ఇతిహాసములు భాగవతము ఏకాదశ స్కంధము
క. శ్రీసీతాపతి! లంకే
శాసురసంహార చతుర! శాశ్వతనుత వా
ణీ సత్యధిభూ భవ వృ
త్రాసురరిపు దేవజాల! రామనృపాలా!
1
వ. మహనీయ గుణగరిష్ఠు లగు న మ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణ వ్యాఖ్యాన వైఖరీ
సమేతుం డైన సూతుం డి ట్లనియె. అట్లు ప్రాయోపవిష్టుం డైన పరీక్షిన్నరేంద్రునకు
శుకయోగీంద్రుం డ య్యా జన్మ కర్మ వ్యాధి విమోచనంబునకుం గారణం బగు
దివ్యౌషధంబు గావున, శ్రీమన్నారాయణ కథామృతంబు గ్రోలు మని యి ట్లనియె.
2
అధ్యాయము - 1
ఋషిశాపంబున ముసలం బుర్భవించుట
మ. బలవత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహా బాహాబలోపేతుఁ డై
కలన\న్‌ రాక్షస వీరవర్యుల వడి\న్‌ ఖండించి భూభార ము
జ్జ్వల మై యుండఁగ నక్షకేళి కతనన్‌ గౌరవ్యు తోడ్తోన త
ద్బలముల్‌ పాండవసైన్యము న్నడచె భూభాగంబు కంపింపఁగ\న్‌.
3
వ. అంత. 4
క. మునివరులు సంతసిల్లిరి
యనయము నందాదులకును హర్షం బయ్యెన్‌
దన నిజ భక్తులు యాదవ
ఘన వీర సమూహ మపుడు గడు నొ ప్పెసఁగె\న్‌.
5
మ. విదితుం డై సకలామరుల్‌ గొలువ నుర్వీభారము\న్‌ మాన్పి దు
ర్మదసంయుక్త వసుంధరాధిపతుల\న్‌ మర్దించి కంసాదుల\న్‌
దుదిముట్ట\న్‌ వధియించి కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁ డై యున్నచో
యదుసైన్యంబులు భూమి మోవఁగ నసహ్యం బయ్యె నత్యుగ్ర మై.
6
సీ. ఈరీతిఁ గృష్ణుండు నేపారఁ బూతనా శకట తృణావర్త సాల్వ వత్స
చాణూర ముష్టిక ధేను ప్రలంబక దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర
కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి యటమీఁదఁ గురుబలం బణఁచి మఱియు
ధర్మజు నభిషిక్తుఁ దనరఁగాఁ జేసిన నతఁడు భూపాలనం బమరఁ జేసె.
 
తే. భక్తు లగు యాదవేంద్రులఁ బరఁగఁ జూచి
యన్యపరిభవ మెఱుఁగ రీ యదువు లనుచు
వీరిఁ బరిమార్ప నేఁ దక్క వే ఱొకండు
దైవ మిఁక లేదు త్రిభువనాంతరమునందు.
7
వ. అని వితర్కించి, జగదీశ్వరుం, డత్యున్నత వేణుకాననంబు వాయువశంబున నొఱసి కొన,
ననలం బుద్భవం బై దహించుచందంబున, యదుబలంబుల కన్యోన్య వైరానుబంధంబులు
గల్పించి, హతం బొనర్చెద నని, విప్రశాపంబు మూల కారణంబుగాఁ దలంచి,
యదుబలంబుల నడంచె. అని పలికిన, ముని వరునకు రాజేంద్రుం డి ట్లనియె.
8
క. హరి పాదకమల సేవా
పరు లగు యాదవుల కెట్లు బ్రాహ్మణ శాప
స్ఫురణంబు సంభవించెనొ
యరయఁగ సంయమివరేణ్య! యానతి యీవే.
9
క. అనిన జనపాలునకు ని
ట్లని సంయమికుల వరేణ్యుఁ డతిమోదముతో
విను మని చెప్పఁగఁ దొణఁగెను
ఘనతర గంభీర వాక్ప్రకాశ స్ఫురణ\న్‌.
10
విశ్వామిత్ర వసిష్ఠ నారదాదులు శ్రీకృష్ణు దర్శనమునకు వచ్చుట
వ. నిరుపమ సుందరం బైన శరీరంబు ధరియించి, సమస్త కర్మతత్పరుం డై, పరమేశ్వరుండు,
యదువుల నడంగింపం దలంచు సమయమున, జటా వల్కల కమండలు ధారులును, రుద్రాక్ష భూతి
భూషణముద్రా ముద్రితులును, గృష్ణాజి నాంబరులును నగు విశ్వామిత్రాసిత కణ్వ దుర్వాసో
భృగ్వాంగిరః కాశ్వప వామదేవ వాలఖి ల్యాత్రి వసిష్ఠ నారదాది మునివరులు
స్వేచ్ఛా విహారంబున ద్వారకానగరంబున కరుగుదెంచి, యందు.
11
సీ. ఘనుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ గర్ణకుండల యుగ్మ ఘనకపోలుఁ
బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ గలిత నానారత్న ఘన కిరీటు
నాజానుబాహు నిరర్గళాయుధహస్తు శ్రీవక్షుఁ బీత కౌశేయవాసు
రుక్మిణీ నయనసరోజ దివాకరు బ్రహ్మాది సురసేవ్య పాదపద్ము
 
తే. దుష్టనిగ్రహ శిష్ట సంతోషకరుణుఁ
గోటిమన్మథ లావణ్య కోమలాంగు
నార్తజన రక్షణైక విఖ్యాతచరితుఁ
గనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు.
12
క. వచ్చిన మునిసంఘములకు
విచ్చలవిడి నర్ఘ్య పాద్య విధు లొనరింప\న్‌
మెచ్చగు కనకాసనముల
నచ్చుగఁ గూర్చుండి వనరుహాక్షునితోడన్‌.
13
క. జనములు నిను సేవింపని
దినములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచునుండు\న్‌
దనువులు నిలుకడ గా వఁట
వనములలో నున్ననైన వనరుహనాభా!
14
క. తరణంబులు భవజలధికి
హరణంబులు దురితలతల కాగమముల కా
భరణంబు లార్తజనులకు
శరణంబులు నీ పదాబ్జ సంస్మరణంబుల్‌.
15
మత్తకోకిల. ఒక్కవేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్ర మై
యొక్కవేళను స్థూలరూపము నొందు దంతయు నీవ యై
పెక్కు రూపులుఁ దాల్తు నీదగు పెంపు మాకు నుతింపఁగా
నక్కజం బగుచున్న దేమన నంబుజాక్ష! రమాపతీ!
16
క. శ్రీనాయక! నీ నామము
నానా భవరోగ దుఃఖ నాశమునకు వి
న్నాణం బగు నౌషధ మిది
గానరు దుష్టాత్ము లకట! కంజదళాక్షా!
17
వ. అని యనేక విధంబులం బ్రస్తుతించిన, మునివరులం గరుణాకటాక్ష వీక్షణంబుల నిరీక్షించి,
పుండరీకాక్షుం డి ట్లనియె. మదీయ ధ్యాన నామస్మరణంబులు భవరోగ హరణంబులును, బ్రహ్మ
రుద్రాది శరణంబులును, మంగళ కారణంబులును నగు. అని మఱియు, నా రూపంబు లయిన
మేదినీసురుల పరితాపం బపహరించు పురుషుల నైశ్వర్య సమేతులఁ గాఁ జేయుదు. అని
యోగీశ్వరేశ్వరుం డానతిచ్చి, యనంతరంబు మీర లిచ్చటికి వచ్చిన ప్రయోజనం బేమి?
అనిన, వారలు భవదీయ పాదారవింద సందర్శనంబు కంటె మిక్కిలి విశేషం బొం డెద్ది? అని,
వాసుదేవ వదనాబ్జామృతంబు నిజనేత్రచకోరంబులం గ్రోలి, యథేచ్ఛావిహారు లై, ద్వారకా
నగరంబున కనతిదూరంబున నుండు పిండారకం బను నొక్క పుణ్యతీర్థంబున కరిగిరి. అంత.
18
క. దర్పించి యాదవులు దమ
నేర్పునఁ గొమరారు సాంబు నెలతుకరూపం
బేర్పడ శృంగారించుక
కర్పూర సుగంధిపోల్కిఁ గావించి రొగి\న్‌.
19
ఉ. మూఁకలుగూడి యాదవులు ముందటఁ బెట్టుక యార్చి నవ్వుచు\న్‌
బోకలఁ బోవుచు\న్‌ మునిసమూహము కొయ్యన సాఁగి మ్రొక్కుచు\న్‌
బ్రాకట మైన యీ సుదతి భారపు గర్భమునందుఁ బుత్రుఁడో
యేకతమందు బాలకియొ యేర్పడఁ జెప్పుఁ డటన్న నుగ్రు లై.
20
క. యదు డింభకులను గనుఁగొని
మదయుతు లై వచ్చి రనుచు మదిలో రోషం
బొదవి కనుఁగొనల నిప్పులు
సెదరఁగ హాస్యంబు చనునె చేయఁగ ననుచు\న్‌.
21
క. వాలాయము యదుకుల ని
ర్మూలకరం బయినయట్టి ముసలం బొక టీ
బాలిక కుదయించును బొం
డాలస్యము లే దటంచు నట పల్కుటయు\న్‌.
22
వ. మదోద్రేకు లయిన యాదవబాలకులు మునిశాప భీతు లై, వడవడ వడంకుచు, సాంబ
కుక్షినిబద్ధ చేలగ్రంధి విమోచనంబు చేయు సమయంబున, ముసలం బొకటి భూతల
పతితం బైన, విస్మయంబు నొంది, దానిం గొని చని, దేవకీ నందను సన్నిధానంబునం బెట్టి,
యెఱింగించిన, నతం డాత్మకల్పిత మాయారూపం బగుట నెఱింగియు, నెఱుంగని విధంబున
వారలం జూచి యి ట్లనియె.
23
క. మది చెడి కన్నుం గానక
మదయుతు లై, మునులఁ గల్ల మాటలఁ జెనయం
గదిసి కులక్షయ కారణ
విదితం బగు శాప మొందు వెఱ్ఱులుఁ గలరే?
24
క. ధరణీసుర శాపమునకు
హరి హర బ్రహ్మాదు లైన నడ్డము గలరే
నరు లనఁగ నెంతవారలు
కర మరుదుగఁ బూర్వజన్మ కర్మముఁ ద్రోవ\న్‌.
25
వ. అది గావున, యతినిందా పరత్వంబున యదునాశనంబగు. సందియంబు లేదు. అని
పరమేశ్వరుండు వారలం జూచి, సముద్రతీరంబున నొక మహాపర్వతం బున్నది.
అందు నుండు నత్యుచ్ఛ్రయ విశాల భీషణం బగు పాషాణంబున మీ భుజాబలంబు
చేత నీ ముసలంబుఁ దివిచి, దీని చూర్ణంబు మహార్ణవ కబంధంబులఁ గలిపి
రండు. పొండు. అని, జగద్విభుం డైన కృష్ణుం డానతిచ్చిన, వారును నట్ల చేసి,
తత్కీలితం బైన లోహఖండంబును సరకుగొనక, సాగరంబునం బడవైచిన, నొక్క
ఝషకంబు గ్రసించిన, దాని నొక్క లుబ్ధకుండు, జాలమార్గంబునఁ బట్టికొని,
తదుదరగతం బైన లోహఖండంబుఁ దెచ్చి, బాణాగ్రంబున ముల్కిగా నొనర్చె.
అనియు దత్కథా వృత్తాంతంబు సెప్పినఁ, బాదరాయణిం గనుంగొని, రాజేంద్రుం డి ట్లనియె.
26
వసుదేవునకు నారదుండు విదేహర్షభ సంవాద మను పురాతన పుణ్యకథను దెలుపుట
క. చిత్తం బే క్రియ నిలుచుం
జిత్తజగురు పాదపద్మ సేవ సదా య
త్యుత్తమ మని వసుదేవుఁడు
చిత్తముఁ దగ నిల్పి యెట్లు చెందె మునీంద్రా!
27
వ. అని యడిగిన, రాజునకు శుకయోగీంద్రుం డి ట్లనియె. 28
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - EkAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )