ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౧౪
వ. అనినఁ బరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె. 430
ఆ. ఈ పదంబులందు నీ మనుప్రముఖుల
నెవ్వ రనుపువార లేమి కతన
నధిక విభువులైరి హరి యేల జనియించె
నెఱుఁగ బలుకు మాకు నిద్ధచరిత!
431
వ. అనినం బారాశర్య కుమారుండిట్లనియె. 432
సీ. మనువులు మునులును మనుసుతు లింద్రులు నమరులు హరియాజ్ఞ నడఁగువారు
యజ్ఞాదు లందఱు హరి పౌరుషాకృతు లా మనువులు తత్సహాయశక్తి
జగములు నడుపుదు రొగి నాల్గుయుగముల కడపటఁ గాలసంగ్రస్తమైన
నిగమచయంబును నిజ తపోబలముల మరలఁ గాంతురు ఋషివరుల దొంటి
 
తే. పగిది ధర్మంబు నాలుగు పాదములను గలిగి వర్తించు మనువులు గమలనేత్రు
నాజ్ఞఁ దిరుగుదు రేలుదు రవనిపతులు జగతి భాగించి తమ తమ సమయములను.
433
వ. మఱియుం బ్రాప్తులైన వారల నింద్రపదంబులను, బహుప్రకారంబుల దేవపదంబులను హరి ప్రతిష్ఠించుచుండు. వారలు విహిత కర్మంబుల జగత్త్రయంబునుం బరి పాలింతురు. లోకంబులు సువృష్టులై యుండు. అందు. 434
సీ. యోగీశరూపుఁడై యోగంబు చూపును మౌనిరూపమునఁ గర్మంబు దాల్చు
సర్గంబుసేయుఁ బ్రజాపతి రూపుఁడై యింద్రుఁడై దైత్యుల నేపడంచు
జ్ఞానంబు నెఱిఁగించుఁ జతుర సిద్ధాకృతిఁ గాలరూపమునఁ బాకంబు సేయు
నానావిధాకార నామరూపంబులఁ గర్మలోచనులకుఁ గానఁబడఁడు
 
ఆ. చనిన రూపములును జను రూపములు నింకఁ జనఁగ నున్న రూపచయము నతఁడ
వివిధుఁడై యనేక వృత్తి వెలుంగును విష్ణుఁ డవ్యయుండు విమలచరిత!
435
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )