ఇతిహాసములు భాగవతము అష్టమ స్కంధము
అధ్యాయము - ౨౪
మత్స్యావతార కథ
సీ. విమలాత్మ! విన మాకు వేడుకయ్యెను మున్ను హరి మత్స్యమైన వృత్తాంతమెల్లఁ
గర్మబద్ధుని భంగి ఘనుఁ డీశ్వరుడుఁ లోకనిందితంబై తమోనిలయమైన
మీనరూపము నేల మేలని ధరియించె నెక్కడ వర్తించె నేమి చేసె
నాద్యమై వెలయు నయ్యవతారమునకు నెయ్యది కారణంబు కార్యాంశమెట్లు
 
ఆ. నీవు తగుదు మాకు నిఖిలంబు నెఱిఁగింపఁ దెలియఁ జెప్పవలయు దేవదేవు
చరిత మఖిలలోక సౌభాగ్యకరణంబు గాదె విస్తరింపు క్రమముతోడ.
689
వ. అని, మునిజనంబులు సూతు నడిగిన, నతండిట్లనియె. మీర లడిగిన యీ యర్థంబుఁ బరీక్షిన్నరేంద్రుం డడిగిన, భగవంతుండగు బాదరాయణి యిట్లనియె. 690
సీ. విభుఁ డీశ్వరుఁడు వేద విప్ర గో సుర సాధు ధర్మార్థములఁ గావఁ దనువుఁ దాల్చి
గాలి చందంబున ఘనరూపముల యందుఁ దనురూపముల యందుఁ దగిలియుండు
నెక్కువ తక్కువ నెన్నఁడు నొందక నిర్గుణత్వంబున నెఱియు ఘనుఁడు
గురుతయుఁ గొఱఁతయు గుణసంగతి వహించు మనుజేశ! చోద్యమే మత్స్యమగుట
 
తే. వినుము పోయిన కల్పాంతవేళఁ దొల్లి ద్రవిళ దేశపురాజు సత్యవ్రతుండు
నీరు ద్రావుచు హరిఁ గూర్చి నిష్ఠతోడఁ దపముఁ గావించె నొక యేటి తటమునందు.
691
వ. మఱియు, నొక్కనాఁ డమ్మేదినీకాంతుండు, కృతమాలిక యను నేటి పొంత హరిసమర్పణంబుగా జలతర్పణంబు సేయుచున్న సమయంబున, నా రాజు దోసిట నొక్కమీను పట్టి, దవిలివచ్చిన నుల్కిపడి, మఱలం దరంగిణీ జలంబు నందు శకుల శాబకంబు విడిచె. విడివడి నీటిలో నుండి జలపోతంబు భూతలేశ్వరున కిట్లనియె. 692
మత్తకోకిల. పాటువచ్చిన జ్ఞాతిఘాతులు పాపజాతి ఝషంబు లీ
యేటఁ గొండొక మీనుపిల్లల నేఱి పట్టి వధింప న
చ్చోట నుండక నీదుదోసిలి సొచ్చి వచ్చిన నన్ను న
ట్టేటఁ ద్రోవఁగఁ బాడియే కృప యింతలేక దయానిధీ!
693
ఆ. వలలుఁ దారు నింక వచ్చి జాలరి వేఁట
కాఱు నేఱుఁ గలఁచి గార వెట్టి
మిడిసి పోవనీక మెడఁ బట్టుకొనియెద
రప్పు డెందుఁ జొత్తు ననఘ చరిత!
694
క. భక్షించు నొండె ఝషములు
శిక్షింతురు ధూర్తులొండె చెడకుండ నను\న్‌
రక్షింపు దీనవత్సల!
ప్రక్షీణులఁ గాచుకంటె భాగ్యము కలదే.
695
వ. అనిన విని, కరుణాకరుండగు నవ్విభుండు, మెల్లన శకుల డింభకంబును గమండలు జలంబునం బెట్టి, తన నెలవునకుం గొనిపోయె. అదియు నొక్క రాత్రంబున గుండ నిండి, తనకు నుండ నిమ్ము చాలక రాజన్యున కిట్లనియె. 696
క. ఉండ నిది కొంచె మెంతయు
నొండొకటిం దెమ్ము భూవరోత్తమ! యనుడు\న్‌
గండకముఁ దెచ్చి విడిచెను
మండలపతి కలశ సలిల మధ్యమునందు\న్‌.
697
వ. అదియును, ముహూర్త మాత్రంబునకు మూఁడుచేతుల నిడుపై, యుదంచనంబు నిండి, పట్టులేక వేఱొండు దెమ్మనవు, డా రాచపట్టి కరుణాగుణంబులకు నాటపట్టు గావున, గండకంబును నొక్క చిఱుత మడుఁగున నునిచె. అదియును నా సరోవర జలంబులకు నగ్గలంబై, తనకు సంచరింప నది కొంచెంబని పలికినఁ, బుడమి ఱేఁడు మంచివాఁ డగుటంజేసి, యా యుదకచరంబు నుదంచిత జలాస్పదంబైన హ్రదంబునందు నిడియె. అదియును జలాశయంబునకు నధికంబై, పెరుఁగ నిమ్ములే దని చెప్పికొనిన, నప్పుణ్యుం డొప్పెడి నడవడి దప్పనివాఁడైన కతంబున, నమ్మహామీనంబును మహార్ణవంబున విడిచె. అదియును, మకరాకరంబునం బడి, పెను మొసళ్ళు ముసరికొని, కసిమసంగి, మ్రింగెడిని, ఇంత కాలంబు నడపి, కడపట దిగవిడువక, వెడలం దిగువుము. అని యెలుంగింప నన్నీటి పొడవునకుం బుడమిఱేఁడు దెలిసి యిట్లనియె. 698
సీ. ఒక దినంబున శతయోజన మాత్రము విస్తరించెదు నీవు వినుము చూడ
మిటువంటి ఝషముల నెన్నఁడు నెఱుఁగము మీనజాతుల కిట్టి మేను గలదె
యేమిటి కెవ్వఁడ వీలీలఁ ద్రిప్పెదు కరుణ నాపన్నులఁ గావ వేఁడి
యంభశ్చరంబైన హరివి నే నెఱిఁగితి నవ్యయ! నారాయణాభిధాన!
 
తే. జనన సంస్థితి సంహార చతురచిత్త! దీనులగు భక్తులకు మాకు దిక్కు నీవ
నీదు మీనావతారంబు నిఖిలభూత భూతిహేతువు మ్రొక్కెదఁ బురుషవర్య!
699
క. ఇతరులము గాము చిత్సం
గతులము మాపాల నీవు గలిగితి భక్త
స్థిరుఁడ వగు నిన్ను నెప్పుడు
నతి సేసిన వాని కేల నాశము గల్గున్‌.
700
క. శ్రీలలనా కుచవీథీ
కేళీపరతంత్ర బుద్ధిఁ గ్రీడించు సుఖా
లోలుఁడవు తామసాకృతి
నేలా మత్స్యంబ వైతి వెఱిఁగింపు హరీ!
701
వ. అని పలుకు సత్యవ్రతుండను మహారాజునకు నయ్యుగంబు కడపటఁ బ్రళయవేళ సముద్రంబున నేకాంతజన ప్రీతుండై విహరింప నిచ్ఛయించు మీనరూపుండైన హరి యిట్లనియె. 702
సీ. ఇటమీఁద నీ రాత్రి కేడవదినమునఁ బద్మగర్భున కొక్క పగలు నిండు
భూర్భువాదిక జగంబులు మూఁడు విలయాబ్ధిలోన మునుంగు నాలోనఁ బెద్ద
నావ చేరఁగవచ్చు నా పంపుపెంపున దానిపై నౌషధతతులు బీజ
రాసులు నిడి పయోరాశిలో విహరింపఁ గలవు సప్తఋషులుఁ గలసి తిరుగ
 
ఆ. మ్రోలఁ గానరాక ముంచుఁ బెంజీఁకటి మినుకుచుండు మునుల మేని వెలుఁగు
దొలఁకుచుండు జలధి దోధూయమానమై నావ తేలుచుండు నరవరేణ్య!
703
వ. మఱియు, న న్నావ మున్నీటికరళ్ళకు లోనుగాకుండ, నిరుగెలంకుల వెనుక ముందఱ నేమఱకుండ, పెన్నెఱులగు నాగఱులం జడియుచుఁ, బొడువవచ్చిన బలుగ్రాహంబుల నొడియుచు, సంచరించెద. ఒక్క పెనుబాఁము చేరువ, నా యనుమతిం బొడచూపెడు. దానంజేసి సుడిగాడ్పులకతంబున నావ వడిఁ దిరుగంబడకుండ నా కొమ్ముతుదిం బదిలంబుగఁ జేసి, నీకును మునులకు, నలజడి చెందకుండ మున్నీటి నిప్పాటం దమ్మిచూలి రేయి వేగునంతకు మెలంగెద. అది కారణంబుగా జలచరరూపంబు గైకొంటి. మఱియునుం బ్రయోజనంబు గలదు. నా మహిమ పరబ్రహ్మంబని తెలియుము. నిన్ను ననుగ్రహించితి. అని సత్యవ్రతుండు సూడ హరి తిరోహితుండయ్యె. అయ్యవసరంబున. 704
ఆ. మత్స్యరూపి యైన మాధవు నుడుగులు
తలఁచికొనుచు రాచతపసి యొక్క
దర్భశయ్యఁ దూర్పు దలగడగాఁ బండి
కాచియుండె నాఁటి కాలమునకు.
705
వ. అంతఁ గల్పాంతంబు డాసిన. 706
క. ఉల్లసిత మేఘపంక్తులు
జల్లించి మహోగ్రవృష్టి జడిగొని గురియ\న్‌
వెల్లి విరిసి జలరాశులు
సెల్లెలికట్టలను దాఁటి సీమల ముంచె\న్‌.
707
వ. తదనంతరంబ. 708
తే. మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర!
బ్రాహ్మ మనఁగ నైమిత్తికప్రళయమైన
నింగిపైఁ దొట్టి తొలఁకు మున్నీటిలోనఁ
గూలె భూతాళి జగముల కొలఁదు లెడలి.
709
వ. అంత నమ్మహారాత్రి యందు. 710
మ. నెఱి నెల్లప్పుడు నిల్చి ప్రాణిచయము\న్‌ మీలింప నిర్మించి వీఁ
పిఱియ న్నీల్గుచు నావులింపుచు నజుం డేసృష్టియు\న్‌ మాని మే
నొఱఁగ\న్‌ ఱెప్పలు మూసి కే ల్దలగడై యుండంగ నిద్రింపుచు\న్‌
గుఱు వెట్టం దొడఁగె\న్‌ గల ల్గనుచు నిర్ఘోషింపుచు\న్‌ భూవరా!
711
ఆ. అలసి సొలసి నిదుర నందిన పరమేష్ఠి
ముఖమునందు వెడలె మొదటిశ్రుతులు
నపహరించె నొక హయగ్రీవుఁడను దైత్య
భటుఁడు దొంగఁ దొడరఁ బరులవశమె.
712
క. చదువులు తన చేపడెనని
చదువుచుఁ బె\న్‌ బయల నుండ శంకించి వడి\న్‌
జదువులముదుకఁడు గూరుకఁ
జదువులతస్కరుఁడు సొచ్చె జలనిధికడుపు\న్‌.
713
వ. ఇట్లు వేదంబులు దొంగిలి, దొంగరక్కసుండు మున్నీట మునింగిన, వాని జయింపవలసియు, మ్రానుదీఁగెలయందు విత్తనంబుల పొత్తరులు పెన్నీట నాని చెడకుండ మనుపవలసియు, నెల్లకార్యంబులకుఁ గావలి యగు నా పురుషోత్తముం డప్పెనురేయి చొరుదలయందు. 714
క. కుఱుగఱులు వలుఁదమీసలు
చిఱుఁదోఁకయుఁ బసిఁడి యొడలు సిరిగల పొడలు\న్‌
నెఱిమొగము నొక్కకొమ్మును
మిఱుచూపులు గలిగి విభుఁడు మీనం బయ్యె\న్‌.
715
వ. ఇట్లు లక్ష యోజనాయుతంబైన పాఠీనంబై, విశ్వంభరుండు జలధి సొచ్చి. 716
సీ. ఒకమాటు జలజంతు యూధంబుతోఁ గూడు నొకమాటు దరులకు నుఱికివచ్చు
నొకమాటు మింటికి నుదరి యుల్లంఘించు నొకమాటు లోపల నొదిఁగి యుండు
లొకమాటు వారాశి నొడలుముంపమి సూపు నొకమాటు బ్రహ్మాండ మొరయఁ దలచు
నొకమాటు ఝషకోటి నొడిసి యాహరించు నొకమటు జలముల నుమిసివైచు
 
తే. గఱులు సారించు మీసలు గడలుగొలుపుఁ బొడలు మెఱిపించుఁ గన్నుల పొలప మార్చు
నొడలు ఝళిపించుఁ దళతళ లొలయు మీనవేషి పెన్నీట నిగమ గవేషి యగుచు.
717
వ. అంతకుమున్ను సత్యవ్రతుండు మహార్ణవంబులు మహీవలయంబు ముంచు నవసరంబునఁ భక్తపరాధీనుండగు హరిం దలఁచుచునుండ, నారాయణ ప్రేరితయై యొక్క నావ వచ్చినం గనుంగొని. 718
మ. చని సత్యవ్రత మేదినీదయితుఁ డోజం బూని మ్రా\న్‌ దీఁగె వి
త్తనముల్‌ పెక్కులు నావపై నిడి హరిధ్యానంబుతో దానిపై
మునిసంఘంబులుఁ దాను నెక్కి వెఱతో మున్నీటిపైఁ దేలుచు\న్‌
గనియె\న్‌ ముందట భక్తలోక హృదలంకర్మీణము\న్‌ మీనము\న్‌.
719
వ. కని, జలచరేంద్రుని కొమ్మున నొక్క పెనుఁబాపత్రాట నన్నావ గట్టి, సంతసించి డెందంబు నివిరికొని, తపస్వులతోడఁ గూడికొని, యా రాచపెద్ద మీనాకారుండగు వేల్పుఱేని నిట్లని పొగడె. 720
మ. తమలోఁబుట్టు నవిద్యఁ గప్పుగొనఁగ\న్‌ దన్మూల సంసారవి
భ్రములై కొందఱు దేలుచు\న్‌ గలఁగుచు\న్‌ బల్వెంటలం దైవయో
గమునం దే పరమేశుఁ గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై
ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మమ్మీశ్వరా!
721
ఉ. కన్నులులేనివాఁడు మఱి కాననివానికిఁ ద్రోవ సూపఁగాఁ
జన్నతెఱంగు మూఢున కసమ్మతి దా గురుఁడౌట సూర్యుఁడే
కన్నులుగాఁగ భూతములఁ గాంచుచు నుండు రమేశ! మాకు ను
ద్యన్నయమూర్తివై గురువవై యల సద్గతిజూడఁ జూపవే.
722
క. ఇంగలముతోడి సంగతి
బంగారమువన్నె గలుగుభంగిని నీ సే
వాంగీకృతుల యఘంబులు
భంగంబులఁ బొందు ముక్తి ప్రాపించు హరీ!
723
క. హృదయేశ! నీ ప్రసన్నత
పదివేలవపాలి లేశభాగము కతనం
ద్రిదశేంద్రత్వము గల దఁట
తుది నిను మెప్పింప నేది దొరకదు శ్రీశా!
724
క. పెఱవాఁడు గురుఁ డటంచును
గొఱగాని పదంబు సూపఁ గుజనుండును నీ
నెఱత్రోవ నడవనేర్చిన
నరమఱ లేనట్టిపదము నందు దయాబ్ధీ!
725
మ. చెలివై చుట్టమవై మనస్స్థితుఁడవై చిన్మూర్తివై యాత్మవై
వలనై కోర్కెలపంటవై విభుఁడవై వర్తిల్లు నిన్నొల్ల కే
పలువెంటం బడి లోక మక్కట! వృథా బద్ధాశమై పోయెడి\న్‌
నిలువ న్నేర్చునె హేమరాశిఁ గనియు న్నిర్భాగ్యుఁ డంభశ్శయా!
726
ఆ. నీరరాశిలోన నిజకర్మబద్ధమై
యుచితనిద్రఁ బొందియున్న లోక
మే మహాత్ముచేత నెప్పటి మేల్కాంచు
నట్టి నీవు గురుఁడ వధిప! మాకు.
727
క. ఆలింపుము విన్నప మిదె
వేలుపుగమిఱేని నిన్ను వేఁడికొనియెద\న్‌
నాలోని చిక్కు మానిచి
నీలోనికిఁ గొంచుఁ బొమ్ము నిఖిలాధీశా!
728
వ. అని యిట్లు సత్యవ్రతుండు పలికిన సంతసించి మత్స్యరూపంబున మహాసముద్రంబున విహరించు హరి, పురాణపురుషుం డగుటంజేసి, సాంఖ్యయోగ క్రియా సహిత యగు పురాణసంహిత నుపదేశించె. అమ్మహారాజు మునిసమేతుండై, భగవన్నిగదితంబైన, సనాతనంబగు బ్రహ్మస్వరూపంబు దెలిసికొని, కృతార్థుండయ్యె. ఇమ్మహాకల్పంబున వివస్వతుండనం బరఁగిన సూర్యునకు శ్రాద్ధదేవుండన జన్మించి, శ్రీహరికృపావశంబున నేడవ మనువయ్యె. అంత నవ్విధంబునం బెనురేయి నిండు నంతకు సంచరించి, జలచరాకారుండగు నారాయణుండు, దన్నిశాంత సమయంబునందు. 729
మ. ఉఱ కంభోనిధి లోని వేదముల కుయ్యుం దైన్యముం జూచి వే
గఱు లాడించి ముఖంబు సాఁచి బలువీఁక\న్‌ దోఁక సారించి మే\న్‌
మెఱయ\న్‌ దౌడలు గీఱి మీస లడర\న్‌, మీనాకృతి\న్‌ విష్ణుఁ డ
క్కఱటిం దాఁకి వధించె ముష్టి దళిత గ్రావు\న్‌ హయగ్రీవుని\న్‌.
730
వ. అంతఁ బ్రళయావసాన సమయంబున. 731
సీ. ఎప్పుడు వేగునం చెదురు సూచుచునుండు మునుల డెందంబులు ముదము నొందఁ
దెలివితోఁ బ్రక్క నిద్రించు భారతి లేచి యోరపయ్యెద చక్క నొత్తికొనఁగ
మలినమై పెనురేయి మ్రక్కిన తేజంబు తొంటిచందంబునఁ దొంగలింపఁ
బ్రాణుల సంచిత భాగధేయంబులు గన్నుల కొలుకులఁ గానఁబడఁగ
 
తే. నవయవంబులు కదలించి యావులించి నిదుర దెప్పిఱి మేల్కాంచి నీల్గి మలఁగి
యొడలు విఱుచుచుఁ గనుఁగవ నుసుముకొనుచు ధాత గూర్చుండె సృష్టి సంధాత యగుచు.
732
వ. అయ్యవసరంబున. 733
ఆ. వాసవారిఁ జంపి వాని చేపడియున్న
వేదకోటి చిక్కు విచ్చి తెచ్చి
నిదుర మాని యున్న నీరజాసనునకు
నిచ్చె గరుణతోడ నీశ్వరుండు.
734
క. జలరుహనాభుని కొఱకై
జలతర్పణ మాచరించి సత్యవ్రతుఁ డా
జలధిఁ బ్రతికి మనువయ్యెను
జలజాక్షునిఁ గొలువ కెందు సంపద గలదే.
735
ఆ. జనవిభుండు తపసి సత్యవ్రతుండును
మత్స్యరూపియైన మాధవుండు
సంచరించి నట్టి సదమలాఖ్యానంబు
వినినవాఁడు బంధ విరహితుండు.
736
క. హరి జలచరావతారముఁ
బరువడిఁ బ్రతిదినముఁ జదువఁ బరమపదంబు\న్‌
నరుఁడందు వాని కోర్కెలు
ధరణీశ్వర! సిద్ధివొందుఁ దథ్యము సుమ్మీ.
737
మ. ప్రళయాంభోనిధిలోన మే\న్‌ మఱచి నిద్రం జెందు వాణీశు మో
ముల వేదంబులు గొన్న దైత్యుని మృతిం బొందించి, సత్యవ్రతుం
డలర\న్‌ బ్రహ్మము మాటలం దెలిపి సర్వాధారుఁడై మీనమై
జలధిం గ్రుంకుచుఁ దేలుచు\న్‌ మెలఁగు రాజన్మూర్తికి\న్‌ మ్రొక్కెద\న్‌.
738
వ. అని చెప్పి. 739
క. రాజేంద్ర! దైత్యదానవ
రాజ మహాగహన దహన! రాజస్తుత్యా!
రాజావతంస మానిత!
రాజధరార్చిత! గుణాఢ్య! రాఘవరామా!
740
మాలిని. దివిజరిపు విదారీ! దేవలోకోపకారీ!
భువనభర నివారీ! పుణ్యరక్షానుసారీ!
ప్రవిమల శుభమూర్తీ! బంధుపోష ప్రవర్తీ!
ధవళ బహుళ కీర్తీ! ధర్మ నిత్యానువర్తీ!
741
గద్య. ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీమహాభాగవత పురాణంబను మహా ప్రబంధంబునందు స్వాయంభువ స్వారోచిషోత్తమ తామస మనువుల చరిత్రంబును, కరిమకరి యుద్ధంబును, గజేంద్ర రక్షణంబును, రైవత చాక్షుష మనువుల వర్తనంబును, సముద్ర మథనంబును, కూర్మావతారంబును, గరళ భక్షణంబును, అమృతాది సంభవంబును, దేవాసుర కలహంబును, హరి కపటకామినీ రూపంబున నసురుల వంచించి, దేవతల కమృతంబు వోయుటయు, రాక్షసవధంబును, హరిహర సల్లాపంబును, గపటకామినీరూప విభ్రమణంబును, వైవస్వత, సూర్య సావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, భద్రసావర్ణి, దేవసావర్ణి, ఇంద్రసావర్ణి మనువుల వృత్తాంతంబును, బలియుద్ధయాత్రయును, స్వర్గవర్ణనంబును, దేవపలాయనంబును, వామనావతారంబును, శుక్ర బలి సంవాదంబును, త్రివిక్రమ విస్ఫురణంబును, రాక్షస సుతలగమనంబును, సత్యవ్రతోపాఖ్యానంబును, మీనావతారంబును నను కథలుగల యష్టమస్కంధము సంపూర్ణము.  
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - aShTamaskaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu andhrabhagavatamu andhrabhaagavatamu pothana bhagavatamu potanabhagavatam ( telugu andhra )