ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౨౧
సీ. భవబంధములఁ బాసి బ్రహ్మలోకంబునఁ గాఁపురంబులు సేయు ఘనులు రాజు
లా మరీచాద్యులు నా సనందాదులు నా దివ్యయోగీంద్రు లచట నెపుడు
మూర్తిమంతంబులై మ్రోయు పురాణ తర్కామ్నాయ నియమేతిహాస ధర్మ
సంహితాదులు గురుజ్ఞానాగ్ని నిర్దగ్ధకర్ములై మఱియును గలుగునట్టి
 
ఆ. వారలెల్లఁ జొచ్చి వచ్చి సర్వాధిపు నంఘ్రిఁ జూచి మ్రొక్కి రధికభక్తిఁ
దమ మనంబులందు దలఁచు విధానంబు గంటి మనుచు నేఁడు మంటి మనుచు.
627
మ. తన పుట్టిల్లిదె పొమ్మటంచు నజుఁడుం దన్నాభి పంకేరుహం
బు నిరీక్షించి నటించి యున్నతపదంబుం జూచి తత్పాదసే
చనముం జేసెఁ గమండూదకములుం జల్లించి తత్తోయముల్‌
వినువీథిం బ్రవహించె దేవనది నా విశ్వాత్ము కీర్తిప్రభ\న్‌.
628
వ. తత్సమయంబున. 629
సీ. యోగమార్గంబున నూహించి బహువిధ పుష్పదామంబులఁ బూజచేసి
దివ్యగంధంబులు దెచ్చి సమర్పించి ధూపదీపములఁ దోడ్తోడ నిచ్చి
భూరి లాజాక్షతంబులు సల్లి ఫలములు గానుక లిచ్చి రాగములఁ బొగడి
శంఖాదిరవముల జయఘోషములు సేసి కరుణాంబునిధి! త్రివిక్రమ! యటంచు
 
ఆ. బ్రహ్మమొదలు లోకపాలురు గొనియాడి రెల్లదిశల వనచరేశ్వరుండు
జాంబవంతుఁ డరిగి చాటె భేరీధ్వని వెలయఁ జేసి విష్ణు విజయ మనుచు.
630
క. అన్ని జగంబులఁ దానై
యున్న జగన్నాథుఁ జూడ నొగి భావింపం
గన్నందక మనమందక
సన్నుతులం జేసిరపుడు సభ్యులు బలియు\న్‌.
631
వ. అంత నొయ్యనఁ బూర్వప్రకారంబున నున్న వామనునిం గని, పదత్రయ వ్యాజంబున నితఁడు సకల మహీమండలంబు నాక్రమించె. కపటవటురూప తిరోహితుండగు విష్ణుండని యెఱుంగక మన దానవేంద్రుండు సత్యసంధుండు గావున మాటదిరుగక యిచ్చె. అతని వలన నేరంబు లేదు. ఈ కుబ్జుం డప్రతిహత తేజఃప్రభావంబున నిజ్జగంబులం బరిగ్రహించి, పర్జన్యాదులకు విసర్జనంబు చేయందలంచి యున్నవాఁడు. ఈ వటునిం దూఱి పాఱనీక నిర్జించుట కర్జంబని, రాహు హేతి ప్రహేతి ముఖ్యులగు రక్కసు లుక్కు మిగిలి, యుద్ధంబునకు సన్నద్ధులై, పరశు పట్టస భల్లాది సాధనంబులు ధరియించి, కసిమసంగి, ముసరికొని, దశదిశలం బ్రసరించినం జూచి, హరిపరిచరులగు సునంద నంద జయ జయంత విజయ ప్రబలోద్బల కుముద కుముదాక్ష తార్క్ష్య పుష్పదంత విష్వక్సేన శ్రుతదేవ సాత్త్వతులను దండనాథు లయుత వేదండ సముద్దండ బలులై, తమ తమ యూధంబుల నాయుధంబులతోఁ గూడికొని, దానవానీకంబులం బరలోకంబున కనుపువారలై యుండ, వారల నెదుర్కొని, కదనంబునకుం బరవసంబు సేయుచున్నం గనుంగొని, శుక్రుశాపంబు దలంచి, దనుజవల్లభుండిట్లనియె. 632
సీ. రాక్షసోత్తములార! రండు పోరాడక కాలంబు గాదిది కలహమునకు
సర్వభూతములకు సంపదాపదలకుఁ బ్రభువైన దైవంబు పరిభవింప
మన మోపుదుమె తొల్లి మనకు రాజ్యంబును సురలకు నాశంబు సొరిది నిచ్చి
విపరీతముగఁ జేయు వేల్పు నేమందుము మనపాలి భాగ్యంబు మహిమ గాక
 
తే. వెఱచి పలుమాఱుఁ బాఱెడి విష్ణుభటులు మిమ్ముఁ గెలుచుట దైవంబు మేర గాదె
మనకు నెప్పుడు దైవంబు మంచిదగును నాఁడు గెలుతము పగవారి నేఁడు వలదు.
633
వ. అదియునుం గాక. 634
క. బలుదుర్గంబులు సచివులు
బలములు మంత్రౌషధములు బహుశేముషియుం
గలిగియు సామోపాయం
ములఁ గాలం బెఱిఁగి నృపుడు పోరుట యొప్పు\న్‌.
635
వ. అట్లు గావున రణంబున కిప్పుడు శత్రుల కెదురు మోహరించుట కార్యంబుగాదు. మనకునుం దగు కాలంబున జయింతము. నలంగక తలంగుం డనినఁ, దలంగి, భాగవతభట భీతులై చిక్కి, రక్కసులు రసాతలంబునకుం జనిరి. అప్పుడు హరి హృదయం బెఱింగి, తార్క్ష్యనందనుండు యాగసుత్యాహంబున వారుణపాశంబుల నసురవల్లభుని బంధించె. అంత. 636
క. బాహులు పదములుఁ గట్టిన
శ్రీహరికృప గాక యేమిసేయుదునని సం
దేహింపక బలి నిలిచెను
హాహారవ మెసఁగె దశ దిగంతములందు\న్‌.
637
క. సంపద చెడియును దైన్యముఁ
గంపంబును లేక దొంటికంటెను బెంపుం
దెంపును నెఱుకయు ధైర్యము
వంపని సురవైరిఁ జూచి వటుఁడిట్లనియె\న్‌.
638
సీ. దానవ! త్రిపదభూతల మిత్తునంటివి, తరణి చంద్రాగ్ను లెందాకఁ నుందు
రంతభూమియు నొక్క యడుగయ్యె నాకును స్వర్లోకమును నొకచరణమయ్యె
నీసొమ్ము సకలమ్ము నేఁడు రెండడుగులు గడమపాదమునకుఁ గలదె భూమి
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు నిరయంబు నొందుట నిజము గాదె
 
తే. కాన దుర్గతికినిఁ గొంత కాల మరుగు గాక యిచ్చెద వేని వేగంబు నాకు
నిపుడు మూఁడవ పదమున కిమ్ము చూపు బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె.
639
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )