ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౨౨
వ. అని యిట్లు వామనుండు వలుక, సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్యనికృత్త హృదయుండయ్యును, విషణ్ణుండుగాక, వైరోచని ప్రసన్నవదనంబుతోడఁ జిన్ని ప్రోడవడుగున కిట్లనియె. 640
ఆ. సూనృతంబు కాని నుడియదు నా జిహ్వ
బొంకఁజాల నాకు బొంకు లేదు
నీ తృతీయ పదము నిజము నా శిరమున
నెలవుసేసి పెట్టు నిర్మలాత్మ!
641
ఆ. నిరయమునకుఁ బ్రాప్త నిగ్రహంబునకును
బదవిహీనతకును బంధమునకు
నర్థభంగమునకు నఖిలదుఃఖమునకు
వెఱవ దేవ! బొంక వెఱచినట్లు.
642
వ. అదియునుం గాక. 643
సీ. తల్లిదండ్రులు నన్నదమ్ములు చెలికాండ్రు గురువులు శిక్షింపఁ గొఱఁత వడునె
పిదప మేలగుఁగాక పృథు మదాంధులకును దానవులకు మాకుఁ దఱి యెఱింగి
విభ్రంశచక్షువుల్‌ వెలయ నిచ్చుటఁజేసి గురువుల్లో నాదిగురువ వీవ
నీవు బంధించిన నిగ్రహమో లజ్జయో నష్టియో బాధయో తలంప
 
తే. నిన్ను నెదిరించి పోరాడి నిర్జరారు లాదియోగీంద్రు లందెడు నట్టి టెంకి
నందరే తొల్లి పెక్కండ్రు హర్షమూర్తి! వైరభక్తులు గట్టిగా వలయుఁగాక.
644
మ. చెలియే మృత్యువు చుట్టమే యముఁడు సంసేవార్థులే కింకరుల్‌
శిలలం జేసెనె బ్రహ్మ దన్ను దృఢమే జీవంబు నో చెల్లరే
చలితం బౌట యెఱుంగ రీ కపటసంసారంబు నిక్కంబుగాఁ
దలఁచు\న్‌ మూఁఢుడు సత్య దాన కరుణా ధర్మాది నిర్ముక్తుఁడై.
645
సీ. చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు కాంతలు సంసార కారణములు
ధనము లస్థిరములు దను వతిచంచల కార్యార్థు లన్యులు గడచుఁ గాల
మాయువు సత్వర మతిశీఘ్ర మని కాదె యనఘుండు దమతండ్రి నధికరించె
మాతాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు నీపాదకమలంబు నియతిఁ జేరె
 
తే. భద్రుఁ డతనికి మృతిలేని బ్రతుకు గలిగె వైరులై కాని తొల్లి మావారు గాన
రర్థివై వచ్చి నీవు నన్నడుగు టెల్లఁ బద్మలోచన! నా పుణ్యఫలము గాదె.
646
వ. అని యిట్లు పలుకుచున్న యవసరంబున. 647
శా. ఆ దైత్యేంద్రుఁడు పీనవక్షు నవపద్మాక్షు\న్‌ బిశాంగాంబరా
చ్ఛాదు\న్‌ నిర్మల సాధువాదు ఘన సంసారచ్ఛదచ్ఛేదు సం
శ్రీదు\న్‌ భక్తిలతాతిరోహిత హరిశ్రీపాదు నిఃఖేదుఁ బ్ర
హ్లాదు\న్‌ బోధకళావినోదుఁ గనియె\న్‌ హర్షంబుతో ముందట\న్‌.
648
వ. ఇట్లు సమాగతుండైన తమ తాతం గనుంగొని, విరోచననందనుండు వారుణ పాశ బద్ధుండు గావునఁ దనకుం దగిన నమస్కారంబు సేయరామింజేసి సంకులాశ్రు విలోలలోచనుండై, సిగ్గుపడి, నతశిరస్కుండై, నమ్రభావంబున మ్రొక్కు చెల్లించె. అంతఁ బ్రహ్లాదుండును మఖమంటపంబున సునందాది పరిచర సమేతుండై, కూర్చున్న వామనదేవునిం గని, యానంద బాష్ప జలంబులం, బులకాంకురంబులు న్నెఱయ, దండప్రణామం బాచరించి యిట్లని విన్నవించె. 649
సీ. ఇతనికి మున్ను నీ వింద్రపదంబిచ్చి నేఁడు త్రిప్పుటయును నెఱయ మేలు
మోహనాహంకృతి మూలంబు గర్వాంధతమస వికారంబు దాని మాన్పి
కరుణ రక్షించుట గాక బంధించుటే తత్త్వజ్ఞునకు మహేంద్రత్వ మేల
నీ పాదకమలంబు నియతిఁ గొల్చినదానిఁ బోలునే సురరాజ్య భోగపరత
 
తే. గర్వ మేపారఁ గన్నులు గానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కువడును
మఱచు నీ సేవలన్నియు మహిమ మాన్చి మేలు చేసితి నీ మేటిమేర సూపి.
650
వ. అని పలికి, జగదీశ్వరుండును, నిఖిల లోకసాక్షియు నగు నారాయణదేవునకు నమస్కరించి, ప్రహ్లాదుండు పలుకుచున్న సమయంబున. 651
మ. తతమత్తద్విపయానయై కుచ నిరుంధచ్చోళ సంవ్యానయై
ధృత బాష్పాంబువితానయై కరయుగాధీనాలికస్థానయై
'పతిభిక్షాం మమ దేహి కోమలమతే! పద్మాపతే' యంచుఁ ద
త్సతి వింధ్యావళి సేరవచ్చెఁ ద్రిజగద్రక్షామను\న్‌ వామను\న్‌.
652
వ. వచ్చి యచ్చేడియ తచ్చరణసమీపంబునం బ్రణతయై, నిలువంబడి యిట్లనియె. 653
క. నీకుం గ్రీడార్థము లగు
లోకంబులఁ జూచి పరులు లోకులు కుమతుల్‌
లోకాధీశుల మందురు
లోకములకు రాజ వీవ లోకస్తుత్యా!
654
క. కాదనఁడు పొమ్ము లే దీ
రాదనఁడు జగత్త్రయైక రాజ్యము నిచ్చె
న్నా దయితుఁ గట్టనేటికి
శ్రీదయితా చిత్తచోర! శ్రితమందారా!
655
వ. అని యిట్లు వింధ్యావళియునుం, బ్రహ్లాదుండును విన్నవించు నవసరంబున హిరణ్య గర్భుండు సనుదెంచి యిట్లనియె. 656
సీ. భూతలోకేశ్వర! భూతభావన! దేవదేవ! జగన్నాథ! దేవవంద్య!
తనసొమ్ము సకలంబు దప్పక నీ కిచ్చె దండయోగ్యుఁడు గాఁడు దానపరుఁడు
కరుణింప నర్హుండు కమలలోచన! నీకు విడిపింపు మీతని వెఱపుఁ దీర్చి
తోయపూరము చల్లి దూర్వాంకురంబులఁ జేరి నీ పదము లర్చించునట్టి
 
తే. భక్తియుక్తుఁడు లోకేశపదము నందు నీవు ప్రత్యక్షముగ వచ్చి నేఁడు వేఁడ
నెఱిఁగి తనరాజ్యమంతయు నిచ్చినట్టి బలికిఁ దగునయ్య దృఢ పాశబంధనంబు.
657
వ. అని పలికిన బ్రహ్మవచనంబులు విని, భగవంతుండిట్లనియె. 658
సీ. ఎవ్వనిఁ గరుణింప నిచ్ఛయించితి వాని యఖిలవిత్తంబు నే నపహరింతు
సంసార గురుమద స్తబ్ధుఁడై యెవ్వఁడు దెగడి లోకము నన్ను ధిక్కరించు
నతఁ డెల్లకాలంబు నఖిలయోనులయందుఁ బుట్టుచు దుర్గతిఁ బొందుఁ బిదప
విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వ ముడిగి
 
తే. యేకవిధమున విమలుఁడై యెవ్వఁడుండు వాఁడు నాకూర్చి రక్షింపవలయువాఁడు
స్తంభ లోకాభిమాన సంసారవిభవ మత్తుఁడై చెడ నొల్లఁడు మత్పరుండు.
659
శా. బద్ధుండై గురుశప్తుఁడై ఛలితుఁడై బంధువ్రజ త్యక్తుఁడై
సిద్ధైశ్వర్యము గోలుపోయి విభవక్షీణుండునై పేదయై
శుద్ధత్వంబును సత్యమున్‌ గరుణయున్‌ జొప్పేమియుం దప్పఁడు
ద్బుద్ధుండై యజయాఖ్య మాయ గెలిచెం బుణ్యుం డితం డల్పుఁడే.
660
ఆ. అసురనాథుఁ డనుచు ననఘుని మర్యాద
యేను జూత మనుచు నింత వలుక
నిజము వలికె నితఁడు నిర్మలాచారుండు
మేలు మేలు నాకు మెచ్చు వచ్చె.
661
క. సావర్ణి మనువువేళను
దేవేంద్రుండగు నితండు దేవతలకు సం
భావితమగు నా చోటికి
రావించెద నంతమీఁద రక్షింతు దయన్‌.
662
క. వ్యాధులు దప్పులు నొప్పులు
బాధలు చెడి విశ్వకర్మభావిత దనుజా
రాధిత సుతలాలయమున
నేధితవిభవమున నుండు నితఁడందాఁకన్‌.
663
వ. అని పలికి, బలిం జూచి, భగవంతుండిట్లనియె. 664
సీ. సేమంబు నీ కింద్రసేనమహారాజ! వెఱవకు మేలు నీ వితరణంబు
వేలుపు లందుండ వేడుక పడుదురు దుఃఖంబు లిడుమలు దుర్మరణము
లాతురతలు నొప్పు లందుండువారికి నొందవు సుతలమందుండు నీవు
నీ పంపు సేయని నిర్జరారాతుల నా చక్ర మేతెంచి నఱకుచుండు
 
ఆ. లోకపాలకులకు లోనుగా వక్కడ నన్యు లెంతవార లచట నిన్ను
నెల్లప్రొద్దు వచ్చి యేను రక్షించెదఁ గరుణతోడ నీకు గానవత్తు.
665
క. దానవ దైత్యుల సంగతిఁ
బూనిన నీ యసురభావమును దోడ్తో మ
ద్ధ్యానమున దొలఁగిపోవును
మానుగ సుతలమున నుండుమా మా యాజ్ఞ\న్‌.
666
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )