ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౧౯
వ. అని ధర్మయుక్తంబుగాఁ బలికిన వైరోచని వచనంబులు విని, సంతోషించి, యీశ్వరుండిట్లనియె. 551
సీ. ఇది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు నొకచోటనక నిండి యుండనేర్తు
నెవ్వనివాఁడ నం చేమని పలుకుదు నాయంతవాఁడనై నడవనేర్తు
నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ బూని ముప్పోకలఁ బోవనేర్తు
నదునేర్తు నిదినేర్తు నని యేల చెప్పంగ నేరుపు లన్నియు నేన నేర్తు
 
ఆ. నొరులు గారు నాకు నొరులకు నే నౌదు నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు
సిరియుఁ దొల్లిఁ గలదు సెప్పెద నా టెంకి సుజనులందుఁ దఱచుఁ జొచ్చియుందు.
552
వ. అది యట్లుండనిమ్ము. 553
సీ. జననాథ! నీ మాట సత్యంబు సత్కీర్తిదంబు కులార్హంబు ధర్మయుతము
కరుణానువర్తులు ఘనసత్త్వమూర్తులు గాని మీ కులమందుఁ గలుగ రొరులు
రణభీరువులు వితరణభీరువులు లేరు ప్రత్యర్థు లర్థులు ప్రబ్బికొనిన
దానశౌండులగుచు దనుపుదు రధికులై మీతాత లందఱు మేటిమగలు
 
ఆ. మీకులంబునందు మెఱయఁ బ్రహ్లాదుండు మింటి చంద్రుమాడ్కి మేలిరుచులఁ
బ్రథితకీర్తితోడ భవదీయవంశంబు నీరరాశిభంగి నెగడుచుండు.
554
వ. తొల్లి మీ మూఁడవతాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు సేసి, గదాయుధుండై భూతలంబునఁ బ్రతివీరులం గానక సంచరింప, విష్ణుండు వరాహరూపంబున నతని సమయించె. తద్భ్రాత యగు హిరణ్యకశిపుండది విని, హరిపరాక్రమంబునకు నాశ్చర్యంబు నొంది, తన జయంబునుం, బలంబునుం, బరిహసించి, గ్రద్దన నుద్ద విడి నద్దనుజమర్దను మందిరంబునకుం జనియె. అప్పుడు. 555
క. శూలాయుధ హస్తుండై
కాలాకృతి వచ్చు దనుజుఁ గని విష్ణుండు\న్‌
గాలజ్ఞత మాయాగుణ
శీలత నిట్లని తలంచెఁ జిత్తములోన\న్‌.
556
మ. ఎదురై పోర జయింపరా దితనిఁ గా కెందేనియుం బోవ భీ
ప్రదుఁడై ప్రాణులఁ దోలు మృత్యువు క్రియంబై వచ్చు నంచుం గ్రియా
విదుఁ డబ్జాక్షుఁడు సూక్ష్మరూపమున నావేశించె నిశ్శ్వాస రం
ధ్రదిశ\న్‌ దైత్యు హృదంతరాళమునఁ బ్రత్యక్షక్రియా భీరుఁడై.
557
వ. అంత నద్దైత్యవల్లభుండు వైష్ణవాలయంబు సొచ్చి, వెదకి, హరిం గానక, మిన్ను మన్ను నన్వేషించి, త్రిదివంబున నరసి, దిశలం బరికించి, భూవివరంబులు వీక్షించి సముద్రంబులు వెదకి, పురంబులు శోధించి, వనంబులు విమర్శించి, పాతాళంబు పరీ క్షించి, జగంబున నదృష్ట శత్రుండై, మార్గణంబు సాలించి, తనలో నిట్లనియె. 558
క. పగవాఁడు మడియనోపును
దెగఁడేనియు నెదురుపడఁడె తెగువ నరులకుం
దెగిన యెఁడ బగఱ మీఁదను
బగ గొనఁదగ దనుచు మానెఁ బ్రాభవశక్తి\న్‌.
559
వ. అతండు మీ ప్రపితామహుండు, అతని గుణంబు లనేకంబులు గలవు. అది యట్లుండనిమ్ము. 560
క. ఆతుర భూసురగతిఁ బురు
హూతాదులు దన్ను వేఁడ నొగిఁ గొమ్మనుచు\న్‌
మీ తండ్రి యిచ్చె నాయువు
నేతన్మాత్రుఁడవె నీవు నీలోకమున\న్‌.
561
క. ఏలితివి మూఁడు జగములు
దోలితి వింద్రాది సురులఁ దొల్లిటివారిం
బోలితివి దానగుణములఁ
జాలితి వీ రాక్షసులను సంరక్షింప\న్‌.
562
వ. అదియునుం గాక. 563
క. రాజ్యంబు గలిగెనేనియుఁ
బూజ్యులకును యాచకులకు భూమిసురులకు\న్‌
భాజ్యముగ బ్రతుకఁ డేనియు
ద్యాజ్యంబులు వాని జన్మ ధన గేహంబుల్‌.
564
క. మున్నెన్నుదురు వదాన్యుల
నెన్నెడుచో నిన్నుఁ ద్రిభువనేశుఁడ వనుచు
న్నిన్ని దినంబులనుండియు
నెన్నఁడు నినుఁ బెట్టు మనుచు నీండ్రము సేయ\న్‌.
565
ఆ. ఒంటివాఁడ నాకు నొకటి రెండడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్లఁ
గోర్కెదీర బ్రహ్మకూఁకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర!
566
వ. అనినఁ బరమయాచకునకుఁ బ్రదాత యిట్లనియె. 567
ఆ. ఉన్నమాటలెల్ల నొప్పును విప్రుండ
సత్యగతులు వృద్ధసమ్మతంబు
లడుగఁ దలఁచి కొంచె మడిగితివో చెల్ల!
దాతపెంపు సొంపుఁ దలఁపవలదె?
568
మ. వసుధాఖండము వేఁడితో గజముల\న్‌ వాంఛించితో వాజుల\న్‌
వెస నూహించితో కోరితో యువతుల\న్‌ వీక్షించి కాంక్షించితో
పసిబాలుండవు నేర వీ వడుగఁ నీ భాగ్యంబు లీపాటిగా
కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే.
569
వ. అనిన మొగంబునం జిఱునగవు మొలకలొత్త, గృహమేధికి మేధావి యిట్లనియె. 570
మ. గొడుగో జన్నిదమో కమండలువొ నాకున్‌ ముంజియో దండమో
వడు గే నెక్కడ భూము లెక్కడ కరుల్‌ వామాక్షు లశ్వంబు లె
క్కడ నిత్యోచితకర్మ మెక్కడ మదాకాంక్షామితంబైన మూ
డడుగుల్‌ మేరయ త్రోవ కిచ్చుటయె బ్రహ్మాండంబు నాపాలికిన్‌.
571
వ. అదియునుం గాక. 572
క. వ్యాప్తిం బొందక వగవక
ప్రాప్తంబగు లేశమైనఁ బదివేలనుచు\న్‌
దృప్తిం జెందని మనుజుఁడు
సప్తద్వీపములనైనఁ జక్కం బడునే.
573
శా. ఆశాపాతము దాఁ గడు న్నిడుపు లే దంతంబు రాజేంద్ర! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసిం బొందిరి గాక వైన్య గయ భూకాంతాదులు న్నర్థకా
మాశ\న్‌ బాయఁగనేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.
574
సీ. సంతుష్టుఁ డీ మూఁడుజగములఁ బూజ్యుండు సంతోషి కెప్పుడు జరుగుసుఖము
సంతోషి గాకుంట సంసారహేతువు సంతసంబున ముక్తిసతియు దొరకుఁ
బూఁటపూటకు జగంబున యదృచ్ఛాలాభ తుష్టినిఁ దేజంబు తోన పెరుఁగు
పరితోషహీనతఁ బ్రభ చెడిపోవును జలధార ననలంబు సమయునట్లు
 
ఆ. నీవు రాజ వనుచు నిఖిలంబు నడుగుట తగవు గాదు నాకుఁ దగినకొలఁది
యేను వేఁడికొనిన యీ పదత్రయమును చాల దనక యిమ్ము చాలు చాలు.
575
వ. ఇట్లు పలుకుచున్న ఖర్వునకు నుర్వీశ్వరుం డుర్వీదానంబు సేయం దలంచి, కర కలిత సలిల కమలుండైన యవ్వితరణగుణ ముఖరునిం గని, నిజ విచారయుక్త దనుజరాజ్యచక్రుండగు శుక్రుండిట్లనియె. 576
సీ. దనుజేంద్ర! యీతఁడు ధరణీసురుఁడు గాఁడు దేవకార్యంబు సాధించుకొఱకు
హరి విష్ణుఁ డవ్యయుం డదితిగర్భంబునఁ గశ్యపసూనుఁడై గలిగె నకట
యెఱుఁగ వీతనికోర్కె నిచ్చెద నంటివి దైత్యసంతతి కుపద్రవము వచ్చు
నీ లక్ష్మి తేజంబు నెలవు నైశ్వర్యంబు వంచించి యిచ్చును వాసవునకు
 
ఆ. మొనసి జగము లెల్ల మూఁడుపాదంబుల నఖిలకాయుఁ డగుచు నాక్రమించు
సర్వధనము విష్ణు సంతర్పణము చేసి బడుగుపగిది యెట్లు బ్రతికె దీవు.
577
క. ఒక్కపదంబున భూమియు
నొక్కటఁ ద్రిదివంబుఁ ద్రొక్కి యున్నత మూర్తి\న్‌
దిక్కులు గగనముఁ దానై
వెక్కసమై యున్న నెట్లు వెడలెదు చెపుమా.
578
సీ. ఇచ్చెదనని పల్కి యీకున్న నరకంబు ద్రోవ నీవును సమర్థుఁడవె దేవ!
యేదానమున నాశ మేతెంచు నదియును దానంబు గాదండ్రు తత్త్వవిదులు
దానంబు యజ్ఞంబు తపము కర్మంబులు దా విత్తవంతుఁడై తలఁపవలయుఁ
దనయింటఁ గల సర్వధనమెల్ల నైదుభాగములుగా విభజించి కామమునకు
 
ఆ. నర్థమునకు ధర్మయశముల కాశ్రిత బృందములకు సమతఁ బెట్టునట్టి
పురుషుఁ డిందుఁ బూర్ణుఁడై మోదించుఁ దన్ను మాని చేఁత తగవుగాదు.
579
వ. అదియునుం గాక యీ యర్థంబునందు బహుభంగి బహ్వృచగీతార్థంబు గల దొకటి. సావధానుఁడవై యాకర్ణింపుము. 580
సీ. అంగీకరించిన నఖిలంబు పోవుచో ననృతంబు గాదు లేదనిన నధిప!
యాత్మవృక్షము మూలమనృతంబు నిశ్చయ మనృతమూలముగల్గ నాత్మచెడదు
పుష్పఫలము లాత్మభూజంబునకు సత్య మా మ్రాను బ్రతుకమి నవియుఁ జెడును
ఫలపుష్పములు లేక పసచెడి వృక్షంబు మూలంబుతో వృద్ధిఁ బొందుగాదె
 
తే. చేటు గొఱతయు లఘిమయుఁ జెందకుండ నిచ్చు పురుషుండు చెడకుండ నిద్ధచరిత!
కాక యంచిత సత్యసంగతి నటంచు నిజధనం బర్థి కిచ్చిన నీకు లేదు.
581
ఆ. సర్వమైన చోట సర్వధనంబులు
నడుగ లే దటంచు ననృతమాడు
చెనఁటి పంద నేమిచెప్పఁ బ్రాణముతోడి
శవము వాఁడు వాని జన్మమేల.
582
వ. మఱియు నొక్క విశేషంబు గలదు వివరించెద. 583
ఆ. వారిజాక్షులందు వైవాహికములందుఁ
బ్రాణ విత్త మాన భంగమందుఁ
జకిత గోకులాగ్రజన్మ రక్షణమందు
బొంకవచ్చు నఘము పొంద దధిప!
584
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )