీల\న్‌ శివుం
డబలా! "పోకుము పోకువే" యనుచు డాయం బాఱి కెంగేలఁ దాఁ
గబరీబంధము వట్టి సంభ్రమముతోఁ గౌఁగిళ్ళ నూరార్చె నం
త బహిఃప్రక్రియ నెట్టకేనిఁ గదియం దద్బాహు నిర్ముక్తయై.
402
సీ. వీడి వెన్నున నాడు వేణీభరంబుతో జఘనభారాగత శ్రాంతితోడ
మాయావధూటియై మఱలి చూచుచుఁ బాఱు విష్ణు నద్భుతకర్ము వెంటఁ దగిలి
యీశాను మఱల జయించె మరుం డనఁ గరిణి వె\న్‌చను కరి కరణిఁ దాల్చి
కొండలు నేఱులు కొలఁకులు వనములు దాఁటి శంభుఁడు సనం దన్మహాత్ము
 
తే. నిర్మలామోఘ వీర్యంబు నేలమీఁదఁ బడిన చోటెల్ల వెండియుఁ బైఁడి యయ్యె
ధరణి వీర్యంబు వడఁ దన్నుఁ దా నెఱింగి దేవమాయా జడత్వంబుఁ దెలిసె హరుఁడు.
403
క. జగదాత్మకుఁడగు శంభుఁడు
మగిడెను హరి నెఱిఁగి తనదు మాహాత్మ్యమున\న్‌
విగత త్రపుఁడై నిలచెను
మగువతనం బుడిగి హరియు మగవాఁడయ్యె\న్‌.
404
ఆ. కాము గెలువవచ్చు గాలారి గావచ్చు
మృత్యుజయము గలిగి మెఱయవచ్చు
నాఁడువారి చూపు టంపఱ గెలువంగ
వశముగాదు త్రిపురవైరి కైన.
405
వ. ఇట్లు పురుషాకారంబు వహించిన హరి హరున కిట్లనియె. 406
సీ. నిఖిలదేవోత్తమ! నీ వొక్కరుఁడు దక్క నెవ్వఁడు నా మాయ నెఱుఁగనేర్చు
మానినియైన నా మాయచే మునుఁగక ధృతి మోహితుండవై తెలిసి తీవు
కాలరూపంబునఁ గాలంబుతోడ నా యందును నీ మాయ యధివసించు
నీ మాయ నన్ను జయింపనేరదు నిజ మకృతాత్ములకు నెల్ల ననుపలభ్య
 
తే. మిపుడు నీ నిష్ఠపెంపున నెఱిఁగితనుచు సత్కరించిన సఖ్యంబు చాల నెఱపి
దక్షతనయ గణంబులుఁ దన్నుఁ గొలువ భవుఁడు విచ్చేసెఁ దగ నిజభవనమునకు.
407
శా. పారావారముఁ ద్రచ్చుచో గిరి సముద్వాహార్థమై కచ్ఛపా
కారుండైన రమేశువర్తనము నాకర్ణింపఁ గీర్తింప సం
సారాంభోనిధిలో మునుంగు కుజనుల్‌ సంశ్రేయముం బొంది వి
స్తారోదార సుఖంబుఁ జెందుదురు తథ్యం బింతయు\న్‌ భూవరా!
408
మ. ఎలమిన్‌ దైత్యుల నాఁడురూపమున మోహింపించి పీయూషముం
జలితాపన్నులకు\న్‌ సురోత్తములకుం జక్కన్‌ విభాగించి ని
ర్మలరేఖ\న్‌ విలసిల్లు శ్రీవిభునిఁ దన్మాయావధూ రూపముం
దలఁతు\న్‌ మ్రొక్కుదు నాత్మలోన దురిత ధ్వాంతోగ్ర దీపంబుగ\న్‌.
409
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )