ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౧౮
వామనమూర్త్యావిర్భావము
మ. రవి మధ్యాహ్నమునం జరింప గ్రహ తారాబద్ధ చంద్రస్థితి\న్‌
శ్రవణ ద్వాదశినాఁడు శ్రోణ నభిజిత్సంజ్ఞాత లగ్నంబున\న్‌
భువనాధీశుఁడు పుట్టె వామనగతిం బుణ్య వ్రతోపేతకు\న్‌
దివిజాధీశ్వరు మాతకుం బరమ పాతివ్రత్య విఖ్యాతకు\న్‌.
506
వ. మఱియు నద్దేవుండు, శంఖ చక్ర గదా కమలకలిత చతుర్భుజుండును, బిశంగవర్ణ వస్త్రుండును, మకర కుండల మండిత గండభాగుండును, శ్రీవత్సవక్షుండును, నిరంతర శ్రీవిరాజిత రోలంబ కదంబ బింబిత వనమాలికా పరిష్కృతుండును, గనక కంకణ కాంచీవలయాంగద నూపురాలంకృతుండును, గమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖిలజన మనోహరుండునునై యవతరించిన సమయంబున. 507
శా. చింతం బాసిరి యక్ష తార్క్ష్య సుమన స్సిద్ధోరగాధీశ్వరుల్‌
సంతోషించిరి సాధ్య చారణ మునీశ బ్రహ్మ విద్యాధరుల్‌
గాంతిం జెందిరి భాను చంద్రములు రంగద్గీత వాద్యంబుల\న్‌
గంతుల్‌ వైచిరి మింటఁ గింపురుషులు\న్‌ గంధర్వులు\న్‌ గిన్నరుల్‌.
508
క. దిక్కుల కావిరి విరిసె
న్నెక్కువ నిర్మలత నొందె నేడు పయోధుల్‌
నిక్కమెయి నిలిచె ధరణియుఁ
జుక్కల త్రోవయును విప్రజన సేవ్యములై.
509
క. ముంపుకొని విరులవానల
జొంపంబులు గురియ సురలు సుమనోమధువుల్‌
తుంపర లెగయఁ బరాగపు
రొంపుల భూభాగ మతినిరూషిత మయ్యె\న్‌.
510
వ. తదనంతరంబ. 511
ఆ. ఈ మహానుభావుఁ డెట్లింతకాలంబు
నుదరమందు నిలిచియుండె ననుచు
నదితి వెఱఁగుపడియె నానంద జయశబ్ద
ములను గశ్యపుండు మొగి నుతించె.
512
వ. అంత నవ్విభుండు సాయుధ సాలంకారంబగు తన దివ్యరూపంబు నుజ్జగించి, రూపాంతరం బంగీకరించి, కపటవటుని చందంబున, నుపనయన వయస్కుండై, బాలకుండు తల్లిముందట సముచితాలాపంబు లాడుచుఁ గ్రీడించు సమయంబున, నదితియుం దనయ విలోకన పరిణామ పారవశ్యంబున. 513
ఆ. నన్నుఁ గన్నతండ్రి! నాపాలి దైవమ!
నా తపఃఫలంబ! నా కుమార!
నాదు చిన్నివడుగ! నా కులదీపక!
రాఁగదయ్య! భాగ్యరాశి వగుచు.
514
క. అన్నా! రమ్మని డగ్గఱి
చన్నుల పాలేఱువాఱ సంశ్లేషిణియై
చిన్నారి మొగము నివురుచుఁ
గన్నారం జూచెఁ గన్న కడుపై యుంట\న్‌.
515
క. పురు డీ బోటికి నిందిర
పురు డంబిక గాక యొరులు పురుడే యనుచు\న్‌
బురుటాలికి పది దినములు
పురుడు ప్రవర్తించి రెలమిఁ బుణ్యపుగరితల్‌.
516
వ. అంత నబ్బాలునకు సంతసంబున మహర్షులు కశ్యపప్రజాపతిం బురస్కరించుకొని సముచితోపనయన కర్మకలాపంబులు చేయించిరి. సవిత సావిత్రి నుపదేశించె. బృహస్పతి యజ్ఞోపవీతంబును, గశ్యపుండు ముంజియు, గౌపీనం బదితియు, ధరణి కృష్ణాజినంబును, దండంబు సోముండును, గగనాధిష్ఠానదేవత ఛత్రంబును, గమండలువు బ్రహ్మయు, సరస్వతి యక్షమాలికయు, సప్తర్షులు కుశపవిత్రంబులు నిచ్చిరి. మరియును. 517
క. భిక్షాపాత్రిక నిచ్చెను
యక్షేశుఁడు వామనునకు నక్షయ మనుచు\న్‌
సాక్షాత్కరించి పెట్టెను
భిక్షునకు భవాని పూర్ణభిక్ష నరేంద్రా!
518
బలిచక్రవర్తి కడకు వామనమూర్తి యేతెంచుట
క. శుద్ధబ్రహ్మర్షి సమా
రాద్ధుండై విహిత మంత్రరాజిఁ జదువుచు
న్నిద్ధంబగు ననలంబున
వృద్ధాచారమున వటుఁడు వేల్చెం గడిమి\న్‌.
519
వ. ఇట్లు కృతకృత్యుండై మాయామాణవకుండు దేశాంతర సమాగతులగు బ్రాహ్మణులఁ నవలోకించి యిట్లనియె. 520
క. వత్తురె విప్రులు వేడ
న్నిత్తురె దాతలును వేడ్క నిష్టార్థములం
దెత్తురె మీరును సంపద
లిత్తెఱఁగున దానవీరుఁ డెవ్వడొ సెపుఁడా.
521
వ. అనిన నఖిల దేశీయులగు భూసురు లిట్లనిరి. 522
మ. కలరు\న్‌ దాతలు నిత్తురు\న్‌ ధనములుం గామ్యార్థముల్‌ గొంచు వి
ప్రులు నేతెంతురు కాని యీవిని బలిం బోల\న్‌ వదాన్యుండు లేఁ
డలఘుండై యొనరించు నధ్వర శతం బా భార్గవానుజ్ఞతో
బలి వేఁడం బడయంగవచ్చు బహు సంపల్లాభముల్‌ వామనా!
523
వ. అని తెలియఁజెప్పిన బ్రాహ్మణ వచనంబు లాలకించి, లోకంబులకుం బ్రీతి పుట్టింపఁ బయనంబై, లాభవచనంబులు గైకొని, తల్లిదండ్రుల వీడ్కొని, శుభ ముహూర్తంబునం గదలి. 524
క. ప్రక్షీణ దివిజవల్లభ
రక్షాపరతంత్రుఁ డగుచు రాజీవాక్షుం
డ క్షణమున బలియింటికి
భిక్షాగమనంబు సేసెఁ బేదఱికముతో\న్‌.
525
క. హరిహరి! సిరియురమునఁ గల
హరిహయు కొఱకు దనుజునడుగ\న్‌ జనియె\న్‌
బరహితరతమతియుతు లగు
దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమి\న్‌.
526
క. సర్వ ప్రపంచ గురుభర
నిర్వాహకుఁ డగుటఁజేసి నెఱిఁ జనుదేర\న్‌
ఖర్వుని వ్రేఁగు సహింపక
నుర్వీస్థలి గ్రుంగె, మ్రొగ్గె నురగేంద్రుండు\న్‌.
527
వ. ఇట్లు చని చని. 528
క. శర్మద యమదండక్షత
వర్మద నతికఠిన ముక్తి వనితా చేతో
మర్మద నంబునివారిత
దుర్మద నర్మదఁ దరించెఁ ద్రోవ\న్‌ వటుఁడు\న్‌.
529
వ. దాఁటి తత్ప్రవాహంబున కుత్తర తటంబునందు. 530
శా. చండస్ఫూర్తి వటుండు గాంచె బహుధా జల్పన్నిశాటంబు, ను
ద్దండాహూత మునీభ్య బిభ్య దమృతాంధస్సిద్ధకూటంబు, వే
దండాశ్వ ధ్వజినీ కవాటము, మహోద్యద్ధూమసంఛన్న మా
ర్తాండ స్యందన ఘోటము\న్‌, బలి మఖాంతర్వేదికా వాటము\న్‌.
531
వ. కని, దానవేంద్రుని హయమేధవాటిక దాఁటి, దరియంజొచ్చు నయ్యవసరంబున. 532
శా. శంభుండో, హరియో, పయోజభవుఁడో, చండాంశుఁడో, వహ్నియో,
దంభాకారత వచ్చెఁ గాక, ధరణి\న్‌ ధాత్రీసురుం డెవ్వఁ డీ
శుంభద్ద్యోతనుఁ డీ మనోజ్ఞతనుఁ డంచు\న్‌ విస్మయభ్రాంతులై
సంభాషించిరి బ్రహ్మచారిఁ గని, తత్సభ్యుల్‌ రహస్యంబున\న్‌.
533
క. గుజగుజలు వోవువారును
గజిబిజి పడువారు చాలఁ గలకల పడుచు\న్‌
గజిబిజి యైరి సభాస్థలిఁ
బ్రజలెల్లను బొట్టివడుగు పాపని రాక\న్‌.
534
వ. ఆ సమయంబున బలి సభామంటపంబు దఱియం జొచ్చి. 535
సీ. చవులుగాఁ జెవులకు సామగానంబులు సదివెడు హోతల చదువు వినుచు
మంత్రతంత్రార్థ సంబంధభావంబులు గొనియాడు యాజులఁ గూడికొనుచు
హోమకుండంబులందున్న త్రేతాగ్నుల వెలిఁగించు యాజక వితతిఁ గనుచు
దక్షులై బహువిధాధ్వర విధానంబులు సెప్పెడు సభ్యులఁ జేరఁ జనుచు
 
తే. బెట్టుగోరెడు వేడుక పట్టుపఱుప నదితిపుట్టువు లచ్చికి నాటపట్టు
కోరి చరియించె సభలోనఁ గొంతతడవు పుట్టు వెన్నఁడు నెఱుఁగని పొట్టివడుగు.
536
వ. మఱియును. 537
క. వెఱచుచు వంగుచు వ్రాలుచు
నఱిముఱి గుబురులకుఁ జనుచు హరిహరి! యనుచు\న్‌
మఱుఁగుచు నులుకుచు దిరదిరఁ
గుఱుమట్టపు పొట్టివడుగు గొంత నటించె\న్‌.
538
క. కొందఱితోఁ జర్చించును
గొందఱితో జటలు సెప్పు గోష్ఠిం జేయుం
గొందఱితోఁ దర్కించును
గొందఱితో ముచ్చటాడుఁ గొందఱ నవ్వు\న్‌.
539
వ. మఱియు ననేకవిధంబుల నందఱికి నన్నిరూపులై వినోదించుచు. 540
క. వెడవెడ నడకలు నడచుచు
నెడనెడ నడుగిడఁగ నడరి యిల దిగఁబడఁగ\న్‌
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడఁగ వడుగు సేరె\న్‌ రాజు\న్‌.
541
వ. ఇట్లు డగ్గఱి మాయా భిక్షుకుండు రక్షోవల్లభుం జూచి యిట్లనియె. 542
మ. ఇతఁడే దానవచక్రవర్తి సురలోకేంద్రాగ్నికాలాది ది
క్పతి గర్వాపనయప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామఖ
వ్రత దాన ప్రవణవానువర్తి సుమనోరామా మనోభేదనో
ద్ధత చంద్రాతపకీర్తి సత్య కరుణా ధర్మోల్లసన్మూర్తి దా\న్‌.
543
వ. ఇట్లు కుశ పవిత్రాక్షత సంయుతంబగు దక్షిణహస్తంబు సాఁచి యిట్లనియె. 544
ఉ. స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర వి
ధ్వస్త నిలింపభర్తకు నుదారపద వ్యవహర్తకు\న్‌ మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధానవిహర్తకు నిర్జరీ గళ
న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు\న్‌.
545
వ. అని దీవించి, కరచరణాద్యవయవంబులు ధరించిన వేదరాశియునుం బోలె ముందట నకుటిలుండును, జటిలుండును, సదండచ్ఛత్రుండును, గక్షలంబిత భిక్షా పాత్రుండును, గరకలితజల కమండలుండును, మనోహర వదన చంద్రమండలుండును, మాయావాదన పటుండును నగు వటునిం గని, దినకరకిరణ పిహితంబులైన గ్రహంబుల చందంబునఁ దిరోహితులయి భృగువులు గూర్చున్నయెడ లేచి సేమం బడిగి తియ్యనిమాటల నాదరించిరి. బలియును నమస్కరించి, తగిన గద్దియ నునిచి, పాదంబులు దుడిచి, తన ప్రాణవల్లభ పసిండి కలశంబున నుదకంబులు వోయ, వడుగుకొమరుని చరణంబులు గడిగి, తడియొత్తి తత్సమయంబున. 546
ఆ. వటుని పాదశౌచవారి శిరంబునఁ
బరమభద్ర మనుచు బలి వహించె
నే జలము గిరీశుఁ డిందుజూటుఁడు దేవ
దేవుఁ డుద్వహించె ధృతి శిరమున.
547
వ. మఱియు, నయ్యజమానుం డభ్యాగతున కిట్లనియె. 548
మ. వడుగా! యెవ్వరివాఁడ వెవ్వఁడవు సంవాసస్థలం బెయ్య ది
య్యెడకు\న్‌ నీ వరుదెంచుట\న్‌ సఫలమయ్యె\న్‌ వంశము\న్‌ జన్మము\న్‌
గడు ధన్యాత్ముఁడ నైతి నీ మఖము యోగ్యంబయ్యె నాకోరికల్‌
గడతేఱెన్‌ సుహుతంబులయ్యె శిఖులుం గల్యాణ మిక్కాలము\న్‌.
549
మ. వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!
550
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )