ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౧౩
వ. అని చెప్పి శుకుండిట్లనియె. 410
తే. నరవరాధీశ! యిప్పుడు నడుచుచున్న
వాఁడు సప్తమమనువు వైవస్వతుండు
శ్రాద్ధదేవుం డనందగు జనవరేణ్య!
పదురు నందను లతనికిఁ బ్రకటబలులు.
411
వ. వార లిక్ష్వాకుండును, నభగుండును, ధృష్టుండును, శర్యాతియు, నరిష్యంతుండును, నాభాగుండును, దిష్టుండును, గరూశకుండును, వృషధ్రుండును, వసుమంతుండు ననువారు పదుగురు రాజులు. పురందరుఁ డనువాఁ డింద్రుండును, ఆదిత్య మరు దశ్వి వసు రుద్ర సంజ్ఞలం గలవారు దేవతలును, గౌతమ కశ్య పాత్రి విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ వసిష్ఠు లను వారు సప్తర్షులునై యున్నవారు. అందుఁ గశ్యపున కదితిగర్భంబున విష్ణుండు వామనరూపుండై జనియించి, యింద్రావరజుండయ్యె. ఇప్పుడేడు మన్వంతరంబులు సెప్పంబడియె. రాగల మన్వంతరంబులును, శ్రీహరి పరాక్రమంబునుఁ జెప్పెద. దత్తావధానుండవై వినుము. అని శుకుండిట్లనియె. 412
సీ. జననాథ! సంజ్ఞయు ఛాయయు ననువారు గల రర్కునకు విశ్వకర్మతనయ
లిరువురు వల్లభ లిటమున్న చెప్పితిఁ బరఁగఁ దృతీయయు బడబ యనఁగ
సంజ్ఞకు యముఁడును శ్రాద్ధదేవుండును యమునయుఁ బుట్టిరి హర్ష మెసఁగ
ఛాయకుఁ దపతియు సావర్ణియును శనైశ్చరుఁడును గలిగిరి సంవరుణుఁడు
 
తే. తపతి నాలిఁగఁ గైకొని తా వరించె నశ్వియుగళంబు బడబకు నవతరించె
వచ్చు నష్టమవసువు సావర్ణి వాఁడు తపము సేయుచున్నాఁడు ధరణినాథ!
413
క. ఒకపరి చూచిన వెండియు
నొకపరి చూడంగలేక యుండు సిరులకు\న్‌
నొకనొకని చేటువేళకు
నొకఁడొకఁడు మనుండు గాచియుండు నరేంద్రా!
414
వ. సూర్యసావర్ణి మన్వంతరంబున నతని తనయులు, నిర్మోహ విరజస్కాద్యులు రాజులును, సుతపో విరజామృత ప్రభు లనువారు దేవతలును గాఁగలరు. గాలవుండును, దీప్తిమంతుండును, బరశురాముండును, ద్రోణపుత్రుండగు నశ్వత్థామయుఁ, గృపుఁడును, మజ్జనకుండగు బాదరాయణుండును, ఋష్యశృంగుఁడు ననువారు సప్తర్షులయ్యెదరు. వారలిప్పుడు తమ తమ యోగబలంబులం జరియింపు చున్నవారు. విరోచననందనుండగు బలి యింద్రుండయ్యెడు. అని చెప్పి శుకుండిట్లనియె. 415
సీ. బలి మున్ను నాకంబు బలిమిమైఁ జేకొన్న వామనుండై హరి వచ్చి వేఁడఁ
బాదత్రయంబిచ్చి భగవన్నిబద్ధుఁడై సురమందిరముకంటె సుభగమైన
సుతలలోకంబున సుస్థితి నున్నాఁడు వెతలేక నిట మీఁద వేదగుహికి
నా సరస్వతికిఁ దా నట సార్వభౌముండు నాఁ బ్రభువై హరి నాకవిభునిఁ
 
ఆ. బదవిహీనుఁ జేసి బలిఁ దెచ్చి నిలుపును బలియు నిర్జరేంద్రు పదము నొందు
నింద్రపదము హరికి నిచ్చినకతమున దానఫలము చెడదు ధరణినాథ!
416
వ. అటమీఁదటి కాలంబున వరుణ నందనుండగు దక్షసావర్ణి తొమ్మిదవ మనువయ్యెడి. అతని కొడుకులు ధృతకేతు దీప్తకేతు ప్రముఖులు రాజులును, బర మరీచి గర్గాదులు నిర్జరులును, నద్భుతుం డనువాఁడింద్రుండును, ద్యుతిమత్ప్రభృతు లగువారలు ఋషులు నయ్యెదరు. అందు. 417
ఆ. దనుజహరణుఁ డంబుధార కాయుష్మంతు
నకు జనియించి రక్షణంబు సేయ
మూఁడు లోకములను మోదంబుతో నేలు
నద్భుతాఖ్య నొప్పు నమరవిభుఁడు.
418
వ. మఱియు, నుపశ్లోకసుతుండగు బ్రహ్మసావర్ణి దశమ మనువయ్యెడి. తత్పుత్రులు భూరిషేణాదులు భూపతులును, హవిష్మత్ప్రముఖులు మునులును, శంభుండను వాఁడింద్రుండును, విబుద్ధ్యాదులు నిర్జరులు నయ్యెదరు. అందు. 419
ఆ. విశ్వసృజుని యింట విభుఁడు విషూచికి
సంభవించు నంశ సహితుఁ డగుచుఁ
జెలిమి శంభుతోఁడ జేయు విష్వక్సేనుఁ
డనఁగ జగముఁ గాచు నవనినాథ!
420
వ. మఱియుం, దదాగమిష్యత్కాలంబున ధర్మసావర్ణి పదునొకొండవ మనువయ్యెడి. మనుతనూజులు, సత్యధర్మాదులు పదుండ్రు ధరణిపతులును, విహంగమ కామ గమన నిర్వాణరుచు లనువారు సురలును, వైధృతుండనువాఁ డింద్రుండు, నరుణాదులు ఋషులును నయ్యెదరు. అందు. 421
ఆ. అంబుజాత నేత్రుఁ డా సూర్యసూనుఁడై
ధర్మసేతు వనఁగ దగ జనించి
వైభవాఢ్యుఁ డగుచు వైధృతుఁ డలరంగఁ
గరుణఁ ద్రిజగములను గావఁగలఁడు.
422
వ. మఱియుం దద్భవిష్యత్సమయంబున భద్రసావర్ణి పండ్రెండవ మనువయ్యెడి. అతని నందనులు దేవవ దుపదేవ దేవజ్యేష్ఠాదులు వసుధాధిపతులును, ఋతుధాముం డనువాఁ డింద్రుండును, హరితాదులు వేల్పులును, దపోమూర్తి తప అగ్నీధ్రకాదులు ఋషులు నయ్యెదరు. అందు. 423
ఆ. జలజలోచనుండు సత్య తప స్సూనృ
తలకు సంభవించుఁ దనయుఁ డగుచు
ధరణిఁ గాచు నంచిత స్వధామాఖ్యుఁడై
మనువు సంతసింప మానవేంద్ర!
424
వ. మఱియుఁ దదేష్యత్కాలంబున నాత్మవంతుండగు దేవసావర్ణి పదమూఁడవ మనువయ్యెడి. మనుకుమారులు చిత్రసేన విచిత్రాదులు జగతీనాయకులు. సుకర్మ సుత్రామ సంజ్ఞలం గలవారు బృందారకులును, దివస్పతి యనువాఁ డింద్రుండును, నిర్మోహతత్త్వదర్శాద్యులు ఋషులు నయ్యెదరు. అందు. 425
ఆ. ధరణిదేవ! హోత్రదయితకు బృహతికి
యోగవిభుఁడు నాఁగ నుద్భవించి
వనజనేత్రుఁ డా దివస్పతి కెంతయు
సౌఖ్య మాచరించు జగతినాథ!
426
వ. మఱియు నచట వచ్చుకాలంబున నింద్రసావర్ణి పదునాల్గవ మనువయ్యెడి. మను నందనులు ఉరుగంభీర వస్వాదులు రాజులును, పవిత్ర చాక్షుషు లనువారు దేవ గణంబులును, శుచి యనువాఁ డింద్రుండును, నగ్ని రాహు శుచి శుక్ర మాగ ధాదులు ఋషులు నయ్యెదరు. అందు. 427
తే. తనర సత్రాయణునకు వితానయందు
భవము నొందెడి హరి బృహద్భానుఁ డనఁగ
విస్తరించుఁ గ్రియాతంతు విసరములను
నాకవాసులు ముదమొంద నరవరేణ్య!
428
క. జగదీశ! త్రికాలములును
బొగడొందు మనుప్రకారములు సెప్పఁబడె\న్‌
దగఁ బదునలువురు మనువులు
దెగ యుగములు వేయు నడువ దివ మజునకగు\న్‌.
429
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )