ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౨౦
మ. కులము\న్‌ రాజ్యము తేజము\న్‌ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండము\న్‌
గలఁడే మాన్ప నొకండు నా పలుకు లాకర్ణింపు కర్ణంబుల\న్‌
వలదీ దానము గీనము\న్‌ బనుపుమా వర్ణి\న్‌ వదాన్యోత్తమా!
585
వ. అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలితలోచనుండై యశస్వి యిట్లనియె. 586
సీ. నిజ మానతిచ్చితి నీవు మహాత్మక! మహిని గృహస్థధర్మంబు నిదియ
యర్థంబుఁ గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింప నిత్తుననియు
నర్థలోభంబున నర్థిఁ బొమ్మనుటెట్లు పలికి లేదనుకంటెఁ బాప మెద్ది
యెట్టి దుష్కర్ముని నే భరించెదఁ గాని సత్యహీనుని మోవఁజాల ననుచుఁ
 
తే. బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ నమరమందడ్గు దిరుగక చచ్చుకంటె
బలికి బొంకక నిజమున బరఁగుకంటె మానధనులకు భద్రంబు మఱియుఁ గలదె.
587
క. ధాత్రిని హాలికునకు సు
క్షేత్రము బీజములు లెస్స చేకుఱు భంగిం
జిత్రముగ దాత కీవియుఁ
బాత్రము సమకూఱునట్టి భాగ్యము గలదే.
588
శా. కారే రాజులు రాజ్యముల్‌ గలుగవే గర్వోన్నతిం బొందరే
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ
బేరైనం గలదే శిబిప్రముఖులుం బ్రీతి\న్‌ యశఃకాములై
యీరే కోర్కులు వారల\న్‌ మఱచిరే యిక్కాలము\న్‌ భార్గవా!
589
క. ఉడుగని క్రతువుల వ్రతములఁ
బొడగనఁ జననట్టి పొడవు పొడవునఁ గుఱుచై
యడిగెడి నఁట నను బోఁటికి
నిడరాదె మహానుభావ! యిష్టార్థంబుల్‌.
590
శా. ఆది\న్‌ శ్రీసతి కొప్పుపైఁ దనువుపై నంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జంబులపైఁ గపోలతటిపైఁ బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిందగుట మీఁదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యము\న్‌ సతతమే కాయంబు నాపాయమే.
591
మ. నిరయంబైన నిబంధమైన ధరణీనిర్మూలనంబైన దు
ర్మరణంబైనఁ గులాంతమైన నిజము\న్‌ రానిమ్ము కానిమ్ము పో
హరుడైన\న్‌ హరియైన నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ
దిరుగ న్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య! వేయేటికి\న్‌.
592
ఆ. నొడివినంతవట్టు నుసలక యిచ్చుచో
నేల కట్టు విష్ణుఁ డేటిమాట
కట్టెనేనిఁ దాన కరుణించి విడుచును
విడువకుండనిమ్ము విమలచరిత!
593
క. మేరువు తలక్రిందైనను
బారావారంబు లింకఁ బాఱిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వముఁ బద్ధమైనఁ దప్పక యిత్తు\న్‌.
594
మత్తకోకిల. ఎన్నఁడుం బరు వేఁడఁబోడఁట యేకలం బఁట కన్నవా
రన్నదమ్ములు నైన లేరఁట యన్నివిద్యల మూలగో
ష్ఠి న్నెఱింగిన ప్రోడగుజ్జఁట చేతులొగ్గి వసింప నీ
చిన్నిపాపనిఁ ద్రోసిపుచ్చఁగఁ జిత్తమొల్లదు సత్తమా!
595
వ. అని యిట్లు సత్యపదవీ ప్రమాణ తత్పరుండును, వితరణకుతూహల సత్వరుండును, విమల యశస్కుండును, దృఢ మనస్కుండును, నియత సత్యసంధుండును, నర్థిజన కమల బంధుండును నైన బలిం జూచి, శుక్రుండు కోపించి, మదీయశాసన మతిక్రమించుటంజేసి శీఘ్రకాలంబునఁ బదబ్రష్టుండవు గమ్మని శపియించెను. బలియును, గురుశాపతప్తుండయ్యును, సూనృతమార్గంబున కభిముఖుండై యుండె. అప్పుడు. 596
ఆ. బ్రతుకవచ్చుఁ గాక బహుబంధనములైన
వచ్చుఁగాక లేమి వచ్చుఁగాక
జీవధనములైనఁ జెడుఁగాక పడుఁగాక
మాట దిరుగలేరు మానధనులు.
597
వ. అను నయ్యవసరంబున. 598
ఆ. దనుజలోకనాథు దయిత వింధ్యావళి
రాజవదన మదమరాళగమన
వటుని కాళ్ళు గడుగ వర హేమఘటమున
జలము దెచ్చె భర్త సన్న యెఱిఁగి.
599
వ. అయ్యవసరంబునఁ గపటవటునకు నద్దానవేంద్రుండిట్లనియె. 600
క. రమ్మా మాణవకోత్తమ!
లెమ్మా నీ వాంఛితంబు లేదన కిత్తు\న్‌
దెమ్మా యడుగుల నిటు రా
నిమ్మా గడుగంగవలయు నేటికిఁ దడయ\న్‌.
601
మ. బలిదైత్యేంద్ర కరద్వయీకృత జలప్రక్షాళన వ్యాప్తికి\న్‌
జలజాతాక్షుఁడు సాఁచె యోగిసుమనస్సంప్రార్థిత శ్రీదము\న్‌
గలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా శాదము\న్‌
నళినామోదము రత్ననూపురిత నానావేదముం బాదము\న్‌.
602
క. సురలోక సముద్ధరణము
నిరత శ్రీకరుణ మఖిల నిగమాంతాలం
కరణము భవసంహరణము
హరిచరణము నీటఁ గడిగె నసురోత్తముఁడున్‌.
603
వ. ఇట్లు ధరణీసుర దక్షిణచరణ ప్రక్షాళనంబు చేసి, వామపాదంబు గడిగి, తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని, వార్చి, దేశకాలాది పరిగణనంబు సేసి. 604
శా. 'విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
దప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి' యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జేసాఁచి పూజించె బ్ర
హ్మప్రీతమ్మని ధారవోసె భువనం బాశ్చర్యముం బొందఁగ\న్‌.
605
వ. తత్కాలంబున. 606
ఆ. నీరధారఁ బడఁగనీక యడ్డంబుగాఁ
గలశరంధ్ర మాఁపగాను దెలిసి
హరియుఁ గావ్యునేత్ర మటు కుశాగ్రంబున
నడువ నేకనేత్రుఁ డయ్యె నతఁడు.
607
వ. అంత. 608
మ. అమరారాతి కరాక్షతోజ్ఝిత పవిత్రాంభఃకణశ్రేణికిం
గమలాధీశ్వరుఁ డొడ్డె ఖండిత దివౌకస్వామి జిన్మస్తముం
గమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతా కచోపాస్తము\న్‌
విమల శ్రీకుచ శాత చూచుకతటీ విన్యస్తము\న్‌ హస్తము\న్‌.
609
క. మునిజన నియమాధారను
జనితాసుర యువతి నేత్ర జలకణ ధార\న్‌
దనుజేంద్ర నిరాధారను
వనజాక్షుఁడు గొనియె బలివివర్జిత ధార\న్‌.
610
ఆ. కమలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు
నెఱిఁగి శుక్రు మాట లెఱిఁగి నాశ
మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి
మహి వదాన్యుఁ డొకఁడు మఱియుఁ గలడె.
611
క. క్షితి దానమిచ్చు నతఁడును
నతికాంక్షఁ బరిగ్రహించు నతఁడును దురిత
చ్యుతులై శతవత్సరములు
శతమఖ లోకమునఁ గ్రీడ సలుపుదు రెలమి\న్‌.
612
వ. అట్లు గావున నే దానంబును భూమిదానంబునకు సదృశంబు గానేరదు. కావున వసుంధరా దానంబిచ్చితి. ఉభయలోకంబులం గీర్తి సుకృతంబులు వడయుము. అని పలికి, యమ్మాయావటుండిట్లనియె. 613
క. ఇది యేమి వేఁడితని నీ
మది వగవక ధారవోయుమా, సత్యము పెం
పొదవఁగఁ గోరిన యర్థం
బిది యిచ్చుట ముజ్జగంబు లిచ్చుట మాకు\న్‌.
614
వ. అని పలికిన పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండై వైరోచనుండు. 615
ఆ. పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో
చిట్టి బుద్ధు లిట్టి పొట్టి వడుగు
పొట్టనున్న వెల్ల బూమెలు నని నవ్వి
యెలమి ధరణిదాన మిచ్చె నపుడు.
616
క. బలి చేసిన దానమునకు
నళినాక్షుఁడు నిఖిల భూతనాయకుఁ డగుటం
గలకల మనె దశదిక్కులు
భళిభళి యని పొగడె భూతపంచక మనఘా!
617
ఆ. గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర
యక్ష పక్షి దేవతాహిపతులు
పొగడి రతనిపెంపుఁ బుష్పవర్షంబులు
గురిసె దేవతూర్యకోటి మొరసె.
618
వ. ఇట్లు ధారా పరిగ్రహంబు చేసి. 619
వామనమూర్తి విశ్వరూపంబు నొంది విజృంభించుట
శా. ఇంతింతై వటుఁడింతయై మఱియుఁ దానింతై నభోవీథిపై
నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
620
మ. రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్వస్త్రమై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండము నిండుచోన్‌.
621
వ. ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరియించిన, నభంబును, దివంబును, భువనంబును, దిశలును, సముద్రంబులును, జల దచల దఖిలభూత నివహంబులుం దానయై యేకీభవించి, క్రమక్రమంబున భూలోకంబునకుం బొడవై, భువర్లోకంబు నతిక్రమించి, సువర్లోకంబునుం దలకడచి, మహర్లోకంబు దాఁటి, జనోలోకంబునకు మీఁదై, తపోలోకంబునకు నుచ్ఛ్రయుండై, సత్యలోకంబుకంటె నౌన్నత్యంబు వహించి, యెడ, లిఱుములు, సందులు, రంధ్రంబులు లేకుండ నిండి, మహాదేహమహితుండై, చరణతలంబున రసాతలంబును, బాదంబుల మహియును, జంఘల మహీంధ్రంబులును, జానువులం బతత్త్రిసముదయంబులును, నూరువుల నింద్రసేన, మరుద్గణంబులును, వాసస్స్థలంబున సంధ్యయు, గుహ్యంబునఁ బ్రజాపతులును, జఘనంబునం దనుజులును, నాభిని నభంబును, నుదరంబునఁ నుదధి సప్తకంబును, నురంబునఁ దారకా నికరంబును, నురోజంబుల ఋతసత్యంబులును, హృదయంబున ధర్మంబును, మనంబునఁ జంద్రుండును, వక్షంబునఁ గమలహస్త యగు లక్ష్మియుఁ, గంఠంబున సామాది సమస్త వేదములును, భుజంబులం బురందరాది దేవతలును, గర్ణంబుల దిశలును, శిరంబున నాకాశంబును, శిరోజంబుల మేఘంబులును, నాసాపుటంబున వాయువులును, నయనంబుల సూర్యుండును, వదనంబున వహ్నియు, వాణి నఖిల చ్ఛందస్సముదయంబును, రసనంబున జలేశుండును, భ్రూయుగళంబున విధినిషేధంబులును, ఱెప్పల నహోరాత్రంబులును, లలాటంబునఁ గోపంబును, నధరంబున లోభంబును, స్పర్శంబునఁ గామంబును, రేతంబున జలంబును, పృష్ఠంబున నధర్మంబును, గ్రమణంబున యజ్ఞంబును, ఛాయవలన మృత్యువును, నగవువలన ననేక మాయావిశేషంబులును, రోమంబుల నోషధులును, నాడీప్రదేశంబుల నదులును, నఖంబుల శిలలును, బుద్ధి నజుండును, బ్రాణంబుల దేవర్షిగణంబులును, గాత్రంబున జంగమ స్థావర జంతు సంఘంబులును గలవాఁడై, జలధర నినద శంఖ శార్ఙ్గ సుదర్శన గదాదండ ఖడ్గాక్షయబాణతూణీర విభ్రాజితుండును, మకర కుండల కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తుభ మణిమేఖలాంబర వనమాలికా విరాజితుండును, సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచరవాహినీ సందోహ పరివృతుండును, నసమాన తేజో విలసితుండునునై, బ్రహ్మాండంబు తన మేని కప్పు తెఱంగున నుండ విజృంభించి. 622
మ. ఒకపాదంబున భూమిఁ గప్పి దివి వేఱొంటన్‌ నిరోధించి యొం
డొకటం మీఁద జగంబు లెల్లఁ దొడి నొండొంట\న్‌ విలంఘించి ప
ట్టక బ్రహ్మాండకటాహముం బగిలి వేండ్రంబై పగుల్‌ గానరా
నొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతి\న్‌.
623
ఆ. ఒక పదంబు క్రింద నుర్వి పద్మమునంటి
కొనినఁ బంకలవము కొమరుఁ దాల్చె
నొకటి మీఁదఁ దమ్మి కొదిఁగిన తేఁటి నా
వెలసె మిన్ను నృప! త్రివిక్రమమున.
624
వ. తత్సమయంబున. 625
ఆ. జగము లెల్ల దాఁటి చనిన త్రివిక్రము
చరణ నఖరచంద్ర చంద్రికలను
బొనుఁగు వడియె సత్యమున బ్రహ్మతేజంబు
దివసకరుని రుచుల దివియ భంగి.
626
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )