ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౧౫
వ. అనిన భూవరుండిట్లనియె. 436
వామన చరిత్ర ప్రారంభము
మ. బలి నంభోరుహనేత్రుఁ డేమి కొఱకై పాదత్రయి\న్‌ వేఁడె ని
శ్చలుఁడుం బూర్ణుఁడు లబ్ధకాముఁడు రమాసంపన్నుఁడై తాఁ బర
స్థలికి\న్‌ దీనునిమాడ్కి నేల చనియె\న్‌ దప్పేమియు\న్‌ లేక ని
ష్కలుషు\న్‌ బంధన మేల చేసెను వినం గౌతూహలం బయ్యెడి\న్‌.
437
వ. అనిన మునినందనుండిట్లనియె. 438
సీ. పురుహూతిచే నొచ్చి పోయి భార్గవులచే బలి యెట్టకేలకు బ్రతికి వారి
చిత్తంబు రాఁ గొల్చు శిష్యుఁడై వర్తింప వారు నాతని భక్తి వలన మెచ్చి
విశ్వజిద్యాగంబు విధితోడఁ జేయింప భవ్య కాంచన పట్టబద్ధ రథము
నర్కవాజులఁ బోలు హరులు కంఠీరవ ధ్వజము మహాదివ్య ధనువుఁ బూర్ణ
 
తే. తూణయుగళంబుఁ గవచంబుఁ దొలుత హోమపావకుండిచ్చె నమ్లాన పద్మమాల
కలుషహరుఁడగు తన తాత కరుణ నొసఁగె సోమసంకాశ శంఖంబు శుక్రుఁడిచ్చె.
439
వ. ఇవ్విధంబున. 440
క. పాణియు రథియుఁ గృపాణియు
దూణియు ధన్వియును స్రగ్వి తురగియు దేహ
త్రాణియు ధిక్కృత విమత
ప్రాణియు మణికనక వలయ పాణియు నగుచు\న్‌.
441
మ. పలు దానంబుల విప్రుల దనిపి తద్భద్రోక్తులం బొంది పె
ద్దలకు\న్‌ మ్రొక్కి విశిష్టదేవతల నంతర్భక్తిఁ బూజించి ని
ర్మలుఁ బ్రహ్లాదునిఁ జీరి నమ్రశిరుఁడై రాజద్రథారూఢుఁడై
వెలిఁగె\న్‌ దానవభర్త శైలశిఖరోద్ద్వేలద్దవాగ్ని ప్రభ\న్‌.
442
క. దండిత మృత్యు కృతాంతులు
ఖండిత సుర సిద్ధ సాధ్య గంధర్వాదుల్‌
పిండిత దిశు లమరాహిత
దండాధీశ్వరులు సములు దన్నుం గొలువ\న్‌.
443
క. చూపుల గగనము మ్రింగు
నేపున దివి భువియు నావ లీవల సేయ\న్‌
రూపించుచు దనుజేంద్రుఁడు
ప్రాపించెను దివిజ నగర పథము నరేంద్రా!
444
వ. ఇట్లు బలవంతుండగు బలి, సురేంద్రుని సాధింప సమకట్టి, దండగమనంబు సేసి నిడుద పయనంబులం జని చని. 445
మ. కనియె\న్‌ బుణ్యజనౌకము\న్‌ విగతరోగ స్వప్న పీడాన్నఖా
దన సంశోకముఁ బుష్ప పల్లవ ఫలోద్దామ ద్రుమానీకమున్‌
స్వనితోద్ధూత పతాకము\న్‌ బ్రవిచర ద్వైమానికానీకము\న్‌
ఘన గంగా సలిలైకము\న్‌ మఘవయుక్త శ్రీకము\న్‌ నాకము\న్‌.
446
వ. కని, రక్కసులఱేఁడు వెక్కసంబై చాల్పుగల వేల్పులనెలవు దరియంజొచ్చి, చెచ్చెర ముందటకుం జని చని, ముందట నెడపడక మొన మొగ్గ యిగురు చిగురు తలిరాకు జొంపంబు నన మొగుడుమొగ్గ యరవిరి నెఱవిరి గుత్తి పిందె పూఁప దోరగాయ పండు గెలలతండంబుల వ్రేఁగు లాఁగలేక, మూఁగి వీఁగి వ్రేఁకలగు మ్రాఁకుల ప్రోకలకుఁ బేటలగు పెందోఁటలును, తోఁటల గాటంబులై నివ్వటిల్లు మవ్వంపుఁ గ్రొవ్విరులకుఁ గవలు వివ్వక కసిమసలు గలిగి, ముసరి కొసరి పూని పాదుకొని తేనియ లాని, విసరు గలిగి, మసరు గవిసి, క్రొవ్వి, రిమ్మకొని, జుమ్ము జుమ్మంచు జంజాటించు తేఁటిదాటులును, దాఁటు వడక నాటుకొని, కూడి, జోడు వీడక, క్రొమ్మావుల కమ్మని కొమ్మల నిమ్ముల ముసరి, పసిమిగల కిసలయంబులు పొసఁగంగ మెసఁగి, కిసరువడక కసరుచెడి, బిట్టు రట్టడితనంబుల మించి కరాళించు కోయిలల మొత్తంబును, మొత్తంబులై చిత్తంబులు మత్తంబులుగఁ దత్తఱంబునం దీయని పండ్లకు గదియంబడి, కయ్యంబు సేసి, యేస రేగి, బేసంబులు గాసంబులు గొని, వాసికెక్కి, పలుబాసలాడు బహు ప్రకారంబులగు కీరంబులును, గీరంబులకు నలిగడచి, మింటనంట నెగసి, పెట్టలం బట్టి, చీరి, యిట్టట్టు చనక నెట్టుకొని, నెలవుల వ్రాలుచు, నింపుగల రవములం గలుగు కలరవంబులును, కలరవంబు లలరం, దొలంకుల కొలంకుల కెలంకులఁ గడంకలం బ్రియల నిడుకొని, క్రమ్మి, దొమ్మిచేసి, యెలదమ్మి తూఁడుల వాఁడు లగు చంచువులం జించి, మెక్కి, చొక్కి, రిక్కల మిక్కిలి కలకలపడుచు నలబలంబులు సేయు హంసంబులును, హంసరుచి జనిత వికసనముల వికవిక నగుచుం బస గలిగి, మిసమిస మెఱయు పసిఁడి కెందమ్ము లిందిరా మందిరంబుల చందంబు లగు కొలంకులును, గొలంకుల కరణిఁ దడసి, వడవడ వడంకుచు, నల్లిబిల్లులు గొని, సాఁగిన తీఁగెయిండ్ల గండ్ల యీఱములం దోరములు సెడి, పలువిరుల కమ్మవలపుల వ్రేఁగునం దూరలేక యీడిగలంబడు గాడ్పులును, గాడ్పులవలన నెగసి, గగనమున విరిసి, పలువన్నెలం జెన్నగు మేలుకట్టు పుట్టంబుల తెఱంగుల దట్టంబులైన కుసుమపరాగంబులును, బరాగంబుల సరాగంబు లగు వాగుల వంతల చెంతల గఱికజొంపంబుల లంపులు దిని, మంపులు గొని, గుంపులుగొని, నెమర్లు వెట్టుచు నొదువు గల పొదువులు గదల, వాడల జాడలం బరుగులిడు దూడల క్రీడల వేడుకలం గూడుకొని, యిళ్ళవాకిళ్ళకుంజేరి, పౌరుల కోరికల కనుసారిక లగుచు, నమృతంబు గురియు కామధేనువులును, గామధేనువులకు నిలువనీడ లగుచు, నడిగిన జనములకు ధనములు ఘనముగఁ బుడుకు కల్ప తరువులును, గల్పతరువుల పల్లవమంజరులఁ గుంజరులకు విఱిచి యిచ్చుచు, మచ్చికల కలిమిని మెచ్చుచు గృతక గిరుల చఱుల నడరు పడఁతుల నడలకు గురువులగు మత్తేభంబులును, నిభంబుల సరస నొరసికొని, వరుసఁ బరుసఁ దనము లెడలి సుకరములగు మకరతోరణ స్తంభంబులును, దోరణస్తంభంబుల చేరువ నిలిచి, చెఱకు విలుతుం దొర వెఱికినం బెడిదములగు నవకంపు మెఱుఁగు జిగురు టడిదముల తెఱంగున నిలుకడ సంపదలు గలుగు శంపల సొంపునం, గర చరణాది శాఖలం గల చంద్రరేఖల పోఁడిమిని, వాహిని గల మోహినీవిద్యల గ్రద్దన, చూపులం దీపు లొదవించుచు, మర్మకర్మంబుల యశంబుల వశంబు గలిగి, యనూనంబు లగు విమానంబు లెక్కి, చక్కవచ్చిన సచ్చరిత్రులకుం జెచ్చెర నెదురు సని, తూకొని, తోకొనిపోవు రంభాది కుంభికుంభ కుచల కలకలంబులును, గలహంస కారండవ కోక సారస బృందసుందర సుందరియు, నిందీవరారవిందనందదిందిందిరయు, నభంగయు, సభంగయు నగు గంగ నింగికిం బొంగి, మిగుల దిగులవడఁ బొగడ్తల కెక్కిన యగడ్తలును, నగడ్తల మిన్నేటి తేటనీట నీటు లీను పాటి సూటి చల్లులాటల మేటి కూటువలు గొనుచు నేచిన ఖేచరకన్యకా వారంబులును, వారవనితానుపూజిత దేహళీ పాటవంబులగు గోపుర కనక కవాటంబులును, గవాటవేదికా ఘటిత మణిగణ కిరణోదారంబులగు నింద్రనీల స్తంభ గంభీరతలును, గంభీర విమలకమలరాగ పాలికా మాలికావారంబు లగు చతుర్ద్వారంబులును, ద్వారదేశంబుల సావళ్ళం గావళ్ళుండి, ప్రొద్దులుపోక, రక్కసులవేల్పులు కయ్యంబుల నెయ్యంబులు సెప్పికొనుచున్న యస్త్ర శస్త్ర ధారులును, శూరులునైన మహా ద్వారపాలక వీరులును, వీరరసజలధి వేలాకారంబులయి, శుద్ధ స్ఫటిక బద్ధ మహోత్తాలంబులగు సోపాన సుకుమారంబులును, సుకుమార మహారజత ప్రదీపంబులగు వప్రంబులును, వప్రోపరి వజ్రకుడ్య శిరోభాగ చంద్రకాంత కాంత తరుణ హిమకర కిరణ ముఖరంబులగు సాలశిఖరంబులును, శిఖరస్తోమ ధామ నికృత్త తారకంబులును, దార తారమణి శిలాకార కఠోరంబు లగుచు, మిగుల గరిత యగు నగరిసిరి పెరిమ గల మగల మొగములు పొడగన, నిలుకడలకు నలువ నడిగికొని పడసిన పసిఁడితెర వలల వడువున బెడంగునం దోరంబులగు ప్రాకారంబులును, బ్రాకార కాంచనాంచిత యుద్ధసన్నద్ధ మహాఖర్వ గంధర్వవాహినీ పాలకంబులగు మరకతాట్టాలకంబులును, నట్టాలకోత్తుంగ వజ్రమయ స్తంభోదంచనంబులును, బరభట ప్రాణవంచనంబులును, సముదంచనంబులు నగు దంచనంబుల తుదలు రథంబుల యిరుసు లొరసికొనం గోట యీవలావల కావలిదివియల కరణి రుచిరము లగుచున్న దినకర హిమకర మండలంబులును, హిమకర మండలంబు నిద్దంపు టద్దంబని మూఁగి, తొంగిచూచుచు, నళికఫలకములఁ గులకములు గొను నలకములం దఱిమి, తిలకములం దెఱఁగు పఱచుకొని, సమయముల వెనుక నొదిగి, కదిసి, ముకురమునం బ్రతిఫలితులైన పతు లితరసతుల రతుల కనుమతులని, కలఁగి, తలఁగి చని, కాంతులకు సొలయు ముగుదలకు నేకాంతంబులై, గగనసముచ్ఛేదనంబులైన రాజ సౌధంబులును, సౌధంబుల సిరుల ముత్తియపు సరులతోడి నిబ్బరపు గుబ్బచన్నుల చెన్నులం బ్రక్కలం జుక్కల పదుపులుండ, మండిత సౌధశిఖరంబులకు శృంగారంబులైన భృంగారంబులును, భృంగారశయన జాలక డోలికా నిశ్శ్రేణికాది విశేషరమ్యంబులైన హర్మ్యంబులును, హర్మ్య కనకగవాక్ష రంధ్ర నిర్గత కర్పూర కుంకుమాగరు ధూప ధూమంబులును, ధూమంబులు జీమూత స్తోమంబులని ప్రేమంబున గొబ్బున గిబ్బటు పబ్బంబు లబ్బెనని, పురులుగొని, పురులు వన్నియల సిరులుగొనం గుటవిటపములం దటవట నటింపుచుఁ బలుకులు విరిసి, కికురువొడుచుచు, వలఱేని మఱుఁగుచదువుల టీకలనం, గేకలిడు నెమళ్ళును, నెమళ్ళ పురుల నారలు నారులగు విండ్ల నినదములను తలంపులఁ దోఁకలు వడసి, వీఁకలు మెఱసి, మూఁకలు గొని, దివి కెగిరి, రవికిం గవిసిన రాహువు క్రియం, దివిఁ దడఁబడు పడగలును, పడగలును గొడుగులును దమకు నాలంబులకు నడియాలంబులుగఁ దోరంబులైన సారంబుల బీరంబులు మెఱసి, బెబ్బులుల గ్రబ్బునం గరుల సిరుల, సింగంబుల భంగంబుల, శరభంబుల రభసంబుల, ధూమకేతువుల రీతుల వైరికిం జీరికిం గొనక, శంకలుడిగి, ఱంకెలిడుచు, లంకెలై లెక్కకు మిక్కిలగుచు, రక్కసుల చక్కటి యెక్కటి కయ్యముల దయ్యము లెఱుంగం దిరుగు వీరభటుల కదంబంబులును, గదంబ కరవాల శూలాదుల మెఱుంగులు మెఱుపుల తెఱంగుల దిశల చెఱంగులం దుఱంగలింప, నేమి నినదంబులు తుఱుములగు నుఱుములుగ, నడమొగుళ్ళ పెల్లునం, బ్రవర్షిత రథిక మనోరథంబులగు రథంబుల గములును, గములుగొని, గమనవేగముల వలన హరిహరుల నగి, గాలిం జాలింబడ గేలికొని, ఘనంబులగు మనంబులం దెగడి, నెగడు సురంగంబులగు తురంగంబులును, రంగదుత్తుంగ విశద మద కల కరి కటతట జనిత మదసలిల కణగణ విగణిత దశ శతనయన భుజ సరళ మిళిత లలిత నిఖిల దిగధిపతి శుభకర కర కనక కటక ఘటిత మణిసముదయ సముదిత రేణువర్గ దుర్గమంబులైన నిర్వక్ర మార్గంబులును, మార్గ స్థలోపరి గతాగత శతాయుతానేక గణనాతీత రోహణాచల తట విరాజమానంబులగు విమానంబులును, విమాన విహరమాణ సుందర సుందరీ సందోహ సంపాదిత భూరి భేరీ వీణా పణవ మృదంగ కాహళ శంఖాది వాదనానూన గాన సాహిత్య నృత్య విశేషంబులును, విశేష రత్నసంఘటిత శృంగార శృంగాటక వాటికాగేహ దేహళీప్రదీపంబులును, దీపాయమాన మానిత సభామంటప ఖచిత రుచిర చింతారత్నంబులునుం గలిగి, రత్నాకరంబునుం బోలె ననిమిష కౌశిక వాహినీ విశ్రుతంబై, శ్రుతివాక్యంబునుం బోలె నకల్మష సువర్ణ ప్రభూతంబై, భూతపతి కంఠంబునుం బోలె భోగిరాజకాంతంబై, కాంతాకుచంబునుం బోలె సువృత్తంబై, వృత్తజాలంబునుం బోలె సదా గురులఘు నియమాభిరామంబై, రామచంద్రుని తేజంబునుం బోలె ఖరదూషణాది దోషాచరానుపలబ్ధంబై, లబ్ధవర్ణ చరిత్రంబునుం బోలె విమలాంతరంగ ద్యోతమానంబై, మానధనుని నడవడియునుం బోలె సన్మార్గభాతి సుందరంబై, సుందరో ద్యానంబునుం బోలె రంభాంచితాశోక పున్నాగంబై, పున్నాగంబునుం బోలె సురభి సుమనోవిశేషంబై, శేషాహి మస్తకంబునుం బోలె నున్నత క్షమావిశారదంబై, శారదసముదయంబునుం బోలె ధవళజీమూత ప్రకాశితంబై, సితేతరాజినదానంబునుం బోలె సరస తిలోత్తమంబై, యుత్తమ పురుష వచనంబునుం బోలె ననేక సుధారస ప్రవర్షంబై, వర్షాదియునుం బోలె నుల్లసదింద్ర గోపంబై, గోపతి మూఁపురంబునుం బోలె విచక్షురార్యాలంకృతంబై, కృతార్థంబైన యమరావతి నగరంబు చేరం జని, కోటచుట్టునుం బట్టు గలుగ బలంబును జలంబుల విడియించి, పొంచి, మార్గంబు లెల్ల నరికట్టుకొని, యేమఱక యుండె. అంత. 447
క. మాయరు నగవులకును గను
మూయరు కాలంబుకతన ముదియరు ఖలులం
డాయరు పుణ్యజనంబులఁ
బాయరు సురరాజు వీటి ప్రమదాజనముల్‌.
448
వ. అప్పుడు. 449
క. దుర్భర దానవశంఖా
విర్భూత ధ్వనులు నిండి విబుధేంద్ర వధూ
గర్భములు పగిలి లోపలి
యర్భకతతు లావు రనుచు నాక్రోశించె\న్‌.
450
వ. అంత. 451
సీ. బలి వచ్చి విడియుట బలభేది వీక్షించి గట్టిగాఁ గోటకుఁ గాపువెట్టి
దేవవీరులుఁ దాను దేవతామంత్రిని రప్పించి సురవైరిరాకఁ జెప్పి
ప్రళయానలుని భంగి భాసిల్లుచున్నాఁడు ఘోరరాక్షసులను గూడినాఁడు
మన కోడి చని నేఁడు మరల వీఁడేతెంచె నేతపంబున వీని కింత వచ్చె
 
ఆ. నీ దురాత్మకునకు నెవ్వఁడు తోడయ్యె నింక వీని గెల్వ నేది త్రోవ
యేమి చేయువార మెక్కడి మగఁటిమి యెదురు మోహరింప నెవ్వఁ డోపు.
452
క. మ్రింగెడు నాకాశంబును
బొంగెడు నమరాద్రికంటెఁ బొడవై వీఁడు\న్‌
మ్రింగెడు కాలాంతకు క్రియ
భంగించును మరలఁబడ్డఁ బంకజగర్భు\న్‌.
453
క. ఈరాదు రాజ్య మెల్లను
బోరాదు రణంబు సేయఁ బోయితి మేని\న్‌
రారాదు దనుజుచేతను
జారా దిటమీఁద నేమి జాడ మహాత్మా!
454
వ. అనిన సురరాజునకు నాచార్యుండిట్లనియె. 455
సీ. వినవయ్య! దేవేంద్ర! వీనికి సంపద బ్రహ్మవాదులు భృగుప్రవరు లర్థి
నిచ్చిరి రాక్షసు నెదురింప వారింప హరి యీశ్వరుఁడు దక్క నన్యజనులు
నీవును నీ సముల్‌ నీకంటె నధికులుఁ జాలరు రాజ్యంబు సాలు నీకు
విడిచిపోవుట నీతి విబుధనివాసంబు విమతులు నలఁగెడు వేళ సూచి
 
తే. మరలి మఱునాఁడు వచ్చుట మా మతంబు విప్రబలమున వీనికి వృద్ధివచ్చె
వారిఁ గైకొన కిటమీఁద వాఁడి చెడును దలఁగుమందాఁక రిపు పేరు తడవవలదు.
456
క. పరు గెలువవలయు నొండెను
సరి పోరఁగవలయు నొండెఁ జావలె నొండె\న్‌
సరి గెలుపు మృతియు దొరకమి
సరసంబుగ మున్నె తొలఁగి చనవలె నొండె\న్‌.
457
వ. అనినఁ గార్యకాల నిదర్శి యగు బృహస్పతి వచనంబులు విని, కామరూపులై దివిజులు త్రివిష్టపంబు\న్‌ విడిచి, తమతమ పొందుపట్లకుం జనిరి. బలియునుం బ్రతిభట వివర్జిత యగు దేవధాని నధిష్ఠించి, జగత్త్రయంబునుం దనవశంబు చేసికొని, విశ్వవిజయుండై, పెద్దకాలంబు రాజ్యంబు సేయుచుండె. శిష్యవత్సలులగు భృగ్వాదు లతనిచేత శతాశ్వమేధంబులు సేయించిరి. తత్కాలంబున. 458
శా. అర్థుల్‌ వేఁడరు దాతలుం జెడరు సర్వారంభముల్‌ పండుఁ బ్ర
త్యర్థుల్‌ లేరు మహోత్సవంబులను దేవాగారముల్‌ వొల్చుఁ బూ
ర్ణార్థుల్‌ విప్రులు వర్షముల్‌ గురియఁ గాలార్హంబులై ధాత్రికి\న్‌
సార్థంబయ్యె వసుంధరాత్వ మసురేంద్రాధీశు రాజ్యంబున\న్‌.
459
వ. అంత. 460
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )