ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౧౬
సీ. తన తనూజులప్రోలు దనుజులు గొనుటయు వేల్పు లెల్లను డాఁగ వెడలుటయును
భావించి సురమాత పరితాపమును బొంది వగ ననాథాకృతి వనరుచుండ
నాయమ్మ పెనిమిటి యగు కశ్యపబ్రహ్మ, మఱియొకనాఁడు సమాధి మాని
తన కుటుంబిని యున్న ధామంబునకు నేఁగి నాతిచే విహితార్చనములు వడసి
 
ఆ. వంది వ్రాలి కుంది వాడిన యిల్లాలి వదనవారిజంబు వడువుఁ జూచి
చేరఁ దిగిచి మగువ చుబుకంబు పుణుకుచు వారిజాక్షి యేల వగచె దనుచు.
461
వ. అమ్మహాత్ముండిట్లనియె. 462
మ. తెఱవా! విప్రులు పూర్ణులే జరుగునే దేవార్చనాచారముల్‌
తఱిలో వెలుతురే గృహస్థులు సుతుల్‌ ధర్మానుసంధానులే
నెఱి నభ్యాగతకోటి కన్నమిడుదే నీరంబునుం బోయుదే
మఱ లే కర్థుల దాసుల\న్‌ సుజనుల\న్‌ మన్నింపుదే పైదలీ!
463
ఆ. అన్నమైనఁ దోయమైన ద్రవ్యంబైన
శాకమైనఁ దనకుఁ జరుగుకొలఁది
నతిథిజనుల కడ్డ మాడక యిడరేని
లేమ! వారు కలిగి లేనివారు.
464
వ. మఱియును. 465
ఆ. నెలతఁ విష్ణునకును నిఖిల దేవాత్మున
కాననంబు శిఖియు నవనిసురులు
వారు దనియఁ దనియు వనజాతలోచనుఁ
డతఁడు దనియ జగములన్ని దనియు.
466
క. బిడ్డలు వెఱతురె? నీ కొఱ
గొడ్డెంబులు సేయ కెల్లకోడండ్రును మా
రొడ్డారింపక నడతురె
యెడ్డము గాకున్నదే మృగేక్షణ యింట\న్‌.
467
వ. అని పలికినం బతికి సతి యిట్లనియె. 468
ఉ. ప్రేమ యొకింత లేక దితిబిడ్డలు బిడ్డలబిడ్డలు\న్‌ మహా
భీమ బలాఢ్యులై తనదు బిడ్డల నందఱిఁ దోలి సాహసా
క్రామిత వైరులయ్యు నమరావతి నేలుచు నున్నవారు నీ
కేమని విన్నవింతు హృదయేశ్వర! మేలు దలంచి చూడవే.
469
క. అక్కాచెల్లెండ్రయ్యును
దక్కదు నాతోడి పోరు తానును దితియు\న్‌
రక్కసులు సురల మొత్తఁగ
నక్కట వలదనుచు చూచు నౌ నౌ ననుచు\న్‌.
470
సీ. ఎండకన్నెఱుఁగని యింద్రుని యిల్లాలు పలుపంచలను జాలిఁ బడియె నేఁడు
త్రిభువన సామ్రాజ్య విభవంబు గోల్పోయి దేవేంద్రుఁ డడవులఁ దిరిగె నేఁడు
కలిమి గారాపు బిడ్డలు జయంతాదులు శబరార్భకులవెంటఁ జనిరి నేఁడు
నమరుల కాధారమౌ నమరావతి యసురుల కాటపట్టయ్యె నేఁడు
 
ఆ. బలి జగముల నెల్ల బలియుచు నున్నాఁడు వాని గెలువరాదు వాసవునకు
యాగభాగ మెల్ల నతఁ డాహరించెను ఖలుఁడు సురల కొక్కకడియు నీఁడు.
471
క. ప్రజలకు నెల్లను సముఁడవు
ప్రజలను గడుపారఁ గన్న బ్రహ్మవు నీవుం
బ్రజలందు దుష్టమతులను
నిజముగ శిక్షింపవలదె నీవు మహాత్మా!
472
మ. సురల\న్‌ సభ్యుల నార్తుల\న్‌ విరథుల\న్‌ శోకంబు వారించి ని
ర్జరధాని న్నిలుపంగ రాత్రిచరుల\న్‌ శాసింప సత్కార్య మే
వెర వేరీతి ఘటించు నట్టి క్రమము\న్‌ వేవేగఁ జింతింపవే
కరుణాలోక సుధాఝరిం దనుపవే కల్యాణ సంధాయకా!
473
వ. అనిన మనోవల్లభ పలుకులాకర్ణించి, ముహూర్త మాత్రంబు చింతించి, విజ్ఞాన దృష్టి నవలంబించి, భావికాల కార్యంబు విచారించి, కశ్యపబ్రహ్మ యిట్లనియె. 474
మ. జనకుం డెవ్వఁడు జాతుఁ డెవ్వఁడు జనస్థానంబు లెచ్చోటు సం
జననం బెయ్యది మేను లేకొలఁది సంసారంబు లే రూపముల్‌
వినుమా యంతయు విష్ణుమాయ దలఁప\న్‌ వేఱేమియు\న్‌ లేదు మో
హ నిబంధంబు నిధాన మింతటికి జాయా! విన్నఁ బోనేటికి\న్‌.
475
వ. అగు నైననుం గాలోచితకార్యంబు సెప్పెద. 476
మ. భగవంతుం బరము\న్‌ జనార్దనుఁ గృపాపారీణు సర్వాత్మకు\న్‌
జగదీశు\న్‌ హరి సేవసేయు మతఁడు\న్‌ సంతుష్టినిం బొంది నీ
కగు నిష్టార్థము లెల్ల నిచ్చు నిఖిలార్థావాప్తి చేకూరెడి\న్‌
భగవత్సేవలఁ బొందరాదె బహు సౌభాగ్యంబులుం బ్రేయసీ!
477
వ. అనిన గృహస్థునకు గృహిణి యిట్లనియె. 478
క. నారాయణుఁ బరమేశ్వరు
నేరీతిఁ దలంతు మంత్ర మెయ్యది విహితా
చారంబు లేప్రకారము
లారాధనకాల మెద్ది యానతి యీవే.
479
వ. అనినం గశ్యపప్రజాపతి సతికిఁ బయోభక్షణంబను వ్రతం బుపదేశించి, తత్కాలంబును, దన్మంత్రంబును, దద్విధానంబును, దదుపవాస దాన భోజన ప్రకారంబులు నెఱింగించెను. 480
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )