ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౨౩
వ. అని యిట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుకవేల్పు తియ్యని నెయ్యంపుఁ బలుకుఁ జెఱకురసంపు సోనలు వీనులతెరువులం జొచ్చి, లో బయలు నిండి, ఱెప్పలకప్పు తప్పం ద్రోచికొని, కనుఁగవకొలంకుల నలుఁగులు వెడలినచందంబున సంతసంబునం గన్నీరు మున్నీరై పఱవ, నురఃఫలకమునం బులకంబులు కులకంబులై తిలకంబు లొత్తఁ గేలు మొగిడ్చి, నెక్కొన్న వేడుకం ద్రొక్కుడు వడుచుఁ జిక్కనిచిత్తంబునఁ జక్కనిమాటల రక్కసులఱేఁడిట్లనియె. 667
ఉ. ఎన్నఁడు లోకపాలకుల నీ కృపఁ జూడని నీవు నేఁడు న
న్నున్నతుఁ జేసి నా బ్రతుకు నోజయు నానతియిచ్చి కాచి తీ
మన్నన నీదయారసము మాటల పెద్దఱికంబు చాలదే
పన్నగతల్ప! నిన్నెఱిఁగి పట్టిన నాపద గల్గ నేర్చునే.
668
వ. అని పలికి, బంధవిముక్తుండై, హరికి నమస్కరించిఁ, బ్రహ్మకుం బ్రణామంబు సేసి, యిందుధరునకు వందనం బాచరించి, తనవారలతోఁ జేరికొని, బలి సుతలంబునకుం జనియె. అంత హరికృపావశంబునం గృతార్థుండై, కులోద్ధారకుండైన మనుమనిం గని, సంతోషించి ప్రహ్లాదుండు భగవంతున కిట్లనియె. 669
సీ. చతురాననుఁడు నీ ప్రసాదంబు గానఁడు శర్వుఁడీ లక్ష్ముల జాడఁ బొందఁ
డన్యుల కెక్కడి దసురులకును మాకు బ్రహ్మాది పూజితపదుఁడవైన
దుర్లభుండవు నీవు దుర్గపాలుఁడవైతి పద్మజాదులు భవత్పాదపద్మ
మకరందసేవన మహిమ నైశ్వర్యంబు లందిరి కాక మే మల్పమతుల
 
తే. మధిక దుర్యోనులము కుత్సితాత్మకులము నీ కృపాదృష్టి మార్గంబు నెలవు సేర
నేమి తపమాచరించితి మెన్నగలమె మమ్ముఁ గాచుట చిత్రంబు మంగళాత్మ!
670
వ. అదియునుం గాక. 671
ఆ. సర్వగతుఁడవయ్యు సమదర్శనుఁడవయ్యు
నొకట విషమవృత్తి నుండు దరయ
నిచ్చలేని వారి కీవు; భక్తులు గోరు
తలఁపు లిత్తు కల్పతరువుమాడ్కి.
672
వ. అని విన్నవించుచున్న ప్రహ్లాదుం జూచి, పరమపురుషుండిట్లనియె. 673
తే. వత్స! ప్రహ్లాద! మేలు నీ వారు నీవు
సొరిది మనుమనిఁ దోడ్కొని సుతలమునకుఁ
బైనమై పొమ్ము నే గదాపాణి నగుచుఁ
జేరి రక్షింతు దురితంబు చెంద దచట.
674
వ. అని, యిట్లు నియమించినం, బరమేశ్వరునకు నమస్కరించి, వలగొని, కరకమల పుట ఘటిత నిటలతటుండై, వీడ్కొని, బలిం దోడ్కొని, సకలాసుర యూధంబునుం, దాను, నొక్క మహాబిలద్వారంబు సొచ్చి, ప్రహ్లాదుండు సుతల లోకంబునకుం జనియె. అంత బ్రహ్మవాదులైన యాజకుల సభామధ్యంబునం గూర్చున్న శుక్రునిం జూచి, నారాయణుండిట్లనియె. 675
ఆ. ఏమి గొఱఁత వడియె నీతని యాగంబు
విస్తరింపు కడమ విప్రవర్య!
విషమమైన కర్మవిసరంబు బ్రాహ్మణ
జనులు సూచినంత సమతఁ బొందు.
676
వ. అనిన శుక్రుండిట్లనియె. 677
సీ. అఖిలకర్మంబుల కధినాథుఁడవు నీవు యజ్ఞేశుఁడవు నీవు యజ్ఞపురుష!
ప్రత్యక్షమున నీవు పరితుష్టి నొందినఁ గడ మేల గల్గు నే కర్మములకు
ధన దేశ కాలార్హ తంత్ర మంత్రంబుల కొఱఁతలు నిన్నుఁ బేర్కొనిన మాను
నైనఁ గావింతు నీ యానతి భవదాజ్ఞ మెలఁగుట జనులకు మేలు గాదె
 
తే. యింతకంటెను శుభము నా కెచటఁ గలుగు ననుచు హరిపంపు శిరమున నావహించి
కావ్యుఁ డసురేంద్రు జన్నంబు కడమఁదీర్చె మునులు విప్రులు సాహాయ్యమునఁ జరింప.
678
వ. ఇవ్విధంబున వామనుండై హరి బలి నడిగి, మహిం బరిగ్రహించి, తనకు నన్నయగు నమరేంద్రునకుం ద్రిదివంబును సదయుండై యిచ్చెను. అప్పుడు దక్ష భృగు ప్రజాపతులును, భవుండును, గుమారుండును, దేవర్షి పితృగణంబులును, రాజులును, దానును గూడికొని, చతురాననుండు కశ్యపునకు, నదితికి సంతోషంబుగా, లోకంబులకును, లోకపాలురకును వామనుండు వల్లభుండని నియమించె. అందఱును ధర్మంబునకు, యశంబునకు, లక్ష్మికి, శుభంబులకు, దేవతలకు, వేదంబులకు, స్వర్గాపవర్గంబులకు, నుపేంద్రుండు ప్రధానుండని సంకల్పించిరి. ఆ సమయంబున. 679
క. కమలజుఁడు లోకపాలురు
నమరేంద్రునిఁ గూడి దేవయానంబున న
య్యమరావతికిని వామను
నమరం గొనిపోయిరంత నట మీఁద నృపా!
680
ఆ. బల్లిదంపుఁ దోడు ప్రాపున నింద్రుని
కింద్రపదము చేరు టిట్లు గలిగెఁ
దనకు నాద్యుఁడైన తమ్ముఁడు గలిగినఁ
గోర్కు లన్న కేల కొఱఁత నొందు.
681
క. పాలడుగఁడు మేలడుగం
డేలఁడు భిక్షించి యన్న కిచ్చెఁ ద్రిజగముల్‌,
వేలుపులతల్లి కడపటి
చూలుం బోలంగఁ గలరె సొలయని తమ్ముల్‌.
682
ఆ. కడుపు బరువుగాఁగఁ గొడుకుల గనుకంటె
తల్లి కొకఁడె చాలు బల్లిదుండు
ద్రిదశగణముఁ గన్న యదితి కానుపు దీర్చి
చిన్ని మేటివడుగుఁ గన్న యట్లు.
683
వ. ఇట్లు దేవేంద్రుండు వామన భుజపాలితంబగు త్రిభువన సామ్రాజ్యవిభవంబు మఱల నంగీకరించె. అప్పుడు బ్రహ్మయు, శర్వుండును, గుమారుండును, భృగు ప్రముఖులైన మునులును, బితృదేవతలును, దక్షాది ప్రజాపతులును, సిద్ధులును, వైమానికులును, మఱియుం దక్కిన వారలు నద్భుత ప్రకాశుండైన జిష్ణు ప్రభావంబులకు నాశ్చర్యంబు నొందుచుఁ, బ్రశంసింపుచు, నాడుచుం, బాడుచుం దమతమ నివాసంబులకుం జనిరి. అని చెప్పి, శుకుండిట్లనియె. 684
తే. మనుజనాథ! త్రివిక్రమ మహిమ కొలఁది
యెఱిఁగి తర్కింప లెక్కింప నెవ్వఁ డోపుఁ
గుంభినీ రేణుకణములు గుఱుతు వెట్టు
వాఁడు నేరఁడు తక్కినవారి వశమె.
685
క. అద్భుత వర్తనుఁడగు హరి
సద్భావితమైన విమలచరితము వినువాఁ
డుద్భట విక్రముఁడై తుది
నుద్భాసితలీలఁ బొందు నుత్తమ గతుల\న్‌.
686
తే. తగిన మానుష పైతృక దైవకర్మ
వేళలందుఁ ద్రివిక్రమ విక్రమంబు
లెక్క డెక్కఁడఁ గీర్తింతు రెవ్వరేనిఁ
బొందుదురు నిత్య సౌఖ్యంబు భూవరేంద్ర!
687
వ. అని, యిట్లు శుకుండు రాజునకు వామనావతార చరితంబు సెప్పె. అని సూతుండు మునులకుం జెప్పిన విని వార లతని కిట్లనిరి. 688
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )