ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౧౭
వ. అదితియును, ఫాల్గుణమాసంబున శుక్లపక్షంబునఁ ప్రథమదివసంబునం దొరఁకొని పండ్రెండు దినంబులు హరిసమర్పణంబుగా వ్రతంబుసేసి, వ్రతాంతంబున నియతయై యున్న యెడఁ, జతుర్బాహుండును, బీతవాసుండును, శంఖ చక్ర గదాధరుండునునై, నేత్రంబుల కగోచరుండైన నారాయణదేవుండు ప్రత్యక్షంబైన గనుంగొని. 480
క. కన్నుల సంతోషాశ్రులు
చన్నులపైఁ బఱువఁ బులకజాలము లెసఁగ\న్‌
సన్నతులును సన్నుతులును
నున్నతరుచిఁ జేసి నిటల యుక్తాంజలియై.
481
క. చూపుల శ్రీపతి రూపము
నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై
వాపుచ్చి మందమధురా
లాపంబులఁ బొగడె నదితి లక్ష్మీనాథు\న్‌.
482
సీ. యజ్ఞేశ! విశ్వంభరాచ్యుత! శ్రవణమంగళ నామధేయ! లోకస్వరూప!
యాపన్న భక్తజనార్తి విఖండనా! దీనలోకాధార! తీర్థపాద!
విశ్వోద్భవస్థితివిలయ కారణభూత! సంతతానంద శశ్వద్విలాస!
యాయువు దేహంబు ననుపమ లక్ష్మియు వసుధయు దివముఁ ద్రివర్గములును
 
తే. వైదిక జ్ఞానయుక్తియు వైరిజయము నిన్నుఁ గొలువని నరులకు నెఱయఁ గలదె
వినుతమందార! గుణహార! వేదసార! ప్రణుతవత్సల! పద్మాక్ష! పరమపురుష!
483
ఆ. అసురవరులు సురల నదరించి బెదరించి
నాక మేలుచున్న నాఁటనుండి
కన్నకడుపు గాన కంటఁ గూరుకు రాదు
గడుపుపొక్కు మాన్పి కావవయ్య.
484
వ. అనిన విని, దరహసితవదనుండయి, యాశ్రిత కామధేనువైన యప్పరమేశ్వరుండిట్లనియె. 485
శా. నీ కోడండ్రును నీ కుమారవరులు\న్‌ నీ నాథుఁడు\న్‌ నీవు సం
శ్లోకింప\న్‌ సతులు\న్‌ బతుల్‌ మిగుల సమ్మోదింప రాత్రించరుల్‌
శోకింప\న్‌ భవదీయ గర్భమునఁ దేజోమూర్తి జన్మించెద\న్‌
నాకు\న్‌ వేడుక పుట్టు నీ సుతుఁడనై నర్తించి వర్తింపఁగా\న్‌.
486
మ. బలిమి\న్‌ దైత్యులఁ జంపరాదు వినయోపాయంబులం గాని సం
చలనం బొందకు నేను నీ నియతికి\న్‌ సద్భక్తికి\న్‌ మెచ్చితి\న్‌
బలివిద్వేషియు నా నిలింపగణము\న్‌ బౌలోమియు\న్‌ మెచ్చ దై
త్యులరాజ్యంబు హరింతు నింద్రునికి నిత్తు\న్‌ దుఃఖ మింకేటికి\న్‌.
487
క. నీ రమణుని సేవింపుము
నా రూపము మానసించి నలి నీ గర్భా
గారంబు వచ్చి చొచ్చెద
గారమునఁ బెంపవమ్మ కరుణ\న్‌ నన్ను\న్‌.
488
క. ఏలింతు దివము సురలను
బాలింతు మహేంద్రయువతి భాగ్యశ్రీల\న్‌
దూలింతు దానవుల ని
ర్మూలింతు రిపు ప్రియాంగముల భూషణముల్‌.
489
వ. అని యిట్లు భక్తజన పరతంత్రుండగు పురాణపురుషుండానతిచ్చి, తిరోహితుండయ్యె. అయ్యదితియుఁ, గృతకృత్యయై సంతోషంబునఁ దన మనోవల్లభుండగు కశ్యపు నాశ్రయించి, సేవింపుచుండె. అంత నొక్కదినంబున. 490
ఆ. ఘన సమాధినుండి కశ్యపుఁ డచ్యుతు
నంశ మాత్మ నొలయ నదితియందుఁ
దనదు వీర్య మధికతరము సేర్చెను గాలి
శిఖిని దారువందుఁ జేర్చినట్లు.
491
వ. ఇట్లు గశ్యప చిరతర తపస్సంభృత వీర్యప్రతిష్ఠిత గర్భయై, సురలతల్లి యుల్లంబున నుల్లసిల్లుచుండె. అంత. 492
క. చలచలనై పిదపిదనైఁ
గలలంబై కరుడుగట్టి గళనాళముతోఁ
దల యేర్పడి గర్భంబై
నెల మసలం జీరచిక్కె నెలఁతకు నధిపా!
493
క. నెలఁతకు చూలై నెల రె
న్నెలలై మఱి మూఁడు నాల్గు నెలలై వరుస\న్‌
నెల లంతకంత కెక్కఁగ
నెలలును డగ్గఱియె నసుర నిర్మూలతకు\న్‌.
494
క. మహితతర మేఘమాలా
పిహితాయుత చండభాను బింబప్రభతో
విహితాంగంబులఁ గశ్యపు
గృహిణీగర్భమున శిశువు గ్రీడించె నృపా!
495
క. తనకడుపున నొకవెఱవున
గొనకొని జగములను నిముడుకొనియెడి ముదుకం
డనిమిషుల జనని కడుపునఁ
దనుగతిఁ గడు నడఁగి మడఁగి తనరె\న్‌ బెడఁగై.
496
వ. అంత నక్కాంతాతిలకంబు క్రమక్రమంబున. 497
మ. నిలిపె\న్‌ ఱెప్పల బృందిమ\న్‌ విశదిమ\న్‌ నేత్రంబులం జూచుకం
బుల నాకాళిమ మేఖల\న్‌ ద్రఢిమ నెమ్మోము\న్‌ సుధాపాండిమ\న్‌
బలిమిం జన్నుల శ్రోణిపాళి గరిమ\న్‌ మధ్యంబున\న్‌ బృంహిమ\న్‌
లలితాత్మ\న్‌ లఘిమ\న్‌ మహామహిమ మేన\న్‌ గర్భదుర్వారయై.
498
క. పెట్టుదురు నెదుట భూతిని
బొట్టిడుదురు మేనఁ బట్టుఁబుట్టపు దోయి\న్‌
బెట్టుదురు వేల్పుటమ్మకుఁ
గట్టుదురును రక్ష పడఁతిగర్భంబునకు\న్‌.
499
వ. ఇవ్విధంబున. 500
తే. విశ్వగర్భుఁడు తన గర్భవివరమందుఁ
బూఁటపూఁటకుఁ బూర్ణుఁడై పొటకరింప
వ్రేఁకఁ జూలాలితనమున వేల్పు పెద్ద
పొలఁతి కంతట నీళ్ళాడుప్రొద్దు లయ్యె.
501
వ. తదనంతరంబునం జతురాననుం డరుగుదెంచి, యదితి గర్భపరిభ్రమ విభ్రముండగు నప్పరమేశ్వరు నుద్దేశించి యిట్లని స్తుతియించె. 502
సీ. త్రిభువనమయరూప! దేవ! త్రివిక్రమ! పృథులాత్మ! శిపివిష్ట! పృశ్నిగర్భ!
ప్రీతత్రినాభ! త్రిపృష్ఠ జగంబుల కాద్యంత మధ్యంబు లరయ నీవ
జంగమ స్థావర జననాది హేతువు నీవ కాలంబవై నిఖిల మాత్మ
లోపల ధరియింతు లోని జంతుల నెల్ల స్తోతంబు లోఁగొను సుందరతను
 
తే. బ్రహ్మలకు నెల్ల సంభవభవన మీవ దినమునకుఁ బాసి దుర్దశ దిక్కులేక
శోకవార్ధి మునింగిన సురల కెల్లఁ దేల నాధార మగుచున్న తెప్ప వీవ.
503
క. విచ్చేయు మదితిగర్భము
చెచ్చెర వెలువడు మహాత్మ చిరకాలంబు\న్‌
విచ్చలవిడి లే కమరులు
ముచ్చటపడి యున్నవారు ముద మందింప\న్‌.
504
వ. అని యిట్లు కమలసంభవుండు వినుతి సేయ నయ్యవసరంబున. 505
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )